Engineering Special
-
ఆ రెండు సబ్జెక్టులు రాకుంటే.. ఇంజనీరింగ్‌లో సాధ్యమేనా?!
బీటెక్‌లో చేరాలంటే..ఇంటర్మీడియెట్‌లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ గ్రూప్ సబ్జెక్ట్‌లుగా.. ఉత్తీర్ణత సాధించాలనే అర్హత నిబంధన ఉన్న సంగతి తెలిసిందే! అందుకే..ఇంజనీరింగ్ లక్ష్యంగా చేసుకున్న లక్షల మంది విద్యార్థులు.. ఇంటర్ ఎంపీసీలో చేరుతుంటారు! ఆ అర్హత ఆధారంగా సదరు సబ్జెక్ట్లతో నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్‌లో.. విజయం సాధిస్తేనే ప్రస్తుతం బీటెక్‌లో అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది! కానీ..తాజాగా ఏఐసీటీఈ(అఖిల భారత సాంకేతిక విద్యా మండలి).. ఇక నుంచి బీటెక్‌లో చేరాలంటే..‘ఇంటర్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చదవడం తప్పనిసరికాదు’ అనేలా ప్రకటన చేసింది. ఇదే ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది! ఈ నేపథ్యంలో.. బీటెక్‌లో చేరేందుకు ఏఐసీటీఈ తాజాగా పేర్కొన్న అర్హతలు.. వాటì తో కలిగే సానుకూల, ప్రతికూల ప్రభావంపై విశ్లేషణాత్మక కథనం.. ‘చిన్న ఇల్లు కట్టాలన్నా.. లేదా కొత్తగా ఒక రహదారి నిర్మించాలన్నా.. సివిల్ ఇంజనీర్లకు ఫిజిక్స్ నైపుణ్యాలు ఎంతో అవసరం. సదరు నిర్మాణం చేపట్టే ప్రదేశంలో సాంద్రత, పటిష్టత వంటివి తెలుసుకోవాలంటే.. ఫిజిక్స్ నైపుణ్యాలతోనే సాధ్యం. ఈ స్కిల్స్ లేకుండా.. సివిల్ ఇంజనీరింగ్‌లో రాణించడం కష్టమే. ఒకవేళ ఫిజిక్స్ లేకుండా.. సివిల్ ఇంజనీరింగ్ చదివినా.. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తడం ఖాయం’ – ఇది బీటెక్‌లో ఫిజిక్స్ నైపుణ్యాలపై విద్యావేత్తల అభిప్రాయం. ‘ప్రస్తుత పోటీ ప్రపంచంలో... ఇండస్ట్రీ 4.0 స్కిల్స్గా పేర్కొంటున్న ఏఐ, ఎంఎల్, ఐఓటీ, డేటా అనలిటిక్స్, రోబోటిక్స్, కోడింగ్, ప్రోగ్రామింగ్.. ఇలా ఎందులోనైనా ప్రతిభ చూపాలంటే.. మ్యాథమెటిక్స్ నైపుణ్యాలు తప్పనిసరి. కోడింగ్, ప్రోగ్రామింగ్‌లను రూపొందించేందుకు అల్గారిథమ్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, కాలిక్యులస్ వంటి వాటిలో బలమైన పునాది ఉండాలి’ –ఇది బీటెక్ ప్రవేశాల్లో మ్యాథమెటిక్స్ను ఐచ్ఛికం చేయడంపై నిపుణుల అభిప్రాయం. ...ఇలా ..ఒక్క సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అనే కాదు. ఇంజనీరింగ్‌లో సర్క్యూట్ బ్రాంచ్‌లుగా పిలిచే ఈసీఈ, ఈఈఈ, ఐటీ.. అదే విధంగా కోర్ బ్రాంచ్‌లుగా పేర్కొనే మెకానికల్, సివిల్.. అన్నింటిలోనూ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సిద్ధాంతాల ఆధారంగా సమస్యలు పరిష్కరించే విధంగా ఇంజనీరింగ్ స్వరూపం ఉంటుంది. రోబోటిక్స్.. ఫిజిక్స్ సూ త్రాల ఆధారంగా పనిచేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇంజనీ రింగ్‌లో ప్రవేశానికి ఇంటర్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లను చదవడం తప్పనిసరికాదనే ప్రకటన చర్చనీయాంశమైంది. 14 సబ్జెక్టుల జాబితా ఏఐసీటీఈ తాజాగా 2021–22 సంవత్సరానికి సంబంధించి బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్ బుక్‌ను విడుదల చేసింది. ఈ హ్యాండ్ బుక్‌లో పేర్కొన్న అర్హత ప్రమాణాల ప్రకారం–బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్‌లో ప్రవేశానికి ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా చదివుండాలనే నిబంధన తొలగించింది. అంతేకాకుండా.. 14 సబ్జెక్ట్లతో జాబి తా పేర్కొని.. ఈ సబ్జెక్ట్‌లలో ఏవైనా మూడు చదివితే.. బీటెక్‌లో ప్రవేశించేందుకు అర్హులేనని పేర్కొంది. అవి.. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయాలజీ, ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్, బయోటెక్నా లజీ, టెక్నికల్ ఒకేషనల్ సబ్జెక్ట్, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, బిజినెస్ స్టడీస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అయితే ఆయా రాష్ట్రాలు, యూనివర్సిటీలు బీటెక్ ప్రవేశాల్లో అర్హతలకు సంబంధించి తమ ఈ 14 సబ్జెక్టుల ప్రకటనకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని.. అర్హతల విషయంలో యూనివర్సిటీలకు, రాష్ట్రాలకు సొంత నిర్ణయం తీసుకునే అధికారం ఉందని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. ఆ సబ్జెక్ట్‌లు ఇంటర్లో? ఏఐసీటీఈ పేర్కొన్న 14 సబ్జెక్ట్‌లు ఆయా రాష్ట్రాల బోర్డ్‌ల ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సుల్లో అందుబాటులో ఉన్నాయా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. వాస్తవానికి ప్రస్తుతం చాలా రాష్ట్రాలు తమ సొంత కరిక్యులంతో ఇంటర్మీ డియెట్ తత్సమాన కోర్సులను బోధిస్తున్నాయి. ఇంజనీరింగ్ ఔత్సాహిక అభ్యర్థుల కోసం ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ అందిస్తున్నాయి. దీంతో ఏఐసీటీఈ తాజా నిర్ణయం పూర్తిగా సీబీఎస్ఈ +2 కరిక్యులంను దృష్టిలో పెట్టుకొని∙తీసు కున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏఐసీటీఈ బీటెక్ ప్రవేశ అర్హతలు.. ముఖ్యాంశాలు ► ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్ చదవకపోయినా బీటెక్‌లో చేరే అవకాశం. ►బీటెక్ మొదటి సంవత్సరంలో బ్రిడ్జ్ కోర్సుల ద్వారా ఫిజిక్స్, మ్యాథ్స్ నైపుణ్యాలు అందించొచ్చని సూచన. ►ఫిజిక్స్, మ్యాథ్స్‌లో పూర్తి స్థాయి అవగాహన లేకుండా ఇంజనీరింగ్‌లో రాణించడం కష్టమంటున్న నిపుణులు. ► ఇంజనీరింగ్‌లోని దాదాపు అన్ని బ్రాంచ్‌లలోనూ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సిద్ధాంతాల ఆధారంగానే పట్టు సాధించాల్సిన ఆవశ్యకత. ►భవిష్యత్తులో జాబ్ మార్కెట్లో, ఉన్నత విద్య, విదేశీ విద్య పరంగా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం. ► రీసెర్చ్, డెవలప్మెంట్ కోణంలోనూ సైన్స్ రంగంలో పరిశోధనలు చేసే విషయంలో ఇబ్బందులు. టెస్ట్‌ల ద్వారానే ప్రవేశాలు అర్హతల విషయంలో పలు మార్పులు చేసిన ఏఐసీటీఈ.. ప్రవేశాలు ఖరారు చేసేందుకు మాత్రం తప్పనిసరిగా ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహించాలని పేర్కొంది. వాటిల్లో విద్యార్థులు సాధించిన ర్యాంకు, మెరిట్ ఆధారంగానే బీటెక్‌లో ప్రవేశాలు కల్పించాలని స్పష్టం చేసింది. సొంతంగా ఎంట్రన్స్‌లు ప్రస్తుతం దేశంలోని ఆయా రాష్ట్రాలు ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం సొంత ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహించి.. అందులో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఈ ఎంట్రన్స్ టెస్ట్‌లకు అర్హత ఇంటర్ తత్సమాన కోర్సులో ఎంపీసీ ఉత్తీర్ణత. ఏఐసీటీఈ ఆయా రాష్ట్రాల విచక్షణ మేరకే తమ సూచనలు పాటించొచ్చని పేర్కొంది. సొంతంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే రాష్ట్రాలు అర్హతల విషయంలో స్వీయ నిబంధనలు రూపొందించొచ్చని తెలిపింది. దీంతో రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్‌లకు ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత నిబంధన కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి.. ఈ ఏడాది ఏఐసీటీఈ సంస్కరణలు అమలు చేయడం సాధ్యం కాదని పేర్కొంది. ఇప్పటికే తేదీలు ప్రకటిం చినందున ఎంసెట్‌నే కొనసాగిస్తామని స్పష్టం చేసింది. బ్రిడ్జ్ కోర్సులతో కష్టమే బీటెక్‌లో చేరడానికి మ్యాథ్స్, ఫిజిక్స్‌లను ఐచ్ఛికం అని పేర్కొ న్న ఏఐసీటీఈ.. విద్యార్థులు వాటికి సంబంధించిన బేసిక్ నైపు ణ్యాలు పొందేందుకు బీటెక్/బీఈ మొదటి సంవత్సరంలో బ్రిడ్జ్ కోర్సులు నిర్వహించొచ్చని సిఫార్సు చేసింది. ఈ బ్రిడ్జ్ కోర్సు లతో సదరు నైపుణ్యాలు లభిస్తాయా అంటే? కాదనే సమా ధానం వినిపిస్తోంది. వీటివల్ల ఆయా సబ్జెక్ట్‌లలోని ముఖ్యమైన అంశాల కాన్సెప్ట్లపై అవగాహన లభిస్తుందే తప్ప.. పూర్తి స్థాయి పట్టు సాధించడం కష్టమంటున్నారు. ఇంజనీరింగ్‌కు పునాదిగా భావించే మ్యాథ్స్‌లోని కాలిక్యులస్, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ సహా పలు కీలకమైన టాపి క్స్‌ను; అదే విధంగా ఫిజిక్స్‌లో మ్యాగ్నటిజం, ఎలక్ట్రో మ్యా గ్నటిజం, థర్మో డైనమిక్స్, మెకానిక్స్ తదితర 20కు పైగా టాపి క్స్‌ను ఇంటర్లో రెండేళ్ల పాటు అభ్యసిస్తే తప్ప విద్యా ర్థులకు వాటిపై అవగాహన రావడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఒకట్రెండు సెమిస్టర్లలో నిర్వహించే బ్రిడ్జ్ కోర్సు ద్వారా అవస రమైన నైపుణ్యాలు లభించడం కష్టమే అంటున్నారు నిపుణులు. భవిష్యత్తులో సమస్యలు మ్యాథ్స్, ఫిజిక్స్‌పై పట్టు లేకుండా.. బీటెక్ పూర్తిచేసిన విద్యా ర్థులు.. పరిశోధనలు, ఆవిష్కరణల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారనే వాదన వినిపిస్తోంది. పర్యవసానంగా దేశంలో ఆర్ అండ్ డీ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడే ఆస్కారముంది. పీజీ స్థాయిలో.. సర్క్యూట్, కోర్ బ్రాంచ్‌ల విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్‌పై అవగాహన లేకుంటే రాణించడం కష్టమే అంటున్నారు. ఉదాహరణకు ఫిజిక్స్, మ్యాథ్స్ లేకుండా.. బీటెక్ పూర్తి చేసి.. ఎంటెక్‌లో వైర్లెస్ కమ్యూనికేషన్స్, ఆర్ఎఫ్ సిగ్నల్స్ వంటి సబ్జెక్ట్‌లలో రాణించడం ఎంతో కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విదేశీ విద్యకు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎంఎస్ కోర్సుల్లో చేరాలంటే.. పదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకూ.. మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్‌లు చదివుండాలనే నిబంధన ఉంది. అంతేకాకుండా ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రామాణిక టెస్ట్‌గా పరిగణించే జీఆర్‌ఈలోనూ మ్యాథమెటిక్స్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతున్నారు. మరికొన్ని విదేశీ యూనివర్సిటీలు.. జీఆర్ఈ సబ్జెక్ట్ టెస్ట్‌లను కూడా అర్హతగా పేర్కొంటున్నాయి. వీటికి సంబంధించి విద్యార్థులు పీజీ స్థాయిలో తాము చదవాల నుకుంటున్న స్పెషలైజేషన్స్‌కు అనుగుణంగా ఈ సబ్జెక్ట్ టెస్ట్‌లలో స్కోర్ సాధించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో మ్యాథ మెటిక్స్ సంబంధిత కోర్సులు చదవాలనుకునే విద్యార్థులు.. జీఆర్ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ టెస్ట్‌లో స్కోర్ సాధించాలి. ఈ సబ్జెక్ట్ టెస్ట్‌లో కాలిక్యులస్, అల్జీబ్రా, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ నైపుణ్యాలు పొందాలంటే.. ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ గ్రూప్ స్థాయిలో వీటిని అభ్యసిస్తేనే సాధ్యమనేది నిపుణుల అభిప్రాయం. జాబ్ మార్కెట్ మ్యాథ్స్, ఫిజిక్స్ లేకుండా.. బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు జాబ్ మార్కెట్లో నిలదొక్కుకోవడం కష్టమేనని అభిప్రాయం నెలకొంది. ఉదాహరణకు.. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆటోమేషన్ ఆధారిత కార్యకలాపాలు సాగుతున్నాయి. రోబో టిక్స్, డేటా అనలిటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, కోడింగ్, 3–డి డిజైన్ ప్రింటింగ్ వంటి వాటికి ప్రధాన్యం పెరుగుతోంది. ఈ విభాగాల్లో రాణించాలంటే.. ప్రోగ్రామింగ్, కోడింగ్ స్కిల్స్ కీలకం అవుతున్నాయి. వీటికి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లలో పట్టుతో పాటు అప్లికేషన్ నైపుణ్యాలు తప్పనిసరి. ఇలాంటి నైపుణ్యాలు ఇంటర్లో పూర్తి స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివిన వారికే లభిస్తాయని సబ్జెక్ట్ నిపుణులు అంటున్నారు. జేఈఈ పరిస్థితి ఏఐసీటీఈ తాజా నిర్ణయం అన్ని వర్గాలకు సాంకేతిక విద్యను అందుబాటులో తెచ్చే ఉద్దేశమే అయినప్పటికీ.. ఎన్ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రెన్స్ టెస్టులైన జేఈఈ–మెయిన్స్, జేఈఈ–అడ్వాన్స్‌డ్‌లకు అర్హత నిబం ధనల విషయంలో సూచనలు చేయకపోవడం గమనార్హం. ఎన్ఐటీలు, ఐఐటీలు.. మ్యాథ్స్,ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరి చేస్తూ ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. కాబట్టి ఇంజనీ రింగ్‌లో చేరాలనుకునే విద్యార్థులు.. ఇంటర్మీడియెట్ స్థాయిలో ఎంపీసీనే ఎంచుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఆలోచనకు అండాదండ
ఆలోచనకు అండాదండ స్టార్టప్ సంస్థలు, ఎంటర్ప్రెన్యూర్ ఔత్సాహికులు.. ఇటీవల విస్తృతంగా వినిపిస్తున్న మాటలు. ముఖ్యంగా.. యువత వినూత్న ఆలోచనలు, విభిన్న వ్యాపార అంశాలతో స్వయం ఉపాధి(స్టార్టప్స్) దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు తోడ్పడే చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అకడమిక్ స్థాయి నుంచే నైపుణ్యాలు అందించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) కొత్త స్టార్టప్ పాలసీని రూపొందించింది. ఆ వివరాలు.. ఇదీ ఉద్దేశం సరికొత్త ఆలోచనలను ప్రోత్సహించడం, స్వదేశీ ఉత్పత్తులను పెంచడం, అందులో యువతను భాగస్వాములు చేసి స్వయం ఉపాధి దిశగా వారు అడుగులు వేసేలా చూడడం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్టార్టప్ ఇండియా’ లక్ష్యం. ఇదీ పరిస్థితి ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రముఖ ఇన్స్టిట్యూట్ల విద్యార్థులు మినహా దేశంలో చాలామంది యువతకు ‘స్టార్టప్’ గురించి పెద్దగా పెద్దగా అవగాహన లేదు. స్టార్టప్స్ ఏర్పాటుకు అనుసరించాల్సిన వ్యూహాలపై మరికొందరిలో అయోమయం. ఇదీ కార్యాచరణ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్, ప్రధానంగా ఏఐసీటీఈ పరిధిలో దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు స్టార్టప్స్‌పై పూర్తి అవగాహన కల్పించడం. అందుకుతగ్గట్లు విధానపరంగా మార్పుచేర్పులు. తొలి దశలో రూ. 433.53 కోట్ల నిధుల కేటాయింపు. 2025 నాటికి లక్ష సాంకేతిక స్టార్టప్స్ ఏఐసీటీఈ స్టార్టప్ పాలసీ ప్రధాన లక్ష్యం.. 2025 నాటికి జాతీయ స్థాయిలో కనీసం లక్ష సాంకేతిక(టెక్నాలజీ) ఆధారిత సంస్థలు నెలకొల్పేలా చూడటం. తద్వారా పది లక్షల మందికి ఉపాధి కల్పించడం. విద్యా సంస్థలు, విద్యార్థులు ఆసక్తి చూపేలా కరిక్యులం, బోధన విధానం, అకడమిక్ స్ట్రక్చర్‌లో మార్పులను ఏఐసీటీఈ నిర్దేశించుకుంది. ఆన్–క్యాంపస్ స్టార్టప్స్ స్టూడెంట్ డ్రివెన్ ఆన్–క్యాంపస్ స్టార్టప్స్ రూపొందడం పాలసీలో ప్రధానంగా పేర్కొనాల్సిన అంశం. ఇందుకోసం విద్యార్థులు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను లక్ష్యంగా ఎంచుకునేలా ఇన్స్టిట్యూట్స్ ప్రోత్సహించాలి. ప్రస్తుత కరిక్యులం, పెడగాగీలో మార్పులు చేసి స్టార్టప్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం దక్కేలా కొత్త కరిక్యులం తీసుకురావాలి. కొత్త కరిక్యులం ఇలా వ్యాపార అవకాశాలను గుర్తించడం.. ఐడియా జనరేషన్, ఐపీఆర్/పేరెంటింగ్ ‘లా’స్, స్టార్టప్ ఫైనాన్స్, స్టార్టప్ ఏర్పాటు –మనుగడ కోణంలో సదరు వ్యక్తులకు ఉండాల్సిన సహజ కమ్యూనికేషన్ స్కిల్స్ అంశాల సమ్మిళితంగా స్టార్టప్ కోర్స్ కరిక్యులం ఉండాలి. టీబీఐల ఏర్పాటు ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ ప్రత్యేకంగా టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ (టీబీఐ)లు ఏర్పాటు చేయాలి. స్టార్టప్ ఆలోచనలకు.. ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా అనుమతి లభించే విధంగా టీబీఐలు తోడ్పడాలి. యాక్సలరేటర్స్ ఔత్సాహిక యువతకు ప్రాక్టికల్ నైపుణ్యాలు అందించేందుకు యాక్సలేటర్స్ విధానాన్ని పేర్కొన్నారు. దీనిప్రకారం.. స్టార్టప్ యాక్సలరేటర్స్, మెంటార్స్, ఇతర నిపుణుల నేతృత్వంలో నిర్దిష్ట ప్రోగ్రామ్‌లను రూపొందించడం, మంచి వ్యాపార ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడం చేయాలి. గుర్తింపు లభించేలా జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్లాట్‌ఫామ్ రూపొందించడం ఔత్సాహికులకు కలిసొచ్చే మరో ముఖ్య విధానం. ఔత్సాహిక విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్ రిపోర్ట్స్‌ను ఈ ప్లాట్ఫామ్లో ఇన్స్టిట్యూట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక విద్యార్థి తన ఆలోచనతో రూపొందించిన స్టార్టప్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను ఏంజెల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్‌లు సైతం చూసే అవకాశం లభిస్తుంది. ప్రత్యేక సబ్జెక్ట్‌లు కరిక్యులం మార్పులపరంగా బీటెక్ ప్రోగ్రామ్‌లో ఏడాదికో నిర్దిష్ట కోర్సులను బోధించాల్సి ఉంటుంది. ఉదాహరణకు... బీటెక్ మూడో సంవత్సరంలో బేసిక్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు ఉండాలని పేర్కొంది. సంవత్సరాలవారీగా బేసిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్, బేసిక్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూరియల్ మార్కెటింగ్, ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ వంటి అంశాలను వారంలో గరిష్టంగా నాలుగు గంటల వ్యవధిలో బోధించాలి. స్పెషలైజేషన్‌గా స్టార్టప్ స్ట్రీమ్ స్టార్టప్ స్ట్రీమ్‌ను ఒక స్పెషలైజేషన్‌గా ఎంచుకునే అవకాశం కల్పించడం మరో ముఖ్యాంశం. బీటెక్, బీఆర్క్, పీజీడీఎం, ఎంటెక్, ఎంబీఏ, బీ ఫార్మసీ తదితర ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లలో.. ‘స్టార్టప్ : లాంచింగ్ అండ్ సస్టెయినింగ్’ పేరుతో ఇన్స్టిట్యూట్లు స్పెషలైజేషన్ సబ్జెక్ట్‌ను ఆఫర్ చేయాల్సి ఉంటుంది. వేసవి/శీతాకాల ఇంటర్న్‌షిప్ స్టార్టప్ లాంచింగ్ అండ్ సస్టెయినింగ్ స్పెషలైజేషన్ విద్యార్థులు.. ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు, పూర్వ విద్యార్థులు నెలకొల్పిన స్టార్టప్ సంస్థల్లో వేసవి లేదా శీతాకాల ఇంటర్న్‌షిప్ చేయడం తప్పనిసరి. దీనివల్ల వారికి ఆర్థిక నిర్వహణ అంశాలపై ప్రాథమిక అవగాహన లభిస్తుంది. ఐడియా ల్యాబ్స్ ఏర్పాటు ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ ఐడియా ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలి. బీటెక్ తృతీయ సంవత్సర విద్యార్థులకు అవకాశం కల్పించి, వారి వ్యాపార ఆలోచనలను సంబంధిత నిపుణులు పరిశీలించేలా చూడటం, కార్యాచరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించడం, ఐపీఆర్‌లను దాఖలు చేయడం వంటివి ఈ ఐడియా ల్యాబ్స్ నిర్వహించాలి. మూక్ నమోదు తప్పనిసరి విద్యార్థులు తప్పనిసరిగా స్టార్టప్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సును మాసివ్లీ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ (మూక్స్) విధానంలో అభ్యసనం చేయాలి. స్టార్టప్‌పై అవగాహన కలిగేందుకు ఇది ఉపయుక్తం. ఇందుకోసం ఐఐటీలు, ఇతర ప్రముఖ విద్యాసంస్థలు అందిస్తున్న మూక్స్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఏంజెల్స్, వీసీస్.. ఇన్‌స్ట్రక్టర్స్‌గా స్టార్టప్ ఏర్పాటులో అత్యంత కీలకమైనది నిధుల సమీకరణ. నిధుల సమీకరణ కోసం ఎలా వ్యవహరించాలి..? అనే అంశంపై అవగాహన కల్పించేందుకు ఏంజెల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్‌లను పార్ట్ టైం కోర్స్ ఇన్‌స్ట్రక్టర్స్‌గా రప్పించే ఏర్పాట్లు చేయాలి. స్టార్టప్–ఫెస్ట్ ఔత్సాహిక యువత, వెంచర్ క్యాపిటలిస్ట్‌లు, ఫండింగ్ ఏజెన్సీలను అనుసంధానం చేసేలా.. ప్రతి ఇన్స్టిట్యూట్ స్టార్టప్ ఫెస్టివల్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రేరణకు వెబ్‌పోర్టల్ ఔత్సాహికులకు ప్రేరణ లభించేలా ఏఐసీటీఈ ప్రత్యేక వెబ్ పోర్టల్ అందుబాటులోకి తీసుకురానుంది. తద్వారా విద్యార్థులు మెంటార్స్‌తో అనుంసధానమై సలహాలు, సూచనలు తీసుకునే అవకాశం లభించనుంది. ఈ వెబ్‌పోర్టల్‌లో సబ్జెక్ట్ నిపుణులు, పరిశోధకులు, ఫ్యాకల్టీ, ట్రైనర్స్ వివరాలు అందుబాటులో ఉంటాయి. జాతీయస్థాయి ప్రోగ్రామ్ ఇన్స్టిట్యూట్ స్థాయిలో స్టార్టప్ ఫెస్టివల్స్‌ను నిర్వహించడమే కాక .. ఏఐసీటీఈ కూడా జాతీయ స్థాయిలో ప్రత్యేక యాక్సలరేషన్ ప్రోగ్రామ్ నిర్వహించనుంది. ఇది నాస్కామ్ 10000 స్టార్టప్స్ ప్రోగ్రామ్ మాదిరిగా ఉంటుంది. దీనిద్వారా ఎంపికైన 50 స్టార్టప్ సంస్థలకు ఏడాదికి రూ. 25 లక్షలు చొప్పున ఏంజెల్ ఫండ్స్ లభిస్తాయి. ఆలోచన మంచిది స్టార్టప్‌లు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ప్రముఖ ఇన్స్టిట్యూట్లలోనే సాధ్యం అనుకుంటున్న పరిస్థితులున్నాయి. అలాంటిది ఏఐసీటీఈ అనుబంధ కళాశాలల్లో ఔత్సాహికులను ప్రోత్సహించే విధానం తీసుకురావడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇన్స్టిట్యూట్లు తప్పనిసరిగా చొరవ చూపేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఉద్దేశం నెరవేరుతుంది. – ప్రొఫెసర్ వి.వెంకట రమణ, కో ఆర్డినేటర్, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్, హెచ్‌సీయూ -
కోర్ బ్రాంచ్‌లు..మినిమమ్ గ్యారెంటీ!
ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాల సమయం.. ఎంట్రన్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు.. ఇదే సమయంలో నాలుగు దశాబ్దాలపాటు కొనసాగాల్సిన కెరీర్ పరంగా.. ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది? అనే సందేహం. ఎన్నో వినూత్న బ్రాంచ్‌లు, అప్‌కమింగ్ బ్రాంచ్‌లు తెరపైకి వస్తున్నా.. నేటికీ కోర్ బ్రాంచ్‌లకు వన్నెతగ్గడంలేదు. భవిష్యత్‌లోనూ అవకాశాల పరంగా కోర్ బ్రాంచ్‌లు మినిమమ్ గ్యారెంటీ అంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో కోర్ బ్రాంచ్‌ల ప్రాముఖ్యత, వాటికి ఆధునిక కాలంలో సైతం ఆదరణ పెరుగుతుండటానికి కారణాలపై విశ్లేషణ.. ఎన్ని ఆధునిక బ్రాంచ్‌లు రూపొందుతున్నా.. కొత్త కోర్సులు ఆవిష్కృతమవుతున్నా.. అవన్నీ కోర్ బ్రాంచ్‌ల పునాదుల నుంచే పుట్టుకొస్తున్నాయి. అందుకే కోర్ బ్రాంచ్‌లు భవిష్యత్‌లోనూ ఎవర్‌గ్రీన్‌గా నిలవనున్నాయి. సివిల్ ఇంజనీరింగ్ కట్టడాలు, నిర్మాణాలు, డిజైన్లకు సంబంధించి మూల భావనలు, నైపుణ్యాలు అందించడం సివిల్ ఇంజనీరింగ్ కోర్సు ముఖ్య స్వరూపం. ప్రస్తుతం సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రులకు డిమాండ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ముఖ్యంగా పట్టణీకరణ, రియల్టీ, మౌలిక సదుపాయాల రంగాల విస్తరణ జరుగుతోంది. కాబట్టి సివిల్ ఇంజనీరింగ్‌ను ఎంపిక చేసుకునే విద్యార్థులకు భవిష్యత్ అవకాశాల పరంగా ఆందోళన అనవసరం అనేది నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా డిజైన్, ప్లానింగ్, కన్స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ పరమైన అంశాలు నేర్పించే సివిల్ ఇంజనీరింగ్ కోర్సును పూర్తిచేసిన అభ్యర్థులకు తమ నైపుణ్యాల ద్వారా ఉజ్వల కెరీర్‌ను సొంతమవడం ఖాయం. ఇటీవల కాలంలో ప్రభుత్వ రంగంలోనూ సివిల్ ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వం మౌలిక సదుపాయాల విస్తరణపై దృష్టిపెట్టడమే అందుకు కారణం. మరోవైపు ప్రైవేటు రంగంలోనూ రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. కార్పొరేట్ సంస్థలు సైతం నిర్మాణ రంగంలో అడుగుపెట్టాయి. మెట్రో నగరాల్లో గృహ సముదాయాలు నిర్మిస్తున్నాయి. వీటన్నింటి దృష్ట్యా వచ్చే నాలుగైదేళ్లలో సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు వేల సంఖ్యలో ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ బ్రాంచ్ ద్వారా చక్కటి భవిష్యత్తు కోరుకునే అభ్యర్థులు అకడమిక్‌గా ఫిజిక్స్, మ్యాథమెటికల్, డిజైన్ స్కిల్స్ సొంతం చేసుకుంటే తిరుగుండదు. అంతేకాకుండా ఆధునిక అవసరాలకు తగ్గట్లు కంప్యూటర్ స్కిల్స్‌ను అలవర్చుకోవాలి. క్యాడ్, క్యామ్ వంటి నైపుణ్యాలు నేర్చుకోవాలి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇంట్లో నిత్యం అవసరమయ్యే బల్బ్‌ల నుంచి సమాజానికి విస్తృతస్థాయిలో ఉపయోగడే ఎలక్ట్రికల్ ట్రైన్స్ వరకూ.. ప్రతిదీ ఎలక్ట్రికల్ ఆధారమే. ఎన్నో ఏళ్లుగా వెలుగులీనుతున్న బ్రాంచ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ). అకడమిక్ కోణంలో ఎలక్ట్రికల్ రంగంలో రాణించాలనే అభ్యర్థులకు మైక్రో అనాలిసిస్ అప్రోచ్ చాలా అవసరం. మ్యాథ్స్, ఫిజిక్స్‌పై ఆసక్తి అవసరం. ఈ రంగంలో జరుగుతున్న తాజా పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. ఉదాహరణకు ఒక ఉత్పత్తి మార్కెట్లో విడుదలైతేæ.. దాని పనితీరు, అందుకు అనుసరించిన విధానాల గురించి తెలుసుకునే ఆసక్తి ఉండాలి. అప్పుడే ఈ రంగంలో రాణించేందుకు వీలవుతుంది. అంతేకాకుండా ఈ బ్రాంచ్ పూర్తిచేసిన విద్యార్థులకు భవిష్యత్తు పరంగా భరోసా కల్పిస్తున్న అంశం.. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు, నిర్దేశించుకున్న లక్ష్యాలే. 2020 నాటికి లక్ష మెగావాట్ల సామర్థ్యం గల విద్యుదుత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అదే విధంగా ఉజ్వల్, గ్రామజ్యోతి యోజన వంటి పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాలను సైతం రానున్న అయిదేళ్లలో విద్యుత్ కాంతులతో నింపాలనే యోచనలో అడుగులుపడుతున్నాయి. ఫలితంగా రానున్న అయిదేళ్ల కాలంలో దేశంలో దాదాపు 1.5 లక్షల మంది ఎలక్ట్రికల్ ఇంజనీర్ల అవసరం ఉంటుందని అంచనా. ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి పరంగా 2020 నాటికి 40 నుంచి 50 శాతం మేర స్వదేశీ ఉత్పత్తుల సంఖ్య పెంచాలనే దిశగా ప్రణాళికలు రూపొందుతున్నాయి. మరోవైపు ఈ రంగంలో ఎఫ్‌డీఐలకు అనుమతివ్వడం కూడా భవిష్యత్తు అవకాశాలను మెరుగుపరిచేందుకు దోహదం చేయనుంది. మెకానికల్ ఇంజనీరింగ్ ఆటో రిక్షా నుంచి బోయింగ్ విమానాల ఉత్పత్తి వరకు ప్రతి విభాగంలోనూ మెకానికల్ ఇంజనీరింగ్ నైపుణ్యాలు కలిగిన వ్యక్తుల అవసరం ఏర్పడుతోంది. మెకానికల్ బ్రాంచ్‌లో చేరాలనుకునే విద్యార్థులకు ఫిజిక్స్‌పై ఆసక్తి ఉండటం కలిసొస్తుంది. అలాగే ఈ బ్రాంచ్‌లో రాణించి, భవిష్యత్తు అవకాశాలు సొంతం చేసుకోవాలంటే అభ్యర్థులకు బేసిక్ నైపుణ్యాలైన డిజైన్, డ్రాయింగ్ వంటి వాటిపై పరిపూర్ణత అవసరం. వీటికితోడు క్యాడ్, క్యామ్, 3–డి డిజైన్ టెక్నాలజీస్, రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి ఆధునిక సాఫ్ట్వేర్ ఆధారిత నైపుణ్యాలు తప్పనిసరి. ఇలా కోర్ + లేటెస్ట్ స్కిల్స్ పొందిన అభ్యర్థులకు సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రస్తుతం మెకానికల్ బ్రాంచ్‌తో బీటెక్‌లో చేరే విద్యార్థులు నాలుగేళ్ల కోర్సు పూర్తిచేసుకునే సరికి అవకాశాల పరంగా ఢోకా ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి పథకాల నేపథ్యంలో 2020 నాటికి దాదాపు లక్ష మంది మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రుల అవసరం ఏర్పడనుందని పలు వర్గాల అంచనా. ఈసీఈ ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ రంగంలో జెట్ స్పీడ్‌లో కార్యకాలాపాలు సాగుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్, స్మార్ట్ టెక్నాలజీస్, ఐటీసీ అమలు, వినియోగదారుల సంఖ్య పరంగా మిలియన్ల మంది పలు ఎలక్ట్రానిక్ ఆధారిత కమ్యూనికేషన్ సాధనాలను వినియోగిస్తున్నారు. ఈ సేవలు విస్తరించేందుకు, అదే సమయంలో ఈ సేవలకు అవసరమైన ఉత్పత్తుల రూపకల్పనను పెంచేందుకు సంస్థలు పలు విస్తరణ కార్యకలాపాలకు శ్రీకారం చుడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ స్థాయిలోనూ డిజిటల్ ఇండియా, డిజిటైజేషన్, డిజిటల్ లిటరసీ మిషన్ వంటి పలు పథకాలకు నాంది పడింది. ఫలితంగా రానున్న రోజుల్లో వేల మందికి అవకాశం కల్పించే రంగంగా మారనుంది. ఇప్పుడు ఈ బ్రాంచ్‌ను ఎంపిక చేసుకునే విద్యార్థులు నాలుగేళ్ల తర్వాత సర్టిఫికెట్లతో బయటికొచ్చే నాటికి ప్రైవేటు, ప్రభుత్వ రంగ కొలువులు స్వాగతం పలకడం గ్యారెంటీ అనేది నిపుణుల అభిప్రాయం. ఈసీఈ బ్రాంచ్ ఔత్సాహికులకు మ్యాథ్స్‌పై ఆసక్తి ఉండాలి. సీఎస్ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ను ఒక రకంగా కోర్ బ్రాంచ్‌గా మరో రకంగా ఇంటర్ డిసిప్లినరీ విభాగంగానూ పేర్కొంటారు. మ్యాథమెటిక్స్, అల్గారిథమ్స్ స్కిల్స్ తప్పనిసరి. ఈ రంగంలో అవకాశాల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అదే సమయంలో సవాళ్లు అనేకం. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ ఆవిష్కరణ జరుగుతోంది... దాన్ని అందరికంటే ముందుగా అందిపుచ్చుకుంటేనే మనగలిగేది. ప్రస్తుతం సర్వత్రా వినిపిస్తున్న ఆటోమేషన్, ఐఓటీ వంటి విధానాల నేపథ్యంలో ఈ బ్రాంచ్‌లో ఉత్తీర్ణత ద్వారా సాఫ్ట్వేర్ కొలువులు సొంతం చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. అకడమిక్స్‌తోపాటు ఆటోమేషన్ టూల్స్‌గా పిలుస్తున్న రోబోటిక్స్, డేటా అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్ వంటి అంశాల్లోనూ నైపుణ్యం పొందితేనే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. -
ఇంజనీరింగ్ ఫస్టియర్..భవిష్యత్తుకు తొలి మెట్టు
ఇంజనీరింగ్ స్పెషల్ తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ విద్యకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లతో పాటు యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలు, వివిధ టాప్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు చాలా మంది బాగా రాణిస్తున్నారు. కానీ, అనేక ప్రైవేటు కళాశాలల్లో చేరే విద్యార్థుల పరిస్థితి భిన్నంగా ఉంది. వారు చదువుల్లో వెనకబడుతున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణులు కాలేక ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు. ఇంటర్ వరకు 75 నుంచి 90 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు సైతం.. ఇంజనీరింగ్‌కు వచ్చేసరికి పాస్ కావడానికి నానా తంటాలు పడుతున్నారు. గత కొన్నేళ్ల మొదటి సంవత్సరం ఫలితాలే అందుకు నిదర్శనం. మ్యాథ్స్‌లో ఎక్కువ మంది ఫెయిల్ జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ), హైదరాబాద్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల్లో 70 నుంచి 73 శాతం మంది ఫెయిల్ అవుతున్నారు. 2014-15 విద్యా సంవత్సరంలో ఫస్టియర్ విద్యార్థులు 29 శాతం మంది మాత్రమే తొలి ప్రయత్నంలో ఉత్తీర్ణులయ్యారు. ఇది 2015-16లో 27.8 శాతం. వీరిలో అత్యధికంగా మ్యాథ్స్, డేటా స్ట్రక్చర్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్టుల్లో తప్పుతున్నారు. విద్యార్థుల్లో ప్రాథమిక అంశాలపై పట్టు లేకపోవడం, తెలుగు మీడియం నేపథ్యం ఉండడం, ఇంటర్ నుంచి ఇంజనీరింగ్‌కు వచ్చేసరికి రిలాక్స్ అయ్యే ప్రవృత్తిని అలవరచుకోవడం తదితర కారణాల వల్ల విద్యార్థులు ఇంజనీరింగ్‌లో తప్పుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే మొదటి సంవత్సరంలో మంచి మార్కులతో ఉత్తీర్ణులైతేనే తర్వాత ఇంజనీరింగ్‌లో మెరుగ్గా రాణించడానికి అవకాశం ఉంటుందని, ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవడానికి తొలి ఏడాదే కీలకమని చెబుతున్నారు. ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఎంపీసీ చదివినా, ఇంజనీరింగ్ మ్యాథ్స్‌లోనే ఎక్కువ మంది విద్యార్థులు బోల్తా పడుతున్నారు. ఈ ఏడాది నుంచి సెమిస్టర్ విధానం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం పరీక్షలు వార్షికంగా నిర్వహించేవారు. కానీ, ఈ విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్ నుంచే సెమిస్టర్ విధానం అమల్లోకి రానుంది. ఫస్ట్ ఇయర్లో ఎక్కువ శాతం మంది విద్యార్థులు మ్యాథ్స్‌లో ఫెయిల్ అవుతున్నారు. 2013కు ముందు మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం 35 శాతంగా ఉండేది. కానీ, తర్వాత పరీక్ష విధానం కాస్త కఠినంగా మారడంతో ఉత్తీర్ణత శాతం తగ్గింది. దీనికి కారణాలను ప్రశ్నల వారీగా విశ్లేషించి వాటిని స్థిరీకరించి కొత్త సెమిస్టర్ విధానాన్ని అమలు చేయనున్నారు. సెమిస్టర్ విధానంతో విద్యార్థికి సిలబస్ భారం తగ్గుతుంది. దీంతో తరగతులు ప్రారంభమైన నాటి నుంచే చదవడం ప్రారంభిస్తారు. కాబట్టి ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు మొదటి రోజు నుంచి రెగ్యులర్‌గా తరగతులకు హాజరుకావడం, ఏ రోజు అంశాలను ఆ రోజే చదవడం, ఫ్యాకల్టీని అడిగి ఎప్పటికప్పుడు సందేహాలు నివృత్తి చేసుకుంటే.. ఎంతటి కఠినమైన సబ్జెక్టులోనైనా ఉత్తీర్ణులు కావచ్చు. - డా. ఏవీఎస్ఎస్ కుమారస్వామి గుప్త, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, జేఎన్టీయూ, హైదరాబాద్. కీలకమైన మొదటి ఏడాదిలో రాణించేందుకు నిపుణుల సూచనలు.. సెల్ఫ్ లెర్నింగ్ అలవరచు కోవాలి ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులు మొదట సెల్ఫ్ లెర్నింగ్‌ను అలవరచుకోవాలి. ఏ రోజు చెప్పిన పాఠాలను ఆ రోజే పునశ్చరణ చేసుకోవాలి. దీనివల్ల సబ్జెక్టుపై పట్టు వస్తుంది. విద్యార్థులు పరీక్షల కోసం కాకుండా.. నాలెడ్జ్ పెంచుకోవడానికి, నైపుణ్యాభివృద్ధికి కృషిచేయాలి. ఇంటర్మీడియెట్ వరకు విద్యార్థులకు స్ఫూన్ ఫీడింగ్ ఉంటుంది. ఇంజనీరింగ్‌లో దీనికి అవకాశం ఉండదు. సెల్ఫ్ లెర్నింగ్‌ను అలవరచుకోవాల్సిందే. నిత్యం నేర్చుకునేందుకు ప్రయత్నించాలి. ఇంజనీరింగ్ సబ్జెక్టులపై పట్టు సాధిస్తే భవిష్యత్ కెరీర్ ఉజ్వలంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి. ముఖ్యంగా క్లిష్టంగా భావించే మ్యాథ్స్‌లో ప్రాబ్లమ్స్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి. - డా. ఎ.గోవర్ధన్, ప్రొఫెసర్ అండ్ ప్రిన్సిపల్, జేఎన్టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. బేసిక్స్‌పై అవగాహన అవసరం విద్యార్థులకు మ్యాథ్స్ బేసిక్స్‌పై అవగాహన ఉండటం లేదు. ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్, క్యాలిక్యులస్ తదితర అంశాలపై పట్టు సాధించాలి. దీనికోసం ఇంటర్మీడియెట్ పుస్తకాల్లోని అంశాలను రివిజన్ చేయడం ఉత్తమం. విద్యార్థులకు ఇంటర్లో బట్టీ విధానం వల్ల బాగానే మార్కులు వస్తున్నాయి. కానీ, ఇంజనీరింగ్‌కు వచ్చేసరికి అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా ప్రశ్నలు ఉంటాయి. దీంతో విద్యార్థులు మ్యాథ్స్‌లో వెనుకంజలో ఉంటున్నారు. బేసిక్స్ నేర్చుకుంటే ఇంజనీరింగ్ మ్యాథ్స్ చాలా సులువు. - డా. వి.నాగరాజు, హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఓయూ. -
చాలెంజింగ్ కెరీర్‌కు.. మెరైన్ ఇంజనీరింగ్!
ఇంజనీరింగ్ స్పెషల్ ఇంజనీరింగ్ విభాగంలో చాలెంజింగ్ కెరీర్ కోరుకునే వారికి సరైన బ్రాంచ్.. మెరైన్ ఇంజనీరింగ్! ఇది ప్రధానంగా సముద్ర రవాణా, నౌకల తయారీ, వాటి నిర్వహణకు సంబంధించిన విభాగం. ప్రస్తుతం మెరైన్ ఇంజనీర్ల పని పరిధి విస్తరించింది. అంతర్జాతీయంగా ఎగుమతి, దిగుమతులకు ఎక్కువగా సముద్ర రవాణాను ఉపయోగిస్తుండటం, ప్రపంచ వ్యాప్తంగా అధికశాతం సరకు రవాణా షిప్పుల ద్వారానే జరుగుతుండటంతో మెరైన్ ఇంజనీరింగ్ ఉజ్వల కెరీర్‌కు వేదికగా నిలుస్తోంది.. మెరైన్ ఇంజనీర్లు ఏం చేస్తారు? మెరైన్ ఇంజనీర్ల విధులు కొద్దిగా రిస్క్‌తో కూడుకున్నవైనప్పటికీ.. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్, నేవిగేషన్లలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సులభతరమయ్యాయి. ఇంజనీర్లకు నౌక ఆకృతి, దాని తయారీకి అవసరమైన పరికరాల ఎంపిక, వాటి అమరిక, పర్యవేక్షణ, నిర్వహణ, మరమ్మత్తులు తదితర విధులు ఉంటాయి. నౌకకు సంబంధించిన ప్రధాన యంత్రాలైన డీజిల్ ఇంజన్లు, గ్యాస్ టర్బైన్లు, పంపులు, కంప్రెషర్లు, హీట్ ఎక్స్చేంజర్స్, హైడ్రాలిక్ మెషిన్స్, ఆటోమేషన్ అండ్ కంట్రోల్ పరికరాలు, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ తదితరాల నిర్వహణ బాధ్యత పూర్తిగా మెరైన్ ఇంజనీర్లదే. నౌకల డిజైన్, నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్చర్లతో కూడా కలిసి పని చేయాల్సి ఉంటుంది. కేవలం నౌకకు సంబంధించే కాకుండా ప్రమాదాలు సంభవించినప్పుడు సైనికుల్లా స్పందించి, సామాన్యులను కాపాడటం కూడా మెరైన్ ఇంజనీర్ల అదనపు బాధ్యత. దీనికి తగిన విధంగా సన్నద్ధమై ఉండాలి. కోర్సులు-వివరాలు పదో తరగతి తర్వాత డిప్లొమా ఇన్ మెరైన్ ఇంజనీరింగ్‌లో చేరవచ్చు. ఇంటర్మీడియెట్ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) పూర్తిచేసిన వారు బీఎస్సీ (నాటికల్ సైన్స్), బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశించవచ్చు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఆసక్తిని బట్టి మాస్టర్స్ డిగ్రీ చేయొచ్చు. ప్రత్యేక విభాగాలు మారిటైమ్ కామర్స్, మెరైన్ రిఫ్రిజిరేషన్, కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టం, నేవిగేషన్ సిస్టమ్స్ అండ్ ఎక్విప్మెంట్, మెరైన్ రిన్యువబుల్ ఎనర్జీ రీసెర్చ్, అండర్ వాటర్ వెహికల్ రీసెర్చ్, ఇన్ఫర్మేషన్-కమ్యూనికేషన్ సిస్టమ్స్-ఎక్విప్మెంట్, ఆఫ్‌షోర్ ఎక్స్ట్రాక్టివ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (కేబుల్ లైయింగ్) వంటివి.. కెరీర్ వివరాలు అనేక ఉద్యోగ అవకాశాలకు ఆస్కారం ఉన్న రంగం మెరైన్ ఇంజనీరింగ్. ఇండియన్ మర్చెంట్ నేవీ, నేవీతోపాటు నౌకా నిర్మాణ కంపెనీల్లో ఉద్యోగాలు అపారం. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి దేశీయ సంస్థలతో పాటు విదేశాల్లో అవకాశాలపై ఆసక్తి ఉన్నవారికి ది అమెరికన్ బ్యూరో ఆఫ్ షిప్పింగ్, ఆంగ్లో ఈస్టెర్న్ షిప్పింగ్ మేనేజ్మెంట్ లిమిటెడ్, గ్రేట్ ఈస్టెర్న్ షిప్పింగ్ వంటి అంతర్జాతీయ కంపెనీల్లో అవకాశాలు లభిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మారిటైమ్ అకాడమీ వంటి సంస్థలు మెరైన్ ఇంజనీరింగ్ పూర్తిచేసినవారిని జూనియర్ ఇంజనీర్లుగా నియమించుకుంటున్నాయి. ప్రతిభ, మంచి పనితీరుతో ఐదారేళ్లలోనే చీఫ్ ఇంజనీర్ స్థాయికి ఎదగవచ్చు. మరికొన్ని సంస్థలు క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా మెరైన్ ఇంజనీర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి. వేతనాలు ఇతర ఇంజనీరింగ్ విభాగాలతో పోల్చితే పోటీ తక్కువగా, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మెరైన్ ఇంజనీర్లకు ప్రారంభంలోనే అధిక వేతనాలు అందుతున్నాయి. ఇందులో ఫిఫ్త్, ఫోర్త్, థర్డ్, సెకండ్, చీఫ్ ఇంజనీర్ అనే స్థాయిలు ఉంటాయి. హోదాను బట్టి నెలకు కనీసం రూ. 25 వేల నుంచి రూ. 5 లక్షల వరకు వేతనాలను అందుకోవచ్చు. కోర్సులు అందిస్తున్న కొన్ని ప్రముఖ సంస్థలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మారిటైమ్ స్టడీస్, గోవా www.imsgoa.org ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ www.iitm.ac.in ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ కోల్‌కతా క్యాంపస్ www.merical.ac.in ఇంటర్నేషనల్ మారిటైమ్ ఇన్స్టిట్యూట్, గ్రేటర్ నోయిడా www.imi.edu.in ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం www.andhrauniversity.edu.in/engg కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాల తర్వాత విద్యార్థులు ఎక్కువగా మెరైన్ ఇంజనీరింగ్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం మెరైన్ ఇంజనీర్లకు జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పెద్ద కంపెనీలు ఆకర్షణీయ ప్యాకేజీలతో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ రంగంలో నైపుణ్యం, అనుభవం ఉన్న వారికి కెరీర్ పరంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. - డా. బి.వి.అప్పారావు, ప్రొఫెసర్, మెరైన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఆంధ్రా యూనివర్సిటీ. -
ఐటీ కోర్సులకు కేరాఫ్ అమీర్‌పేట!!
ఇంజనీరింగ్ స్పెషల్ బీఎస్సీ, బీసీఏ, బీటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంటెక్ విద్యార్హత ఏదైనా... సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, నెట్వర్కింగ్.. చేరాలనుకున్న కోర్సు ఏదైనా అన్నింటికి ముఖ్య కూడలి.. హైదరాబాద్‌లోని అమీర్‌పేట. ఇది నేడు ఐటీ కోర్సుల శిక్షణా శిబిరంగా మారింది. నేటి ఆధునిక ప్రపంచానికి అవసరమైన సాంకేతిక నిపుణులను తీర్చిదిద్దుతోంది. ఈ నేపథ్యంలో అమీర్‌పేటలోని ఐటీ శిక్షణ సంస్థలు.. కోర్సులు.. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఇంజనీర్లు కావాలని కలలు కనే వారికి పరిచయం అక్కర్లేని ప్రాంతం అమీర్‌పేట. ఫ్రెషర్స్ ఉద్యోగాలు పొందాలన్నా, ఉద్యోగులు తమ స్కిల్‌ను డెవలప్ చేసుకోవాలన్నా అమీర్పేటని ఆశ్రయించవలసిందే. ఇక్కడి కోచింగ్ సంస్థలు.. ట్రెండ్‌కు అనుగుణంగా..సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డిమాండ్‌కు తగిన కోర్సుల్లో శిక్షణ ఇస్తూ సగటు విద్యార్థుల సమున్నత కెరీర్‌కు బాసటగా నిలుస్తున్నాయి. ఎవరెవరికి ఏ కోర్సులు బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, బీఎస్సీ.. విద్యార్థులు.. సీ, సీ++, జావా, డాట్నెట్, ఒరాకిల్, హడూప్, షేర్‌పాయింట్, లైనక్స్, టెస్టింగ్ టూల్స్, నెట్వర్కింగ్ కోర్సులతోపాటు ఆండ్రాయిడ్, ఐఫోన్ మొబైల్ అప్లికేషన్లనూ నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. బీకామ్ విద్యార్థులు ట్యాలీ వంటి అకౌంటింగ్ కోర్సుల్లోనూ చేరుతున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ విద్యార్థుల కోసం వీఎల్ఎస్ఐ డిజైన్, క్యాడ్/క్యామ్ తదితర కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్, హిమాయత్‌నగర్, కుకట్‌పల్లిలో కూడా మంచి ఇన్స్టిట్యూట్లు, కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యార్థులు అమీర్పేటకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. గతంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ), (హైదరాబాద్) అమీర్‌పేటలోని మైత్రివనంలో ఉండేది. ఎస్టీపీఐ అనుమతి పొందిన సంస్థలు అక్కడే చుట్టుపక్కల ఇన్స్టిట్యూట్స్ ప్రారంభించాయి. దాంతో విద్యార్థులు ఇక్కడకు వచ్చి వివిధ ఐటీ కోర్సుల్లో శిక్షణ పొందేవారు. అలా అమీర్‌పేట ఐటీ శిక్షణ సంస్థలకు కేంద్రంగా మారింది. అమీర్‌పేటలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న అన్ని రకాల టెక్నాలజీలకు కోచింగ్ లభిస్తుంది. ఇక్కడ ఇన్స్టిట్యూట్ల మధ్య పోటీ ఉండటంతో తక్కువ ఫీజులకే కోచింగ్‌ను అందిస్తున్నాయి. ఫీజులు ఒక్కో ఇన్స్టిట్యూట్ ఒక్కో కోర్సుకు ప్రసిద్ధి. ఫీజులు కూడా ఇన్స్టిట్యూట్లను, కోర్సులను బట్టి మారుతుంటాయి. రూ.500 నుంచి రూ.50000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అభ్యర్థులు తమ అర్హతలు, అనుభవం, అభిరుచులకు తగిన కోర్సులను ఎంపిక చేసుకోవాలి. ఇతర విద్యార్థులే ఎక్కువ ప్రస్తుతం ఇన్స్టిట్యూట్లల్లో ఇతర రాష్ట్రాల వారు, విదేశీయులు ఎక్కువగా ఉంటున్నారు. జావా నేర్చుకునే వారిలో 40 శాతం మంది తెలుగు విద్యార్థులు ఉండగా, ఇతర రాష్ట్రాల వారు 50 శాతం మంది, విదేశీయులు 10 శాతం వరకు ఉన్నారు. ఇన్స్టిట్యూట్, కోర్సు ఎంపికలో జాగ్రత్తలు * మార్కెట్ ట్రెండ్‌కనుగుణంగా డిమాండ్ ఉన్న కోర్సును ఎంచుకోవాలి. అయితే అన్ని టెక్నాలజీలు, టూల్స్ కానీ మార్కెట్లో ఎక్కువ కాలం ఉన్న దాఖలాలు లేవు. కొన్ని టెక్నాలజీలు మాత్రమే నిలకడగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. అభ్యర్థులు వాటివైపు మొగ్గు చూపాలి. * కోర్సు పూర్తయ్యాక ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఎలాంటి కంపెనీలు నిపుణులను నియమించుకుంటున్నాయో తెలుసుకోవాలి. * కోర్సు కాలపరిమితిని దృష్టిలో ఉంచుకోవాలి. సదరు కోర్సును తక్కువ కాలవ్యవధుల్లో ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్లో చేరేముందు, ఆ పరిమిత కాలంలో పూర్తి నైపుణ్యాలు సాధించగలరో లేదో విశ్లేషించుకోవాలి. * ఇన్స్టిట్యూట్లో ల్యాబ్స్, ఇతర సౌకర్యాలనూ దృష్టిలో ఉంచుకోవాలి. * అన్నింటి కంటే ముఖ్యంగా చేరాలనుకుంటున్న ఇన్స్టిట్యూట్ పాటించే ప్రమాణాలు, ఫ్యాకల్టీ అనుభవం, వారు ఎప్పటి నుంచి అక్కడ పనిచేస్తున్నారు తదితర అంశాలను స్నేహితులు, సీనియర్ల ద్వారా తెలుసుకోవాలి. కొన్ని ఇన్స్టిట్యూట్లు అనుభవం లేని, ల్యాబ్ కోఆర్డినేటర్లతో కూడా క్లాసులు నిర్వహిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఇన్స్టిట్యూట్ల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి. * కొన్ని ఇన్స్టిట్యూట్లు తమ ప్రకటనలతో విద్యార్థులను బుట్టలో వేసుకుంటాయి. ఇంకా ఆకర్షణీయంగా డెమో క్లాసులు నిర్వహించి అభ్యర్థులను తమ వైపు తిప్పుకుంటాయి. అలాంటి ఇన్స్టిట్యూట్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అమీర్‌పేటలో కోర్సుల ఫీజులు చాలా తక్కువ. పుణే, బెంగళూర్ లాంటి నగరాల్లో జావా నేర్చుకోవాలంటే దాదాపు రూ. 25 వేల వరకు ఖర్చు చేయాల్సిందే. కానీ ఇక్కడ రూ. 3 వేల నుంచి రూ.5 వేల లోపే పూర్తవుతుంది. - ఎన్.దుర్గా ప్రసాద్, డెరైక్టర్, దుర్గాసాఫ్ట్ -
ఐఐటీల్లో ఫీజుల భారం.. ఉపశమన మార్గాలివిగో!!
ఇంజనీరింగ్ స్పెషల్ ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ ముగిసింది.. త్వరలోనే ఫలితాలు.. ఆ తర్వాత అడ్మిషన్స్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. మరోవైపు విద్యార్థులు, తల్లిదండ్రులను కలవరపరుస్తున్న అంశం.. ఐఐటీల్లో ఫీజుల పెంపు! ఐఐటీల్లో బీటెక్ ఫీజులు రెట్టింపు చేస్తూ గత నెలలో కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయం తీసుకుంది. గతేడాది వరకు రూ.90 వేలుగా ఉన్న వార్షిక ఫీజును రూ.రెండు లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఐఐటీల్లో ఫీజుల భారం నుంచి ఉపశమనం పొందేలా విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఆర్థిక ప్రోత్సాహకాలపై విశ్లేషణ... స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఐఐటీ కౌన్సిల్ సిఫార్సుల మేరకు గత నెలలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఐఐటీల్లో బీటెక్ ఫీజులను రూ.90 వేల నుంచి రూ. రెండు లక్షలకు పెంచింది. వాస్తవానికి ఫీజును రూ. మూడు లక్షలకు పెంచాలని కమిటీ సిఫార్సు చేసినా.. రూ. రెండు లక్షలకు పెంచడం మధ్యతరగతి వర్గాలకు కాస్తలో కాస్త ఊరట. ఫీజుల పెంపునకు కారణాలు ఐఐటీల్లో ఫీజుల పెంపు ప్రతిపాదనపై గతేడాది కాలంగా కసరత్తు జరుగుతోంది. ఐఐటీ -చెన్నై, కాన్పూర్, ఢిల్లీ, హైదరాబాద్ డెరైక్టర్ల నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఐఐటీ కౌన్సిల్ ఫీజుల పెంపుపై పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. రూ.3లక్షలకు పెంచాలని సిఫార్సు చేసింది. ఐఐటీలు ఏటా ఒక్కో విద్యార్థిపై వెచ్చిస్తున్న వ్యయాన్ని, ఇతర నిర్వహణ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఫీజులు పెంచినట్లు కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఫీజుల పెంపుపై విద్యార్థులు ఆందోళన చెందక్కర్లేదని, ఐఐటీ చదువులు ఆర్థిక భారమనే ఒత్తిడికి లోనవనక్కర్లేదని కేంద్రం పేర్కొనడం విశేషం. 70 శాతం మందికి మినహాయింపు! * ఎస్సీ, ఎస్టీలు, అంగవైకల్యం ఉన్నవారికి ఫీజు నుంచి పూర్తి రాయితీ. * కుటుంబ వార్షికాదాయం రూ. లక్షలోపు ఉన్న విద్యార్థులకు వారి సామాజికవర్గంతో నిమిత్తం లేకుండా పూర్తి ఫీజు రాయితీ సౌకర్యం కల్పిస్తారు. * కుటుంబ వార్షికాదాయం రూ. 5 లక్షలలోపు ఉంటే ఫీజులో మూడింట రెండొంతుల మేరకు (66 శాతం) మినహాయింపు ఉంటుంది. * ఇలా పలు విధానాలను పరిశీలిస్తే దాదాపు 70 శాతం మందికి ఫీజు నుంచి పూర్తి స్థాయిలో మినహాయింపు లేదా రాయితీ లభిస్తుంది. విద్యాలక్ష్మి పథకం ఫీజుల భారం నేరుగా భరించే విద్యార్థుల కోసం తాజా ప్రతిపాదన విద్యాలక్ష్మి పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం. దీని ద్వారా ఐఐటీల్లో ప్రవేశం ఖరారై ఇన్స్టిట్యూట్లో అడుగుపెట్టిన రోజే వడ్డీ రహిత స్కాలర్షిప్ అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అదేవిధంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో చర్చించి బ్యాంకుల సహకారంతో తక్కువ వడ్డీకి రుణాలు సైతం అందించేందుకు చర్యలు చేపడుతోంది. రీసెర్చ్, టీచింగ్ అసిస్టెన్స్‌షిప్ ఐఐటీల్లో బీటెక్ కోర్సులు చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూతనిచ్చేవి.. రీసెర్చ్ అసిస్టెన్స్‌షిప్, టీచింగ్ అసిస్టెన్స్‌షిప్. ఈ రెండింటి ద్వారా విద్యార్థులు అప్పటికే సదరు ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ చేస్తున్న వారికి సహాయకులుగా వ్యవహరిస్తూ అటు అకడమిక్ నైపుణ్యాలు పెంచుకోవడంతోపాటు నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు రీసెర్చ్, టీచింగ్ అసిస్టెన్స్‌షిప్ అందుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఐఐటీల్లో బీటెక్ విద్యార్థులకు దాదాపు 23 స్కాలర్షిప్ పథకాలు వేర్వేరుగా అమలవుతున్నాయి. వీటి కోసం విద్యార్థులు తమ అడ్మిషన్ ఆఫర్ లెటర్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇందుకోసం https://scholarships.gov.in చూడొచ్చు. రెండు వేల కోట్లతో ప్రత్యేక ఎన్బీఎఫ్సీ స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఐఐటీ కౌన్సిల్ రూ.రెండు వేల కోట్ల కార్పస్‌తో ప్రత్యేక ఎన్బీఎఫ్సీ(న్యాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్) వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. దీని ద్వారా ఐఐటీల్లో పరిశోధనలు, మౌలిక సదుపాయాలు, ఇతర నిర్వహణ వ్యయాలకు వడ్డీ రహిత రుణాలు అందించాలని సూచించింది. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం లభించిందని, కేబినెట్ ఆమోదం లాంఛనమేనని తెలుస్తోంది. విదేశీ విద్యార్థులకు సైతం పెరిగిన ఫీజులు ఐఐటీల్లో అడ్మిషన్ ఫర్ ఫారెన్ నేషనల్స్ పేరుతో మొత్తం సీట్లకు అదనంగా పది శాతానికి మించకుండా విదేశీ విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు. వీరికి ప్రస్తుతం 4 వేల యూఎస్ డాలర్లుగా ఉన్న వార్షిక ఫీజును పది వేల డాలర్లకు పెంచారు. ఇతర ఖర్చులకు సిద్ధంగా ఉండాలి ఫీజుల విషయంలో రాయితీలు పొందే విద్యార్థులు ఇతర ఖర్చుల విషయంలో మాత్రం స్వయంగా వనరులు సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా ఇన్స్టిట్యూట్ లో ప్రవేశించే సమయంలో లైబ్రరీ ఫీజు, అడ్మిషన్ ఫీజు, వన్ టైం కాషన్ డిపాజిట్ వంటి వాటికోసం నగదును దగ్గర పెట్టుకోవాలి. అదేవిధంగా హాస్టల్ అకామడేషన్ ఫీజు పరంగానూ సొంత నిధులు సమకూర్చుకోవాలి. ఈ ఇతర వ్యయాలు పరిగణనలోకి తీసుకుంటే ఐఐటీల్లో ప్రతి సెమిస్టర్‌కు విద్యార్థులకు అవుతున్న వ్యయం రూ. 30 వేల వరకు ఉంటోంది. ఆ మేరకు నగదు సిద్ధంగా ఉంచుకోవాలి. స్వయం ప్రతిపత్తికి ప్రాధాన్యం ఐఐటీల్లో ఫీజుల పెంపుపై విద్యార్థులు ఆందోళన చెందక్కర్లేదు. వీరికి ఎన్నో రకాల ఆర్థిక ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయి. ఫీజుల పెంపునకు కారణం ఐఐటీలకు ఆర్థికంగా స్వయం ప్రతిపత్తి కల్పించడమే. అంతేకానీ విద్యార్థులపై భారం మోపడం ఉద్దేశం కాదు. పెంచే ఫీజుల వల్ల ఆయా ఐఐటీల్లో నిర్వహణ వ్యయం లభిస్తుంది. తద్వారా పలు అనవసర జాప్యాలను నివారించొచ్చు. - ప్రొఫెసర్. కె.ఎన్. సత్యనారాయణ, ఐఐటీ-తిరుపతి క్యాంపస్ ఇన్ఛార్జ్. -
ఇస్రోలో 375
సైంటిస్ట్ /ఇంజనీర్ పోస్టులు దేశంలో స్పేస్ సైన్స్ అప్లికేషన్స్, టెక్నాలజీలో విశేష కృషిచేస్తున్న సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)! ఇది తాజాగా వివిధ విభాగాల్లో సైంటిస్ట్/ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. యువ ఇంజనీర్ గ్రాడ్యుయేట్లకు ఇదో మంచి అవకాశం. ఇస్రోలో కొలువును చేజిక్కించుకోవడం ద్వారా ఉన్నత కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు! ఉద్యోగం: సైంటిస్ట్/ఇంజనీర్ (ఎస్సీ) వేతన స్కేలు: రూ.15,600-రూ.39,100 (గ్రేడ్ పే రూ.5,400). ఖాళీలు: 375 ఎంపికైన అభ్యర్థులు ప్రారంభంలో ‘ఎస్సీ’ గ్రేడ్‌లో నియమితులవుతారు. తర్వాత సీనియారిటీ, పని అనుభవం ఆధారంగా ఎస్డీ, ఎస్ఈ, ఎస్ఎఫ్ వంటి గ్రేడ్లు ఇస్తారు. ప్రారంభంలో గ్రాస్ రూ.45,990 వరకు ఉంటుంది. ట్రావెల్ అలవెన్సు, వైద్య సదుపాయాలు వంటివి కూడా ఉంటాయి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్: www.isro.gov.in ఇంజనీరింగ్ స్పెషల్ జాబ్ పాయింట్ అర్హత కనీసం 65 శాతం మార్కులతో లేదా 6.84 సీజీపీఏతో బీఈ/బీటెక్ లేదా తత్సమాన ఉత్తీర్ణత. ఏఎంఐఈ/గ్రాడ్ఐఈటీఈ అర్హత ఉన్న వారికి సెక్షన్ బీలో 65 శాతం మార్కులు లేదా 6.84 సీజీపీఏ ఉండాలి. బీఈ/బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా అభ్యర్థులు 2016, ఆగస్టు నాటికి బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. వయసు 2016, మే 25 నాటికి 35 ఏళ్లు మించరాదు. పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. తొలి దశలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులను ఉద్యోగాలను ఎంపిక చేస్తారు. అభ్యర్థుల తుది జాబితా రూపకల్పనలో రాత పరీక్షలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకోరు. ఫీజు దరఖాస్తు ఫీజు రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, చలానా జనరేట్ అవుతుంది. ఫీజు మొత్తాన్ని ఎస్బీఐలో చెల్లించాలి. చలానా కాపీని ‘సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఐసీఆర్బీ), ఇస్రో హెడ్‌క్వార్టర్స్, అంతరిక్ష్ భవన్, న్యూ బీఈఎల్ రోడ్, బెంగళూరు’కు పంపించాలి. ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: మే 5, 2016 దరఖాస్తుకు చివరి తేదీ: మే 25,2016 రాత పరీక్ష తేదీ: జూలై 3, 2016 పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, గువహటి, హైదరాబాద్, కోల్‌కతా... -
ప్లాస్టిక్ కోర్సులకు కేరాఫ్ సిపెట్
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్).. ప్లాస్టిక్ సంబంధిత కోర్సులు అభ్యసించాలనుకునే అభ్యర్థులకు చక్కటి విద్యా సంస్థ. కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ సంస్థ పదో తరగతి ఉత్తీర్ణుల నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణుల వరకు వివిధ కోర్సులందిస్తోంది. చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సిపెట్‌కు హైదరాబాద్ (చర్లపల్లి)లో కూడా క్యాంపస్ ఉంది. ప్రస్తుతం వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సిపెట్ కోర్సులు, అర్హతలు తదితర వివరాలు.. ఇంజనీరింగ్ స్పెషల్ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, మారుతున్న అవసరాలకనుగుణంగా ప్లాస్టిక్ వాడకం నానాటికీ పెరుగుతోంది. పిల్లల పాల డ బ్బా, ఆడుకునే వస్తువులు మొదలుకుని పెద్దలకు ఊతాన్నిచ్చే స్టిక్ వరకు ప్రతీది పాలిమర్ సమ్మేళనమే. రాదేదీ ప్లాస్టిక్‌కు సాటి అనే చందంగా.. గతంలో మాదిరిగా సాదాసీదా వ్యవహారంలా కాకుండా ప్లాస్టిక్ రంగం ఇప్పుడు ప్రొఫెషన్ రూపును సంతరించుకుంటోంది. దీంతో ప్లాస్టిక్‌లో ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సులను అభ్యసించినవారికి డిమాండ్ పెరుగుతోంది. ఈ విభాగంలో నిపుణులను తీర్చిదిద్దే ఉద్దేశంతో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) హైదరాబాద్ క్యాంపస్ వివిధ కోర్సుల్లో శిక్షణ అందిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న డిమాండ్ వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్‌కి ప్రాధాన్యత పెరుగుతోంది. వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ, చెరువుల పునరుద్ధరణ .. వంటి కార్యక్రమాల్లో దాదాపు 85 శాతం ప్లాస్టిక్ సంబంధిత మెటీరియల్స్‌నే వాడుతున్నారు. వీటితోపాటు కూరగాయలు, పండ్లను ప్యాకింగ్ చేసే ట్రేలు, వరి నాట్లు, పాల శుద్ధికి ఉపయోగించే వస్తువులు.. ఇలా ఒకటేంటి దాదాపు వ్యవసాయ రంగంలో అధికంగా ప్లాస్టిక్ వస్తువులే కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీంతో అనేక రకాల ప్లాస్టిక్ తయారీ సంస్థల్లో ఉద్యోగుల అవసరం పెరుగుతోంది. అనేక విభాగాల్లో కోర్సులు మార్కెట్, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుకోర్సులున్నాయి. డిజైన్/టూలింగ్/క్యాడ్/ సీఏఎం/సీఎన్సీ ప్రోగ్రామ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్/ ప్రాసెసింగ్ ఆఫ్ ప్లాస్టిక్స్/మెషీన్ మెయింటనెన్స్, టెస్టింగ్ - క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, వెల్డింగ్ - ఫ్యాబ్రికేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ -నెట్వర్కింగ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్లున్నాయి. అవకాశాలు ఏటా దాదాపు ఐదు వేల మందికి శిక్షణ ఇస్తున్నారు. వీరిలో 85 శాతం మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. కొంతమంది స్వయం ఉపాధి దిశగా సాగుతున్నారు. సౌదీ అరేబియా, యూఏఈ కంపెనీలకు సగానికి పైగా ఎంపికవుతున్నారు. వీటితోపాటు జైన్, సుధాకర్ పైప్స్, గోదావరి పాలిమర్స్, నాగార్జున గ్రూప్.. క్యాంపస్ ప్లేస్మెంట్లు కల్పిస్తున్నాయి. గతేడాది అమెరికాకు చెందిన అప్తార్ కంపెనీకి 65 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఇలా కోర్సు నేర్చుకున్న ప్రతీ ఒక్కరు ఉద్యోగాలు పొందుతున్నారు. ప్లాస్టిక్ అనేది కామన్ మ్యాన్ మెటీరియల్, తక్కువ ధరకే లభించే వస్తువు. దీంతో ఈ రంగంలో మానవ వనరుల ఆవశ్యకత పెరుగుతోంది. రెగ్యులర్ డిగ్రీ కోర్సుల కంటే సిపెట్ అందించే కోర్సుల్లో డిగ్రీ/డిప్లొమా చేసిన వారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శిక్షణ పొందేవారిలో అర్హత గల విద్యార్థులకు స్కాలర్షిప్ సదుపాయాన్ని కల్పిస్తున్నాం. అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్లాస్టిక్ రంగంలో శిక్షణ ఇచ్చివారిని ప్రోత్సహిస్తున్నాం. ప్రతిభావంతులైన ఐదుగురు విద్యార్థులకు మా సంస్థలోనే ఉద్యోగం ఇస్తాం. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఇద్దరు విద్యార్థులకు ప్రత్యేకంగా స్కాలర్‌షిప్‌ని అందిస్తున్నాం. వి. కిరణ్‌కుమార్, చీఫ్ మేనేజర్ సిపెట్, హైదరాబాద్ కోర్సుల వివరాలు సిపెట్ హైదరాబాద్ క్యాంపస్.. డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో శిక్షణ ఇస్తోంది. ప్రస్తుతం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ప్లాస్టిక్ ప్రాసెసింగ్ టెస్టింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (పీజీడీ-పీపీటీ) అర్హత: కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. వ్యవధి: ఏడాదిన్నర వయసు: 25 ఏళ్లకు మించకూడదు. క్యాడ్/ క్యామ్‌తో ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్‌లో పోస్ట్ డిప్లొమా (పీడీ-పీఎండీ విత్ క్యాడ్/ క్యామ్) అర్హత: డిప్లొమా ఇన్ మెకానికల్/ప్లాస్టిక్ టెక్నాలజీ/ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ /మెకట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ / టూల్ అండ్ డై మేకింగ్/ డీపీఎంటీ/డీపీటీ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత. వ్యవధి: ఏడాదిన్నర వయసు: 25 ఏళ్లకు మించకూడదు. ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీలో డిప్లొమా (డీపీఎంటీ) ప్లాస్టిక్ టెక్నాలజీలో డిప్లొమా (డీపీటీ) అర్హత: 10వ తరగతి వ్యవధి: మూడేళ్లు వయసు: 20 ఏళ్లకు మించకూడదు అన్ని కోర్సుల్లో ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తుల విక్రయానికి చివరి తేది: మే 6 దరఖాస్తుకు చివరి తేది: మే 13 జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్: జూన్ 5 వెబ్సైట్: www.cipet.gov.in ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి పాస్/ ఫెయిల్ విద్యార్థులకు షార్ట్ టర్మ్ కోర్సుల ద్వారా శిక్షణ అందిస్తున్నారు. ఈ కోర్సులు రెండు నుంచి మూడు నెలల వ్యవధి ఉంటాయి. -
మెకానికల్.. మెరిసే..!!
ఇంజనీరింగ్ స్పెషల్ నిత్యం ఉపయోగించే వాషింగ్ మెషిన్, గడియారాలు, సంగీత పరికరాలు, గన్స్, సైకిల్ మొదలైనవన్నీ మెకానికల్ ఇంజనీర్ల సృష్టే! మార్కెట్ ఒడిదొడుకులతో పెద్దగా ప్రభావితం కాకుండా స్థిరమైన అవకాశాలు అందించే బ్రాంచ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ ఔత్సాహికుల కోసం మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు, ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు, కెరీర్ స్కోప్ వివరాలు.. కోర్సు ఇలా జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ అర్హత పరీక్షలో మంచి ర్యాంకు సాధిస్తే ప్రఖ్యాత ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు పొందవచ్చు. వీటితో పాటు ఈ పరీక్షలో సాధించిన స్కోరు ఆధారంగా దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో సీటు దక్కించుకోవచ్చు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ ద్వారా రాష్ట్రంలోని క్యాంపస్ కాలేజీలు, ప్రైవేటు కాలేజీల్లో సీటు లభిస్తుంది. థర్మో డైనమిక్స్, ప్రొడక్షన్ టెక్నాలజీ, కైనమెటిక్స్ ఆఫ్ మెషినరీ, థర్మల్ ఇంజనీరింగ్ తదితర కోర్ సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు ఏరోస్పేస్ ఇంజనీర్, ఏరోనాటికల్ ఇంజనీర్, ఆటోమోటివ్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్, న్యూక్లియర్ ఇంజనీర్, టూల్ డిజైనర్.. మొదలైన వాటిలో కెరీర్ ప్రారంభించవచ్చు. ఆసక్తి ఉన్నవారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దిశగా పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్‌లోని పరిశోధన సంస్థల్లో చేరొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్జీసీ, వీఎస్ఎస్సీ, ఇస్రో, ఐవోసీ, డీఆర్డీవో, సెయిల్, ఎన్టీపీసీ, డిఫెన్స్, పీడబ్ల్యుడీ, సీపీడబ్ల్యుడీ, ఆర్మ్డ్ ఫోర్సెస్‌ల్లో పనిచేసే అవకాశం కూడా లభిస్తుంది. ఉన్నత విద్య మెకానికల్ ఇంజనీరింగ్ చేశాక ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు గేట్, పీజీఈసెట్ ద్వారా ఎంటెక్‌లో చేరొచ్చు. హైడ్రాలిక్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెషిన్ డిజైన్, మ్యానుఫాక్చరింగ్ ఇంజనీరింగ్, ఏరో డైనమిక్స్ తదితర స్పెషలైజేన్లలో ఉన్నత విద్యను అభ్యసించొచ్చు. అలాగే మేనేజ్మెంట్ విద్య పట్ల ఆసక్తి ఉంటే... క్యాట్, మ్యాట్, ఎక్స్‌ఏటీ, ఎక్స్ఎల్ఆర్ఐ వంటి పరీక్షల్లో ప్రతిభను చూపడం ద్వారా ఎంబీఏలో చేరొచ్చు. విధులు మెకానికల్ ఇంజనీర్లు వారు పనిచేసే ఇండస్ట్రీ, స్పెషలైజేషన్ ఆధారంగా వేర్వేరు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డిజైన్, ప్రొడక్షన్, అనాలసిస్ అండ్ టెస్టింగ్, ఇన్స్టాలేషన్, మెయింటెన్స్ విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది. టాప్ రిక్రూటర్స్ టాటా గ్రూప్, గోద్రెజ్ గ్రూప్, ఎల్ అండ్ టీ, సీమెన్స్, జీఈ, హ్యుందాయ్ మోటార్స్, ఫోర్డ్, ఆశోక్ లేల్యాండ్, రాయల్ ఎన్ఫీల్డ్, మహింద్రా అండ్ మహింద్రా, జిందాల్ మొదలైనవి. మెకానికల్ ఇంజనీరింగ్‌కు చెందిన కంప్యూటర్ సైన్స్ ఏరియా.. కంప్యూటేషనల్ ఫ్లుయిడ్ డైనమిక్స్ (సీఎఫ్‌డీ) ద్వారా డిజైన్ ప్రక్రియలో చాలా మార్పులు వచ్చాయి. ఈ విభాగంలో అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. హానీవెల్, జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) లాంటి పెద్ద కంపెనీలు సీఎఫ్డీపై అవగాహన ఉన్నవారిని నియమించుకుంటున్నాయి. - వి. ఉమామహేశ్వర్, అసోసియేట్ ప్రొఫెసర్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ -
బ్రాంచ్ ఎంపికలో.. అభిరుచి
ఇంజనీరింగ్ స్పెషల్ జాతీయ స్థాయిలో ఐఐటీలు, నిట్లతోపాటు రాష్ట్ర స్థాయి కాలేజీల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు భారీ కసరత్తు జరుగుతోంది. జేఈఈ మెయిన్ ఫలితాలు ఇప్పటికే వెలువడగా, తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ ముగిసింది. తెలంగాణలో మే 15న ఎంసెట్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రుల దృష్టంతా ఇంజనీరింగ్‌లో బ్రాంచ్ సెలక్షన్ గురించే! ఈ నేపథ్యంలో బ్రాంచ్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై నిపుణుల సలహాలు, సూచనలు.. 1. తొలి ప్రాధాన్యం.. ఆసక్తి సివిల్ ఇంజనీరింగ్ నుంచి సిరామిక్ టెక్నాలజీ వరకు.. ఐటీ కొలువుకు దారిచూపే కంప్యూటర్ సైన్స్.. కోర్ బ్రాంచ్‌లు, అప్‌కమింగ్ బ్రాంచ్‌లు.. ఇలా పదుల సంఖ్యలో బ్రాంచ్‌లు! బ్రాంచ్‌లు ఎన్ని ఉన్నా.. విద్యార్థులు మాత్రం తమ వ్యక్తిగత అభిరుచికి తగ్గ బ్రాంచ్నే ఎంచుకోవాలన్నది నిపుణుల సూచన. తాము అప్పటివరకు అకడమిక్‌గా మంచి ఆసక్తి కనబర్చిన సబ్జెక్ట్‌లను ఇందుకు ఉపకరణాలుగా మలచుకోవాలి. ఎందుకంటే.. సబ్జెక్టుపై ఆసక్తి ఉంటేనే అకడమిక్‌గా రాణించడం సాధ్యమవుతుంది. మ్యాథమెటిక్స్‌లో అల్గారిథమ్స్, స్టాటిస్టికల్ స్కిల్స్ ఉన్న విద్యార్థులు ప్రోగ్రామింగ్‌లో ప్రతిభ కనబర్చగలరు. ఇలాంటి విద్యార్థులు సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ వంటి బ్రాంచ్‌లను ఎంపిక చేసుకోవచ్చు. డ్రాయింగ్, డిజైనింగ్ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులకు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ వంటి బ్రాంచ్‌లు సరిపోతాయి. 2. ‘భవిష్యత్తు’ బేరీజు బ్రాంచ్ ఎంపికలో ఆసక్తితోపాటు భవిష్యత్తులో లభించే కెరీర్ అవకాశాలపైనా దృష్టిపెట్టాలి. కొన్ని బ్రాంచ్‌లకు మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. మరికొన్ని బ్రాంచ్‌లు మార్కెట్ స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు సీఎస్ఈ ద్వారా అవకాశాలు లభించే సాఫ్ట్వేర్ రంగాన్ని పరిగణిస్తే ఈ రంగం ఒడిదుడుకులకు లోనవుతుంది. భవిష్యత్తు అంచనాలు తెలుసుకునేందుకు అసోచామ్, ఫిక్కీ వంటి సంస్థల సర్వేల నివేదికలను పరిశీలించొచ్చు. 3. ఉన్నత విద్య బ్రాంచ్‌ను ఎంపిక చేసుకునే ముందు.. ఆయా బ్రాంచ్ ద్వారా లభించే ఉన్నత విద్య.. వాటిని పూర్తి చేశాక లభించే కెరీర్ అవకాశాలపైనా దృష్టిపెట్టాలి. ఉదాహరణకు ఈఈఈ బ్రాంచ్‌ను పరిగణిస్తే బీటెక్ ఈఈఈతో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌లో నాలెడ్జ్ లభిస్తుంది. కాని ఈఈఈకి సంబంధించి జాబ్ మార్కెట్ పరంగా అందుబాటులో ఉన్న ప్రత్యేక విభాగాల్లో జాబ్స్ కోసం ఎంటెక్ స్థాయిలో నైపుణ్యాలు పొందాలి. ఉదా: మైక్రో చిప్స్, మెమొరీ చిప్స్ తయారు చేసే పలు ఎలక్ట్రానిక్ సంస్థల్లో ఉన్నత కొలువులు పొందాలంటే నానో టెక్నాలజీ స్పెషలైజేషన్‌తో ఎంటెక్ పూర్తిచేయాలి. 4. ఆటిట్యూడ్ కూడా ముఖ్యమే బ్రాంచ్ ఎంపికలో ఆసక్తితోపాటు విద్యార్థి వ్యక్తిగత దృక్పథం కూడా కీలకం. బ్రాంచ్ ద్వారా ఉత్తీర్ణత లభించే ఉద్యోగాలను దృష్టిలో పెట్టుకుంటే.. కొన్ని రంగాల్లో (ఉదాహరణకు.. సివిల్, మెకానికల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ తదితర) ఓర్పు, సహనం, శ్రమించే తత్వం, ఫీల్డ్ వర్క్‌కు ప్రాధాన్యం ఉంటుంది. మరికొన్ని రంగాల్లో (సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఐటీ సంస్థల్లో) రాణించాలంటే.. బృంద నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్‌తోనే సాధ్యం. విద్యార్థులు ఆయా బ్రాంచ్‌ల ద్వారా లభించే ఉద్యోగాల నేచర్ ఆఫ్ ది జాబ్, అందుకు తగ్గ దృక్పథం తనకు ఉందా లేదా అనేది కూడా పరిశీలించుకోవాలి. బ్రాంచ్ ఎంపికలో పరిగణించాల్సిన మరో అంశం.. నిరంతరం నేర్చుకునే తత్వం! కారణం.. నిత్యం కొత్త మార్పులు జరిగే సాఫ్ట్వేర్ వంటి రంగాల్లో రాణించేందుకు అప్డేట్ అవడం చాలా అవసరం. 5. అనుబంధ బ్రాంచ్లపైనా విద్యార్థులు తమకు నచ్చిన బ్రాంచ్‌లో సీటు లభించే అవకాశాలు తక్కువగా ఉంటే.. ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి. ఒక బ్రాంచ్‌కు అనుబంధంగా ఎన్నో కొత్త బ్రాంచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు సీఎస్ఈకి అనుబంధంగా ఐటీ; ఈసీఈకి అనుబంధంగా ఈటీఎం (ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికం మేనేజ్మెంట్); మెకానికల్‌కు అనుబంధంగా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వంటివి. బ్రాంచ్ ముఖ్యమా.. కాలేజ్ ప్రధానమా బ్రాంచ్ విషయంలో స్పష్టత లభించాక ఆ బ్రాంచ్‌కు సంబంధించి అకడమిక్‌గా పేరున్న కళాశాలలను అన్వేషించడం అవసరం. ఆ కాలేజ్‌లకు ఉన్న అకడెమిక్ రికార్డ్, ప్లేస్‌మెంట్స్, ఫ్యాకల్టీ, ల్యాబ్స్, లైబ్రరీ తదితరాల ఆధారంగా కాలేజీల జాబితా రూపొందించుకోవాలి. ఆయా కళాశాలలకు ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించాలి. ఆ క్రమంలో కొన్నిసార్లు బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా? లేదా కాలేజ్ /ఇన్స్టిట్యూట్కు ప్రాధాన్యమివ్వాలా? అనే ప్రశ్న ఎదురవుతుంది. నూటికి 75 శాతం బ్రాంచ్‌కే ప్రాధాన్యమివ్వాలి అనేది నిపుణుల సలహా. క్రేజ్ కంటే... ఇష్టానికి ప్రాధాన్యం ప్రస్తుతం విద్యార్థుల్లో అధిక శాతం మంది జాబ్ మార్కెట్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని బ్రాంచ్‌లు ఎంపిక చేసుకుంటున్నారు. కానీ ఇది కొంతమేరకే ఫలితం ఇస్తుంది. కాబట్టి క్రేజ్ కంటే వ్యక్తిగత ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యక్తిగత ఆసక్తి ఉంటే బ్రాంచ్ ఏదైనా భవిష్యత్తు అవకాశాలు పుష్కలం. తప్పనిసరి పరిస్థితుల్లో ఆసక్తి గల బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్‌కు మారాల్సి వస్తే విద్యార్థులు తమ మైండ్ సెట్‌ను కూడా అందుకు అనుగుణంగా మార్చుకోవాలి. - ప్రొఫెసర్ బి.చెన్నకేశవ రావు, ప్రిన్సిపాల్, సీబీఐటీ ప్లేస్మెంట్సే ప్రధానం కాదు విద్యార్థులు బ్రాంచ్ ఎంపికలో భవిష్యత్తు ప్లేస్‌మెంట్స్‌నే ప్రధానంగా భావించకూడదు. ముందుగా నచ్చిన బ్రాంచ్‌ను ఎంపిక చేసుకుని దాని ద్వారా లభించే అవకాశాలు, వాటిని అందిపుచ్చుకునే మార్గాల గురించి అన్వేషణ సాగించాలి. ప్లేస్‌మెంట్స్ కోణంలోనే బ్రాంచ్‌లను ఎంపిక చేసుకుంటే ఇబ్బందికి గురవుతారు. నచ్చిన బ్రాంచ్‌లో సీటు రాకపోతే అనుబంధ బ్రాంచ్‌లపై ముందు నుంచే దృష్టిపెట్టి వాటిల్లో చేరేందుకు కృషి చేయాలి. - ప్రొఫెసర్ ఎం.చంద్రశేఖర్, ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్, నిట్-వరంగల్ -
టెక్ రెజ్యుమె ఎలా ఉండాలంటే..
ఇంజనీరింగ్ స్పెషల్ నేడు ఉద్యోగ సాధనలో రెజ్యుమె పాత్ర కీలకం. రెజ్యుమె ఏ మాత్రం సరిగా లేకున్నా రిక్రూటర్స్‌ను ఆకట్టుకోవడం కష్టం. దీంతోనే అభ్యర్థులపై ఒక అంచనాకు వచ్చేస్తాయి నియామక సంస్థలు. ఈ నేపథ్యంలో టెక్నికల్ ఉద్యోగాలకు ఎలాంటి రెజ్యుమెను రూపొందించుకోవాలో తెలుసుకుందాం.. అన్ని ఉద్యోగాలకు ఒకటే రె జ్యుమె సరికాదు కొలువు కావాలంటే దరఖాస్తుతోపాటు తప్పనిసరిగా పంపాల్సింది.. రెజ్యుమె. ఇది రంగాన్ని, ఉద్యోగాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. ఒకే ఫార్మాట్లోని రెజ్యుమె అన్ని రకాల కొలువులకు సరిపోదు. సాంకేతిక కొలువులకు సంబంధిత రెజ్యుమెను జతచేయాలి. ఇది టెక్ ఫ్రెండ్లీగా ఉండాలి. టెక్నాలజీలో మీ అర్హతలు, అనుభవం, నైపుణ్యాలను రిక్రూటర్‌కు సరిగ్గా తెలియజేయాలి. టెక్నాలజీ జాబ్స్‌పై ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐటీ ప్రొఫెషనల్స్ టెక్ రెజ్యుమెపై తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలి. సాంకేతిక నైపుణ్యాలు టెక్నాలజీ రెజ్యుమె రూపకల్పనలో ఇతర విషయాల కంటే మీలోని టెక్నికల్ స్కిల్స్‌కే పెద్దపీట వేయాలి. వీటిని ప్రముఖంగా పేర్కొనాలి. హైరింగ్ మేనేజర్ మీ రెజ్యుమెను ఆసాంతం చదవలేరు. మొదట మీలోని సాంకేతిక నైపుణ్యాలనే పరిశీలిస్తారు. వాటిపట్ల సంతృప్తి చెందితేనే మిగిలిన అంశాలపై దృష్టి సారిస్తారు. పని అనుభవాలు మీ పని అనుభవాలను క్లుప్తంగా మూడు లేదా నాలుగు లైన్లలో ప్రస్తావిస్తూ రెజ్యుమెను ప్రారంభించండి. తర్వాత వివిధ విభాగాల్లో మీ టెక్నికల్ స్కిల్స్‌ను విపులంగా పేర్కొనండి. ఉదాహరణకు.. ఆపరేటింగ్ సిస్టమ్స్: విండోస్, యూనిక్స్, లైనక్స్ లాంగ్వేజెస్: జావా, విజువల్ బేసిక్, సీ/సీ++, పెర్ల్ డేటాబేస్: ఒరాకిల్, ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్ నెట్వర్కింగ్: టీసీపీ/ఐపీ, లాన్/వాన్. మీ ప్రొఫైల్‌కు వర్తించే ప్రోగ్రామ్స్/అప్లికేషన్లను మాత్రమే ప్రస్తావించండి. తెలియని వాటిని కూడా పేర్కొంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంటర్వ్యూలో పూర్తి ఆత్మవిశ్వాసంతో చర్చించగలిగే సాంకేతిక అంశాలనే రెజ్యుమెలో చేర్చండి. అంటే వాటిపై మీకు మంచి పరిజ్ఞానం ఉండాలి. అప్పుడే ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలుగుతారు. మీరు ఇప్పటికే ఒక సంస్థలో పనిచేసి ఉంటే అక్కడ సాధించిన విజయాలను కూడా పేర్కొనండి. కీలక పదాలు ఐటీ రెజ్యుమెకు సరిగ్గా నప్పే సాంకేతిక పదాలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఆయా పదాలు ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు.. యాక్టివేటెడ్, డిజైన్డ్, ఆర్గనైజ్డ్, అసిమిలేటెడ్, డెవలప్డ్, ఇనిషియేటెడ్, యుటిలైజ్డ్, డెమాన్స్ట్రేటెడ్, ఇన్స్టాల్డ్ వంటి పదాలను రెజ్యుమెలో సందర్భానుసారం ఉపయోగించాలి. జూనియర్, సీనియర్ జూనియర్, సీనియర్ ప్రొఫెషనల్స్ రెజ్యుమె కంటెంట్ వేర్వేరుగా ఉంటుంది. అనుభవజ్ఞులు, అనుభవం లేనివారి అర్హతలు, నైపుణ్యాలు ఒకేలా ఉండవు. ఈ భేదాన్ని గుర్తించాలి. తొలిసారిగా కెరీర్లో ప్రవేశించేవారు స్కిల్స్, ప్రాజెక్ట్‌లపై ఎక్కువ ఫోకస్ చేయాలి. -
హైటెక్ కెరీర్‌కు.. బీటెక్
ఇంజనీరింగ్ స్పెషల్ ఇంజనీరింగ్ ప్రస్తుతం క్రేజ్ ఉన్న కోర్సు. ఇంటర్ పూర్తిచేసిన వారిలో చాలా మంది ఇంజనీరింగ్‌లో చేరాలనుకుంటారు. కానీ వారికి కోర్సు, కాలేజీ ఎంపిక, అందులో ఉన్న కష్టనష్టాలు, నాలుగేళ్లు పూర్తయ్యాక ఏం చేయాలి అనే విషయాలపై స్పష్టత అవగాహన కల్పించేందుకు ఈ కథనం. ప్రవేశ పరీక్షలు ఇంజనీరింగ్‌లో చేరాలనుకునే విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో చేరాలనుకుంటే ఐఐటీ-జేఈఈ, బిట్ శాట్...వంటి ప్రవేశ పరీక్షల గురించి తెలుసుకోవాలి. స్థానిక కాలేజీల్లో చేరాలనుకున్న వారు ఎంసెట్ రాయడం ఉత్తమం. బ్రాంచ్ ఎంపికలో జాగ్రత్త పూర్వ విద్యార్థులు, పెద్దల సలహా తీసుకుని మనకిష్టమైన బ్రాంచ్ ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న తరువాత వేరే ఆలోచన లేకుండా దాని గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి. కాలేజీ ఎంపిక ఇలా... కాలేజీ ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఫ్యాకల్టీ(అనుభవం, అర్హతలు), అక్రిడేషన్స్(నాక్, ఎన్బీఏ), పూర్వ విద్యార్థుల ప్రతిభ, కాలేజీ ఉన్న ప్రాంతం, ప్లేస్మెంట్ సెల్, ల్యాబ్, లైబ్రరీ సౌకర్యం, క్లోజింగ్ ర్యాంక్స్, క్యాంపస్, హాస్టల్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.* బీటెక్ తర్వాత విద్యార్థుల ముందున్న అవకాశాలు.. * ఇండియాలో ఉన్నత విద్య చదవాలనుకున్నవారు ఎంటెక్, ఎంఈ చేయవచ్చు. * విదేశాల్లో పీజీ చేయాలనుకుంటే..టోఫెల్, జీఆర్ఈ, ఐఈఎల్టీఈటీఎస్ వంటి పరీక్షలు రాసి ఎంఎస్ చేయవచ్చు. * ఐసెట్, క్యాట్, మ్యాట్, ఎన్‌మ్యాట్, ఐఐఎఫ్‌టీ వంటి పరీక్షలు రాసి బిజినెస్ స్కూళ్లల్లో ఎంబీఏ చేయవచ్చు. * ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు చేయవచ్చు. న్యూ కోర్స్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ ఫుల్ టైం కోర్సుల పరంగా ఐఐఎం-బెంగళూరు, కోల్‌కతలు తాజాగా ప్రారంభించిన ప్రోగ్రామ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్. ఈ కోర్సు ప్రధానంగా హెల్త్‌కేర్ రంగంలో ఎగ్జిక్యూటివ్స్ కెరీర్ పరంగా మరింత రాణించేందుకు దోహదపడుతుంది. ఐఐఎం కోల్‌కత కూడా ఇదే బాటలో ఏడాది వ్యవధి గల హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ కోర్సును ప్రారంభించింది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి మూడేళ్ల అనుభవం ఉన్నవారు ఈ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులు. -
కొలువుకు తొలి మార్గం!!
కోర్సు పూర్తి కాకుండానే.. క్లాస్‌లు కొనసాగుతుండగానే.. కంపెనీల్లో వాస్తవ కార్యక్షేత్రంలో.. కొద్ది రోజులపాటు కొలువు దీరే అవకాశం కల్పించే సాధనమే.. ఇంటర్న్‌షిప్! విద్యార్థి తరగతి గదిలో అప్పటి వరకు పొందిన పరిజ్ఞానాన్ని వాస్తవ పరిస్థితుల్లో అన్వయించడానికి వీలుకల్పిస్తుంది ఇంటర్న్‌షిప్. కంపెనీలు ఇంటర్న్‌షిప్ ద్వారా అభ్యర్థి ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని పరీక్షిస్తాయి. ప్రొఫెషనల్ కోర్సులకేనా..! ఇంటర్న్‌షిప్.. వాస్తవానికి ఈ మాట ప్రస్తుతం ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, సైన్స్ వంటి ప్రొఫెషనల్ కోర్సులకు కీలకంగా మారింది. వృత్తి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేయడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సుల విద్యార్థులు రియల్‌టైం ఎక్స్‌పీరియన్స్‌ను, జాబ్ రెడీ స్కిల్స్‌ను సొంతం చేసుకునేందుకు ఇంటర్న్‌షిప్ ఉపయుక్తంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ప్రొఫెషనల్ కోర్సులతోపాటు సైన్స్, సోషల్ సైన్స్ అభ్యర్థులకు వివిధ విభాగాల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాలు విస్తృతమవుతున్నాయి. సమ్మర్.. సరైన సమయం రెండు లేదా రెండున్నర నెలల వ్యవధిలో లభించే వేసవి సెలవుల్లో ఇంటర్న్‌షిప్ చేయడం విద్యార్థులకు సమయం విషయంలో ఎంతో వెసులుబాటు కల్పిస్తుంది. ఇంజనీరింగ్ విద్యార్థులు మూడో సంవత్సరం తర్వాత లభించే సెలవుల్లో, మేనేజ్మెంట్ విద్యార్థులు రెండో సెమిస్టర్ తర్వాత సెలవుల్లో ఇంటర్న్‌షిప్ చేయడం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇంటర్న్‌షిప్ అందిపుచ్చుకునే మార్గాలు భవిష్యత్తు కొలువులకు తొలి మార్గంగా నిలుస్తున్న ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మార్గమేంటి? ప్రముఖ ఇన్స్టిట్యూట్కు కంపెనీలు వాటంతటవే వస్తాయి. కానీ సాధారణ కాలేజీల్లో చదివే వారి సంగతేంటి! ఇది కూడా విద్యార్థులను వేధించే ప్రశ్నే.. ఇప్పుడు చాలా కంపెనీలు తమ వెబ్సైట్లు, ఇతర ప్రసార మాధ్యమాలు, జాబ్ సెర్చ్ ఇంజన్స్ ద్వారా ఇంటర్న్‌షిప్ ఆఫర్స్‌ను ప్రకటిస్తున్నాయి. వీటికి నిర్దేశిత అర్హతలున్న వారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ ఔత్సాహిక విద్యార్థులు నిరంతరం తాము ఆసక్తి చూపుతున్న కంపెనీల వెబ్సైట్లను వీక్షిస్తుండాలి. జాబ్ సెర్చ్ పోర్టల్స్‌లో, సోషల్ వెబ్‌సైట్స్‌లో తమ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి. అదే విధంగా తమ క్యాంపస్‌ల ప్లేస్మెంట్ ఆఫీసర్లను, ఆయా రంగాల్లో తమకు పరిచయం ఉన్న అనుభవజ్ఞులను సంప్రదిస్తుండటం మరింత మేలు చేస్తుంది. ఐఐటీలు, బార్క్, ఐఐఎస్సీ తదితర పరిశోధక సంస్థలు సైతం ఇప్పుడు సమ్మర్ ఇంటర్న్పేరుతో స్పాన్సర్డ్ రీసెర్చ్ కార్యకలాపాల్లో పాల్పంచుకునే వీలు కల్పిస్తున్నాయి. ఇంటర్నషిప్తో ప్రయోజనాలు ఇంటర్న్‌షిప్‌తో సంబంధిత రంగంలో వాస్తవ పరిస్థితులపై అవగాహన కలుగుతుంది. అప్పటివరకు నేర్చుకున్న అకడమిక్ అంశాలను ప్రాక్టికల్‌గా అన్వయించే అవకాశం లభిస్తుంది. కంపెనీలు కోరుకుంటున్న నైపుణ్యాలు, తామింకా మెరుగుపరచుకోవాల్సిన స్కిల్స్ ఏంటో తెలుస్తాయి. పని సంస్కృతి, టీంవర్క్‌కు అవసరమైన ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అలవడతాయి. ఆ రంగంలోని సీనియర్లతో కలిసి పని చేసే అవకాశం దక్కుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటర్న్‌షిప్ ఆవశ్యకత రోజురోజుకీ పెరుగుతోంది. విద్యార్థులు కేవలం తమ ఇన్స్టిట్యూట్లకు వచ్చే సంస్థలపైనే ఆధారపడకుండా.. వ్యక్తిగతంగానైనా ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందుకునేందుకు కృషి చేయాలి. అదే విధంగా ఇంటర్న్‌షిప్ సమయంలో చూపే పనితీరు, ప్రతిభ జాబ్ రెడీ స్కిల్స్ పెంచుకోవడంలో ఎంతో దోహదపడుతుంది. - బి.వెంకటేశం, ప్లేస్మెంట్ ఆఫీసర్, ఐఐటీ-హెచ్. -
క్షేత్ర స్థాయి నైపుణ్యాలకు కీలకం.. ఇంటర్న్షిప్స్
ఎం.చంద్రశేఖర్, ప్రొఫెసర్, ఎన్ఐటీ-వరంగల్ ప్రస్తుతం జాబ్ మార్కెట్‌ను పరిశీలిస్తే.. ఇన్స్టిట్యూట్ల నుంచి డిగ్రీలతో బయటికి వస్తున్న విద్యార్థులు జాబ్ రెడీగా ఉండాలని పరిశ్రమలు ఆశిస్తున్నాయి. పుస్తకావగాహన కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు పెద్ద పీట వేస్తున్నాయి.. అకడమిక్‌గా నేర్చుకున్న అంశాలను వాస్తవ పరిస్థితుల్లో అన్వయించే విషయంలో ఏమేరకు సామర్థ్యం కలిగి ఉన్నారు? అనే విషయాన్ని లోతుగా పరిశీలిస్తున్నాయి.. పని చేయాల్సిన రంగంపై కనీస అవగాహన ఉండాలని భావిస్తున్నాయి.. ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థికి ఉన్న ప్రాక్టికల్ అప్రోచ్ ఉద్యోగ సాధనలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది.. విద్యార్థుల్లో ఈ విధమైన ప్రాక్టీకల్ అప్రోచ్ పెంపొందించుకోవడానికి, క్షేత్ర స్థారుు అవగాహనకు ఇంటర్న్షిప్స్ ఎంతో తోడ్పాటునందిస్తాయి.. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ప్రాముఖ్యత, సంబంధిత అంశాలపై సూచనలు.. ఇంజనీరింగ్ విద్యార్థులు థియరీ కంటే ప్రాక్టికల్‌గా ఎక్కువ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడే.. వారి కెరీర్ సరైన దిశలో సాగుతున్నట్లు భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు కూడా ఈ విషయానికి తార్కాణంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంజనీరింగ్ విద్యలో ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను పెంచే కార్యకలాపాలకు ప్రాధాన్యత క్రమంగా పెరుగుతోంది. ఇంటర్న్షిప్స్, మినీ ప్రాజెక్ట్ వర్క్, టెక్నికల్ కాంపిటీషన్స్, ప్రాజెక్ట్ వర్క్ వంటివి ఈ కోవలోకి వస్తాయి. మూడో సంవత్సరంలో: సాధారణంగా ఇంజనీరింగ్ కోర్సులో మూడో సంవత్సరంలో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ తర్వాత వేసవి సెలవుల్లో ఇంటర్న్‌షిప్ (ఇండస్ట్రీ ఓరియెంటెడ్ మినీ ప్రాజెక్ట్) ఉంటుంది. కొన్ని యుూనివర్సిటీల పరిధిలో ఇంజనీరింగ్ కరిక్యులంలో ఇంటర్న్‌షిప్ భాగంగా లేనప్పటికీ ప్రొఫెషనల్ స్కిల్స్‌ను పెంపొందించుకోవడంలో ఇంటర్న్‌షిప్స్‌ను వినియోగించుకోవాలి. ఇంటర్న్‌షిప్‌లు సాధారణంగా రెండు విధాలుగా అందుబాటులో ఉంటాయి. అవి.. అకడమిక్‌గా తప్పనిసరిగా చేయాల్సినవి. కొన్ని కంపెనీలు ఆఫర్ చేసే సమ్మర్ ఇంటర్న్షిప్స్. సమ్మర్ ఇంటర్న్షిప్స్: ఇంటర్న్‌షిప్స్‌లో కీలకమైనవి.. సమ్మర్ ఇంటర్న్షిప్స్. పాఠ్యపుస్తకాల్లో నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్‌గా వాస్తవ పరిస్థితుల్లో అన్వయించడానికి సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఒక ఫ్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడతాయి. వీటిని వేసవి సెలవుల్లో నిర్వహిస్తారు. సాధారణంగా వీటి వ్యవధి ఐదు నుంచి పది వారాల పాటు ఉంటుంది. విద్యార్థులు వేసవి సెలవులను వృథా చేసుకోకుండా.. ఇటువంటి ఇంటర్న్షిప్స్ ద్వారా విలువైన పని అనుభవాన్ని (వర్క్ఎక్స్పీరియెన్స్) పొందొచ్చు. సమ్మర్ ఇంటర్న్‌షిప్ వల్ల విద్యార్థులకు రెండు రకాలుగా ప్రయోజనాలు ఉంటాయి. అవి.. ఒకటి, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం. రెండోది, చదువుతున్న బ్రాంచ్‌కు సంబంధించి మార్కెట్లోకి వచ్చిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పొందడం. ఒక్కోసారి కొన్ని కంపెనీలు ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థులకు అలవెన్స్‌ను కూడా చెల్లిస్తున్నాయి. మల్టినేషనల్ కంపెనీల్లో సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల ప్రపంచ స్థాయి కంపెనీల పని వాతావరణం, వర్కింగ్ మెథడాలజీపై ఒక అవగాహన ఏర్పడుతుంది. సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేసిన విద్యార్థులకు మిగతా విద్యార్థులతో పోల్చితే కెరీర్ పరంగా చక్కని అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. ఇంటర్న్ టు జాబ్: ఇంటర్న్‌షిప్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు కంపెనీలు ఉద్యోగాన్ని ఆఫర్ చేసేందుకు కూడా వెనకాడటం (కోర్సు పూర్తయిన తర్వాత) లేదు. ప్రతిభావంతులైన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని కొన్ని కంపెనీలు ఇంటర్న్‌షిప్‌ను ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ (పీపీఓ) రూపంలో అందిస్తున్నాయి. అంతేకాకుండా విద్యార్థి భావి కెరీర్ దిశగా.. కీలకమైన వర్క్ ఎన్విరాన్మెంట్పై అవగాహన పొందొచ్చు. బృందంగా పని చేయడం వల్ల నాయకత్వ లక్షణాలు, టీమ్ మ్యాన్, పరిశోధన ఆధారంగా పని చేయడం (రీసెర్చ్ బేస్డ్ వర్క్) వంటి నైపుణ్యాలు అలవడతాయి. సంబంధిత రంగంలోని అనుభవజ్ఞుల ద్వారా.. ఉన్నత విద్య, ఉద్యోగం అనే అంశంపై విలువైన సూచనలను పొందొచ్చు. ఆసక్తి ఆధారంగా: చదువుతున్న బ్రాంచ్, ఎంచుకున్న పరిశ్రమను బట్టి ఇంటర్న్షిప్స్ వేర్వేరుగా ఉంటాయి. లోతైన స్వీయ విశ్లేషణ, పక్కా ప్రణాళిక ద్వారానే విజయవంతంగా ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయుడం సాధ్యమవుతుంది. ఇంటర్న్‌షిప్ అంశం ఎంపికకు ముందే అన్ని కోణాల్లో విశ్లేషించాలి. ఆసక్తి ఉన్న అంశాన్ని (ఏరియాను) ఇంటర్న్‌షిప్ కోసం ఎంచుకోవాలి. ఇంటర్న్‌షిప్ ఉద్దేశాలను, ప్రతిఫలాలను తప్పకుండా బేరీజు వేసుకోవాలి. భవిష్యత్‌లో సంభవించే మార్పులను దృష్టిలో ఉంచుకుని సీనియర్లు, ప్రొఫెసర్ల సహాయంతో ఇంటర్న్‌షిప్ అంశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇంజనీరింగ్‌లోని అన్ని విభాగాల్లో ఇంటర్న్షిప్స్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రొఫెషనల్ స్కిల్స్: ఇంటర్న్‌గా ఎంపికైన వారు సంబంధిత పరిశ్రమలో వారానికి నిర్దేశించిన గంటలు పని చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక సముహం (గ్రూప్)గా లేదా వ్యక్తిగతంగా ఇంటర్న్‌షిప్‌ను చేపడతారు. భావన (కాన్సెప్ట్) చిన్నదైనా.. ఇంటర్న్‌షిప్ అనుభవం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటర్న్‌షిప్ ఉండే రెండు/మూడు నెలలు విద్యార్థి ఆలోచన విధానంలో ఎంతో మార్పు తెస్తుందని చెప్పొచ్చు. విద్యార్థిగా కాకుండా ఒక ప్రొఫెషనల్‌గా వ్యవహరించే తత్వం అలవడుతుంది. పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి అనుసరిస్తున్న పద్ధతులను దగ్గరగా పరిశీలించే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా కోర్సులోని భావనలను పరిశ్రమలో అన్వయించే విధానాన్ని నేరుగా చూడడం ద్వారా కోర్సులోని సదరు అంశాలపై పట్టు వస్తుంది. అంతేకాకుండా కొన్ని కంపెనీలు ఇంటర్న్స్‌కు కూడా వాస్తవ పనులను అప్పగిస్తాయి. దాంతో అకడమిక్‌గా నేర్చుకున్న అంశాలను క్షేత్ర స్థారుులో అన్వయించే సాధ్యాసాధ్యాలపై స్పష్టత వస్తుంది. తద్వారా విద్యార్థి పరిశ్రమ కోరుకుంటున్న విధంగా జాబ్ రెడీగా ఉంటాడు. ఇంటర్న్‌షిప్‌లో చూపిన ప్రతిభ విద్యార్థి ఉద్యోగ సాధనలోనూ తోడ్పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఇంటర్న్‌షిప్‌ను ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్‌గా కూడా పేర్కొనవచ్చు. ఇంటర్న్‌షిప్‌లో చక్కని ప్రతిభ చూపిన విద్యార్థులకు అకడమిక్ పరంగా ఉండే ప్రాజెక్ట్ వర్క్‌ను రియల్ టైమ్‌లో తమ కంపెనీలో చేసే అవకాశాన్ని కూడా కొన్ని సంస్థలు కల్పిస్తున్నాయి. ఎంపిక ఇలా: ఇంటర్న్‌షిప్ చేయాలనుకున్న అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంటర్న్‌షిప్ చేయాల్సిన సంస్థ ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించాలి. కెరీర్ మీట్స్, జాబ్ మేళావంటి కార్యక్రమాలకు హాజరవుతుండడం, ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఇంటర్న్‌షిప్ బ్లాగులను చూడడం, యూనివర్సిటీలు, కళాశాలల్లో విద్యార్థి కేంద్రాలను సందర్శించడం ద్వారా ఇంటర్న్షిప్స్ అవకాశాలను సులభంగా పొందొ చ్చు. ఇంటర్నెట్లో పలు వెబ్సైట్లు ఇంటర్న్‌షిప్ గురించిన విస్తృత సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇంటర్నెట్ లేదా కాలేజీల్లోని ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ద్వారా ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేసే కంపెనీల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. లేదా వ్యక్తిగతంగా సంబంధించిన పరిశ్రమల అధికారులను కలవడం ద్వారా కూడా ఇంటర్న్‌షిప్‌ను దక్కించుకోవచ్చు. కీలకం రెజ్యుమె: ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని దక్కించుకోవడంలో రెజ్యుమె పాత్ర కీలకం. విద్యార్థులు తమ గురించి సమగ్రంగా వివరించడానికి రెజ్యుమె నిర్ణయాత్మక పాత్రను పోషిస్తుంది. కాబట్టి రెజ్యుమెను పకడ్బందీగా రూపొందించాలి. రెజ్యుమెలో ఎంచుకున్న రంగంపై ఉన్న ఆసక్తి, అవగాహన, భవిష్యత్ ప్రణాళికలు స్పష్టం చేసే విధంగా ఉండేలా జాగ్రత్త పడాలి. వ్యక్తిత్వం, విద్యా ప్రవృత్తులు, ఉద్యోగ సంబంధిత సామర్థ్యాలను ప్రస్ఫుటించేలా రూపొందించుకోవాలి. ఎంప్లాయర్స్ అవసరాలు, ప్రాధాన్యతలను కూడా రెజ్యుమెలో పొందుపర్చడం మర్చిపోవద్దు. సాధారణంగా కంపెనీలు ఇంటర్న్షిప్స్ కోసం నిర్దిష్ట గడువును నిర్ణయిస్తాయి. కాబట్టి వీలైనంత ముందుగానే దరఖాస్తు చేయడం మంచిది. వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా ఇంటర్న్‌షిప్ కోసం విద్యార్థులను ఎంపిక చేస్తారు. వనరుగా: ఇంటర్న్‌షిప్ చేశాక,దాన్ని ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి వన రుగా ఉపయోగించుకోవాలి. ఇంటర్న్‌షిప్‌లో మీరు నిర్వహించిన బాధ్యతలను, ప్రాజెక్టు విజయంలో దాని పాత్రను మీ రెజ్యుమెలో పేర్కొనాలి. కళాశాలల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ జరుగుతున్నప్పుడు ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఇంటర్వ్యూ సమయంలో ఇంటర్న్‌షిప్‌లో నిర్వర్తించిన విధులను వివరించడం ద్వారా కొలువును సులువుగా సొంతం చేసుకోవచ్చు. నిపుణులైన ఉద్యోగుల ఎంపికకు ఇంటర్న్‌షిప్‌ను కంపెనీలు చక్కని వేదికగా భావిస్తున్నారుు. ఇంటర్న్‌షిప్‌నకు అకడమిక్ పరంగా కొన్ని మార్కులను కూడా కేటాయించడం జరిగింది. ప్రాముఖ్యత కాలేజీ నుంచి బయటకు రాకముందే కొంతకాలంపాటు క్షేత్రస్థాయి కార్యకలాపాల్లో విద్యార్థులు పాల్గొంటారు. ............................. అనుభవజ్ఞుల పర్యవేక్షణలో పని అనుభవం సంపాదిస్తారు. ............................................................ అకడమిక్ నైపుణ్యాలతో పాటు పని అనుభవం ఉన్న వారికి కంపెనీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. ............................................................ ఇంటర్న్‌షిప్ చేస్తున్నప్పుడు విద్యార్థులు కంపెనీలోని సీనియర్లతో నిరంతరం సంప్రదిస్తూ కెరీర్‌కు కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. ............................................................ బృంద స్ఫూర్తి, కమ్యూనికేషన్ స్కిల్స్, సమయపాలన, ఒత్తిడిని జయించడం వంటి సాఫ్ట్‌స్కిల్స్‌ను అలవర్చుకోవడానికి ఇంటర్న్‌షిప్ వేదికగా నిలుస్తుంది. ............................................................ ఉద్యోగానికి ముందే తమ రంగానికి చెందిన పరిశ్రమలో వాస్తవ పరిస్థితులను పరిశీలించే అవకాశం లభిస్తుంది. ............................................... బ్రాంచ్‌ల వారీగా ఇంటర్న్‌షిప్ కోసం ఎంచుకోవాల్సిన కంపెనీలు.. మెకానికల్-ఎల్ అండ్ టీ, ఎస్ఆర్ స్టీల్స్, వైజాగ్ స్టీల్స్, బీహెచ్ఈఎల్, హెచ్ఏఎల్ మొదలైనవి. సివిల్ -ఎల్ అండ్ టీ, ఎన్సీసీ, కన్స్ట్రక్షన్ కంపెనీలు తదితరాలు. ఎలక్ట్రికల్- ఎన్టీపీసీ, ఆర్టీపీపీ, వీటీపీఎస్, సాగర్, పవర్ జనరేషన్ యూనిట్స్ మొదలైనవి. ఈసీఈ-బీడీఎల్, హెచ్ఏఎల్, ఇస్రో తదితరాలు. సీఎస్ఈ-టీసీఎస్, విప్రో, మైక్రోసాఫ్ట్ తదితరాలు. తప్పనిసరి.. ఏఐసీటీఈ దేశంలో సాంకేతిక విద్యను పర్యవేక్షిస్తున్న ఆల్ ఇండియా టెక్నికల్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ).. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసింది. నేషనల్ ఎంప్లాయబిలిటీ ఎన్హన్సమెంట్ మిషన్ (ఎన్ఈఈఎం-ూఉఉక)లో భాగంగా ఏఐసీటీఈ ఈ ప్రతిపాదన చే సింది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఐదు, ఆరు, ఏడో సెమిస్టర్లలో మూడు నుంచి 24 నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం వివిధ సంస్థలతో ఏఐసీటీఈ ఒక అవగాహన కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఈ విషయంలో ఇంజనీరింగ్ కోర్సులోని మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థులకు కమ్యూనికేషన్స్ సంబంధింత విభాగంలో శిక్షణనిచ్చేందుకు బీఎస్ఎన్ఎల్తో ఒప్పందం చేసుకుంది. ఉపయోగకరమైన వెబ్‌సైట్స్ www.internshala.com www.twenty19.com www.hellointern.com www.letsintern.com -
కెరీర్‌కు కీలకం.. ఆంగ్ల భాష నైపుణ్యం
డా॥ఇ.సురేశ్ కుమార్, ప్రొఫెసర్ అండ్ హెడ్, డిపార్టమెంట్ ఆఫ్ ఇంగ్లిష్, ఓయూ, హైదరాబాద్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్లో అకడమిక్ అర్హతల కంటే, నైపుణ్యాలకే పెద్దపీట వేస్తున్నారడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి నైపుణ్యాల్లో కీలకమైంది.. ఇంగ్లిష్‌లో కమ్యూనికేషన్. ఎందుకంటే కార్పొరేట్, ఎంఎన్సీ సంస్కృతి కారణంగా ఆయా సంస్థల కార్యకలాపాలు ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాలేదు. జట్టుగా (టీమ్).. కంపెనీల్లో పలు విభాగాల మధ్య సమన్వయంతో పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో విభిన్న భాషల నేపథ్యం ఉన్న వ్యక్తులతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. దీంతో అందరితో సులువుగా సమన్వయంతో వ్యవహరించడానికి ఇంగ్లిష్‌ను మించిన సాధనం మరొకటి లేదు. స్కోరింగ్ సబ్జెక్ట్ ఇంటర్మీడియెట్‌లో ఇంగ్లిష్ సబ్జెక్ట్.. పోయెట్రీ, ప్రోజ్, గ్రామర్ అంశాల కేంద్రీకృతంగా ఉంటుంది. సిలబస్‌ను త్వరగా పూర్తి చేయడానికి, మార్కుల స్కోరింగ్ అనే అంశానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు. అంతేకాకుండా ఇంటర్మీడియెట్ దశలో విద్యార్థులు ఇంగ్లిష్‌ను కేవలం స్కోరింగ్ సబ్జెక్ట్‌గానే భావిస్తుంటారు. దాంతో అకడమిక్ పరంగా ఎన్ని మార్కులు సాధించినా.. ఇంగ్లిష్ భాషలో ప్రభావవంతంగా తమ భావాల్ని వ్యక్తం చేయలేకపోతున్నారు. ఈ లోపాలను అధిగమించి చక్కటి కెరీర్‌కు దోహదపడేలా కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించడానికి ఇంజనీరింగ్ ఇంగ్లిష్ ఉపకరిస్తుంది. జాబ్ మార్కెట్‌కనుగుణంగా ఇంజనీరింగ్ ఇంగ్లిష్ మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ నైపుణ్యాలను మెరుగుపరచడమే (స్కిల్స్ ఓరియెంటెడ్) లక్ష్యంగా ఇంగ్లిష్ సబ్జెక్ట్‌ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్రస్తుత జాబ్ మార్కెట్‌కనుగుణంగా వాస్తవిక దృక్పథంతో విద్యార్థులకు వృత్తిపరంగా (ప్రొఫెషనల్‌గా), వ్యక్తిగతంగా (పర్సనల్) అవసరమయ్యే నైపుణ్యాలను పెంపొందించడం జరుగుతుంది. కెరీర్లో విజయం సాధించడంలో ఇంగ్లిష్ కమ్యూనికేషన్ ప్రాధాన్యతను వివరించడం, సామాజిక, ప్రొఫెషనల్ అంశాల పట్ల తమ అభిప్రాయాలను ప్రభావవంతంగా వ్యక్తం చేయడం నేపథ్యంగా సిలబస్‌ను రూపొందించారు. ఈ క్రమంలో సిలబస్‌లో రోల్ ఆఫ్ కమ్యూనికేషన్, ది ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, డెవలపింగ్ లిజనింగ్, స్పీకింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, రిపోర్ట్ రైటింగ్, బిజినెస్ లెటర్స్, రైటింగ్ నోటిసెస్-సర్క్యులర్స్, ప్రిపేరింగ్ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్, సౌండ్స్ ఆఫ్ ఇంగ్లిష్ తదితర అంశాలకు చోటు కల్పించారు. తరగతిలో ఇలా తరగతి గదిలో ఎంతో కీలకమైన రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్ నైపుణ్యాలపై పట్టు సాధించడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు టీచర్ ఏదైనా ఒక అంశాన్ని కొంత సేపు చదవాలి అని నిర్దేశిస్తాడు. అంటే రీడింగ్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకునే అవకాశం ఏర్పడుతుంది. తర్వాత ఆ అంశంపై కాంప్రెహెన్షన్ ప్రశ్నలు అడగటం జరుగుతుంది. ఈ సమయంలో సమాధానం ఇవ్వడం ద్వారా లిజనింగ్, స్పీకింగ్ స్కిల్స్ మెరుగవుతాయి. దీని ఆధారంగా పేరాగ్రాఫ్/ఎస్సే వంటి రైటప్ రాయొచ్చు. తద్వారా రైటింగ్ స్కిల్స్‌ను పెంపొందించుకోవచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత తరగతి గదిలో చెప్పిన విషయాలను మననం చేసుకోండి. ఆ అంశానికి సంబంధించిన మెటీరియల్‌ను విభిన్న పద్ధతుల్లో చదవడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు ఆ రోజు చెప్పిన పాఠాన్ని సొంతంగా రాయడం లేదా దాని సారాంశాన్ని రాయడం చేయాలి. గ్రామర్ పరంగా, స్పెల్లింగ్ పరంగా తరచుగా వస్తున్న తప్పులపై అధికంగా దృష్టి పెట్టాలి. బృంద చర్చల్లో పాల్పంచుకోవాలి. ఇంగ్లిష్ క్లాస్‌లో ఉండే రోల్-ప్లేస్ అంశంలో విధిగా పాల్గొనాలి. గ్రామీణ, తెలుగు మాధ్యమం నేపథ్యంగా ఉన్న విద్యార్థులు ఇంగ్లిష్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. టీచర్లు నిర్వహించే ల్యాబ్ సెషన్లు, అసైన్‌మెంట్స్‌ను ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత లాభం పొందుతారు. తరగతిలో మిగతా విద్యార్థులతో ఇంగ్లిష్‌లో మాట్లాడడానికి ప్రయత్నించాలి. తద్వారా కమ్యూనికేషన్ పరంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించవచ్చు. ల్యాబ్ సెషన్స్.. కీలకం మరో కీలాకాంశం.. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులు ల్యాబ్సెషన్స్ను ప్రభావవంతంగా వినియోగించుకోవాలి. భవిష్యత్‌లో ఇంటర్వ్యూలను ఎదుర్కోవడానికి, బృంద చర్చల్లో (గ్రూప్ డిస్కషన్) రాణించడానికి అవసరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ల్యాబ్ సెషన్స్ ఎంతో దోహదం చేస్తాయి. కమ్యూనికేషన్లో ఎంతో కీలకమైన లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ వంటి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంలో కూడా ల్యాబ్ సెషన్స్ పాత్ర ఎంతో ఉంటుంది. ఈ క్రమంలో కన్వర్సేషన్ ప్రాక్టీస్, జామ్ (జెస్ట్ ఏ మినిట్) సెషన్స్, డిస్కషన్స్ అండ్ డిబేట్స్, ప్రెజెంటేషన్స్ అండ్ సెమినార్స్, మాక్ ఇంటర్వ్యూలు, రోల్-ప్లే, ఫోనోటెనిక్స్-ప్రాక్టీస్ ఆఫ్ సౌండ్స్ ఇన్ ఇంగ్లిష్ వంటి కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఫొనెటిక్స్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకోవడం ద్వారా పదాలను ఏ విధంగా పలకాలనే అంశంపై స్పష్టమైన అవగాహన పొందొచ్చు. ప్రొనౌన్సియేషన్ ప్రభావవంతంగా ఉన్నప్పుడే చక్కని ఇంగ్లిష్ మాట్లాడే అవకాశం ఏర్పడుతుంది. ప్రొనౌన్సియేషన్ ఎక్సర్‌సైజ్‌లను రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయాలి. వారానికి మూడు ల్యాబ్ సెషన్స్ ఉంటాయి. వీటికి రెండు క్రెడిట్స్ కేటాయించారు. దృక్పథం గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చే విద్యార్థులు ఇంగ్లిష్ విషయంలో ఎక్కువగా దృష్టిసారించాలి. వీరు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి.. ఇంగ్లిష్ భాషను నేర్చుకోవడంలో కీలక పాత్ర పోషించేది.. దృక్పథం. ఇంగ్లిష్‌ను ఏదో విదేశీ భాష మాదిరిగా కాకుండా సొంత భాషలా భావిస్తూ.. మనది అనే దృక్పథం, ఆసక్తి ఉంటే సులువుగానే ఈ భాషపై పట్టు సాధించవచ్చు. ఫ్యాకల్టీలు ల్యాబ్ సెషన్స్‌ల్లో చేపట్టే కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవచ్చు. మిగతా విద్యార్థులతో చనువుగా కలిసిపోవాలి. వారందరితో ఇంగ్లిష్ భాషలోనే మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఇక్కడ వ్యాకరణం, సరైన పదజాలం అంటూ నియమాలు పెట్టుకోకుండా మాట్లాడేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా కమ్యూనికేషన్ పరంగా పట్టు సాధించే అవకాశం ఉంది. ఇంగ్లిష్ న్యూస్ చానళ్లను చూడడం, దిన పత్రికలను చదవడం వల్ల ఇంగ్లిష్ భాషపై స్వల్ప కాలంలో పట్టు సాధించవచ్చు. అందులో ఏయే సందర్భాల్లో ఎటువంటి పదాలను వినియోగిస్తున్నారు అనే అంశంపై అవగాహన పెంచుకోవాలి. కాలేజీల్లో ఉండే క్లబ్‌లు లేదా ఫోరమ్‌లలో చేరాలి. వాటి ద్వారా పరిచయమయ్యే స్నేహితులతో పలు అంశాలపై చర్చించడం వల్ల ఇంగ్లిష్‌ను ప్రభావవంతంగా నేర్చుకోవచ్చు. అంతేకాకుండా కాలేజీల్లో నిర్వహించే కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొనాలి. వివిధ రకాల ఈవెంట్లు, టెక్నికల్ ఫెస్టివల్స్, ఇంటర్-కాలేజ్ స్పోర్ట్స్, సెమినార్లు, కంపెనీలు నిర్వహించే వివిధ రకాల పోటీ పరీక్షలు, టెక్నికల్ కాంపిటీషన్స్ నిర్వహణ వంటి వాటిల్లో పాల్గొనడంపై దృష్టి సారించాలి. తద్వారా చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ అలవడతాయి. పునాది అధిక శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ పట్ల నిర్లక్ష్య భావంతో వ్యవహరిస్తుంటారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విజయం సాధించలేనప్పుడు మాత్రమే వారు ఆంగ్ల భాష ప్రాధాన్యతను గుర్తిస్తుంటారు. దాంతో ఆ లోపాన్ని అధిగమించేందుకు స్పోకెన్ ఇంగ్లిష్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. ఇక్కడ గమనించాల్సిన అంశం.. కోచింగ్ సెంటర్లు కేవలం వ్యాకరణం (గ్రామర్) కేంద్రీకృతంగా మాత్రమే బోధనను నిర్వహిస్తుంటాయి. వ్యాకరణం ద్వారానే ఇంగ్లిష్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవడం సాధ్యం కాదు. కాబట్టి కోర్సులో భాగంగా ఉండే ఇంగ్లిష్ తరగతులను విస్మరించవద్దు. ఎందుకంటే ఇంగ్లిష్ కమ్యూనికేషన్ దిశగా ఈ తరగతులు పునాదులుగా ఉపయోగపడతాయి. ఇచ్చిన అసైన్‌మెంట్స్‌ను ప్రతిరోజూ ప్రాక్టీస్ చేస్తూంటే సులభంగా ఈ విషయంపై పట్టు సాధించవచ్చు. భవిష్యత్ దిశగా ఇంజనీరింగ్ నాలుగేళ్లు, తర్వాత ఉన్నత విద్య దిశగా ఏ కోర్సు చేసినా భవిష్యత్‌లో బోధన, పరీక్షల నిర్వహణ, సంబంధిత వ్యవహారం మొత్తం ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది. ప్రాజెక్ట్స్, సెమినార్స్, ఇలా అన్ని అంశాలకు ఇంగ్లిష్ భాషలోనే హాజరు కావాలి. ఈ నేపథ్యంలో మీకు విషయంపై ఎంత అవగాహన ఉన్నా దాన్ని ఎటువంటి వ్యాకరణ, అక్షర దోషాలు లేకుండా వ్యక్తం చేయడంలోనే యుక్తి దాగి ఉంటుంది. అందుకోసం ఇంగ్లిష్ భాషపై పట్టు తప్పనిసరి. తద్వారా సబ్జెక్ట్ పరంగా మెరుగైన స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంగ్లిష్‌లో నైపుణ్యం అనేది అకడమిక్స్ పరంగా కూడా మీ రికార్డును ప్రభావితం చేస్తుంది. సులభంగా చాలామంది విద్యార్థులు ఇంగ్లిష్ భాషను మెరుగుపరుచుకోవడం చాలా కష్టంతో కూడిన వ్యవహారంగా భావిస్తారు. కానీ ఇది ఒక అపోహ మాత్రమే. కాసింత శ్రమ, నిరంతర సాధన ద్వారా ఈ అంశంపై సులభంగానే పట్టు సాధించొచ్చు. ఇందుకోసం మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, తదితరులతో.. దైనందిన కార్యకలాపాలు, భవిష్యత్ ప్రణాళికలు, సినిమాలు, ఇలా ఏ విషయాలైనా ఇంగ్లిష్‌లో సంభాషించడానికి ప్రయత్నించాలి. ఇక్కడ వ్యాకరణం, సరైన పదజాలం అంటూ నియమాలు పెట్టుకోకుండా మాట్లాడేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. త ద్వారా కమ్యూనికేషన్ పరంగా పట్టు సాధించే అవకాశం ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత తరగతి గదిలో చెప్పిన విషయాలను మననం చేసుకోండి. ఆ అంశానికి సంబంధించిన మెటీరియల్‌ను విభిన్న పద్ధతుల్లో చదవడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు ఆ రోజు చెప్పిన పాఠాన్ని సొంతంగా రాయడం లేదా దాని సారాంశాన్ని రాయడం చేయాలి. కీలకం వొకాబ్యులరీపై పట్టు సాధించడం కూడా ఇంగ్లిష్ కమ్యూనికేషన్లో కీలక భాగం. ఇందుకోసం అందుబాటులోని వనరులను ప్రభావవంతంగా వినియోగించుకోవాలి. ప్రతి రోజూ ఇంగ్లిష్ దినపత్రికలు, మ్యాగజైన్లను చదవాలి. అందులో ఏయే సందర్భాల్లో ఎటువంటి పదాలను వినియోగిస్తున్నారు అనే అంశంపై అవగాహన పెంచుకోవాలి. ఇంగ్లిష్ న్యూస్ చానెళ్లను వీక్షించండి. అందులో ఉపయోగించిన భాషను నిజ జీవిత అంశాలకనుగుణంగా వాడే ప్రయ త్నం చేయాలి. కథల పుస్తకాలు (స్టోరీ బుక్స్), ఏవైనా ఆసక్తి కలిగించే పుస్తకాలను చదవాలి. అందులోని భాషను పరిశీలించాలి. తర్వాత సొంతంగా అందులోని కథను లేదా దానిపై సమీక్షను ఇంగ్లిష్‌లో రాసే ప్రయత్నం చేయాలి. మీ తప్పులను తెలుసుకోవాలి. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. తిరిగి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏవైనా సందేహాలు ఉంటే సీనియర్లు, ఫ్యాకల్టీ, ఇతర నిపుణులతో నివృత్తి చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకునే దిశగా ఇంగ్లిష్‌ను ఒక చక్కటి అవకాశంగా భావించాలి. ఇంజనీరింగ్ కోర్సు మొత్తం, ఆ తర్వాత ఉన్నత విద్య, ఉద్యోగం ఏదైనా ఆంగ్ల భాషతో ముడిపడి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, ప్రదర్శించడానికి ఇంగ్లిష్ ల్యాబ్ సెషన్స్ ఎంతో దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించవద్దు. స్నేహితులతో సాధ్యమైనంత వరకు ఇంగ్లిష్‌లో మాట్లాడడానికి ప్రయత్నించాలి. కోర్సులో భాగంగా ఉండే ఇంగ్లిష్ తరగతులకు రెగ్యులర్‌గా హాజరు కావాలి. డైరీ రాయడం, వివిధ అంశాలపై వ్యాసాలు (ఎస్సే రైటింగ్) రాయడం, కొన్ని కథలను సంక్షిప్తం చేయడం, ఉత్తరాలు రాయడం (రైటింగ్ లెటర్స్), పత్రికలకు వ్యాసాలు పంపడం (ఆర్టికల్స్ టూ న్యూస్ పేపర్స్) వంటి వాటి ద్వారా కూడా రైటింగ్ స్కిల్‌ను మెరుగుపరుచుకోవచ్చు. ఇంగ్లిష్ భాషలో 44 సౌండ్స్ ఉన్నాయి. ఇందులో 20 ఓవెల్ సౌండ్స్, 24 క న్సోనెంట్ సౌండ్స్. వీటిని క్షుణ్నంగా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించవచ్చు.