కొలువుకు తొలి మార్గం!!
కోర్సు పూర్తి కాకుండానే..
క్లాస్‌లు కొనసాగుతుండగానే..
కంపెనీల్లో వాస్తవ కార్యక్షేత్రంలో..
కొద్ది రోజులపాటు కొలువు దీరే
అవకాశం కల్పించే సాధనమే..
ఇంటర్న్‌షిప్!
విద్యార్థి తరగతి గదిలో అప్పటి వరకు పొందిన పరిజ్ఞానాన్ని వాస్తవ పరిస్థితుల్లో అన్వయించడానికి వీలుకల్పిస్తుంది ఇంటర్న్‌షిప్. కంపెనీలు ఇంటర్న్‌షిప్ ద్వారా అభ్యర్థి ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని పరీక్షిస్తాయి.
ప్రొఫెషనల్ కోర్సులకేనా..!
ఇంటర్న్‌షిప్.. వాస్తవానికి ఈ మాట ప్రస్తుతం ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, సైన్స్ వంటి ప్రొఫెషనల్ కోర్సులకు కీలకంగా మారింది. వృత్తి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేయడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సుల విద్యార్థులు రియల్‌టైం ఎక్స్‌పీరియన్స్‌ను, జాబ్ రెడీ స్కిల్స్‌ను సొంతం చేసుకునేందుకు ఇంటర్న్‌షిప్ ఉపయుక్తంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ప్రొఫెషనల్ కోర్సులతోపాటు సైన్స్, సోషల్ సైన్స్ అభ్యర్థులకు వివిధ విభాగాల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాలు విస్తృతమవుతున్నాయి.
సమ్మర్.. సరైన సమయం
రెండు లేదా రెండున్నర నెలల వ్యవధిలో లభించే వేసవి సెలవుల్లో ఇంటర్న్‌షిప్ చేయడం విద్యార్థులకు సమయం విషయంలో ఎంతో వెసులుబాటు కల్పిస్తుంది. ఇంజనీరింగ్ విద్యార్థులు మూడో సంవత్సరం తర్వాత లభించే సెలవుల్లో, మేనేజ్‌మెంట్ విద్యార్థులు రెండో సెమిస్టర్ తర్వాత సెలవుల్లో ఇంటర్న్‌షిప్ చేయడం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.
ఇంటర్న్‌షిప్ అందిపుచ్చుకునే మార్గాలు
భవిష్యత్తు కొలువులకు తొలి మార్గంగా నిలుస్తున్న ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మార్గమేంటి? ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌కు కంపెనీలు వాటంతటవే వస్తాయి. కానీ సాధారణ కాలేజీల్లో చదివే వారి సంగతేంటి! ఇది కూడా విద్యార్థులను వేధించే ప్రశ్నే..
ఇప్పుడు చాలా కంపెనీలు తమ వెబ్‌సైట్లు, ఇతర ప్రసార మాధ్యమాలు, జాబ్ సెర్చ్ ఇంజన్స్ ద్వారా ఇంటర్న్‌షిప్ ఆఫర్స్‌ను ప్రకటిస్తున్నాయి. వీటికి నిర్దేశిత అర్హతలున్న వారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్న్‌షిప్ ఔత్సాహిక విద్యార్థులు నిరంతరం తాము ఆసక్తి చూపుతున్న కంపెనీల వెబ్‌సైట్లను వీక్షిస్తుండాలి.
జాబ్ సెర్చ్ పోర్టల్స్‌లో, సోషల్ వెబ్‌సైట్స్‌లో తమ ప్రొఫైల్ అప్‌డేట్ చేసుకోవాలి. అదే విధంగా తమ క్యాంపస్‌ల ప్లేస్‌మెంట్ ఆఫీసర్లను, ఆయా రంగాల్లో తమకు పరిచయం ఉన్న అనుభవజ్ఞులను సంప్రదిస్తుండటం మరింత మేలు చేస్తుంది.
ఐఐటీలు, బార్క్, ఐఐఎస్‌సీ తదితర పరిశోధక సంస్థలు సైతం ఇప్పుడు సమ్మర్ ఇంటర్న్‌పేరుతో స్పాన్సర్డ్ రీసెర్చ్ కార్యకలాపాల్లో పాల్పంచుకునే వీలు కల్పిస్తున్నాయి.
ఇంటర్‌నషిప్‌తో ప్రయోజనాలు
ఇంటర్న్‌షిప్‌తో సంబంధిత రంగంలో వాస్తవ పరిస్థితులపై అవగాహన కలుగుతుంది.
అప్పటివరకు నేర్చుకున్న అకడమిక్ అంశాలను ప్రాక్టికల్‌గా అన్వయించే అవకాశం లభిస్తుంది.
కంపెనీలు కోరుకుంటున్న నైపుణ్యాలు, తామింకా మెరుగుపరచుకోవాల్సిన స్కిల్స్ ఏంటో తెలుస్తాయి.
పని సంస్కృతి, టీంవర్క్‌కు అవసరమైన ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అలవడతాయి.
ఆ రంగంలోని సీనియర్లతో కలిసి పని చేసే అవకాశం దక్కుతుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటర్న్‌షిప్ ఆవశ్యకత రోజురోజుకీ పెరుగుతోంది. విద్యార్థులు కేవలం తమ ఇన్‌స్టిట్యూట్‌లకు వచ్చే సంస్థలపైనే ఆధారపడకుండా.. వ్యక్తిగతంగానైనా ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందుకునేందుకు కృషి చేయాలి. అదే విధంగా ఇంటర్న్‌షిప్ సమయంలో చూపే పనితీరు, ప్రతిభ జాబ్ రెడీ స్కిల్స్ పెంచుకోవడంలో ఎంతో దోహదపడుతుంది.
- బి.వెంకటేశం,
ప్లేస్‌మెంట్ ఆఫీసర్, ఐఐటీ-హెచ్.