Summer internship
-
ఆర్బీఐలో ఇంటర్న్‌షిప్ రూ.20వేల స్టయిపండ్
దేశ కేంద్ర బ్యాంకు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ).. 2022 సంవత్సరానికి సంబంధించి స్వదేశీ, విదేశీ విద్యార్థుల కోసం సమ్మర్ ఇంటర్న్‌షిప్స్‌కు ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20వేల స్టయిపండ్ అందిస్తారు. ఇది బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎకానమీ, లా తదితర విభాగాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు చక్కటి అవకాశం. అర్హతలు, ఆసక్తిగల విద్యార్థులు డిసెంబర్ 31 తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్బీఐ తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 125 ఇంటర్న్‌లకు అవకాశం కల్పించనుంది. ఈ సమ్మర్ ఇంటర్న్‌షిప్ కాల వ్యవధి గరిష్టంగా మూడు నెలలు ఉంటుంది. ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో ఈ ఇంటర్న్‌షిప్ శిక్షణ కొనసాగుతుంది. ఎవరు అర్హులు ► స్వదేశీ విద్యార్థులకు అర్హతలు: ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులు, అలాగే మేనేజ్మెంట్/స్టాటిస్టిక్స్/లా/కామర్స్ /ఎకనామిక్స్/ఎకనోమెట్రిక్స్/బ్యాంకింగ్/ఫైనాన్స్‌లలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను అభ్యసించే వారు(లేదా) భారతదేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో న్యాయశాస్త్రంలో మూడేళ్ల పూర్తిస్థాయి బ్యాచిలర్ డిగ్రీని చదువుతున్న వారు ఆర్బీఐ సమ్మర్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ► ఆయా కోర్సుల చివరి సంవత్సరం/చివరి సెమిస్టర్ చదువుతున్నవారే కేంద్ర బ్యాంక్ ఇంటర్న్షిప్స్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ► విదేశీ విద్యార్థులకు అర్హతలు: విదేశాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో ఫైనాన్స్, బ్యాం కింగ్, ఎకనామిక్స్, మేనేజ్మెంట్, లా(ఐదేళ్ల ప్రోగ్రామ్)లో గ్రాడ్యుయేషన్ ఆ పైస్థాయి ఉన్నత కోర్సులు చదువుతున్న విదేశీ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం ► వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. అర్హులైన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌లో నిలిచిన వారికి 2022 జనవరి/ఫిబ్రవరిలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో ఇంటర్వ్యూ లను నిర్వహిస్తారు. తుది ఎంపికకు సంబంధించిన వివరాలను 2022 ఫిబ్రవరి/మార్చి నెలల్లో ప్రకటిస్తారు. ఇంటర్న్‌షిప్‌లో ఇలా ► ఎంపికైన ఇంటర్న్లు ముంబైలో ఉన్న బ్యాంక్ సెంట్రల్ ఆఫీస్ విభాగాలు లేదా వివిధ ప్రాంతాల్లోని ఆర్బీఐ కంట్రోల్ ఆఫీస్‌ల్లో మాత్రమే ప్రాజెక్ట్‌ను చేపట్టాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్న్‌షిప్‌కు రిపోర్ట్ చేయడానికి ముందు అభ్యర్థులు తప్పనిసరిగా బ్యాంకుకు డిక్లరేషన్ ఆఫ్ సీక్రసీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్న్‌షిప్ సమయంలో దూర ప్రాంతాల విద్యార్థులు తమవసతి సౌకర్యాలను సొంతంగా భరించాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానం ► అర్హత, ఆసక్తి గల విద్యార్థులు తాము చదువుతున్న ఇన్స్టిట్యూట్ లేదా కాలేజీ ద్వారా ఆన్లైన్ వెబ్బేస్డ్ అప్లికేషన్ ఫామ్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► విదేశీ విద్యార్థులు నిర్దేశిత దరఖాస్తును ఈమెయిల్ ద్వారా పంపించాలి. ► హార్ట్‌కాపీలు పంపేందుకు చిరునామా: ది చీఫ్ జనరల్ మేనేజర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ (ట్రైనింగ్–డెవలప్మెంట్ డివిజన్), సెంట్రల్ ఆఫీస్, 21వ అంతస్తు, సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్, షహీద్ భగత్ సింగ్ రోడ్, ముంబై 400 001కు పంపాలి. ► విదేశీ విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తు ఫామ్‌ను నింపి మెయిల్ ద్వారా cgminchrmd@rbi.org.in కు పంపించాలి. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేదీ: 31.12.2021 ► వెబ్సైట్: https://opportunities.rbi.org.in -
ఆ విద్యార్థులకు 2 నెలలకి రూ.5 లక్షల వేతనం
కోల్కత్తా : జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, జంషెడ్పూర్ విద్యార్థులు సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రొగ్రామ్ కింద భారీ ఎత్తున్న వేతనం పొందుతున్నారు. ఈ బీ-స్కూల్ కేవలం రెండు రోజుల్లో పూర్తిచేసిన ఈ ఇంటర్న్‌షిప్ ప్లేస్మెంట్ ప్రాసెస్‌లో, టాప్ కంపెనీలు పాల్గొన్నాయి. ప్రైస్వాటర్హౌజ్కాపర్స్, కోకాకోలా, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు విద్యార్థులను తమ ఇంటర్న్‌లుగా తీసుకున్నాయి. ఇంటర్న్‌లుగా నియమించుకున్న వీరికి అత్యధిక వేతనం కింద రూ.5 లక్షల వరకు చెల్లిస్తున్నట్టు తెలిసింది. ''2017-19 బ్యాచ్‌కు చెందిన 364 మంది విద్యార్థులు 100 శాతం ప్లేస్మెంట్ పొందారు. వీరికి సగటు వేతనం 20 శాతం పైగా పెరిగి, రెండు నెలలకు గాను రూ.5 లక్షలను టచ్ చేసింది'' అని జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. 90కి పైగా కంపెనీలు ఈ ఇంటర్న్‌షిప్ ప్లేస్మెంట్లో పాల్గొన్నాయి. కన్సల్టింగ్, ఫైనాన్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఆపరేషన్స్, బిజినెస్ డెవలప్మెంట్, హ్యుమన్ రిసోర్స్, ఇండస్ట్రీయల్ రిలేషన్స్ వంటి పొజిషన్లను కంపెనీలు విద్యార్థులకు ఆఫర్ చేశాయి. పలు కొత్త కంపెనీలు కూడా ఈ రిక్రూటర్స్ జాబితాలో ఉన్నాయి. జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్లేస్మెంట్ ప్రొగ్రామ్‌లో టాప్ రిక్రూటర్లుగా బీసీజీ, పీడబ్ల్యూసీ, కోకా-కోలా, హెచ్‌సీసీబీ, హెచ్‌యూఎల్, ఐటీసీ, పీ అండ్ జీ, టీఏఎస్, ఆర్బీ, మైక్రోసాఫ్ట్, ఉబర్, ఏబీజీ వంటి పలు సంస్థలున్నాయి. రంగాల పరంగా ఎఫ్ఎంసీజీ 27 శాతం షేరుతో టాప్‌లో ఉంది. -
కొలువుకు తొలి మార్గం!!
కోర్సు పూర్తి కాకుండానే.. క్లాస్‌లు కొనసాగుతుండగానే.. కంపెనీల్లో వాస్తవ కార్యక్షేత్రంలో.. కొద్ది రోజులపాటు కొలువు దీరే అవకాశం కల్పించే సాధనమే.. ఇంటర్న్‌షిప్! విద్యార్థి తరగతి గదిలో అప్పటి వరకు పొందిన పరిజ్ఞానాన్ని వాస్తవ పరిస్థితుల్లో అన్వయించడానికి వీలుకల్పిస్తుంది ఇంటర్న్‌షిప్. కంపెనీలు ఇంటర్న్‌షిప్ ద్వారా అభ్యర్థి ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని పరీక్షిస్తాయి. ప్రొఫెషనల్ కోర్సులకేనా..! ఇంటర్న్‌షిప్.. వాస్తవానికి ఈ మాట ప్రస్తుతం ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, సైన్స్ వంటి ప్రొఫెషనల్ కోర్సులకు కీలకంగా మారింది. వృత్తి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేయడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సుల విద్యార్థులు రియల్‌టైం ఎక్స్‌పీరియన్స్‌ను, జాబ్ రెడీ స్కిల్స్‌ను సొంతం చేసుకునేందుకు ఇంటర్న్‌షిప్ ఉపయుక్తంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ప్రొఫెషనల్ కోర్సులతోపాటు సైన్స్, సోషల్ సైన్స్ అభ్యర్థులకు వివిధ విభాగాల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాలు విస్తృతమవుతున్నాయి. సమ్మర్.. సరైన సమయం రెండు లేదా రెండున్నర నెలల వ్యవధిలో లభించే వేసవి సెలవుల్లో ఇంటర్న్‌షిప్ చేయడం విద్యార్థులకు సమయం విషయంలో ఎంతో వెసులుబాటు కల్పిస్తుంది. ఇంజనీరింగ్ విద్యార్థులు మూడో సంవత్సరం తర్వాత లభించే సెలవుల్లో, మేనేజ్మెంట్ విద్యార్థులు రెండో సెమిస్టర్ తర్వాత సెలవుల్లో ఇంటర్న్‌షిప్ చేయడం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇంటర్న్‌షిప్ అందిపుచ్చుకునే మార్గాలు భవిష్యత్తు కొలువులకు తొలి మార్గంగా నిలుస్తున్న ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మార్గమేంటి? ప్రముఖ ఇన్స్టిట్యూట్కు కంపెనీలు వాటంతటవే వస్తాయి. కానీ సాధారణ కాలేజీల్లో చదివే వారి సంగతేంటి! ఇది కూడా విద్యార్థులను వేధించే ప్రశ్నే.. ఇప్పుడు చాలా కంపెనీలు తమ వెబ్సైట్లు, ఇతర ప్రసార మాధ్యమాలు, జాబ్ సెర్చ్ ఇంజన్స్ ద్వారా ఇంటర్న్‌షిప్ ఆఫర్స్‌ను ప్రకటిస్తున్నాయి. వీటికి నిర్దేశిత అర్హతలున్న వారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ ఔత్సాహిక విద్యార్థులు నిరంతరం తాము ఆసక్తి చూపుతున్న కంపెనీల వెబ్సైట్లను వీక్షిస్తుండాలి. జాబ్ సెర్చ్ పోర్టల్స్‌లో, సోషల్ వెబ్‌సైట్స్‌లో తమ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి. అదే విధంగా తమ క్యాంపస్‌ల ప్లేస్మెంట్ ఆఫీసర్లను, ఆయా రంగాల్లో తమకు పరిచయం ఉన్న అనుభవజ్ఞులను సంప్రదిస్తుండటం మరింత మేలు చేస్తుంది. ఐఐటీలు, బార్క్, ఐఐఎస్సీ తదితర పరిశోధక సంస్థలు సైతం ఇప్పుడు సమ్మర్ ఇంటర్న్పేరుతో స్పాన్సర్డ్ రీసెర్చ్ కార్యకలాపాల్లో పాల్పంచుకునే వీలు కల్పిస్తున్నాయి. ఇంటర్నషిప్తో ప్రయోజనాలు ఇంటర్న్‌షిప్‌తో సంబంధిత రంగంలో వాస్తవ పరిస్థితులపై అవగాహన కలుగుతుంది. అప్పటివరకు నేర్చుకున్న అకడమిక్ అంశాలను ప్రాక్టికల్‌గా అన్వయించే అవకాశం లభిస్తుంది. కంపెనీలు కోరుకుంటున్న నైపుణ్యాలు, తామింకా మెరుగుపరచుకోవాల్సిన స్కిల్స్ ఏంటో తెలుస్తాయి. పని సంస్కృతి, టీంవర్క్‌కు అవసరమైన ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అలవడతాయి. ఆ రంగంలోని సీనియర్లతో కలిసి పని చేసే అవకాశం దక్కుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటర్న్‌షిప్ ఆవశ్యకత రోజురోజుకీ పెరుగుతోంది. విద్యార్థులు కేవలం తమ ఇన్స్టిట్యూట్లకు వచ్చే సంస్థలపైనే ఆధారపడకుండా.. వ్యక్తిగతంగానైనా ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందుకునేందుకు కృషి చేయాలి. అదే విధంగా ఇంటర్న్‌షిప్ సమయంలో చూపే పనితీరు, ప్రతిభ జాబ్ రెడీ స్కిల్స్ పెంచుకోవడంలో ఎంతో దోహదపడుతుంది. - బి.వెంకటేశం, ప్లేస్మెంట్ ఆఫీసర్, ఐఐటీ-హెచ్.