కెరీర్‌కు కీలకం.. ఆంగ్ల భాష నైపుణ్యం | Engineering Special-ENGLISH | Sakshi
Sakshi News home page

కెరీర్‌కు కీలకం.. ఆంగ్ల భాష నైపుణ్యం

Published Thu, Nov 14 2013 4:34 PM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM

Engineering Special-ENGLISH


డా॥ఇ.సురేశ్ కుమార్,
 ప్రొఫెసర్ అండ్ హెడ్,
 డిపార్‌‌టమెంట్ ఆఫ్ ఇంగ్లిష్,
 ఓయూ, హైదరాబాద్.
 
 ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్‌లో అకడమిక్ అర్హతల కంటే, నైపుణ్యాలకే పెద్దపీట వేస్తున్నారడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి నైపుణ్యాల్లో కీలకమైంది.. ఇంగ్లిష్‌లో కమ్యూనికేషన్. ఎందుకంటే కార్పొరేట్, ఎంఎన్‌సీ సంస్కృతి కారణంగా ఆయా సంస్థల కార్యకలాపాలు ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాలేదు. జట్టుగా (టీమ్).. కంపెనీల్లో పలు విభాగాల మధ్య సమన్వయంతో పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో విభిన్న భాషల నేపథ్యం ఉన్న వ్యక్తులతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. దీంతో అందరితో సులువుగా సమన్వయంతో వ్యవహరించడానికి ఇంగ్లిష్‌ను మించిన సాధనం మరొకటి లేదు.
 
 స్కోరింగ్ సబ్జెక్ట్
 
 ఇంటర్మీడియెట్‌లో ఇంగ్లిష్ సబ్జెక్ట్.. పోయెట్రీ, ప్రోజ్, గ్రామర్ అంశాల కేంద్రీకృతంగా ఉంటుంది. సిలబస్‌ను త్వరగా పూర్తి చేయడానికి, మార్కుల స్కోరింగ్ అనే అంశానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు. అంతేకాకుండా ఇంటర్మీడియెట్ దశలో విద్యార్థులు ఇంగ్లిష్‌ను కేవలం స్కోరింగ్ సబ్జెక్ట్‌గానే భావిస్తుంటారు. దాంతో అకడమిక్ పరంగా ఎన్ని మార్కులు సాధించినా.. ఇంగ్లిష్ భాషలో ప్రభావవంతంగా తమ భావాల్ని వ్యక్తం చేయలేకపోతున్నారు. ఈ లోపాలను అధిగమించి చక్కటి కెరీర్‌కు దోహదపడేలా కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించడానికి ఇంజనీరింగ్ ఇంగ్లిష్ ఉపకరిస్తుంది.
 
 జాబ్ మార్కెట్‌కనుగుణంగా
 
 ఇంజనీరింగ్ ఇంగ్లిష్ మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ నైపుణ్యాలను మెరుగుపరచడమే (స్కిల్స్ ఓరియెంటెడ్) లక్ష్యంగా ఇంగ్లిష్ సబ్జెక్ట్‌ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్రస్తుత జాబ్ మార్కెట్‌కనుగుణంగా వాస్తవిక దృక్పథంతో విద్యార్థులకు వృత్తిపరంగా (ప్రొఫెషనల్‌గా), వ్యక్తిగతంగా (పర్సనల్) అవసరమయ్యే నైపుణ్యాలను పెంపొందించడం జరుగుతుంది. కెరీర్‌లో విజయం సాధించడంలో ఇంగ్లిష్ కమ్యూనికేషన్ ప్రాధాన్యతను వివరించడం, సామాజిక, ప్రొఫెషనల్ అంశాల పట్ల తమ అభిప్రాయాలను ప్రభావవంతంగా వ్యక్తం చేయడం నేపథ్యంగా సిలబస్‌ను రూపొందించారు. ఈ క్రమంలో సిలబస్‌లో రోల్ ఆఫ్ కమ్యూనికేషన్, ది ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, డెవలపింగ్ లిజనింగ్, స్పీకింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, రిపోర్ట్ రైటింగ్, బిజినెస్ లెటర్స్, రైటింగ్ నోటిసెస్-సర్క్యులర్స్, ప్రిపేరింగ్ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్, సౌండ్స్ ఆఫ్ ఇంగ్లిష్ తదితర అంశాలకు చోటు కల్పించారు.
 
 తరగతిలో ఇలా
 
 తరగతి గదిలో ఎంతో కీలకమైన రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్ నైపుణ్యాలపై పట్టు సాధించడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు టీచర్ ఏదైనా ఒక అంశాన్ని కొంత సేపు చదవాలి అని నిర్దేశిస్తాడు. అంటే రీడింగ్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకునే అవకాశం ఏర్పడుతుంది. తర్వాత ఆ అంశంపై కాంప్రెహెన్షన్ ప్రశ్నలు అడగటం జరుగుతుంది. ఈ సమయంలో సమాధానం ఇవ్వడం ద్వారా లిజనింగ్, స్పీకింగ్ స్కిల్స్ మెరుగవుతాయి. దీని ఆధారంగా పేరాగ్రాఫ్/ఎస్సే వంటి రైటప్ రాయొచ్చు. తద్వారా రైటింగ్ స్కిల్స్‌ను పెంపొందించుకోవచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత తరగతి గదిలో చెప్పిన విషయాలను మననం చేసుకోండి. ఆ అంశానికి సంబంధించిన మెటీరియల్‌ను విభిన్న పద్ధతుల్లో చదవడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు ఆ రోజు చెప్పిన పాఠాన్ని సొంతంగా రాయడం లేదా దాని సారాంశాన్ని రాయడం చేయాలి. గ్రామర్ పరంగా, స్పెల్లింగ్ పరంగా తరచుగా వస్తున్న తప్పులపై అధికంగా దృష్టి పెట్టాలి. బృంద చర్చల్లో పాల్పంచుకోవాలి. ఇంగ్లిష్ క్లాస్‌లో ఉండే రోల్-ప్లేస్ అంశంలో విధిగా పాల్గొనాలి. గ్రామీణ, తెలుగు మాధ్యమం నేపథ్యంగా ఉన్న విద్యార్థులు ఇంగ్లిష్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. టీచర్లు నిర్వహించే ల్యాబ్ సెషన్‌లు, అసైన్‌మెంట్స్‌ను ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత లాభం పొందుతారు. తరగతిలో మిగతా విద్యార్థులతో ఇంగ్లిష్‌లో మాట్లాడడానికి ప్రయత్నించాలి. తద్వారా కమ్యూనికేషన్ పరంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించవచ్చు.
 
 ల్యాబ్ సెషన్స్.. కీలకం
 
 మరో కీలాకాంశం.. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులు ల్యాబ్‌సెషన్స్‌ను ప్రభావవంతంగా వినియోగించుకోవాలి. భవిష్యత్‌లో ఇంటర్వ్యూలను ఎదుర్కోవడానికి, బృంద చర్చల్లో (గ్రూప్ డిస్కషన్) రాణించడానికి అవసరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ల్యాబ్ సెషన్స్ ఎంతో దోహదం చేస్తాయి. కమ్యూనికేషన్‌లో ఎంతో కీలకమైన లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ వంటి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంలో కూడా ల్యాబ్ సెషన్స్ పాత్ర ఎంతో ఉంటుంది. ఈ క్రమంలో కన్వర్సేషన్ ప్రాక్టీస్, జామ్ (జెస్ట్ ఏ మినిట్) సెషన్స్, డిస్కషన్స్ అండ్ డిబేట్స్, ప్రెజెంటేషన్స్ అండ్ సెమినార్స్, మాక్ ఇంటర్వ్యూలు, రోల్-ప్లే, ఫోనోటెనిక్స్-ప్రాక్టీస్ ఆఫ్ సౌండ్స్ ఇన్ ఇంగ్లిష్ వంటి కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఫొనెటిక్స్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకోవడం ద్వారా పదాలను ఏ విధంగా పలకాలనే అంశంపై స్పష్టమైన అవగాహన పొందొచ్చు. ప్రొనౌన్సియేషన్ ప్రభావవంతంగా ఉన్నప్పుడే చక్కని ఇంగ్లిష్ మాట్లాడే అవకాశం ఏర్పడుతుంది. ప్రొనౌన్సియేషన్ ఎక్సర్‌సైజ్‌లను రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయాలి. వారానికి మూడు ల్యాబ్ సెషన్స్ ఉంటాయి. వీటికి రెండు క్రెడిట్స్ కేటాయించారు.
 
 దృక్పథం
 
 గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చే విద్యార్థులు ఇంగ్లిష్ విషయంలో ఎక్కువగా దృష్టిసారించాలి. వీరు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి.. ఇంగ్లిష్ భాషను నేర్చుకోవడంలో కీలక పాత్ర పోషించేది.. దృక్పథం. ఇంగ్లిష్‌ను ఏదో విదేశీ భాష మాదిరిగా కాకుండా సొంత భాషలా భావిస్తూ.. మనది అనే దృక్పథం, ఆసక్తి ఉంటే సులువుగానే ఈ భాషపై పట్టు సాధించవచ్చు. ఫ్యాకల్టీలు ల్యాబ్ సెషన్స్‌ల్లో చేపట్టే కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవచ్చు. మిగతా విద్యార్థులతో చనువుగా కలిసిపోవాలి. వారందరితో ఇంగ్లిష్ భాషలోనే మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఇక్కడ వ్యాకరణం, సరైన పదజాలం అంటూ నియమాలు పెట్టుకోకుండా మాట్లాడేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా కమ్యూనికేషన్ పరంగా పట్టు సాధించే అవకాశం ఉంది. ఇంగ్లిష్ న్యూస్ చానళ్లను చూడడం, దిన పత్రికలను చదవడం వల్ల ఇంగ్లిష్ భాషపై స్వల్ప కాలంలో పట్టు సాధించవచ్చు. అందులో ఏయే సందర్భాల్లో ఎటువంటి పదాలను వినియోగిస్తున్నారు అనే అంశంపై అవగాహన పెంచుకోవాలి. కాలేజీల్లో ఉండే క్లబ్‌లు లేదా ఫోరమ్‌లలో చేరాలి. వాటి ద్వారా పరిచయమయ్యే స్నేహితులతో పలు అంశాలపై చర్చించడం వల్ల ఇంగ్లిష్‌ను ప్రభావవంతంగా నేర్చుకోవచ్చు. అంతేకాకుండా కాలేజీల్లో నిర్వహించే కరిక్యులర్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొనాలి. వివిధ రకాల ఈవెంట్లు, టెక్నికల్ ఫెస్టివల్స్, ఇంటర్-కాలేజ్ స్పోర్ట్స్, సెమినార్లు, కంపెనీలు నిర్వహించే వివిధ రకాల పోటీ పరీక్షలు, టెక్నికల్ కాంపిటీషన్స్ నిర్వహణ వంటి వాటిల్లో పాల్గొనడంపై దృష్టి సారించాలి. తద్వారా చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ అలవడతాయి.
 
 పునాది
 
 అధిక శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ పట్ల నిర్లక్ష్య భావంతో వ్యవహరిస్తుంటారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విజయం సాధించలేనప్పుడు మాత్రమే వారు ఆంగ్ల భాష ప్రాధాన్యతను గుర్తిస్తుంటారు. దాంతో ఆ లోపాన్ని అధిగమించేందుకు స్పోకెన్ ఇంగ్లిష్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. ఇక్కడ గమనించాల్సిన అంశం.. కోచింగ్ సెంటర్లు కేవలం వ్యాకరణం (గ్రామర్) కేంద్రీకృతంగా మాత్రమే బోధనను నిర్వహిస్తుంటాయి. వ్యాకరణం ద్వారానే ఇంగ్లిష్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవడం సాధ్యం కాదు. కాబట్టి కోర్సులో భాగంగా ఉండే ఇంగ్లిష్ తరగతులను విస్మరించవద్దు. ఎందుకంటే ఇంగ్లిష్ కమ్యూనికేషన్ దిశగా ఈ తరగతులు పునాదులుగా ఉపయోగపడతాయి. ఇచ్చిన అసైన్‌మెంట్స్‌ను ప్రతిరోజూ ప్రాక్టీస్ చేస్తూంటే సులభంగా ఈ విషయంపై పట్టు సాధించవచ్చు.
 
 భవిష్యత్ దిశగా
 
 ఇంజనీరింగ్ నాలుగేళ్లు, తర్వాత ఉన్నత విద్య దిశగా ఏ కోర్సు చేసినా భవిష్యత్‌లో బోధన, పరీక్షల నిర్వహణ, సంబంధిత వ్యవహారం మొత్తం ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది. ప్రాజెక్ట్స్, సెమినార్స్, ఇలా అన్ని అంశాలకు ఇంగ్లిష్ భాషలోనే హాజరు కావాలి. ఈ నేపథ్యంలో మీకు విషయంపై ఎంత అవగాహన ఉన్నా దాన్ని ఎటువంటి వ్యాకరణ, అక్షర దోషాలు లేకుండా వ్యక్తం చేయడంలోనే యుక్తి దాగి ఉంటుంది. అందుకోసం ఇంగ్లిష్ భాషపై పట్టు తప్పనిసరి. తద్వారా సబ్జెక్ట్ పరంగా మెరుగైన స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంగ్లిష్‌లో నైపుణ్యం అనేది అకడమిక్స్ పరంగా కూడా మీ రికార్డును ప్రభావితం చేస్తుంది.
 
 సులభంగా
 
 చాలామంది విద్యార్థులు ఇంగ్లిష్ భాషను మెరుగుపరుచుకోవడం చాలా కష్టంతో కూడిన వ్యవహారంగా భావిస్తారు. కానీ ఇది ఒక అపోహ మాత్రమే. కాసింత శ్రమ, నిరంతర సాధన ద్వారా ఈ అంశంపై సులభంగానే పట్టు సాధించొచ్చు. ఇందుకోసం మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, తదితరులతో.. దైనందిన కార్యకలాపాలు, భవిష్యత్ ప్రణాళికలు, సినిమాలు, ఇలా ఏ విషయాలైనా ఇంగ్లిష్‌లో సంభాషించడానికి ప్రయత్నించాలి. ఇక్కడ వ్యాకరణం, సరైన పదజాలం అంటూ నియమాలు పెట్టుకోకుండా మాట్లాడేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. త ద్వారా కమ్యూనికేషన్ పరంగా పట్టు సాధించే అవకాశం ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత తరగతి గదిలో చెప్పిన విషయాలను మననం చేసుకోండి. ఆ అంశానికి సంబంధించిన మెటీరియల్‌ను విభిన్న పద్ధతుల్లో చదవడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు ఆ రోజు చెప్పిన పాఠాన్ని సొంతంగా రాయడం లేదా దాని సారాంశాన్ని రాయడం చేయాలి.
 
 కీలకం
 
 వొకాబ్యులరీపై పట్టు సాధించడం కూడా ఇంగ్లిష్ కమ్యూనికేషన్‌లో కీలక భాగం. ఇందుకోసం అందుబాటులోని వనరులను ప్రభావవంతంగా వినియోగించుకోవాలి. ప్రతి రోజూ ఇంగ్లిష్ దినపత్రికలు, మ్యాగజైన్లను చదవాలి. అందులో ఏయే సందర్భాల్లో ఎటువంటి పదాలను వినియోగిస్తున్నారు అనే అంశంపై అవగాహన పెంచుకోవాలి. ఇంగ్లిష్ న్యూస్ చానెళ్లను వీక్షించండి. అందులో ఉపయోగించిన భాషను నిజ జీవిత అంశాలకనుగుణంగా వాడే ప్రయ త్నం చేయాలి. కథల పుస్తకాలు (స్టోరీ బుక్స్), ఏవైనా ఆసక్తి కలిగించే పుస్తకాలను చదవాలి. అందులోని భాషను పరిశీలించాలి. తర్వాత సొంతంగా అందులోని కథను లేదా దానిపై సమీక్షను ఇంగ్లిష్‌లో రాసే ప్రయత్నం చేయాలి. మీ తప్పులను తెలుసుకోవాలి. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. తిరిగి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏవైనా సందేహాలు ఉంటే సీనియర్లు, ఫ్యాకల్టీ, ఇతర నిపుణులతో నివృత్తి చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలి.
 
 కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకునే దిశగా ఇంగ్లిష్‌ను ఒక చక్కటి అవకాశంగా భావించాలి.
 
 ఇంజనీరింగ్ కోర్సు మొత్తం, ఆ తర్వాత ఉన్నత విద్య, ఉద్యోగం ఏదైనా ఆంగ్ల భాషతో ముడిపడి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
 
 మీ నైపుణ్యాలను  మెరుగుపరుచుకోవడానికి, ప్రదర్శించడానికి ఇంగ్లిష్ ల్యాబ్ సెషన్స్ ఎంతో దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించవద్దు.
 
 స్నేహితులతో సాధ్యమైనంత వరకు ఇంగ్లిష్‌లో మాట్లాడడానికి ప్రయత్నించాలి.
 
 కోర్సులో భాగంగా ఉండే ఇంగ్లిష్ తరగతులకు రెగ్యులర్‌గా హాజరు కావాలి.
 
 డైరీ రాయడం, వివిధ అంశాలపై వ్యాసాలు (ఎస్సే రైటింగ్) రాయడం, కొన్ని కథలను సంక్షిప్తం చేయడం, ఉత్తరాలు రాయడం
 
 (రైటింగ్ లెటర్స్), పత్రికలకు వ్యాసాలు పంపడం (ఆర్టికల్స్ టూ న్యూస్ పేపర్స్)
 వంటి వాటి ద్వారా కూడా రైటింగ్ స్కిల్‌ను మెరుగుపరుచుకోవచ్చు.
 
 ఇంగ్లిష్ భాషలో 44 సౌండ్స్ ఉన్నాయి. ఇందులో 20 ఓవెల్ సౌండ్స్, 24 క న్సోనెంట్ సౌండ్స్. వీటిని క్షుణ్నంగా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement