bhavita
-
విశాఖలో భవిత కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ (ఫొటోలు)
-
రోల్‌మోడల్ స్టేట్‌గా ఏపీ.. జగనన్నకు థ్యాంక్స్
-
భవితకు రెండు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: బ్లూ రాక్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో జీఎస్ఎం క్రీడాకారిణి ఎన్. భవిత మెరిసింది. సబ్ జూనియర్, జూనియర్ బాలికల సింగిల్స్ విభాగాల్లో చాంపియన్‌గా నిలిచి రెండు టైటిళ్లను అందుకుంది. సబ్ జూనియర్ బాలికల ఫైనల్లో భవిత 4–1తో విధి జైన్ (జీఎస్ఎం)పై, జూనియర్ బాలికల టైటిల్ పోరులో 4–2తో వి. సస్య (ఏడబ్ల్యూఏ)పై నెగ్గి విజేతగా నిలిచింది. సబ్ జూనియర్ బాలుర విభాగంలో కేశవన్ కన్నన్ (ఎంఎల్ఆర్) 4–2తో ఎస్ఎస్కే కార్తీక్ (ఏడబ్ల్యూఏ)పై, జూనియర్ బాలుర కేటగిరీలో అమన్ (ఏవీఎస్‌సీ) 4–2తో వరుణ్ శంకర్ (జీటీటీఏ)పై గెలిచారు. క్యాడెట్ బాలబాలికల ఫైనల్ మ్యాచ్‌ల్లో పార్థ్‌భాటియా (ఏడబ్ల్యూఏ) 3–1తో జతిన్ దేవ్ (ఎస్పీహెచ్ఎస్)పై, కావ్య (ఏడబ్ల్యూఏ) 3–2తో నిఖిత (వీపీజీ)పై... యూత్ బాలబాలికల తుదిపోరులో మొహమ్మద్ అలీ (ఎల్బీఎస్) 4–0తొ సరోజ్ సిరిల్ (ఏడబ్ల్యూఏ)పై, వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) 4–2తో జి. ప్రణీత (హెచ్‌వీఎస్)పై గెలుపొందారు. పురుషుల ఫైనల్లో విఘ్నయ్ రెడ్డి (ఆర్బీఐ) 4–2తో పి. చంద్రచూడ్ (ఎంఎల్ఆర్)పై నెగ్గగా, మహిళల టైటిల్ పోరులో నిఖత్ బాను 4–3తో వరుణి జైస్వాల్ (జీఎస్ఎం)ను ఓడించింది. -
ఆ వీడియోల ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న వైనం!
యూట్యూబ్.. ప్రతిభను ప్రదర్శించేందుకు అంతర్జాతీయ వేదిక. ఇది కొంతమందిని రాత్రికిరాత్రే స్టార్లుగా మార్చేస్తోంది. మరికొంత మందికి ఊహించని ఆదాయం తెచ్చిపెడుతోంది. సృజనాత్మకతే పెట్టుబడిగా యూట్యూబర్‌గా మారి సంపాదించేందుకు వీలుకల్పిస్తోంది. ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, కామెడీ, బ్యూటీ, ఫ్యాషన్, ఫిట్నెస్ మొదలైన విభాగాల్లో యువత ప్రతిభ చాటుతోంది. యూట్యూబర్గాసక్సెస్ సాధించి.. సినిమా అవకాశాలను చేజిక్కించుకుంటున్నవారూ ఉన్నారు. సృజన, నవ్యత, నాణ్యత ఉంటే.. ఎవరైనా యూట్యూబర్‌గా మారొచ్చు. నేటి డిజిటల్ యుగంలో వినోదంతోపాటు ఆదాయ వనరుగా నిలుస్తున్న యూట్యూబర్ కెరీర్ గురించి తెలుసుకుందాం.. వైవా హర్ష, ఘాజీ దర్శకుడు సంకల్ప్‌రెడ్డి, పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శి, మహా తల్లి (జాహ్నవి) వంటి వారెందరో యూట్యూబ్‌లో ప్రతిభను చాటడం ద్వారా.. బుల్లితెర, వెండితెరలపై తమకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు. యూట్యూబ్‌ను ఆధారం గా చేసుకొని కొందరు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుం టే.. మరికొందరు బాగా సంపాదిస్తున్నారు. వినూ త్నంగా సాగే తమ ఆలోచనలకు ఒక రూపం ఇవ్వగలిగే నేర్పు ఉంటే చాలు యూట్యూబ్ స్టార్‌గా ఎదగవచ్చు అంటున్నారు నిపుణులు. ఇందుకోసం పెద్దగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. మొబైల్ లేదా తక్కువ బడ్జెట్ కెమెరాలతో వీడియో షూట్ చేయొచ్చు. వీటిని గూగుల్ అకౌంట్ సహాయంతో యూట్యూబ్ చానల్ అకౌంట్ ఓపెన్‌చేసి, అప్లోడ్ చేయొచ్చు. ఆదాయం ఎలా? యూట్యూబ్ చానల్‌కు ప్రధాన ఆదాయ మార్గం.. ప్రకటనలు. వీటిద్వారా వచ్చే ఆదాయం ద్వారానే సదరు యూట్యూబ్ చానల్ యజమానికి చెల్లింపులు జరుగుతాయి. ఇటీవల యూట్యూబ్‌లో స్పామ్ కంటెంట్ పెరిగిందంటూ ఫిర్యాదులు, వీడియోలను వాయిస్‌ఓవర్‌తో తప్పుదోవ పట్టిస్తున్న సంఘటనలు ఎక్కువ అవడంతో గూగుల్ సంస్థ యూట్యూబ్ నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో నవ్యత, నాణ్యతకు ప్రాధాన్యత పెరిగింది. వీటితోపాటు ఏడాది కాలంలో 4,000 గంటల వాచ్‌టైం తప్పనిసరిగా ఉండాలనే నిబంధనను సైతం అమల్లోకి తెచ్చింది. కనీసం వెయ్యి మంది సబ్ స్క్రైబర్స్‌తో రోజుకు 10 గంటల వాచ్ టైం ఉంటేనే ఆదాయం పొందేందుకు వీలుంటుంది. ముఖ్యమైన టూల్స్ యూట్యూబ్ చానల్ ప్రారంభించడానికి పెట్టుబడి అవసరం లేకున్నా.. వీడియోలను కొన్ని టూల్స్ ద్వారా ఆకర్షణీయంగా రూపొందించవచ్చు. దాంతో వ్యూస్ పెంచుకోవడంతో పాటు సబ్స్క్రిప్షన్స్ కూడా పెరుగుతాయి. చానల్ ప్రారంభించే ముందు మీరు ఎంచుకునే అంశంపై స్పష్టత ఉండాలి. దానికోసం కొంత పరిశోధన చేయాలి. వీక్షకులకు ఆసక్తి గలిగించే అంశాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. వీడియో రికార్డింగ్ కోసం 720పి రెజల్యూషన్ కంటే ఎక్కువ నాణ్యతతో రికార్డింగ్ చేస్తే మేలు. బడ్జెట్ అనుకూలిస్తే తక్కువ బడ్జెట్లో అందుబాటులో ఉండే కెనాన్ 1300డి వంటి బ్రాండెడ్ కెమెరాలు తీసుకొని వాటితో వీడియోలు చేయొచ్చు. ట్రైపాడ్స్ తీసుకుంటే రికార్డింగ్ సులువు అవుతుంది. మార్కెట్లో తక్కువ పెట్టుబడితో ట్రైపాడ్స్ కొనుగోలు చేయొచ్చు. మైక్రోఫోన్ ఆధారంగా చక్కటి ఆడియోతో పాటు వీడియో రికార్డింగ్ సాధ్యపడుతుంది. ఇది ప్రేక్షకుల ఆదరణ పొందడానికి ఉపయోగపడుతుంది. బ్లూ స్క్రీన్ లేదా గ్రీన్ స్క్రీన్ ఉపయోగిస్తే బ్యాక్‌గ్రౌండ్ ఎడిటింగ్ సులువు అవుతుంది. వీడియో రికార్డింగ్ చేసే క్రమంలో అవాంతరాలు రావడం సహజం. వాటిని డిలీట్ చేయడానికి ఎడిటింగ్ టూల్స్ ఉపయోగపడతాయి. వీడియో, ఆడియో ఎడిటింగ్ టూల్స్ ఉపయోగించి వీడి యోను ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దొచ్చు. ముఖ్యంగా వీడియో ఎడిటింగ్ కోసం థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లను ఉపయోగించుకోవచ్చు. యూట్యూబ్‌లోనూ ఇన్ బిల్ట్ ఎడిటింగ్ టూల్స్ ఉంటాయని.. వాటిని ఉపయోగించుకుంటే కోరుకున్న ఔట్పుట్ వస్తుం దని నిపుణులు చెబుతున్నారు. వ్యూస్ పెరిగేకొద్దీ.. యూట్యూబ్‌లో డబ్బులు రావాలంటే వ్యూస్ ఎక్కువగా రావాలి. అదేవిధంగా క్రమంతప్పకుండా వీడియోలు అప్లోడ్ చేయాలి. చానల్ ప్రారంభించిన మొదట్లోనే డబ్బులు రావు. మొదటి పేమెంట్ రావాలంటే.. బ్రేక్ ఈవెన్ అమౌంట్ (సుమారు 100 డాలర్లు) దాటాలి. తర్వాత రెగ్యులర్‌గా ఆదాయం అందుతుంది. ఇండియాలో కంటే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వీడియోలు చూస్తే సదరు చానల్ ఓనర్‌కు ఆదాయం ఎక్కువగా ఉంటుంది. వ్యూస్ పెంచుకునేందుకు కొన్ని చిట్కాలు పాటించడం తప్పనిసరి. ప్రధానంగా టైటిల్స్ ఆకర్షించే విధంగా ఉండాలి. అదే విధంగా థంబ్‌నైల్స్ కూడా చూపరులను కట్టిపడేసేవిగా కనిపించాలి. తెలుగులో చానల్ ప్రారంభిస్తే .. తెలుగు భాషలోనే కీవర్డ్స్ ఇవ్వాలి. ఇక, యూట్యూబ్ నుంచి కూడా ఆటోమేటిక్/సజెస్టెడ్ కీవర్డ్స్ వస్తుంటాయి. వాటిని ఉపయోగిం చుకోవాలి. ‘ఎంటర్టైన్మెంట్’ విభాగాల వీడి యోలు ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. ఎడ్యుకేషన్ వంటి సంప్రదాయ విభాగాలు ట్రెండింగ్ వీడియోల్లో కనిపించట్లేదు. వైరల్ అయితే కాసులే! ప్రస్తుతం ఒక వీడియో వైరల్ అయితే చాలు ఎంతో పేరు, డబ్బు వస్తుంది. వినోదాత్మక జానర్ ఎంచుకొని కొత్తగా వీడియోలు చేస్తే త్వరగా వీక్షకుల సంఖ్య పెరుగుతుంది. కొత్తగా చానల్ పెట్టాలనుకుంటే.. ఫ్రెష్‌గా, ప్రొఫెషనల్‌గా తీయాలి. వాయిస్ ఓవర్, యాంకర్లను పెట్టి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లొచ్చు. అప్లోడ్ చేసే క్రమంలో ‘కీవర్డ్స్’ కూడా సరిపోయేవి ఇస్తే చానల్‌కు ప్రేక్షకులు ఎక్కువగా వస్తారు. చానల్ ప్రమోషన్స్‌కు ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలను కూడా ఉపయోగించుకోవాలి. అందులోనూ ‘చెల్లింపు’ ప్రమోషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిద్వారా త్వరగా ప్రేక్షకులను చేరొచ్చు. – నల్లమోతు శ్రీధర్, కంప్యూటర్ ఎరా మ్యాగజైన్ చానల్. డేటా వినియోగం బాగా పెరిగింది జియో వచ్చాక తెలుగు రాష్ట్రాల్లో డేటా వినియోగం బాగా పెరిగింది. యూట్యూబ్ వీడియోలు బాగా చూస్తున్నారు. నేను అప్లోడ్ చేసే పోటీ పరీక్షల ‘ఎడ్యుకేషన్’ విభాగానికి సంబంధించిన వీడియోలకు ప్రత్యేకంగా ప్రేక్షకులు ఉంటున్నారు. వారు మాత్రమే ఈ వీడియోలు చూస్తున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ అంత సులువుగా డబ్బులు ఇవ్వడం లేదు. నిబంధనలు కఠినంగా ఉన్నాయి. నాకు మొదట ఆర్నెల్ల వరకు డబ్బులు రాలేదు. నేను ఫుల్‌టైం ఉద్యోగం చేస్తూ వీలున్నప్పుడు వీడియోలు చేస్తున్నాను. రెగ్యులర్‌గా వీడియోలు పెడితే డబ్బులు వస్తాయి. – ఆకుల నారాయణరావు, ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. -
కొలువులపై టెక్నాలజీ దెబ్బ
గతమంతా ఘనం.. భవిష్యత్ అంతా గందరగోళం అన్నట్లు..! ఒక్కసారి గతంలో ఉద్యోగాలు ఎలా ఉండేవో గుర్తుకు తెచ్చుకోండి. ఉద్యోగాలకు భద్రత ఉండేది. కొంత అనుభవం సంపాదిస్తే.. ప్రమోషన్ గ్యారెంటీ..! అనే నమ్మకంఉండేది. జీతం తక్కువైనా ఖర్చులు తక్కువకాబట్టి ఆదాయ భద్రత ఎక్కువగా ఉండేది.ఇప్పుడు ప్రపంచం వేగంగా మారిపోతోంది. ఈరోజున్న జాబ్ రేపు ఉంటుందన్న గ్యారెంటీలేదు. ప్రస్తుతం మీకు ఎంత టాలెంట్ ఉన్నా.. మీనైపుణ్యాలను మెరుగుపరచుకోకుంటే మూడేళ్లతర్వాత మీ ఉద్యోగం ఊడినట్లే..! అంటున్నారునిపుణులు. ఎందుకంటే.. ప్రతి మూడేళ్లకోసారిటెక్నాలజీ సమూలంగా మారిపోతుండటమే! ఓతాజా నివేదిక ప్రకారం భారత జాబ్మార్కెట్లోనియామకాల పరిస్థితి గతంలో ఎన్నడూలేనంత అస్థిరంగా మారింది. ఈ నేపథ్యంలోజాబ్ మార్కెట్లో తాజా హైరింగ్ ట్రెండ్స్ ఎలాఉన్నాయి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగంసొంతం కావాలన్నా.. కొలువులో మనుగడసాగించాలన్నా.. ఏం చేయాలోతెలుసుకుందాం... సాక్షి భవిత, జాబ్ ట్రెండ్స్ :టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవిస్తున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ), డేటా అనలిటిక్స్, రోబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), క్లౌడ్ కంప్యూటింగ్ కారణంగా టెక్నాలజీ రంగంలో రాకెట్ వేగంతో మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేషన్ విస్తరణ కారణంగా... ప్రపంచవ్యాప్తంగా వ్యాపార వాణిజ్యం రంగంలో, ఉత్పత్తి ప్రక్రియలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. కంపెనీలు వ్యయ నియంత్రణలో భాగంగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. దాంతో గతంలో ఏ పదేళ్లకో మార్పులకు లోనయ్యే జాబ్ మార్కెట్.. ఇప్పుడు మూడేళ్లకే పూర్తిగా మారిపోతోంది. కాబట్టి ఈ టెక్నాలజీని ఎంత సమర్థంగా అందిపుచ్చుకోగలరు అనే దానిపైనే మీ కెరీర్ గమనం ఆధారపడి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు టెక్నాలజీ నేటి మంత్రం కంపెనీలు ఆన్లైన్ కస్టమర్స్‌తో మాట్లాడేందుకు చాట్ బోట్స్‌ను ఉపయోగిస్తున్నాయి. దాంతో ఇంతకాలం కస్టమర్ సర్వీస్, కాల్ సెంటర్స్‌లో ఈ పనిచేసిన సిబ్బంది అవసరం లేకుండా పోయింది. అంతేకాదు ఉదాహరణకు ఐబీఎం వాట్సన్ కంప్యూటర్లో నిక్షిప్తిమైన రోగిæ.. రోగ చరిత్రనంతా స్కాన్ చేసి అత్యంత కచ్చితత్వంతో రోగాన్ని విశ్లేషించి.. వ్యాధి నివారణకు ఏం చేయాలో సలహా ఇస్తుంది. తద్వారా సంబంధిత నిపుణుల పాత్ర నామమాత్రంగా మారుతోంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి సేవల రంగం వరకూ.. టెక్నాలజీ సాయంతో గతంలో ఒక పని పూర్తిచేసేందుకు నాలుగు గంటల సమయం అవసరమైతే.. ఇప్పుడు ఆ పని క్షణాల్లో పూర్తి కచ్చితత్వంతో పూర్తవుతోంది. తద్వారా కంపెనీలకు ఖర్చు తగ్గ డంతోపాటు తక్కువ సమయంలోనే ఎక్కువ ఉత్పత్తి సాధ్యమవుతోంది. అందుకే కంపెనీలు మానవ వనురులపై ఆధారపడటం తగ్గించేస్తున్నాయి. నైపుణ్యం ప్రస్తుతమున్న నైపుణ్యాలనే పట్టుకొని కూర్చుంటే.. మీరు రోడ్డునపడటం ఖాయమంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. మార్పు నేటి తారకమంత్రం కాబట్టి! ఉదాహరణకు.. గతంలో బుక్కీపింగ్ తెలిసుంటే చాలు.. అకౌంటెంట్ ఉద్యోగం ఖాయంగాలభించేది, జీవిత కాలంపాటు కొనసాగేది. కొన్నేళ్ల క్రితమే బుక్కీపింగ్ స్థానంలో.. అకౌంటింగ్ సాఫ్ట్వేర్ వచ్చి చేరింది. ఆ సమయంలో అకౌంటింగ్ సాఫ్ట్వేర్ నైపుణ్యం లేనివారందరూ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఇదే అకౌంటింగ్ జాబ్స్‌పై కొద్దికాలం క్రితం అమల్లోకి వచ్చిన జీఎస్టీ పెద్ద దెబ్బ కొట్టింది. జీఎస్టీ వచ్చాక ఈ అకౌంటెంట్స్‌పై ఆధార పడటం తగ్గిపోయింది. అంటే.. ప్రస్తుతం అమలుచేసిన జీఎస్టీ కారణంగా మారిన కంపెనీల అవసరాలకు తగ్గట్లు కొత్త నైపుణ్యాలున్న వారికే జాబ్ మార్కెట్లో అవకాశం లభిస్తుంది. నాలెడ్జ్ ఇప్పుడు మీరు సంపాదించిన నాలెడ్జ్ ఒక్క ఏడాది కళ్లు మూసుకుంటే ఎందుకూ కొరగాకుండా పోతుందంటే నమ్ముతారా..! నమ్మాలంటున్నారు మేధావులు. దీనికి కూడా టెక్నాలజీ విప్లవమే కారణం!! అంతేకాకుండా ఒక డాక్టర్, ఒక లాయర్, ఇంజనీర్ అందించే సేవల నాణ్యత.. ఆ సేవలకు ఎంత చెల్లించొచ్చో డేటా అనలిటిక్స్ వంటి వాటి ద్వారా క్షణాల్లో అంచనాకు వస్తున్నాయి కంపెనీలు. దాంతో సంస్థలు ఇస్తున్న వేతనానికి ఉద్యోగుల నాలెడ్జ్ స్థాయి, పనితీరు ఏమాత్రం తగ్గినా.. పింక్ స్లిప్ వెలాడుతున్నట్లే! మరోవైపు తక్కువ వేతనానికి నాణ్యమైన పనితీరు చూపే యువత అందుబాటులో ఉంటే.. సీనియర్ నిపుణులకు భారీ జీతాలు చెల్లించడం భారమని కంపెనీలు భావిస్తున్నాయి. ఫలితంగానే పింక్ స్లిప్‌ల పరంపర మొదలవుతోందని చెబుతున్నారు. ఇటీవలే ఓ ప్రముఖ ఐటీ కంపెనీ 1000 మంది సీనియర్ ఉద్యోగులను ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అందుకు సదరు సీనియర్ ఉద్యోగులు టెక్నాలజీ పరంగా అప్డేట్ కాకపోవడం ఒక కారణమైతే.. వారికి జీతాలు భారీగా ఉండటం మరో కారణమట! కాబట్టి ఉద్యోగులు ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నాలెడ్జ్ పెంచుకుంటూæ... మంచి ఫలితాలు చూపితేనే కెరీర్లో మనుగడ సాధ్యమవుతుంది. నిరంతర అధ్యయనం స్టే క్యూరియస్, స్టే హంగ్రీ.. అనేది నేటి కెరీర్ మంత్రం. ప్రస్తుత నైపుణ్యాలు జాబ్ మార్కెట్‌కు పనికిరాకుండాపోతే.. ఇక ముందున్న ఏకైక మార్గం.. కొత్త స్కిల్స్‌ను వేగంగా నేర్చుకోవడమే! ఇందుకోసం ఆయా అంశాలపై ఆసక్తి పెంచుకోవాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందిపుచ్చుకోవాలి. నిత్య విద్యార్థిలా మారి.. మూక్స్ వంటి ఆన్లైన్ విధానాల ద్వారా అప్డేట్ కావాలి. నేర్చుకున్నది ఎప్పటికీ వృథా కాదు. నిరంతరం నేర్చుకుంటూ.. సమస్యలను పరిష్కరిస్తూ ఉత్పత్తి పెంచుతున్న ఉద్యోగిని వదులుకోవాలని ఏ కంపెనీ కోరుకోదు. కాబట్టి ఫ్రెషర్స్‌తోపాటు సీనియర్ ఉద్యోగులు కూడా కెరీర్ పరంగా, టెక్నాలజీ పరంగా తాము నేర్చుకోవాల్సిన టెక్నాలజీని, నైపుణ్యాలను సమీక్షించుకోవాలి. గత వారంలో, గత నెలలో ఎలాంటి పనితీరు ప్రదర్శించాం.. ఏఏ కొత్త విషయాలు నేర్చుకున్నాం.. కొత్తగా వస్తున్న టెక్నాలజీ ఏంటి.. ఆ టెక్నాలజీ గురించి మనం ఏం నేర్చుకున్నాం.. నేర్చుకున్న టెక్నాలజీని మన కంపెనీ ప్రొడక్టివిటీ పెంచడంలో ఏమేరకు అన్వయించాం.. ఇలా ప్రతి ఒక్కరూ సమీక్షించుకుంటూ... ఉద్యోగ మనుగడ సాధించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే మేలు నిరంతరం తమ సామర్థ్యాలను సమీక్షించుకుంటూ.. నైపుణ్యాలు మెరుగుపరచుకుంటూ.. టెక్నాలజీని నేర్చుకుంటూ ముందుకు సాగాలి. జాబ్ మార్కెట్‌కు ఉపయోగపడే స్కిల్స్ నేర్చుకోవడంతోపాటు, ప్రత్యామ్నాయ కెరీర్ గురించి ఆలోచిస్తుండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ద్వారా నేర్చుకునే తపన, పనిచేసే సామర్థ్యం పెంచుకోవాలి. నిపుణుల ప్రసంగాలు వినడం, మంచి పుస్తకాలు చదడం, మనసును చురుగ్గా ఉంచుకోవడం ద్వారా అవుట్‌డేట్ ప్రమాదం నుంచి బయటపడొచ్చు. మనం పనిచేయడమేకాకుండా... తోటి ఉద్యోగులు తమ శక్తిసామర్థ్యాలు పెంచుకొని మరింత బాగా పనిచేసేలా ప్రోత్సహిస్తుండాలని కంపెనీలు కోరుకుంటున్నాయి. -
స్టార్టప్ ఆఫర్స్..ఆచితూచి అడుగేయండి..!
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో స్టార్టప్స్ కంపెనీలు రెట్టింపు సంఖ్యలో నియామకాలు జరుపుతున్నాయి. భారీ పే ప్యాకేజీలు అందిస్తున్నాయి. విద్యార్థులు కూడా స్టార్టప్‌ల వైపు ఆకర్షితులవుతున్నారు. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే! మరోవైపు స్టార్టప్ కంపెనీలు ప్రముఖ ఇన్స్టిట్యూట్లలోని విద్యార్థులకు ఇచ్చిన ఆఫర్స్‌ను సైతం వెనక్కు తీసుకుంటున్నాయి. నియామకాలను వాయిదా వేస్తున్నాయి. ఇది విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. త్వరలో ఈ విద్యా సంవత్సరానికి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో..స్టార్టప్ కంపెనీల ఆఫర్స్ విషయంలో నిపుణులు అందిస్తున్న సూచనలు, సలహాలు!! పేరున్న స్టార్టప్ కంపెనీలు సైతం ఇటీవల కాలంలో విద్యార్థులకు ఇచ్చిన ఆఫర్స్‌ను వెనక్కు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. విద్యా సంవత్సరం చివర్లో ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో ప్రముఖ ఇన్స్టిట్యూట్స్లో చదివిన ప్రతిభావంతులు ఏదో ఒక జాబ్‌తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కాబట్టి స్టార్టప్ కంపెనీల ఆఫర్స్‌ను ఆమోదించే ముందు అభ్యర్థులు ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రమోటర్స్ నుంచి కంపెనీ ప్రొఫైల్ వరకు స్టార్టప్ కంపెనీ ఆఫర్‌ను ఆమోదించే ముందు అభ్యర్థులు స్టార్టప్ సంస్థ ప్రమోటర్స్ వివరాలు, వారి విజన్, సంస్థ ప్రొఫైల్, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి? అనే అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి. సదరు సంస్థ ప్రొడక్ట్/సర్వీస్ వివరాలు.. టార్గెట్ కస్టమర్స్, సర్వీస్/ప్రొడక్ట్‌కు సంబంధించి మార్కెట్ పరిస్థితుల గురించి అవగాహన పెంచుకోవాలి. క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్, ప్లేస్మెంట్ కోఆర్డినేటర్స్, కంపెనీల వెబ్‌సైట్స్ ద్వారా ఈ సమాచారం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా స్టార్టప్ కంపెనీ ఆర్థిక సామర్థ్యం గురించి తెలుసుకోవాలి. కార్యకలాపాల నిర్వహణ, భవిష్యత్తు మనుగడ పరంగా సంస్థకున్న ఆర్థిక వనరుల లభ్యత చాలా కీలకం. ఎందుకంటే భారీ లాభాలు ఆశించి పెట్టుబడులు పెట్టే సీడ్ ఫండింగ్ సంస్థలు, వెంచర్ క్యాపిటలిస్టులు.. స్టార్టప్ కంపెనీ నుంచి ఆశించిన లాభాలపై నమ్మకం సడలితే నిధులు ఉపసంహరించుకుంటారు. దాంతో ఒత్తిడికి లోనైన కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ముందు మానవ వనరులపై వేటు వేస్తాయి. కాబట్టి రూ.లక్షల ప్యాకేజ్‌తో ఆఫర్ ఇచ్చినా.. సంస్థ ఆర్థిక సామర్థ్యం సరిగా లేకుంటే అభ్యర్థులు సమీప భవిష్యత్తులోనే ఒడిదుడుకులకు లోనవ్వాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. పని వాతావరణం ఇప్పటికే సదరు స్టార్టప్ కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య గురించి తెలుసుకోవడం కూడా తాజా అభ్యర్థులకు మేలు చేస్తుంది. సాధారణంగా స్టార్టప్ సంస్థల్లో మానవ వనరుల సంఖ్య 20 నుంచి 50 మధ్యలోనే ఉంటోంది. ఫండింగ్ సంస్థల ప్రోత్సాహం ఉంటే ఈ సంఖ్య 100 నుంచి 150 వరకు ఉంటుంది. తద్వారా స్టార్టప్ సంస్థ మనుగడపై ఒక అంచనాకు రావచ్చు. వీలైతే అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని సంప్రదించి వాస్తవ పరిస్థితుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా స్టార్టప్ కంపెనీలో పని సంస్కృతి, పని వాతావరణం గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. స్టార్టప్ సంస్థల్లో చేరాలనుకునే అభ్యర్థులు తమలోని సృజనాత్మకతను, నైపుణ్యాలను, తమ ఆలోచనలను అమలు చేసేందుకు వీలుంటుందని, ఆ మేరకు కంపెనీలు సైతం తమను ప్రోత్సహిస్తాయనే అభిప్రాయంతో ఉంటారు. తాము చేరాలనుకుంటున్న కంపెనీలో ఇలాంటి పరిస్థితి ఉందో? లేదో? తెలుసుకోవడం మంచిది. ప్యాకేజ్, ఇతర బెనిఫిట్స్ స్టార్టప్ ఆఫర్‌ను ఆమోదించే క్రమంలో తమకు అందించే ప్యాకేజ్‌ను ఏ రూపంలో ఇస్తాయో అభ్యర్థులు ముందుగానే తెలుసుకోవాలి. కొన్ని స్టార్టప్ సంస్థలు భారీ స్థాయిలో పే ప్యాకేజీ ప్రకటించినా.. అందులో 40 నుంచి 50 శాతం మాత్రమే నగదు రూపంలో ఇస్తున్నాయి. మిగతా మొత్తాన్ని ఈక్విటీలు, స్టాక్ ఆప్షన్స్ కేటాయింపు రూపంలో అందిస్తున్నాయి. కాబట్టి ఔత్సాహిక అభ్యర్థులు.. తమ వాస్తవ అవసరాలు, కంపెనీలు అందించే ప్యాకేజీ తీరుతెన్నుల గురించి తెలుసుకోవాలి. నగదు రూపంలో అందించే మొత్తం తమ అవసరాల మేరకు ఉందని భావిస్తేనే ఆఫర్‌ను అంగీకరించడం మేలు. స్టార్టప్ జాబ్.. సవాలే! స్టార్టప్ సంస్థలంటే అప్పుడే మొగ్గ తొడిగిన కంపెనీలు. ఉత్పత్తులు, సేవల గురించి లక్ష్యాలు నిర్దిష్టంగా ఉన్నప్పటికీ.. వాటి అమలు, కార్యాచరణ అంతా ప్రాథమిక దశలోనే ఉంటుంది. జీరో నుంచి పని మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి స్టార్టప్ కంపెనీలో పనిచేయడం సవాల్‌తో కూడుకున్న వ్యవహారం. కంపెనీలు సైతం తాము ఆఫర్ ఇచ్చిన అభ్యర్థుల నుంచి ఎంతో ఎక్కువగా ఆశిస్తాయి. నిజమైన ఆసక్తి ఉంటేనే, పని ఒత్తిడిని తట్టుకోగలమనుకుంటేనే స్టార్టప్ సంస్థల ఆఫర్‌ను ఆమోదించాలి. అంతేకాకుండా తమకున్న సబ్జెక్ట్ స్కిల్స్ సంస్థ జాబ్ ప్రొఫైల్‌కు సరితూగుతాయో లేదో ముందుగానే అంచనా వేసుకొని అడుగేయాలి. నిత్యనూతనంగా ఉండాలి కొత్తగా ప్రారంభమైన కంపెనీలో సీఈఓ నుంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్ వరకూ.. అందరూ కలివిడిగా పని చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన జాబ్ ప్రొఫైల్‌ను మాత్రమే కాకుండా అందరూ అన్ని రకాల పనులు చేయాల్సి ఉంటుంది. మారుతున్న మార్కెట్ పరిస్థితులను నిరంతరం అంచనా వేయడం.. పోటీదారుల నుంచి ఎదురవుతున్న సవాళ్లను గుర్తించడం.. వ్యూహ, ప్రతివ్యూహాలు రూపొందించడం వంటి విధులు నిర్వర్తించాలి. సంస్థ కార్యకలాపాలను నిర్వహించడంలో సృజనాత్మకతను వెలికి తీసే నైపుణ్యం అవసరం. ఇతరుల కంటే తమ సంస్థ ప్రొడక్ట్స్ బెస్ట్ అని వినియోగదారుల్లో అభిప్రాయం ఏర్పడేలా వ్యూహాలు, పథకాలు రచించాలి. ముఖ్యంగా మార్కెటింగ్ ప్రొఫైల్ ఆఫర్స్ అందుకున్న అభ్యర్థులకు ఇది ఎంతో అవసరం. కాబట్టి స్టార్టప్ కంపెనీలో చేరేటప్పుడు అన్ని ప్రతికూలతలు, సానుకూలతలను బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలన్నది నిపుణుల సలహా!! స్టార్టప్ జాబ్స్.. కీ డొమైన్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ∙డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ∙ఎస్ఈఓస్ ∙కోడింగ్ ఎక్స్పర్ట్స్ ∙సాఫ్ట్వేర్ డెవలపర్స్ ∙డేటా సైంటిస్ట్స్ ∙ప్రోగ్రామ్ డెవలప్మెంట్ మేనేజర్స్ ∙వెబ్ డిజైనర్స్, యాప్ డెవలపర్స్ ∙బిజినెస్ స్ట్రాటజీ ఎగ్జిక్యూటివ్స్ ∙సోషల్ నెట్వర్క్ స్పెషలిస్ట్స్ స్టార్టప్ జాబ్స్ సానుకూలతలు అభ్యర్థుల నైపుణ్యాలు, సృజనాత్మకతను వెలుగులోకి తెచ్చేందుకు ఎంతో అవకాశం. తాము చేసిన పనికి వెనువెంటనే ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. ఆసక్తికి అనుగుణంగా పని చేసే అవకాశం (ఫ్లెక్సిబుల్ వర్క్ ఎన్విరాన్మెంట్) ఉంటుంది. స్వీయ సామర్థ్యాలను పెంపొందించుకునే అవకాశం. వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసే అవకాశం. ఇది ఎంఎన్సీ జాబ్స్‌లో లభించడం కొంత కష్టమే. స్టార్టప్ జాబ్స్ ప్రతికూలతలు సంస్థ ప్రమోటర్స్కు నిర్దిష్ట వ్యూహం లేకపోతే ఉద్యోగుల భవితవ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్రారంభంలో నిర్దిష్ట పని వేళలని లేకుండా.. 24్ఠ7 విధానంలో పనిచేయాల్సిన పరిస్థితి. ఎంఎన్సీల మాదిరిగా కొత్త టెక్నాలజీలపై వ్యవస్థాగతంగా శిక్షణ ఉండదు. అభ్యర్థులే స్వీయ శిక్షణ ద్వారా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. వేతనాల పరంగా ఎంఎన్‌సీలతో పోల్చితే తక్కువ ప్యాకేజ్‌లు. వినియోగదారులను ఆకట్టుకోవడంలో కొంత ఇబ్బంది. తమ సంస్థను మెప్పించడంలో ప్రారంభంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు సైతం ఎదురవుతాయి. -
ఆన్లైన్ ‘పరీక్ష’లో విజయానికి...
ఎగ్జామ్ టిప్స్ ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది.. అన్ని విభాగాల మాదిరిగానే చదువు, పోటీ పరీక్షలు కూడా ‘ఆన్లైన్’ బాటలో నడుస్తున్నాయి. ఐబీపీఎస్, ఆర్ఆర్బీ వంటి ఉద్యోగ నియామక పరీక్షలతో పాటు క్యాట్, గేట్ వంటి ప్రవేశ పరీక్షలూ ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఆన్లైన్ పరీక్షల వల్ల ఉపయోగాలతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. వీటిని అధిగమించడానికి మార్గాలు.. అభ్యర్థులు మొదట ఆన్లైన్ పరీక్ష విధానంపై అవగాహన పెంపొందించుకోవాలి. దరఖాస్తు విధానం, పరీక్ష కేంద్రాలు, స్లాట్ బుకింగ్, ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్, పరీక్ష విధానం తదితరాల గురించి ముందే తెలుసుకోవాలి. లేకుంటే పరీక్ష రోజు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మాక్ టెస్ట్‌లు కీలకం వీలైనన్ని ఎక్కువ ఆన్లైన్ మాక్‌టెస్ట్‌లు రాయాలి. దీనివల్ల ఆన్లైన్ పరీక్షపై పూర్తిస్థాయి అవగాహన ఏర్పడుతుంది. పరీక్ష సమయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్, ఎస్సే... ప్రశ్నలకు ఆన్లైన్లో సమాధానాలు ఎలా రాయాలో తెలుస్తుంది. తరచూ ఎలాంటి తప్పులు చేస్తున్నామో తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవచ్చు. ప్రాక్టీస్ చేసేటప్పుడు సమయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. సెక్షన్ల వారీగా సమయాన్ని నిర్దేశించుకుని, ప్రాక్టీస్ చేయాలి. వేగం, కచ్చితత్వం అవసరం ప్రాక్టీస్ సమయంలోనే ప్రశ్నను వేగంగా చదివి అర్థం చేసుకుని తక్కువ సమయంలో కచ్చితమైన సమాధానం గుర్తించేలా సాధన చేయాలి. లేకపోతే ప్రశ్న పెద్దగా, క్లిష్టంగా ఉన్నప్పుడు సమయం వృథా అవ డమే కాక చివర్లో సమయం సరిపోక ఇబ్బంది పడేలా చేస్తుంది. మ్యాథమెటిక్స్, డేటా అనాలసిస్ వంటి సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే క్రమంలో.. వీలైనంతలో పెన్-పేపర్ అవసరం లేకుండా ప్రాక్టీస్ చేయాలి. మార్గదర్శకాలు చదవాలి పరీక్ష ప్రారంభానికి ముందు తప్పనిసరిగా గైడ్‌లైన్స్ చదవాలి. దీని వల్ల సమయం ఆదా చేయడం, పరీక్ష విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుస్తాయి. పరీక్ష రాసేటప్పుడు టైం కీలక పాత్ర పోషిస్తుంది. తెలివిగా ఏ ప్రశ్నకు ఎంత సమయం కేటాయించుకోవాలో నిర్ణయించుకోవాలి. పేజీ పైభాగంలో కనిపించే కౌంట్‌డౌన్ డిస్ప్లే గమనిస్తూ పరీక్ష రాయాలి. దీని వల్ల ఏ సెక్షన్‌కు ఎంత సమయం కేటాయిస్తున్నామో తెలుసుకుని జాగ్రత్త పడవచ్చు. కంప్యూటర్ విషయంలో జాగ్రత్తలు * పరీక్ష సమయానికి ముందే పరీక్షహాలుకు చేరుకుని నెట్ కనెక్షన్, కంప్యూటర్ను చెక్ చేసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే యాజమాన్యానికి తెలియజేయాలి. వైర్లెస్ ఇంటర్నెట్ కంటే కేబుల్ నెట్ కనెక్షన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. * పరీక్ష రాసేటప్పుడు ఎలాంటి నావిగేషన్ బటన్లను (బ్యాక్, హోం, ఫార్వోడ్, రీఫ్రెష్, రీలోడ్) ఉపయోగించకూడదు. * పేజీ పూర్తిగా లోడ్ అయ్యే వరకు వేచి ఉండాలి. పేజీ పూర్తిగా లోడ్ కాకుండానే పరీక్ష రాయడం ప్రారంభిస్తే కొన్ని ప్రశ్నలు మిస్ అయ్యే అవకాశం ఉంది. * ప్రతి ప్రశ్నకు సమాధానం క్లిక్ చేశాక సేవ్ చేయడం మరచిపోవద్దు. * పరీక్ష రాయడం పూర్తయితే, అన్ని ప్రశ్నలను ఒకసారి చెక్ చేసుకొని, అప్పుడు సబ్మిట్ బటన్ నొక్కాలి. * సబ్మిట్ చే సేటప్పుడు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా కొంచెం ముందుగానే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక కన్ఫర్మేషన్ పాస్వర్డ్ వచ్చే వరకు వేచి ఉండాలి. కన్ఫర్మేషన్ పాస్వర్డ్ రాకపోతే సబ్మిట్ కాలేదని అర్థం. వెంటనే ఇన్విజిలేటర్‌కి తెలియజేసి, సరిగా సబ్మిట్ అయ్యేలా చూసుకోవాలి. -
భారత రాజ్యాంగం లౌకిక స్వభావం-పరిశీలన
కాంపిటీటివ్ గెడైన్స్ పాలిటీ (గ్రూప్ 1, 2) భారతదేశం బహు మతాలకు, భిన్న సంస్కృతులకు, భాషలకు నిలయం. భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉంటూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో ఉండటం గర్వించాల్సిన విషయం. మత సామరస్యం కోసం లౌకిక రాజ్యంగా ప్రకటించడం జరిగింది. అయినా కొన్ని సందర్భాల్లో మత విశ్వాసాలకు, ఆధునిక అభివృద్ధికి, ప్రజల మనోభావాలకు మధ్య ఘర్షణ ఏర్పడుతోంది. వివిధ సందర్భాల్లో స్థానికంగా మతం రాజకీయ సమీకరణకు ప్రాతిపదిక అవుతూ వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాజ్యాంగ లౌకిక మూలాలు, ప్రకరణలు, చట్టాలను పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చాలా వరకు లౌకిక రాజ్యాలే. లౌకిక రాజ్యమంటే ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలు, పరిపాలన.. మత విశ్వాసాల ప్రాతిపదికన కాకుండా రాజ్యం, చట్టపరంగా నిర్ణయించి కొనసాగించడం. లౌకికం అంటే భౌతిక ప్రపంచం గురించి ఆలోచించడం. మనకు తెలిసిన ప్రాపంచిక విషయాలను మన అనుభవం, పరిశీలనతో వ్యాఖ్యానించడం లేదా వివరించడం. మతం మనకు తెలియని మరో లోకాన్ని గురించి ఊహించి చెప్పే ప్రయత్నం చేస్తుంది. లౌకికవాదం అనే పదాన్ని 19వ శతాబ్దానికి చెందిన సామాజిక శాస్త్రవేత్త జార్జి జాకబ్ హోలియోక్ మొదటి సారిగా వాడుకలోకి తెచ్చారు. ఈ పదం లాటిన్ భాషలోని Seculum (సెక్యులమ్) అనే పదం నుంచి ఉద్భవించింది. తరం (జనరేషన్) అని దీని అర్థం. ఆ తర్వాత వాడుకలో ప్రభుత్వాన్ని, పరిపాలనను.. మతం ముఖ్యంగా చర్చి నుంచి వేరుచేయడం.. పాలన చట్టం, రాజ్యాంగం ప్రకారం కొనసాగించడం అనే భావనలు లౌకికవాదంగా ప్రాచుర్యం పొందాయి. లౌకిక భావన, వివిధ పార్శ్వాలు లౌకిక భావనకు రాజకీయ, సామాజిక పార్శ్వాలున్నాయి. రాజకీయ కోణంలో పరిశీలించినప్పుడు లౌకికవాదం అనేది చారిత్రక నేపథ్యంలో రాజ్యానికి-చర్చికి జరిగిన సంఘర్షణ. పూర్వకాలంలో ప్రజల అన్ని విషయాలను మతం, మతాచార్యులే నిర్దేశించేవారు. రాజు కూడా వీరు చెప్పినట్లే న డుచుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కాబట్టి లౌకిక భావన అనేది రాజ్యాన్ని మత నియంత్రణ నుంచి వేరు చేసే ప్రయత్నంలో జరిగిన సంఘర్షణగా చెప్పొచ్చు. సామాజిక కోణంలో చూస్తే లౌకిక భావన అనేది ప్రజలు తమ జీవన విధానాన్ని స్వతంత్రంగా మలచుకొనే దశలో మితిమీరిన మత జోక్యాన్ని, ప్రభావాన్ని నిరసించే సామాజిక తిరుగుబాటుగా వర్ణించొచ్చు. భారతీయ భావన భిన్నం పైన ఉదహరించిన రెండు అంశాలు పాశ్చాత్య సమాజానికి సంబంధించిన పరిణామాలు. అయితే భారతదేశంలో అలా లేదు. భిన్న మతాలు, విశ్వాసాలు, జాతులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి రెండు ప్రధాన ప్రాథమ్యాలుంటాయి. మొదటిది మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయడం, రెండోది భిన్న మతాల మధ్య సామరస్యాన్ని సాధించడానికి అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పించడం. ఈ నే పథ్యంలోనే భారత రాజ్యాంగ నిర్మాతలు లౌకికతత్వాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త, భారతదేశ రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతీయ లౌకిక భావనను ఈ విధంగా వర్ణించారు. * ‘లౌకికవాదం అంటే మతరహిత సమాజం కాదు. మత వ్యతిరేకం కూడా కాదు. ప్రాపంచిక సుఖాలు అంతకంటే కాదు. విశ్వవ్యాప్తమైన ఆధ్యాత్మిక విలువలను విభిన్న మార్గాల్లో అన్వేషించడమే’. లక్షణాలు * ప్రభుత్వానికి అధికార మతం ఉండరాదు. * అన్ని మతాలకు సమాన గుర్తింపు, గౌరవం, సమాన అవకాశాలు. మత వివక్షకు తావు లేదు. * మత విశ్వాసాలను హేతుబద్ధతతో పాటించడం. మూఢ విశ్వాసాలను త్యజించడం. * న్యాయమైన, మానవీయమైన జీవన పరిస్థితులను కల్పించడం. * మతం పూర్తిగా వ్యక్తిగతం. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మాత్రమే ప్రభుత్వ జోక్యం ఉండాలి. * రాజ్యాంగ సవరణ-లౌకిక భావన ద్విగుణీకృతం లౌకికతత్వం (సెక్యులర్) అనే పదాన్ని మౌలిక రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో పొందుపరిచారు. ఈ పదం చేరికతో రాజ్యాంగాన్ని లౌకికతత్వం మరింత స్పష్టీకరించడంతోపాటు ద్విగుణీకృతం చేసింది. అంతేకాకుండా మౌలిక నిర్మాణంలో అంతర్భాగంగా పరిగణనలో ఉంది. * లౌకికతత్వం- రాజ్యాంగ ప్రకరణలు రాజ్యాంగం వివిధ ప్రకరణల్లో లౌకికతత్వాన్ని స్పష్టీకరించింది. దీనికి అనుగుణంగా పార్లమెంటు.. చట్టాలను కూడా రూపొందించింది. ప్రవేశికలో లౌకికతత్వం అనే పదం చేరిక, ప్రాథమిక హక్కులలో మత స్వేచ్ఛను గుర్తించడం, నిర్దేశిక నియమాలలో ఉమ్మడి పౌర నియమాలను ప్రస్తావించడం, ప్రాథమిక విధుల్లో పరమత సహనాన్ని ప్రతి పౌరుడు కలిగి ఉండాలని కోరడం, లౌకికతత్వానికి మచ్చుతునకలుగా చెప్పొచ్చు. వాటిని ఈ కింది విధంగా పరిశీలించొచ్చు. ప్రవేశిక - లౌకిక భావన భారత రాజ్యాంగ ఆత్మ, హృదయంగా పరిగణించే ప్రవేశికలో లౌకికం అని చేర్చడం, ప్రతి వ్యక్తికి ఆరాధన, విశ్వాసం, నమ్మకం అనే అంశాలలో స్వేచ్ఛను గుర్తించడం లౌకికతత్వానికి ప్రతీకగా పేర్కొనొచ్చు. ప్రాథమిక హక్కులు- లౌకికతత్వం రాజ్యాంగం మూడో భాగంలో మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా పేర్కొనడం విశేషంగా పరిగణించాలి. ముఖ్యంగా.. * ప్రకరణ-14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. చట్టం మూలంగా అందరికీ సమాన రక్షణ. * ప్రకరణ-15 ప్రకారం మత ప్రాతిపదికపై ప్రజల పట్ల వివక్షను నిషేధించడం. * ప్రకరణ-16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో కొన్ని మినహాయింపులు తప్ప అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం. * ప్రకరణ-25 ప్రకారం ప్రతి వ్యక్తి తన ఆత్మ ప్రబోధం మేరకు తనకు నచ్చిన మతాన్ని అవలంబించడం, ఆచరించడం, ప్రచారం చేసుకోవడం, మత మార్పును చేసుకోవడానికి స్వేచ్ఛను కల్పించడం. * ప్రకరణ-26 ప్రకారం మత సంస్థలను స్థాపించుకుని నిర్వహించుకునే హక్కును గుర్తించడం. * ప్రకరణ-27 ప్రకారం మతం ఆధారంగా పన్నులు విధించకుండా నిషేధించడం. * ప్రకరణ-28 ప్రకారం ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రత్యేక మత బోధన నిషేధించడం. * మొదలైన హక్కులు, స్వేచ్ఛలు లౌకి క తత్వానికి ఆచరణాత్మక అంశాలు. * నిర్దేశిక నియమాల్లో ప్రకరణ 44 ప్రకారం ఉమ్మడి పౌర నియమావళిని అమలు చేయాలని ప్రభుత్వానికి మార్గదర్శకత్వం చేయడం ద్వారా దేశ ఐక్యత, సమగ్రతలకు మత విశ్వాసాలు సమస్యగా పరిణమించకుండా నియంత్రించొచ్చు. రాజ్యాంగం ప్రకారం ఏ ప్రజా ప్రతినిధికి పోటీ చేయడానికైనా మతం అడ్డంకి కాదు. ఉదా: * రాష్ట్రపతి పదవికి పోటీచేయడం (ప్రకరణ-58) * ఉపరాష్ట్రపతి పదవికి పోటీచేయడం (ప్రకరణ-66) * గవర్నర్ నియామకం (ప్రకరణ-155) * పార్లమెంట్, శాసనసభలకు పోటీ చేయడం (ప్రకరణ 80, 173) మొదలైన అంశాలు. * అదేవిధంగా 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కును కల్పించడం (ప్రకరణ-325) కూడా లౌకికవాదానికి ఉదాహరణలుగా చెప్పొచ్చు. లౌకికతత్వం, వివాదాలు, సుప్రీంకోర్టు తీర్పులు రాజ్యాంగంలో లౌకిక రాజ్యం అనే పదం ప్రత్యక్షంగా పేర్కొననప్పటికీ భారతదేశం లౌకిక రాజ్యమే అని ప్రాథమిక హక్కుల్లోని ప్రకరణలు 25 నుంచి 28 వరకు స్పష్టంగా తెలియజేస్తున్నాయని సుప్రీంకోర్టు.. జేవియర్ కాలేజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసు (1974)లో తీర్పు చెప్పింది. అదేవిధంగా 1994లో ఎస్ఆర్ బొమ్మాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో లౌకికతత్వం రాజ్యాంగంలోని మౌలిక సారాంశంలో అంతర్భాగమని, లౌకికతత్వాన్ని ఉల్లంఘించే రాష్ట్రాలపై ప్రకరణ 356 ప్రకారం చర్యలు చేపట్టవచ్చని స్పష్టం చేసింది. లౌకికతత్వాన్ని సకారాత్మకంగా, నిర్మాణాత్మకంగా చూడాలని, పాఠశాలలో వివిధ మత విలువలను విద్యార్థులకు బోధించడం ద్వారా ఇతర మతాల పట్ల గౌరవాన్ని కలిగి ఉండటానికి, పరమత సహనానికి తోడ్పడుతుందని అది లౌకికతత్వానికి విఘాతం కాదని 2003లో అరుణారాయ్ వర్సెస్ ఇండియన్ యూనియన్ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రకటించింది. * లౌకికతత్వాన్ని పెంపొందించే అంశాలు * శాస్త్రీయ విద్యను, తార్కిక ఆలోచనను ప్రోత్సహించాలి. * రాజకీయాల్లో మత సంస్థలు పాల్గొనరాదు. * మత విశ్వాసాలతో కూడిన మత ప్రదర్శనలను నిషేధించాలి. * అధికార హోదాలో ఎవరూ మత ప్రదేశాలను సందర్శించరాదు. * వ్యక్తి ప్రజా జీవితంలో తాము నిర్వహించే పాత్రలో తన వ్యక్తిగత మత విశ్వాసాలను చొప్పించరాదు. ఏది ఏమైనా మొత్తానికి మత స్వేచ్ఛ, నమ్మకాలు వ్యక్తిగత ఔన్నత్యానికి, ఆధ్యాత్మిక చింతనకు తోడ్పడినంతవరకు ఫర్వాలేదు కానీ మత స్వేచ్ఛల పేరుతో మత సామరస్యానికి చేటు చేసేవారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందే. లేదంటే ప్రతి చిన్న విషయం అలజడికి కారణమై దేశ ఐక్యత, సమగ్రతకు సవాలుగా పరిణమించవచ్చు. కారల్‌మార్క్స్ అన్నట్లు మతం మత్తు మందుగా మారుతుంది. మతోన్మాదానికి దారితీస్తుంది. ఉన్మాదంగా చెలరేగుతుంది. మానవ సంస్కృతిని మింగేస్తుంది. దీనికి చరిత్రలో చాలా ఆధారాలున్నాయి. మతోన్మాద చరిత్ర ఎప్పటికీ పునరావృతం కారాదు. చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే అవి పునరావృతం అవుతాయి. లౌకికతత్వం వర్ధిల్లాలి. రాజ్యాంగ, చట్టపాలన కొనసాగాలి. - బి. కృష్ణారెడ్డి, డెరైక్టర్, క్లాస్-వన్ స్టడీ సర్కిల్ -
ఉజ్వల భవిష్యత్తుకు.. ఏవియేషన్
కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ ప్రజల ఆదాయాల్లో పెరుగుదల, విమాన ప్రయాణ చార్జీలు తగ్గడం, వ్యాపార నిర్వహణకు సంబంధించి రాకపోకలు పెరగడం, పర్యాటక రంగ అభివృద్ధి తదితర కారణాల వల్ల విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఏవియేషన్ రంగం విస్తరిస్తూ యువతకు సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అందుబాటులో ఉన్న ఏవియేషన్ కోర్సులు, వాటిని అందిస్తున్న సంస్థలు, అర్హతలు తదితర వివరాలు.. ఏవియేషన్ రంగంలో కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ కోర్సుకు క్రేజ్ ఎక్కువ. దీనికి ఫీజు కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే విజయవంతంగా కోర్సు పూర్తిచేస్తే, అత్యున్నత వేతనంతో ఉద్యోగం పొందొచ్చు. కమర్షియల్ పైలట్ కావాలనుకునే వారికి కమర్షియల్ పైలట్ లెసైన్స్ (సీపీఎల్) తప్పనిసరి. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) గుర్తింపు పొందిన సంస్థ నుంచి శిక్షణ పూర్తిచేసిన వారికి ఈ లెసైన్స్ లభిస్తుంది. తొలుత స్టూడెంట్ పైలట్ లెసైన్స్, అనంతరం ప్రైవేట్ పైలట్ లెసైన్స్, ఆ తర్వాత కమర్షియల్ పైలట్ లెసైన్స్ ఇస్తారు. అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్‌లను ప్రధాన సబ్జెక్టులుగా చదివుండాలి. ఇంటర్లో వీటిని చదవనివారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా అభ్యసించవచ్చు. ఈ కోర్సులో చేరే వారికి నిర్ణీత శారీరక, ఆరోగ్య ప్రమాణాలు ఉండాలి. అలాగే నిర్దిష్ట వయోపరిమితి కలిగి ఉండాలి. కోర్సులో ప్రవేశాలకు పైలట్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. వేతనం: కోర్సు పూర్తిచేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పైలట్ ఉద్యోగాలు పొందొచ్చు. ప్రారంభంలో రూ.5 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. కోర్సును అందిస్తున్న సంస్థలు: ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్, రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్, ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ - సికింద్రాబాద్, గవర్నమెంట్ ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ - భువనేశ్వర్, న్యూఢిల్లీ, గవర్నమెంట్ ఫ్లయింగ్ ట్రైనింగ్ స్కూల్ - బెంగళూరు, రాజీవ్‌గాంధీ అకాడమీ ఫర్ ఏవియేషన్ టెక్నాలజీ - తిరువనంతపురం, ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ - రాయ్‌బరేలీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ - గుజరాత్ క్యాబిన్ క్రూ/ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ ఇందులో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఈ కోర్సుల కాల వ్యవధి 6 నెలల నుంచి ఏడాది మధ్యలో ఉంటుంది. కోర్సులు అందిస్తున్న సంస్థలు: ఫ్రాంక్ఫిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ (కోర్సులు: డిప్లొమా ఇన్ ఏవియేషన్, హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, డిప్లొమా కోర్స ఇన్ హాస్పిటాలిటీ, ట్రావెల్ అండ్ కస్టమర్ సర్వీస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ సర్వీసెస్), ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ - గుజరాత్ (కోర్సు: క్యాబిన్ క్రూ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ - ఎయిర్ హోస్టెస్/ఫ్లైట్ స్టీవార్‌డ). అర్హతలు: ఇంటర్/+2 పూర్తిచేసిన మహిళా, పురుష అభ్యర్థులిద్దరూ అర్హులు. ఇందులో కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ సర్వీసెస్, ఇన్ ఫ్లైట్ ట్రైనింగ్, సేఫ్టీ అండ్ ఫస్డ్ ఎయిడ్ ప్రొసీజర్, ఫుడ్ అండ్ బేవరేజ్ ప్రొడక్షన్ అండ్ సర్వింగ్ తదితర అంశాలు నేర్పిస్తారు. ప్రారంభంలో వార్షిక వేతనం రూ.4 నుంచి రూ.6 లక్షలు ఉంటుంది. ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇది నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ. ఎయిర్‌క్రాఫ్ట్‌ల డిజైన్, రూపకల్పన, నిర్వహణ తదితరాలపై ఈ కోర్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇది పూర్తిచేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో చీఫ్ ఇంజనీర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. అర్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్/+2 పూర్తిచేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. ఇందులో ప్రవేశాలకు అభ్యర్థులు జాతీయ/రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. వేతనం: ప్రారంభంలో వార్షిక వేతనం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉంటుంది. సంస్థలు: జేఎన్టీయూ - కాకినాడ, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీ బాంబే, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. బీఎస్సీ ఏవియేషన్ బీఎస్సీ ఏవియేషన్ కోర్సు కాలవ్యవధి మూడేళ్లు. ఎయిర్ రెగ్యులేషన్స్, నేవిగేషన్, ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ ఇంజిన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఏవియేషన్ సెక్యూరిటీ, ఫ్లైట్ సేఫ్టీ తదితర అంశాలపై ఈ కోర్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. దీన్ని పూర్తిచేసిన వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, గ్రౌండ్ ఆపరేషన్స్ స్టాఫ్, కార్గో మేనేజ్మెంట్ స్టాఫ్, టికెటింగ్ స్టాఫ్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. అర్హత: ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్లతో ఇంటర్/+2. వేతనం: ప్రారంభంలో వార్షిక వేతనం రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుంది. ఉన్నత విద్య దిశగా కూడా వెళ్లొచ్చు. కోర్సును అందిస్తున్న సంస్థలు: ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్; ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ - సికింద్రాబాద్, ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ - రాయ్‌బరేలీ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ (ఏఎంఈ) కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. కోర్సు, ఇంటర్న్‌షిప్‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి డీజీసీఏ.. ఏఎంఈ లెసైన్స్‌ను అందిస్తుంది. ఎయిర్‌క్రాఫ్ట్‌ల తనిఖీ, నిర్వహణ, సర్వీసింగ్‌పై ఈ కోర్సు ప్రధానంగా దృష్టిసారిస్తుంది. కోర్సు పూర్తిచేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాలు పొందొచ్చు. అలాగే ఏవియేషన్, ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణ సంస్థలు, ఫ్లయింగ్ స్కూళ్లలో కూడా ఉద్యోగాలు సాధించొచ్చు. అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్ పూర్తిచేసినవారు ఈ కోర్సుకు అర్హులు. అలాగే నిర్ణీత వయోపరిమితి, వైద్య ప్రమాణాలు ఉండాలి. చివరి 6 నెలల పాటు విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేయాలి. వేతనం: ప్రారంభంలో వార్షిక వేతనం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది. కోర్సును అందిస్తున్న సంస్థలు: ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్, రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ - హైదరాబాద్, ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ - సికింద్రాబాద్. బీబీఏ ఇన్ ఏవియేషన్ మేనేజ్మెంట్ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. కోర్సు కరిక్యులంలో ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, సేఫ్టీ మేనేజ్మెంట్ తదితర అంశాలు ఉంటాయి. ఈ కోర్సును పూర్తిచేసిన వారు విమానాశ్రయాల్లో ఎయిర్పోర్ట్ మేనేజర్, అడ్మినిస్ట్రేటర్, స్టాఫ్ మేనేజర్, సేఫ్టీ ఆఫీసర్ తదితర విభాగాల్లో విధులు నిర్వర్తించొచ్చు. అర్హత : కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా గ్రూపులో ఇంటర్/+2. అందిస్తున్న సంస్థలు: ఎయిమ్ఫిల్ ఇంటర్నేషనల్ - హైదరాబాద్, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (యూపీఈఎస్) - డెహ్రాడూన్ (బీబీఏ ఏవియేషన్ ఆపరేషన్స). వేతనం: ప్రారంభంలో 3 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. ఈ కోర్సు పూర్తిచేసిన తర్వాత ఔత్సాహికులు ఎంబీఏ కూడా చేయొచ్చు. గ్రౌండ్ స్టాఫ్ మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో ఈ కోర్సులుంటాయి. ఏదైనా గ్రూపులో ఇంటర్ పూర్తి చేసిన వారు ఇందులో చేరొచ్చు. ఎయిర్పోర్ట్ స్ట్రాటజీ అండ్ ఫంక్షనింగ్, కార్గో మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్, స్టాఫ్ మేనేజ్మెంట్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ తదితర అంశాలను ఇందులో నేర్పిస్తారు. కోర్సు పూర్తిచేసిన వారు ప్రాంతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎయిర్పోర్ట్ ఇన్ఫర్మేషన్ డెస్క్, కార్గో డిపార్ట్మెంట్ మేనేజర్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. ప్రారంభంలో వార్షిక వేతనం రూ.2 లక్షల నుంచి ఉంటుంది. అయితే ఈ కోర్సు తర్వాత ఐఏటీఏ సర్టిఫికేషన్ కోసం ప్రయత్నిస్తే మెరుగైన ఫలితాలుంటాయి. కోర్సులు - అందిస్తున్న సంస్థలు: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్పోర్ట్ ఫెమిలియరైజేషన్ అండ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ (కోర్సు: ఎయిర్ కార్గో అండ్ కొరియర్ మేనేజ్మెంట్). ఇంకా ఎన్నో.. ఇవే కాకుండా డిప్లొమా ఇన్ క్యాబిన్ క్రూ అండ్ ఇన్ ఫ్లైట్ సర్వీస్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఎయిర్ కార్గో మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్, డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఎయిర్ కార్గో ప్రాక్టీసెస్ అండ్ డాక్యుమెంటేషన్, డిప్లొమా ఇన్ డొమెస్టిక్ ఎయిర్‌లైన్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ తదితర ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి కాల వ్యవధి 6 నెలల నుంచి ఏడాది వరకు ఉంటుంది. ఇంటర్ విద్యార్హతతో ఈ కోర్సులు చేయొచ్చు. నల్సార్ వర్సిటీలో.. నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్)... ఏవియేషన్ అండ్ స్పేస్లా కోర్సులను అందిస్తోంది. కోర్సుల వివరాలు... ⇒ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ (రెండేళ్లు) ⇒ మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్పేస్ అండ్ టెలీకమ్యూనికేషన్ ‘లా’స్ (రెండేళ్లు) ⇒ పీజీ డిప్లొమా ఇన్ ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ (ఏడాది) ⇒ పీజీ డిప్లొమా ఇన్ జీఐఎస్ అండ్ రిమోట్ సెన్సింగ్ లా (ఏడాది) అర్హతలు: మూడేళ్ల ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీతో పాటు సంబంధిత రంగంలో మూడేళ్ల పని అనుభవం ఉన్నవారు ఈ కోర్సుకు అర్హులు. -
పదో తరగతి తర్వాత..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి, ఇంటర్మీడియెట్ పూర్తి చేస్తున్నారు. తర్వాత ఏ కోర్సులో చేరాలి? ఏ గ్రూప్‌ను ఎంపిక చేసుకోవాలి? ఆయా గ్రూప్‌లు/కోర్సులతో ఎలాంటి ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు ఉంటాయి? ఆయా కోర్సులు ఎంచుకోవాలంటే ఉండాల్సిన లక్షణాలేమిటి? పదో తరగతి, ఇంటర్మీడియెట్‌తో కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలేవి? స్వయం ఉపాధి దిశగా అవకాశాలున్నాయా? దూరవిద్య విధానంలో కోర్సులు అభ్యసించొచ్చా? ఇలా ఎన్నో సందేహాలు విద్యార్థులు.. వారి తల్లిదండ్రుల్లో నెలకొన్నాయి. మరికొద్ది రోజుల్లో కొత్త అకడమిక్ ఇయర్ ప్రారంభం కానుంది. ఇంటర్మీడియెట్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై విద్యార్థులకొచ్చే సందేహాలకు నిపుణుల సమాధానాలు.. ఇంటర్మీడియెట్‌లో బైపీసీ గ్రూప్‌ను ఎంచుకోవాలనుకునేవారికి ఉండాల్సిన లక్షణాలేమిటి? బైపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ) అంటే.. ఎంబీబీఎస్‌లో చేరడానికి మాత్రమే అనే అభిప్రాయముంది. కానీ బైపీసీతో ఎంబీబీఎస్‌తోపాటు అనేక అవకాశాలు అందుకోవచ్చు. పరిశోధనల పట్ల ఆసక్తి, లైఫ్ సెన్సైస్ సబ్జెక్టులపై ఇష్టం, ప్రకృతి పరిశీలన, జంతువులు.. వాటి జీవన శైలి వంటి వాటిపై సహజమైన ఆసక్తి ఉన్న వారికి సరిపడే గ్రూప్ బైపీసీ. వీటన్నిటికంటే ముఖ్యంగా బైపీసీ ఎంచుకునే విద్యార్థికి కావాల్సిన లక్షణం కష్టించే తత్వం. కారణం.. బైపీసీ సబ్జెక్ట్ సిలబస్ విస్తృతంగా ఉంటుంది. అదే విధంగా ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఉండే గ్రూప్ కూడా ఇదే. కాబట్టి ప్రాక్టికల్ అప్రోచ్, ఎప్పటికప్పుడు చదివిన అంశాన్ని ప్రయోగశాలలో పరిశీలించే విధంగా సన్నద్ధత సైతం అవసరం. నేను పదో తరగతి పూర్తి చేశాను. ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ గ్రూప్‌ను ఎంపిక చేసుకోవాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి? మ్యాథ్స్‌పై ఆసక్తి, సమస్యలు-పరిష్కారాలు-వివరణలు ఇవ్వడం, భౌతిక, రసాయన శాస్త్ర సిద్ధాంతాలు, సూత్రాలు, ప్రయోగాలంటే ఇష్టపడేవారు మ్యాథ్స, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ గ్రూప్)ను ఎంపిక చేసుకోవచ్చు. థియరీ కంటే ప్రాక్టికల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న గ్రూప్.. ఎంపీసీ. ఆయా సబ్జెక్టుల్లో ఎప్పటికప్పడు పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. నిరంతర అధ్యయనం, కొత్త టెక్నాలజీలను అవగాహన చేసుకోవడం, వాటిలో నైపుణ్యం సాధించడం అనే సహజ లక్షణాలు ఎంపీసీ గ్రూప్ ఎంచుకునే విద్యార్థులకు చాలా అవసరం. ఎంపీసీలో ప్రథమ భాషగా తెలుగు లేదా సంస్కృతం, ద్వితీయ భాషగా ఇంగ్లిష్, గ్రూప్ సబ్జెక్టులుగా.. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు ఉంటాయి. ఎంపీసీ అంటే.. కేవలం ఇంజనీరింగ్‌లో చేరడం కోసమే అనే అభిప్రాయంతో ఈ గ్రూప్‌ను ఎంచుకుంటారు. కానీ ఇంటర్మీడియెట్ తర్వాత ఇంజనీరింగ్‌తోపాటు అనేక అవకాశాలు ఎంపీసీ విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం సైన్స్ పరిశోధనలకు ప్రాధాన్యం పెరుగుతుండటంతో బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీలో అడుగుపెట్టి తర్వాత ఎమ్మెస్సీ, పీహెచ్డీ వంటి కోర్సులు చేయొచ్చు. ఇంటర్మీడియెట్‌లో సీఈసీ గ్రూప్‌ను ఎంచుకోవాలనుకునేవారికి ఉండాల్సిన లక్షణాలేమిటి? సమస్యను విశ్లేషణాత్మక దృష్టితో చూసే లక్షణం; కొత్త విషయాలపై ఆసక్తి, నిరంతర అధ్యయన దృక్పథం, గణాంకాలను విశ్లేషించే నైపుణ్యం ఉన్న విద్యార్థులకు అనుకూలమైన గ్రూప్.. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స (సీఈసీ). ప్రస్తుత కార్పొరేట్ యుగంలో వ్యాపార, పారిశ్రామిక రంగాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. కామర్స్‌లో నైపుణ్యాలు పొందిన మానవ వనరుల అవసరం పెరుగుతోంది. దీన్ని అందిపుచ్చుకునేందుకు సరైన గ్రూప్.. సీఈసీ. చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ), కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్) వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో రాణించేందుకు సీఈసీ ఎంతో అనుకూలమైన గ్రూప్. ఈ గ్రూప్ ఎంచుకునే విద్యార్థులకు తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణం సహనం. చిట్టా పద్దుల్లో చిక్కుముడులను విప్పే క్రమంలో ఒక్కోసారి గంటలకొద్దీ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో సహనం కోల్పోకుండా పనిచేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యాపార రంగానికి సంబంధించి ప్రభుత్వ పరంగా జరిగే చట్టాల్లో మార్పులు, వాటి పర్యవసానాలను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకునే నైపుణ్యం కావాలి. సీఈసీ తర్వాత చాలామంది బీకాంలో చేరతారు. ఇప్పుడు బీకాంలో కూడా పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ప్రత్యేక స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. (ఉదా: బీకాం అడ్వర్టయిజింగ్, సేల్స్ అండ్ సేల్స్ ప్రమోషన్, ట్యాక్స్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఈ-కామర్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఆనర్స్ తదితర). బ్యాచిలర్ డిగ్రీలో ఇలాంటి విభిన్న స్పెషలైజేషన్లను ఎంచుకోవడం ద్వారా భవిష్యత్తులో త్వరగా స్థిరపడొచ్చు. ఇంటర్మీడియెట్ ఎంఈసీ గ్రూప్‌ను ఎంచుకోవాలంటే ఏయే స్కిల్స్ ఉండాలి? ఇటీవల కాలంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆదరణ పొందుతున్న గ్రూప్.. మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ (ఎంఈసీ). అటు మ్యాథ్స్.. ఇటు కామర్స్.. రెండిటిని ఇష్టపడేవారికి చక్కటి గ్రూప్.. ఎంఈసీ. లెక్కలు, వ్యాపారం, గణాంకాలు, ఆర్థిక అంశాలపై ఆసక్తి ఉన్నవారికి అపార అవకాశాలందిస్తున్న ఈ కోర్సుకు ప్రాధాన్యత పెరుగుతోంది. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణలతో విస్తృత ఉద్యోగావకాశాలను ఈ గ్రూప్ ద్వారా సాధించవచ్చు. మ్యాథ్స్ అంటే ఆసక్తి, ఆర్థిక వ్యవహారాలు, వాణిజ్య శాస్త్రం పట్ల మక్కువ ఉన్నవారు ఎంఈసీని ఎంపిక చేసుకోవచ్చు. ఇంటర్మీడియెట్‌లో హెచ్ఈసీ గ్రూప్‌ను ఎంపిక చేసుకునేవారికి ఎలాంటి లక్షణాలు ఉండాలి? ‘ఏ గ్రూప్‌లో సీటు రాకపోతే హెచ్ఈసీలో చేరతారు’.. ఇది సాధారణఅభిప్రాయం. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని తిరగ రాయాల్సిందే. ఎందుకంటే.. ఇంటర్మీడియెట్‌లో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ (హెచ్ఈసీ).. సుస్థిర భవిష్యత్తుకు పునాది అని చెప్పొచ్చు. ముఖ్యంగా భవిష్యత్తులో పోటీ పరీక్షల ద్వారా సివిల్స్ మొదలు గ్రూప్-4 వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు.. మేలు చేసే గ్రూప్ హెచ్ఈసీ. ఈ గ్రూప్‌లో చేరాలనుకునే విద్యార్థులకు ముఖ్యంగా ఉండాల్సిన లక్షణాలు.. రైటింగ్ స్కిల్స్, నిరంతర అధ్యయనం. విస్తృతంగా ఉండే అంశాల నుంచి కీలకమైన వాటిని గుర్తించే సునిశిత పరిశీలన దృష్టి. సామాజిక అంశాలపై అవగాహన, సమాజంలో నిరంతరం చోటుచేసుకునే పరిణామాలను తెలుసుకునే నైపుణ్యం. ఉన్నత విద్య కోణంలోనూ హెచ్ఈసీ తర్వాత అవకాశాలు అనేకం. ఒకప్పుడు హెచ్ఈసీ తర్వాత బీఏలో చేరడమే మార్గంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బీఏలోనూ విభిన్నమైన స్పెషలైజేషన్లు (ఉదా: హోటల్ మేనేజ్మెంట్, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, సోషల్ వర్క్, లిబరల్ ఆర్ట్స్ తదితర) అందుబాటులోకి వచ్చాయి. హెచ్‌ఈసీతో (ఇంటర్మీడియెట్) ఐదేళ్ల బ్యాచిలర్ ఆఫ్ లా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ(ఎంఏ)లో ప్రవేశించొచ్చు. ఐటీఐలో చేరడానికి అర్హత ఏమిటి? ఎంపిక ఎలా ఉంటుందో తెలియజేయండి? పదో తరగతి తర్వాత తక్కువ ఖర్చు, తక్కువ సమయంలోనే ఉద్యోగం/స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి మార్గం.. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటీఐ). ఐటీఐ కోర్సుల్లో రెండేళ్ల శిక్షణతో వివిధ నైపుణ్యాలు సొంతమవుతారుు. దాంతో స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం అవుతుంది. ఐటీఐ కోర్సులను పూర్తిచేసిన వారికి నేడు ఉపాధికి ఢోకాలేదు. వెల్డర్, ఫిట్టర్, ప్లంబర్, టర్నర్ వంటి కోర్సులతోపాటు తాజాగా విభిన్న నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చే అంశాలపై ఐటీఐలు దృష్టిసారించారుు. పదో తరగతి మార్కుల ఆధారంగా వీటిలో చేరొచ్చు. జూలై/ఆగస్టుల్లో ప్రవేశాలుంటాయి. ఐటీఐలో ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయి? ఐటీఐల్లో రెండేళ్ల వ్యవధి ఉన్న ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, రేడియో అండ్ టెలివిజన్, డ్రాఫ్ట్స్‌మెన్ మెకానికల్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, వైర్‌మెన్, మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్, అటెండెంట్ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్, డీజిల్ మెకానిక్, ప్లంబర్, వెల్డర్, కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, ఫోర్జర్ అండ్ హీట్‌ట్రీటర్, మాసన్ (బిల్డింగ్ కనస్ట్రక్షన్) తదితర కోర్సులు ఉన్నాయి. నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్స్: స్టెనోగ్రఫీ, సెక్రెటేరియల్ ప్రాక్టీస్, డ్రెస్మేకింగ్, కట్టింగ్ అండ్ టైలరింగ్, బుక్ బైండింగ్, హ్యాండ్ కంపోసర్, కార్పెట్ వేవింగ్. ఈ కోర్సులే కాకుండా ఎప్పటికప్పుడు మార్కెట్/కంపెనీల అవసరాలకనుగుణంగా కొత్త కోర్సులు, జాబ్ ఓరియెంటెడ్ కోర్సులను ఐటీఐలు అందిస్తున్నాయి. పదో తరగతి పూర్తి చేశాను. స్వయం ఉపాధి దిశగా స్థిరపడాలంటే స్వల్పకాలిక శిక్షణ కోర్సులు అందించే సంస్థల వివరాలు తెలపండి? సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ టిన్స్విటీస్ (సెట్విన్).. యువతకు స్వయం ఉపాధి కోర్సులను అందిస్తోంది. ఎంఎస్ ఆఫీస్, డెస్క్‌టాప్ పబ్లిషింగ్, మల్టీమీడియా, వెబ్ డిజైనింగ్, కంప్యూటర్ హార్డ్‌వేర్, ఎయిర్‌లైన్ టికెటింగ్, ఆఫీస్ ఆటోమేషన్ ప్రోగ్రామ్, ఆటో ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, రేడియో అండ్ టీవీ మెకానిక్, టైప్ రైటింగ్, టెలిఫోన్ ఆపరేటర్, కటింగ్ అండ్ టైలరింగ్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి కోర్సులను సెట్విన్ ఆఫర్ చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెట్విన్ కేంద్రాలు ఉన్నాయి. సెట్విన్ మాత్రమే కాకుండా స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్-భూదాన్ పోచంపల్లి(నల్గొండ జిల్లా), మైక్రోస్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్(ఎంఎస్ఎంఈ)- హైదరాబాద్ వంటి సంస్థలు అటు స్వయం ఉపాధిని, ఇటు ఏదైనా ఉద్యోగాన్ని పొందేలా వివిధ కోర్సులందిస్తున్నాయి. వీటిల్లో ఇన్స్టిట్యూట్ను బట్టి హోటల్ మేనేజ్మెంట్, బ్యూటీషియన్, సెల్‌ఫోన్ రిపేరింగ్, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, రేడియో అండ్ టీవీ మెకానిజం, జ్యుయెలరీ మేకింగ్, కార్పెంటరీ, డీటీపీ, వెబ్ డిజైనింగ్, ఎంఎస్ ఆఫీస్, మల్టీమీడియా, కంప్యూటర్ హార్డ్‌వేర్, ఎయిర్‌లైన్ టికెటింగ్, కాల్‌సెంటర్ ట్రైనింగ్, గోల్డ్ పాలిషింగ్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల కాల వ్యవధి కోర్సును బట్టి మూడు నెలల నుంచి ఏడాది వరకు ఉంటుంది. పాలిటెక్నిక్ కోర్సులతో ప్రయోజనాలేమిటి? ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయి? పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలిసెట్ రాయాలి. ఇందులో ర్యాంకు ద్వారా మూడేళ్లు/మూడున్నరేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆటోమొబైల్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ తదితర ఇంజనీరింగ్ బ్రాంచ్‌లలో డిప్లొమా చేయొచ్చు. డిప్లొమా ఉత్తీర్ణులు ఈసెట్ ద్వారా బీటెక్‌లో రెండో సంవత్సరంలో ప్రవేశించొచ్చు. డిప్లొమా ఇంజనీరింగ్ ఉత్తీర్ణులను పలు ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు ట్రైనీ సూపర్వైజర్లుగా నియమించుకుంటున్నాయి. అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీ పాలిటెక్నిక్ కోర్సుల గురించి తెలపండి? పదో తరగతి ఉత్తీర్ణతతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్రికల్చర్ పాలిటెక్నిక్, వెటర్నరీ పాలిటెక్నిక్, ఫిషరీ పాలిటెక్నిక్, హార్టికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులు అభ్యసించే వీలుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, శ్రీ పి.వి.నరసింహారావు తెలంగాణ స్టేట్ వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఈ కోర్సులు అందిస్తున్నాయి. అగ్రి పాలిటెక్నిక్‌లో భాగంగా రెండేళ్ల డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, మూడేళ్ల డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సులున్నాయి. హార్టికల్చర్‌లో భాగంగా రెండేళ్ల డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్సు అందుబాటులో ఉంది. వెటర్నరీ పాలిటెక్నిక్‌లో భాగంగా డిప్లొమా ఇన్ యానిమల్ హజ్బెండరీ, డిప్లొమా ఇన్ ఫిషరీ పాలిటెక్నిక్ కోర్సులున్నాయి. కోర్సుల వ్యవధి రెండేళ్లు. ప్రస్తుతం ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటనలు వెలువడ్డాయి. దరఖాస్తుకు సమయం ఉంది. మరిన్ని వివరాల కోసం ఆయా యూనివర్సిటీల వెబ్‌సైట్స్ చూడొచ్చు. పదో తరగతి అర్హతతో కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు తెలపండి? సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్‌లో కానిస్టేబుల్స్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స (సీఐఎస్ఎఫ్), సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), ఎస్ఎస్ఎఫ్, సెంట్రల్ రిజర్వ పోలీస్ ఫోర్స (సీఆర్పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స (బీఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స (ఐటీబీపీ)లలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లో రైఫిల్మెన్స అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. వయోపరిమితి: 18 నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజుర్మెంట్స్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టె స్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష విధానం: వంద మార్కులకు నిర్వహించే పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. జనరల్ ఇంటెలిజెన్స అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్‌జ అండ్ జనరల్ ఎవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ లేదా హిందీలో నాలుగు విభాగాల నుంచి 25 మార్కుల చొప్పున 25 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. వెబ్‌సైట్స్: www.cisf.gov.in, www.ssb.nic.in, www.nia.gov.in, www.http://bsf.nic.in, http://crpf.nic.in, http://itbpolice.nic.in, www.assamrifles.gov.in ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎంపిక విధానం: ఫిజికల్ టెస్ట్, రాత పరీక్షల ద్వారా వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్లు ప్రకటన: రైల్వే ఉద్యోగాల భర్తీకి ఏడాదిలో చాలాసార్లు ప్రకటనలు వెలువడుతూనే ఉంటాయి. ఈ మధ్య వివిధ రైల్వే జోన్లు ఖాళీలను ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తున్నాయి. ప్రకటనలు ఠీఠీఠీ.టటఛిఛ.జౌఠి.జీ వెబ్సైట్లో లేదా ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో చూడొచ్చు. డిఫెన్స్ జాబ్స్.. ఇండియన్ నేవీలో.. పోస్టులు: మెట్రిక్ రిక్రూట్-స్టివార్డ్/కుక్స్; మ్యుజీషియన్లు. వయోపరిమితి: 17-21 ఏళ్లు. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. వెబ్సైట్: www.nausena-bharti.nic.in ఇండియన్ ఆర్మీలో.. పోస్టు: సోల్జర్ జనరల్ డ్యూటీ అర్హత: 45 శాతం మార్కులతో దో తరగతి. వయోపరిమితి: 171/2న్నర నుంచి 21 ఏళ్లు. ఎంపిక విధానం: రాతపరీక్ష, హదారుఢ్య, వైద్య ఆరోగ్య పరీక్షల ద్వారా. వెబ్సైట్: http://indianarmy.nic.in ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో.. పోస్టు: ఎయిర్‌మెన్ గ్రూప్-వై మ్యుజీషియన్ ట్రేడ్ అర్హత: పదోతరగతిలో 45 శాతం మార్కులు. వయసు: 17 నుంచి 25 ఏళ్ల వరకు ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్‌ల ద్వారా. సంబంధిత సంగీత పరికరంలో ప్రావీణ్యం ఉండాలి. వెబ్సైట్: http://careerairforce.nic.in ఏపీఎస్ఆర్టీసీ/టీఎస్ఆర్టీసీలో.. పోస్టు: బస్ కండక్టర్ ఎంపిక విధానం: పదోతరగతి మార్కుల ఆధారంగా.. పోస్టు: బస్ డ్రైవర్ ఇతర అర్హతలు: హెవీ మోటార్ వెహికల్ పర్మినెంట్ డ్రైవింగ్ లెసైన్స్‌తోపాటు నిర్దేశిత అనుభవం తప్పనిసరి. ఆసక్తికి అనుగుణంగా ఇంటర్లో ఏ గ్రూపులో చేరినప్పటికీ, మొదట్నుంచి అకడమిక్‌గా ముందుండటానికి ప్రయత్నించాలి. భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా ఆయా ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలకు ప్రిపరేషన్ కొనసాగించాలి. ఏదో ఒక కారణం చెప్పి, సబ్జెక్టుల అధ్యయనాన్ని వాయిదా వేసే ధోరణి సగటు విద్యార్థిలో కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఏ రోజు పాఠాలను ఆ రోజే పూర్తిచేయాలి. తమ గ్రూప్ సబ్జెక్టులకు సంబంధించిన అంశాల అప్లికేషన్స్‌పై పూర్తిస్థాయిలో పట్టు సాధించడం ముఖ్యం. కాలేజీ సమయాన్ని మినహాయించి, రోజుకు 4-5 గంటలు కష్టపడి చదివినప్పుడే లక్ష్యాలను చేరుకునేందుకు వీలవుతుంది. - ఎం.ఎన్.రావు, సీనియర్ ఫ్యాకల్టీ, శ్రీచైతన్య విద్యాసంస్థలు. -
ఇంటర్ తర్వాత...
ఇంటర్మీడియెట్ ఎంపీసీ తర్వాత ఉన్నతవిద్య పరంగా ఎలాంటి అవకాశాలుంటాయి? ♦ అత్యున్నత విద్యావకాశాలు అందించే గ్రూప్.. మ్యాథ్స, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ). ఇంటర్మీడియెట్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ (ఇంజనీరింగ్) రాసి.. వివిధ బ్రాంచ్‌ల్లో బీటెక్, బీఫార్మసీ, బీటెక్(అగ్రి ఇంజనీరింగ్), బీటెక్(బయోటెక్నాలజీ), బీటెక్(డెయిరీ టెక్నాలజీ), బీటెక్(ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ), ఫార్మ్‌డి వంటి కోర్సులు అభ్యసించొచ్చు. ఫార్మ్‌డి మినహాయించి మిగిలిన కోర్సుల వ్యవధి నాలుగేళ్లు. ఫార్మ్‌డి వ్యవధి ఆరేళ్లు. ♦ జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ విద్యకు మేటి సంస్థలుగా పేరొందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీలు)లలో నాలుగేళ్ల బీటెక్, ఐదేళ్ల డ్యుయెల్ డిగ్రీ (ఇంజనీరింగ్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ వంటి కోర్సులు చదవొచ్చు. దీనికోసం జాతీయస్థాయిలో ప్రతి ఏటా ఏప్రిల్/మేలలో జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ నిర్వహిస్తారు. ♦ సైన్స్ సంబంధిత కోర్సులను అందించడంలో దేశంలోనే పేరుగాంచిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)లో నాలుగేళ్ల బీఎస్ (రీసెర్చ్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)లలో ఐదేళ్ల బీఎస్-ఎంఎస్ డ్యుయెల్ డిగ్రీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (నైసర్)-భువనేశ్వర్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ వంటి కోర్సులు చదివే వీలుంది. ఇన్స్టిట్యూట్ను బట్టి జాతీయస్థాయిలో జరిగే ప్రవేశపరీక్ష/జేఈఈ అడ్వాన్స్డ్ తదితర మార్గాల ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ♦ దేశంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ వంటివాటితోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ వంటివి ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణతతో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు అందిస్తున్నాయి. ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ♦ ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణతతో బీఏ(మ్యాథ్స్), బీఎస్సీ(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ), బీఎస్సీ(బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ), బీఎస్సీ(మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్), బీఎస్సీ(మ్యాథ్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్), బీఎస్సీ(మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్) వంటి కాంబినేషన్లతోపాటు బీఏ/బీకాం వంటి కోర్సులు చదివే వీలుంది. బీఏలో ఎకనామిక్స్ చదవడం కుదరదు. ఇంటర్లో ఎకనామిక్స్ చదివినవాళ్లే అర్హులు. బీఏ/బీఎస్సీ/బీకాం కోర్సుల వ్యవధి: మూడేళ్లు. ♦ బీటెక్ /బీఏ /బీఎస్సీ/బీకాం కోర్సులు పూర్తిచేస్తే సంబంధిత సబ్జెక్టులు/స్పెషలైజేషన్‌తో ఎంటెక్/ఎంఏ/ఎంఎస్సీ/ఎంకాం/ఎంబీఏ వంటి కోర్సులు అభ్యసించొచ్చు. దేశంలో దాదాపు అన్ని యూనివర్సిటీలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఎంటెక్/ఎంబీఏ మినహాయించి మిగిలిన కోర్సులకు ఆయా వర్సిటీల ప్రవేశపరీక్షలు రాయాలి. ఎంటెక్కు గేట్/పీజీఈసెట్, ఎంబీఏకు క్యాట్/మ్యాట్/గ్జాట్/సీమ్యాట్/ఆత్మా వంటి పరీక్షల్లో ర్యాంకు సాధించాలి. ఇంటర్మీడియెట్ ఎంపీసీ తర్వాత చదువుకుంటూ ఉద్యోగం చేసే వీలుందా? ఇంటర్మీడియెట్ ఎంపీసీ తర్వాత చదువుకుంటూ ఉద్యోగం చేసే వీలుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏటా రెండుసార్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ ఎగ్జామ్ (ఎన్డీఏ అండ్ ఎన్ఏ) నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా త్రివిధ దళాలైన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ల్లో కమిషన్డ్ అధికారిగా అడుగుపెట్టే వీలుంది. అవాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. నోటిఫికేషన్లో ప్రకటించిన తేదీనాటికి నిర్దేశిత వయసును కలిగి ఉండాలి. ప్రవేశపరీక్ష, సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి మూడేళ్లపాటు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో నెలకు రూ.21,000 స్టైఫండ్ లభిస్తుంది. తర్వాత బీఎస్సీ/బీఎస్సీ (కంప్యూటర్స్)/బీఏ సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు. 10+2 కేడెట్ ఎంట్రీ స్కీమ్ అభ్యర్థులకు ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ)- ఎజిమలలో నాలుగేళ్లు శిక్షణ ఇచ్చి బీటెక్ ప్రదానం చేస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని అభ్యర్థి ఎంచుకున్న విభాగాన్ని బట్టి త్రివిధ దళాల్లో కమిషన్డ్ ఆఫీసర్‌గా నియమిస్తారు. నెలకు రూ.35 వేల వేతనంతో కెరీర్ ఆరంభమవుతుంది. ఇంకా గ్రేడ్ పే, హెచ్ఆర్ఏ, ఇన్సూరెన్స్, పెన్షన్ తదితర సదుపాయాలుంటాయి. ♦ దూరవిద్యతో అవకాశం: ఇంటర్మీడియెట్ తర్వాత ఉన్నత చదువులకు ఆటంకాలు ఏర్పడితే ఏదైనా ఉద్యోగం చేస్తూ దూరవిద్య విధానం ద్వారా బీఏ/బీకాం/బీఎస్సీ వంటి కోర్సులు చదువుకునే వీలుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం-తిరుపతి, ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) దూరవిద్య విధానంలో కోర్సులు అందిస్తున్నాయి. ఏటా జనవరి నుంచి జూలై మధ్యలో ఆయా నోటిఫికేషన్లు వెలువడతాయి. ఇంటర్మీడియెట్ ఎంఈసీ పూర్తిచేస్తే ఉన్నతవిద్య పరంగా ఎలాంటి అవకాశాలుంటాయి? ♦ ఇంటర్లో ఎంఈసీ పూర్తి చేయడం ద్వారా.. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ) మ్యాథ్స్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్(బీకాం) (జనరల్ /ఈ-కామర్స్ /కంప్యూటర్స్ /ఫైనాన్షియల్ మార్కెట్స్); బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బీబీఏ); బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్(బీబీఎం), బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(బీసీఏ), ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంఏ(ఎకనామిక్స్), ఇంటిగ్రేటెడ్ ఎంకాం(వ్యవధి:ఐదేళ్లు)లలో చేరొచ్చు. ♦ బీఏ/బీకాం తర్వాత మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ), పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ (పీజీడీఎం) చదివి సంస్థల నిర్వహణలో కీలకపాత్ర పోషించొచ్చు. తద్వారా మేనేజ్మెంట్ నిపుణులుగా ఎదగొచ్చు. మరోవైపు భారీ వేతనాలను అందిస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ), కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్) వంటి జాబ్ గ్యారెంటీ కోర్సులు చదవొచ్చు. ఏ కంపెనీకైనా వీరి అవసరం ఉంటుంది. ఇంటర్మీడియెట్ హెచ్ఈసీ పూర్తి చేశాను. బ్యాచిలర్ డిగ్రీలో బీఏ చదవాలనుకుంటున్నాను. బీఏలో ఏయే కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి? ♦ ఇంటర్మీడియెట్‌లో ఏ గ్రూపు ఉత్తీర్ణులైనా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ)లో చేరొచ్చు. ఇందులో భాగంగా వివిధ కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి. అవి.. ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్; హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్; హిస్టరీ, సోషియాలజీ, జాగ్రఫీ; సైకాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ; సైకాలజీ, సోషియాలజీ, మార్కెటింగ్; సైకాలజీ, ఇంగ్లిష్ లిటరేచర్, ఫిలాసఫీ; సోషియాలజీ, ఉర్దూ, పర్షియన్; హిస్టరీ, హిందీ, సంస్కృతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రభుత్వ కళాశాలలు, కొన్ని ప్రైవేటు కళాశాలల్లో ఈ కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలను లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులు వీటిని ఎంచుకుంటున్నారు. ఆయా పరీక్షల్లో కూడా ఈ నేపథ్యం ఉపకరిస్తోంది. దీంతో బీఏ కోర్సుకు ఆదరణ పెరుగుతోంది. ♦ ఇంటర్మీడియెట్ సీఈసీ పూర్తయింది. బీకాం చేయాలనుకుంటున్నాను. ఇందులో ఏయే స్పెషలైజేషన్లు ఉన్నాయి? ఆర్థిక, వాణి జ్య రంగాల విస్తరణ, కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో బీకాం కోర్సుల అభ్యర్థులకు చక్కటి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. మార్కెట్/కంపెనీ అవసరాలకనుగుణంగా బీకాంలో వివిధ స్పెషలైజేషన్లను ఆయా విద్యా సంస్థలు ప్రవేశపెట్టాయి. రెగ్యులర్ బీకాంతోపాటు బీకాం ఈ-కామర్స్ /హానర్స్ /ఫైనాన్షియల్ మార్కెట్స్ /కంప్యూటర్స్ /బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ /ట్యాక్సేషన్ /మార్కెటింగ్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటికి జాబ్ మార్కెట్లో మంచి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. బీకాం పూర్తయిన తర్వాత సంబంధిత అంశంలో ఎంకాం కూడా పూర్తిచేసే వీలుంది. ఇంటర్మీడియెట్ బైపీసీ కోర్సు పూర్తయిన తర్వాత ఉన్నత విద్య అవకాశాలు ఎలా ఉంటాయి? ♦ ఇంటర్మీడియెట్ బైపీసీ పూర్తిచేసినవారు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ రాసి బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (ఎంబీబీఎస్), బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్), బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (బీఏఎంఎస్), బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ అండ్ మెడిసిన్ సర్జరీ (బీహెచ్ఎంఎస్), బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సెన్సైస్ (బీఎన్‌వైఎస్), బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (హార్టికల్చర్), బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ(బీవీఎస్సీ అండ్ ఏహెచ్), బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సెన్సైస్ (బీఎఫ్ఎస్సీ), బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ), బీఫార్మసీ, బీటెక్ (బయోటెక్నాలజీ), ఫార్మ్‌డి వంటి కోర్సులు అభ్యసించొచ్చు. ♦ ఇవే కాకుండా ఇంటర్మీడియెట్ బైపీసీ మార్కుల ఆధారంగా పారామెడికల్ కోర్సుల్లో చేరొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పారామెడికల్ బోర్డులు ఈ కోర్సులు నిర్వహిస్తున్నాయి. రెండేళ్ల వ్యవధి గల ఈ కోర్సుల్లో డిప్లొమా ఇన్.. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ/మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ/ఆఫ్తల్మాలిక్ అసిస్టెంట్/డయాలసిస్ టెక్నాలజీ /రెస్పిరేటరీ థెరపీ/మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ/పర్ఫ్యూషన్ టెక్నాలజీ/రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్/డార్క్‌రూమ్ అసిస్టెంట్/కార్డియాలజీ టెక్నీషియన్/క్యాత్ ల్యాబ్ టెక్నాలజీ/ఈసీజీ టెక్నీషియన్/అనస్థీషియా టెక్నీషియన్/ఆడియోమెట్రీ టెక్నీషియన్/ఆప్టోమెట్రీ టెక్నీషియన్/రేడియోథెరపీ టెక్నాలజీ/మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తిచేయడం ద్వారా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అవకాశాలు దక్కించుకోవచ్చు. ♦ పారామెడికల్ కోర్సులే కాకుండా బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ(బీపీటీ), బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ(బీఎంఎల్టీ), బీఎస్సీ(నర్సింగ్) వంటి కోర్సుల్లోనూ ఇంటర్ బైపీసీ మార్కుల ఆధారంగా చేరొచ్చు. ♦ బ్యాచిలర్ ఆఫ్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ (బీయూఎంఎస్) కోర్సులో ప్రవేశానికి ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ♦ బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఈ కోర్సులు అభ్యసించిన విద్యార్థులు పీజీ స్థాయిలో సంబంధిత విభాగాల్లో ఎంఎస్/ఎండీ/సూపర్ స్పెషాలిటీ/డిప్లొమా/ఎంఎస్సీ వంటి కోర్సులు చదవచ్చు. ఇంటర్మీడియెట్ ఎంపీసీతో ఇండియన్ ఆర్మీలో ఏయే ఉద్యోగాలు ఉంటాయి? ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణతతో ఇండియన్ ఆర్మీలో వివిధ ఉద్యోగాలు ఉన్నాయి.. ♦ సోల్జర్స్ (టెక్నికల్) (టెక్నికల్ ఆర్మ్స్, ఆర్టిలరీ, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్): 50 శాతం మార్కులతో 10+2/ఇంటర్మీడియెట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లిష్) ఉత్తీర్ణత. ప్రతి సబ్జెక్టులో 40 శాతం మార్కులు తప్పనిసరి. 171/2-231/2 వయసు ఉన్నవారు అర్హులు. నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి. ♦ సోల్జర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్ (అన్ని ఆర్మ్స్): 50 శాతం మార్కులతో 10+2/ ఇంటర్మీడియెట్ (ప్రతి సబ్జెక్టులో 40 శాతం మార్కులు పొందాలి) ఉత్తీర్ణత. 17 1/2-23 1/2 వయసు ఉన్నవారు అర్హులు. నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి. ♦ పర్మినెంట్ కమిషన్ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్: అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. నిర్దేశిత తేదీనాటికి 16 1/2 నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి. 70 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణులు అర్హులు. నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి. సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్ఎస్బీ) ద్వారా ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారు ఐదేళ్లు శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపడతారు. నెలకు అన్ని కలుపుకొని రూ.65 వేల వేతనం చెల్లిస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది జూన్ 30. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో జాతీయస్థాయిలో ఉన్న ఉద్యోగావకాశాలేమిటి? ♦ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో లోయర్ డివిజన్ క్లర్క్స్(ఎల్డీసీ), డేటా ఎంట్రీ ఆపరేటర్స్(డీటీపీలు), పోస్టల్ అసిస్టెంట్స్, సార్టింగ్ అసిస్టెంట్స్ భర్తీకి జాతీయస్థాయిలో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నిర్వహించే పరీక్ష.. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ (10+2). ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై, నిర్దేశిత తేదీ నాటికి 18-27 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. ప్రవేశ పరీక్ష, టైపింగ్ టెస్ట్/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి రూ.5200-రూ.20200 వేతన శ్రేణితో కెరీర్ ప్రారంభమవుతుంది. ♦ స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామినేషన్: వివిధ కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర విభాగాల్లో స్టెనోగ్రాఫర్స్ పోస్టుల భర్తీకి ఏటా ఎస్ఎస్సీ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ ఏడాదికి ప్రకటన వెలువడింది. ఇంటర్మీడియెట్ పూర్తిచేసి ఆగస్టు 1, 2016 నాటికి 18-27 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. రాత పరీక్ష, స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. జూలై 31న పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణతతో ఇండియన్ నేవీలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? ♦ ఆర్టిఫిషర్ అప్రెంటీస్ సెయిలర్: నిర్దేశిత తేదీ నాటికి 17-20 ఏళ్ల మధ్యలో ఉండాలి. అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి. రాతపరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ♦ సీనియర్ సెకండరీ రిక్రూట్స్: 17-21 ఏళ్ల మధ్య వయసు ఉన్న అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి.రాతపరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది. గంట వ్యవధిలో జరిగే రాత పరీక్ష ఇంగ్లిష్/హిందీల్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే ఈ పరీక్షలో ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్‌లపై ప్రశ్నలు ఉంటాయి. రాతపరీక్షలో ఉత్తీర్ణులను శారీరక సామర్థ్య పరీక్షకు ఎంపిక చేస్తారు. ♦ నోటిఫికేషన్లు: ఏటా డిసెంబర్/జనవరి; జూన్/జూలైల్లో ఎంప్లాయ్మెంట్ న్యూస్, జాతీయ, ప్రాంతీయ దినపత్రికల్లో ప్రకటనలు వెలువడుతుంటాయి. ఇంటర్మీడియెట్ లో సీఈసీ/హెచ్ఈసీ పూర్తిచేసిన తర్వాత ఉన్నత విద్యపరంగా ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఇంటర్మీడియెట్‌లో సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ (సీఈసీ), హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ (హెచ్ఈసీ) గ్రూప్‌ను ఎంచుకున్నవారికి తర్వాత ఉన్నతవిద్య పరంగా మంచి అవకాశాలుంటాయి. ♦ రెండేళ్ల ఇంటర్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదేళ్ల బీఏఎల్ఎల్బీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (లాసెట్) రాయొచ్చు. జాతీయస్థాయిలో లా కోర్సుల్లో ప్రవేశానికి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) రాయాలి. ♦ ఉపాధ్యాయ వృత్తి అంటే ఇష్టమున్నవారు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈడీ) కోర్సుల్లో చేరొచ్చు. దీనికోసం డీఈఈసెట్ రాయాలి. ఏటా మే/జూన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ర్యాంకు ద్వారా డీఈడీ కోర్సు పూర్తిచేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక ఉపాధ్యాయులుగా అడుగుపెట్టడానికి అర్హత లభిస్తుంది. ♦ హోటల్ మేనేజ్మెంట్పై ఆసక్తి ఉన్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ (ఎన్సీహెచ్ఎంసీటీ) నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(జేఈఈ) ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (ఐహెచ్ఎం)లలో మూడేళ్ల బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో చేరొచ్చు. ♦ సంప్రదాయ డిగ్రీలో చేరాలనుకుంటే.. మూడేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ)/బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బీకాం)ల్లో చేరొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని యూనివర్సిటీల పరిధిలోని కళాశాలలు ఈ కోర్సులు అందిస్తున్నాయి. కొన్ని కళాశాలలు బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (బీబీఎం), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) వంటి కోర్సులు కూడా అందిస్తున్నాయి. బీఏ/బీకాం/బీబీఎం/బీబీఏ పూర్తిచేస్తే తర్వాత రెండేళ్ల ఎంఏ/ఎంకాం/ఎంబీఏ చదవొచ్చు. ♦ సీఈసీ విద్యార్థులు చార్టర్ట్ అకౌంటెన్సీ(సీఏ), కంపెనీ సెక్రటరీ(సీఎస్), కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ) వంటి కోర్సులు అభ్యసిస్తే అద్భుత అవకాశాలు అందుకోవచ్చు. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోనే ఈ కోర్సుల్లో ప్రవేశించే వీలుంది. లేదంటే బీకాం చేసిన తర్వాత అకౌంటింగ్, ట్యాలీ వంటి కోర్సులు పూర్తిచేస్తే వివిధ సంస్థల్లో అకౌంటెంట్‌గా పనిచేయొచ్చు. ♦ ఇంటర్ సీఈసీ/హెచ్ఈసీ విద్యార్థులకు ఉన్న మరో అద్భుత అవకాశం.. ఇంటిగ్రేటెడ్ పీజీలు. వీటి ద్వారా బ్రేక్ లేకుండా మూడేళ్ల డిగ్రీ, రెండేళ్ల పీజీ పూర్తిచేయొచ్చు. మూడేళ్ల తర్వాత పీజీ వద్దనుకుంటే గ్రాడ్యుయేట్ పట్టా కూడా ఇవ్వడం ఈ కోర్సుల ప్రత్యేకత. ఇంటర్మీడియెట్ సీఈసీ పూర్తయింది. ఫైన్ఆర్ట్స చేయాలనుకుంటున్నాను. ఇందులో ఏయే స్పెషలైజేషన్లు ఉన్నాయి? ఇంటర్ సీఈసీ/హెచ్ఈసీ ఉత్తీర్ణతతో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ఆర్ట్స్లో భాగంగా స్కల్ప్చర్/ఫొటోగ్రఫీ/అప్లైడ్ ఆర్ట్స్/యానిమేషన్/ పెయింటింగ్/ఇంటీరియర్ డిజైన్ వంటి కోర్సుల్లో చేరొచ్చు. హైదరాబాద్‌లో ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) ఈ కోర్సులను అందిస్తోంది. ప్రవేశపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఈ ఏడాది కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. రూ. 3 వేలు ఆలస్య రుసుముతో ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూలైలో ప్రవేశపరీక్ష ఉంటుంది. సీఈసీ పూర్తిచేశాను.. బీసీఏ/బీబీఎం/బీబీఏ వంటి కోర్సుల్లో చేరొచ్చా? వీటితో ఎలాంటి అవకాశాలు ఉంటాయి? బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) చదవాలంటే.. ఇంటర్లో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. సాఫ్ట్వేర్ బూమ్ ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన కోర్సుల్లో బీసీఏ ఒకటి. కొన్ని కళాశాలల్లో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంది. గ్రాడ్యుయేషన్ స్థాయిలోనే విద్యార్థులకు నిర్వహణ నైపుణ్యాలను అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కోర్సులు.. బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ (బీబీఎం), బ్యాచిలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ). ఈ కోర్సులకు కూడా ఆదరణ అంతంత మాత్రమే. కొన్ని యూనివర్సిటీలు/విద్యా సంస్థలు బీబీఏ+ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సు అందిస్తున్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు అర్హులు. కోర్సు వ్యవధి ఐదేళ్లు. ప్రత్యేకంగా ఆయా అంశాల్లో కోర్ నైపుణ్యాలు కోరుకునేవారికి మాత్రమే ఈ కోర్సులు ఉపకరిస్తాయి. బీఎస్సీలో ఏయే కాంబినేషన్లు ఉన్నాయి? దేనికి ఎక్కువ ఉద్యోగావకాశాలున్నాయి? ఇంటర్ ఎంపీసీ/బైపీసీ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్సీ)లో వివిధ కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి. ♦ ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న కాంబినేషన్లు: బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ; మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్; మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్; మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్; మ్యాథమెటిక్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్, కంప్యూటర్ సైన్స్; బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ. ♦ బైపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న కాంబినేషన్లు: బీఎస్సీలో భాగంగా బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ; మైక్రోబయాలజీ, జెనెటిక్స్, కెమిస్ట్రీ; బయోటెక్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ; బయోటెక్నాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ; బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ వంటి కాంబినేషన్లు ఉన్నాయి. వీటిలో అన్ని సబ్జెక్టులకు ఉన్నతవిద్య అవకాశాలున్నాయి. ముఖ్యంగా లైఫ్ సెన్సైస్ సబ్జెక్టులు (జెనెటిక్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ) చదివే విద్యార్థులు పీజీ, పీహెచ్డీ చేయాలనుకుంటేనే ఆ సబ్జెక్టులు చదవడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఆ కోర్సులతో అంతగా ఉద్యోగావకాశాలు లేకపోవడమే ఇందుకు కారణం. ఫిజికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్) కు ఉన్నతవిద్య పరంగా, ఉద్యోగాల పరంగా మంచి అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. లైఫ్ సెన్సైస్ సబ్జెక్టుల్లో పీహెచ్డీ చేస్తేనే మంచిదని పేర్కొంటున్నారు. ఆసక్తి, కెరీర్ పరంగా భవిష్యత్తు లక్ష్యాలు, జాబ్ మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా గ్రాడ్యుయేషన్ స్థాయిలో కాంబినేషన్ సబ్జెక్టులను ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు ప్రస్తుతం బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ కోర్సులు పూర్తిచేసిన వారికి ఫార్మా ఇండస్ట్రీ, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్‌లో ఉన్నత అవకాశాలుంటున్నాయి. ఫైనలియర్లో చూద్దాంలే అనుకోకుండా.. కాలేజీలో చేరిన మొదటి నుంచి ఉన్నత విద్య, ఉద్యోగ సాధనకు సంబంధించి స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, దానికి అనుగుణంగా సీరియస్‌గా సిద్ధమవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంచుకోవాలి. మన సామర్థ్యాలను కచ్చితంగా వ్యక్తపరిచేందుకు ఇవి కీలకం. కాలేజీ లైబ్రరీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. దినపత్రికలను కూడా చదవాలి. కేవలం మార్కులు, పర్సంటేజీలే కాకుండా అన్ని అంశాల్లోనూ ముందున్నప్పుడే ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజయం సొంతమవుతుంది. - డా. కె.ప్రమీల, ప్రిన్సిపల్, ఎల్హెచ్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైలవరం. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ 10+2 (బీటెక్) అర్హత: 70 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణత. ఇంటర్మీడియెట్ ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరి. నిర్దేశిత తేదీ నాటికి 17 - 19 1/2 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. వెబ్సైట్: www.joinindiannavy.gov.in/ బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ (బీబీఎం), బ్యాచిలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ). ఈ కోర్సులకు ఆదరణ అంతంత మాత్రమే. కొన్ని యూనివర్సిటీలు/విద్యా సంస్థలు బీబీఏ+ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సు అందిస్తున్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు అర్హులు. కోర్సు వ్యవధి ఐదేళ్లు. ప్రత్యేకంగా ఆయా అంశాల్లో కోర్ నైపుణ్యాలు కోరుకునేవారికి మాత్రమే ఈ కోర్సులు ఉపకరిస్తాయి. మీ సలహాలు, సందేహాలు పంపాల్సిన ఈ-మెయిల్: sakshieducation@gmail.com -
ఉద్యోగాలు
పుదుచ్చేరి నిట్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు పుదుచ్చేరిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. పోస్టు: ఫ్యాకల్టీ, అసిస్టెంట్ లైబ్రేరియన్, జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ విభాగాలు: ఫ్యాకల్టీ: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, నాన్ -టీచింగ్: ఎలక్ట్రికల్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇంటర్వ్యూ తేదీలు: జూన్ 30, జూలై 1, 2, 3 వివరాలకు: www.nitpy.ac.in రాయ్‌పూర్ ఎయిమ్స్‌లో ట్యూటర్/క్లినికల్ ఇన్స్ట్రక్టర్ రాయ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) ట్యూటర్/ క్లినికల్ ఇన్స్ట్రక్టర్ (నర్సింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది: జూలై 14 ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా వివరాలకు: www.aiimsraipur.edu.in విజయనగరం జిల్లాలో 39 పోస్టులు విజయనగరం జిల్లా సెలక్షన్ కమిటీ.. వ్యవసాయశాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో బహుళ ప్రయోజన విస్తరణాధికారి (ఎంపీఈఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఖాళీలు: 39 అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్, హార్టికల్చర్, డ్రైల్యాండ్ అగ్రికల్చర్ ) చేసిన వారికి తొలి ప్రాధాన్యత ఉంటుంది. వయసు: జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండి 40 సంవత్సరాలలోపు ఉండాలి. దరఖాస్తుకు చివరి తేది: జూన్ 25 వివరాలకు: www.vizianagaram.nic.in -
సహోద్యోగులే స్నేహితులు!
స్కిల్ డెవలప్మెంట్ కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదగాలంటే.. పనిచేసే చోట స్నేహపూరిత వాతావరణాన్ని సృష్టించుకోవాలి. సహోద్యోగులను స్నేహితులుగా, సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కారాన్ని కనుగొనడంలో మార్గం చూపే వ్యక్తులుగా మలచుకోవాలి. అప్పుడే వృత్తిగత జీవితం వర్ధిల్లుతుంది. ఈ క్రమంలో తోటి ఉద్యోగులను స్నేహితులుగా మార్చుకునేందుకు సూచనలు.. ఉద్యోగంలో చేరిన మొదట్లో ఆఫీసు వాతావరణం కొత్తగా ఉంటుంది. ఈ సమయంలో మౌనంగా కూర్చోకుండా, చొరవ తీసుకొని సహోద్యోగులతో మాట కలపాలి. టీ, లంచ్ బ్రేక్‌లో సాన్నిహిత్యం పెంచుకునేందుకు ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే పనిచేసే చోట కుదురుకునేందుకు వీలవుతుంది. సహచర ఉద్యోగులను స్నేహితులుగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి. చక్కటి పనితీరు, కమ్యూనికేషన్ నైపుణ్యాలతో తోటి ఉద్యోగులకు దగ్గర కావొచ్చు. వీలైనంత వరకు వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకూడదు. మంచి ఆలోచనలను పంచుకుంటూ, సానుకూల దృక్పథంతో ఉంటే తోటి ఉద్యోగులే మీతో స్నేహం చేయడానికి పోటీపడతారు. బ్రేక్ సమయాల్లో లేనిపోని గొప్పలు చెప్పుకోకుండా.. వృత్తికి సంబంధించిన లేదా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ తాజా పరిణామాలపై తోటి ఉద్యోగులతో చర్చించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కువ మంది స్నేహితులుగా మారడానికి దోహదం చేస్తుంది. సాయం చేయడంలో ముందుండాలి తోటి ఉద్యోగులు ఇబ్బందుల్లో ఉంటే.. చొరవ తీసుకొని, సాయం చేయడంలో ముందుండాలి. ఇలా చేస్తే వారు మిమ్మల్ని ఎప్పుడూ మరచిపోరు. చిన్న చిన్న కారణాలతో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు.. మీరే ముందుగా సారీ చెప్పండి. కొద్ది సేపు ఏకాంతంగా కూర్చుని, అన్ని అంశాలనూ చర్చించుకోండి. * మీతో మంచిగా ఉంటూ.. మీ గురించి ఇతరులతో చెడుగా చెప్పేవారిని దూరం పెట్టాలి. * మీ ఆలోచనలను కాపీ కొట్టి.. బాస్ దగ్గర మంచి పేరు కొట్టెయ్యాలనుకునే వారితో జాగ్రత్తగా ఉండాలి. * చక్కటి పనితీరు కనబరిచే వారిపై లేనిపోని రూమర్లు పుట్టించి, వారిని పక్కదారి పట్టించాలని చూసేవారి మాటలు పట్టించుకోవద్దు. * పని విషయంలో ఇతరులను పోటీదారులుగా భావించకుండా, బృంద స్ఫూర్తితో అడుగేయాలి. -
చాలెంజింగ్ కెరీర్‌కు.. మెరైన్ ఇంజనీరింగ్!
ఇంజనీరింగ్ స్పెషల్ ఇంజనీరింగ్ విభాగంలో చాలెంజింగ్ కెరీర్ కోరుకునే వారికి సరైన బ్రాంచ్.. మెరైన్ ఇంజనీరింగ్! ఇది ప్రధానంగా సముద్ర రవాణా, నౌకల తయారీ, వాటి నిర్వహణకు సంబంధించిన విభాగం. ప్రస్తుతం మెరైన్ ఇంజనీర్ల పని పరిధి విస్తరించింది. అంతర్జాతీయంగా ఎగుమతి, దిగుమతులకు ఎక్కువగా సముద్ర రవాణాను ఉపయోగిస్తుండటం, ప్రపంచ వ్యాప్తంగా అధికశాతం సరకు రవాణా షిప్పుల ద్వారానే జరుగుతుండటంతో మెరైన్ ఇంజనీరింగ్ ఉజ్వల కెరీర్‌కు వేదికగా నిలుస్తోంది.. మెరైన్ ఇంజనీర్లు ఏం చేస్తారు? మెరైన్ ఇంజనీర్ల విధులు కొద్దిగా రిస్క్‌తో కూడుకున్నవైనప్పటికీ.. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్, నేవిగేషన్లలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సులభతరమయ్యాయి. ఇంజనీర్లకు నౌక ఆకృతి, దాని తయారీకి అవసరమైన పరికరాల ఎంపిక, వాటి అమరిక, పర్యవేక్షణ, నిర్వహణ, మరమ్మత్తులు తదితర విధులు ఉంటాయి. నౌకకు సంబంధించిన ప్రధాన యంత్రాలైన డీజిల్ ఇంజన్లు, గ్యాస్ టర్బైన్లు, పంపులు, కంప్రెషర్లు, హీట్ ఎక్స్చేంజర్స్, హైడ్రాలిక్ మెషిన్స్, ఆటోమేషన్ అండ్ కంట్రోల్ పరికరాలు, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ తదితరాల నిర్వహణ బాధ్యత పూర్తిగా మెరైన్ ఇంజనీర్లదే. నౌకల డిజైన్, నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్చర్లతో కూడా కలిసి పని చేయాల్సి ఉంటుంది. కేవలం నౌకకు సంబంధించే కాకుండా ప్రమాదాలు సంభవించినప్పుడు సైనికుల్లా స్పందించి, సామాన్యులను కాపాడటం కూడా మెరైన్ ఇంజనీర్ల అదనపు బాధ్యత. దీనికి తగిన విధంగా సన్నద్ధమై ఉండాలి. కోర్సులు-వివరాలు పదో తరగతి తర్వాత డిప్లొమా ఇన్ మెరైన్ ఇంజనీరింగ్‌లో చేరవచ్చు. ఇంటర్మీడియెట్ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) పూర్తిచేసిన వారు బీఎస్సీ (నాటికల్ సైన్స్), బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశించవచ్చు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఆసక్తిని బట్టి మాస్టర్స్ డిగ్రీ చేయొచ్చు. ప్రత్యేక విభాగాలు మారిటైమ్ కామర్స్, మెరైన్ రిఫ్రిజిరేషన్, కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టం, నేవిగేషన్ సిస్టమ్స్ అండ్ ఎక్విప్మెంట్, మెరైన్ రిన్యువబుల్ ఎనర్జీ రీసెర్చ్, అండర్ వాటర్ వెహికల్ రీసెర్చ్, ఇన్ఫర్మేషన్-కమ్యూనికేషన్ సిస్టమ్స్-ఎక్విప్మెంట్, ఆఫ్‌షోర్ ఎక్స్ట్రాక్టివ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (కేబుల్ లైయింగ్) వంటివి.. కెరీర్ వివరాలు అనేక ఉద్యోగ అవకాశాలకు ఆస్కారం ఉన్న రంగం మెరైన్ ఇంజనీరింగ్. ఇండియన్ మర్చెంట్ నేవీ, నేవీతోపాటు నౌకా నిర్మాణ కంపెనీల్లో ఉద్యోగాలు అపారం. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి దేశీయ సంస్థలతో పాటు విదేశాల్లో అవకాశాలపై ఆసక్తి ఉన్నవారికి ది అమెరికన్ బ్యూరో ఆఫ్ షిప్పింగ్, ఆంగ్లో ఈస్టెర్న్ షిప్పింగ్ మేనేజ్మెంట్ లిమిటెడ్, గ్రేట్ ఈస్టెర్న్ షిప్పింగ్ వంటి అంతర్జాతీయ కంపెనీల్లో అవకాశాలు లభిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మారిటైమ్ అకాడమీ వంటి సంస్థలు మెరైన్ ఇంజనీరింగ్ పూర్తిచేసినవారిని జూనియర్ ఇంజనీర్లుగా నియమించుకుంటున్నాయి. ప్రతిభ, మంచి పనితీరుతో ఐదారేళ్లలోనే చీఫ్ ఇంజనీర్ స్థాయికి ఎదగవచ్చు. మరికొన్ని సంస్థలు క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా మెరైన్ ఇంజనీర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి. వేతనాలు ఇతర ఇంజనీరింగ్ విభాగాలతో పోల్చితే పోటీ తక్కువగా, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మెరైన్ ఇంజనీర్లకు ప్రారంభంలోనే అధిక వేతనాలు అందుతున్నాయి. ఇందులో ఫిఫ్త్, ఫోర్త్, థర్డ్, సెకండ్, చీఫ్ ఇంజనీర్ అనే స్థాయిలు ఉంటాయి. హోదాను బట్టి నెలకు కనీసం రూ. 25 వేల నుంచి రూ. 5 లక్షల వరకు వేతనాలను అందుకోవచ్చు. కోర్సులు అందిస్తున్న కొన్ని ప్రముఖ సంస్థలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మారిటైమ్ స్టడీస్, గోవా www.imsgoa.org ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ www.iitm.ac.in ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ కోల్‌కతా క్యాంపస్ www.merical.ac.in ఇంటర్నేషనల్ మారిటైమ్ ఇన్స్టిట్యూట్, గ్రేటర్ నోయిడా www.imi.edu.in ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం www.andhrauniversity.edu.in/engg కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాల తర్వాత విద్యార్థులు ఎక్కువగా మెరైన్ ఇంజనీరింగ్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం మెరైన్ ఇంజనీర్లకు జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పెద్ద కంపెనీలు ఆకర్షణీయ ప్యాకేజీలతో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ రంగంలో నైపుణ్యం, అనుభవం ఉన్న వారికి కెరీర్ పరంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. - డా. బి.వి.అప్పారావు, ప్రొఫెసర్, మెరైన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఆంధ్రా యూనివర్సిటీ. -
ఇంటర్వ్యూ తేదీలు
* ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) హాస్పిటల్లో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు: జూన్ 20 * హైదరాబాద్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) మెడికల్ కాలేజీ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్స్ పోస్టులకు: జూన్ 27 * రూర్కీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ప్రాజెక్ట్ అటెండెంట్ (టెక్నికల్) పోస్టులకు: జూన్ 27 -
ఏ జీవులు ఎప్పుడు పుట్టాయి?
స్కూల్ ఎడ్యుకేషన్ మన భూగోళంపై ఇప్పటివరకు లక్షలాది జీవజాతులు అవతరించాయి. అనేక కారణాలవల్ల వాటిలో కొన్ని జీవజాతులు ఎప్పుడో అంతరించిపోయినా, మిగిలినవి మాత్రం మనుగడ కొనసాగిస్తున్నాయి. మన భూగోళం ఏర్పడి ఇప్పటికి సుమారు 460 కోట్ల సంవత్సరాలు అవుతోందని అంచనా. అయితే భూమి పుట్టిన 110 కోట్ల సంవత్సరాల వరకు (ఇప్పటికి 350 కోట్ల సంవత్సరాల కిందటి వరకు) భూమిపై జీవం ఆవిర్భవించలేదు. భూమి పుట్టిన తర్వాత 210 కోట్ల సంవత్సరాల నుంచి 418 కోట్ల సంవత్సరాల వరకు (ఇప్పటికి 42 కోట్ల సంవత్సరాల కిందటి వరకు) గడచిన కాలాన్ని ‘ప్రథమ జీవ మహాయుగం’ అంటారు. భూగోళంపై అనేక రకాల ఏకకణ జీవులు, బహుకణ జీవులు ఈ యుగంలోనే ఉద్భవించి బాగా విస్తరించాయి. గవ్వలతో (పై పెంకుతో) బతికే జీవులు, వెన్నెముక లేని ప్రాణులు పుట్టింది ఈ దశలోనే. -
జాబ్స్ అబ్రాడ్.. గల్ఫ్
జాబ్స్ అబ్రాడ్ అంటే యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల పేర్లు గుర్తొస్తాయి.. అయితే సంఖ్యా పరంగా చూస్తే అధిక శాతం మంది గమ్యం గల్ఫ్ దేశాలే! భారత విదేశీ మంత్రిత్వ శాఖ నివేదిక (2014-15) ప్రకారం వివిధ దేశాల్లో 50 లక్షల మందికి పైగా భారతీయులు పనిచేస్తుంటే.. వారిలో 90 శాతానికి పైగా గల్ఫ్, ఆగ్నేయాసియా దేశాల్లోనే ఉన్నారు. ఆయా దేశాల విధానాలు కూడా విదేశీ ఉద్యోగార్థులకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల్లో అవకాశాలు కల్పిస్తున్న రంగాలు, అందుబాటులో ఉన్న ఉద్యోగాలు తదితరాలపై ఫోకస్.. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం అంటే డొమెస్టిక్ వర్కర్స్, డైలీ వేజ్ లేబర్, చమురు శుద్ధి కర్మాగారాల్లో కింది స్థాయి ఉద్యోగాలు- అనేది ఎక్కువ మందిలో ఉండే అభిప్రాయం. వాస్తవానికి గల్ఫ్ కంట్రీస్‌లో అర్హతలను బట్టి అవకాశాలు అందుకోవచ్చు. ఏటా 8 లక్షల మంది.. ఉద్యోగావకాశాల కల్పనలో జీసీసీ (గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్) కంట్రీస్‌గా పేర్కొనే కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ ముందంజలో ఉన్నాయి. భారత్ నుంచి ఏటా దాదాపు 8 లక్షల మంది జీసీసీ దేశాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. ఈ దేశాల్లోని విదేశీ ఉద్యోగుల్లో దాదాపు 30 శాతం మంది భారత్ నుంచి వెళ్లినవారే. భారత్ నుంచి ఉద్యోగాల కోసం గల్ఫ్ దేశాలకు వెళుతున్న వారి సంఖ్య పరంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలు గత నాలుగైదేళ్లుగా మొదటి 5 స్థానాల్లో నిలుస్తున్నాయి. 2010-15 మధ్యకాలంలో ఏటా సగటున 1.10 లక్షల మంది తెలుగు వారు గల్ఫ్ దేశాల్లో పలు హోదాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు. ఎడ్యుకేషన్ నుంచి ఎనర్జీ సెక్టార్ వరకు; నిర్మాణ రంగం నుంచి ఆయిల్ రిఫైనరీస్ వరకు.. వివిధ రంగాలు ఆకర్షణీయ కెరీర్‌కు అవకాశాలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఉత్పత్తి, సేవారంగాల్లో అవకాశాలు మరింత పెరుగుతున్నాయి. కువైట్ నిర్మాణం, ఆస్పత్రులు, ఆతిథ్య రంగాల్లో నియామకాల సంఖ్య అధికంగా ఉంది. దీనికి కారణం.. కువైట్ ప్రభుత్వం కీ డెవలప్మెంట్ ప్లాన్ 2010-15 పేరుతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టడమే. సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్, ఐటీఐ, డిప్లొమా; నర్సింగ్‌లో డిప్లొమా, బ్యాచిలర్; హోటల్ మేనేజ్మెంట్, హౌస్‌కీపింగ్ వంటి విభాగాల్లో సర్టిఫికెట్లు ఉంటే కువైట్‌లో కొలువు సొంతం చేసుకోవచ్చు. ఖతార్ ఆయిల్ రిఫైనరీలతో పాటు సేవా రంగం, హోటల్ పరిశ్రమ, హౌస్ కీపింగ్, మెయింటనెన్స్ విభాగాల్లో అవకాశాలు ఎక్కువ. వీటితోపాటు 2022 ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణకు ఖతార్ ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో వచ్చే అయిదేళ్లలో ఉత్పత్తి, సేవా రంగాల్లో వలస ఉద్యోగులకు డిమాండ్ పెరగనుంది. సౌదీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రధాన ఉపాధి రంగం. ఇక్కడి ప్రభుత్వం ఎకనామిక్ సిటీస్, ఇంధనేతర తయారీ రంగాల అభివృద్ధికి చర్యలు చేపడుతోంది. సౌదీలో హాస్పిటాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ రంగాలు ఇతర ముఖ్య ఉపాధి వేదికలుగా నిలవనున్నాయి. యూఏఈ నిర్మాణం, రిటైల్, హాస్పిటాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, డొమెస్టిక్, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ రంగాలు టాప్ రిక్రూటర్స్‌గా నిలుస్తున్నాయి. వరల్డ్ ఎక్స్పో-2020 పేరిట యూఏఈ ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమంతో వచ్చే అయిదేళ్లలో అవకాశాలు మరింత పెరగనున్నాయి. అర్హతను బట్టి ఉద్యోగాలు ఐటీఐ, ఒకేషనల్ కోర్సులు చేసిన వారు సెమీ స్కిల్డ్ హోదాలో ఉద్యోగాలు అందుకోవచ్చు. వీటినే బ్లూ కాలర్ జాబ్స్‌గా పేర్కొంటున్నారు. బ్యాచిలర్ డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు ఉంటే స్కిల్డ్ వర్కర్స్ హోదాలో సూపర్వైజర్స్, ఆఫీస్ మేనేజర్స్ వంటి వైట్ కాలర్ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ పీజీలు, ఎంటెక్/ఎంఈ కోర్సులతో ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందొచ్చు. వేతనాలు కూడా ఆకర్షణీయంగా ఉంటున్నాయి. స్కిల్స్ వారీగా చూస్తే లో స్కిల్: 500-100; సెమీ స్కిల్డ్: 1200-1500; స్కిల్డ్ (ప్రొఫెషనల్): 3500-4000. (ఆయా దేశాల కరెన్సీల్లో..) ఔత్సాహికులకు భరోసా గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన స్కిల్స్ విషయంలో భారత ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు చేపడుతోంది. స్వర్ణ ప్రవాస్ యోజన పేరుతో అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న రంగాల్లో భారత అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తద్వారా మన దేశంలో అందించే వృత్తి విద్యా కోర్సులు, టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేందుకు చర్యలు తీసుకుంటోంది. భారత ప్రభుత్వం.. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగార్థుల కెరీర్‌కు భరోసా కల్పించే విధంగా ప్రత్యేక నిబంధనలు రూపొందిస్తోంది. ఇందులో ముఖ్యమైంది మినిమల్ రిఫరల్ వేజెస్ మొత్తాన్ని 800 రియాల్స్ నుంచి 1500 రియాల్స్‌కు పెంచడం. అంటే.. ఒక అభ్యర్థిని నియమించుకోవాలనుకునే గల్ఫ్ దేశాలకు చెందిన వ్యక్తులు లేదా సంస్థలు ప్రతి అభ్యర్థికి కనీసం 1500 రియాల్స్ చెల్లించాలని పేర్కొనడం. వీటితోపాటు రిక్రూటర్ల ప్రామాణికత, ఏజెంట్లకు సంబంధించిన సమాచారంపై అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. రిక్రూట్మెంట్ ఏజెంట్లు ఇమిగ్రేషన్ అధికారుల వద్ద డిపాజిట్ చేయాల్సిన నగదు మొత్తాన్ని కూడా భారీగా పెంచింది. అంతా ఆన్లైన్లో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. గల్ఫ్ ఉద్యోగ ఔత్సాహికుల కోసం ఆన్లైన్ సేవలు అందిస్తోంది. ఈ శాఖ.. రిక్రూటర్స్, జాబ్ సీకర్స్, రిక్రూటింగ్ ఏజెంట్స్ తమ దరఖాస్తులను ఆన్లైన్లో అందించే సదుపాయం కల్పిస్తోంది. ఈ మూడు వర్గాల వారు అనుసరించాల్సిన విధివిధానాలు, కొత్త మార్పులపై సమాచారం కూడా అందిస్తోంది. కఫాలా.. తప్పనిసరి గల్ఫ్ దేశాల ఉద్యోగార్థులు ఇమిగ్రేషన్ అధికారుల వద్ద అనుమతి పొందాలంటే కఫాలా (స్పాన్సర్షిప్ లెటర్) తప్పనిసరి. ఇది ఒక అభ్యర్థిని నియమించుకున్న వ్యక్తి లేదా సంస్థ దాన్ని ధ్రువీకరిస్తూ ఇచ్చే పత్రం. ఇది ఉంటేనే వీసా చేతికందుతుంది. ముఖ్యంగా ఇమిగ్రేషన్ చెక్ రిక్వయిర్డ్ (ఈసీఆర్) జాబితాలో ఉన్న గల్ఫ్ దేశాలకు సంబంధించి ఇది తప్పనిసరి. అవసరమైన డాక్యుమెంట్లు ఇమిగ్రేషన్ చెక్ పూర్తిచేసుకుని.. వీసా పొంది ఉద్యోగం కోసం గల్ఫ్ దేశాల్లో అడుగుపెట్టాలనుకునే వారికి దరఖాస్తుతోపాటు అందించాల్సిన డాక్యుమెంట్లు.. ఎంప్లాయర్ అందించే స్పాన్సర్ లెటర్ (కఫాలా), పాస్‌పోర్ట్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్, నిర్ణీత మొత్తంలో నగదు డిపాజిట్. గల్ఫ్ దేశాల్లోని అవకాశాలతో పాటు ప్రైవేటు నియామక ఏజెంట్ల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ క్రమంలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ పేరిట సంస్థను నెలకొల్పడం జరిగింది. ఔత్సాహికులు మమ్మల్ని సంప్రదిస్తే వారికి అవసరమైన సమాచారం అందిస్తాం. వీసా విధివిధానాలను వివరిస్తాం. వీటిని ఔత్సాహికులు ఉపయోగించుకోవడం వల్ల ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆఫీస్‌లో ఇబ్బందులు ఎదురు కాకుండా ఉంటాయి. - కె.భవాని, జీఎం-హెచ్ఆర్, టామ్‌కామ్. -
యువతి అదృశ్యం
ఇంట్లో నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. టెలికాంనగర్‌లో నివాసం ఉండే పి.భవిత(22) ఈ నెల 16న తెల్లవారు జామున 4 గంటల సమయంలో చెప్పాపెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆచూకీ లభ్యం కాకపోవడంతో తండ్రి సురేష్‌రెడ్డి శుక్రవారం రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ-చెత్తతో ఆరోగ్యానికి తూట్లు!
కాంపిటీటివ్ గెడైన్స్ జనరల్ సైన్స్ 20వ శతాబ్దంలో మానవుడు సాధించిన అభివృద్ధిలో భాగంగా అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఆవిష్కృతమయ్యాయి. తర్వాత కాలంలో ప్రపంచీకరణ ఫలితంగా సెల్‌ఫోన్, టీవీ, కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఏసీ వంటి ఎలక్ట్రానిక్ సాధనాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మనిషి జీవితం నుంచి వీటిని విడదీయలేనంతగా కలిసి పోయాయి. ఇదే సమయంలో అపరిమితంగా వాడి పారేస్తున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు పర్యావరణానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. అందువల్లే ప్రస్తుతం ప్రపంచ దేశాలను తీవ్రంగా కలవరపెడుతున్న అంశాల్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ-వేస్ట్) సమస్య ముందు వరుసలో ఉంది. వాడిపారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ-వ్యర్థాలు) అంటారు. పాడైన టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు, ప్రింటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్చార్జర్లు, బ్యాటరీలు, మదర్‌బోర్డులు, ఏసీలు, వాషింగ్మెషిన్లు, రిమోట్లు, సీడీలు, హెడ్ఫోన్లు, జిరాక్స్ యంత్రాలు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లు (సీపీయూ), ఐపాడ్, ఫ్యాక్స్ యంత్రాలు మొదలైన వాటిని ఈ-వ్యర్థాలుగా పేర్కొంటారు. వీటి విడుదల రోజురోజుకూ అధికమవుతూ..పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోంది. ఈ-వ్యర్థాల నుంచి వెలువడే ప్రమాదకర రసాయనాలు భూమిలోకి చేరి, భూగర్భ జలాలను విషతుల్యం చేస్తూ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు - వ్యాధులు ఈ-వ్యర్థాలకు సంబంధించి మదర్‌బోర్డు, చిప్, సర్క్యూట్లను ముఖ్యమైనవిగా పేర్కొనవచ్చు. వీటి తయారీలో ప్రమాదకరమైన సీసం, ఆర్సినిక్, బేరియం, కాడ్మియం, కోబాల్ట్, పాదరసం, నికెల్, జింక్ మొదలైన వాటిని ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించి తయారు చేసిన వస్తువులను పారేస్తే వాటి భాగాల్లో ఉండే రసాయనాలు మట్టితో పాటు భూగర్భ జలాలను విషతుల్యం చేస్తాయి. వీటిని తగలబెట్టడం ద్వారా వచ్చే విష వాయువులు వాతావరణానికి హాని కలిగిస్తాయి. సీసాన్ని రీచార్జబుల్ బ్యాటరీలు, ట్రాన్సిస్టర్లు, లిథియం బ్యాటరీల తయారీలో అధికంగా వాడతారు. సీసంతో కలుషితమైన నీటిని తాగితే నాడీ వ్యవస్థతో పాటు మూత్రపిండాలు దెబ్బతింటాయి. పిల్లల్లో బుద్ధిమాంద్యం వస్తుంది. కంప్యూటర్ మానిటర్, సర్క్యూట్ బోర్డులు, కంప్యూటర్ బ్యాటరీ తయారీలో కాడ్మియాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. దీర్ఘకాలం కాడ్మియం ప్రభావానికి గురైతే ఐ్ట్చజీఐ్ట్చజీ అనే వ్యాధి కలుగుతుంది. మూత్రపిండాలు, ఎముకలను బలహీనపరచడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. దీంతోపాటు ఈ వ్యాధి వస్తే వెన్నెముక, కీళ్లలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. పాదరసాన్ని (మెర్క్యూరీ) స్విచ్‌లు, పాకెట్ క్యాలిక్యులేటర్, ఎల్సీడీల తయారీలో వాడతారు. పాదరసం ఆహారపు గొలుసు ద్వారా మనిషిలోకి చేరి మినిమెటా వ్యాధిని కలుగజేస్తుంది. సెమికండక్టర్లు, డయోడ్లు, లెడ్‌ల తయారీలో వాడే ఆర్సినిక్ వల్ల క్యాన్సర్, గుండెజబ్బు కలుగుతాయి. అమెరికా నుంచే అధికంగా.. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సరాసరి 93.5 మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు విడుదలవుతున్నాయి. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం అమెరికా అత్యధిక ఎలక్ట్రానిక్ వ్యర్థాలను విడుదల చేస్తూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా చైనా, జపాన్, జర్మనీ దేశాలున్నాయి. భారతదేశం సంవత్సరానికి 18.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను వెలువరిస్త్తూ ఐదో స్థానంలో ఉంది. 2020 నాటికి భారత్‌లో 52 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు విడుదలవుతాయని అసోచామ్ అంచనా. పెరుగుతున్న జనాభా, ప్రపంచదేశాలకు భారతదేశం ప్రధాన మార్కెట్‌గా ఉండటంతో ఎలక్ట్రానిక్ సంస్థలు తమ ఉత్పత్తులను ముందుగా ఇక్కడ విడుదల చేస్తున్నాయి. భారత్‌లో యువత ఎక్కువ సంఖ్యలో ఉండటం, వినియోగదారుల కొనుగోలు శక్తి పెరగడం వంటివి కూడా ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ముంబై నగరం 1,20,000 మెట్రిక్ టన్నుల ఈ-వ్యర్థాల ఉత్పత్తితో దేశంలో మొదటి స్థానంలో ఉండగా, ఢిల్లీ రెండో స్థానం (98,000 మెట్రిక్ టన్నులు), బెంగుళూరు మూడో స్థానం, చెన్నై నాలుగో స్థానంలో ఉన్నాయి. హైదరాబాద్ నగరం ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ఏడో స్థానంలో ఉంది. దేశంలో విడుదలతున్న ఈ-వ్యర్థాల్లో 70 శాతం కంప్యూటర్ విడిభాగాలు ఉండగా.. 12 శాతం టెలికాం పరికరాలు, 8 శాతం ఎలక్ట్రానిక్ రంగం నుంచి వచ్చిన వ్యర్థాలు ఉన్నట్లు అంచనా. ఎలక్ట్రానిక్ వ్యర్థాల పునఃశుద్ధి (రీ సైక్లింగ్ ఆఫ్ ఈ-వేస్ట్) భారతదేశంలో విడుదలయ్యే ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో కేవలం 1.5 శాతం మాత్రమే రీసైకిల్ అవుతున్నట్లు అసోచామ్ సర్వే తెలిపింది. రీసైక్లింగ్ ప్రక్రియలో ఈ-వ్యర్థాలను సుత్తెలతో కొట్టి పిండి చేయడం, ముక్కలుగా నరకడం చేస్తారు. ఈ ప్రక్రియలో వాటి నుంచి బయటపడిన రసాయన పదార్థాలు మట్టిలో చేరతాయి. వర్షం వచ్చినప్పుడు అవి నీటిలో కలిసి, భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి. కలుషితమైన ఈ నీటిని తాగడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. బాసెల్ ఒడంబడిక ప్రపంచదేశాల మధ్య హానికర వ్యర్థ పదార్థాల రవాణాను నిషేధిస్తూ బాసెల్ ఒడంబడిక జరిగింది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి హానికర వ్యర్థ పదార్థాలను అభివృద్ధి చెందుతున్న దేశాలకు రవాణా చేయడాన్ని బాసెల్ ఒడంబడిక నిషేధిస్తుంది. అయితే ఈ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అమెరికా, ఐరోపా యూనియన్ దేశాలు తమ దేశాల్లో విడుదలైన ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఆఫ్రికాలోని ఘనా, నైజీరియా, ఆసియాలోని భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మలేసియా, చైనా వంటి దేశాలకు తరలిస్తున్నాయి. ఈ విధంగా భారత్‌లోకి ఏడాదికి 50,000 టన్నుల ఈ-వ్యర్థాలు అక్రమ రవాణా జరుగుతున్నట్లు అంచనా. భారతదేశ ఎగుమతి-దిగుమతి చట్టాల ప్రకారం 10 సంవత్సరాలు వాడిన సెకండ్ హ్యాండ్ కంప్యూటర్లను దిగుమతి చేసుకోవచ్చు. ఈ నిబంధనను అడ్డం పెట్టుకొని ఆయా దేశాలు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను భారత్‌లో ప్రవేశపెడుతున్నాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు చాలా ప్రమాదకరమైనవి కాబట్టి ధనిక దేశాలు ఈ-వ్యర్థాలను పేద దేశాలకు తరలిస్తున్నాయి. హానికర ఈ-వ్యర్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆఫ్రికా ఖండంలోని 12 దేశాలు కలిసి బమాకో కన్వెన్షన్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. ఇది 1999 నుంచి ఆఫ్రికా ఖండంలో అమల్లోకి వచ్చింది. తర్వాత కాలంలో హానికర రసాయన వ్యర్థ పదార్థాల రవాణాను మరింత కఠినతరం చేస్తూ 1998లో 140 దేశాలు రోటర్డ్యామ్ కన్వెన్షన్‌ను ఆమోదించాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా 2004, ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది. భారతదేశం 2005, మే 24న దీన్ని ఆమోదించింది. హానికర రసాయన వ్యర్థ పదార్థాల వల్ల జరుగుతున్న హానిని గ్రహించిన భారత ప్రభుత్వం ఇటీవల హానికర వ్యర్థ పదార్థాల నిర్వహణ నియమావళిని (మార్చి, 2016) తీసుకొచ్చింది. మాదిరి ప్రశ్నలు 1. Itai-Itai అనే వ్యాధి దేని ప్రభావం వల్ల కలుగుతుంది? 1) సీసం 2) ఆర్సెనిక్ 3) కాడ్మియం 4) పాదరసం జవాబు: 3 2. ప్రపంచంలో అత్యధిక ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే దేశం ఏది? 1) అమెరికా 2) చైనా 3) జపాన్ 4) జర్మనీ జవాబు: 1 3. భారతదేశంలో అత్యధిక ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే నగరం ఏది? 1) ఢిల్లీ 2) కోల్‌కతా 3) చెన్నై 4) ముంబై జవాబు: 4 - ప్రవీణ్ దత్తు లెక్చరర్ ఇన్ జువాలజీ,ఎల్.హెచ్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైలవరం -
ఎంబీఏ.. మెరుగైన కాలేజీ ఎంపిక ఎలా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐసెట్ ముగిసింది.. ఫలితాలు సైతం వెలువడ్డాయి. మరికొద్ది రోజుల్లో కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఐసెట్ ర్యాంకుతో ఎంబీఏలో చేరాలనుకుంటున్న విద్యార్థులకు ఇప్పుడు ఎదురయ్యే ప్రధాన ప్రశ్న.. మంచి కాలేజీని ఎంపికచేసుకోవడం ఎలా?! కాలేజీ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన ప్రమాణాలేంటి? ఈ క్రమంలో ఎంబీఏ కాలేజీ ఎంపికపై నిపుణుల సలహాలు... ఏఐసీటీఈ ప్రమాణాలు కళాశాల ఎంపికలో విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు- ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ సంఖ్య, ఫ్యాకల్టీ అర్హతలు, ఫ్యాకల్టీ సైటేషన్స్, మౌలిక సదుపాయాలు, లైబ్రరీ, ఈ-జర్నల్స్ సదుపాయం, అందుబాటులో ఉన్న రియల్ కేస్ స్టడీస్. * ఫ్యాకల్టీ - స్టూడెంట్ నిష్పత్తి: 1:15 * ఫ్యాకల్టీలో 80 శాతం మంది శాశ్వత ప్రాతిపదికన నియమితులై ఉండాలి. * ఫ్యాకల్టీ హోదాల పరంగా ప్రొఫెసర్; అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాలు ఉండాలి. వీరి నిష్పతి 1:2:6గా ఉండాలి. * లైబ్రరీలో కనీసం ఆరు వేల జాతీయ, అంతర్జాతీయ స్థాయి జర్నల్స్ అందుబాటులో ఉండాలి. * వీటిలో 25 శాతం జర్నల్స్‌ను డిజిటైజేషన్ విధానంలో ఈ-జర్నల్స్గా అందుబాటులో ఉంచాలి. * కంప్యూటర్స్ పరంగా నలుగురు విద్యార్థులకు ఒక కంప్యూటర్ చొప్పున అందుబాటులో ఉండాలి. * ఇవన్నీ ఉంటేనే ఒక కళాశాలలో పరిపూర్ణమైన బోధన లభిస్తుందని ఏఐసీటీఈ అంచనా. ఫ్యాకల్టీ.. ప్లేస్‌మెంట్స్ ఎంబీఏ మొదటి సంవత్సరం అందరికీ కామన్‌గా ఉంటుంది. కాబట్టి రెండో సంవత్సరంలో స్పెషలైజేషన్‌కు అనుగుణంగా సంబంధిత అర్హతలున్న ఫ్యాకల్టీ వివరాలు తెలుసుకోవాలి. వీటన్నింటి కంటే ముఖ్యంగా ప్లేస్‌మెంట్స్ పరంగా గత నాలుగేళ్ల సమాచారం సేకరించాలి. ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొంటున్న కంపెనీలు, వాటి ప్రొఫైల్స్, అవి ఆఫర్ చేసిన ఉద్యోగాలు తదితరాల గురించి తెలుసుకోవాలి. గత మూడేళ్ల కాలంలో కళాశాలలో ఉత్తీర్ణత శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. బీటెక్ కళాశాలల్లో ఎంబీఏ వివిధ ఇంజనీరింగ్ కళాశాల్లో ఎంబీఏ కోర్సు కూడా ఉంది. ఒక రకంగా ఇది ఎంబీఏ విద్యార్థులకు అనుకూలమని చెప్పొచ్చు. కారణం.. బీటెక్ స్థాయిలో పేరున్న కళాశాలలకు ఇండస్ట్రీ వర్గాల గుర్తింపు ఉంటుంది. ప్లేస్‌మెంట్స్ పరంగా ఇవి ముందుంటాయి. ఇంజనీరింగ్ కళాశాలల్లో నిర్వహించే ప్లేస్మెంట్లో బీటెక్, ఎంటెక్ విద్యార్థులే కాకుండా.. ఎంబీఏ అభ్యర్థులు సైతం అవకాశాలు అందుకోవచ్చు. కాబట్టి ఇంజనీరింగ్ కోర్సులను ఆఫర్ చేసే కళాశాలలో ఎంబీఏ కూడా ఉంటే అది సానుకూల అంశమే! ప్రత్యక్ష పరిశీలన వివిధ సర్వే సంస్థలు కాలేజీలకు ఇస్తున్న ర్యాంకుల్లో తేడాలు ఉంటున్నాయి. వీటివల్ల విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు ప్రత్యక్షంగా కళాశాలలను సందర్శించి, అక్కడి సీనియర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకోవడం మేలు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, కోర్సులను అందిస్తున్న కళాశాలల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లకు ప్రాధాన్యమిస్తున్న కళాశాలలపై దృష్టిసారించాలి. స్పెషలైజేషన్ కళాశాల ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన మరో అంశం.. స్పెషలైజేషన్లు. ప్రస్తుతం అన్ని కళాశాలల్లో ప్రధాన స్పెషలైజేషన్లు అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలు, సదరు స్పెషలైజేషన్‌కు సంబంధించి రియల్ కేస్ స్టడీస్ అందుబాటులో లేకపోవడం, కేస్ అనాలిసిస్ చేస్తూ బోధించే అధ్యాపకులు లేకపోవడం సమస్యగా మారింది. ఇలాంటి సమస్యలకు తావు లేని కళాశాలలను ఎంపిక చేసుకోవాలి. పరిశ్రమ వర్గాలతో ఒప్పందాలు కళాశాల ఎంపిక విషయంలో మరో ముఖ్యమైన అంశం.. పరిశ్రమ వర్గాలతో ఉన్న ఒప్పందాలు. ఇలాంటి ఒప్పందాలున్న కళాశాలల ద్వారా ఆయా కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం లభిస్తుంది. కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యల్ని ఫ్యాకల్టీ ద్వారా కేస్ అనాలిసిస్ చేసే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో ఎంబీఏ కాలేజీలు ఇలాంటి ఏర్పాట్లపై దృష్టిసారిస్తున్నాయి. కొన్ని కళాశాలలకు సీఐఐ, ఫిక్కీ, అసోచామ్, ఫ్యాప్సీ తదితర మేనేజ్మెంట్ అసోసియేషన్స్‌తో సంబంధాలు ఉంటున్నాయి. ఇలాంటి వాటిని ఎంపిక చేసుకోవడం వల్ల క్షేత్రస్థాయి నైపుణ్యాలు లభిస్తాయి. ఐసెట్ 2015 గణాంకాల ప్రకారం.. ఏపీలో ఎంబీఏ కళాశాలలు, సీట్లు కళాశాలలు: 384 సీట్లు: 45,965 తెలంగాణలో ఎంబీఏ కళాశాలలు, సీట్లు కళాశాలలు: 347 సీట్లు: 41,796 ఐసెట్ కౌన్సెలింగ్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే కళాశాల ఎంపికపై కసరత్తు ప్రారంభించాలి. చివరి ర్యాంకులు, వెబ్సైట్ సమాచారం, సర్వే రిపోర్టులకే పరిమితం కాకుండా.. ప్రత్యక్షంగా కళాశాలలను సందర్శించి వివరాలు తెలుసుకోవడం మంచిది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో విద్యార్థులు కళాశాల ఎంపికతో పాటు రెండో సంవత్సరంలో తీసుకోవాల్సిన స్పెషలైజేషన్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. - ప్రొ॥ఓం ప్రకాశ్, టీఎస్ ఐసెట్ కన్వీనర్. గత కౌన్సెలింగ్ ‘చివరి ర్యాంకులు’ ఆధారంగా కళాశాలలపై ప్రాథమికంగా ఒక అంచనాకు రావొచ్చు. ఔత్సాహికులు తమ ప్రాథమ్యాల వారీగా కళాశాలలను ప్రత్యక్షంగా సందర్శించి, నిర్ణయం తీసుకోవడం మంచిది. కళాశాలల ఎంపికలో వాటికి పరిశ్రమ వర్గాలతో ఉన్న ఒప్పందాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అదే విధంగా విద్యార్థులు కోర్సులో భాగంగా ఇంటర్న్షిప్స్, రియల్‌టైం ప్రాజెక్ట్వర్క్కు ప్రాధాన్యమివ్వాలి. - ప్రొ॥కట్టా రామమోహన్ రావు, ఏపీ ఐసెట్ కన్వీనర్. -
భవితకు ‘నిర్మాణ’ రంగం
నిర్మాణ రంగం ప్రస్తుత శరవేగంగా వృద్ధి చెందుతున్న విభాగం. మార్కెట్ వాటా పరంగా గత నాలుగేళ్లుగా సగటున పది శాతం వార్షిక వృద్ధి నమోదు చేసుకుంటోంది. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలోనూ కేరాఫ్‌గా నిలుస్తోంది కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. ఉపాధి కల్పనలో ఈ రంగం జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనం. తాజా నివేదికల ప్రకారం- 2022 నాటికి నిర్మాణ రంగం, దాని అనుబంధ మౌలిక సదుపాయాల విభాగాల్లో 12.67 మిలియన్ల కొత్త ఉద్యోగాలు నమోదవడం ఖాయమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగంలో కెరీర్ అవకాశాలు.. జాబ్ ప్రొఫైల్స్, అవసరమైన స్కిల్స్‌పై విశ్లేషణ.. ప్రాజెక్ట్ మేనేజర్స్ నిర్దిష్టంగా ఒక నిర్మాణం, లేదా ఒక ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టే వ్యక్తులు.. ప్రాజెక్ట్ మేనేజర్స్. బీటెక్, ఎంటెక్ స్థాయిలో సివిల్ ఇంజనీరింగ్, దాని అనుబంధ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు ప్రాజెక్ట్ మేనేజర్స్‌గా చేరొచ్చు. వీరికి అకడమిక్ అర్హతలతోపాటు ప్లానింగ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, ఒక ప్రాజెక్ట్ సమర్థంగా పూర్తి చేయడంలో ఎదురయ్యే సానుకూల, ప్రతికూల అంశాలపై ముందుగానే అవగాహన, నాయకత్వ లక్షణాలు, బృంద నైపుణ్యాలు ఉండాలి. సైట్/ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఒక ప్రాజెక్ట్‌కు సంబంధించి పూర్తిగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే నిపుణులే.. సైట్/ప్రాజెక్ట్ ఇంజనీర్స్. బీటెక్/ఎంటెక్ స్థాయిలో సివిల్, అనుబంధ బ్రాంచ్‌లలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను సైట్/ప్రాజెక్ట్ ఇంజనీర్స్‌గా నియమిస్తారు. ఒక ప్రాజెక్ట్‌కు సంబంధించి డిజైన్, ప్లానింగ్, షెడ్యూలింగ్, ఎగ్జిక్యూషన్, రిస్క్ మేనేజ్మెంట్, ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ ఉంటే కెరీర్లో మంచి స్థాయికి చేరొచ్చు. సూపర్వైజర్స్ ఉన్నతాధికారులకు, క్షేత్రస్థాయిలో సిబ్బందికి మధ్య వారధిగా పనిచేసేవారే.. సూపర్వైజర్స్. నిర్దిష్ట ప్రాజెక్ట్ పనితీరును పర్యవేక్షించే విధులను నిర్వర్తించడం సూపర్వైజర్స్ ప్రధాన బాధ్యత. నిర్దిష్ట ప్రాజెక్ట్‌కు అవసరమైన పరికరాలు, మెటీరియల్, మెషినరీ అవసరాల గురించి ముందస్తు అవగాహన ఉంటే సూపర్‌వైజర్స్‌గా మరింత రాణించొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా కింది స్థాయిలో దినసరి వేతనంపై పనిచేసే సిబ్బంది నిర్వహణ విషయంలో వీరికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరం. డిప్లొమా స్థాయిలో సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు సూపర్వైజర్స్ పోస్టుకు అర్హులు. స్వల్పకాలిక కోర్సులతో వృత్తి నైపుణ్యాలు ఉన్నవారికి నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పుష్కలం. కొద్దిపాటి శిక్షణ, స్కిల్స్‌తో బార్ బెండర్, మ్యాసన్, ప్లంబర్, పెయింటర్, వెల్డర్, ఎక్విప్మెంట్ ఆపరేటర్ వంటి పలు అవకాశాలు అందుకోవచ్చు. పదో తరగతి, ఇంటర్మీడియెట్ అర్హతతో; సెట్విన్, నిమ్స్మేలలో అందించే స్వల్పకాలిక శిక్షణ ద్వారా విధులు సమర్థంగా నిర్వహించే అవకాశముంది. నిర్మాణ రంగంలో నిపుణులైన మానవ వనరుల ఆవశ్యకత దృష్ట్యా శిక్షణనిచ్చే సంస్థల సంఖ్య సైతం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ పరిధిలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, రాష్ట్రాల పరిధిలో డెరైక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ పరిధిలో వృత్తి శిక్షణ కేంద్రాలు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్‌లో ఈ శిక్షణ లభిస్తోంది. ప్రస్తుతం కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్కు సంబంధించి కన్స్ట్రక్షన్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ వంటి సంస్థలు శిక్షణ అందిస్తున్నాయి. క్యాడ్ కలిసొచ్చే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో రాణించాలనుకునే అభ్యర్థులకు కలిసొచ్చే మరో ప్రధాన అంశం.. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ (క్యాడ్)లో నైపుణ్యం. ప్రస్తుతం నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లన్నీ కంప్యూటర్ ఆధారితంగా రూపొందుతున్నాయి. వీటికి సంబంధించిన నైపుణ్యాలను అందించే కోర్సు.. క్యాడ్ డిజైనింగ్. బీటెక్ స్థాయిలో ఈ కోర్సు అందుబాటులో ఉండదు. ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని సర్టిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీన్ని పూర్తి చేసుకుంటే.. క్షేత్ర స్థాయి విధులు ఎక్కువ అని భావించే కన్స్ట్రక్షన్ విభాగంలోనే ఇన్-హౌస్ జాబ్స్ సొంతం చేసుకోవచ్చు. నిర్వహణ నైపుణ్యాలు.. కోర్సులు నిర్మాణ రంగం ఔత్సాహికులు తమ ఇంజనీరింగ్ నైపుణ్యాలకు... నిర్వహణ నైపుణ్యాలను కూడా సమ్మిళితం చేస్తే కెరీర్లో దూసుకెళ్లొచ్చు. ప్రస్తుతం పలు ఇన్స్టిట్యూట్లు కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ పేరిట ఇటు కోర్ ఇంజనీరింగ్ నైపుణ్యాలు, అటు నిర్దిష్ట ప్రాజెక్ట్ నిర్వహణ నైపుణ్యాలు అందించే విధంగా కోర్సులు అందిస్తున్నాయి. అవి.. * ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ - కోర్సు: అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. * నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ (నిక్మర్) - కోర్సులు: పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ అడ్వాన్స్డ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్. * నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) - కాలికట్, కోర్సు: పోస్ట్ డిప్లొమా ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ నిర్మాణం, అనుబంధ రంగాల గణాంకాలివే * దేశంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రెండో పెద్ద రంగం. * ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రస్తుతం 45 మిలియన్ ఉద్యోగాలు. * 2022 నాటికి మానవ వనరుల అవసరం 66.62 మిలియన్లకు చేరుకోనుందని అంచనా * ప్రభుత్వ మౌలిక నిర్మాణ పథకాల్లోనే (హైవేల నిర్మాణం, రైల్వే నిర్మాణం తదితర) 2022 నాటికి 1.8 మిలియన్ల మంది అవసరమని అంచనా. * వీటిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రేడ్ సర్టిఫికేషన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎన్ఎస్డీసీ) నిపుణుల కమిటీ సూచించింది. పాజిటివ్స, నెగటివ్స్ * డిమాండ్ - సప్లయ్ కోణంలో ఏ కోర్సు పూర్తి చేసినా కెరీర్ ఖాయం. * ప్రారంభంలో కింది స్థాయిలోనే నెలకు రూ.10 వేల వరకు సంపాదించే అవకాశం. * క్షేత్ర స్థాయి విధులే కాకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పెరుగుతున్న ఇన్-హౌస్ జాబ్స్. * సిబ్బందిని, కార్మికులను మెప్పించడంలో ఎదురయ్యే ఇబ్బందులు. * అధిక శాతం విధులు క్షేత్ర స్థాయిలో నిర్వహించే విధంగా ఉండటం. * ఒక ప్రాజెక్ట్‌కు సంబంధించిన మెటీరియల్స్‌ను త్వరగా తెప్పించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు. ఎమర్జింగ్ కెరీర్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ప్రస్తుతం ఎమర్జింగ్ కెరీర్‌గా మారుతోంది. ముఖ్యంగా డిప్లొమా, బీటెక్ స్థాయిలో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారికి అవకాశాలు ఖాయం. వీరు తమ అకడమిక్ అర్హతలకు అనుగుణంగా అదనపు సర్టిఫికేషన్ క్యాడ్, క్యామ్ వంటివి నేర్చుకోవడం, అదే విధంగా ఈ రంగానికి సంబంధించి స్పెషలైజ్డ్ శిక్షణ తరగతులకు హాజరవడం వంటివి చేస్తే ఈ రంగంలో మరింత ఉన్నతంగా ఎదగొచ్చు. - ప్రొఫెసర్ ఆర్.సతీశ్ కుమార్,నిక్మర్, హైదరాబాద్ ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పలు ఇన్స్టిట్యూట్స్ వృత్తి శిక్షణ నైపుణ్యాలను అందించే కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. అవి.. నేషనల్ కౌన్సిల్ ఫర్ కన్స్ట్రక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కోర్సులు: డిప్లొమా ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ క్వాలిటీ సర్వేయింగ్. సర్టిఫికెట్ కోర్సులు: సైట్ ఆర్గనైజేషన్ అండ్ లేఔట్; కాంక్రీట్ అండ్ కాంక్రీటింగ్, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ మెయింటనెన్స్ తదితర కోర్సులు. వెబ్సైట్: www.baionline.in నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అసిస్టెంట్ కన్స్ట్రక్షన్ లేబొరేటరీ టెక్నీషియన్ అసిస్టెంట్ స్కాఫోల్డర్ హెల్పర్ బార్ బెండర్ అండ్ ఫిక్సర్ హెల్పర్ కార్పెంటర్ హెల్పర్ కన్స్ట్రక్షన్ లేబొరేటరీ టెక్నీషియన్ హెల్పర్ మాసన్ వీటిని కన్స్ట్రక్షన్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ విభాగం పరిధిలో పలు ఇన్స్టిట్యూట్లతో ఒప్పందం ద్వారా అందిస్తోంది వెబ్సైట్: www.nsdcindia.org -
కొన్ని జంతువుల పాలు పసుపు రంగులో ఎందుకుంటాయి?
స్కూల్ ఎడ్యుకేషన్ గేదె పాలు తెల్లగా ఉండటాన్ని, ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు కదా! ఇలా కొన్ని జంతువుల పాలు తెల్లగా ఉండటానికి, మరికొన్ని జంతువుల పాలు తెల్లగా లేకపోవడానికి చాలా ముఖ్య కారణమే ఉంది. ఆవు పాలలో ‘బీటా కెరోటిన్’ అనే పదార్థం కొంచెం ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఆ పాలకు లేత పసుపు రంగు వస్తుంది. గేదె పాలలో ఆ పదార్థం లేకపోవడం వల్ల పాలు తెల్లగా ఉంటాయి. చిన్నపిల్లలకు గేదె పాల కంటే ఆవుపాలు మంచివని చెప్పడానికి.. వాటిలో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండా, ఈ బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండటం కూడా కారణం. ఆవుపాలు సులభంగా జీర్ణం కావడమే కాకుండా వాటిలోని బీటా కెరోటిన్ ‘ఎ’ విటమిన్‌గా మార్పు చెంది చిన్నారులకు బాగా ఉపయోగపడుతుంది. పాలలో ఉండే వివిధ పదార్థాల నిష్పత్తిలో ఉన్న తేడాలను బట్టి ఆయా జంతువుల పాల రంగుల్లో తేడాలు ఉంటాయి. -
ఉద్యోగాలు
చిత్తూరు జిల్లాలో 23 పోస్టులు చిత్తూరు జిల్లా ‘మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ’.. ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లోని వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన జిల్లా కోఆర్డినేటర్, జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టు: డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, ఖాళీలు: 23 దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో దరఖాస్తు పూర్తిచేసి ‘ప్రాజెక్ట్ డెరైక్టర్, జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ, చిత్తూరు’ చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకు చివరి తేది: జూన్ 11 వివరాలకు: www.chittoor.ap.gov.in సెయిల్‌లో ప్రొఫిషియన్సీ ట్రైనీ (నర్స్) స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)కి చెందిన దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ (డీఎస్పీ).. వివిధ విభాగాల్లో ప్రొఫిషియన్సీ ట్రైనీ (నర్స్)లకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఖాళీలు: 69 విభాగాలు: ఐసీయూ/ఎన్ఐసీయూ/బీఐసీయూ,మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, క్యాజువాలిటీ, ఆర్థోపెడిక్స్ తదితర విభాగాలు దరఖాస్తుకు చివరి తేది: జూన్ 22 ఇంటర్వ్యూ తేది: జూన్ 26 వివరాలకు: www.sailcareers.com ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలో సీనియర్, జూనియర్ రెసిడెంట్ పోస్టులు గుల్బర్గాలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) మెడికల్ కాలేజీ.. వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్, ట్యూటర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. విభాగాలు: పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, డెర్మటాలజీ, టీబీ అండ్ చెస్ట్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, అనస్థీషియా తదితర విభాగాలు. ఖాళీలు: 21, ఇంటర్వ్యూ తేది: జూన్ 21 వివరాలకు: www.esic.nic.in -
ఇంటర్వ్యూ తేదీలు
* సీఎస్ఐఆర్ అనుబంధ సంస్థ.. సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వివిధ విభాగాల్లో అప్రెంటీస్ పోస్టులకు: జూన్ 15 * హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ లో కన్సల్టెంట్ పోస్టులకు: జూన్ 21 * ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ)లో ప్రాజెక్ట్ ఫెలో, సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు: జూన్ 24 -
సవాళ్లతో కూడిన కెరీర్... పోలీస్
గ్రాడ్యుయేట్స్ స్పెషల్ సమాజంలో శాంతి భద్రతలను కాపాడే బృహత్తర బాధ్యత పోలీసులది. పోలీసులు లేకుంటే ప్రజలకు భద్రత కరువవుతుంది. సమాజంలో నేరాలను, నేర ప్రవృత్తిని అరికట్టే బాధ్యతాయుత ఉద్యోగం.. పోలీస్! నేరాలు ఘోరాలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో పోలీసుల అవసరం మరింతగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ స్థాయిల్లో పోలీసు ఉద్యోగ నియామకాలు జరుపుతున్నాయి. తెలంగాణాలో ఇప్పటికే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ ప్రకటనలు వెలువడి భర్తీ ప్రక్రియ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ త్వరలో పోలీస్ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాల ప్రకటనల నేపథ్యంలో పోలీస్ కెరీర్‌పై ప్రత్యేక కథనం.. ఉద్యోగావకాశాలు * రాష్ట్ర స్థాయిలో పోలీస్ శాఖలో ప్రాథమికంగా కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడతాయి. రాత పరీక్ష, శారీరక దారుఢ్య, వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా వీటిని సొంతం చేసుకోవచ్చు. తర్వాత ప్రమోషన్ల ద్వారా పై స్థాయికి వెళ్లొచ్చు. * అలాగే రాష్ట్ర స్థాయిలో గ్రూప్-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ఉద్యోగం సాధించొచ్చు. * యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయడం ద్వారా ఐపీఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) ఉద్యోగం సాధించొచ్చు. ఇందుకోసం ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. * ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డయ్యూ అండ్ డామన్, దాద్రా నగర్ హవేలీ పోలీస్ సర్వీసెస్ గ్రూప్-బీ, పాండిచ్చేరి పోలీస్ సర్వీసెస్ గ్రూప్-బీ ద్వారా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ప్రాంతాల్లో పోలీసు నియామకాలు చేపడుతుంది. సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. * సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లో సబ్ ఇన్స్పెక్టర్లు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్‌లో ఇన్స్పెక్టర్లు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)లో సబ్ ఇన్స్పెక్టర్లు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ)లో ఇన్స్పెక్టర్ పోస్టులను కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్) ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) భర్తీ చేస్తుంది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఈ పోస్టులను దక్కించుకోవచ్చు. * సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, సశస్త్ర సీమ బల్ (ఎస్ఎస్బీ)లలో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ ద్వారా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేస్తుంది. రాత, శారీరక, వైద్య పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోలీసు విభాగాలు సాధారణంగా ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక పోలీసు విభాగాలు ఉంటాయి. ఇవి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో పనిచేస్తాయి. రాష్ట్ర పోలీస్ శాఖలో మళ్లీ ఏపీఎస్పీ, ఏఆర్, సివిల్, టాస్క్‌ఫోర్స్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్), క్రైంబ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ) తదితర విభాగాలుంటాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఛండీగఢ్, పాండిచ్చేరి, డామన్ అండ్ డయ్యూ, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలీ, అండమాన్ నికోబార్ దీవుల్లోని పోలీసు విభాగాలు నేరుగా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటాయి. సీబీఐ, ఎన్ఐఏ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్‌లో ఇన్స్పెక్టర్లు, సబ్ఇన్స్పెక్టర్లు ఉంటారు. పారా మిలటరీ దళాలు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ఫోర్స్ (సీఆర్పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), అస్సాం రైఫిల్స్, ఇండోటిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్), సశస్త్ర సీమబల్ (ఎస్ఎస్బీ)లు ప్రత్యేక సాయుధ దళాలు. నిర్ణీత విధుల కోసం వీటిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తిరుగుబాట్లను ఎదుర్కోవడం, ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడంలో పోలీసులకు ఇవి సహకరిస్తాయి. సైన్యం తరహాలో వీటి నిర్మాణం ఉన్నందువల్ల వీటిని పారా మిలటరీ దళాలు అంటారు. పోలీసు విధులు ⇒ అంతర్గత భద్రతను పరిరక్షించడం. ⇒ రోడ్లు, రైల్వేలు, బ్రిడ్జిలు తదితర ప్రజల ఆస్తులు, ప్రఖ్యాత భవనాలు, కట్టడాలకు రక్షణ కల్పించడం. ⇒ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం. ⇒ నిందితులను విచారించడం, స్టేట్మెంట్లు నమోదు చేయడం. ⇒ క్రైం రిపోర్టులను పరిశీలించడం. ⇒ అభియోగాలను నమోదు చేయడం. వాటికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించి, కోర్టుకు సమర్పించడం. ⇒ రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహించడం. ⇒ అత్యవసర సమయాల్లో స్పందించడం. ⇒ ట్రాఫిక్/సమూహాన్ని నియంత్రించడం. ⇒ ఉద్రిక్తతల సమయంలో అందరూ శాంతియుతంగా ఉండేలా చూడటం పని వేళలు పోలీసులకు ప్రత్యేకించి పనివేళలు అంటూ ఏమీ ఉండవు. వీరు 24 గంటలూ డ్యూటీలో ఉంటారు. అవసరమైతే అర్ధరాత్రయినా వెళ్లి నేరస్తులను అరెస్టు చేయాలి. నిరంతరం ప్రజలకు రక్షణ కల్పించడం వీరి బాధ్యత. పండగల సమయంలో కూడా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కావాల్సిన నైపుణ్యాలు ⇒ పరిణతితో వ్యవహరించాలి. ⇒ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలి. ⇒ విపత్కర పరిస్థితులను ధీటుగా ఎదుర్కోగలగాలి. ⇒ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. ⇒ సమస్యలను పరిష్కరించగలిగే నైపుణ్యం. ⇒ సునిశిత పరిశీలన, పరిశోధనాత్మక దృక్పథం ఉండాలి. పాజిటివ్స్ ⇒ ప్రజలకు నేరుగా రక్షణ కల్పించే అవకాశం లభిస్తుంది. ⇒ ఆయా నేరాలకు సంబంధించిన చిక్కుముళ్లను ఛేదించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు దక్కించుకోవచ్చు. ⇒ పోలీసులంటే సమాజంలో ప్రత్యేక గౌరవం ఉంటుంది. ⇒ ప్రతిభ ఆధారంగా ఉన్నత స్థానాలకు ఎదగొచ్చు. నెగటివ్స్ ⇒ పోలీసులకు నిర్ణీత పనివేళలు ఉండవు. వారు 24 గంటలు డ్యూటీలో ఉంటారు. ⇒ పండుగలు, ఇతర సెలవు రోజుల్లో కూడా అవసరమైతే విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ⇒ మిగిలిన ఉద్యోగాలతో పోలిస్తే ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. ⇒ వృత్తి పరంగా అనేక సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. ⇒ ఉగ్రవాద, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి రావడం.