
ట్రిపుల్ ఐటీలతో పల్లె ప్రతిభకు నగిషీలు!
విద్యార్థుల్లో దాగున్న ప్రతిభను సానపడితే అద్భుతాలు సృష్టించగలరు! కెరీర్‌ను అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు దేశ ప్రగతిలో భాగస్వాములు కాగలరు! ఈ ఆశయంతో ఏర్పాటైనవే ట్రిపుల్ ఐటీలు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగావకాశాలు పొందడం ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకే సొంతమన్న మాటల్ని తిరగరాస్తున్నారు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు. ఉన్నత వేతనాలతో జాబ్ ఆఫర్లను చేజిక్కించుకుంటున్నారు. ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో స్పెషల్ ఫోకస్..
ప్రతిభావంతులైన పేద, గ్రామీణ విద్యార్థులు పదో తరగతితోనే సమున్నత కెరీర్‌కు మార్గం వేసుకునే దిశగా నెలకొల్పినవే ఏపీ ట్రిపుల్ ఐటీలు. ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా కేవలం పదో తరగతిలో చూపిన ప్రతిభ ఆధారంగా రెండేళ్ల ఇంటర్మీడియెట్‌కు సమానమైన పీయూసీ, ఆ తర్వాత నాలుగేళ్ల బీటెక్ కోర్సును నామమాత్రపు ఫీజుతో అందించి.. పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గం వేయడమే ట్రిపుల్ ఐటీల ముఖ్య ఉద్దేశం.
విద్యార్థుల ఎంపిక విధానం
ప్రస్తుతం ఆర్‌జీయూకేటీ పరిధిలో ఏపీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లు మూడు ఉన్నాయి. అవి.. ఆర్.కె.వ్యాలీ (ఇడుపులపాయ-వైఎస్‌ఆర్ జిల్లా), నూజివీడు (కృష్ణా జిల్లా), బాసర (ఆదిలాబాద్ జిల్లా). ఒక్కో క్యాంపస్‌లో వెయ్యి చొప్పున మొత్తం మూడు వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు నిబంధనల మేరకు నిర్దిష్ట సంఖ్యలో సీట్లను రిజర్వ్ చేస్తారు. అంతేకాకుండా 5 శాతం అదనపు సీట్లను ఇతర రాష్ట్రాల్లోని విద్యార్థులకు, గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న భారతీయుల పిల్లలకు, అంతర్జాతీయ విద్యార్థులకు కేటాయిస్తున్నారు. అలాంటి అభ్యర్థులు పదో తరగతి తత్సమాన కోర్సులో కనీసం 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. అంతేకాకుండా వార్షిక ఫీజు రూ.1.36 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
లోకల్, అన్ రిజర్వ్‌డ్
గతంలో రాష్ట్ర స్థాయిలో అన్ని మండలాల్లోని టాపర్లను మాత్రమే ఎంపిక చేస్తుండేవారు. కానీ, హైకోర్టు ఆదేశాల మేరకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అందరికీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు.ఈ క్రమంలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లను స్టేట్ వైడ్ ఇన్‌స్టిట్యూట్‌లుగా పరిగణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న యూనివర్సిటీ రీజియన్ విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్‌లుగా విభజించి.. ఒక్కో యూనివర్సిటీ రీజియన్‌కు 42:36:22 నిష్పత్తిలో సీట్లు కేటాయిస్తున్నారు. 85 శాతం సీట్లను సంబంధిత యూనివర్సిటీ రీజియన్ లోకల్ విద్యార్థులకు, 15 శాతం సీట్లను ఓపెన్ కాంపిటీషన్‌లో అన్ రిజర్వ్‌డ్ కేటగిరీలో భర్తీ చేస్తున్నారు.
‘ప్రభుత్వ’ విద్యార్థులకు డిప్రవేషన్ స్కోర్
ప్రభుత్వ పాఠశాలలతో పోల్చితే పదో తరగతిలో ప్రైవేటు విద్యార్థులకే అధిక మార్కులు వస్తున్నాయి. దీంతో ట్రిపుల్ ఐటీల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆశించినంతగా అవకాశం లభించట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలల (మున్సిపల్, జెడ్‌పీపీ, గురుకుల సహా) విద్యార్థులకు వారు పొందిన మార్కులకు అదనంగా 0.4 జీపీఏ కలిపి మెరిట్ జాబితా రూపొందిస్తున్నారు. ఈ డిప్రవేషన్ విషయంలో ఎలాంటి రిజర్వేషన్ నిబంధనలు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన అన్ని సామాజిక వర్గాల వారికి డిప్రవేషన్ స్కోర్ విధానం అమలు చేస్తున్నారు.
మెరిట్ జాబితా రూపకల్పన
మెరిట్ జాబితా రూపొందించే విషయంలో ప్రథమంగా పరిగణనలోకి తీసుకునే అంశం- విద్యార్థి పొందిన జీపీఏ, రిజర్వేషన్ కేటగిరీ. ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ మంది విద్యార్థులకు జీపీఏ స్కోర్ సమానంగా ఉంటే.. కొన్ని ప్రాథమ్యాల ఆధారంగా వారిని ఎంపిక చేస్తున్నారు. అవి..
తొలుత మ్యాథమెటిక్స్‌లో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థి..
ఇందులోనూ మార్కులు సమానంగా ఉంటే ఫిజిక్స్‌లో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థి .. అది కూడా సమానంగా ఉంటే కెమిస్ట్రీలో అత్యధిక మార్కులు, ఆ తర్వాత ఇంగ్లిష్‌లో అత్యధిక మార్కులు ఇలా అన్ని సబ్జెక్టుల్లోనూ సమానంగా ఉంటే.. వయసును పరిగణనలోకి తీసుకుని ఎక్కువ వయసున్న అభ్యర్థికి అవకాశం కల్పిస్తున్నారు.
ఆర్థిక చేయూత
ఏపీ ట్రిపుల్ ఐటీల ప్రధాన లక్ష్యం.. పేద విద్యార్థులకు చక్కటి భవితను అందించడం. ప్రతిభావంతులైన ఏ విద్యార్థి కూడా అవకాశం కోల్పోకూడదనే ఉద్దేశంతో ఆర్థిక చేయూత కూడా అందిస్తున్నారు. సామాజిక వర్గ నేపథ్యంతో సంబంధం లేకుండా.. కుటుంబ వార్షికాదాయం రూ. లక్షలోపు ఉంటే.. ఎలాంటి ట్యూషన్ ఫీజు చెల్లించక్కర్లేదు. కేవలం రూ. 3వేలు కాషన్ డిపాజిట్ చెలిస్తే సరిపోతుంది. ఇది కూడా కోర్సు పూర్తయ్యాక తిరిగి ఇచ్చేస్తున్నారు. కుటుంబ వార్షికాదాయం రూ.లక్ష దాటిన విద్యార్థులు ఏడాదికి రూ. 36 వేల ట్యూషన్ ఫీజు చెల్లించాలి. కేవలం ట్యూషన్ ఫీజునే వసూలు చేస్తున్నారు. మిగతా అన్ని సదుపాయాలు (వసతి, భోజనం తదితర) ఉచితంగా అందిస్తున్నారు.
కోర్సు స్వరూపం
ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్‌గా పేర్కొంటున్న కోర్సు స్వరూపం రెండు రకాలు. అవి.. ప్రీ యూనివర్సిటీ సర్టిఫికెట్.. బీటెక్. కోర్సు మొదటి రెండేళ్లు ఇంటర్మీడియెట్‌కు సమానమైన ప్రీ యూనివర్సిటీ కోర్సు బోధన సాగుతుంది. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్‌సెన్సైస్(ఎంపీసీ, బైపీసీకి సమానం)వంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. రెండేళ్లు పూర్తి చేసుకుని వేరే అవకాశం వచ్చి బయటకి వెళతామనే విద్యార్థులకు పీయూసీ సర్టిఫికెట్ ఇస్తారు. పీయూసీ తర్వాత మూడో ఏడాది నుంచి నాలుగేళ్ల బీటెక్ కోర్సు మొదలవుతుంది. ప్రస్తుతం ఆరు బ్రాంచ్‌లు (సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, మెకానికల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్) అందుబాటులో ఉన్నాయి.
ఒక మేజర్, ఒక మైనర్
మూడో ఏడాది నుంచి ప్రారంభమయ్యే బీటెక్ కోర్సులో.. అందుబాటులో ఉన్న ఆరు బ్రాంచ్‌లలో ఒక బ్రాంచ్‌ను మేజర్ సబ్జెక్ట్‌గా ఎంచుకోవాలి. దీంతోపాటు ఇంటర్-డిసిప్లినరీ స్కిల్స్ అలవడాలనే లక్ష్యంతో మరో సబ్జెక్ట్‌ను మైనర్ సబ్జెక్ట్‌గా ఎంచుకోవాలనే నిబంధన విధించారు. ఈ క్రమంలో ఇంజనీరింగ్, సెన్సైస్, మేనేజ్‌మెంట్, హ్యుమానిటీస్, క్లాసికల్ పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్ వంటి సబ్జెక్టులను మైనర్ సబ్జెక్టులుగా అందిస్తున్నారు. విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్ట్‌ను మైనర్ సబ్జెక్ట్‌గా ఎంచుకోవచ్చు. ఈ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్న ఏకైక యూనివర్సిటీ ఇదే. దీనివల్ల విద్యార్థికి ఇంటర్-డిసిప్లినరీ స్కిల్స్ లభిస్తాయి. ఫలితంగా కోర్ బ్రాంచ్‌లోనే కాకుండా.. ఇతర విభాగాల్లోనూ అవకాశాలు పొందొచ్చు. ఉదాహరణకు మెకానికల్‌ను మేజర్‌గా.. ఎలక్ట్రానిక్స్‌ను మైనర్‌గా ఎంచుకున్న విద్యార్థి మెకానికల్‌తోపాటు మెకట్రానిక్స్‌లోనూ రాణిస్తారు.
ఇంటర్న్‌షిప్.. కంపల్సరీ
ఏపీ ట్రిపుల్ ఐటీల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో మరో ప్రత్యేకత ఇంటర్న్‌షిప్. దీన్ని కరిక్యులంలో అంతర్భాగంగా రూపొందించారు. బీటెక్ మూడో ఏడాది పూర్తయ్యాక వేసవి సెలవుల సమయంలో రెండు, మూడు నెలల వ్యవధిలో ఈ ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు వైజాగ్ స్టీల్ ప్లాంట్, బీఎస్‌ఎన్‌ఎల్, ట్రాన్స్‌కో, జెన్‌కో, సీఎస్‌ఐఆర్ ల్యాబ్స్, ప్రభుత్వ నీటి పారుదల శాఖ తదితర అనేక సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు.
ప్రముఖ సంస్థల ఫ్యాకల్టీతో గెస్ట్ లెక్చర్స్
విద్యార్థులకు ఇక్కడి స్థానిక బోధన సిబ్బంది ఇచ్చే శిక్షణతోపాటు దేశంలోనే ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లుగా పేరుగడించిన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర దేశాల్లోని ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన ఫ్యాకల్టీతో గెస్ట్ లెక్చర్స్ సదుపాయం కల్పిస్తున్నారు. ఇలా.. అన్ని విధాలుగా నిరంతర లెర్నింగ్ విధానాన్ని అమలు చేస్తూ.. విద్యార్థులు అకడెమిక్ స్కిల్స్ పెంపొందించుకునేలా కృషి చేస్తున్నారు.
అన్ని నియంత్రణ సంస్థల గుర్తింపు
ఆర్‌జీయూకేటీ అందిస్తున్న ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుకు ప్రభుత్వ గుర్తింపుతోపాటు ఏఐసీటీఈ, యూజీసీ వంటి నియంత్రణ సంస్థల గుర్తింపు కూడా లభించింది. అంతేకాకుండా ఆరేళ్ల కోర్సులో మొదటి రెండేళ్లు ప్రీ యూనివర్సిటీ కోర్సు పేరుతో బోధించే కోర్సుకు కూడా ఇంటర్మీడియెట్‌కు సమానమైన గుర్తింపును ఇంటర్ బోర్డ్ ఇచ్చింది.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: మే 21, 2014.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 16, 2014 (రాత్రి 8 గంటల వరకు).
{పింట్ అవుట్ తీసుకున్న దరఖాస్తు అందజేయడానికి చివరి తేదీ: జూన్ 21, 2014 (సాయంత్రం ఐదు గంటల వరకు).
కౌన్సెలింగ్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి:
జూలై 7, 2014.
కౌన్సెలింగ్: జూలై 23, 24, 2014.
తరగతుల ప్రారంభం: జూలై 28, 2014
వివరాలకు వెబ్‌సైట్: www.rgukt.in
ఉత్తమ బోధనా సిబ్బందితో నాణ్యమైన విద్య
ఇప్పుడు అన్ని వసతులూ ఉన్న కాలేజీలో నచ్చిన బ్రాంచ్‌లో సీటు పొందాలంటే హై ప్రొఫైల్ కోచింగ్ తప్పనిసరిగా ఉండాలన్న భావన ఉంది. ఇలాంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ఇంజనీరింగ్ విద్యకు దూరం చేస్తోంది. ఈ తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత ఇంజనీరింగ్ విద్యను అందించాలన్న గొప్ప ఆశయంతో ట్రిపుల్ ఐటీలను నెలకొల్పారు. ఎలాంటి ఎంట్రన్స్‌లు లేకుండా పదో తరగతిలో చూపిన జీపీఏతో ప్రవేశాలు కల్పిస్తున్నాం. ట్రిపుల్ ఐటీల్లో బోధనా సిబ్బంది నియామకం విషయంలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్నాం. దేశ వ్యాప్తంగా పర్యటించి ఐఐటీ వంటి ఉన్నత విద్యా సంస్థల్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు నిర్వహించి ఫ్యాకల్టీని తీసుకుంటున్నాం. ఐఐటీ స్థాయి సౌకర్యాలు, ల్యాబ్‌లు, కరిక్యులం.. ట్రిపుల్ ఐటీల ప్రత్యేకత. వీడియో లెక్చర్స్, పుస్తక పఠనం, సమస్యా పరిష్కార నైపుణ్యాల పెంపుదలకు ప్రత్యేక విధానాలు, చేయడం ద్వారా నేర్చుకునే (లెర్నింగ్ బై డూయింగ్) బోధనా పద్ధతులు వంటివన్నీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులను మెరికలుగా తీర్చిదిద్దేవే.
- ప్రొఫెసర్ ఆర్.వి.రాజకుమార్,
వైస్ ఛాన్సలర్, ఆర్‌జీయూకేటీ.