పట్టణ జనాభా-రవాణా వ్యవస్థ
కాంపిటీటివ్ గెడైన్స్ : జనరల్ ఎస్సే
ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ పెరుగుతోంది. ప్రపంచ జనాభా వృద్ధిరేటు కంటే పట్టణ జనాభా వృద్ధి అధికంగా ఉంది. ప్రపంచ పట్టణ జనాభా వార్షిక వృద్ధి మూడు శాతమని అంచనా. ప్రపంచ జనాభాలో సుమారు 50 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. 2011 లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో పట్టణ జనాభా 31.16 శాతంగా ఉంది. భారత్‌లో పట్టణీకరణని పరిశీలిస్తే.. పట్టణ జనాభాలో వృద్ధి అధికంగా ఉండటంతోపాటు పెద్ద నగరాల్లో జనాభా కేంద్రీకరణను గమనించొచ్చు.
స్వాతంత్య్రానంతరం భారతదేశం మిశ్రమ ఆర్థిక విధానాన్ని అవలంబించింది. దీంతో ప్రైవేట్ రంగం అభివృద్ధి చెంది పట్టణ జనాభా పెరుగుదలకు కారణమైంది. 1901లో దేశ జనాభాలో పట్టణ జనాభా వాటా 11.4%. ఇది 2001లో 27.81 శాతానికి, 2011లో 31.16 శాతానికి పెరిగింది.
వివిధ నివేదికలు
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం రాబోయే దశాబ్దాల్లో పెరిగే పట్టణ జనాభాలో భారత్, చైనా వాటా 1/3 వంతుగా ఉండనుంది. 2010 నుంచి 2050 మధ్య కాలంలో భారత్‌లో పట్టణ జనాభాకు అదనంగా 497 మిలియన్లు, చైనాలో 341 మిలియన్లు, నైజీరియాలో 200 మిలియన్లు, అమెరికాలో 103 మిలియన్లు, ఇండోనేషియాలో 92 మిలియన్ల మంది తోడవనున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. గత 40 ఏళ్లతో పోల్చినప్పుడు 2010 నుంచి 2050 మధ్య కాలంలో పట్టణ జనాభాలో పెరుగుదల భారత్, నైజీరియాలలో ఎక్కువగా ఉండనుంది.
చైనాలో 2000-2050 మధ్య కాలంలో పట్టణ జనాభా పెరుగుదలకు పట్టణాభివృద్ధిని ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. ఇదే కాలంలో భారత్‌లో పట్టణ జనాభాలో 2/3 వంతు పెరుగుదలకు పట్టణాభివృద్ధి, 1/3 వంతు పెరుగుదలకు మొత్తం జనాభా పెరుగుదల దోహదపడతాయని నివేదికలు పేర్కొంటున్నాయి.
ది గ్లోబల్ కమిషన్ ఆన్ ది ఎకానమీ అండ్ క్లైమేట్
2014లో ‘న్యూ క్లైమేట్ ఎకానమీ’ పేరిట నివేదిక రూపొందించింది. దీని ప్రకారం 2031 నాటికి భారతదేశ పట్టణ జనాభా 600 మిలియన్లకు చేరనుంది. దేశ మొత్తం జనాభాలో ఇది 40 శాతంగా ఉండనుంది. రాబోయే 20 ఏళ్ల కాలంలో పట్టణ అవస్థాపనా పెట్టుబడిలో 827 బిలియన్ డాలర్ల లోటు ఉండే అవకాశం ఉంది. 2050 నాటికి అంచనా వేసిన వయసు కంటే ముందు సంభవించే మరణాలకు పట్టణ వాయుకాలుష్యం ప్రధాన కారణం అవుతుందని నివేదిక పేర్కొంది.
పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా భారత్ అధిక ప్రయోజనం పొందగలదని ఎం.సి.కిన్సె నివేదిక పేర్కొంది. 2030 నాటికి నగరాలు 70 శాతం నికర నూతన ఉపాధిని అందించగలవని, భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో నగరాల వాటా 70 శాతంగా ఉండొచ్చని నివేదిక అభిప్రాయపడింది. పట్టణ ప్రాంతాల్లోని మౌలిక సౌకర్యాలపై భారత్‌లో వార్షిక తలసరి మూలధన వ్యయం 17 డాలర్లు కాగా, చైనా వార్షిక తలసరి మూలధన వ్యయంలో 14 శాతం, పట్టణీకరణ డిమాండ్‌కు అనుగుణంగా భారత్‌లో ఏటా 700 మిలియన్ చదరపు మీటర్ల రెసిడెన్షియల్, 900 మి.చ.మీ. కమర్షియల్ నిర్మాణాలు జరగాలని నివేదిక పేర్కొంది.
ప్రపంచ బ్యాంకు నివేదిక 2016 ప్రకారం ప్రపంచ జనాభాలో 54 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2045 నాటికి నగరాల్లోని జనాభా 1.5 రెట్లు పెరిగి, మొత్తం పట్టణ జనాభా 6 బిలియన్లకు చేరుకునే అవకాశం ఉంది. ప్రపంచ జీడీపీలో పట్టణ ప్రాంత వాటా 80 శాతంగా ఉండనుంది. ఉత్పాదకత, నవకల్పనల్లో పెరుగుదల కారణంగా సుస్థిర వృద్ధి సాధనకు పట్టణ ప్రాంతాలు దోహదపడతాయి. వేగవంతమైన పట్టణీకరణ కారణంగా మౌలిక సౌకర్యాల కల్పనలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. వాతావరణ మార్పును అధిగమించడంలో పట్టణ ప్రాంతాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని నివేదిక పేర్కొంది. ప్రపంచంలో శక్తి వినియోగంలో పట్టణ ప్రాంతాలు 2/3వ వంతు వాటాను కలిగి ఉన్నాయి. ప్రపంచ హరిత గృహ వాయు ఉద్గారాల విడుదలలోనూ పట్టణాల వాటా 70 శాతమని నివేదిక పేర్కొంది.
జాతీయ రవాణా అభివృద్ధి విధాన కమిటీ అభిప్రాయంలో 2031 నాటికి భారత పట్టణ జనాభా 60 కోట్లకు చేరే అవకాశం ఉంది. మొత్తం దేశ జనాభాలో పట్టణ జనాభా 40 నుంచి 42 శాతంగా కమిటీ అంచనా వేసింది.
పట్టణ అవస్థాపనా సేవలకు అవసరమైన పెట్టుబడి అంచనాలో భాగంగా.. 2031 నాటికి పట్టణ జనాభా 600 మిలియన్లకు చేరుతుందని హై పవర్‌డ ఎక్స్‌పర్‌ట కమిటీ పేర్కొంది.
రవాణా వ్యవస్థ: భారత ఆర్థిక వ్యవస్థలో రవాణా ఒక ముఖ్య అంశం. 1990వ దశకంలో మొదలైన సరళీకృత ఆర్థిక విధానాల వల్ల భూ, జల, వాయు రవాణాల్లో అనేక రవాణా సాధనాలు వాడుకలోకి వచ్చాయి. ఇదే సమయంలో దేశంలోని అధిక జనాభాకు ప్రజా రవాణా ప్రాథమిక రవాణా సాధనంగా నిలిచింది. ప్రపంచంలో ప్రజా రవాణాను అధికంగా వినియోగిస్తున్న రవాణా వ్యస్థల్లో భారత్ రైల్ నెట్‌వర్‌క ఒకటి. భారత రైల్వే వ్యవస్థ 2014-15లో రోజుకు 23 మిలియన్ల మంది ప్రయాణీకులను చేరవేసింది. మొత్తంగా ఆ ఏడాదిలో 8.397 బిలియన్ల మంది రవాణా అవసరాలను తీర్చిడంతో పాటు 1058.81 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసింది.
మార్చి 2013 నాటికి దేశంలో మొత్తం రిజిస్టర్‌డ మోటారు వాహనాలు 172 మిలియన్లు. వీటిలో 21.5 మిలియన్లు కార్లు, టాక్సీలు, జీపులున్నాయి. మొత్తం కుటుంబాల్లో 10 శాతం కుటుంబాలు మోటారు సైకిల్ కలిగి ఉన్నాయి. ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రపంచంలో అధిక మరణాలు సంభవిస్తున్న దేశంగా భారత్ నిలిచింది. భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఏటా 4.6 మిలియన్ల వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. 2015-16లో భారత ప్రభుత్వం భూ ఉపరితల రోడ్లు, రైల్వేల నుంచి ట్రాఫిక్‌ను జలమార్గాలకు మరల్చడానికి ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద 106 జాతీయ జల మార్గాలను ప్రకటించింది.
పట్టణ రవాణా: దేశంలో పేదరిక నిర్మూలనకు విద్యుత్, భూమిని పొదుపుగా వినియోగించుకోవాలి. దీంతోపాటు కాలుష్యం, గ్రీన్ హౌజ్ వాయు ఉద్గారాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్యసాధనలో పట్టణ రవాణా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం దేశంలో నాణ్యత, పరిమాణం పరంగా పట్టణ రవాణా సర్వీసులు, అవస్థాపనా సదుపాయాల లోటు అధికమైంది. దేశంలోని మెగాసిటీల్లో వాహన కాలుష్య పెరుగుదలకు కారణాలుగా కింది అంశాలను పేర్కొనవచ్చు.
1. అధిక ట్రాఫిక్ పరిమాణం, పట్టణ జనాభా పెరుగుదల.
2. ప్రైవేట్, వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరగడం.
3. వాహనాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం.
4. ట్రాఫిక్ అడ్డంకుల పెరుగుదల
5. పర్యావరణహిత రవాణా సాధనాల వినియోగం తక్కువగా ఉండటం. ఇంధన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తక్కువగా ఉండటం.
6. ప్రైవేట్, వ్యక్తిగత వాహనాల సంఖ్యను తగ్గించడానికి సమగ్రమైన కోశపరమైన వ్యూహాలు అవలంభించిక పోవడం.
- డాక్టర్ తమ్మా కోటిరెడ్డి
ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్