Transport system
-
ప్రజారవాణాపై ఎజెండా ఎక్కడ?
‘‘జన జీవనంలో రవాణా వ్యవస్థ అత్యంత కీలకమైనది. కానీ ప్రజారవాణాపై పాలకులకు గానీ రాజకీయపార్టీలకు గానీ ఎజెండా లేకుండా పోతోంది. మేనిఫెస్టోలో ఎన్నో కార్యక్రమాల గురించి చెప్పుకొస్తున్నా.. రవాణా వ్యవస్థపై ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకటించడం లేదు. సౌకర్యవంతమైన ప్రజారవాణా కల్పిస్తామని హామీ ఇవ్వడం లేదు. ప్రజలకు రవాణా వ్యవస్థ సౌకర్యవంతంగా ఉంటే..బయటకు వచ్చిన ప్రతి వ్యక్తి వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్లే. అలాంటి ఆదాయం ఇచ్చే వ్యవస్థను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరం. రూ. వేల కోట్లతో మెట్రో, ఫ్లైఓవర్లు కడుతున్నా.. రోడ్లపై సురక్షితంగా నడించేందుకు ఫుట్‌పాత్‌లు లేని పరిస్థితి ఉంది..’’ అని రవాణారంగ నిపుణుడు ప్రొఫెసర్ సి రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన ‘సాక్షి’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. జనాభా పెరుగుతున్నా.. సరిపడా బస్సులేవి? పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ప్రజారవాణాను అందించే విషయమై పాలకులు దృష్టి పెట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లక్ష మంది జనా భాకు 60 బస్సులు అవసరం. ఆ లెక్కన కోటి జనాభా దాటిన హైదరాబాద్‌లో ఎన్ని బస్సులుండాలి..? ప్రస్తుతం రాష్ట్రం మొత్తం తిరుగుతున్న బస్సులను హైదరాబాద్‌లోనే తిప్పాల్సి ఉంటుంది. ప్రయాణికులు వీలైనంత మేర సొంత వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే పరిస్థితి రావాలి. దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలి.. ఆ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించాలి. అప్పుడే ఇటు ప్రభుత్వానికి, అటు ప్రయాణికులకు మంచి జరుగుతుంది. కానీ మన దగ్గర అంతా అస్తవ్యస్తంగా ఉంది. రాష్ట్ర పురోగతిని ఇతర రాష్ట్రాలు, దేశాలతో పోల్చే ముందు మన దగ్గర రవాణా వ్యవస్థ, రోడ్లు ఎలా ఉన్నాయో ఒక్కసారి బేరీజు వేసుకోవాలి. చంద్రబాబు ఆర్టీసీని దెబ్బ తీశారు.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో ఆర్టీసీ కోలుకోని విధంగా దెబ్బతింది. చార్జీలు అడ్డగోలుగా పెంచుతూ పోయారు, ఫలితం.. ఆర్టీసీలో సమ్మెలకు దారితీసింది. పాదచారులు సురక్షితంగా నడిస్తేనే.. కేసీఆర్ అధికారంలో ఉన్న ఈ తొమ్మిదిన్నరేళ్లలో ఆర్టీసీకి ఏవిధమైన ప్రాధాన్యం ఇవ్వలేదు. నగరంలో ప్రజారవాణాకు ఇప్పటికీ ఆర్టీసీనే వెన్నెముక. కానీ దాని పట్ల ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఫ్లైఓవర్ల మీద ఉన్న శ్రద్ధలో వందోశాతం కూడా ఫుట్‌పాత్‌ల మీద లేదు. దాంతో నడవడం, రోడ్లు దాటడం కూడా ప్రమాదకరంగా మారింది. నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మూడు శాతం పాదచారులే బలవుతున్నారు. పాదచారులు సురక్షితంగా నడిచే నగరాలనే ప్రపంచ శ్రేణి నగరాలుగా పరిగణిస్తారు. ఎంఎంటీఎస్ రెండో దశను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఫుట్‌పాత్, బస్‌స్టాప్‌లు ఎక్కడ అనేక దేశాల్లో ఫుట్‌పాత్ అంటే రోడ్డులో ఒక భాగం. కానీ మన దగ్గర మాత్రం ప్రయాణికులు నడవాలంటే సరైన ఫుట్‌పాత్‌లే ఉండవు. ఒక్కసారి ఎర్రగడ్డ నుంచి ఎల్బీనగర్ వరకు చూస్తే ఫుట్‌పాత్‌ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం అవుతుంది. రూ.వేల కోట్లతో మెట్రో రైలు వ్యవస్థ ఏర్పాటు, ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతున్నా.. పాదచారుల కనీస అవసరమైన ఫుట్‌పాత్‌లను మాత్రం తీవ్రంగా విస్మరిస్తున్నారు. విదేశీ పర్యటనలు చేసి వచ్చే నేతలు అక్కడి ఫుట్‌పాత్‌లను చూసి కూడా తీరు మార్చుకోకపోవటం విడ్డూరం. నగరం చుట్టూ సైకిల్ ట్రాక్ ఉండాలి విస్తరిస్తున్న నగరాల్లో సైకిల్ ట్రాక్ కూడా అందుబాటులో ఉండాలి. అభివృద్ధి చెందిన ఎన్నో నగరాల్లో జనం సైకిళ్లను విస్తృతంగా వాడుతున్నారు. ఇది వాహన రద్దీని నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. కానీ హైదరాబాద్ నగరం అలాంటి వ్యవస్థకు దూరంగా ఉంది. ఎక్కడో ఓ చోట నిర్మించాం చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. నగరం చుట్టూ సైకిల్ ట్రాక్ ఉండాలి. పీక్ అవర్‌పై దృష్టి పెట్టాలి కీలక సమయాలుగా పేర్కొనే వేళల్లో రోడ్లపై రద్దీని నియంత్రించేందుకు పక్కా ప్రణాళిక అవసరం. ఆయా వేళల్లో ఆర్టీసీ బస్సులు ఎక్కువగా అందుబాటులో ఉండాలి. హైదరాబాద్‌లో చూడండి.. పీక్ అవర్స్‌లో సొంత వాహనాలు రోడ్లను ట్రాఫిక్ జామ్‌లతో నింపేస్తున్నాయి. రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాలను విస్మరించండి అంటూ అభివృద్ధి చెందిన దేశాల్లో సూచనలు కనిపిస్తుంటాయి. ఒకవేళ ఎవరైనా ఆ మార్గాల వైపే వెళ్లాలనుకుంటే చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. మనదగ్గర అలాంటి వ్యవస్థ లేదు. ఓట్ల కోసమే ఆరాటం తప్ప.. నేతలు కేవలం ఓట్ల కోసం మేనిఫెస్టో తయారు చేస్తున్నారు. ఎలాంటి అంశాలు చేరిస్తే ఎక్కువ ఓట్లు వస్తాయన్న వాటిపైనే ఆలోచిస్తున్నారు. ప్రజా రవాణాను మెరుగుపరుస్తామని చెబితే పెద్దగా ప్రయోజనం ఉండదనుకుంటున్నారు. అందుకే మేనిఫెస్టోల్లో ఆ అంశాన్ని చేర్చటం లేదు. ప్రజా రవాణా వ్యవస్థపై రాజకీయ పార్టీలకు ఎంత చులకన భావం ఉందో ప్రస్తుత మేనిఫెస్టోలను చూస్తే అర్థం అవుతుంది. ప్రజలు బయటికొస్తే ఆదాయం వచ్చినట్టే కదా ప్రజా రవాణా వ్యవస్థను గాలికొదిలేయడం వల్ల వ్యక్తిగత వాహనాలు పెరుగుతున్నాయి.చాలా దేశాల్లో ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. ప్రజలు అవసరాల నిమిత్తం రోడ్ల మీదకు వచ్చారంటే ప్రభుత్వానికి ఏదో ఒక రకంగా ఆదాయం వచ్చినట్లు అనే విషయాన్ని ప్రభుత్వాలు ఎందుకు చూడడంలేదో అర్థం కావడంలేదు. -గౌటే దేవేందర్ -
Mumbai: ముంబై జలదిగ్బంధం.. ఆరెంజ్ అలెర్ట్ జారీ
ముంబై: కుండపోత వర్షాలతో దేశవాణిజ్య రాజధాని ముంబై, చుట్టుపక్కల ప్రాంతాల్లో మంగళవారం జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలతో ముంబై రవాణా వ్యవస్థలో కీలకమైన సబర్బన్ రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రహదారులపైకి మోకాలి లోతు నీరు చేరడంతో చాలా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని బస్సు సర్వీసులను దారి మళ్లించారు. వచ్చే 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మంగళవారం ఉదయం 8 గంటల సమయానికి 24 గంటల వ్యవధిలో దక్షిణ, పశ్చిమ, తూర్పు ముంబై ప్రాంతాల్లో వరుసగా 96 మిల్లీమీటర్ల, 115 మి.మీ.,117 మి.మీ. వర్షపాతం నమోదైందని తెలిపింది. రానున్న నాలుగు రోజుల్లో ఉత్తర, దక్షిణ మహారాష్ట్ర కొంకణ్, మరాఠ్వాడా, గోవా ప్రాంతాలకు వాతావరణ శాఖ(ఐఎండీ) ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్)ను అధికారులు అప్రమత్తం చేశారు. చదవండి: (Mahua Moitra: మాంసం తినే మద్యం తాగే దేవత) -
వాహనాల తయారీకి ఊతం
న్యూఢిల్లీ: దేశీయంగా వాహనాల తయారీకి మరింత ఊతమిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆటోమొబైల్ పరిశ్రమ ఉత్పాదకత మరింతగా పెరగడం, నిలకడగా వృద్ధి సాధించడంపై మరింతగా దృష్టి పెడుతోందని వివరించారు. స్వచ్ఛమైన ఇంధనాల వినియోగం, ఆధునిక రవాణా వ్యవస్థ ఏర్పాటుకు భారత్ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ 61వ వార్షిక సదస్సు సందర్భంగా పంపిన సందేశంలో ప్రధాని ఈ విషయాలు తెలిపారు. సియామ్ ప్రెసిడెంట్ కెనిచి అయుకావా ఈ సందేశాన్ని చదివి వినిపించారు. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ, దేశ పురోగతిలోనూ వాహన పరిశ్రమ ఎంతో కీలకపాత్ర పోషిస్తోంది. ఎగుమతులకు ఊతమిచ్చేలా తయారీ కార్యకలాపాలు మొదలుకుని అసంఖ్యాకంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రజల జీవనాన్ని సులభతరం చేస్తోంది. దేశ అభివృద్ధి సాధనలో భాగస్వామిగా ఉంటోంది’’ అని ప్రధాని ప్రశంసించారు. ‘‘స్వచ్ఛమైన, ఆధునిక రవాణా వ్యవస్థ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగడానికి భారత్ కట్టుబడి ఉంది. ఆటో రంగం ఉత్పాదకత పెరిగేందుకు, పరిశ్రమ నిలకడగా ఎదిగేందుకు.. వాహనాల తయారీకి సంబంధించిన వివిధ విభాగాలకు తోడ్పాటునిచ్చేందుకు సమగ్రమైన చర్యలు తీసుకుంటున్నాం’’ అని మోదీ వివరించారు. భారత్‌ను అంతర్జాతీయ తయారీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో ఆటో పరిశ్రమ పాత్ర కీలకంగా ఉంటుందని ఆయన తెలిపారు. సాంకేతికత, జీవన విధానాలు, ఆర్థిక వ్యవస్థలో చాలా వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, పాత పద్ధతులను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త తరం మౌలిక సదుపాయాల కల్పన, ప్రపంచ స్థాయి తయారీ, ఆధునిక టెక్నాలజీ లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జీడీపీలో 12 శాతానికి ఆటో వాటా: గడ్కరీ స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ఆటోమొబైల్ పరిశ్రమ వాటాను 12 శాతానికి పెంచాలని, కొత్తగా 5 కోట్ల కొలువులు సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం జీడీపీలో ఆటో పరిశ్రమ వాటా 7.1 శాతంగా ఉంది. మరోవైపు, కాలుష్యకారకమైన డీజిల్ వాహనాల ఉత్పత్తి, అమ్మకాలను తగ్గించుకోవడంపై ఆటోమొబైల్ కంపెనీలు కసరత్తు చేయాలని, ప్రత్యామ్నాయ టెక్నాలజీల వైపు మొగ్గు చూపాలని గడ్కరీ సూచించారు. 100% పెట్రోల్ లేదా 100% బయో–ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్స్ ఇంజిన్ల ఆధారిత వాహనాలను విస్తృతంగా వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే అమెరికా వంటి దేశాలతో పాటు భారత్‌లోనూ ఇలాంటి బ్రాండ్లు కొన్ని కార్యకలాపాలు సాగిస్తున్నాయని గడ్కరీ చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలపై పరిశోధన, అభివృద్ధి కోసం పరిశ్రమ నిధులు వెచ్చించాలని తెలిపారు. ఈవీ చార్జింగ్ సదుపాయాలపై కసరత్తు: కేంద్ర మంత్రి పాండే విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే క్రమంలో దేశవ్యాప్తంగా చార్జింగ్ సదుపాయాలను కల్పించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే చెప్పారు. జాతీయ రహదారులు, నగరాల్లో వీటిని ఏర్పాటు చేయడంపై వివిధ శాఖలు, ప్రభుత్వ విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఇటు పన్నుల చెల్లింపుల్లోనూ, అటు మూడు కోట్ల మందికి పైగా జనాభాకు ఉపాధి కల్పించడంలో వాహన రంగం కీలకపాత్ర పోషిస్తోందని ఆయన ప్రశంసించారు. ఆటో పరిశ్రమకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం రూ. 1.5 లక్షల కోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. వాహన రంగానికి అవసరమైన తోడ్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు పాండే తెలిపారు. మరోవైపు, ఆటోమొబైల్ పరిశ్రమ తోడ్పాటు లేకుండా భారత్ సుదీర్ఘకాలం అధిక వృద్ధి రేటుతో పురోగమించడం సాధ్యపడేది కాదని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. విద్యుత్ వాహనాల వైపు మళ్లడం ఎప్పటికైనా తప్పదని, ఈ రంగంలో భారత్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ఆటో పరిశ్రమ కృషి చేయాలని సూచించారు. మాటలు కాదు.. చేతలు కావాలి: పరిశ్రమ దిగ్గజాలు ఆటో పరిశ్రమ వృద్ధికి చర్యల విషయంలో ప్రభుత్వ అధికారుల ధోరణులను సియామ్ సదస్సులో పరిశ్రమ దిగ్గజాలు ఆక్షేపించారు. నానాటికీ క్షీణిస్తున్న ఆటోమొబైల్ రంగం పునరుద్ధరణకు నిర్మాణాత్మకమైన చర్యలు అవసరమని, కేవలం మాటల వల్ల ఉపయోగం లేదని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ, టీవీఎస్ మోటార్ చీఫ్ వేణు శ్రీనివాసన్ తదితరులు వ్యాఖ్యానించారు. అసలు దేశాభివృద్ధిలో ఆటోపరిశ్రమ పోషిస్తున్న పాత్రకు కనీసం గుర్తింపైనా ఉంటోందా అన్న సందేహాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ‘‘ఆటో పరిశ్రమ చాలాకాలంగా క్షీణ బాటలో కొనసాగుతోంది. పరిశ్రమ ప్రాధాన్యతపై ఎన్నో ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. కానీ, క్షీణతను అడ్డుకునే నిర్మాణాత్మక చర్యల విషయానికొస్తే మాత్రం క్షేత్రస్థాయిలో ఏమీ కనిపించడం లేదు. కొత్త కాలుష్య ప్రమాణాలను, భద్రతా ప్రమాణాలను పాటించేందుకు కంపెనీలు గణనీయంగా వ్యయాలు చేయాల్సి వస్తుండటం, భారీ పన్నుల భారం వల్ల వాహనాల ఖరీదు పెరిగిపోతోంది. దీంతో వినియోగదారులకు అవి అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఫలితంగా అమ్మకాలపై ప్రభావం పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించకుండా బయో ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు అంటూ ఏది చేసినా కార్ల పరిశ్రమ కోలుకుంటుందని అనుకోవడం లేదు’’ అని భార్గవ పేర్కొన్నారు. మరోవైపు, దేశంలో ప్రాథమిక రవాణా సాధనంగా ఉంటున్న ద్విచక్ర వాహనాలపై సైతం విలాస ఉత్పత్తులకు సరిసమానంగా ఏకంగా 28 శాతం వస్తు, సేవల పన్ను విధించడం సరికాదని వేణు శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకుని దేశీయంగానే తయారీ, డిజైనింగ్ కార్యకలాపాలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తోందని ఆయన చెప్పారు. ఇంత చేస్తున్నా తమకు గుర్తింపనేది లభిస్తోందా అన్న సందేహం కలుగుతోందన్నారు. -
తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపినా సేవలు అంతంతే..
సాక్షి, చుంచుపల్లి: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజు సోమవారం ప్రశాంతంగా జరిగింది. కార్మి కులు డిపోల పరిధిలో భారీ ప్రదర్శన, ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు జరగలేదు. అయితే సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో పండగకు సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువ మంది ప్రైవేటు వాహనాలనే ఆశ్రయించారు. జిల్లాలో మూడో రోజు 193 బస్సులను నడిపారు. శని, ఆదివారాల్లో 167 బస్సులు మాత్రమే తిరగగా, సోమవారం మరో 26 బస్సులను పెంచారు. అయినా అవి ప్రయాణికుల అవసరాలను తీర్చలేకపోయాయి. ఎక్కువ మంది ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్లోనే వెళ్లాల్సి వచ్చింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా 50 శాతం బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో జిల్లాలో ఆర్టీసీకి ఈ మూడు రోజుల్లో సుమారు రూ.90 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా. ఆర్టీసీ కార్మికులతోనే ప్రభుత్వ పతనం ఆరంభం.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులతోనే పతనం ప్రారంభం అవుతుందని ఆర్టీసీ జేఏసీ, వివిధ రాజకీయ పక్షాల నాయకులు అన్నారు. సోమవారం ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో కొత్తగూడెంలో భారీ ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనకు వివిధ రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కొత్తగూడెం బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ..సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను విధుల నుంచి తొలగించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం సిగ్గుచేటన్నారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికులపై వేటు వేయమనడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన కార్మికులను అణగదొక్కేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు అండగా ఉంటామని, ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. కార్మికులకు మద్దతు తెలిపిన వారిలో మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎడవల్ల కృష్ణ, యెర్రా కామేష్, బీజేపీ జిల్లా నాయకులు కోనేరు చిన్ని, జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రంగాకిరణ్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్‌పాషా, వై. శ్రీనివాస్‌రెడ్డి, గుత్తుల సత్యనారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, అన్నవరపు సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య, నాగ సీతారాములు, ఇప్టూ నాయకులు సంజీవ్, సతీష్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీవీ.రాజు, ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రసాద్, జాకబ్, వైఎన్ రావు, సంధోని పాష, చిట్టిబాబు ఉన్నారు. -
గ్రూప్–2 అభ్యర్థులకు ‘ఫొని’ ఎఫెక్ట్
సాక్షి, గుంటూరు: ఫొని తుపాను ప్రభావం గ్రూప్–2 స్క్రీనింగ్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులపై పడింది. 446 గ్రూప్–2 పోస్టులకు ఈ నెల 5న ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 2.95 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. ఫొని తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే దాదాపు 80 రైళ్లను రద్దు చేసింది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తుపాను ప్రభావం ఎక్కువ ఉన్న ఉత్తరాంధ్రలో అభ్యర్థుల కష్టాలు అన్నీఇన్నీ కావు. రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం చాలా మంది అభ్యర్థులు హైదరాబాద్, విశాఖ తదితర నగరాల్లో కోచింగ్ తీసుకున్నారు. గ్రూప్–2 పరీక్షకు హాజరయ్యేందుకు తమ సొంత జిల్లాలకు చేరుకోవడానికి వీరంతా రైళ్లు, బస్సులకు రిజర్వేషన్ చేయించుకున్నారు. ఫొని తుపాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే 80 వరకు రైళ్లను రద్దు చేసింది. రోడ్డు మార్గంలో చేరుకోవాలన్నా ఉత్తరాంధ్ర సహా తీర ప్రాంతాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా తుపాను ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలు, తీర ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగానికి సెలవులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో గ్రూప్–2కు దరఖాస్తు చేసుకున్న వీఆర్వో, వీఆర్ఏ, కానిస్టేబుళ్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు పరీక్షకు దూరం కావాల్సిన పరిస్థితి. పరీక్ష వాయిదా వేయాలి అభ్యర్థులు తమ సొంత జిల్లాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో పరీక్ష నిర్వహించడం ఏపీపీఎస్సీ నియంతృత్వ ధోరణికి నిదర్శనం. పరీక్షలను వెంటనే వాయిదా వేసి అందరూ హాజరయ్యే విధంగా మళ్లీ నిర్వహించాలి. – సమయం హేమంత్ కుమార్,ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పరీక్ష కేంద్రాలకు వెళ్లడం కష్టమే మాది కొత్తపాలెం గ్రామం. నేను గ్రూప్–2 పరీక్ష రాయాల్సిన కేంద్రం టెక్కలిలో ఉంది. తుపాను నేపథ్యంలో మా ప్రాంతంలో రవాణాకు తీవ్ర అంతరాయం నెలకొంది. పరీక్ష వాయిదా వేస్తే బాగుంటుంది. – జి.లక్ష్మి, గ్రూప్–2 అభ్యర్థిని, శ్రీకాకుళం జిల్లా ప్రైవేట్ రవాణా ఏర్పాటు చేసుకోవాలన్నారు ఫొని తుపానుతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ చైర్మన్‌ను కోరగా ఆయన ప్రైవేట్ రవాణా ఏర్పాటు చేసుకుని పరీక్షకు హాజరుకావాలని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. – ఎస్.మహబూబ్ బాషా, ఏపీ నిరుద్యోగ జేఏసీ వ్యవస్థాపకుడు -
హైదరాబాద్ రవాణాకు 'లండన్ మోడల్'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకూ నష్టాల ఊబిలో కూరుకుపోతున్న తెలంగాణ ఆర్టీసీకి తిరిగి జవసత్వాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కీలక సూచన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బస్సుల నిర్వహణ ఒక సంస్థే పర్యవేక్షిస్తే అది ఎప్పటికీ బాగుపడదని, హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను విడిగా చూసినప్పుడే పరిస్థితి మెరుగుపడుతుందని కమిటీ నిర్ధారణకు వచ్చింది. ఇందుకోసం లండన్ మోడల్‌ను తెరపైకి తెచ్చింది. హైదరాబాద్ సిటీ వరకు లండన్ మోడల్‌ను నిర్వహిస్తే సిటీలో రవాణా వ్యవస్థ మెరుగుపడటంతోపాటు ఆర్టీసీపై సిటీ భారం తొలగిపోయి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో బస్సుల నిర్వహణ గాడిలో పడుతుందని కమిటీ తన సిఫారసులో ఖరారు చేసినట్లు తెలిసింది. త్వరలో దీన్ని ప్రభుత్వానికి నివేదించేందుకు సిద్ధమైంది. ఏమిటీ లండన్ మోడల్...? ప్రపంచ పట్టణ రవాణాలో లండన్ నగరాన్ని ఉత్తమంగా పేర్కొంటారు. అక్కడ సిటీ బస్సులు, ట్రామ్ సర్వీసులు, మెట్రో రైలు వ్యవస్థతోపాటు ఇతర రవాణా వ్యవస్థలు ఒకే గొడుగు కింద పని చేస్తున్నాయి. వాటన్నింటినీ నగర మేయర్ పర్యవే క్షిస్తారు. లండన్ ప్రజలు మంచినీటి సరఫరా కంటే రవాణా వ్యవస్థకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. రవాణా వ్యవస్థ గాడి తప్పితే మేయర్ సీటులో ఉన్న వ్యక్తి చీత్కారాలు ఎదుర్కోవాల్సిందే. వెరసి అక్కడ రవాణా వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోంది. హైదరాబాద్ సిటీలో కూడా అదే తరహా వ్యవస్థ అవసరమని కమిటీ సిఫారసులో పేర్కొంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 3,800 సిటీ బస్సులు తిరుగుతున్నాయి. ఇటీవలే రెండు కారిడార్ల మెట్రో రైలు సేవలు మొదలయ్యాయి. దాదాపు దశాబ్దంన్నర నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు పరుగుపెడుతున్నాయి. కానీ ఈ మూడు ప్రధాన రవాణా సాధనాలు మూడు సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇలా కాకుండా వాటిని ఒకే సంస్థ పర్యవేక్షించేలా చూడాలని, ఆ బాధ్యత ఆర్టీసీ కాకుం డా హైదరాబాద్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ తరహాలో ఓ వ్యవస్థ పర్యవేక్షించాలని కమిటీ తేల్చింది. ఒకే పరిధిలో ఉండటం వల్లే సమస్యలు... హైదరాబాద్ సిటీలో బస్సుల నిర్వహణకు, జిల్లాల్లో బస్సుల నిర్వహణకు చాలా తేడా ఉంటుంది. వాటిని ఒకేలా పర్యవేక్షిస్తుండటంతో ఆర్టీసీకి సమస్యలు వస్తున్నాయని కమిటీ తేల్చింది. జిల్లా బస్సు సర్వీసులు పకడ్బందీగా కొనసాగాలంటే ఆర్టీసీపై సిటీ బస్సుల నిర్వహణ భారం ఉండరాదని తేల్చింది. ప్రస్తుతం కర్ణాటకలో బెంగళూరు మహానగర ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (బీఎంటీసీ) పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఉంది. సిటీ బస్సులను అదే నిర్వహిస్తోంది. దేశంలోని అన్ని ముఖ్య నగరాలతో పోలిస్తే బెంగళూరులో సిటీ బస్సుల నిర్వహణ మెరుగ్గా ఉంది. దీనికి ఈ ప్రత్యేక వ్యవస్థే కారణం. హైదరాబాద్‌లో కూడా అలాంటి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి మెట్రో రైలు, ఎంఎంటీఎస్ రైళ్లను దాని పరిధిలోకి తీసుకోవాలనేది కమిటీ అభిప్రాయం. అమలు కష్టమే.. నిపుణుల కమిటీ చేసిన సిఫారసు అమలు ఎంతవరకు సాధ్యమనే విషయంలో సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో చేపట్టిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రస్తుతం ఎల్ అండ్ టీ సంస్థ కనుసన్నల్లో కొనసాగుతోంది. దాన్ని ప్రభుత్వం తీసుకోవడం అంత సులభం కాదు. ఇక ఎంఎంటీఎస్ రైళ్లను రైల్వేశాఖ పర్యవేక్షిస్తోంది. వాటిని రైల్వే నుంచి విడదీసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు కేంద్రం అంగీకరించాల్సి ఉంటుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి తదనుగుణంగా ప్రయత్నిస్తే అది అసాధ్యం కాదని కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు. -
రైల్వేకు సర్వీస్ ప్రొవైడర్‌గా జియో
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వేకు టెలికం సేవల ప్రొవైడర్ అవకాశాన్ని రిలయన్స్ జియో సొంతం చేసుకుంది. వచ్చే జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. దీనివల్ల రైల్వే టెలిఫోన్ బిల్లుల భారం కనీసం 35 శాతం మేర తగ్గి పోతాయని అధికారులు తెలిపారు. భారతీయ రైల్వేకు గత ఆరేళ్లుగా భారతీ ఎయిర్టెల్ టెలికం సేవలు అందిస్తోంది. 1.95 లక్షల మొబైల్ ఫోన్ కనెక్షన్లను సీయూజీ కింద రైల్వే ఉద్యోగులు వినియోగిస్తున్నారు. ఇందు కోసం ఏటా రూ.100 కోట్లను ఎయిర్‌టెల్‌కు రైల్వే చెల్లిస్తోంది. ఇరు సంస్థల మధ్య ఒప్పందం గడువు డిసెంబర్ 31తో ముగిసిపోతోంది. దీంతో తాజా సీయూజీ పథకాన్ని నిర్ణయించే బాధ్యతను రైల్వే శాఖ రైల్‌టెల్ సంస్థకు అప్పగించింది. దీంతో నూతన సీయూజీ పథకాన్ని అందించేందుకు రిలయన్స్ జియోను రైల్‌టెల్ ఖరారు చేసింది. జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తన ఆదేశాల్లో పేర్కొంది. రూ.125 నెలసరి అద్దెపై ప్రతీ నెలా 60జీబీ డేటా (పై స్థాయిలోని సీనియర్ ఉద్యోగులు), రూ.99 ప్లాన్‌పై ప్రతీ నెలా 45జీబీ, రూ.67 అద్దెపై 30జీబీ (గ్రూపు సి ఉద్యోగులకు) జియో అందించనుంది. ఈ ప్లాన్లలో కాల్స్ ఉచితం. దీనికి తోడు బల్క్ ఎస్ఎంఎస్ల ప్లాన్‌కు రూ.49 చార్జ్ చేయనుంది.అదనపు 2జీబీ డేటాకు రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. ఇక సీయూజీ వెలుపల నంబర్లకు చేసే కాల్స్‌కు ప్రస్తుతం చార్జీలను ఉద్యోగులు చెల్లించాల్సి వస్తోంది. జియో ప్లాన్లలో ఈ చార్జీలు ఉండవు. -
సొరంగంలో సవారీ...!
డిసెంబర్ 10.. ప్రపంచం మొత్తం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు. నగర రవాణా వ్యవస్థను మార్చే ఓ అద్భుతమైన ప్రాజెక్టును ఆ రోజున ఆవిష్కరిస్తానని అమెరికన్ వ్యాపారవేత్త, టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ మాట ఇచ్చాడు. అంతేకాదు దీని వల్ల తక్కువ సమయంలో.. అతి తక్కువ ఖర్చుతో ఒకచోట నుంచి మరోచోటుకి ప్రయాణాన్ని సాగించవచ్చని తెలిపాడు. మస్క్ ఆధ్వర్యంలోని బోరింగ్ కంపెనీ రూపొందించిన ఈ ప్రాజెక్టు పేరే ‘బోరింగ్ టన్నెల్’. ఇంతకీ ఆ ప్రాజెక్టు విజయవంతం అవుతుందా? లేదా? అని ప్రపంచమే ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ప్రాజెక్టు గనుక విజయవంతమైతే ట్రాఫిక్ కష్టాలు తప్పడంతోపాటు భవిష్యత్తు నగర రవాణా వ్యవస్థనే సమూలంగా మార్చేస్తుందని భావిస్తోంది. ప్రాజెక్టులో ముఖ్యమైనవి.. స్ట్రీట్ లెవెల్ ప్లాట్‌ఫారమ్స్ ఎలక్ట్రిక్ స్కేట్స్ సొరంగంలో ఏర్పాటు చేసిన పట్టాలు పనితీరు ఇలా.. సొరంగ మార్గంలోకి ప్రవేశించడానికి స్ట్రీట్ లెవెల్ ప్లాట్‌ఫారమ్స్ ఏర్పాటు చేశారు. ఇవి రోడ్డుపై ఫుట్‌పాత్‌కు పక్కనే ఉంటాయి. వాహనాలు ముందుగా స్ట్రీట్ లెవెల్ ప్లాట్‌ఫారమ్‌పై ఏర్పాటు చేసిన ‘ఎలక్ట్రిక్ స్కేట్స్’మీదకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ స్కేట్స్ ఎలివేటర్ మాదిరిగా పని చేస్తాయి. ఈ స్కేట్స్ వాహనాలను భూమిలోనికి తీసుకెళుతూ.. సొరంగ మార్గంలోని పట్టాల మీదకు వెళ్లి కూర్చుంటాయి. అనంతరం ఈ స్కేట్స్ పట్టాల మీద అత్యధిక వేగంతో ముందుకు కదులుతూ గమ్యస్థానానికి చేరుకుంటాయి. అక్కడ నుంచి ఈ స్కేట్స్ పట్టాల నుంచి విడిపోయి పక్కకు జరిగి ఎలివేటర్ సహాయంతో పైకి కదులుతూ.. స్ట్రీట్ లెవెల్ ప్లాట్‌ఫారమ్స్ మీదకు చేరుకుంటాయి. తొలి ప్రయోగానికి సిద్ధం.. బోరింగ్ కంపెనీ ఇప్పటికే రెండు మైళ్ల పొడవు ఉన్న సొరంగ మార్గాన్ని సిద్ధం చేసింది. లాస్ ఏంజిలెస్‌లోని టెస్లా (ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ) ప్రధాన కేంద్రం నుంచి లాస్ ఏంజిలెస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేలా ఈ సొరంగ మార్గాన్ని రూపొందించింది. దీన్ని ఉపయోగించుకోవడానికి కేవలం ఒక అమెరికన్ డాలర్ మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ మారాన్ని డిసెంబర్లో ప్రపంచం ముందుకు మస్క్ తీసుకురానున్నారు. ఇది విజయవంతమైతే అమెరికాలో మరో మూడు ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. స్కేట్స్ స్పెషాలిటీ.. స్కేట్స్పైన వాహనాలు ఉన్న సమయంలో వీటి వేగం గంటకు సుమారు 240 కిలోమీటర్లు. టెస్లా మోడల్ ఎక్స్ చాసీస్‌ను మార్పులు చేసి ఈ స్కేట్స్ను తయారు చేశారు. ఇవి బ్యాటరీ ఆధారంగా పనిచేస్తాయి. వీటి నుంచి వచ్చే ఉద్గారాల శాతం సున్నా కావడం గమనార్హం. ఒక స్కేట్ ఒకేసారి ఓ వాహనం లేదా 8 నుంచి 16 మంది ప్రయాణికులను మోసుకెళ్లగలదు. ఇప్పుడున్న ప్రయాణ సమయం కంటే 14 రెట్లు వేగంగా.. ప్రస్తుత ఖర్చుతో పొలిస్తే దీని ఖర్చు 90 శాతం తక్కువ కావడం విశేషం. మరో మూడు మార్గాలివే.. డగవుట్ లూప్ లాస్ ఏంజిలెస్‌లోని డాడ్జర్ బేస్‌బాల్ స్టేడియం నుంచి పలు మెట్రో స్టేషన్లకు తీసుకెళ్లేలా ఈ సొరంగ మార్గాన్ని రూపొందించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఇంకా దీనికి అనుమతులు లభించలేదు. షికాగో ఎక్స్‌ప్రెస్ లూప్ ఓ హేర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లేక్ మిచిగాన్ ఒడ్డున ఉండే షికాగో ప్రాంతం వరకు ఈ సొరంగ మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ మార్గం పొడవు మొత్తం 27 కిలోమీటర్లు. సాధారణ ట్రాఫిక్‌లో అయితే ఈ దూరాన్ని చేరుకోవడానికి గంట లేదా గంటన్నర సమయం పడుతుంది. అదే సొరంగ మార్గం ద్వారా కేవలం 12 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. ఈస్ట్ కోస్ట్ లూప్ ప్రాజెక్టు మొత్తంలో ఇదే అతిపెద్ద మార్గం అని చెప్పుకోవాలి. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీని వాణిజ్య నగరం న్యూయార్క్‌కు కలిపేలా ఈ సొరంగ మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. అయితే మొదటి దశలో వాషింగ్టన్ డీసీ నుంచి మేరిలాండ్ మీదుగా బాల్టిమోర్లను కలిపేలా మార్గాన్ని రూపొందించనున్నారు. టన్నెల్ కోసం టాప్ టెక్నాలజీ.. మస్క్ ఈ ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు వాడిన సెకండ్ హ్యాండ్ బోరింగ్ మెషీన్ చాలా నెమ్మదిగా పనిచేసేది. ఎంత నెమ్మదిగా అంటే నత్త కంటే 10 రెట్లు తక్కువ వేగంతో భూమిని తవ్వేది. దీంతో లాభం లేదని భావించిన మస్క్ కొత్త టెక్నాలజీ అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాగే బోరింగ్ మెషీన్లకు టెస్లా కార్ల బ్యాటరీలు కూడా వాడాలని మస్క్ భావిస్తున్నాడు. ప్రస్తుతం సొరంగం తవ్వడానికి అవుతున్న ఖర్చు ఒక మైలు దూరానికి సుమారు 600 మిలియన్ల డాలర్ల నుంచి 1 బిలయన్ డాలర్లు. దీనిని 60 మిలియన్ డాలర్లకు తగ్గించాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చంతంటినీ ప్రైవేట్ కంపెనీలు ఫైనాన్స్ చేయనున్నట్లు తెలిపాడు. అలాగే భవిష్యత్తులో ఇప్పుడు ఉన్న బోరింగ్ మెషీన్ల కంటే 14 రెట్లు వేగవంతమైన వాటిని తీసుకురానున్నట్లు మస్క్ ప్రకటించాడు. -
ఆదిలాబాద్ అతలాకుతలం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమైంది. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. సుమారు 2లక్షల ఎకరాల్లో పత్తి, సోయాబీన్ పంట, వరి పంటలు నీట మునిగాయి. ఇచ్చోడలో 26.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. నదులు, వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లాయి. పంట చేలల్లోకి భారీగా వరదనీరు చేరింది. ప్రాథమిక అంచనా ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలోనే లక్షా 20 వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆదిలాబాద్ పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. తాంసి మండల కేంద్రంలో 12 ఇళ్లు నేలకూలాయి. జిల్లా అంతటా వందలాది ఇళ్లు కూలిపోయాయి. జైనథ్ మండలం తరోడ వద్ద అంతర్రాష్ట్ర రహదారి వరద కారణంగా కొట్టుకుపోయింది. బ్రిడ్జి నుంచి రోడ్డు ప్రారంభమయ్యే చోట పూర్తిగా కోసుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ బ్రిడ్జి నిర్మించిన తర్వాత 20 ఏళ్లలో ఇంతటి ప్రవాహం ఇదే మొదటిసారి. సరిహద్దులో పెన్‌గంగ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పెన్‌గంగ బ్యాక్‌వాటర్ కారణంగా జైనథ్, బేల, తాంసి మండలాల్లో పంట చేలు నీట మునిగాయి. బోథ్ మండలం కండ్రివాగు వంతెన పైనుంచి వరదనీరు పోటెత్తడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుంటాల జలపాతం పూర్తిగా బండరాళ్లు కనిపించనంతగా వరద నీరు ప్రవహించింది. పొచ్చెర జలపాతంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఆయా మండలాల్లో వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సాత్నాల ప్రాజెక్టుకు 45వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో నాలుగు గేట్లను ఎత్తి వరద నీటిని వదిలారు. మత్తడివాగు ప్రాజెక్టుకు 10వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ఐదు గేట్లను ఎత్తి నీటిని వదిలారు. పీహెచ్సీలో చిక్కుకున్న గర్భిణులు, బాలింతలు ఇచ్చోడలోని లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి వరద నీరు చేరడంతో పూర్తిగా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో ఆస్పత్రిలో ఉన్న ఎనిమిది మంది గర్భిణులు, బాలింతలను బయటకు తీసుకొచ్చేందుకు ఇబ్బంది ఎదురైంది. పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తాళ్ల సహాయంతో అందరిని బయటకు తీసుకొచ్చారు. మావల, గుడిహత్నూర్ మండలాలకు సరిహద్దులో ఉన్న వైజాపూర్ గ్రామం వద్ద విధులకు వెళ్తున్న టీచర్లు పయనిస్తున్న కారు వరద ప్రవాహంలో చిక్కుకుంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆ టీచర్లను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వరద నీటిలో కొట్టుకుపోయిన కారు ధ్వంసమైనప్పటికీ దానిని బయటకు తీసుకొచ్చారు. కుమురంభీం జిల్లాలో.. కుమురం భీం జిల్లా బెజ్జూరులో అత్యధికంగా 21.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి వాగు పొంగిపొర్లడంతో రోడ్డుపై రాకపోకలు నిలిచిపోవడంతో చిర్రకుంట, తిర్యాణి మండలం కైరిగూడ, పంగిడిమాదర, లింగాపూర్ మండలాల ప్రజలు ఎక్కడి వాళ్లు అక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. వంతెన వద్ద ప్రసవ వేదన కుమురం భీం జిల్లా దహెగాం మండలంలోని గెర్రె–గిరవెల్లి గ్రామాల మధ్య ఉన్న ఎర్రవాగు ఉప్పొంగడంతో అవతలి వైపు ఉన్న 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గిరవెల్లి గ్రామానికి చెందిన గర్భిణి ఎల్కరి సుజాతకు గురువారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. దహెగాంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకోవాలంటే మధ్యలో ఎర్రవాగు ఉండగా, హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా ఉంది. వాగులో దాటే పరిస్థితి లేకపోవడంతో వంతెనకు రెండు వైపులా నిచ్చెనలు వేసి ఆమెను మంచానికి తాళ్లు కట్టి కూర్చోపెట్టి గ్రామస్తులు బ్రిడ్జి దాటించారు. నిర్మల్, మంచిర్యాల జిల్లాలో.. నిర్మల్ జిల్లాలోని మూడు ప్రధాన ప్రాజెక్టులైన కడెం, గడ్డెన్నవాగు, స్వర్ణలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా ఇన్‌ఫ్లో ఉండటంతో గేట్లు ఎత్తివేసి నీళ్లు దిగువకు వదులుతున్నారు. జన్నారం మండలంలో అప్రోచ్‌రోడ్డు తెగిపోవడంతో మంచిర్యాల నుంచి నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు రవాణా వ్యవస్థ స్తంభించింది. వాహనాలను కలమడుగు, ధర్మపురి, రాయపట్నం మీదుగా మళ్లించారు. -
మెట్రోతో మారుమూలల అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలుకు అనుసంధానంగా మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల మెరుగుదలకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. రవాణా మంత్రి పి.మహేందర్ రెడ్డితో కలసి సోమవారం ఇక్కడ మారుమూల ప్రాంతాలకు మెట్రో రైలు అనుసంధానంపై సమీక్షించారు. మెట్రో రైలు పనులు త్వరలో పూర్తి కానున్న నేపథ్యంలో మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు రవాణా శాఖ, ఆర్టీసీ, సెట్విన్, మెట్రో రైలు సంస్థలు సమన్వయంతో ముందుకు పోవాలని కోరారు. శాఖల మధ్య సమన్వయం, నగరంలో ప్రజారవాణా వ్యవస్థ మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యల కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రవాణా, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులు, మెట్రో రైలు ఎండీ, సెట్వీన్, జీహెచ్ఎంసీ, దక్షిణ మధ్య రైల్వే సంస్థల ప్రతినిధులను ఈ టాస్క్ఫోర్సులో సభ్యులుగా నియమించారు. నగరంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ఇందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని ఈ కమిటీని కోరారు. రెండు నెలల్లో ప్రాథమిక నివేదికతో ముందుకు రావాలని ఆదేశించారు. నగరంలో రవాణా అవసరాలను తీర్చడంలో ఆర్టీసీ, మెట్రో రైలు సంస్థలు పరస్పర సహకారంతో పనిచేస్తే మరింత మేలు చేకూరుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. నగరంలో ప్రయాణికుడే లక్ష్యంగా ప్రజా రవాణా సౌకర్యాలుంటాయని, ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు, మెట్రో స్టేషన్ నుంచి కార్యాలయాలను అనుసంధానం చేస్తూ రవాణా సదుపాయం కల్పించేందుకు దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. నగరంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఎలక్ట్రిక్ బస్సులు, వ్యాన్లు, ఆటోలనే తీసుకోవాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు నగరంలోని మెట్రో స్టేషన్లు, బస్సు డిపోల వద్ద చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. -
కూ.. చుక్.. చుక్
1907.. నాంపల్లి రైల్వే స్టేషన్.. నాంపల్లి రైల్వే స్టేషన్‌ను 1907లో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ హయాంలో నిర్మించారు. అయితే 1921 వరకు ప్రయాణికులను ఇందులోకి అనుమతించలేదు. స్టేషన్‌ను గూడ్స్ రైళ్ల కోసమే వినియోగించారు. బొంబాయి తదితర ప్రదేశాల నుంచి వచ్చే సరుకులను సికింద్రాబాద్ నుంచి నాంపల్లి వరకు తీసుకురావడానికి ఈ స్టేషన్ అనుకూలంగా ఉండేది. ఆ రోజుల్లో.. కచ్రం ఎడ్ల బండ్లు, జట్కాలే దిక్కు.. ఈ రోజుల్లో ఉన్నట్టుగా ప్రభుత్వ రవాణా వ్యవస్థ అ రోజుల్లో ఉండేది కాదు.. జమిందారులు, ప్రభుత్వ అధికారులు సొంత గుర్రాలు, ఎడ్లబండ్లలో ప్రయాణం చేసేవారు.. లేదంటే ప్రభుత్వం కేటాయించిన గుర్రాలు, గుర్రపు బగ్గీలపైనే వెళ్లే వారు. సాధారణ ప్రజల పరిస్థితి దారుణంగా ఉండేది. కాస్తో కూస్తో ఉన్న వారు సొంత ఎడ్ల బండ్లపై రోజుల తరబడి ప్రయాణం చేసి గమ్యానికి చేరుకునేవారు.. అదే పేదలైతే కాలినడకనే ప్రయాణం సాగించేవారు. మారుమూల గ్రామలు, తాలుకాల్లో నివసించే వారికి అనారోగ్య సమస్యలు వచ్చినా.. లేక పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం వేరే జిల్లాలకు, ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినా.. కచ్రం ఎడ్ల బండ్లు అద్దెకు తీసుకుని వేళ్లావారు. హైదరాబాద్ సంస్థానంలోని దాదాపు అన్ని గ్రామాల్లో కచ్రాలు అద్దెకు లభించేవి. ఆ రోజుల్లో దొరలు, జమిందారులు, భుస్వాములు, ధనికుల వద్ద సొంత కచ్రాలు ఉండేవి. వాటిని వారు రోజుల చొప్పున అద్దెకు ఇచ్చే వారు. ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లాలంటే.. ఊళ్లో జనమంతా ప్రణాళిక వేసుకుని అందరూ కలసి కచ్రం అద్దెకు తీసుకుని వెళ్లే వారు. ప్రపంచంలోనే తొలి స్వతంత్ర రైల్వే వ్యవస్థ హైదరాబాద్ స్టేట్. ఈ పేరు వింటే ఘనమైన గతమంతా కళ్ల ముందు కదులుతుంది. దేశంలోనే సుసంపన్నమైన హైదరాబాద్ రాష్ట్రంలో అన్నీ అద్భుతాలే. ప్రపంచంలోనే ధనవంతులైన నిజాంల హయాంలో ప్రతిదీ ప్రత్యేకమే. నిజానికి అదో దేశం. బ్రిటిష్ వలస నీడకు దూరంగా ఎదిగిన రాజ్యం. కరెన్సీ, పోస్టల్, ఎయిర్వేస్ ఇలా అన్నీ స్వతంత్రమే. వీటికి తోడు మరో అరుదైన ఖ్యాతిని కూడా నిజాం స్టేట్ సొంతం చేసుకుంది. అదే స్వతంత్ర రైల్వే. అవును.. ఈ దేశంలో సొంత ధనంతో రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది హైదరాబాదే. 1857 తర్వాత బ్రిటిష్ వారు హైదరాబాద్‌ను కలుపుతూ గ్రేట్ ఇండియన్ రైల్వే లైన్ వేయాలని ప్రతిపాదించారు. అయితే అందుకు నిజాం పాలకులు ఒప్పుకోలేదు. తమ రాజ్యంలో బ్రిటిష్ వారి చొరబాటును, ఆధిపత్యాన్నీ అంగీకరించలేదు. అయితే అభివృద్ధికి, ఆధునిక అవసరాలనూ గుర్తించిన నిజాం సర్కార్ సొంత రైల్వేను నెలకొల్పాలని నిర్ణయించింది. హైదరాబాద్ రైల్వే.. 143 ఏళ్ల ఘన చరిత్ర.. హైదరాబాద్ స్టేట్ రైల్వేది 143 ఏళ్ల ఘన చరిత్ర. స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో ఉన్నదంతా బ్రిటిష్ రైల్వేనే. దాని పేరు గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే. కానీ హైదరాబాద్ రాష్ట్రంలో మాత్రం బ్రిటిష్ వారికి సంబంధం లేని సొంత రైల్వే ఉండేది. అదే నిజాం స్టేట్ రైల్వే. 1870లో నిజాం స్టేట్ రైల్వే పురుడు పోసుకుంది. ఆ రోజుల్లో ఆరో నిజాం పాలనలో ప్రధానమంత్రిగా ఉన్న సాలార్ జంగ్.. నిజాం రైల్వేకు ప్రాణంపోశారు. ఇందుకోసం లండన్ మనీ మార్కెట్ నుంచి నేరుగా రుణం తీసుకున్నారు. రూ.4.3 కోట్లను మూడు విడతల్లో 6 శాతం గ్యారంటీ ఇచ్చి మరీ మూలధనాన్ని సేకరించారు. భారత పాలకులతో సంబంధం లేకుండా నేరుగా లండన్ మనీ మార్కెట్‌కు వెళ్లడం ఆ రోజుల్లో పెను సంచలనం. ఈ వార్తతో భారతదేశంతోపాటు ప్రపంచ దేశాలకు నిజాం సంస్థానం పరిపాలన, వ్యవహార శైలి తెలిసింది. 1916.. కాచిగూడ రైల్వే స్టేషన్.. కాచిగూడ రైల్వే స్టేషన్‌ను 1916లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో నిర్మించారు. నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే హెడ్‌క్వార్టర్స్‌గా దీనిని వినియోగించారు. మోడ్రన్ హైదరాబాద్‌కు పునాది.. ఐదో నిజాం మీర్ తహీనియత్ అలీఖాన్ అఫ్జలుద్దౌల్లా పాలనా కాలంలో హైదరాబాద్ అభివృద్ధి బాట పట్టింది. ఆ రోజుల్లో ప్రధానమంత్రిగా ఉన్న మీర్ తురా»Œ అలీఖాన్ సాలార్ జంగ్–1 నగరాభివృద్ధికి కారణం. బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధితో పోటీ పడుతూ.. హైదరాబాద్ సంస్థానంలో సొంతంగా పోస్టల్, టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్తో పాటు స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటయ్యాయి. మోడ్రన్ హైదరాబాద్ నిర్మాణానికి సాలార్ జంగ్ ఆధునిక ఆలోచనా విధానమే నాంది. ఐదో నిజాం మరణానంతరం ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ చేతికి అధికార పగ్గాలు వచ్చాయి. ఈయన హయాంలో కూడా ప్రధానమంత్రిగా సాలార్జంగ్ 1 ఉన్నారు. మోడ్రన్ హైదరాబాద్ కోసం సిద్ధం చేసిన ప్రణాళికల్లో రవాణా వ్యవస్థ ఏర్పాటు కూడా ఉంది. హైదరాబాద్‌లో తొలి రైల్వే లైన్.. కర్ణాటకలో ఉన్న బ్రిటిష్ రైల్వే జంక్షన్ వాడితో హైదరాబాద్ సంస్థానాన్ని అనుసంధానం చేసేలా 1871లో సికింద్రాబాద్–వాడి రైల్వే లైన్ పనులు మొదలై 1874 నాటికి పూర్తయ్యాయి. హైదరాబాద్ నుంచి 1874 అక్టోబర్ 8న తొలి ప్యాసింజర్ రైలు మూడు బోగీలు.. 150 మంది ప్రయాణికులతో నిజాం స్టేట్ రైల్వే ట్రాక్‌పై పరుగులు పెట్టింది.(హైæదరాబాద్ నుంచి వాడికి 115 మైళ్లు, 185 కిలోమీటర్లు). అదే రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రారంభమైంది. దీంతో స్వతంత్రంగా ఏర్పాటైన తొలి రైల్వేగా నిజాం రైల్వే ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్వేగా కూడా మరో రికార్డు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్లు, జంక్షన్లు, స్టేషన్లు అప్పట్లో సిద్ధమైనవే. కీలకమైన హైదరాబాద్–కాజీపేట–బెజవాడ లైన్ కూడా 1891 నాటికి రెడీ అయ్యింది. దీంతో మద్రాస్ రాష్ట్రంతో నిజాం స్టేట్‌కు దగ్గరి దారి కలిసింది. బొగ్గు రవాణా కోసం నల్ల బంగారు లోకం సింగరేణి పుట్టిల్లు ఇల్లెందుకు కూడా అప్పట్లోనే ట్రాక్ వేశారు. మద్రాస్‌లో తొలి గూడ్స్ రైల్ బ్రిటిష్ పాలిత భారతదేశంలో మద్రాస్‌లో రైలు రవాణా వ్యవస్థ కోసం 1832లో ప్రణాళికలు రచించారు. తొలిసారి 1837లో మద్రాస్ రెడ్ హిల్స్ రైల్వేస్టేషన్ నుంచి చింతాద్రిపేట్ వరకు రైలు నడిపించారు. విలియమ్స్ ఎవిరీ రూపొందించిన రోటరీ స్టీమ్ ఇంజన్ ద్వారా సర్ ఆర్థర్ కాటన్ ఈ రైలును రూపొందించారు. తొలి రోజుల్లో మద్రాస్‌లో రోడ్లు, భవనాల నిర్మాణం కోసం గ్రానైట్, రాళ్లు తరలించేందుకు గూడ్స్ రైలుగా నడిపించారు. ఆ తర్వాత 1845లో ధవళేశ్వరంలో రైల్వే లైన్ నిర్మాణం జరిగింది. అదే ఏట ఆర్థర్ కాటన్ గోదావరి వంతెన నిర్మాణం కూడా ప్రారంభించారు. వంతెన నిర్మాణానికి రాళ్లను రైల్ ద్వారా తీసుకెళ్లారు. ఇదే ఏడాది మే 8న మద్రాస్ రైల్వే ఏర్పాటైంది. స్వాతంత్య్రానికి పూర్వమే అన్ని ప్రాంతాలకూ రవాణా 1891 నాటికి నిజాం స్టేట్ రైల్వే వేసిన బ్రాడ్ గేజ్ లైన్ 467 మైళ్లు. 1901 వచ్చే సరికి 391 మైళ్ల మీటర్ గేజ్ లైన్స్ నిర్మించారు. 1884లో నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే కంపెనీగా రూపాంతరం చెందింది. ఈ సంస్థ 1930లో తిరిగి పూర్తిగా హైదరాబాద్ స్టేట్ అధీనంలోకి వచ్చింది. నిజాం స్టేట్ రైల్వేకు అనుబంధంగా మరో సంస్థ ఉండేది. అదే గోదావరి వ్యాలీ రైల్వే. మహారాష్ట్రలోని మన్మాడ్‌ను లింక్ చేసే ప్రధాన లైన్ 1897లో మంజూరైంది. మూడేళ్లలో పనులన్నీ పూర్తై 1900 సంవత్సరంలో హైదరాబాద్–మన్మాడ్ మధ్య రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీని కలిపే మరో లైన్ కాజీపేట–బలార్షా. అత్యంత కీలకమైన ఈ లైన్ పనులు 1921లో ప్రారంభమై దశలవారీగా పూర్తవుతూవచ్చాయి. పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, ఆసిఫాబాద్, కాగజ్నగర్లను కలుపుతూ 1928 నాటికి సంపూర్ణంగా వినియోగంలోకి వచ్చింది ఈ మార్గం. ఇక 117 మైళ్ల సికింద్రాబాద్–గద్వాల్ లైన్ 1914లో ప్రారంభమై 1916 నాటికి వినియోగంలోకి వచ్చింది. కారేపల్లి–కొత్తగూడం లైన్ 1925 నాటికి పని చేయడం ప్రారంభించింది. ముధ్ఖేడ్–ఆదిలాబాద్ లైన్ 1931లో వాడుకలోకి వచ్చింది. ఇలా హైదరాబాద్ నుంచి నలువైపులా పరుచుకున్న పట్టాలన్నీ అప్పట్లో నిర్మించినవే. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో ఉన్న స్టేషన్లన్నీ ఆనాడు నిర్మించినవే. ఉమ్మడి రైల్, రోడ్ వ్యవస్థ మరో ప్రత్యేకత నిజాం రైల్వేకు ఉన్న మరో ప్రత్యేకత ఉమ్మడి రైల్, రోడ్డు వ్యవస్థ. 1932 జూన్ 15న రోడ్డు, రైలును లింక్ చేస్తూ జాయింట్ స్టీమ్‌ను తయారు చేశారు. దేశంలో అది తొలి ప్రయోగం. 1930లోనే మిచెల్ కార్కిక్ కమిటీ దేశంలో రోడ్డు, రైల్ రవాణా వ్యవస్థలను ఒకే సంస్థ నిర్వహణలో ఉంచాలని సిఫార్సు చేస్తూ నివేదిక ఇచ్చింది. ఇతర రాష్ట్రాల్లో ఈ సిఫార్సుల అమలు సాధ్యం కాలేదు. హైదరాబాద్ స్టేట్ మాత్రం వెంటనే అమలులో పెట్టి అద్భుత ఫలితాలను సాధించింది. మొత్తం దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని ప్రధాన లైన్లు, జంక్షన్లు, స్టేషన్లు నిజాం హయాంలో నిర్మించినవే. హైదరాబాద్‌ను ఉత్తర, దక్షిణ భారతదేశాలతో కలిపే రైల్వే లైన్ పనులన్నీ 19వ శతాబ్దంలోనే పూర్తయ్యాయి. 1950 నాటికి 2,353 కిలోమీటర్ల పట్టాలను పరిచింది నిజాం రైల్వే. నిజాం స్టేట్ రైల్వేను 1950లో కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సెంట్రల్ రైల్వేలో కలిపేసింది. అది 1966 నుంచి సౌత్ సెంట్రల్ రైల్వేగా మారింది. బొంబాయిలో తొలి ప్యాసింజర్ రైలు దేశంలో తొలి ప్యాసింజర్ రైలు బొంబాయి(బొరిబందర్) నుంచి థానే వరకూ 1853 ఏప్రిల్ 8న నడిచింది. 14 బోగీలతో మూడు స్టీమ్ లోకోమోటివ్ ఇంజిన్లు సాహెబ్–సింధ్–సుల్తాన్ పేర్లతో 34 కిలోమీటర్లు 400 మంది ప్యాసింజర్లతో నడిపించారు. 1854 ఆగస్టు 15న కలకత్తా హౌరా నుంచి హుబ్లీ వరకూ 24 మైళ్లు ప్యాసింజర్ రైలు నడిపించారు. 1884లోనే బొంబాయి–థానే నుంచి కళ్యాణ్ వరకు రైల్వే లైన్ పొడిగించారు. ఇందుకోసం ఉల్లాస్ నదిపై దేశంలోనే తొలి రైలు వంతెన దపూరీ వయాడక్ట్‌ను నిర్మించారు. దక్షిణాదిన 1856 జూలై 1న మద్రాస్‌లోని రాయపురం/వేయసరపాడి నుంచి వల్లజా రోడ్(ఆర్కాట్) వరకు 60 మైళ్ల దూరం నడిపించారు. ప్రత్యేక రైలు బోగీ నిజాం పాలకులు ప్రయాణించడానికి ప్రత్యేక రైలు బోగీని తయారు చేయించారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ 1904లో ఢిల్లీ దర్బార్‌కు వెళ్లేటప్పుడు ఈ ప్రత్యేక రైలు బోగీలోనే బయలుదేరారు. ఈ రైలులో నిజాం పాలకుల కోసం బెడ్రూమ్, కిచెన్, సెలూన్, బాత్రూమ్ ఉండేవి. సికింద్రాబాద్ గూడ్స్ రైలు గ్యారేజ్‌లో ఈ బోగీ ఉండేది. 2003లో ఎంఎంటీఎస్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం(ఎంఎంటీఎస్). ఇది సబర్బన్ రైల్వే వ్యవస్థ. రాష్ట్ర ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే సంయుక్తంగా హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేశాయి. నగరంలోని 43 కిలోమీటర్ల(27 మైళ్లు) పరిధిలోని 27 స్టేషన్లను కలుపుతూ 2003 ఆగస్టు 9న అప్పటి ఉప ప్రధాని ఎల్కే అద్వానీ ఎంఎంటీఎస్‌ను ప్రారంభించారు. ఈ రైల్వే లైన్ ఏర్పాటుకు రూ.178 కోట్లు ఖర్చు చేశారు. తొలి దశలో ఫలక్‌నుమా–సికింద్రాబాద్, నాంపల్లి–సికింద్రాబాద్, సికింద్రాబాద్– లింగంపల్లి, లింగంపల్లి– నాంపల్లి రూట్లలో ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నా యి. రెండో దశలో ఫలక్‌నుమా నుంచి ఉందానగర్, సికింద్రాబాద్ నుంచి మనోహరాబాద్ వరకు పొడిగించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ పనులు ప్రారంభం కాలేదు. -
తండా రోడ్లకు మహర్దశ..
సాక్షి, హైదరాబాద్: గతుకుల ప్రయాణం ఇక గతించనుంది. కాలిబాటలు కనుమరుగు కానున్నాయి. తండాతండాకు బీటీ రోడ్డు దర్శనమివ్వనుంది. గిరిజన ఆవాసాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టంలోనూ ఈ అంశానికి ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రంలో 12,905 గిరిజన తండాలుండగా వీటిలో 4,673 తండాలకు తారురోడ్డు సౌకర్యం లేదు. ఇందులో సగం తండాలకు మెటల్ రోడ్లు ఉన్నా సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడంతో కాలిబాటలుగానే మిగిలిపోయాయి. ఈ క్రమంలో 2017–18 వార్షిక సంవత్సరంలో వీలైనన్ని ఎక్కువ తండాలకు రోడ్లు నిర్మించాలని సంకల్పించిన గిరిజన సంక్షేమ శాఖ ప్రస్తుతానికి 721 ఆవాసాలను గుర్తించి నిర్మాణ పనులకు అంచనాలు ఖరారు చేసింది. ప్రాధాన్యతాక్రమంలో నిర్మాణం... : ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద ప్రతి గిరిజన ఆవాసానికి మౌలిక వసతులు కల్పించేలా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తండాలవారీగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జనాభా ఎక్కువగా ఉండి, రవాణా వసతి అదమంగా ఉన్న తండాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో ఐటీడీఏ పరిధిలో 487, మైదాన ప్రాంతాల్లో 234 ఆవాసాలున్నాయి. ఈ ఆవాసాల రోడ్ల కోసం ప్రభుత్వం రూ.450.17 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నిధులతో 761.21 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించనుంది. వీటిని తండా నుంచి ప్రధాన రహదారులకు అనుసంధానం చేస్తారు. ఇప్పటికే ఖరారైన పనుల టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఈ నెల చివరల్లోగా పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని 4,763 ఆవాసాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేయాల్సిన అవసరముంది. గతేడాది చివర్లో గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్లు సుమారు 7,988 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు నిర్మించాల్సి ఉందని తేల్చారు. -
నగరాల్లో సైకిళ్లకూ మార్గాలుండాలి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా నగరీకరణ పెరిగిపోతున్న నేపథ్యంలో నగరాల్లో రవాణా వ్యసవ్థలను సుస్థిర పద్ధతిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్ జామ్‌ల నివారణకు ప్రజారవాణా వ్యవస్థలను పటిష్టం చేయడంతోపాటు పాదచారులు, సైక్లిస్టులకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. శనివారం హైదరాబాద్‌లో అర్బన్ మొబిలిటీ ఇండియా సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకయ్య కీలకోపన్యాసం చేశారు. రవాణా సమస్యలను పరిష్కరించడంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలంటే నగరాల్లో మళ్లీ సైకిళ్లను అందుబాటులోకి తేవాలన్నారు. స్మార్ట్ సిటీస్ ద్వారా ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వెంకయ్య...కాలుష్యకారక వాహనాల నియంత్రణ, ఎలక్ట్రిక్ బస్సుల వాడకం, పార్కింగ్ లేకుంటే కొత్త కార్ల కొనుగోళ్లకు నిరాకరించడం వంటి చర్యల ద్వారా నగరాల్లో రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చవచ్చన్నారు. ప్రయాణాల్లోనే గంటల సమయం వృథా దశాబ్దాలుగా అనేక దేశాల్లో నగరాలు వేగంగా విస్తరించాయని, ఫలితంగా ఆయా ప్రాంతాల్లో వాహనాల వాడకమూ పెరిగి ఆర్థిక, సామాజిక, పర్యావరణ సమస్యలకు దారితీసిందని వెంకయ్యనాయుడు చెప్పారు. వాతావరణ మార్పులకు కారణమవుతున్న విషవాయు ఉద్గారాల్లో నాలుగో వంతు నగర ప్రాంత రవాణా వ్యవస్థల ద్వారానే వస్తుండటం గమనార్హమన్నారు. వాయు, శబ్ద కాలుష్యాల ప్రభావం ప్రజారోగ్యంపైనా పడుతోందని... నగరాల్లో ప్రయాణాల్లోనే గంటల సమయం గడచిపోతుండటం వ్యక్తుల ఉత్పాదకత, వ్యాపారాలనూ దెబ్బతీస్తోం దన్నారు. దేశంలో బస్సులు, మెట్రోల వంటి ప్రజారావాణ వ్యవస్థలకు ఆదరణ తగ్గుతోందని, 2011 నాటికి ప్రజారవాణాలో వాటి భాగస్వామ్యం 30 శాతం వరకు ఉండగా 2021 నాటికి అది 22 శాతానికి తగ్గిపోనుందన్నారు. సమర్థ రవాణా వ్యవస్థల లేమి ప్రభుత్వేతర రవాణా ఏర్పాట్లకు కారణమవుతోందన్నారు. ఈ సమస్యల న్నింటినీ పరిష్కరించేందుకు పెరుగుతున్న జనాభా, అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ రవాణా వ్యవస్థలకు రూపకల్పన చేయాలన్నారు. వాయు, శబ్ధ కాలుష్యాలను తగ్గించేందుకు భారీగా ప్రజారవాణ వ్యవస్థలను ప్రోత్సహించాల్సిన అవసరముం దని వెంకయ్య సూచించారు. ప్రభుత్వాలు వినూత్న పద్ధతుల్లో ఆలోచించాలి భారీ పెట్టుబడులతో కూడుకున్న మెట్రో రైలు వంటి ప్రజా రవాణా వ్యవస్థలను విస్తృతం చేసేందుకు ప్రభుత్వాలు వినూత్న పద్ధతుల్లో ఆలోచించాలని, పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యాలకు అవకాశం కల్పించాలని వెంకయ్య సూచించారు. ఇదే పద్ధతిలో సిద్ధమవుతున్న హైదరాబాద్ మెట్రో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య వ్యవస్థ అని గుర్తుచేశారు. అంతకుముందు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖ మంత్రి హర్దేవ్సింగ్ పూరి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాల్లో దాదాపు 380 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణాలు పూర్తవగా మరో 500 కిలోమీటర్లు నిర్మాణంలో ఉందన్నారు. దేశంలో 90 శాతం మంది బస్సులు, రైళ్ల వంటి ప్రజారవాణా వ్యవస్థలపై ఆధారపడుతుంటే మిగిలిన 10 శాతం మంది ప్రైవేటు వాహనాలతో రోడ్లను ఆక్రమిస్తున్నారన్నారు. సంపన్న వర్గాలు కూడా తమ ప్రైవేట్ వాహనాల స్థానంలో బస్సులను వాడటం మొదలుపెడితే రవాణా సమస్యలు గణనీయంగా తగ్గుతాయని సూచించారు. సదస్సులో ఫ్రాన్స్ సంస్థ కొడాటూ అధ్యక్షుడు డొమినిక్ బ్రూసౌ, ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ జిగ్లర్ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. -
మొబైక్.. ఇదో హైటెక్ సైకిల్
సాక్షి, హైదరాబాద్: లేటెస్ట్ మోడల్ కార్లు హల్చల్ చేసే విశ్వనగరం రోడ్లపై త్వరలో కిరాయి సైకిళ్లు కన్పించనున్నాయి! సైకిళ్లంటే మామూలు సైకిళ్లు కాదండోయ్.. హైటెక్ బైక్‌లకు ఏమాత్రం తీసిపోని విధంగా హైటెక్ హంగులతో రాబోతున్నాయి మొబైక్‌లు. బిజీ లైఫ్‌లో వ్యాయామం సాధ్యం కాని వారికి ఈ మొబైక్లతో ఆ చాన్స్ దొరకనుంది. వాహనాల కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు ఇంధనాన్ని పొదుపు చేయెచ్చు. త్వరలోనే మెట్రో రైల్ కారిడార్‌లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త రకం సైకిళ్లను కొనాల్సిన పని లేదు. పాతకాలం రోజుల్లో మాదిరిగా గంటల లెక్కన కిరాయికి తీసుకోవచ్చు. మెట్రో రైలు దిగగానే చూడచక్కని డిజైన్‌తో ఆకట్టుకునే ఇంపోర్టెడ్ సైకిలెక్కి వెళ్లాల్సిన చోటికి వెళ్లొచ్చు. హైదరాబాద్ లాంటి ట్రాఫిక్‌లో సైకిళ్లెక్కడ వర్కవుట్ అవుతాయనే చింతక్కర్లేదు! ఏ గల్లీలో నుంచైనా షార్ట్కట్లు ఉంటాయి. చిన్నప్పుడు సైకిల్ తొక్కినా తొక్కకపోయిన ఆరోగ్యం, అవసరం కోసం ఇప్పుడు అలవాటు చేసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. చైన్లెస్.. డిస్క్ బ్రేకులు.. మెట్రో మార్గాల్లో అందుబాటులోకి రానున్న మొబైక్ను వినూత్న పద్ధతిలో రూపొందించారు. ఇది సైకిల్ మాదిరే ఉన్నా.. సాధారణ సైకిల్‌కు ఉన్నట్లు చైన్ ఉండదు. పంక్చర్లెస్ టైర్లు ఉం టాయి. బ్రేక్ సిస్టం అత్యంత భద్రమైనది. సాధారణ సైకిళ్ల బ్రేకులు కొన్ని సందర్భాల్లో సకాలంలో సహకరించకపోవడంతో ప్రమాదాలకు దారితీస్తుంది. మొబైక్లో బ్రేక్ వ్యవస్థ మోటారు సైకిళ్ల మాదిరిగా డిస్క్ సిస్టంతో రూపొందించారు. ఒక్కరు మాత్రమే ప్రయాణించే వీలున్న ఈ మొబైక్కు అత్యాధునిక పద్ధతిలో సీటింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. సరుకులు తీసుకెళ్లేందుకు వీలుగా స్ట్రాంగ్ బాస్కెట్ ఉంటుంది. విదేశాల్లో విజయవంతంగా.. ప్రస్తుతం సింగపూర్, జపాన్, మలేసియా, అమెరికా, చైనా, యూకే, ఇటలీ, థాయ్‌లాండ్ దేశాల్లోని 180 నగరాల్లో 70 లక్షల మొబైక్‌లు విజయవంతంగా నడుస్తున్నాయి. రోజుకు సగటున 2.5 కోట్ల మంది వీటిని నడుపుతుండగా.. 15 కోట్ల మంది ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్నారు. త్వరలో ఇండియాలోని మెట్రో నగరాల్లో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు మొబైక్ సంస్థ ఏర్పాట్లు వేగవంతం చేసింది. భారత మార్కెట్‌కు అనుగుణంగా వీటిని మరింత అభివృద్ధి చేసి అందుబాటులోకి తెస్తామని సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. శనివారం హైటెక్స్‌లో జరిగిన అర్బన్ మొబిలిటీ ఇండియా–2017 సదస్సులో మొబైక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంకేతిక హంగులు... మొబైక్ల నిర్వహణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించారు. ప్రస్తుతం ఇవి మెట్రో మార్గాల్లో అద్దె పద్ధతిలో అందుబాటులోకి వస్తున్నాయి. మెట్రో రైల్ స్టేషన్ నుంచి వీటిని కిరాయికి తీసుకోవచ్చు. ఇందుకు ప్రత్యేకించి వ్యవస్థ ఏమీ ఉండదు. అంతా సాంకేతిక పరిజ్ఞానంతోనే ప్రక్రియ పూర్తవుతుంది. మొబైక్ను అద్దెకు తీసుకోవాలనుకున్న వారి వద్ద సెల్‌ఫోన్ తప్పనిసరిగా ఉండాలి. అందులో మొబైక్ యాప్ డౌన్లో చేసుకున్న తర్వాత మొబైక్పై ఉండే క్యూఆర్ కోడ్‌ను చూపిన వెంటనే తాళం తెరుచుకుంటుంది. అప్పట్నుంచి అద్దె సమయం మొదలవుతుంది. గమ్యస్థానాన్ని చేరిన తర్వాత తిరిగి మొబైక్ స్టోర్‌లో నిలిపేయాలి. అద్దె చెల్లింపులకు సంబంధించి నిధులను యాప్‌లో ముందస్తుగా నిల్వ ఉంచుకోవాలి. మొబైక్‌లు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టంతో నడుస్తాయి. అందుకు ప్రత్యేక వ్యవస్థ అందులో ఉంటుంది. మొబైక్‌లను దారిమళ్లించే ప్రయత్నం చేస్తే రైడర్ మొబైల్ నంబర్‌తో పాటు జీపీఎస్ సిస్టంతో ఇట్టే పట్టేయొచ్చు. -
సైబర్ నేరాలకు బ్లాక్‌చెయిన్‌తో చెక్
సాక్షి, విశాఖపట్నం: బ్లాక్‌చెయిన్ సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తులో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీకి విశాఖ రాజధానిగా నిలుస్తుందని చెప్పారు. రెండు రోజుల పాటు జరగనున్న బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సదస్సును సోమవారం విశాఖలోని నోవాటెల్ హోటల్లో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలో తొలిసారిగా భూముల రిజిస్ట్రేషన్లు, రవాణా వ్యవస్థలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన రాష్ట్రంగా ఏపీ ప్రసిద్ధి చెందుతుందన్నారు. నగదు రహిత లావాదేవీల నిర్వహణకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపకరిస్తుందన్నారు. రెండు రోజుల పాటు అగ్రి హ్యాకథాన్ విశాఖలో వచ్చే నెల 17, 18 తేదీల్లో అగ్రి హ్యాకథాన్ బిజినెస్ కాన్ఫరెన్స్ జరుగుతుందని, దీనికి మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ హాజరవుతున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. వ్యవసాయాధారిత భారతదేశంలో భూసార పరీక్షలు చేసి.. తద్వారా దిగుబడులు పెంచుకునే అంశంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చిస్తారన్నారు. కాగా, విశాఖ నగరంలో అమలు చేయనున్న భూగర్భ విద్యుత్ కేబుల్ ప్రాజెక్టుకు పాండురంగాపురం సబ్‌స్టేషన్ వద్ద చంద్రబాబు శంకుస్థాపన చేశారు. గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్న థామ్సన్ రాయ్‌టర్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని చంద్రబాబు ప్రారంభించారు. కాండ్యెంట్ సహకారంతో రాష్ట్రంలో 5 వేల ఉద్యోగాల కల్పనకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐసీఐసీఐ, మహీంద్ర ఫైనాన్స్ సంస్థలు ఫిన్‌టెక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అగ్రి హ్యాకథాన్ అంటే..: భూముల సమగ్ర సమాచారం, జీపీఎస్ విధానంలో హద్దులు, యాజమాన్య వివరాలు సేకరించి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా భద్రపరుస్తారు. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉంటుంది. డ్రోన్ కెమెరాలను వినియోగించి భూ సారాన్ని సేకరిస్తారు. వీటికనుగుణంగా ఏ పంటలు పండించవచ్చో తెలుసుకునే వీలుంటుంది. పైన పేర్కొన్న సమాచారాన్నంతటినీ సేకరించేందుకు బ్లాక్‌చెయిన్‌తో పాటు నూతన సాంకేతికతను వినియోగించి భూ వివరాలను నిక్షిప్తం చేసే ప్రాజెక్టును రూపొందించిన వారితో నిర్వహించే సదస్సును అగ్రి హ్యాకథాన్‌గా పేర్కొంటారు. ప్రపంచ విత్తన కేంద్రంగా ఏపీ: సీఎం సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రపంచ విత్తన కేంద్రంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని సీఎం నారా చంద్రబాబు అన్నారు. దేశ విదేశాలకు ఇక్కడి నుంచే విత్తనాలను ఎగుమతి చేస్తామన్నారు. కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలం తంగెడంచ వద్ద మెగా సీడ్ పార్క్‌కు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. మొత్తం 650 ఎకరాల్లో రూ. 600 కోట్ల పెట్టుబడితో అమెరికాలోని అయోవా యూనివర్సిటీతో కలిసి ఈ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇక్కడ కొత్త విత్తనాల పరిశోధనతో పాటు సీడ్ కంపెనీలకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని, రైతులకూ భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు. మూడో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ఆయన కర్నూలు జిల్లాలో ప్రారంభించారు. మూడో విడతలో మొత్తం రూ.3,600 కోట్లతో ఖాతాదారులకు లబ్ధి కలగనుందని వెల్లడించారు. రుణమాఫీపై కొంత మంది విమర్శలు చేస్తున్నారని, అన్ని సరిగ్గా ఉండి రుణమాఫీ కాకుండా ఉంటే ముందుకు రావాలని సవాల్ చేశారు. తానిచ్చిన లక్షన్నర రుణమాఫీ తీసుకుని తననే విమర్శిస్తున్నారని మండిపడ్డారు. -
బెంగళూరు బస్సు.. బహుబాగు బాసూ!
ప్రజా రవాణా వ్యవస్థలో అత్యుత్తమ సేవలందిస్తున్న బెంగళూరు.. 400 కోట్ల నష్టంతో, తీవ్ర కష్టాల్లో కునారిల్లుతున్న హైదరాబాద్ సిటీ ఆర్టీసీ ♦ బెంగళూరు వ్యాప్తంగా బీఎంటీసీ బస్సులు 6,350 ♦ మరో 1,600 బస్సుల కొనుగోలుకు ప్రణాళిక ♦ మరోవైపు ఏటా బస్సులను తగ్గిస్తున్న హైదరాబాద్ ♦ 3,700 బస్సులు నడుపుతూ.. భారీ నష్టాల్లో సంస్థ సాక్షి, హైదరాబాద్: రెండు మహా నగరాలు.. కోటి చొప్పున జనాభా! సాఫ్ట్వేర్ పరిశ్రమలో దేశానికే రెండు కళ్లు!! కానీ ప్రజా రవాణా వ్యవస్థ నిర్వహణలో మాత్రం భూమ్యాకాశాలకు ఉన్నంత తేడా! ఈ రెండు మహా నగరాల్లో ఒకటి... అత్యుత్తమ ప్రజా రవాణా సంస్థగా గుర్తింపు పొందిన బెంగళూరు. మరోటి... ముక్కుతూ మూలుగుతూ పుట్టెడు నష్టాలతో ఆపసోపాలు పడుతున్న హైదరాబాద్ ఆర్టీసీ వ్యవస్థ! ఓవైపు మెట్రో రైలు, మరోవైపు కొత్త పుంతలు తొక్కుతున్న ప్రైవేటు క్యాబ్ సర్వీసులు, ఆటోలు, సొంత వాహనాలు.. ఇలా పోటీ ఎంతున్నా బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (బీఎంటీసీ) సగర్వంగా ముందుకు సాగుతోంది. కానీ క్రమంగా బస్సుల సంఖ్య తగ్గించుకుంటూ సాయం కోసం హైదరాబాద్ సిటీ బస్సు వ్యవస్థ నిస్తేజంగా మారుతోంది. గతేడాదితో పోలిస్తే నగరంలో వంద బస్సులు తగ్గగా.. అటు బెంగళూరులో కొత్తగా 1,600 బస్సులు కొనేందుకు రంగం సిద్ధం చేస్తోంది.. బెంగళూరు విజయ రహస్యమిదే ఢిల్లీలోని సాలీనా ఆర్టీసీ కార్పొరేషన్ సగటున రూ.వెయ్యి కోట్లు, ముంబై రూ.855 కోట్లు నష్టపోతుంటే, ఇప్పుడు భాగ్యనగరం వాటితో పోటీకి సై అంటూ 2016–17లో రూ.400 కోట్లు నష్టాల మూటగట్టుకుంది. బీఎంటీసీ మాత్రం నాలుగేళ్ల క్రితం వరకు లాభాల్లోనే ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్లు నష్టపోయింది. అర్బన్ ప్రాంతాల్లోనే ఈ నష్టాలు నమోదు కావడం గమనార్హం. ప్రపంచంలో ఎక్కడైనా అర్బన్ ప్రాంతాల్లో నష్టాలు పరిపాటి. అలా చూస్తే అతి తక్కువ నష్టాలున్నది బీఎంటీసీకే. 1. ట్రాఫిక్ చిక్కుల్లో బెంగళూరు కూడా ఇతర నగరాలకు తీసిపోదు. కానీ అనుసంధాన మార్గాలు, వంతెనలు, వన్‌వే నిబంధనలు, రోడ్ల విస్తరణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట తదితరాలతో అడ్డంకులను అధిగమిస్తోంది. 2. మెయిన్ రోడ్‌కు ఇరువైపులా కాలనీల్లోకి బస్సులు వెళ్లేలా రోడ్లను తీర్చిదిద్దారు. మొదటి కాలనీ అప్రోచ్ రోడ్డు 40 అడుగులుంటే, తదుపరి కాలనీ రోడ్డూ అంతే ఉంటుంది. 3. ప్రతి నెలా 4వ తేదీన బస్ డే ఉంటుంది. ఆ రోజు జనం బస్సుల్లోనే ప్రయాణిస్తారు. 4. ఏకంగా 655 ఏసీ బస్సులున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాటికి అలవాటు పడేలా చేశారు. 5. ఆర్టీసీ అధికారులు నిత్యం పర్యటిస్తుంటారు. కొత్త మార్గాల అన్వేషణ బృందాలూ ఉన్నాయి. 6. ప్రభుత్వం ఏటా బడ్జెట్ నిధులు కేటాయిస్తోంది. 7. ప్రత్యేకంగా బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సీనియర్ ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించారు. హైదరాబాద్ సమస్యలివే.. ⇒ ఆర్టీసీ బస్సులు ప్రధాన రోడ్లకే పరిమితమవుతున్నాయి. కాలనీల్లోకి తక్కువ సంఖ్యలో తిరుగుతుండటంతో అవి ప్రయాణానికి అనుకూలం కాదని జనం భావిస్తున్నారు. రోడ్ల ఆక్రమణలు, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనా మందిరాలు, సరైన ప్రణాళిక లేకుండా రోడ్ల నిర్మాణం కారణంగా బస్సులు కాలనీల్లోకి, బస్తీల్లోకి వెళ్లలేకపోతున్నాయి. ⇒ తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకునే విషయంలో ప్రభుత్వపరంగా బడ్జెట్ కేటాయింపుల భరోసా లేదు. బకాయిల చెల్లింపూ లేదు. ⇒ బస్సులెక్కేలా నగర ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు శూన్యం. సొంత వాహనాలను నియంత్రించే చర్యలు లేవు. పార్కింగ్ వసతి ఉంటేనే వాహనం కొనాలనే బెంగళూరు నిబంధనా ఇక్కడ లేదు. కాలనీల్లోనూ పరుగుపెట్టాలి.. కేవలం హైవేల మీదుగానే బస్సులు నడుస్తున్నంత కాలం హైదరాబాద్‌లో ప్రజా రవాణా మెరుగవడం కష్టమే. కాలనీలకూ వెళ్లాలి. బెంగళూరులో మెజిస్టిక్ నుంచి బన్నేర్‌గట్ట హైవేకు దూరంగా (దాదాపు 25 కి.మీ.) ఉండే అరికెరా వంటి ప్రాంతానికీ నిత్యం సిటీ బస్సులుంటాయి. అవి కాలనీల మీదుగా వెళ్తాయి గనుక కార్లున్న వారూ వాటిలోనే వెళ్తుంటారు. – ఈమని శివనాగిరెడ్డి, రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి మెరుగ్గానే నిర్వహిస్తున్నాం సిటీ బస్సుల నిర్వహణ మెరుగ్గానే ఉందని చెప్పాలి. భారీగా కొత్త బస్సులు కొనాలని ప్లాన్ చేశాం, ఇటీవల 80 ఏసీ బస్సులు అందుబాటులోకి తెచ్చాం. మినీ బస్సులూ ప్రారంభించాం. సొంత వాహనాల వాడకాన్ని తగ్గిస్తే సిటీ బస్సులు మంచి సేవలందిస్తాయి – పురుషోత్తం నాయక్, ఈడీ, హైదరాబాద్ సిటీ జోన్ ప్రభుత్వ దృక్పథం మారాలి ‘నగరంలో ఏటా ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గటం మంచి పరిణామం కాదు. ప్రజలు సిటీ బస్సుల్లో ఎక్కువగా ప్రయాణించేలా ప్రభుత్వం కార్యాచరణ ఏర్పాటు చేయాలి. బెంగళూరును అధ్యయనం చేసి ఇక్కడా అలాంటి చర్యలు తీసుకోవాలి’ – నాగేశ్వరరావు ఆర్టీసీ కార్మిక సంఘం నేత -
భాగ్యనగరి..బుల్లి రైలు...
సిటీబ్యూరో: చారిత్రక వారసత్వం కలిగిన పురాతన నగరం హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగే క్రమంలో సరికొత్త రవాణా వ్యవస్థలనూ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఈ సంవత్సరంలో పట్టాలెక్కనున్న మెట్రోరైలుతో పాటు నగరంలో మరో సరికొత్త రవాణా వ్యవస్థ ‘న్యూ జనరేషన్ ట్రామ్ వే ’కూ ఏర్పాట్లు చేస్తున్నారు. సిస్టర్ సిటీ ఒప్పందంలో భాగంగా ఫ్రాన్స్‌లోని బోర్డెక్స్ నగరంలోని ట్రామ్‌వేలను పరిశీలించిన మేయర్, అధికారులు మన నగరానికీ ట్రామ్వేలు అత్యంత అనుకూలమైనవని అంచనా వేశారు. బోర్డెక్స్ సిటీకి, హైదరాబాద్‌కు వివిధ అంశాల్లో సామీప్యతలుండటంతో అక్కడ నిత్యం వేలాదిమందిని గమ్యస్థానాలకు చేరుస్తున్న ట్రామ్‌వేలను నగరంలో ప్రవేశపెట్టాలని ఆలోచించారు. తొలుత చారిత్రక ప్రాధాన్యం సంతరించుకున్న, పర్యాటక ఆకర్షణ కలిగిన, పాదచారుల పథకం అమలవుతున్న చార్మినార్ వద్ద ఈ ప్రాజెక్టును అమలు చేయాలని భావించారు. మొజంజాహి మార్కెట్ నుంచి చార్మినార్ వరకు 2.9 కి.మీ.ల మేర ట్రామ్వే ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు, ఖర్చు తదితరమైనవి అంచనా వేసేందుకు నగరానికి వచ్చిన ఫ్రెంచ్ ప్రతినిధుల బృందం సోమవారం పాదచారుల పథకాన్ని పరిశీలించింది. అనంతరం ఆస్కిలో నగరంలోని వివిధ విభాగాల అధికారులతో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్ మంగళవారం కూడా కొనసాగనుంది. మంగళవారం మోజాంజాహిమార్కెట్ నుంచి చార్మినార్ వరకు ట్రామ్వే ఏర్పాటు సాధ్యాసాధ్యాలు, ఖర్చు తదితరమైనవి పరిశీలించి ఒక నివేదిక రూపొందిస్తారు. ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాక, ప్రభుత్వ ఆమోదంతో పనులు చేపడతామని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. మలి దశలో కుతుబ్షాహి టూంబ్స్ నుంచి గోల్కొండ కోట వరకు కూడా ట్రామ్వే ఏర్పాటు ఆలోచన ఉందన్నారు. ముఖ్యంగా ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో వీటి ఏర్పాటు ద్వారా అటు పర్యాటకులకు ఆకర్షణగానే కాక, ఇటు కాలుష్య తీవ్రత తగ్గుతుందని భావిస్తున్నారు. ఇందుకనుగుణంగా ట్రామ్వే ఏర్పాటయ్యే ప్రాంతాల్లో తగినంత పార్కింగ్ సదుపాయం కల్పించే యోచనలో ఉన్నారు. ఇతర నగరాల్లో.. ఫ్రాన్స్‌లోని బోర్డెక్స్తోపాటు మనదేశంలోని ముంబై, కోల్కత్తా వంటి నగరాల్లోనూ ట్రామ్వేలున్నాయి. చార్మినార్ చుట్టూ దాదాపు 7.7 కి.మీ. ల మేర ఔటర్‌రింగ్ రోడ్, 2.6 కి.మీల మేర ఇన్నర్‌రింగ్ రోడ్ పనులు దాదాపు పూర్తికావచ్చాయని అధికారులు పేర్కొన్నారు. చార్మినార్ వద్ద చిరువ్యాపారులను తరలించేందుకు సాలార్జంగ్ మ్యూజియం వద్ద మూసీపై బ్రిడ్జి నిర్మించే అంశం కూడా పరిశీలనలో ఉంది. మనకెంతో అవసరం... దాదాపు ఐదాలరు లక్షల జనాభా కలిగిన బోర్డెక్స్లోనే ట్రామ్వేలుండగా, కోటిమంది జనాభా కలిగిన హైదరాబాద్‌లో వీటి ఆవశ్యకత ఎంతైనా ఉందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ వర్క్‌షాప్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ అన్నారు. ప్రజారవాణాతోనే ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారమన్నారు. పర్యాటకంగా మనకెన్నో అపురూప సంపదలున్నా తగినవిధంగా పర్యాటకులను ఆకర్షించడంలో వెనుకబడి ఉన్నామని చెబుతూ, వీలైన అన్ని మార్గాల్లో ట్రామ్‌వేలను పరిశీలిస్తామన్నారు. శివార్ల దాకా ఈ రవాణా ఉంటే నగరం వెలుపలే డబుల్బెడ్రూమ్ ఇళ్లు కట్టవచ్చునని చెప్పారు. ప్రయాణ సదుపాయం లేకే పలువురు నగరం వెలుపలకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారని చెప్పారు. దీంతోపాటు మూసీ సుందరీకరణ అంశాన్నీ బోర్డెక్స్ ప్రతినిధులతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. పాదచారుల పథకానికి అనుసంధానం.. నగరంలో దాదాపు దశాబ్దం క్రితం ప్రారంభమైన చార్మినార్ పాదచారుల పథకం పనులు మరో నాలుగైదు నెలల్లో పూర్తికానుండటంతో దానికి అనుసంధానంగా ట్రామ్‌వేను అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఖిల్వత్ వద్ద మల్టీలెవెల్ కార్ పార్కింగ్ పనులు కూడా చేపడుతున్నారు. పాదచారుల పథకానికి దాదాపు రూ. 35.10 కోట్లు ఖర్చు చేస్తున్నారు. -
రైల్వేల్లో మార్పు ప్రతిబింబించాలి
రాజకీయాలకు అతీతంగానే రైల్వే బడ్జెట్ తొలగింపు: మోదీ న్యూఢిల్లీ: రైల్వే శాఖ కొత్త వేగం, పురోగతి, కొత్త సామర్థ్యన్ని అందుకుని.. ఈ శతాబ్దపు మార్పును ప్రతిబింబింపజేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ శివార్లలోని సూరజ్‌కుండ్‌లో నిర్వహించిన ‘రైల్వే వికాస్ శిబిర్’లో పాల్గొన్న రైల్వే ఉద్యోగులనుద్దేశించి మోదీ వీడియో కాన్ఫరెన్సలో ప్రసంగించారు. దేశంలో హైస్పీడ్ రైళ్లను ప్రారంభించేందుకు మోదీ సర్కారు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కొత్త వేగంతో రైల్వేశాఖ పరుగులు తీయాలని సూచించారు. 92 ఏళ్ల రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సాంప్రదాయాన్ని రాజకీయాలకు అతీతంగానే (ఎలాంటి స్వలాభాన్ని ఆశించకుండా) ధైర్యంగా నిర్ణయం తీసుకుని రద్దుచేసినట్లు వెల్లడించారు. ‘చిన్నప్పటినుంచి రైల్వే స్టేషన్లో చాయ్ అమ్మిన నాకు.. రైల్వేలతో మరపురాని అనుబంధం ఉంది. దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థను చాలా దగ్గరినుంచి చూశాను. ఆ శతాబ్దం మారింది. రైల్వేల్లోనూ మార్పు రావాలి. కొత్త శతాబ్దంలో సాంకేతికతను అందిపుచ్చుకుని మరింత బలమైన వ్యవస్థగా రైల్వేలు ఎదగాలి’అని ప్రధాని అన్నారు. రైల్వేల అభ్యున్నతికి సంస్థ ఉద్యోగుల చిత్తశుద్ధే కారణమన్నారు. చిన్న స్థారుు రైల్వే ఉద్యోగి కూడా తన కుమారుడు ఉన్నత శిఖరాలకు చేరేలా ఆశించాలన్నారు. రైల్వేల పనితీరులో మార్పులు తీసుకొచ్చి ఉద్యోగుల మధ్య ఓ కుటుంబ వాతావరణం ఏర్పర్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. -
నిధులున్నా పనులు సున్నా
గ్రామాల అభివృద్ధికి రవాణావ్యవస్థ ముఖ్యమని గ్రహించిన తెలంగాణ సర్కార్ రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు వెచ్చిస్తున్నా కాంట్రాక్లర్ల నిర్లక్షయంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. టెండర్లు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్లు ఏళ్ల తరబడిగా కాలయాపన చేస్తున్నారు. వీరి నిర్లక్ష్యానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మెదక్ రూరల్: మెదక్ (హవేళిఘనాపూర్) మండల పరిధిలోని మెదక్-భోదన్ ప్రధాన రహదారికి ఆనుకుని బూర్గుపల్లి గేటు నుంచి వాడీ, రాజ్‌పేట, కొత్తపల్లి మీదుగా పొల్కంపేట వరకు సుమారు 12 కి.మీ. రోడ్డు వేసేందుకు రెండేళ్ల్ల క్రితం పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.1.40 కోట్లు మంజూరు చేశారు. పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్ కొన్ని నెలల తర్వాత ప్రారంభించారు. కేవలం రెండు కి.మీ. మేర డాంబర్ కోటింగ్ వేసి పనులు నిలిపివేశాడు. అలాగే మండల పరిధిలోని హవేళిఘనాపూర్ వైపీఆర్ కళాశాల నుంచి లింగ్సాన్‌పల్లి, తిమ్మాయిపల్లి, బ్యాతోల్ మీదుగా మెదక్-రామాయంపేట ప్రధాన రహదారిలో గల ఔరంగాబాద్ తండా ప్రభుత్వ పాఠశాల వరకు గల 11 కి.మీ. రహదారి నిర్మించాలని ప్రభుత్వ ప్రతిపాదించింది. ఈ పనులు కూడా చేజిక్కించుకున్న కాంట్రాక్టర్ ఉన్న రోడ్డును కాస్తా తవ్వి వదిలేశాడు. పనులు పూర్తిచేయండా వదిలేయడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర బ్బందులుపడుతున్నారు. రోడ్ల పనులు పర్యవేక్షించాల్సిన అధికారులు ఇలా ఉదాసీనం ఉండటం ఎంతవరకు సమంజసమని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రోడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని కోరుతున్నారు. రోడ్డు పనులు చేపట్టాలి రోడ్డు ను వేస్తున్నామంటూ ఉన్న రోడ్డును కాస్త తవ్వేసారు, ఏళ్ల గడుస్తున్నా పనులు ప్రారంభం కావడంలేదు. దీంతో ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉంది. ఈదారిలో వందల సంఖ్యలో విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పటికైనా రోడ్డు పనులు చేపట్టాలి. - శ్రీనివాస్, తిమ్మాయిపల్లి కాంగ్రెస్ నాయకుడు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే పనులు ముందుకు సాగుతలేవు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా కాంట్రాక్టర్ల నిర్లక్ష ్యంతోనే పనులు ముందుకు సాగడంలేదు. కొత్తపల్లి వద్ద రెండు కి.మీ. రోడ్డు వేసి డాంబర్ సమస్య ఉందంటూ పనులు నిలిపేశారు. అప్పటి నుంచి కాంట్రాక్టర్ పత్తాలేడు. రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. - సాప రవి, గాజిరెడ్డిపల్లి రాకపోకలకు ఇబ్బందిగా ఉంది రోడ్డు పనులు ప్రారంభించకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఉన్న రోడ్డును తవ్వేసి అలాగే వదిలేశాడు. దీంతో రోడ్డంతా గుంతలు. రాళ్లు పైకితేలాయి. ఇలాంటి రోడ్డుపై ప్రయాణించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. -నర్సింహారెడ్డి, లింగ్సాన్‌పల్లి సర్పంచ్ -
పట్టు వీడం..
ప్రధాన డిమాండ్లు ⇒35 శాతం వేతన పెంపు ⇒ఒక విభాగం నుంచి మరో విభాగానికి సిబ్బందిని బదిలీ చేయడానికి వీలుగా నూతన పాలసీ రూపకల్పన ⇒ఎనిమిది గంటల పని ⇒ఆరునెలల శిక్షణ కాలం తర్వాత కచ్చితంగా ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. ⇒శిక్షణ కాలంలో రూ.18 వేల గౌరవవేతనం ⇒విశ్రాంత రవాణాశాఖ ఉద్యోగులకు కనిష్టంగా రూ.10 వేల పింఛన్, రూ.10 లక్షల వరకూ జీవితబీమా పాలసీ ⇒ఉన్నతాధికారుల తనిఖీల్లో టికెట్టు లేని ప్రయాణికులు పట్టుబడినప్పుడు కండక్టర్‌పై చర్యలు తీసుకోకూడదు. బెంగళూరు : అటు కార్మిక సంఘాల్లోను ప్రభుత్వంలోను పట్టువిడుపులు లేకపోవడంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో ప్రజల కష్టాలు వర్ణనాతీతం. తొలిరోజు కేఎస్ ఆర్టీసీ సమ్మె పూర్తిగా విజయవంతమైంది. తమ డిమాండ్లు పరిష్కరించాల్సిందే నంటూ కార్మికులు పట్టుబట్టగా ముందు సమ్మె విరమించండి ఆ తరువాత డిమాండ్ల గురించి ఆలోచిస్తాం అంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి చెప్పడంతో ఆర్టీసీ కార్మికులు స్పందించలేదు. 35 శాతం వేతన పెంపు అసాధ్యమంటూ సోమవారం మంత్రి రామలింగారెడ్డి మీడియాతో అన్నారు. ఇదిలా ఉంటే ఆదివారం అర్ధరాత్రి నుంచి కేఎస్ ఆర్టీసీ సిబ్బంది సమ్మెలోకి వెళ్లిపోవడంతో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో లక్షల మంది ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. మరోవైపు ప్రైవేట్ రవాణా సిబ్బంది అందినకాడికి దోచుకుంటున్నారు. వేతన సవరణతో ఇతర డిమాండ్లు పరిష్కరించాలని 1.25 లక్షల మంది సిబ్బంది ఒక్కసారిగా సమ్మె చేస్తుండటంతో 23 వేల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో సగటున రోజు ప్రభుత్వానికి రూ. 21 కోట్ల ఆదాయం గండిపడింది. ఇదిలా ఉండగా సమ్మె సందర్భంగా కొంతమంది దినసరి వేతనంపై కొంతమంది ప్రైవేటు వ్యక్తులతో కొన్ని చోట్ల బస్సులను నడపడానికి ప్రయత్నించగా ఆందోళకారులు బస్సులపై రాళ్లు రువ్వారు. దీంతో పదిమందికి గాయాలు కాగా 142 బస్సులు ధ్వంసమయ్యాయి. ఒక్కరోజే రూ. 12 లక్షల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి. ప్రైవేటు దోపిడీ : రెండు రోజుల పాటు ప్రైవేట్ రవాణాకు అనుమతి ఇవ్వడంతో వారు అందినకాడికి దోచుకున్నారు. వివిధ ఉపాధి, ఉద్యోగ నిమిత్తం పల్లెల నుంచి బెంగళూరు, మైసూరు, మంగళూరు వంటి నగరాలకు వచ్చేవారు ప్రైవేట్ బస్సులపైకి ఎక్కి గమ్యస్థానాలకు చేరుకోవడం కనిపించింది. ఇక వివిధ పట్టణాల్లో ఆస్పత్రులకు వచ్చే వారి పరిస్థితి వర్ణనాతీతం. సమ్మె విషయం తెలిసిన కొంతమంది రోగులు వారి సహాయకులతో ఆదివారం రాత్రికే ఆయా నగరాల బస్టాండ్లకు చేరుకున్నారు. అక్కడి నుంచి వెళ్లేందుకు రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఆటోలు, క్యాబ్‌లకు రెట్టింపు చార్జీలు చెల్లించి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు బెంగళూరు శివారులోని అత్తిబెలె నుంచి ఫోరంమాల్ వరకూ సాధారణ రోజుల్లో రూ.35 వసూలు చేసే ప్రైవేటు బస్సులు సోమవారం ఒక్కొక్కరి నుంచి రూ.87 వసూలు చేసింది. ఇక ఆటోవాలాలు ఇదే అదనుగా తీసుకుని రూ. 200 నుంచి 800 వరకు వసూలు చేశారు. ఇక సమ్మె నేపథ్యంలో మంగళవారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మెట్రోకు పెరిగిన డిమాండ్... సమ్మెలో భాగంగా బెంగళూరులో బీఎంటీసీ సేవలు కూడా నిలిచిపోవడంతో ‘మెట్రో’కు డిమాండ్ పెరిగింది. తమ గమ్యస్థానాలను చేరుకోవడానికి మెట్రోరైలును ఆశ్రయించే ప్రయాణికుల సంఖ్య పెరగడంతో బీఎంఆర్సీఎల్ అధికారులు ప్రతి ఆరు నిమిషాలకు ఒక మెట్రో రైలును ప్రజల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ ఉన్న మెట్రో సేవలను మరో గంట పాటు పెంచుతూ 11 గంటల వరకూ అందబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. అదనపు సర్వీసుల ఆలోచనలో... బెంగళూరులోని ‘శాంతలా సిల్క్స్’ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ సంస్థలు బస్సు సర్వీసులు నడుపుతున్న విషయం తెలిసిందే. సమ్మె ప్రభావం తమ సేవలపై కొంత మేర ప్రభావం చూపుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శాంతలా శిల్క్స్ చేరుకోవడానికి బీఎంటీసీ బస్సులు లేకపోవడంతో కొంతమంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో ప్రయాణికుల సంఖ్య తగ్గుతోంది. మరోవైపు మరోరెండురోజుల పాటు ఇక్కడి పరిస్థితులను చూసి ఏపీఎస్ ఆర్టీసీ అదనపు సర్వీసులను నడిపే ఆలోచనలో ఉంది. సాధారణంగా ప్రయాణాలను ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ వాయిదా వేసుకోలేరని అందువల్ల మరో రెండు రోజుల తర్వాత సాధారణం కంటే ఎక్కువగానే ప్రయాణికులు వస్తారని ఇక్కడి అధికారులు దీమా వ్యక్తం చేస్తున్నారు. అదే గనుక జరిగితే అదనపు సర్వీసులను కూడా నడిపే ఆలోచన ఉందని ఏపీఎస్ఆర్టీసీ బెంగళూరు విభాగం ఏటీఎం రవీంద్ర తెలిపారు. కార్మికులతో చర్చలు జరపాలి : మాజీ సీఎం కుమార మైసూరు: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమ్మెను విరమింపచేయాలని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కార్మికులకు వేతనాలు పెంచితే సంస్థ నష్టాలపాలవుతుందని చెబుతున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముందు సంస్థలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వేతనాలు పెంచాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నా పెడచెవిన పెట్టడంతో ఉద్యోగులు సమ్మెబాట పట్టారని పేర్కొన్నారు. ఇంధన ధరలు తగ్గినపుడు టికెట్ ధరలను తగ్గించ కుండా అటు ప్రజల్లోనూ, వేతనాలు పెంచకుండా ఇటు ఉద్యోగుల్లోనూ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని విమర్శించారు. -
పట్టణ జనాభా-రవాణా వ్యవస్థ
కాంపిటీటివ్ గెడైన్స్ : జనరల్ ఎస్సే ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ పెరుగుతోంది. ప్రపంచ జనాభా వృద్ధిరేటు కంటే పట్టణ జనాభా వృద్ధి అధికంగా ఉంది. ప్రపంచ పట్టణ జనాభా వార్షిక వృద్ధి మూడు శాతమని అంచనా. ప్రపంచ జనాభాలో సుమారు 50 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. 2011 లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో పట్టణ జనాభా 31.16 శాతంగా ఉంది. భారత్‌లో పట్టణీకరణని పరిశీలిస్తే.. పట్టణ జనాభాలో వృద్ధి అధికంగా ఉండటంతోపాటు పెద్ద నగరాల్లో జనాభా కేంద్రీకరణను గమనించొచ్చు. స్వాతంత్య్రానంతరం భారతదేశం మిశ్రమ ఆర్థిక విధానాన్ని అవలంబించింది. దీంతో ప్రైవేట్ రంగం అభివృద్ధి చెంది పట్టణ జనాభా పెరుగుదలకు కారణమైంది. 1901లో దేశ జనాభాలో పట్టణ జనాభా వాటా 11.4%. ఇది 2001లో 27.81 శాతానికి, 2011లో 31.16 శాతానికి పెరిగింది. వివిధ నివేదికలు ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం రాబోయే దశాబ్దాల్లో పెరిగే పట్టణ జనాభాలో భారత్, చైనా వాటా 1/3 వంతుగా ఉండనుంది. 2010 నుంచి 2050 మధ్య కాలంలో భారత్‌లో పట్టణ జనాభాకు అదనంగా 497 మిలియన్లు, చైనాలో 341 మిలియన్లు, నైజీరియాలో 200 మిలియన్లు, అమెరికాలో 103 మిలియన్లు, ఇండోనేషియాలో 92 మిలియన్ల మంది తోడవనున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. గత 40 ఏళ్లతో పోల్చినప్పుడు 2010 నుంచి 2050 మధ్య కాలంలో పట్టణ జనాభాలో పెరుగుదల భారత్, నైజీరియాలలో ఎక్కువగా ఉండనుంది. చైనాలో 2000-2050 మధ్య కాలంలో పట్టణ జనాభా పెరుగుదలకు పట్టణాభివృద్ధిని ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. ఇదే కాలంలో భారత్‌లో పట్టణ జనాభాలో 2/3 వంతు పెరుగుదలకు పట్టణాభివృద్ధి, 1/3 వంతు పెరుగుదలకు మొత్తం జనాభా పెరుగుదల దోహదపడతాయని నివేదికలు పేర్కొంటున్నాయి. ది గ్లోబల్ కమిషన్ ఆన్ ది ఎకానమీ అండ్ క్లైమేట్ 2014లో ‘న్యూ క్లైమేట్ ఎకానమీ’ పేరిట నివేదిక రూపొందించింది. దీని ప్రకారం 2031 నాటికి భారతదేశ పట్టణ జనాభా 600 మిలియన్లకు చేరనుంది. దేశ మొత్తం జనాభాలో ఇది 40 శాతంగా ఉండనుంది. రాబోయే 20 ఏళ్ల కాలంలో పట్టణ అవస్థాపనా పెట్టుబడిలో 827 బిలియన్ డాలర్ల లోటు ఉండే అవకాశం ఉంది. 2050 నాటికి అంచనా వేసిన వయసు కంటే ముందు సంభవించే మరణాలకు పట్టణ వాయుకాలుష్యం ప్రధాన కారణం అవుతుందని నివేదిక పేర్కొంది. పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా భారత్ అధిక ప్రయోజనం పొందగలదని ఎం.సి.కిన్సె నివేదిక పేర్కొంది. 2030 నాటికి నగరాలు 70 శాతం నికర నూతన ఉపాధిని అందించగలవని, భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో నగరాల వాటా 70 శాతంగా ఉండొచ్చని నివేదిక అభిప్రాయపడింది. పట్టణ ప్రాంతాల్లోని మౌలిక సౌకర్యాలపై భారత్‌లో వార్షిక తలసరి మూలధన వ్యయం 17 డాలర్లు కాగా, చైనా వార్షిక తలసరి మూలధన వ్యయంలో 14 శాతం, పట్టణీకరణ డిమాండ్‌కు అనుగుణంగా భారత్‌లో ఏటా 700 మిలియన్ చదరపు మీటర్ల రెసిడెన్షియల్, 900 మి.చ.మీ. కమర్షియల్ నిర్మాణాలు జరగాలని నివేదిక పేర్కొంది. ప్రపంచ బ్యాంకు నివేదిక 2016 ప్రకారం ప్రపంచ జనాభాలో 54 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2045 నాటికి నగరాల్లోని జనాభా 1.5 రెట్లు పెరిగి, మొత్తం పట్టణ జనాభా 6 బిలియన్లకు చేరుకునే అవకాశం ఉంది. ప్రపంచ జీడీపీలో పట్టణ ప్రాంత వాటా 80 శాతంగా ఉండనుంది. ఉత్పాదకత, నవకల్పనల్లో పెరుగుదల కారణంగా సుస్థిర వృద్ధి సాధనకు పట్టణ ప్రాంతాలు దోహదపడతాయి. వేగవంతమైన పట్టణీకరణ కారణంగా మౌలిక సౌకర్యాల కల్పనలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. వాతావరణ మార్పును అధిగమించడంలో పట్టణ ప్రాంతాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని నివేదిక పేర్కొంది. ప్రపంచంలో శక్తి వినియోగంలో పట్టణ ప్రాంతాలు 2/3వ వంతు వాటాను కలిగి ఉన్నాయి. ప్రపంచ హరిత గృహ వాయు ఉద్గారాల విడుదలలోనూ పట్టణాల వాటా 70 శాతమని నివేదిక పేర్కొంది. జాతీయ రవాణా అభివృద్ధి విధాన కమిటీ అభిప్రాయంలో 2031 నాటికి భారత పట్టణ జనాభా 60 కోట్లకు చేరే అవకాశం ఉంది. మొత్తం దేశ జనాభాలో పట్టణ జనాభా 40 నుంచి 42 శాతంగా కమిటీ అంచనా వేసింది. పట్టణ అవస్థాపనా సేవలకు అవసరమైన పెట్టుబడి అంచనాలో భాగంగా.. 2031 నాటికి పట్టణ జనాభా 600 మిలియన్లకు చేరుతుందని హై పవర్డ ఎక్స్పర్ట కమిటీ పేర్కొంది. రవాణా వ్యవస్థ: భారత ఆర్థిక వ్యవస్థలో రవాణా ఒక ముఖ్య అంశం. 1990వ దశకంలో మొదలైన సరళీకృత ఆర్థిక విధానాల వల్ల భూ, జల, వాయు రవాణాల్లో అనేక రవాణా సాధనాలు వాడుకలోకి వచ్చాయి. ఇదే సమయంలో దేశంలోని అధిక జనాభాకు ప్రజా రవాణా ప్రాథమిక రవాణా సాధనంగా నిలిచింది. ప్రపంచంలో ప్రజా రవాణాను అధికంగా వినియోగిస్తున్న రవాణా వ్యస్థల్లో భారత్ రైల్ నెట్వర్క ఒకటి. భారత రైల్వే వ్యవస్థ 2014-15లో రోజుకు 23 మిలియన్ల మంది ప్రయాణీకులను చేరవేసింది. మొత్తంగా ఆ ఏడాదిలో 8.397 బిలియన్ల మంది రవాణా అవసరాలను తీర్చిడంతో పాటు 1058.81 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసింది. మార్చి 2013 నాటికి దేశంలో మొత్తం రిజిస్టర్డ మోటారు వాహనాలు 172 మిలియన్లు. వీటిలో 21.5 మిలియన్లు కార్లు, టాక్సీలు, జీపులున్నాయి. మొత్తం కుటుంబాల్లో 10 శాతం కుటుంబాలు మోటారు సైకిల్ కలిగి ఉన్నాయి. ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రపంచంలో అధిక మరణాలు సంభవిస్తున్న దేశంగా భారత్ నిలిచింది. భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఏటా 4.6 మిలియన్ల వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. 2015-16లో భారత ప్రభుత్వం భూ ఉపరితల రోడ్లు, రైల్వేల నుంచి ట్రాఫిక్‌ను జలమార్గాలకు మరల్చడానికి ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద 106 జాతీయ జల మార్గాలను ప్రకటించింది. పట్టణ రవాణా: దేశంలో పేదరిక నిర్మూలనకు విద్యుత్, భూమిని పొదుపుగా వినియోగించుకోవాలి. దీంతోపాటు కాలుష్యం, గ్రీన్ హౌజ్ వాయు ఉద్గారాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్యసాధనలో పట్టణ రవాణా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం దేశంలో నాణ్యత, పరిమాణం పరంగా పట్టణ రవాణా సర్వీసులు, అవస్థాపనా సదుపాయాల లోటు అధికమైంది. దేశంలోని మెగాసిటీల్లో వాహన కాలుష్య పెరుగుదలకు కారణాలుగా కింది అంశాలను పేర్కొనవచ్చు. 1. అధిక ట్రాఫిక్ పరిమాణం, పట్టణ జనాభా పెరుగుదల. 2. ప్రైవేట్, వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరగడం. 3. వాహనాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం. 4. ట్రాఫిక్ అడ్డంకుల పెరుగుదల 5. పర్యావరణహిత రవాణా సాధనాల వినియోగం తక్కువగా ఉండటం. ఇంధన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తక్కువగా ఉండటం. 6. ప్రైవేట్, వ్యక్తిగత వాహనాల సంఖ్యను తగ్గించడానికి సమగ్రమైన కోశపరమైన వ్యూహాలు అవలంభించిక పోవడం. - డాక్టర్ తమ్మా కోటిరెడ్డి ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్ -
‘రైల్వే’ రాజసం...
తొలి ‘కూత’ పెట్టిన వేళ.... బోరీబందర్ నుంచి థానే వరకు నడిచిన మొదటి రైలు ఈ నెల 10 నుంచి 16 వరకు రైల్వే వారోత్సవాలు బ్రిటీష్ రైల్వేకు ధీటుగా ఎదిగిన నిజామ్స్ రైల్వే రేపు సికింద్రాబాద్‌లో వేడుకలు సిటీబ్యూరో: మన దేశంలోని రవాణా వ్యవస్థలో రైల్వేకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. 18వ శతాబ్దంలో అప్పటి వరకు ఉన్న రవాణా వ్యవస్థలో రైలు ఒక పెను ప్రభంజనమైంది. సామాజిక, ఆర్థిక రంగంలో అద్భుతమైన ప్రగతికి శ్రీకారం చుట్టింది. ఆధునిక రవాణా రంగానికి వెన్నుదన్నుగా నిలిచింది. 1853 ఏప్రిల్ 16వ తేదీన దేశంలో మొట్టమొదటి రైలు బోరీబందర్ నుంచి థానే వరకు పరుగులు పెట్టింది. ఆ చరిత్రాత్మకమైన రోజుకు గుర్తుగా భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీ నుంచి 16 వరకు రైల్వే వారోత్సవాలు నిర్వహిస్తుంది. బ్రిటీష్ రైల్వే వ్యవస్థకు ధీటుగా ఆవిర్భవించిన నిజామ్స్ రైల్వే అనతి కాలంలో సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణమధ్య రైల్వేగా కొత్తరూపును సంతరించుకుంది. దేశవ్యాప్తంగా జరుగనున్న వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోనూ ఈ నెల 11వ తేదీన వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బ్రిటీష్ రైల్వే వ్యవస్థకు సమాంతరంగా ఎదిగిన నిజామ్స్ రైల్వే ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... ఇలా ఆవిర్భవించి... లయబద్ధమైన చక్రాల చప్పుళ్లు, అప్పటి వరకు పరిచయం లేని ఒక సరికొత్త రైలు కూత ఆధునిక హైదరాబాద్‌ను ఆవిష్కరించాయి. వచ్చి, పోయే ప్రయాణికుల కంటే రైళ్లను వీక్షించేందుకు వచ్చే ప్రజలతోనే ఆ రోజుల్లో రైల్వేస్టేషన్లు కిటకిటలాడేవి. నాంపల్లిలోని హైదరాబాద్ దక్కన్ రైల్వేస్టేషన్ నిత్యం జనసముద్రాన్ని తలపించేది. రకరకాల భాషలు, విభిన్న సంస్కృతులు, ఆచారవ్యవహారాలను మోసుకొచ్చే రైళ్లతో రైల్వేస్టేషన్లు వైవిధ్యమైన వాతావరణాన్ని సృష్టించేవి. హైదరాబాద్ సంస్థానంలో ఆసఫ్‌జాహీల కాలంలో మొట్టమొదటి రైళ్లు పరుగులు తీశాయి. ముంబయి నుంచి మద్రాస్‌కు రైలుమార్గం ఏర్పడింది. ఆ మార్గాన్ని హైదరాబాద్‌కు అనుసంధానం చేశారు. 1873 నాటికి నిజాం స్టేట్ రైల్వే వ్యవస్థ కొలువుదీరింది. 1904 వరకు మొత్తం రూ.4.3 కోట్ల నిధులతో రైల్వేలను అభివృద్ధి చేశారు. 1874లో వాడి నుంచి హైదరాబాద్ వరకు 110 మైళ్ల లైన్ నిర్మించారు. 1889 నాటికి ఈ లై న్ను బెజవాడ వరకు పొడిగించారు. 1924లోనే బల్లార్ష-కాజీపేట్ లైన్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ సమీపంలోని చంద్రపూర్ నుంచి వరంగల్ వరకు 1930లో రైలు మార్గం ఏర్పడింది. ఇదే సంవత్సరం వికారాబాద్-బీదర్ లైన్లో రైల్వే సేవలు ప్రారంభమయ్యాయి. రైల్వేస్టేషన్ల నిర్మాణంలోనూ నిజామ్ ప్రభుత్వం బ్రిటీష్‌తో పోటీపడింది. 1874లోనే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఏర్పడింది. చల్లగా ఆహ్లాదంగా ఉండే పబ్లిక్‌గార్డెన్స్ అంటే నిజాం నవాబు ఉస్మాన్‌అలీఖాన్‌కు ఎంతో ఇష్టం. అందుకే దానిని ఆనుకొని 1907లో నాంపల్లి రైల్వేస్టేషన్‌ను కట్టించారు. 1916లో కాచిగూడ రైల్వేస్టేషన్ నిర్మించారు. బ్రిటీష్ ప్రభుత్వానికి సమానస్థాయిలో రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు నిజాం ప్రభుత్వం పోటీ పడింది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను కలపడంలో హైదరాబాద్ సంస్థానం కేంద్రబిందువుగా నిలిచింది. ప్రత్యేక జోన్‌గా పరుగులు... 1966వ సంవత్సరం గాంధీ జయంతి రోజున దక్షిణమధ్య రైల్వే జోన్ ఆవిర్భవించింది. దీంతో రైల్వే సేవలు మరింత విస్తరించాయి.రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి దేశంలోని అన్ని ముఖ్యమైన పట్టణాలకు, నగరాలకు రైలు సర్వీసులు పెరిగాయి. పొగబండ్ల నుంచి డీజిల్ బండ్లు ఒక టర్నింగ్ పాయింట్. రైల్వేవ్యవస్థలో విద్యుదీకరణ విప్లవాత్మకమైంది. హైదరాబాద్ కేంద్రబిందువుగా దురంతో వంటి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు ప్రస్తుతం పరుగులు తీస్తున్నాయి.ప్రతి రోజు సుమారు 2వందల రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.3 లక్షల మందికి పైగా రైల్వేసేవలను వినియోగించుకుంటున్నారు.నగరంలోని 121 ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రతి నిత్యం లక్షా 40 వేల మంది ప్రయాణిస్తున్నారు.వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి రెండో దశ పూర్తి అయితే మరో 2 లక్షల మంది ప్రయాణికులకు ఎంఎంటీఎస్ అందుబాటులోకి వస్తుంది. అలాగే యాదాద్రి వరకు ఈ రైళ్లను పొడిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు చర్లపల్లిలో నిర్మించతలపెట్టిన రైల్వేటర్మిన ల్ హైదరాబాద్‌లో 4వ ప్రయాణ ప్రాంగణం కానుంది. ఈ నెల 11న వేడుకలు.. రైల్వే వారోత్సవాల సందర్భంగా ఈ నెల 11వ తేదీన సికింద్రాబాద్ రైల్‌కళారంగ్‌లో వేడుకలను నిర్వహించనున్నారు. వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని గురించి ఈ సందర్భంగా జీఎం రవీంద్రగుప్తా వివరిస్తారు. -
మహిళలకు డేంజర్ నగరాలు ఇవే..!
న్యూయార్క్: ప్రపంచంలో చాలాచోట్ల మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది కాదనలేని వాస్తవం. ఎక్కడికి వెళ్లినా వారికి మాటలు, చేతలతో లైంగిక వేధింపులు తప్పడం లేదు. ముఖ్యంగా మహిళలు ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కాదు. ఇలా ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ఏ నగరంలో మహిళ పరిస్థితి భయంకరంగా, అపాయకరంగా ఉందో తెలుసుకునేందుకు ది థామ్సన్ రాయిటర్స్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రపంచంలోని 20 దేశాల రాజధానుల్లోని 16 నగరాల్లో మహిళలను ప్రశ్నించింది. మొత్తం 6,550మంది మహిళలను రవాణా వ్యవస్థ ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటని ప్రశ్నించింది. దీని ఆధారంగా మహిళలకు అపాయకరంగా మారిన నగరాల జాబితా తయారు చేయగా అందులో భారత్ నుంచి ఢిల్లీ నాలుగో స్థానం చేరింది. అంతేకాదు, లండన్ లోని 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉన్న 41శాతం స్త్రీలు భయంకరమైన లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. మహిళలకు ప్రజా రవాణా ద్వారా డేంజర్ గా మారిన టాప్ 16 నగరాలివే.. 1.బొగోటా, కొలంబియా 2.మెక్సికో నగరం, మెక్సికో 3.లిమా, పెరూ 4 .న్యూఢిల్లీ, భారత్ 5.జకర్తా, ఇండినేషియా 6.బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా 7.కౌలాలంపూర్, మలేషియా 8.బ్యాంకాక్, థాయిలాండ్ 9.మాస్కో, రష్యా 10.మనీలా, పిలిప్పీన్స్ 11.పారిస్, ఫ్రాన్స్ 12.సియోల్, దక్షిణ కొరియా 13.లండన్, ఇంగ్లాండ్ 14.బీజింగ్, చైనా 15.టోక్యో, జపాన్ 16.న్యూయార్క్, అమెరికా -
రోడ్లకు రూ.7,332 కోట్ల వ్యయం
మౌలిక వసతుల కల్పనపై సీఆర్డీఏ ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో తొలిదశ రహదారుల నిర్మాణానికి రూ.7,332 కోట్లు అవసరమని సీఆర్డీఏ అంచనా వేసింది. రాజధానిలో తొలి దశలో మౌలిక వసతుల కల్పన కోసం ఏ రంగానికి ఎంత వ్యయం అవుతుందనే అంశంపై సీఆర్డీఏ అంచనాలను రూపొందించి, ఆ మేరకు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించింది. ఇందులో ఎక్స్‌ప్రెస్ హైవేలు, ఆర్వోడబ్ల్యూ రోడ్లు ఉండగా భూగర్భ కేబుళ్ల ఏర్పాటు నిమిత్తం చేపట్టే సొరంగ నిర్మాణాన్ని కూడా రోడ్ల విభాగంలోనే చేర్చారు. ఈ రహదారుల నిర్మాణానికి ఒక్కో కిలోమీటర్‌కు రూ.7 కోట్ల చొప్పున వ్యయమవుతుందని సీఆర్డీఏ అంచనా వేసింది. భూగర్భ కేబుళ్ల కోసం 306 కిలోమీటర్ల మేర టన్నల్ నిర్మాణానికి ఒక్కో కిలోమీటర్ టన్నల్‌కు రూ.8 కోట్ల చొప్పున వ్యయం అవుతుందని పేర్కొంది. ఇక మంచినీటి సరఫరాకు రూ.1,637 కోట్లు ఖర్చవుతుందని తెలిపింది. ఇందుకోసం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, నీటి నిల్వ రిజర్వాయర్లు, నీటి పంపిణీ నెట్ వర్క్, అటోమేటిక్ కంట్రోల్ అండ్ కమాండ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. వృధా నీటి నిర్వహణ పనులకు రూ.2,562 కోట్ల వ్యయం అవుతుందని సీఆర్డీఏ అంచనా వేసింది. స్మార్ట్ విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థ ఏర్పాటునకు రూ.7,500 కోట్లు ఖర్చవుతాయని ప్రతిపాదించింది. 1,500 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయడానికి ఒక్కో మెగావాట్‌కు రూ.5 కోట్ల చొప్పున రూ.7,500 కోట్ల వ్యయం అవుతుందని వివరించింది. రాజధాని ప్రాంతంలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఐటీ మౌలిక సదుపాయాల కల్పన కోసం 600 కోట్లు, నిఘా వ్యవస్థ ఏర్పాటునకు రూ.50 కోట్లు, ఇంటిలిజెంట్ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ ఏర్పాటునకు రూ.300 కోట్లు వ్యయం అవుతుందని సీఆర్డీఏ పేర్కొంది. -
ఇదీ మన ‘మెట్రో’
ప్రజా రవాణా వ్యవస్థల్లో అంతర్భాగమవుతున్న మెట్రో రైళ్లు మహా నగరాల అవసరాలకు దీటుగా మెట్రో రూపకల్పన లక్షలాది మంది ప్రజలకు ఏసీ బోగీల్లో సౌకర్యవంత ప్రయాణం ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నైల్లో ఇప్పటికే పరుగులు హైదరాబాద్‌లో వచ్చే ఏడాది అందుబాటులోకి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న మెట్రో ప్రస్తుతం దేశంలో ‘మెట్రో’ శకం నడుస్తోంది. మెట్రో రైలు.. మహానగరాల్లోని సాధారణ ప్రజల జీవితాల్లో ఓ అంతర్భాగమైపోయింది. మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రతిరోజూ లక్షలాది మంది ఆమ్ఆద్మీలను గమ్యస్థానం చేరుస్తున్న మెట్రో ఇప్పుడు ప్రజా రవాణా వ్యవస్థలకు కొత్త దారి చూపింది. మహానగరాల అవసరాలకు దీటుగా రూపుదిద్దుకున్న మెట్రో రైలు.. సాధారణ ప్రజలకు ఏసీ బోగీల్లో సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తోంది. ట్రాఫిక్ అనే పద్మవ్యూహంలో చిక్కుకుంటున్న నగరవాసులను సులువుగా గమ్యస్థానాలకు చేర్చి విలువైన పనిగంటలను మిగులుస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థను సరికొత్తగా ఆవిష్కరిస్తూ మరే రవాణా సాధనం తనకు సాటి రాదని, రాలేదని మెట్రో రైలు రుజువు చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు బెంగళూరు, ముంబై, చెన్నై మహానగరాల్లో ఇప్పుటికే మెట్రో రైళ్లు పరుగెడుతున్నాయి. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలో మెట్రో రైలు ప్రజలకు అందుబాటులోకి రానుంది. దేశంలోని ఇతర మహా నగరాలకు దీటుగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లోని మెట్రో రైళ్లకంటే ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది మన మెట్రో రైలు. ఒకే పిల్లర్‌పై మెట్రో రైలు ట్రాక్, స్టేషన్ల నిర్మాణం, డ్రైవర్ లేని సాంకేతికత, కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థ, ప్రీకాస్ట్ విధానం, పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో పనులు ఇలా చెప్పుకుంటూపోతే హైదరాబాద్ మెట్రోకు అన్నీ ప్రత్యేకతలే. ప్రస్తుతం వేగంగా హైదరాబాద్ మెట్రో నిర్మాణం జరుగుతున్న తరుణంలో పలు మహానగరాల్లో అందుబాటులో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టులతోపాటు మన హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు విశేషాలపై ఈ వారం ‘సాక్షి’ ఫోకస్.. - సాక్షి, హైదరాబాద్ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ►2012 జూన్‌లో హైదరాబాద్ మెట్రో పనులు ప్రారంభమయ్యాయి. ►ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.14,132 కోట్లు. కేంద్ర ప్రభుత్వం 10 శాతం, మరో 90 శాతం నిర్మాణ వ్యయాన్ని ఎల్అండ్టీ సంస్థ భరించనున్నాయి. మరో రూ.1,980 కోట్లను తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ, రహదారుల విస్తరణకు ఖర్చు చేస్తోంది. ►ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా, నాగోల్-శిల్పారామం రూట్లలో మొత్తం 72 కి.మీ. మార్గంలో పనులు చేపట్టారు. ►2017 జూన్ నాటికి మొత్తం 72 కి.మీ. మార్గంలో మెట్రో పనులు పూర్తికానున్నాయి. ►ప్రారంభంలో సుమారు 18 లక్షలు, 2020 నాటికి 24 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణించనున్నారు. ►కనీస చార్జీ రూ.10, గరిష్ట చార్జీ రూ.25 ఉండే అవకాశం. ►తొలిదశ కింద మియాపూర్-పంజాగుట్ట మార్గంలో వచ్చే ఏడాది ప్రారంభంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ►ప్రతి రైలుకు మూడు బోగీలు ఉంటాయి. వెయ్యి మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ►మొత్తం మూడు కారిడార్లలో 57 మెట్రో రైళ్లు 72 కి.మీ. మార్గంలో రాకపోకలు సాగిస్తాయి. ►మియాపూర్, ఉప్పల్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో మూడు మెట్రో రైలు డిపోలు ఏర్పాటు చేయనున్నారు ►3 కారిడార్లలో రాకపోకలు సాగించే మెట్రో రైళ్లను ఉప్పల్ మెట్రో డిపోలోని ఆపరేషన్ కంట్రోల్ కేంద్రం నుంచి నియంత్రిస్తారు. ‘మెట్రో’ ఇంజనీరింగ్ అద్భుతం హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ►హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ప్రపంచంలోనే తొలిసారిగా పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన అతిపెద్ద మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టు. ఒంటిస్తంభం పిల్లర్లపై పక్షి రెక్కల ఆకృతిలో ఏర్పాటు చేసిన మెట్రో రైలు స్టేషన్లు ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తితో హైదరాబాద్ విశ్వనగరం కావడం తథ్యం. హా నిర్మాణ రంగంలో ఆధునిక విప్లవానికి ఈ ప్రాజెక్టు నాంది. ప్రాజెక్టులో 85 శాతం నిర్మాణాలు కుత్బుల్లాపూర్, ఉప్పల్ కాస్టింగ్ యార్డుల్లో ప్రీకాస్ట్ విధానంలో రూపొందించినవే కావడం విశేషం. ప్రీకాస్ట్ విధానం వినియోగించడం.. రద్దీ రహదారులపై పనులు చేపట్టకపోవడంతో ట్రాఫిక్ ఇక్కట్లు బాగా తగ్గాయి. ► డ్రైవర్ లేని సాంకేతికత, కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థలు దేశంలోని ఇతర మెట్రో ప్రాజెక్టుల్లో అందుబాటులో లేవు. హైదరాబాద్ నగరంలోనే తొలిసారిగా ఈ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నాం. ► ప్రాజెక్టు పనులతో మతపరమైన, చారిత్రక కట్టడాలు దెబ్బ తినకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సుమారు పది సంస్థలు మెట్రో పనుల్లో భాగం పంచుకుంటున్నాయి. ► ఒక్కో మెట్రో రైలు ట్రాక్ ఏడు బస్సు లైన్లు, 24 కార్ లైన్లతో సమానం. ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో తక్కువ విస్తీర్ణంలోనే పనులు చేపడుతున్నాం. పిల్లర్ల మందం 2 మీటర్ల విస్తీర్ణానికంటే లోపుగానే ఉంది. ►మెట్రో రైలుకు బ్రేక్ వేసినప్పుడు ఉత్పన్నమయ్యే శక్తి నుంచే విద్యుత్ ఉత్పత్తి చేసి మెట్రో అవసరాలను 35 శాతం వరకు తీర్చుకునే అవకాశం ఉంది. ► మెట్రో ప్రయాణ అవసరాలను తీర్చే ప్రాజెక్టు మాత్రమే కాదు ఇది నగర పునర్నిర్మాణ ప్రాజెక్టు. ప్రజలకు ఉపయుక్తమైనది, పర్యావరణానికి హాని తలపెట్టని హరిత ప్రాజెక్టు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఇలా అన్ని వర్గాలకు అవసరమైన సకల సౌకర్యాలు మెట్రోలో అంతర్భాగమై ఉన్నాయి. ► ప్రధాన రైల్వే స్టేషన్లు, ఎంఎంటీఎస్, బస్స్టేషన్లను మెట్రో రైలు స్టేషన్లతో అనుసంధానించి ట్రాఫిక్ రద్దీలో నగరవాసులు చిక్కుకుపోకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. మెట్రో స్టేషన్లకు సమీప కాలనీలకు చేరుకునేందుకు వీలుగా నిరంతరం మెర్రీ గో అరౌండ్ బస్సులు అందుబాటులో ఉంటాయి. ► మెట్రో స్టేషన్లకు సమీపంలో ఉన్న ప్రముఖ పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, కార్యాలయాలకు ఫుట్ఓవర్ బ్రిడ్జీ(ఆకాశ వంతెనలు)లతో అనుసంధానం. ► హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు నిర్మాణ దశలోనే గ్లోబల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టు ఆఫ్ ది ఇయర్-2013(న్యూయార్క్), రాయల్ సొసైటీ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్ గోల్డ్ అవార్డు వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకోవడం విశేషం. ముంబైలో.. ►ముంబైలో ప్రజా రవాణాకు రైళ్లే కీలకం. అక్కడ మెట్రో రైళ్లలో రోజువారీగా 2.5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ► {పస్తుతం 11.4 కి.మీ. మార్గంలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ► తొలిదశ మెట్రో పనుల పూర్తికి ఎనిమిదేళ్ల సమయం పట్టింది. ►కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఢిల్లీ మెట్రో ►1998 అక్టోబర్‌లో ఢిల్లీ మెట్రో రైలు పనులు ప్రారంభమయ్యాయి. ►2002 డిసెంబర్లో 25 కి.మీ. మార్గంలో తొలిదశ అందుబాటులోకి వచ్చింది. ► {పస్తుతం 194 కి.మీ. మార్గంలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ►నిత్యం 6 మార్గాల్లో 24 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ►డీఎంఆర్సీ సంస్థ ఈ పనులను చేపట్టింది. బెంగళూరులో.. ►2015 మే నెలలో మెట్రో రైలు ప్రారంభమైంది. ►బయ్యనహళ్లి నుంచి ఎంజీ రోడ్ వరకు మెట్రో పరుగులు తీస్తోంది. ► {పస్తుతానికి 8.5 కి.మీ. మార్గంలో పనులు పూర్తిచేసేందుకు నాలుగేళ్ల సమయం పట్టింది. ►కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టు పనులు చేపట్టాయి. చెన్నైలో.. ►చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు పనులు 2009 జూన్‌లో ప్రారంభమయ్యాయి. ►ఈ ఏడాది జూన్ 29 నాటికి తొలిదశ పూర్తయ్యింది. ►తొలిదశలో కోయంబేడు-ఆలందూర్ మధ్య 10 కి.మీ. మార్గంలో 27 మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ►నిత్యం సుమారు 3 లక్షల మంది ఈ రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. ►మొత్తం 45 కి.మీ. మార్గంలో మెట్రో పనులు చేపడుతున్నారు. ఇందులో 21 కి.మీ. మేర ఎలివేటెడ్ (ఆకాశమార్గం), మరో 24 కి.మీ. భూగర్భ మార్గం. ►{పాజెక్టు అంచనా వ్యయం రూ.14,750 కోట్లు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 41 శాతం, 59 శాతం జైకా బ్యాంకు రుణంతో పనులు చేపట్టారు.