‘రైల్వే’ రాజసం...
తొలి ‘కూత’ పెట్టిన వేళ....
బోరీబందర్ నుంచి థానే వరకు నడిచిన మొదటి రైలు
ఈ నెల 10 నుంచి 16 వరకు రైల్వే వారోత్సవాలు
బ్రిటీష్ రైల్వేకు ధీటుగా ఎదిగిన నిజామ్స్ రైల్వే
రేపు సికింద్రాబాద్‌లో వేడుకలు
సిటీబ్యూరో: మన దేశంలోని రవాణా వ్యవస్థలో రైల్వేకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. 18వ శతాబ్దంలో అప్పటి వరకు ఉన్న రవాణా వ్యవస్థలో రైలు ఒక పెను ప్రభంజనమైంది. సామాజిక, ఆర్థిక రంగంలో అద్భుతమైన ప్రగతికి శ్రీకారం చుట్టింది. ఆధునిక రవాణా రంగానికి వెన్నుదన్నుగా నిలిచింది. 1853 ఏప్రిల్ 16వ తేదీన దేశంలో మొట్టమొదటి రైలు బోరీబందర్ నుంచి థానే వరకు పరుగులు పెట్టింది. ఆ చరిత్రాత్మకమైన రోజుకు గుర్తుగా భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీ నుంచి 16 వరకు రైల్వే వారోత్సవాలు నిర్వహిస్తుంది. బ్రిటీష్ రైల్వే వ్యవస్థకు ధీటుగా ఆవిర్భవించిన నిజామ్స్ రైల్వే అనతి కాలంలో సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణమధ్య రైల్వేగా కొత్తరూపును సంతరించుకుంది. దేశవ్యాప్తంగా జరుగనున్న వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోనూ ఈ నెల 11వ తేదీన వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బ్రిటీష్ రైల్వే వ్యవస్థకు సమాంతరంగా ఎదిగిన నిజామ్స్ రైల్వే ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం...
ఇలా ఆవిర్భవించి...
లయబద్ధమైన చక్రాల చప్పుళ్లు, అప్పటి వరకు పరిచయం లేని ఒక సరికొత్త రైలు కూత ఆధునిక హైదరాబాద్‌ను ఆవిష్కరించాయి. వచ్చి, పోయే ప్రయాణికుల కంటే రైళ్లను వీక్షించేందుకు వచ్చే ప్రజలతోనే ఆ రోజుల్లో రైల్వేస్టేషన్‌లు కిటకిటలాడేవి. నాంపల్లిలోని హైదరాబాద్ దక్కన్ రైల్వేస్టేషన్ నిత్యం జనసముద్రాన్ని తలపించేది. రకరకాల భాషలు, విభిన్న సంస్కృతులు, ఆచారవ్యవహారాలను మోసుకొచ్చే రైళ్లతో రైల్వేస్టేషన్‌లు వైవిధ్యమైన వాతావరణాన్ని సృష్టించేవి. హైదరాబాద్ సంస్థానంలో ఆసఫ్‌జాహీల కాలంలో మొట్టమొదటి రైళ్లు పరుగులు తీశాయి. ముంబయి నుంచి మద్రాస్‌కు రైలుమార్గం ఏర్పడింది. ఆ మార్గాన్ని హైదరాబాద్‌కు అనుసంధానం చేశారు. 1873 నాటికి నిజాం స్టేట్ రైల్వే వ్యవస్థ కొలువుదీరింది. 1904 వరకు మొత్తం రూ.4.3 కోట్ల నిధులతో రైల్వేలను అభివృద్ధి చేశారు. 1874లో వాడి నుంచి హైదరాబాద్ వరకు 110 మైళ్ల లైన్ నిర్మించారు. 1889 నాటికి ఈ లై న్‌ను బెజవాడ వరకు పొడిగించారు. 1924లోనే బల్లార్ష-కాజీపేట్ లైన్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ సమీపంలోని చంద్రపూర్ నుంచి వరంగల్ వరకు 1930లో రైలు మార్గం ఏర్పడింది. ఇదే సంవత్సరం వికారాబాద్-బీదర్ లైన్‌లో రైల్వే సేవలు ప్రారంభమయ్యాయి. రైల్వేస్టేషన్‌ల నిర్మాణంలోనూ నిజామ్ ప్రభుత్వం బ్రిటీష్‌తో పోటీపడింది. 1874లోనే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఏర్పడింది. చల్లగా ఆహ్లాదంగా ఉండే పబ్లిక్‌గార్డెన్స్ అంటే నిజాం నవాబు ఉస్మాన్‌అలీఖాన్‌కు ఎంతో ఇష్టం. అందుకే దానిని ఆనుకొని 1907లో నాంపల్లి రైల్వేస్టేషన్‌ను కట్టించారు. 1916లో కాచిగూడ రైల్వేస్టేషన్ నిర్మించారు. బ్రిటీష్ ప్రభుత్వానికి సమానస్థాయిలో రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు నిజాం ప్రభుత్వం పోటీ పడింది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను కలపడంలో హైదరాబాద్ సంస్థానం కేంద్రబిందువుగా నిలిచింది.
ప్రత్యేక జోన్‌గా పరుగులు...
1966వ సంవత్సరం గాంధీ జయంతి రోజున దక్షిణమధ్య రైల్వే జోన్ ఆవిర్భవించింది. దీంతో రైల్వే సేవలు మరింత విస్తరించాయి.రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి దేశంలోని అన్ని ముఖ్యమైన పట్టణాలకు, నగరాలకు రైలు సర్వీసులు పెరిగాయి. పొగబండ్ల నుంచి డీజిల్ బండ్లు ఒక టర్నింగ్ పాయింట్. రైల్వేవ్యవస్థలో విద్యుదీకరణ విప్లవాత్మకమైంది. హైదరాబాద్ కేంద్రబిందువుగా దురంతో వంటి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు ప్రస్తుతం పరుగులు తీస్తున్నాయి.ప్రతి రోజు సుమారు 2వందల రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.3 లక్షల మందికి పైగా రైల్వేసేవలను వినియోగించుకుంటున్నారు.నగరంలోని 121 ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రతి నిత్యం లక్షా 40 వేల మంది ప్రయాణిస్తున్నారు.వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి రెండో దశ పూర్తి అయితే మరో 2 లక్షల మంది ప్రయాణికులకు ఎంఎంటీఎస్ అందుబాటులోకి వస్తుంది. అలాగే యాదాద్రి వరకు ఈ రైళ్లను పొడిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు చర్లపల్లిలో నిర్మించతలపెట్టిన రైల్వేటర్మిన ల్ హైదరాబాద్‌లో 4వ ప్రయాణ ప్రాంగణం కానుంది.
ఈ నెల 11న వేడుకలు..
రైల్వే వారోత్సవాల సందర్భంగా ఈ నెల 11వ తేదీన సికింద్రాబాద్ రైల్‌కళారంగ్‌లో వేడుకలను నిర్వహించనున్నారు. వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని గురించి ఈ సందర్భంగా జీఎం రవీంద్రగుప్తా వివరిస్తారు.