పెనుగాలుల ధాటికి జిల్లా వణికిపోతోంది. పచ్చని చెట్లు నిలువునా నేల కూలుతున్నాయి. చేతికందాల్సిన కాయలు నేలపాలవుతున్నాయి. ఆరుగాలం కష్టించి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన అరటి, మామిడి, బొప్పాయి తోటలు కళ్లముందే వాలిపోతుంటే రైతన్నకు కన్నీరు మిగులుతోంది. సోమవారం సాయంత్రం ప్రకృతి సృష్టించిన బీభత్సం జన జీవితాలను అతలాకుతలం చేసింది. పంటలు నష్టపోయిన రైతులు ఆదుకునేవారి కోసం ఎదురు చూస్తున్నారు.
సాక్షి, కడప: మూడు రోజులుగా పెనుగాలులు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. గాలి బీభత్సానికి చాలాచోట్ల చెట్లు విరిగిపడుతున్నాయి. ఉద్యాన పంటలు నేలమట్టం అవుతున్నాయి. విద్యుత్ స్తంభాలు, టవర్లు నేల కొరుగుతున్నాయి. దీంతో ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ఉద్యాన పంటలకు సంబంధించి తీరా పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి అన్నదాతపై కక్ష కట్టడంతో రైతన్నలు విలవిల్లాడుతున్నారు. సుడిగాలుల నేపథ్యంలో విద్యుత్‌స్తంభాలు విరిగిపడుతుండటంతో రైల్వేకోడూరు, బద్వేలు, మైదుకూరు, పులివెందుల నియోజకవర్గాల్లోని పలు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి.
దీంతో అక్కడ ప్రజలు తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకొర ఉన్న చేతి బోర్ల వద్దనే జనాలు బారులు తీరుతున్నారు. ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అనూహ్యంగా గాలులు వీస్తుండటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతూనే ఉంది. పలుచోట్ల చెట్లు విరిగి రోడ్లకు అడ్డంగా పడుతుండటంతో రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతోంది.
పంట నష్టం జరిగిన ప్రాంతాలివే!
ముఖ్యంగా అరటి, బొప్పాయిపంటలకు సంబంధించి మైదుకూరు మండలంలోని భూమాయపల్లె, కేశిలింగాయపల్లె, విశ్వనాథపురం, బండివారిపల్లె, పోచిరెడ్డిపల్లె, వనిపెంట, ఆదిరెడ్డిపల్లె, కాశినాయన మండలం బసనపల్లె, గొంటువారిపల్లె, ఆకుల నారాయణపల్లెతోపాటు తొండూరు, వేంపల్లె, ముద్దనూరు, వేముల, వీరపునాయునిపల్లె, కమలాపురం మండలాల్లోని పలు గ్రామాల్లో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైల్వేకోడూరు, రాయచోటి ప్రాంతాల్లో మామిడి రైతుకు తీరని నష్టాన్ని మిగిల్చింది. సోమవారం సాయంత్రం రైల్వేకోడూరుతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెనుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి.
పెనుగాలుల ధాటికి అతలాకుతలం
Published Tue, Jun 3 2014 2:31 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement