కడప: నిన్న రాత్రి ఎడితెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని మైలవరం మండలం నవాబుపేటలో విషాదం అలుముకుంది. సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో మట్టి మిద్దె కూలి ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 15 మందికి తీవ్ర గాయాలైయ్యాయి. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. కాగా, జిల్లా వ్యాప్తంగా భారీ పంట నష్టం కూడా వాటిల్లింది.
మూడు రోజులుగా పెనుగాలులు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. గాలి బీభత్సానికి చాలాచోట్ల చెట్లు విరిగిపడుతున్నాయి. ఉద్యాన పంటలు నేలమట్టం అయ్యాయి. విద్యుత్ స్తంభాలు, టవర్లు నేల కొరిగాయి. దీంతో ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ఉద్యాన పంటలకు సంబంధించి తీరా పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి అన్నదాతపై కక్ష కట్టడంతో రైతన్నలు విలవిల్లాడుతున్నారు. సుడిగాలుల నేపథ్యంలో విద్యుత్‌స్తంభాలు విరిగిపడుతుండటంతో రైల్వేకోడూరు, బద్వేలు, మైదుకూరు, పులివెందుల నియోజకవర్గాల్లోని పలు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి.