‘చుక్కలు’ చూపిస్తున్నారు..! | Probems of Dotted Lands | Sakshi
Sakshi News home page

‘చుక్కలు’ చూపిస్తున్నారు..!

Published Sun, Mar 11 2018 11:01 AM | Last Updated on Mon, Oct 1 2018 2:19 PM

Probems of Dotted Lands - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఫై ఫోటోలోని రైతు పేరు కొల్లుబోయిన బాలమునెయ్య. ప్రొద్దుటూరు మండలం ఎర్రగుండ్లపల్లె. చాపాడు మండలంలోని తుమ్మలపాడులో 2.66 ఎకరాల పొలం ఉంది. 35ఏళ్ల క్రితం కొనుక్కున్న ఈ రైతుకు అప్పటినుంచి పాసుపుస్తకాలు ఉన్నాయి. గతేడాదిలో పొలంలో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు కోసమని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోగా, నీ భూమి చుక్కల భూమి అని అనుమతివ్వటం కుదరదని చెప్పారు. తర్వాత చుక్కల భూములకు కూడా ప్రభుత్వం పాసుపుస్తకాలు ఇస్తారని చెప్పగా అర్జీ ఇచ్చి, ఏడాది నుంచి ఎదురుచూస్తున్నానని బాలమునెయ్య వాపోతున్నాడు.


ఫై ఫోటోలోని రైతు పేరు మొగిలి రామ్మోహన్‌. చాపాడు మండలం పల్లవోలు గ్రామ సర్పంచ్‌. 3.58 ఎకరాల పొలం ఉంది. ఏడాది క్రితం వరకూ పాసుపుస్తకం ఉండేది. బ్యాంకులో రుణాలు కూడా తీసుకున్నారు. అయితే తర్వాత అది చుక్కల భూమి అని పాసుబుక్‌ చెల్లకుండా చేశారు. రుణం ఇవ్వలేదు. తర్వాత అధికారులు  దరఖాస్తు చేసుకోండి పాసుపుస్తకం ఇస్తామని చెప్పగా, దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్న ఇప్పటివరకూ అతీగతీ లేదు. అధికారులు తీరుపై  సర్పంచ్‌ రామ్మోహన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ జిల్లాలో చుక్కల భూముల క్రమబద్ధీకరణ తీరు. వీరిద్దరే కాదు జిల్లావ్యాప్తంగా 3,910 మంది రైతులు అర్జీలు సమర్పిం చి, పరిష్కారం కాక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారుల తీరుతో అలసిపోతున్నారు. మామూళ్ల మత్తులో ఉన్న రెవెన్యూ అధికారులు సేవాధర్మాన్ని మరిచి అన్నదాతలను తమ చుట్టూ తిప్పుకుంటున్నారు.



కడప సెవెన్‌రోడ్స్‌/చాపాడు: ప్రభుత్వ చుక్కల భూములను సాగు చేసుకుంటున్న రైతుల పేరిట వాటిని బదలాయించడంలో రెవెన్యూ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. రైతుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు జిల్లా అంతటా దుమారం రేపుతున్నాయి. పైసలు ముట్టనిదే తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో ఫైళ్లు కదలడం లేదు. కాసులు ముట్టజెప్పకపోతే ఏదోఒక కొర్రీ వేసి ఫైళ్లను వెనక్కి పంపుతున్నారు.

జిల్లాలో మొత్తం 38వేల ఎకరాల వరకు చుక్కల భూములున్నట్లు అధికారక అంచనా. అయితే ప్రభుత్వ వద్ద సరైన లెక్కలు లేవు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం చట్టాన్ని తీసుకొచ్చి 8 నెలలైంది. ఇప్పటివరకూ జిల్లాలో కేవలం ఒకే ఒక్క క్లైయిమ్‌ పరిష్కారం అయ్యిందంటే రెవె న్యూ అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం అవుతుంది. డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ కమిటీ(డీఎల్‌సీ) చైర్మన్‌ అయిన  కలెక్టర్, జేసీ ఈ విషయంపై దృష్టిసారించకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇదీ నేపథ్యం..
1916లో రీసర్వే అండ్‌ సెటిల్‌మెంట్‌ ఆపరేషన్స్‌ జరిగాయి. కరువులు, భూమి శిస్తు అధికంగా ఉండటం వంటి పలు కారణాల వల్ల రైతులు భూములను బీళ్లుగా పెట్టుకోవాల్సి వచ్చింది. అనేకమంది గ్రామాల్లో లేకుండా వలసలు వెళ్లారు. ఈ పరిస్థితుల్లో భూములు ఎవరి అనుభవంలో ఉన్నాయో సెటిల్‌మెంట్‌ అధికారులకు సమాచారం లభించలేదు. దీంతో ఆయా సర్వేనంబర్లలో ఉన్న భూముల వద్ద రీసెటిల్‌మెంట్‌ రిజిస్టర్లలో డాట్స్‌ పెట్టారు. అంటే డాట్స్‌ ఉన్న భూములన్నీ ప్రభుత్వ భూములుగా పేర్కొన్నారు. ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చి ఆ వివరాలను రిజిస్ట్రేషన్‌ అధికారులకు పంపారు.

అప్పటినుంచి వీటిని కొనడం, అమ్మడం చెల్లకుండా పోయింది. సెటిల్‌మెంట్‌ అధికారులకు ఆ తర్వాత తామే సాగుదారులమని పలువురు రైతులు ఆధారాలను సమర్పించారు. అప్పటికే ఆర్‌ఎస్‌ఆర్‌  ముద్రణ జరిగిపోయింది కనుక ఆ వివరాలను రిజిస్టర్‌ ఆఫ్‌ హోల్డిం గ్స్‌(ఆర్‌హెచ్‌)లలో నమోదు చేసి సబ్‌ రిజి స్ట్రార్‌ కార్యాలయాలకు పంపారు. చుక్కల భూములపై చాలా ఏళ్లుగా ప్రభుత్వాలకు, రైతులకు మధ్య న్యా యపోరాటం సాగింది. ఎట్టకేలకు ‘ది ఆంధ్రప్రదేశ్‌ డాటెడ్‌ ల్యాండ్స్‌(అప్‌డేషన్‌ ఇన్‌ రీసెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌) యాక్టు 2017’ వచ్చింది. గత సంవత్స రం జూలై 17న ఇందుకు సంబంధించిన జీఓ 298 కూడా విడుదలైంది. 

క్లైయిమ్స్‌ పరిష్కారం ఇలా..
చుక్కల భూములను పన్నెండేళ్లుగా సాగుచేసుకుంటున్న రైతులు వాటిపై హక్కుల కోసం మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుతోపాటు ఆర్‌ఎస్‌ఆర్, ఆర్‌హెచ్‌ నకలు, 1బీ రిజిస్టర్, అడంగళ్, రిజిస్ట్రేషన్‌ లింకు డాక్యుమెంట్లు వంటివి జత పరచాలి. మీసేవా ద్వారా క్లైయిమ్స్‌ అన్నీ నేరుగా సంబంధిత తహసీల్దార్ల లాగిన్లకు వెళ్తాయి. తహసీల్దార్‌ నోటీసులు జారీ చేసి ఆయా గ్రామాల్లో విచారణ నిర్వహించాల్సి ఉంటుంది.

తహసీల్దార్లు తమ నివేదికను కలెక్టర్‌ చైర్మన్‌గా ఉండే జిల్లా స్థాయి కమిటీకి పంపాలి. రికార్డులన్నీ సక్రమంగా ఉంటే ఆ భూమిపై సంబంధిత రైతులకు డీఎల్‌సీ హక్కును కల్పిస్తుంది. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఉన్న నిషేధిత జాబితా నుంచి ఆ భూములను తొలగించాలంటూ కలెక్టర్‌ ఆదేశాలు పంపుతారు. ఈ మొత్తం ప్రక్రియ ఆరునెలల్లో పూర్తిచేయాలని చట్టం స్పష్టం చేస్తోంది.  

జిల్లాలో పరిస్థితి ఇదీ!
డాటెడ్‌ ల్యాండ్స్‌ చట్టం రావడంతో ఇన్నేళ్లకు తమ సమస్య పరిష్కారం అయ్యిం దని రైతులు ఎంతగానో సంబరపడ్డారు. మీసేవా కేంద్రాలకు క్యూ కట్టి దరఖాస్తులు సమర్పించారు. 2017 జూలై 17 నుంచి  ఇప్పటివరకూ కడప రెవెన్యూ డివిజన్‌లో 1,839, జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌లో 1,630, రాజంపేట డివిజన్‌లో 442 వెరసి 3,911 క్లైయిమ్స్‌ వచ్చాయి. ఇందులో పులివెందుల మండలం కె. వెలమవారిపల్లెకు చెందిన బోరెడ్డి కాంతమ్మ అనే మహిళా రైతు క్లైయిమ్‌ మాత్రమే పరిష్కారమైంది. పరిష్కారానికి గడువు మీరని క్లైయిమ్స్‌ 3,743 ఉన్నాయి. గడువు మీరిన క్లైయిమ్స్‌ 5కాగా, 168 క్లైయిమ్స్‌ను కలెక్టర్‌ లాగిన్‌కు పంపారు.

ఈ క్లైయిమ్స్‌ వివిధ దశల్లో ఉన్నప్పుడు ఆయా అధికారులకు మామూళ్లు ముట్టజెప్పనిదే పనులు జరగడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా ఆ రైతు సాగుబడిలోనే ఉంద ని ధ్రువీకరణ ఇచ్చేందుకు వీఆర్వోలు దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఎట్టకేలకు  తహసీల్దార్‌ కార్యాలయ గడ ప దాటి కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లినా, ఆర్డీఓ రెకమెండేషన్స్‌ కావాలంటూ తిరిగి వాటిని వెనక్కి పంపుతున్నారు. దీంతో రైతులు మళ్లీ ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. మరి పరిష్కారం ఎప్పుడో?

ఆర్డీఓల నివేదికల ఆధారంగా చర్యలు
చుక్కల భూములపై రైతులకు హక్కులు కల్పించే విషయంలో ఆర్డీఓలు ఇచ్చే నివేదికల ఆధారంగానే జిల్లాస్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. రైతులు సమర్పించే అర్జీలపై తహసీల్లార్లు నివేదికలు ఇవ్వాలి. వాటిపై సంబంధిత ఆర్డీఓలు క్షేత్రాస్థాయి పరిశీలన నిర్వహించి డీఎల్‌సీకి నివేదిక ఇస్తే అలాంటి క్లెయిమ్స్‌ను పరిష్కరిస్తాం. ఇంతవరకు డీఎల్‌సీ వద్ద ఎలాంటి క్లెయిమ్స్‌ పెండింగ్‌లో లేవు.
– బాబయ్య, జిల్లా రెవెన్యూ అధికారి, కడప

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement