Terraced house
-
Terrace Gardens: డాబాలే.. పొలాలై..
ఉదయం లేచింది మొదలు ఈ రోజు ఏం కూర వండాలని తెగ ఆలోచిస్తుంటారు ఆడవాళ్లు. కానీ డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలంలోని అర్తమూరుకు చెందిన వల్లూరి సత్యవేణి మాత్రం డాబా మీదకు వెళతారు. అప్పుడే తాజాగా కాసిన కూరగాయలు తెచ్చి వంట కానిచ్చేస్తారు. అక్కడేమి అద్భుతం ఉండదు. సత్యవేణి ప్రేమగా పెంచుకుంటున్న గార్డెన్ ఉంటుంది. ఆమె ఒక్కరే కాదు.. ఇప్పుడు చాలా ఇళ్ల వద్ద కనిపిస్తున్న పరిస్థితి ఇది. కోవిడ్ తర్వాత ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధకు ప్రభుత్వ ప్రోత్సాహం తోడవడంతో చాలా ఇళ్లపై డాబాలు మినీ వనాలను తలపిస్తున్నాయి. వీటితో పాటు పొలం గట్లు, దిమ్మలు కూరగాయల పాదులు, ఆకుకూరలతో నిండిపోతున్నాయి. గతంలో ఎక్కువ మంది రైతులు వ్యవసాయం చేయడం వలన కౌలు రైతులు పెద్దగా ఉండేవారు కాదు. పొలాల్లో దిమ్మలపై పశువుల మకాంలు ఏర్పాటు చేసుకుని ఖాళీ స్థలాల్లో కూరగాయలు, పొలం గట్లపై కందులు సాగు చేసేవారు. తద్వారా ఇంటి అవసరాలు తీరడంతో పాటు మార్కెట్లో అమ్మడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకునేవారు. మరోపక్క గృహిణులు ఇంటి పెరటిలో కూరగాయలు, ఆకుకూరల మొక్కలు పెంచేవారు. కాలక్రమంలో వ్యవసాయం చేసే రైతులు తగ్గిపోగా కౌలు రైతులు పెరిగారు. శిస్తు చెల్లించే క్రమంలో సాగు విస్తీర్ణం పెంచుకునేందుకు కౌలుదారులు ప్రాధాన్యమిస్తున్నారు. పారలంకతో గట్లు కుచించుకుపోతుండగా దిమ్మలు కరిగిపోయి పొలాల్లో చాలా వరకూ కూరగాయల సాగు తగ్గిపోయింది. మరోపక్క ఇళ్ల వద్ద పెరడులు కనుమరుగైపోయి మార్కెట్లో దొరికే ఎరువులు, పురుగు మందులతో పండించిన కూరగాయలు, ఆకుకూరల పైనే ఆధారపడాల్సి వస్తోంది. వెలగతోడులో పొలం గట్లపై వేసిన బెండ మొక్కలను పరిశీలిస్తున్న ప్రకృతి వ్యవసాయాధికారి కూరగాయల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా సేంద్రియ పద్ధతిలో ఇళ్ల వద్ద, పొలాల్లోను కూరగాయలు, ఆకుకూరల సాగును ప్రోత్సహిస్తోంది. గ్రామాల్లోని డ్వాక్రా మహిళలకు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సేంద్రియ సేద్యం ద్వారా తక్కువ ఖర్చుతో కూరగాయలు, ఆకుకూరల సాగుపై శిక్షణ ఇస్తున్నారు. రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా వారికి వంగ, మిరప, టమాటా, ఆనప, బెండ వంటి కూరగాయలతో పాటు గోంగూర, తోటకూర, పాలకూర తదితర ఆకుకూరల విత్తనాలు అందజేస్తున్నారు. కరోనా తర్వాత ఆరోగ్యం పట్ల ప్రజల్లో శ్రద్ధ పెరిగింది. మార్కెట్లో రసాయనాలు వినియోగించిన కూరగాయలు కొనే కన్నా ఇంటి వద్ద సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీలైనంతలో ఇంటి వద్ద ఖాళీ ప్రదేశాలు, మేడ పైన కూరగాయలు, ఆకుకూరలు పెంచుకుంటున్నారు. మరోపక్క పొలంబడి ద్వారా రైతులకు శిక్షణ ఇచ్చి గట్లు, దిమ్మలపై కూరగాయల సాగును కూడా ప్రకృతి వ్యవసాయ విభాగం ప్రోత్సహిస్తోంది. ఆకుకూరలు, కాయగూరలతో పాటు మునగ, బొప్పాయి విత్తనాలు, మొక్కలు అందజేస్తున్నారు. ఎరువులు, పురుగు మందులు వాడకుండా ప్రకృతిలో లభించే వనరులతో కషాయాల తయారీపై శిక్షణ ఇస్తూ సేంద్రియ పద్ధతిలో రైతులతో సాగు చేయిస్తున్నారు. ఆయా పంటలను ఎప్పటికప్పుడు వ్యవసాయ సిబ్బంది పరీక్షించి రైతులకు అవసరమైన సూచనలు ఇస్తున్నారు. ఈ తరహాలో పండించిన వాటికి మంచి డిమాండ్ ఉంటోంది. మార్కెట్ ధరలతో పోలిస్తే సేంద్రియ కూరగాయలను రెట్టింపు ధరకు కొనుగోలు చేసేందుకు కూడా వినియోగదారులు వెనుకాడటం లేదు. ప్రకృతి వ్యవసాయ విభాగం గణాంకాల ప్రకారం జిల్లాలోని 14,800 మంది మహిళలు కిచెన్ గార్డెన్ ద్వారా సేంద్రియ పద్దతిలో ఇళ్ల వద్ద కూరగాయలు పెంచుతుండగా, 5,400 మంది రైతులు పొలం గట్లు, దిమ్మలపై వీటిని సాగు చేస్తున్నారు. మరింత మందితో సాగు చేయించే దిశగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ప్రకృతి వ్యవసాయ అధికారులు తెలిపారు. మా ఇల్లే మినీ వనం ప్రకృతి వ్యవసాయ అధికారుల సూచనలతో సేంద్రియ సాగుపై అవగాహన పెంచుకుని మేడపై సాగు చేయడం మొదలు పెట్టాం. ఆకుకూరలు, కూరగాయలతో పాటు డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్ష, అంజీర వంటి పండ్లు, పూల మొక్కలు కూడా పెంచుతున్నాం. ఇంట్లో కూరల కోసం వీటి నుంచి వచ్చిన కూరగాయలు, ఆకు కూరలనే వినియోగిస్తుంటాం. ఎక్కువగా కాపుకొచ్చినప్పుడు ఇరుగుపొరుగు వారికి ఇస్తూంటాం. – వల్లూరి సత్యవేణి, అర్తమూరు ఆరోగ్యవంతమైన జీవనం పొలం గట్లు, ఇళ్ల వద్ద సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. డ్వాక్రా మహిళలు, రైతులకు శిక్షణతో పాటు విత్తనాలు, మొక్కలు అందజేస్తున్నాం. సేంద్రియ సాగు వలన ఆరోగ్యవంతమైన జీవనంతో పాటు పర్యావరణానికి హాని జరగకుండా ఉంటుంది. గట్లపై కందులు, కూరగాయల సాగుతో వరిపై మొవ్వు, పచ్చదోమ వంటి చీడపీడల బెడద చాలా తక్కువగా ఉంటుంది. – బి.జగన్, మండల ప్రకృతి వ్యవసాయ అధికారి, మండపేట -
ఎక్సర్సైజ్ చేయడానికి టెర్రాస్ మీదకు వెళ్లి .. మాటల్లో పడి..
తిరువనంతపురం: ఉదయంపూట తన సోదరుడితో కలిసి అపార్ట్‌మెంట్‌పై వ్యాయామం చేస్తున్న యువతి.. అనుకోకుండా అదుపుతప్పి కిందపడింది. ఈ దుర్ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కొచ్చిలోని చిత్తోర్‌రోడ్డులో ఉన్న ఒక అపార్ట్మెంట్లో 18 ఏళ్ల ఐరిస్‌రాయ్, ఆమె సోదరుడు అలస్‌తో కలిసి ఉండేవాడు. ఈ క్రమంలో వీరిద్దరు కూడా తమ అపార్ట్మెంట్లోని భవనం పైకి వెళ్లి ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేస్తుంటారు. కాగా, ప్రతిరోజు మాదిరిగానే.. ఐరిస్‌రాయ్, తన సోదరుడితో కలిసి ఈ రోజు (గురువారం) ఉదయం వ్యాయామం చేయడానికి టెర్రాస్ పైకి వెళ్లింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి అక్కడ కొంచెం బురదగా ఉంది. ఆ టెర్రాస్‌కు పక్కన సెఫ్టీ వాల్స్‌కూడా లేదు. ఈ క్రమంలో.. ఆమె వ్యాయామం చేసి అలసిపోయి.. అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంది. సోదరుడితో కలిసి మాటల్లో పడి .. ఎత్తైన ప్రదేశంలో ఉన్న విషయాన్ని మర్చిపోయింది. దీంతో ఒక్కసారిగా.. 9వ అంతస్తు నుంచి ఐరిన్ రాయ్ కిందకు జారిపడింది. ఈ సంఘటనతో అక్కడి వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆమె అరుచుకుంటూ.. కిందపడింది. ఆమె ముక్కు,నోటిలో నుంచి రక్తం బయటకు వచ్చింది. దీంతో, ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. యువతి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలుస్తాయని కొచ్చి పోలీసు అధికారి విజయ్ శంకర్ తెలిపారు. -
చలికాలపు ఇంటిపంటలు
చలికాలంలో ఇంటిపెరట్లో, మేడపైన సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసుకోదగిన ప్రత్యేక కూరగాయ రకాలు కొన్ని ఉన్నాయి. ఆకుకూరలను ఏడాదిలో ఎప్పుడైనా సాగు చేసుకోవచ్చు. వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆలూ/బీన్స్, క్యాబేజ్, క్యాలీ ఫ్లవర్, కాప్సికం, ఉల్లి, ముల్లంగి, వంగ, క్యారట్, టమాట, గోరుచిక్కుడు, పాలకూర, మెంతికూర వంటి రకాలను ఈ సీజన్లో నిక్షేపంగా సాగు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలం సుదీర్ఘంగా కొనసాగడం వల్ల శీతాకాలపు పంటలకు సంబంధించి ఇప్పుడు నారు పోసుకోవడం కన్నా.. దగ్గరల్లోని నర్సరీల నుంచో, సీనియర్ ఇంటిపంటల సాగుదారుల నుంచో మొక్కల నారును తెచ్చుకొని నాటుకోవడం మేలు. ఈ సీజన్లో కుండీలు, మడుల్లో మొక్కలకు నీరు అంత ఎక్కువగా అసవరం ఉండదు. తేమను బట్టి తగుమాత్రంగా నీటిని అందించుకోవడం అవసరమని ఇంటిపంటల సాగుదారులు గుర్తించాలి. -
ఇంటిపంటలకు షేడ్‌నెట్ అవసరమే లేదు!
కాంక్రీటు జంగిల్లా మారిన మహానగరంలో నివాసం ఉంటూ రసాయనిక అవశేషాల్లేని సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తమ మేడ మీదే పండించుకోవడానికి మించిన సేఫ్ ఫుడ్ ఉద్యమం మరొకటి ఉండదు. ఎందుకంటే.. ఆహారంతో పాటు కడుపులోకి వెళ్లే రసాయనాలు ఎన్నో జబ్బులకు కారణమవుతూ జీవితానందాన్ని ఏ విధంగా హరించివేస్తున్నాయో తెలియజెప్పే నివేదికలు రోజుకొకటి వెలువడుతూనే ఉన్నాయి కదా..! అటువంటి ఉత్తమాభిరుచి కలిగిన అరుదైన సేంద్రియ ఇంటిపంటల సాగుదారులే ప్రభుత్వ ఉద్యోగి శ్రీనివాసరెడ్డి, లత దంపతులు. హైదరాబాద్ బీరంగూడ రాఘవేంద్ర కాలనీ (బీహెచ్ఈఎల్ దగ్గర)లో తమ స్వగృహంపై నాలుగేళ్లుగా సేంద్రియ ఇంటిపంటలను మక్కువతో సాగు చేస్తూ.. మొక్కలతో ఆత్మీయస్నేహం చేస్తూ, ప్రకృతితో మమేకం అవుతున్నారు! 1800 చదరపు గజాల టెర్రస్‌ను పూర్తిగా కూరగాయ మొక్కలు, పూలమొక్కలతో నింపేశారు. ప్రేమతో పండించుకునే సేంద్రియ కూరగాయలను ఆరగించడంలోనే కాదు ఇతరులతో పంచుకోవడంలోనూ అమితానందాన్ని పొందుతున్నారు లత. తల్లిదండ్రులు, తమ్ముడు, చెల్లెలు ఇతర బంధువుల కుటుంబాలకు పండిన పంటలో సగం మేరకు పంచుతుండటం విశేషం. టెర్రస్ పైన పిట్టగోడలకు అనుక్ముని 3 వైపులా హాలో బ్రిక్స్‌ను ఏర్పాటు చేసుకుని మట్టి మిశ్రమం పోసి మొక్కలు పెట్టారు. 300కు పైగా కుండీలు, మూడు సిమెంటు రింగ్స్‌లో రకరకాల మొక్కలు పెంచుతుండటంతో జీవవైవిధ్యం ఉట్టిపడుతోంది. చిక్కుడు కాయలు, వంకాయలు, టమాటోలు, మిరపకాయలు, సొర, నేతిబీర, బీర, కాకరకాయలు ఇప్పుడు పుష్కలంగా వస్తున్నాయి. చేమ మొక్కలను దుంపల కోసమే కాకుండా ఆకుకూరగా కూడా వాడుతున్నారు. పాలకూర, చుక్కకూర, తోటకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీన వంటి ఆకుకూరలకు కొదవ లేదు. అంజీర, సపోట, జామ, నిమ్మ (5 రకాలు), బత్తాయి, ఆరెంజ్, దానిమ్మ, స్టార్ ఫ్రూట్, మామిడి (4 రకాలు) వంటి పండ్ల మొక్కలు చక్కగా పెరుగుతూ దిగుబడినిస్తున్నాయి. నాలుగేళ్లుగా ఇంటిపంటలు సాగు చేస్తున్న లత ఎండాకాలంలోనూ చాలా జాగ్రత్త తీసుకుంటుంటారు. షేడ్‌నెట్ వేయకుండానే ఇంటిపంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటుండటం విశేషం. ఈ ఏడాది ఎండలు ఎక్కువగానే ఉంటాయని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో చాలా మంది ఇంటిపంటల సాగుదారులు ఇప్పటికే షేడ్నెట్లు వేసుకున్నారు. అయితే, ఈ ఏడాదీ షేడ్‌నెట్ వేయకుండానే పంటలను జాగ్రత్తగా కాపాడుకుంటానని లత అంటున్నారు. సమ్మర్లో రెండుపూటలా మొక్కలకు నీరు ఇస్తానని, అది కూడా తగుమాత్రంగా కొద్ది కొద్దిగానేనని ఆమె అంటున్నారు. కుండీలు, మడుల్లో మట్టి బీటలు వారకుండా చూసుకుంటూ తగుమాత్రంగా రెండు పూటలా నీరు అందించాలని ఆమె సూచిస్తున్నారు. పోషకాలు తగ్గకుండా అప్పుడప్పుడూ వర్మీ కంపోస్టును/ సొంతంగా తయారు చేసుకున్న కంపోస్టును మొక్కలకు అందిస్తూ.. జీవామృతాన్ని వాడుతూ ఉంటే ఎండలకు భయపడాల్సిందేమీ లేదని లత చెబుతున్నారు. ఇంటిపంటలను జీవనశైలిలో భాగంగా మార్చుకున్న ఆదర్శ గృహిణి లత (96032 32114) గారికి జేజేలు! -
జీవ వైవిధ్యమే ప్రాణం!
‘గత డిసెంబరుతో (హైదరాబాద్ సమీపంలోని నారపల్లిలోని) మా మిద్దెతోట తొమ్మిదవ సంవత్సరంలోకి ప్రవేశించింది. గడచిన ఎనిమిది సంవత్సరాల కాలంలో మార్కెట్లో కూరగాయలు కొనలేదు – పండ్లు కొనలేదు! మిద్దెతోటలోనే ఉత్పత్తి చేశాం! ఎనిమిది సంవత్సరాల మిద్దెతోట ఉత్పత్తిని – రోజుకు కిలో చొప్పున లెక్కించినా – మూడు టన్నుల పైమాటే! ఇదంతా కేవలం 1240 స్క్వేర్ ఫీట్ల టెర్రస్ మీద మాత్రమే పండించాం. ఎనిమిది సంవత్సరాల క్రితం మిద్దెతోట నిర్మాణ వ్యయం ఇరవై వేల రూపాయలు. అయితే, ఈ ప్రత్యక్ష ఫలితాల గురించి కాదు నేను చెప్పాలనుకుంటున్నది.. అది అందరికీ కనిపించే విషయమే! ఈ ఉత్పత్తి వెనుక ఒక సహజసిద్ధమైన ‘జీవ వైవిధ్య ప్రభావం’ ప్రక్రియ ఉన్నదని తెలియ జెప్పాలన్నదే ఈ ప్రయత్నం. అదే లేకుంటే, ఈ ఉత్పత్తి వచ్చేదే కాదు! జీవ వైవిధ్యం వల్లనే ప్రకృతి కొనసాగుతున్నది. మనందరికీ తెలుసు, పరపరాగ సంపర్కం వల్లనే పువ్వులు ఫలిస్తాయని. తేనెటీగలు సీతాకోకచిలుకలు ఇతర రెక్కల పురుగులు అందుకు దోహదపడతాయి. పూలలోని తేనె కోసం తేనెటీగలు వచ్చి పువ్వుల మీద వాలినప్పుడు వాటి కాళ్ల నూగుకు పువ్వుల పుప్పొడి అంటుకుని.. అలా పరపరాగ సంపర్కం అప్రయత్నంగా జరుగుతుంది. అలా పువ్వులు ఫలదీకరణ చెందుతాయి. మనకు లభించే దాదాపుగా అన్ని రకాల ఉత్పత్తులు ఇలానే పండుతాయి. మిద్దెతోటను మనం అభివృద్ధి చేస్తున్నకొద్దీ, రావలసిన జీవజాతులు వచ్చి చేరతాయి. మిద్దెతోటల్లో పండ్ల మొక్కలను కూడా పెంచడం వల్ల పక్షులు కూడా వస్తాయి. చిన్న చిన్న పక్షులు మొక్కల మీద పురుగులను ఏరుకొని తింటాయి! మొక్కలకు హాని చేసే క్రిమికీటకాలను అలా కంట్రోల్ చేస్తాయి. కోయిలలు కూడా పండ్ల కోసం మిద్దెతోటల లోకి వస్తాయి. వాటి పాటలను వినగలగడం వల్ల మనకు ఎంతో సంతోషం కలుగుతుంది. అది మన స్వయం కృషి ఫలమైన సహజ సంగీతం! మట్టిలో వానపాములు అభివృద్ధి అవుతాయి. వాటివలన సహజసిద్ధమైన ఎరువు తయారు అవుతుంది. మిద్దెతోటలో సంవత్సరం పొడవునా పువ్వు లుండేలా పూల మొక్కలను పెంచుతాం కనుక రంగురంగుల సీతాకోక చిలుకలు మిద్దె తోటలోకి వస్తాయి, తేనె తాగడానికి! తద్వారా పువ్వుల మధ్య పరపరాగ సంపర్కం జరిగి మనకు సంపూర్ణ ఉత్పత్తి వస్తుంది. గువ్వలు, పిచ్చుకలు వచ్చి మిద్దెతోటలో గూళ్లు కట్టుకుంటాయి. మిద్దెతోటల మొక్కలకు హాని చేసే పురుగూ పుట్రలను అవి తినేస్తూ మొక్కలకు పరోక్షంగా రక్షణ కలిగిస్తాయి. మిద్దెతోటల్లోకి ఎలుకలు కూడా వస్తాయి.. నష్టాన్ని కలిగిస్తాయి. ఎలుకల కోసం పిల్లులు వస్తాయి. ఇలా ఇప్పుడు మా మిద్దెతోటలో మూడు పిల్లులు ఉన్నాయి. ఒక పెంçపుడు శునకం ఉంది. వాటి మధ్య సఖ్యత కూడా కలిగింది! మిద్దెతోటలో నిత్యం పూసే పువ్వుల తేనె కోసం వందలాది తేనెటీగలు ఉదయం పూట వస్తాయి. మిద్దెతోటలో చిన్నచిన్న తేనెపట్టులు పెట్టుకుంటాయి. ప్రతీ చిన్న పువ్వు నుండి అవి తేనెను గ్రహిస్తాయి. కూరగాయ మొక్కల పువ్వుల నుండి కూడా తేనెను గ్రహిస్తాయి. ఆ ప్రక్రియ వల్లనే నిజానికి సమస్త రకాల పువ్వులు ఫలదీకరణం చెందుతున్నాయి. మనం నిత్యం తినే తిండి తయారీలో తేనెటీగల పాత్ర అపురూపమైనది – వెలకట్టలేనిది! మనం ప్రకృతి సమతుల్యతను కాపాడితే, అది మన ఆయురారోగ్యాలను కాపాడుతుంది! మిత్రుడు క్రాంతిరెడ్డి ఓ మాట అన్నాడు, ‘నేను మాత్రమే అనుకుంటే అహం – నేను కూడా అనుకుంటే సుఖం. మనుషులొక్కరే భూగోళం మీద మనలేరు – సమస్త జీవజాతుల మనుగడలో మనుషుల మనుగడ ముడిపడి ఉంది! పట్టణాలలో జీవ వైవిధ్యం పెరగాలంటే, మిద్దెతోటలను మించిన సాధనాలు లేవు! – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దెతోట నిపుణులు, నారపల్లి రఘోత్తమరెడ్డి మిద్దె తోటలో జీవవైవిధ్యానికి ఆనవాళ్లు.. పక్షి గూళ్లు, పక్షులు, పిల్లి, కుక్క.. -
పేనును నలిపేస్తే చాలు!
వంగ మొక్కలకు పేను సమస్య ఉంటుంది. పేను సోకిన ఆకులను తెంపి పారెయ్యాలి. అంటే, లేతాకులను మినహా మిగతా అన్ని ముదురు ఆకులను తెంపి దూరంలో పారెయ్యాలి. మిగిలిన ఆకులకు ఉన్న పేనును చేతి వేళ్లతో సున్నితంగా నలపాలి. వరుసగా రెండు, మూడు రోజులు అలాగే చెయ్యాలి. పేను లేకుండా అవుతుంది. దీనికి ఏ మందులూ స్ప్రే చెయ్యనవసరం లేదు. మిద్దె తోటల్లో చీడపీడల నివారణలో చేతులను మించిన సాధనాలు లేవు. – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దెతోట నిపుణులు -
మూడు ఆకాకర పాదులుంటే చాలు..!
మంచి పోషక విలువలతో కూడిన ఆకాకర/బోడకాకర కాయల ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇంటిపంటల్లో సాధారణంగా ఇది కనిపించడం అరుదు. అటువంటి అరుదైన ఆకాకర కాయలను హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ(టెంపుల్ బస్టాప్ దగ్గర)కి చెందిన కన్సల్టింగ్ ఇంజనీర్ నాగేంద్ర సొంత ఇంటిపైన సాగు చేస్తున్నారు. ఆయన టెర్రస్ గార్డెన్లో బోడకాకర పాదులు ఆరు ఉన్నాయి. అందులో 2 మగవి, 4 ఆడవి. ఆడ పాదులే కాయలు కాస్తాయి. పరపరాగ సంపర్కం ద్వారా ఆడ పాదుల పూలు ఫలదీకరణం చెంది ఫలసాయం రావాలంటే.. బొప్పాయి, తాటిచెట్లలో మాదిరిగా.. పది ఆడ పాదులకు కనీసం ఒక మగ పాదు ఉండాలని నాగేంద్ర తెలిపారు. ఆకాకర విత్తనాలు మార్కెట్లో కూడా దొరకడం లేదు. నాగేంద్ర తమ ఇంటి సమీపంలోని రైతు బజార్లో వ్యాపారులు పారేసిన పండు కాయలను తీసుకొచ్చి.. విత్తనాలు సేకరించి.. విత్తుకున్నారు. గుప్పెడు విత్తనాలు వేస్తే 8 మొలిచాయి. 6 మిగిలాయి. ఈ పాదులను విత్తనం ద్వారా లేదా దుంప నాటడం ద్వారా పెంచుకోవచ్చు. దుంపను చూస్తే ఆడ, మగ తేడా తెలీదు. పూత వస్తే తప్ప అది ఆడ పాదా, మగ పాదా అనేది చెప్పలేం. ఆడ, మగ పాదులకు వచ్చే పూల మధ్య ఒక తేడా గమనించవచ్చు. ఆడ పువ్వునకు అడుగున చిన్న కాయ కూడా ఉంటుంది. కొన్నాళ్లకు పువ్వు రాలిపోయి కాయ పెరుగుతుంది. మగ పువ్వు అడుగున కాయేమీ ఉండదు. వర్షాకాలంలో 3 నెలల పాటు ఆకాకర పాదు కాయలనిస్తుంది. ఒక్కో పాదు తడవకు పావు కిలో వరకు కాయలిస్తుంది. రెండు ఆడ పాదులు, ఒక మగ పాదున్నా నలుగురున్న ఇంటికి కూరకు సరిపడా ఆకాకర కాయలు పండించుకోవచ్చని నాగేంద్ర (98481 30414) చెబుతున్నారు. ఇంటిపంటల్లో అరుదైన ఆకాకర/బోడకాకర పాదులు పెంచుతున్న నాగేంద్రను ‘సాక్షి–ఇంటిపంట’ అభినందిస్తోంది. గమనిక: మీరూ ఏదైనా అరుదైన/విలక్షణ కూరగాయలను సేంద్రియంగా ఇంటిపంటల్లో పెంచుతున్న వారెవరైనా ఉంటే వివరాలు, ఫొటోలను sagubadi@sakshi.com కు మెయిల్ చెయ్యవచ్చు. -
సిమెంటు వరలు, హాలో బ్రిక్స్‌లో ఇంటిపంటలు!
పెద్దగా ఖర్చు పెట్టకుండానే రసాయనాల అవశేషాల్లేని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను సొంతంగా ఇంటిపైనే పండించుకోవచ్చని ఈ ఇంటిపంటల తోటను చూస్తే అర్థమవుతుంది. హైదరాబాద్ నగరంలోని బీరంగూడ రాఘవేంద్ర కాలనీ(బీహెచ్ఈఎల్ దగ్గర)లో ఇండిపెండెంట్ హౌస్‌లో నివాసం ఉంటున్న గృహిణి లత తన అభిరుచి మేరకు తమ ఇంటిపైన స్వల్ప ఖర్చుతోనే సేంద్రియ ఇంటిపంటలను గత మూడేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. 3 సిమెంటు వరలను ఆకుకూరల మడులుగా మార్చేశారు. 1500 చదరపు అడుగుల టెర్రస్ పైన మూడు కార్నర్లలో హాలోబ్రిక్స్తో మడులు ఏర్పాటు చేసి తీగజాతి కూరగాయ మొక్కలను పెంచుతున్నారు. పాలకూర, తోటకూర, కీర, వంగ, సొర కాయలతోపాటు.. పైనాపిల్ పండ్లు, ఆపిల్ బెర్ పండ్లను ఆమె సాగు చేస్తున్నారు. డ్రమ్ములో నాటిన ఆపిల్ బెర్ మొక్క ఏడాదికి 3 సీజన్లలోనూ మంచి ఫలసాయాన్ని ఇస్తున్నదని ఆమె తెలిపారు. అంజూర మొక్క కూడా నిరంతరం పండ్ల దిగుబడినిస్తున్నదని తెలిపారు. సీతాఫలం మొక్కలను కూడా పెంచుతున్నారు. చెట్టుచిక్కుడు కాస్తున్నది. కీర దోస కాయలను సైతం తమ ఇంటిపైనే లత(96032 32114) సాగు చేస్తుండడం విశేషం. -
చుక్కకూర విత్తనాల సేకరణ ఎలా?
► మన విత్తనాలను మనం కట్టుకోవడం మంచిది. మార్కెట్లో దొరికే విత్తనాలు ఒక్కోసారి మొలవవు. మొలిచినా బూడిద తెగులువి అయ్యుండే ప్రమాదం ఉంటుంది! చక్కని ఆరోగ్యవంతమైన విత్తనాలను మనం మన తోటలోనే కట్టుకోవడం మంచిది. ► చుక్క కూర పూత దశకు రాగానే రెండు, మూడు బలమైన ఆరోగ్యవంతమైన మొక్కలను విత్తనం కోసం వదలాలి. వాటిని కొయ్యకూడదు. ► పువ్వుల మధ్యలో విత్తనాలు ఉంటాయి. చిన్న చిన్న స్పాంజి ముక్కల్లా కనిపిస్తాయి. గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తన రకం చుక్కకూర! ► పువ్వులు క్రమంగా ఎండుతాయి. బాగా ఎండిన తరువాత పువ్వుల గుత్తులను కొయ్యాలి. మరో రెండు రోజులు బాగా ఎండబెట్టాలి. తరువాత కుండలో నిల్వ చేసుకోవడం మంచిది! పైన మూత పెట్టుకోవాలి. వెంటనే కానీ తరువాత కానీ ఎప్పుడు అవసరం పడితే అప్పుడు నాటుకోవచ్చు. ఈ దిగువ విత్తనాలు వందల మందికి ఇవ్వవచ్చు. అలా ఇస్తున్నాం కూడా, మా మిద్దెతోట చూడ వచ్చిన వారికి! – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దె తోటల నిపుణులు -
‘ఇంటిపంట’ స్ఫూర్తితో బడిపంట!
పిల్లలకు రసాయనిక ఎరువులు లేకుండా, పురుగుమందులు లేకుండా సేంద్రియ సేద్యమనేది ఒక కల్టివేషన్ మెథడ్‌గా చెబితే.. భవిష్యత్తులో ఈ పిల్లలే బడులుగా మారిపోతారు! ఇన్నాళ్లూ రసాయనాలతో వ్యవసాయం చేస్తూ నష్టపోతున్న పెద్దలు..ఆ బడుల్లో పాఠాలు నేర్చుకుంటారు.. వ్యవసాయం బాగుపడుతుంది.. దేశం బాగుపడుతుందన్న మంచి ఆలోచనతో ‘ఇంటిపంట’ స్ఫూర్తితో మొదలు పెట్టిన ఈ కార్యక్రమం.. ‘బడిపంట’గా మొదలయ్యింది. వర్థిల్లాలి. అందుకే ఈ కథనం.. ‘సాక్షి’ దినపత్రికలో గత ఏడేళ్లుగా ప్రచురితమవుతున్న ‘ఇంటిపంట’ కథనాల స్ఫూర్తితో గుంటూరు నల్లచెరువులోని కలాం థెరిస్సా ఐడియల్ స్కూల్ తన విద్యార్థులకు సేంద్రియ ‘బడిపంట’లపై పాఠాలు చెబుతూ వారిలో సామాజిక స్పృహను పెంపొందిస్తోంది. ప్రాథమికోన్నత, ఉన్నత తరగతుల విద్యార్థులకు రసాయనిక అవశేషాల్లేని ప్రకృతి ఆహారం ప్రాధాన్యతను తెలియజెప్తూ ‘బడిపంట’లను సాగు చేస్తున్నది. భవనం టెర్రస్ మీద గ్రోబ్యాగ్స్‌లో మట్టి, ఘనజీవామృతం, జీవామృతంతో బడిపంటల సాగుకు గత ఏడాది ఖరీఫ్‌లో శ్రీకారం చుట్టారు. మొదట్లో ఆకుకూరలు, కూరగాయలను విద్యార్థులతో స్కూలు భవనంపైనే గ్రోబ్యాగ్స్, బియ్యం బస్తాలలో సాగు చేయించారు. ఈ ఏడాది కూరగాయలతోపాటు మొక్కజొన్న, కొర్ర, సామలు, ఊదలు, అరికలు వంటి సిరిధాన్యాలను సైతం సాగు చేయిస్తున్నారు. 6–9 తరగతుల విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా కొన్ని గ్రోబ్యాగ్స్‌ను, విత్తనాలు ఇచ్చి వారి ఇళ్ల దగ్గర ఇంటిపంటలు పెంచేలా ప్రోత్సహిస్తున్నారు. పెంచిన పంటలను విద్యార్థులకే పంచిపెడుతున్నారు. వ్యవసాయ విశ్రాంత విస్తరణాధికారి సత్యనారాయణ మూర్తి(94915 82181) మార్గదర్శకత్వంలో స్కూలు కరస్పాండెంట్ షేక్ మస్తాన్ ‘బడిపంట’ కార్యక్రమాన్ని చేపట్టారు. కొర్ర వంటి సిరిధాన్యాలను తాము ఇంతకుముందెన్నడూ చూడలేదని విద్యార్థులు మురిసిపోతూ చెప్పారు. అంతేకాదు.. పంట పొలాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 20 మంది అన్నదాతలను ఆహ్వానించి గత ఏడాది ఘనంగా సత్కరించడం ద్వారా అన్నదాతల్లో, విద్యార్థులలో స్ఫూర్తిని నింపడం విశేషం. పద్మశ్రీ పాలేకర్ ప్రశంసలు అందుకున్న ఈ స్కూలులో ‘బడిపంట’లను పలు స్కూలు యాజమాన్యాలు సందర్శించాయని మూర్తి తెలిపారు. ఇటీవల స్కూలు వార్షికోత్సవంలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, పప్పులు, కూరగాయలతోనే విందు ఏర్పాటు చేయడం శుభపరిణామం. స్కూలు యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులకు జేజేలు! మా ఇంటిపంటల రుచి బాగుంది! ఇంటిదగ్గర 11 గ్రోబ్యాగ్స్‌లో కొర్రలు, అలసందలు, మొక్కజొన్నలు పండిస్తున్నా. ఇంతకుముందు ఆకుకూరలు పండించి, వండుకు తిన్నాం. రుచి బాగుంది. పదిరోజులకోసారి స్కూల్లోనే జీవామృతం తయారు చేసుకొని తెచ్చి పోస్తున్నా. మంచి పని చేస్తున్నారు, మున్ముందు ఈ అనుభవం పనికొస్తుంది. బాగా చెయ్యమని మా అమ్మానాన్న అంటున్నారు. తర్వాత వంకాయలు పండిస్తా. అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతా. – షేక్ సల్మా, 9వ తరగతి, నల్లచెరువు, గుంటూరు తన ఇంటిపంటలకు నీరు పోస్తున్న సల్మా ఇంటి పైన సామ,కొర్ర పండిస్తున్నా.. స్కూల్లో గ్రోబ్యాగ్స్‌లో మిరపకాయలు, బెండకాయలు, టమాటాలు, మొక్కజొన్న పండించాం. ప్రాజెక్టులో భాగంగా ఇంటిదగ్గర సామ, కొర్ర, అరికలు వంటి సిరిధాన్యాలు ఇప్పుడు కొన్ని గ్రోబ్యాగ్స్‌లో వేశాను. కంకులు వచ్చాయి. పురుగుమందులు, ఎరువులు వేయకుండా పంటలు పండిస్తే ఆరోగ్యకరమని తెలుసుకున్నాను. మా అమ్మానాన్నా కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇక ముందు కూడా ఇంటిపంటలు పండిస్తాను. – వీర్ల ప్రభు, 9వ తరగతి, నల్లచెరువు, గుంటూరు తమ ఇంటి మేడపైన కొర్ర కంకులు చూపుతున్న ప్రభు ఈ కాయగూరలు తింటే ఆరోగ్యం జీవామృతంతో పండిస్తే కాయగూరలు విషపూరితం కాకుండా ఉంటాయని మా బడిపంట ద్వారా తెలుసుకు న్నాను. వీటిని తింటే ఆరోగ్యం బాగుంటుంది. మంచిది. హేమంత్ సాయి భార్గవ్,6వ తరగతి, నల్లచెరువు, గుంటూరు ఎప్పటికీ ఇంటిపంటలు పండిస్తా! మెంతి విత్తనాలు వేస్తే వారంలో మెంతి కూర వచ్చింది. అందరికీ ఇచ్చా. తోటకూర కూడా జీవామృతం వేసి పెంచాను. మా స్కూల్లో చెప్పటం వల్ల రోగాలు రాకుండా పంటలు ఎలా పెంచాలో తెలిసింది. పెద్దయ్యాక కూడా వేస్తా. ఎస్.యామిని, 7వ తరగతి, నల్లచెరువు, గుంటూరు చైతన్యం కోసమే ‘బడిపంట’! సాక్షి ఇంటిపంట, సాగుబడి కథనాల స్ఫూర్తితో రెండు సీజన్ల నుంచి సేంద్రియ ‘బడిపంట’ల సాగును మా విద్యార్థులకు పరిచయం చేస్తున్నాం. మొదట ఆకుకూరలు, కూరగాయలతో ప్రారంభించాం. వ్యాధులను సైతం నయం చేయగల సిరిధాన్యాలను కూడా ఇప్పుడు స్కూల్లోను, పిల్లల ఇళ్ల దగ్గర కూడా గ్రోబ్యాగ్స్‌లో సాగు చేయిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను సత్కరించాం. పిల్లలకు పంటల సాగు సులువేనని తెలియజెప్పడంతోపాటు ప్రకృతి ఆహారంపై చైతన్యం కలిగించాలన్నదే మా ప్రయత్నం. షేక్ మస్తాన్ (70360 29365), కరస్పాండెంట్,కలాం థెరిస్సా ఐడియల్ స్కూల్, నల్లచెరువు, గుంటూరు నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ఆదర్శవంతం.. టెర్రస్ ఉద్యానవనం!
సేంద్రియ ఇంటిపంటల సాగుపై మక్కువ పెంచుకుంటే ఆయురారోగ్యాలు, ఆనందోత్సాహాలను పొందడంతోపాటు.. మహానగరంలో సొంత ఇల్లున్న బాధ్యతాయుతమైన పౌరులుగా విశ్రాంత జీవితాన్ని అర్థవంతంగా గడపవచ్చని నిరూపిస్తున్నారు.. పిన్నాక శ్రీనివాస్, పద్మ దంపతులు. హైదరాబాద్ మియాపూర్‌లోని దీప్తిశ్రీనగర్ వాసులైన ఈ ఆదర్శ దంపతులు తమ సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కుమారులు అమెరికాలో స్థిరపడ్డారు. దుబాయ్‌లో ఉద్యోగ విరమణ అనంతరం నగరంలో పద్మ, శ్రీనివాస్ స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. విశ్రాంత జీవితంలో ఇంటిపంటల సాగును ప్రధాన వ్యాపకంగా మార్చుకున్నారు. ఇంటిపైన గల వెయ్యి చదరపు అడుగుల స్థలాన్ని పూల మొక్కలు, సుసంపన్నమైన ఉద్యాన పంటల జీవవైవిధ్యానికి చిరునామాగా రూపుదిద్దారు. వంటింటి వ్యర్థాలు, ఆకులు అలములను తగుల బెట్టకుండా.. బయట పడేయకుండా.. ఇంట్లోనే కంపోస్టు తయారు చేసుకుంటూ ఆరోగ్యదాయకమైన, రుచికరమైన సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఏడాది పొడవునా పండించుకొని తింటున్నారు. వీరి కృషికి మెచ్చిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ‘టెర్రస్ హార్టీకల్చర్’ విభాగంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఇటీవల సత్కరించడం విశేషం. బోన్సాయ్, పూల మొక్కలపై ఉన్న ఆసక్తిని పద్మ, శ్రీనివాస్ దంపతులు మూడేళ్ల క్రితం నుంచి టెర్రస్‌పై సేంద్రియ ఇంటిపంటల వైపు మళ్లించారు. దాదాపుగా ఏమీ కొనడం లేదు. ఎక్కువ దిగుబడి ఉన్నప్పుడు ఇరుగుపొరుగు వారికి పంచిపెడుతున్నారు. సాక్షిలో ఇంటిపంట, సాగుబడి కథనాలు, ఇతర పుస్తకాలు చదువుతూ.. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ ఎప్పటికప్పుడు పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్నామని పద్మ తెలిపారు. ఎక్కువ అవసరం అనుకున్న ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలను రకానికి ఐదేసి కుండీల్లో పెంచుకోవడం ద్వారా ఏడాది పొడవునా దిగుబడి వచ్చేలా ప్రణాళికా బద్ధంగా ఇంటిపంటలను సాగు చేస్తున్నారు. అన్ని రకాల ఆకుకూరలు, వంగ, టమాటా, దొండ, దోస, కాకర.. తదితర కూరగాయలు.. బొప్పాయి, అంజూర, కమలాలు, నారింజ, నిమ్మ, స్టార్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, యాపిల్ బెర్ తదితర పండ్ల చెట్లు పెంచుతున్నారు.. ఇక పూల చెట్లకు లెక్కే లేదు. వెలగ, రావి, జువ్వి.. వంటి ఇతర చెట్లూ ఉన్నాయి. చీడపీడలు చాలా తక్కువ. ఏదైనా పురుగు కనిపిస్తే చేతులతోనే తీసేస్తున్నారు. అపుడప్పుడూ వేపనూనె, గంజి ద్రావణం వాడుతున్నారు. సొంత విత్తనాలనే వాడుతున్నారు. ఇతరులకూ పంచుతున్నారు. లిచీ, యాపిల్ పండ్ల నుంచి విత్తనాలు తీసి.. మొక్కలు పెంచుతున్నారు. నిమ్మకాయలతో ఊరగాయ పచ్చడి పెట్టుకుంటున్నారు. ఎండాకాలంలోనూ షేడ్‌నెట్ అవసరం లేదని, రోజుకు 3 సార్లు నీరు ఇస్తే చాలన్నారు. సేంద్రియ ఫలం రుచే వేరు..! మా ఇంటి మీద పండిన పండ్లు, కూరగాయలు, ఆకుకూరల రుచి చాలా బాగుంటుంది. తింటేనే ఆ తేడా తెలుస్తుంది. ముఖ్యంగా బొప్పాయిని రుచి చూస్తే.. సేంద్రియ ఫలం గొప్పతనం తెలుస్తుంది. ఉదయం, సాయంత్రం చెట్లను కనిపెట్టుకొని ఉంటున్నాం. విశ్రాంత జీవితంలో ఇంటిపంటలే మా లోకం, ఆనందం, ఆరోగ్యం కూడా. ఇంటిపంటల సాగును ఉచితంగా నేర్పిస్తాం. ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు. ముందుగా చెప్పి.. స్వయంగా వచ్చి చూడొచ్చు. – పిన్నాక శ్రీనివాస్ (87900 73518), పద్మ(94406 43065), దీప్తిశ్రీనగర్, మియాపూర్, హైదరాబాద్ – పట్టోళ్ల గోవర్థన్‌రెడ్డి, సాక్షి, మియాపూర్, హైదరాబాద్ -
భారీ వర్షానికి ఇంటి మిద్దె కూలి ఆరుగురు మృతి
-
భారీ వర్షానికి ఇంటి మిద్దె కూలి ఆరుగురు మృతి
కడప: నిన్న రాత్రి ఎడితెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని మైలవరం మండలం నవాబుపేటలో విషాదం అలుముకుంది. సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో మట్టి మిద్దె కూలి ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 15 మందికి తీవ్ర గాయాలైయ్యాయి. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. కాగా, జిల్లా వ్యాప్తంగా భారీ పంట నష్టం కూడా వాటిల్లింది. మూడు రోజులుగా పెనుగాలులు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. గాలి బీభత్సానికి చాలాచోట్ల చెట్లు విరిగిపడుతున్నాయి. ఉద్యాన పంటలు నేలమట్టం అయ్యాయి. విద్యుత్ స్తంభాలు, టవర్లు నేల కొరిగాయి. దీంతో ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ఉద్యాన పంటలకు సంబంధించి తీరా పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి అన్నదాతపై కక్ష కట్టడంతో రైతన్నలు విలవిల్లాడుతున్నారు. సుడిగాలుల నేపథ్యంలో విద్యుత్‌స్తంభాలు విరిగిపడుతుండటంతో రైల్వేకోడూరు, బద్వేలు, మైదుకూరు, పులివెందుల నియోజకవర్గాల్లోని పలు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి.