గుంటూరు నల్లకుంట 3వ లైనులోని కలామ్ థెరెస్సా ఐడియల్ స్కూల్ టెర్రస్ పైన కొలువైన ‘బడిపంట’లు
పిల్లలకు రసాయనిక ఎరువులు లేకుండా, పురుగుమందులు లేకుండా సేంద్రియ సేద్యమనేది ఒక కల్టివేషన్ మెథడ్‌గా చెబితే.. భవిష్యత్తులో ఈ పిల్లలే బడులుగా మారిపోతారు! ఇన్నాళ్లూ రసాయనాలతో వ్యవసాయం చేస్తూ నష్టపోతున్న పెద్దలు..ఆ బడుల్లో పాఠాలు నేర్చుకుంటారు.. వ్యవసాయం బాగుపడుతుంది.. దేశం బాగుపడుతుందన్న మంచి ఆలోచనతో ‘ఇంటిపంట’ స్ఫూర్తితో మొదలు పెట్టిన ఈ కార్యక్రమం.. ‘బడిపంట’గా మొదలయ్యింది. వర్థిల్లాలి. అందుకే ఈ కథనం..
‘సాక్షి’ దినపత్రికలో గత ఏడేళ్లుగా ప్రచురితమవుతున్న ‘ఇంటిపంట’ కథనాల స్ఫూర్తితో గుంటూరు నల్లచెరువులోని కలాం థెరిస్సా ఐడియల్ స్కూల్ తన విద్యార్థులకు సేంద్రియ ‘బడిపంట’లపై పాఠాలు చెబుతూ వారిలో సామాజిక స్పృహను పెంపొందిస్తోంది. ప్రాథమికోన్నత, ఉన్నత తరగతుల విద్యార్థులకు రసాయనిక అవశేషాల్లేని ప్రకృతి ఆహారం ప్రాధాన్యతను తెలియజెప్తూ ‘బడిపంట’లను సాగు చేస్తున్నది. భవనం టెర్రస్ మీద గ్రోబ్యాగ్స్‌లో మట్టి, ఘనజీవామృతం, జీవామృతంతో బడిపంటల సాగుకు గత ఏడాది ఖరీఫ్‌లో శ్రీకారం చుట్టారు. మొదట్లో ఆకుకూరలు, కూరగాయలను విద్యార్థులతో స్కూలు భవనంపైనే గ్రోబ్యాగ్స్, బియ్యం బస్తాలలో సాగు చేయించారు.
ఈ ఏడాది కూరగాయలతోపాటు మొక్కజొన్న, కొర్ర, సామలు, ఊదలు, అరికలు వంటి సిరిధాన్యాలను సైతం సాగు చేయిస్తున్నారు. 6–9 తరగతుల విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా కొన్ని గ్రోబ్యాగ్స్‌ను, విత్తనాలు ఇచ్చి వారి ఇళ్ల దగ్గర ఇంటిపంటలు పెంచేలా ప్రోత్సహిస్తున్నారు. పెంచిన పంటలను విద్యార్థులకే పంచిపెడుతున్నారు. వ్యవసాయ విశ్రాంత విస్తరణాధికారి సత్యనారాయణ మూర్తి(94915 82181) మార్గదర్శకత్వంలో స్కూలు కరస్పాండెంట్ షేక్ మస్తాన్ ‘బడిపంట’ కార్యక్రమాన్ని చేపట్టారు. కొర్ర వంటి సిరిధాన్యాలను తాము ఇంతకుముందెన్నడూ చూడలేదని విద్యార్థులు మురిసిపోతూ చెప్పారు.
అంతేకాదు.. పంట పొలాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 20 మంది అన్నదాతలను ఆహ్వానించి గత ఏడాది ఘనంగా సత్కరించడం ద్వారా అన్నదాతల్లో, విద్యార్థులలో స్ఫూర్తిని నింపడం విశేషం. పద్మశ్రీ పాలేకర్ ప్రశంసలు అందుకున్న ఈ స్కూలులో ‘బడిపంట’లను పలు స్కూలు యాజమాన్యాలు సందర్శించాయని మూర్తి తెలిపారు. ఇటీవల స్కూలు వార్షికోత్సవంలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, పప్పులు, కూరగాయలతోనే విందు ఏర్పాటు చేయడం శుభపరిణామం. స్కూలు యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులకు జేజేలు!
మా ఇంటిపంటల రుచి బాగుంది!
ఇంటిదగ్గర 11 గ్రోబ్యాగ్స్‌లో కొర్రలు, అలసందలు, మొక్కజొన్నలు పండిస్తున్నా. ఇంతకుముందు ఆకుకూరలు పండించి, వండుకు తిన్నాం. రుచి బాగుంది. పదిరోజులకోసారి స్కూల్‌లోనే జీవామృతం తయారు చేసుకొని తెచ్చి పోస్తున్నా. మంచి పని చేస్తున్నారు, మున్ముందు ఈ అనుభవం పనికొస్తుంది. బాగా చెయ్యమని మా అమ్మానాన్న అంటున్నారు. తర్వాత వంకాయలు పండిస్తా. అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతా.
– షేక్ సల్మా, 9వ తరగతి, నల్లచెరువు, గుంటూరు
తన ఇంటిపంటలకు నీరు పోస్తున్న సల్మా
ఇంటి పైన సామ,కొర్ర పండిస్తున్నా..
స్కూల్లో గ్రోబ్యాగ్స్‌లో మిరపకాయలు, బెండకాయలు, టమాటాలు, మొక్కజొన్న పండించాం. ప్రాజెక్టులో భాగంగా ఇంటిదగ్గర సామ, కొర్ర, అరికలు వంటి సిరిధాన్యాలు ఇప్పుడు కొన్ని గ్రోబ్యాగ్స్‌లో వేశాను. కంకులు వచ్చాయి. పురుగుమందులు, ఎరువులు వేయకుండా పంటలు పండిస్తే ఆరోగ్యకరమని తెలుసుకున్నాను. మా అమ్మానాన్నా కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇక ముందు కూడా ఇంటిపంటలు పండిస్తాను.
– వీర్ల ప్రభు, 9వ తరగతి, నల్లచెరువు, గుంటూరు
తమ ఇంటి మేడపైన కొర్ర కంకులు చూపుతున్న ప్రభు
ఈ కాయగూరలు తింటే ఆరోగ్యం
జీవామృతంతో పండిస్తే కాయగూరలు విషపూరితం కాకుండా ఉంటాయని మా బడిపంట ద్వారా తెలుసుకు న్నాను. వీటిని తింటే ఆరోగ్యం బాగుంటుంది. మంచిది.
హేమంత్ సాయి భార్గవ్,6వ తరగతి, నల్లచెరువు, గుంటూరు
ఎప్పటికీ ఇంటిపంటలు పండిస్తా!
మెంతి విత్తనాలు వేస్తే వారంలో మెంతి కూర వచ్చింది. అందరికీ ఇచ్చా. తోటకూర కూడా జీవామృతం వేసి పెంచాను. మా స్కూల్‌లో చెప్పటం వల్ల రోగాలు రాకుండా పంటలు ఎలా పెంచాలో తెలిసింది. పెద్దయ్యాక కూడా వేస్తా.
ఎస్.యామిని, 7వ తరగతి, నల్లచెరువు, గుంటూరు
చైతన్యం కోసమే ‘బడిపంట’!
సాక్షి ఇంటిపంట, సాగుబడి కథనాల స్ఫూర్తితో రెండు సీజన్ల నుంచి సేంద్రియ ‘బడిపంట’ల సాగును మా విద్యార్థులకు పరిచయం చేస్తున్నాం. మొదట ఆకుకూరలు, కూరగాయలతో ప్రారంభించాం. వ్యాధులను సైతం నయం చేయగల సిరిధాన్యాలను కూడా ఇప్పుడు స్కూల్‌లోను, పిల్లల ఇళ్ల దగ్గర కూడా గ్రోబ్యాగ్స్‌లో సాగు చేయిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను సత్కరించాం. పిల్లలకు పంటల సాగు సులువేనని తెలియజెప్పడంతోపాటు ప్రకృతి ఆహారంపై చైతన్యం కలిగించాలన్నదే మా ప్రయత్నం.
షేక్ మస్తాన్ (70360 29365), కరస్పాండెంట్,కలాం థెరిస్సా ఐడియల్ స్కూల్, నల్లచెరువు, గుంటూరు
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment