jeevamrutham
-
ప్రకృతిని, ఆవులను నమ్ముకున్నారు.. 40 సెంట్లు.. రూ.3 లక్షలు!
ఈ రైతు దంపతులు ప్రకృతిని, తనకున్న రెండు ఆవులను నమ్ముకున్నారు.. పేడ, గోమూత్రంతో ఘనజీవామృతం, జీవామృతాలను తయారు చేసుకొని ఏడేళ్లుగా శ్రద్ధగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.. వీరి స్వయం కృషికి పంచభూతాలు సాయం చేస్తున్నాయి. మామిడి తోట మధ్యలో 40 సెంట్లలో ఫిబ్రవరి నుంచి అంతర పంటలుగా కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తూ ప్రతి వారం మంచి ఆదాయం పొందుతున్నారు. అందుకే దీన్ని ‘ఏటీఎం నమూనా’గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రూ. 1,20,000 ఆదాయం వచ్చింది. కేవలం ఈ అంతరపంటల ద్వారా మొత్తం రూ.3 లక్షలకు పైగా ఆదాయం పొందే అవకాశం ఉందంటున్న నారాయణ, పార్వతి దంపతుల కృషిపై ‘సాక్షి’ ఫోకస్.. స్వయంకృషితో పాటు ప్రకృతిని నమ్ముకుంటే రైతు సుభిక్షంగా ఉంటాడనడానికి హెచ్. నారాయణ, పార్వతి దంపతులే నిదర్శనం. వీరి స్వస్థలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లాపురం గ్రామం. తమకున్న 3.70 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. అంతర పంటల్లోనూ మంచి ఆదాయం తమకున్న రెండు నాటు ఆవులను సంరక్షిస్తూ పేడ, గో మూత్రంతో ద్రవ జీవామృతం, ఘన జీవామృతం, నీమాస్త్రం తయారు చేసుకొని పంటలకు వాడుతున్నారు. స్వయం కృషికి తోడుగా అతి తక్కువ పెట్టుబడితోనే మామిడిలో, అంతర పంటల్లోనూ మంచి ఆదాయం ఆర్జిస్తూ ఇతర రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. మామిడి తోటలోని 40 సెంట్ల స్థలాన్ని ఫిబ్రవరి 13న ఎంపిక చేసుకొని బోదెలు సిద్ధం చేసుకున్నారు. ఐదు వరసల్లో 5 రకాల పంటలను విత్తుకున్నారు. గోరుచిక్కుడు, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, అలసంద, మొక్కజొన్నతో పాటు మెంతాకు, కొత్తిమీర, గోంగూర సాగు చేస్తున్నారు. బోరు నీటిని అందిస్తున్నారు. ఘనజీవామృతం వేస్తున్నందు వల్ల నీరు కూడా ఎక్కువ అవసరం రావటం లేదు. ఒక్క తడి ఇస్తే 15–20 రోజులు ఉంటుంది. కెమికల్ వేసిన పొలం అయితే ఐదారు రోజులకే నీరు మళ్లీ అడుగుతుంది. తోట పనులను నారాయణ, ఆయన భార్య కలసి చేసుకుంటున్నారు. ప్రతి శుక్రవారం మార్కెట్లో, ఇంటి దగ్గర కూరగాయలు అమ్ముతున్నారు. గోరుచిక్కుడు ద్వారా 30 వేలు ఇప్పటివరకు గోరుచిక్కుడు (చోలా కాయల) ద్వారా రూ.30 వేలు, ముల్లంగి ద్వారా రూ.50 వేలు, కొత్తిమీరలో రూ.20 వేలు, మెంతాకు, గోంగూరలలో మరో రూ.20 వేలు ఆదాయం వచ్చింది. ముల్లంగి, ఆకుకూరలు తీసేవి తీస్తూ ఉంటే మళ్లీ విత్తుతున్నారు. మొక్కజొన్న, అలసంద, క్యారెట్, బీట్రూట్ పంటలు మరో ఒకటిన్నర నెలల్లో చేతికొస్తాయి. క్యారెట్, బీట్రూట్ మంచి ధర పలుకుతాయని, మొత్తంగా 40 సెంట్లకు రూ.3 లక్షలకు పైగానే ఆదాయం వస్తుందని, ఇదంతా నికరాదాయమేనని నారాయణ ధీమాగా చెబుతున్నారు. రూ. 1,500లతో విత్తనాలు కొనటం తప్ప వేరే ఏ ఖర్చూ లేదన్నారు. రసాయనాలు వేయకుండా పంటలను పసిబిడ్డల్ని చూసుకున్నట్లు చూసుకుంటున్నామని నారాయణ చెప్పారు. అంతర పంటల ద్వారా నిరంతరం ఆదాయం వస్తోందని చెబుతూ.. ఇదే ఏటీఎం మోడల్ పంటల వల్ల లాభం అన్నారు. తనను చూసి తన పక్క పొలం రైతు కూడా 20 సెంట్లలో ఈ నమూనాలో పంటలు వేశాడన్నారు. క్లస్టర్లో మరో 25 మంది రైతులు వేశారన్నారు. మామిడిలోనూ మంచి ఆదాయం మామిడి పంటను కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే నారాయణ దంపతులు సాగు చేస్తున్నారు. ఘనజీవామృతం, జీవామృతాన్ని వినియోగిస్తూ మంచి దిగుబడి, ఆదాయం పొందుతున్నారు. గత ఏడాది మామిడి 8 టన్నుల దిగుబడి రాగా రూ.2 లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఇప్పటికే 6 టన్నులు పంట కోత కోశారు. మరో 3 టన్నులు పంట చేతికొస్తుంది. మామిడి ద్వారా రూ.3 లక్షలకు పైగా ఆదాయం వస్తుందని నారాయణ చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన పండ్లు, కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయని, రుచిగా ఉంటున్నాయని వినియోగదారులు సంతోషంగా మంచి ధరకు తీసుకుంటున్నారని నారాయణ, పార్వతి ఆనందంగా చెబుతున్నారు. వీరి పొలాన్ని ఇటీవల పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ బి.రాజశేఖర్, ఏపీ రైతు సాధికార సంçస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్‌కుమార్, అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి తదితరులు సందర్శించి అభినందించారు. ప్రకృతి వ్యవసాయం ఎంతో మేలు నేను అయిష్టంగానే ప్రకృతి వ్యవసాయాన్ని ఏడేళ్ల క్రితం మొదలు పెట్టాను. డీపీఎం లక్ష్మానాయక్, మాస్టర్ ట్రైనర్ శివశంకర్ అన్ని విషయాలూ అర్థమయ్యేలా చెప్పి సహకరించారు. ఘన, ద్రవ జీవామృతాలు తయారు చేసుకొని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. పంటలకు ఎలాంటి తెగుళ్లు, వైరఃస్లు రాలేదు. పండ్ల తోటల్లో కూడా ఐదారు రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తే ఒకదాని తర్వాత ఒకటి మనకు పంట చేతికొస్తుంది. మంచి నికరాదాయం వస్తుంది. ఇది రైతులకు ఎంతో మేలైన పద్ధతి. భూమి కూడా గుల్లబారి బాగుంటుంది. వాన నీరు బాగా ఇంకుతుంది. సహజ సిద్ధమైన ఎరువులతో పండించిన కూరగాయలు, ఆకుకూరలు తింటే మనిషి ఆరోగ్యం కూడా బాగుంటుంది. నన్ను చూసి కొందరు ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు. రైతులంతా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి. – హెచ్.నారాయణ (95504 84675), ప్రకృతి వ్యవసాయదారుడు, మల్లాపురం గ్రా., కళ్యాణదుర్గం మం., అనంతపురం జిల్లా స్వయంగా చూస్తే గానీ నమ్మలేరు.. పది రకాల కూరగాయలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తూ అనంతపురం జిల్లాలో రైతులు సుమారు 400 మంది అత్యంత ఆశ్చర్యకరమైన రీతిలో అధికాదాయం పొందుతున్నారు. స్వయంగా వచ్చి చూస్తే గానీ ఇంత ఆదాయం వస్తున్నదని నమ్మకం కలగదు. నారాయణ, పార్వతి రైతు దంపతులు తమ మామిడి తోటలో 40 సెంట్లలో అంతర పంటలుగా కూరగాయలను సాగు చేస్తూ చక్కని ఆదాయం పొందుతున్నారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటికి రూ. 1,20,000 ఆదాయం వచ్చింది. మరో రెండు నెలల్లో ఈ ఆదాయం రూ. 3 లక్షలకు పెరుగుతుందని రైతు ధీమాగా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గౌతమి, ఏపీ రైతుసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ టి. విజయకుమార్, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ బి.రాజశేఖర్ కూడా ఇటీవల నారాయణ తోటను సందర్శించారు. అంత ఆదాయాన్ని పొందే అవకాశాలు ప్రకృతి వ్యవసాయంలో ఉన్నాయన్నది ఈ తోటలను స్వయంగా చూసిన వారికి అర్థం అవుతుంది. వారానికి రెండు, మూడు సార్లు కూరగాయలను విక్రయిస్తూ నిరంతరం ఆదాయం పొందుతున్నారు. అందువల్లనే ఈ నమూనాను ‘ఏటీఎం మోడల్’ అని పిలుస్తున్నాం. – లక్ష్మానాయక్ (83310 57583), ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్, అనంతపురం జిల్లా - ఈదుల శ్రీనివాసులు, సాక్షి, కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా -
Natural Farming: ప్రకృతి వ్యవసాయానికి ఏపీ చేదోడు
సమస్త జీవకోటి భారాన్ని మోసేది నేల. గతం నుండి మన తరానికి సంక్రమించిన వారసత్వ సంపద నేల. నేలను సారవంతంగా ఉంచే కారకాలు అపరిమితమైనవి కాదు, పరి మితమైనవి. విచ్చలవిడిగా భూమిని వాడిపడేస్తే... అది త్వరలోనే వట్టిపోతుంది. మనం ఈ భూమి మీద నివసిస్తున్నట్లే భవిష్యత్తు తరాలూ మనుగడ సాగించాలంటే... వారికి పనికి రాని నేలను కాక... సజీవమైన భూమిని అప్పగించాల్సిన బాధ్యత మనదే. మనుషుల నిర్లక్ష్యం, పేరాశ కారణంగా సాగు భూమి నిస్సారమైపోతోంది. నేల సేంద్రియ కర్బన పదార్థాలను కోల్పోయి పంటల సాగుకు పనికి రాకుండా పోతున్నది. వ్యవసాయంలో విచక్షణారహితంగా రసాయనాలను వాడటం వల్ల నేల నిస్సారమవుతున్నది. అధిక మొత్తంలో రసాయనాలు వాడిన ఫలి తంగా వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులు తిన్న జీవజాలం అనారోగ్యం పాలవుతుంది. కన్న తల్లి పాలు కూడా పంటలపై చల్లే రసాయనాల కారణంగా విషతుల్య మవుతున్నాయని రాజస్థాన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు డాక్టర్ ఇంద్రసోని పాల్ తెలిపారు. విషతుల్యమైన వ్యవసాయ ఉత్పత్తుల వల్ల పిల్లల రోగ నిరోధక శక్తి నశిస్తుందనీ, తెలివితేటలు, జ్ఞాపకశక్తి దెబ్బతింటాయనీ ఇప్పటికే పరిశోధకులు తేల్చారు. అందుకే వ్యవసాయ విధానం ప్రకృతికి దగ్గరగా ఉండాలనే నినాదం ఇప్పుడు ఊపందుకుంది. అందులో భాగంగా నేలలోని సారం దీర్ఘకాలం మన గలిగే నిర్వహణ పద్ధతులు ప్రచారం చేస్తున్నారు. మట్టి ఆరోగ్యమే మనిషి ఆరోగ్యం అని తాత్వికతతో వ్యవసాయాన్ని సాగించాలి. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికీ, పర్యావరణాన్ని సుస్థిరమైనదిగా తయారు చేయ డానికీ, రైతుల జీవన ప్రమాణాలు పెంచడానికీ, సహజ వనరు లను ఉపయోగించి మంచి ఫలసాయం సాధించడానికీ, ప్రకృతి వ్యవసాయం దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ప్రత్యేకంగా ‘రైతు సాధికార సంస్థ’ ద్వారా జీరో–బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్, కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమాలను అమలు చేస్తోంది. రైతుల సంక్షేమం, వినియోగదారుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ వంటి బహుళ లక్ష్యాలతో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. రైతుల సాగు ఖర్చులను తగ్గించడం, రైతుల దిగుబడిని మెరుగుపరచడం, వారి నష్టాలను తగ్గించడం, లాభదాయ కమైన ధరలను పొందడం ద్వారా వారి నికర ఆదాయాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అధిక ధర కలిగిన కృత్రిమ ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు ఉపయోగించకుండా ప్రకృతికి అనుగుణంగా గోమూత్రం, గో పేడ, వేప ఆకులు, స్థానిక వనరులతో... ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, బీజామృతం, నీమాస్త్రం, అగ్నిఅస్త్రం, బ్రహ్మాస్త్రం వంటివాటిని తయారుచేసుకుని వ్యవసాయంలో ఉపయోగించడానికి ప్రోత్సహిస్తోంది. ఇందువల్ల నేలలో జీవ పదార్థం అధికమవ్వడమే కాక మొత్తంగా భూసారం పెరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం ద్వారా మానవ ఆరోగ్యమే కాక, నేల ఆరోగ్యాన్నీ కాపాడవచ్చని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. (క్లిక్ చేయండి: తూర్పు కనుమల అభివృద్ధిపై విభిన్న వైఖరి!) – ఎ. మల్లికార్జున, ప్రకృతి వ్యవసాయ శిక్షకుడు -
‘ప్రకృతి’కి పట్టుగొమ్మ జీవామృతం
ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలను రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా సాగు చేయటం ద్వారా మనుషుల ఆరోగ్యంతోపాటు భూమి, పర్యావరణం, పశుపక్ష్యాదుల ఆరోగ్యం కూడా కుదుట పడుతుందని ఇప్పటికే రుజువైన విషయం. స్థానికంగా గ్రామాల్లో అందుబాటులో ఉండే ప్రకృతి వనరులతోనే స్థానిక ప్రజలకు అవసరమైన చక్కని ఆరోగ్యదాయకమైన పంట ఉత్పత్తులను పండించుకోవటం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఎంతో ఆవశ్యకమైన అంశంగా అందరి గ్రహింపునకు వస్తుండటం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ విభాగం జీవామృతాన్ని అందుబాటులో ఉన్న వనరులతోనే తయారు చేసుకోవటంతోపాటు, పంటలకు జీవామృతాన్ని వాడుకునే పద్ధతులను రైతులకు సూచిస్తోంది. జీవామృతం తయారు చేసుకునే విధానం, కావలసిన పదార్ధాలు: 1. దేశీ ఆవుపేడ – 10 కేజీలు 2. దేశీ ఆవు మూత్రం – 5 నుండి 10 లీటర్లు 3. బెల్లం – 2 కేజీలు (నల్ల బెల్లం అయితే మరీ మంచిది) లేదా చెరుకు రసం 2 లీటర్లు 4. పప్పుల (ద్విదళాల) పిండి – 2 కేజీలు (శనగ, ఉలవ, పెసర, మినుము ఏదైనా వాడవచ్చు. వేరుశనగ, సోయా పిండి మాత్రం వాడకూడదు) 5). బావి/బోరు/నది నీరు – 200 లీటర్లు 6). పుట్ట మన్ను లేదా పొలంగట్టు మన్ను దోసెడు పెద్ద సిమెంటు తొట్లలో జీవామృతం తయారీ జీవామృతాన్ని తయారు చేసే విధానం: తొట్టిలో గానీ, డ్రమ్ములో గానీ 200 లీటర్ల నీటిలో ఈ పదార్థాలన్నింటినీ కలిపి నీడలో 48 గంటల పాటు ఉంచాలి. ప్రతి రోజూ రెండు, మూడు సార్లు కర్రతో కుడి వైపునకు తిప్పాలి. 200 లీటర్ల జీవామృతం ఎకరానికి సరిపోతుంది. ఇలా కలిపిన జీవామృతం 48 గంటల తర్వాత వాడకానికి సిద్ధమవుతుంది, అప్పట్నుంచి 9 నుంచి 12 రోజుల మధ్య సూక్ష్మజీవుల వృద్ధి అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు అధికంగా వృద్ధి చెందుతాయి. నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములు చైతన్యవంతం అవుతాయి. తద్వారా భూసారం పెరగడానికి దోహదపడుతుంది. రైతులు వరి, మొక్కజొన్న, వేరుసెనగ, కూరగాయలు, పండ్ల తోటల దగ్గరే జీవామృతం తయారు చేసుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. ప్లాస్టిక్ డ్రమ్ములు, శాశ్వత సిమెంట్ వరలతో లేదా ఇటుకలతో నిర్మించే సిమెంటు తొట్లు, అవేవీ లేకపోతే ప్లాస్టిక్ కవర్లను మూడు ఊత కర్రల సాయంతో నిలబెట్టి అందులో కూడా ద్రవ జీవామృతాన్ని తయారు చేసుకోవచ్చు. పంటలకు నీటి ద్వారా పారించవచ్చు. లేదా పిచికారీ చేయవచ్చు. పొలం గట్లపైనే జీవామృతం సిద్ధం చేసుకునే పద్ధతులు 1. 200 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్ము ఎక్కువ మంది రైతులు జీవామృతం తయారీ కోసం 200 లీటర్లు పట్టే ప్లాస్టిక్ డ్రమ్ములను ఉపయోగిస్తుంటారు. ఈ డ్రమ్ము ఖరీదు సుమారుగా రూ. 800 వరకు ఉంటుంది. కొందరు రైతులు 100 లీటర్ల సామర్ధ్యం గల చిన్న ప్లాస్టిక్ డ్రమ్ములను ఉపయోగిస్తుంటారు. ఈ ప్లాస్టిక్ డ్రమ్ములను రైతులు పొలం గట్ల పైన లేదా పాకలు / షెడ్లలో పెట్టుకొని జీవామృతాన్ని తయారు చేసుకుంటూ వాడుతూ ఉంటారు. ప్లాస్టిక్ డ్రమ్ములతో సులువుగా పంటలకు కావలసిన జీవామృతాన్ని అందించగలుగుతున్నారు. 2. ప్లాస్టిక్ కవర్ పిట్ డ్రమ్ములు కొనలేని చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు 100 లీటర్ల ప్లాస్టిక్ కవర్లను జీవామృతం తయారీ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ కవరు ఖరీదు రూ. 20 వరకు ఉంటుంది. మూడు ఊత కర్రలను భూమి లోపలికి దిగేసి నిలబెట్టి, వాటి మధ్య ఈ ప్లాస్టిక్ కవర్‌ను ఉంచి పొలం గట్ల పైన లేదా పాకలలో జీవామృతం తయారు చేసుకొని వాడుతున్నారు. 3. సిమెంట్ వరలతో జీవామృతం పిట్ సిమెంటు వరల (నందల)తో పిట్లను నిర్మించుకొని కొందరు రైతులు జీవామృతాన్ని ఉపయోగిస్తున్నారు. ఇవి శాశ్వతంగా ఉండిపోతాయి. సిమెంట్ వరల పిట్ ఏర్పాటుకు సుమారు రూ. 500ల నుంచి రూ.750 వరకు ఖర్చవుతుంది. పండ్ల తోటల రైతులు వీటిని ఎక్కువగా నిర్మించుకొని ఏడాది పొడవునా జీవామృతం తయారీకి ఉపయోగిస్తున్నారు. 4. పెద్ద సైజు సిమెంటు తొట్లు సొంత భూముల్లో వ్యవసాయం చేసే రైతులు, పండ్ల తోటల రైతులు పొలంలోనే సిమెంటుతో పెద్ద తొట్లు నిర్మించుకొని, వాటిలో జీవామృతం తయారు చేసుకోవటమే కాకుండా ఫిల్టర్ చేసుకునే ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. జీవామృతం పంటలకు వాడే పద్ధతులు : నీటి తడులతో పారించటం వరి, మొక్కజొన్న, చెరకు తదితర పంటలకు నీటి తడులను అందించేటప్పుడు నీటితో పాటుగా జీవామృతాన్ని ఎకరాకు ఒక దఫా 200 లీటర్లు చొప్పున అందిస్తున్నారు. పంటల వివిధ దశల్లో 3 నుండి 4 సార్లు నీటితోపాటు పారిస్తున్నారు జీవామృతం పిచికారీ పద్ధతి వరి, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలకు జీవామృతాన్ని బాగా వడగట్టి, నీటితో పాటుగా ఎకరాకు ఒక దఫాకు 200 లీటర్లు పంటల వివిధ దశల్లో 3 నుంచి 4 సార్లు రైతులు పొలాల్లో పిచికారీ చేస్తున్నారు. డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా జీవామృతం పారించటం పండ్ల తోటలు, కూరగాయ తోటలకు కొన్ని చోట్ల ఆరుతడి వరికి సైతం జీవామృతాన్ని జాగ్రత్తగా వడకట్టి డ్రిప్ ద్వారా లేదా స్ప్రింక్లర్ల ద్వారా రైతులు అందిస్తున్నారు. పైపాటుగా పంటలపై పోయటం చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు లేదా పెరట్లో కూరగాయలు పండించుకునే వారు పంటలపై జీవామృతాన్ని చెంబులు, మగ్గులతో విరజిమ్ముతున్నారు. (మరిన్ని వివరాలకు.. ప్రకృతి వ్యవసాయ విభాగం విజయనగరం జిల్లా మేనేజర్ ప్రకాశ్ (91211 47885)ను సంప్రదింవచ్చు) ఏ యే పంటలకు ఎంత జీవామృతం? వరి, మొక్కజొన్న, వేరుసెనగ, కూరగాయ పంటలకు నీరు పారించే సమయంలో నీటితో కలిపి పారేలా చేసి పొలం మొత్తానికి జీవామృతం అందేలా చేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి 200 లీటర్ల జీవామృతాన్ని నీటితోపాటు భూమికి అందించాలి. అలాగే పండ్ల తోటల్లో ఒక సంవత్సరం వయసున్న మొక్కకు అర లీటరు చొప్పున, రెండు సంవత్సరం మొక్కలకు ఒక లీటరు చొప్పున.. ప్రతి 15 రోజులకు ఒకసారి నేలకు అందించాలి. తద్వారా భూమిలో సుక్ష్మజీవరాశి పెంపొంది, నేల ఆరోగ్యవంతమవుతుంది. ఆరోగ్యవంతమైన భూమి మొక్కలకు సకల పోషకాలను అందిస్తుంది. -
15 రోజులకోసారి జీవామృతం
అధిక సాంద్రత గల జీవవైవిధ్య ఉద్యాన ప్రకృతి వ్యవసాయ క్షేత్రానికి రూపుకల్పన చేశారు విలక్షణ రైతు సుఖవాసి హరిబాబు(62). హైదరాబాద్ సమీపంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట గ్రామపరిధిలోని ఆయన క్షేత్రం ఉంది. పదెకరాల్లో ఎన్నో అరుదైన పండ్ల, ఔషధ, కలప జాతి చెట్లను నాటారు. దేశీ జాతుల ఆవులు, గొర్రెలు, కోళ్లు, బాతులను కలగలిపి సమీకృత ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని హరిబాబు నెలకొల్పారు. డ్రిప్ ద్వారా ప్రతి 15 రోజులకోసారి ద్రవజీవామృతం, ఏడాదికోసారి ఘనజీవామృతం, వర్షాకాలంలో ఒకసారి చెట్ల మధ్యలో వేసి.. రోటవేటర్ వేస్తూ మంచి ఫలసాయం పొందుతున్నారు. తనదైన శైలిలో అనేక ఇతర పదార్థాలను కలిపి జీవామృతం, ఘనజీవామృతంలను ఆయన తయారు చేసుకుంటున్నారు. జీవామృతం + వేపగింజల పొడి.. 6 వేల లీటర్ల సంప్‌లు రెండు నిర్మించుకొని జీవామృతం తయారు చేసుకుంటూ ప్రతి 15 రోజులకోసారి చెట్లకు అందిస్తున్నారు. ప్రతి సంప్‌లో 500–550 కిలోల ఆవు పేడ, 300–400 లీటర్ల ఆవు మూత్రం, 20 కిలోల నల్లబెల్లం, 10–15 కిలోల శనగపిండి వేసి జీవామృతం కలుపుతారు. 5 రోజుల తర్వాత.. ఒక్కో సంప్‌లో.. 400 లీటర్ల ఎర్రమట్టి నీళ్లు, 40 కిలోల స్టోన్ క్రషర్ డస్ట్ నీళ్లు 400 లీటర్లు, కిలో వేపగింజల పొడి, ఒక్కో లీటరు చొప్పున 12 రకాల నూనెలు, 1.25 లీటర్ల ఎమల్సిఫయర్ లేదా 2 లీ. కుంకుడు రసం కలిపి డ్రిప్ ద్వారా చెట్లకు అందిస్తున్నారు. పేడ + కట్టెల బొగ్గు+జీవామృతం.. హరిబాబు ఏడాదికోసారి ఘనజీవామృతం తయారు చేసుకుంటారు. జూలై నెలలో తన తోటలోని చెట్లకు వేస్తున్నారు. రెండు లాట్లుగా ఘనజీవామృతం తయారు చేస్తారు. ఒక్కో లాటుకు 60 టన్నుల పేడ(5 టిప్పర్లు), 7–8 టన్నుల కట్టెల బొగ్గు పొడితోపాటు తోటలో ప్రూనింగ్ చేసిన ఆకులు, అలములు, కొమ్మలు, రెమ్మలు 10 టన్నులను జెసిబితో ముక్కలు చేసి ముప్పావు గంటలో కలిపి పోగు చేస్తారు. దీన్ని కలిపేటప్పుడే 6 వేల లీటర్ల జీవామృతం పోస్తారు. ఈ జీవామృతంలో ముందురోజు 7–8 రకాల జీవన ఎరువులు 150 కిలోలను కలుపుతారు. ఇలా కలిపిన ఎరువుల మిశ్రమం పోగుపైన ఎండ పడకుండా చెరకు పిప్పి, అరటి, కొబ్బరి ఆకులను కప్పుతారు. 3 రోజులకోసారి పైన నీరు పోస్తూ తడుపుతుంటారు. మధ్యలో తిరగేసే పని లేదు. 4–5 నెలల్లో ఘనజీవామృతం సిద్ధమవుతుంది. జీవవైవిధ్యం ఉట్టిపడే ఉద్యాన వనాన్ని నిర్మించిన హరిబాబు (94412 80042) తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో నిర్వహిస్తుండడం విశేషం. జీవామృతాన్ని కలుపుతున్న హరిబాబు -
ఘన జీవామృతం చేద్దామిలా!
ప్రకృతి వ్యవసాయానికి ఘన జీవామృతం, ద్రవ జీవామృతం పట్టుగొమ్మలు. ఆవు పేడ, మూత్రం, పప్పుల పిండి, బెల్లంలతో ద్రవ జీవా మృతాన్ని ప్రతి 15 రోజులకోసారి తయారు చేసుకొని వాడే రైతులు ఘన జీవా మృతాన్ని అనుకూలమైన ఎండాకాలంలో తయారు చేసుకుంటారు. భూసారం పెంపుదలలో పశువుల ఎరువు, వర్మీ కంపోస్టులకు ఇది చక్కని ప్రత్యామ్నాయం. ఎకరానికి ఏటా 400 కిలోలు వేస్తే చాలు. ఘన జీవామృతాన్ని దుక్కిలో వేసుకోవడంతోపాటు.. నిల్వ చేసుకొని కొద్ది నెలల తర్వాత కూడా అవసరాన్ని బట్టి పంటలకు వేస్తూ ఉంటారు. ఖరీఫ్ వ్యవసాయ సీజన్‌కు సమాయత్తమవుతున్న ప్రకృతి వ్యవసాయదారులు ప్రస్తుతం ఘన జీవామృతాన్ని తయారు చేసుకోవడంలో నిమగ్నమవుతున్నారు. ఘన జీవామృతాన్ని రెండు విధాలుగా తయారు చేసుకోవచ్చు. ఏపీ కమ్యూనిటీ మానేజ్డ్ ప్రకృతి వ్యవసాయ విభాగం విజయనగరం జిల్లా అధికారి ప్రకాశ్ (88866 13741) అందించిన వివరాలు.. ఘన జీవామృతం –1 తయారీకి కావాల్సిన పదార్థాలు : దేశీ ఆవు పేడ (వారం రోజుల్లో సేకరించినది) 100 కిలోలు, దేశీ ఆవు మూత్రం 5 లీటర్లు, ద్విదళ పప్పుల (శనగ, ఉలవ, పెసర, మినుముల పిండి.. ఈ పిండ్లన్నీ కలిపైనా లేదా ఏదో ఒక రమైనా సరే పర్వాలేదు. అయితే, నూనె శాతం ఎక్కువగా ఉండే వేరుశనగ, సోయాచిక్కుళ్ల పిండి వాడరాదు) పిండి 2 కేజీలు, బెల్లం 2 కేజీలు (నల్లబెల్లం అయితే మరీ మంచిది) లేదా చెరకు రసం 3 లీటర్లు లేదా తాటి పండ్ల గుజ్జు తగినంత, పిడికెడు పుట్టమట్టి లేదా రసాయనాలు తగలని పొలం గట్టు మన్ను. తయారు చేసే విధానం : చెట్టు నీడలో లేదా షెడ్డులో ఈ పదార్థాలన్నిటినీ వేసి చేతితో బాగా కలిపి, 10 రోజులు ఆరబెడితే ఘనజీవామృతం సిద్ధమవుతుంది. తయారు చేసిన వారం రోజుల్లో పొలంలో వెదజల్లి, దుక్కి దున్నవచ్చు. నిల్వ చేసుకొని తదనంతరం వాడుకోవాలనుకుంటే.. దినుసులన్నీ కలిపిన వెంటనే గుండ్రటి ఉండలుగా చేసి నీడలో ఆరబెట్టుకోవాలి. ఆ ఉండలను గోనె సంచులలో నిల్వ ఉంచుకోవాలి. సీజన్లో అవసరమైనప్పుడు ఉండలను పొడిగా చేసుకొని పొలంలో వెదజల్లుకోవాలి. ఘన జీవామృతం – 2 తయారీకి కావాల్సిన పదార్థాలు : 200 బాగా చివికిన పశువుల పేడ ఎరువు, 20 లీటర్ల ద్రవ జీవామృతం. తయారు చేసే విధానం : 200 కేజీలు బాగా చివికిన పశువుల పేడ ఎరువును చెట్టు నీడలో లేదా షెడ్డులో పలుచగా పరవాలి. దానిపై 20 లీటర్ల ద్రవ జీవామృతాన్ని చల్లి, బాగా కలియబెట్టి కుప్పగా చేసి, గోనె పట్టా కప్పాలి. 48 గంటలు గడచిన తర్వాత దీన్ని పలుచగా చేసి ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తరువాత గోనె సంచులలో నిల్వ చేసుకోవాలి. పంటలకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇలా తయారు చేసిన ఘన జీవామృతం 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఎకరానికి ఎంత? ఘన జీవామృతాన్ని ఈ రెంటిలో ఏ పద్ధతిలో తయారు చేసినప్పటికీ.. ఎకరానికి దుక్కిలో కనీసం 400 కిలోల ఘన జీవామృతం వేసుకోవాలి. దానితోపాటు.. పైపాటుగా ఎకరానికి కనీసం మరో 200 కిలోలు వేసుకోగలిగితే మంచిది. పంటలకు పోషకాల లోపం లేకుండా మంచి దిగుబడులు పొందవచ్చు. -
అన్నదమ్ముల అపూర్వ సేద్యం
ఆరిమిల్లి కృష్ణ, బాపిరాజు సోదరులు 135 ఎకరాల సొంత భూమిలో ఉమ్మడి వ్యవసాయం చేస్తున్న పెద్దరైతులు. కర్నూలు జిల్లా కోసిగి మండలం కోల్‌మాన్‌పేట వారి స్వగ్రామం. పశ్చిమగోదావరి జిల్లా నుంచి 1960లో వీరి తండ్రి వలస వచ్చి కోల్మాన్పేటలో స్థిరనివాసం ఏర్పరచుకొని పాడి పశువుల పోషణతోపాటు పంటలు సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కృష్ణ బీటెక్ చదువుకున్నప్పటికీ తండ్రి చూపిన బాటలో వ్యవసాయాన్నే వృత్తిగా ఎంపిక చేసుకున్నారు. అంతేకాదు, ఎన్నో ఏళ్లుగా చేస్తున్న రసాయనిక వ్యవసాయం అనేక విధాలుగా ఎలా నష్టదాయకమో గ్రహించి కుటుంబంలో అందర్నీ ఒప్పించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడం విశేషం. 40 దేశవాళీ ఆవులను పోషిస్తూ.. వాటి పేడ, మూత్రంతో జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసుకొని భూములను సజీవవంతంగా మార్చుకుంటూ ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని పండిస్తున్నారు. రసాయనిక వ్యవసాయంలో ఎరువులు, పురుగుమందుల ఖర్చులు పెరిగిపోయి క్రమంగా నికరాదాయం తగ్గిపోతూ వస్తున్న తరుణంలో 2012 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ శిక్షణా శిబిరంలో కృష్ణ పాల్గొన్నారు. రసాయనిక వ్యవసాయంతో ప్రజారోగ్యానికి, భూమికి, పర్యావరణానికి, ఆరోగ్యానికి జరుగుతున్న నష్టాన్ని అర్థం చేసుకున్న కృష్ణ.. పాలేకర్ చెప్పిన విధంగా 2012 ఖరీఫ్ పంట కాలం నుంచే ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ఏకంగా 90 ఎకరాల్లో వరి సేద్యాన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మార్చేశారు. అయితే, కొత్త కావడం, సందేహాలను నివృత్తి చేసే వారు అందుబాటులో లేకపోవడంతో వరి ధాన్యం దిగుబడి తొలి ఏడాది ఎకరానికి 18 బస్తాలకు పడిపోయింది. మొదటి ఏడాది రూ. లక్షల ఆదాయం తగ్గిపోయింది. అయినా, మొక్కవోని దీక్షతో ప్రకృతి వ్యవసాయంలో మెలకువలను నేర్చుకుంటూ వ్యవసాయాన్ని కొనసాగించారు. అంతేకాదు, అప్పటివరకు నిర్వహిస్తున్న రసాయనిక ఎరువులు, పురుగుమందుల దుకాణం(ఏటా రూ. 30 లక్షలకు పైగా టర్నోవర్) కూడా అదే సంవత్సరం మూసివేసి మరీ ప్రకృతి వ్యవసాయానికి కట్టుబడిన ప్రకృతి వ్యవసాయ కుటుంబం వారిది. దిగుబడి 18 నుంచి 52 బస్తాల వరకు.. ప్రకృతి వ్యవసాయంలో పట్టు సాధిస్తున్న కొద్దీ ఏటేటా దిగుబడులు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం తమ ప్రాంతంలో రసాయనిక వ్యవసాయదారుల కన్నా ఎక్కువగానే ప్రకృతి వ్యవసాయంలో తాము వరి ధాన్యం దిగుబడి తీయగలుగుతున్నామని గర్వంగా చెప్పుకునే స్థితికి కృష్ణ ఎదిగారు. మొదటి ఏడాదే 90 ఎకరాల్లో వరిసాగును ప్రకృతి వ్యవసాయంలో చేపట్టినప్పుడు కొన్ని పొరపాట్ల వల్ల ఎకరానికి 18 బస్తాల వరి ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ఎకరానికి 35 నుంచి 40 బస్తాల (బస్తా 72 కిలోలు) దిగుబడి సాధిస్తున్నారు. రెండేళ్ల క్రితం చీడపీడల బెడద ఎక్కువగా ఉండటంతో రసాయనిక వ్యవసాయం చేసిన రైతులకు ధాన్యం దిగుబడి బాగా తగ్గిపోయినా తమ పొలంలో చీడపీడలూ లేవు, దిగుబడీ తగ్గలేదని కృష్ణ తెలిపారు. రెండు ఎకరాల్లో ప్రయోగాత్మకంగా పచ్చి పేడ స్లర్రీని బకెట్లతో పొలంలో కూలీలతో తరచూ పోయిస్తూ వచ్చానని, దిగుబడి ఎకరానికి 52 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చిందని కృష్ణ తెలిపారు. అయితే, పేడ స్లర్రీని బక్కెట్లతో పోయించడం శ్రమతోటి, ఖర్చుతోటి కూడిన పని కాబట్టి కొనసాగించడం లేదన్నారు. పత్తిలో అంతర పంటగా తెల్ల జొన్న కృష్ణ సోదరులకు 12 ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఈ ఏడాది 56 ఎకరాల్లో వరి (బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, ఎన్‌డిఎల్‌ఆర్–7 రకాలు) సాగు చేశారు. ఆర్ఎన్ఆర్ ఎకరానికి 38 బస్తాల దిగుబడి వచ్చింది. ఆముదం 20 ఎకరాల్లో, 4 ఎకరాల్లో కంది సాగు చేస్తున్నారు. 14 ఎకరాల్లో అండుకొర్రలు, కొర్రలు, ఊదలు, సామలు, వరిగలు సాగు చేశారు. 6 ఎకరాల్లో బీటీ పత్తి వేసి, జొన్నను అంతరపంటగా సాగు చేస్తున్నారు. ఇప్పటికే ఎకరానికి 6 క్వింటాళ్ల పత్తి తీశారు. మరో 6 క్వింటాళ్లు రావచ్చు. పత్తి సాళ్ల మధ్య 48 అంగుళాల దూరం పెట్టారు. పత్తి సాళ్ల మధ్య రెండు వరుసలుగా తెల్ల జొన్నను విత్తారు. ఎకరానికి పది క్వింటాళ్ల జొన్న దిగుబడి వస్తుందని కృష్ణ ఆశిస్తున్నారు. షాంపూ, వేప చెక్క+గోమూత్ర కషాయం సోప్ షాంపూ, వేప చెక్క+గోమూత్రంతో చేసిన కషాయం పిచికారీ చేశాక కత్తెర పురుగు ఉధృతి రసాయనిక వ్యవసాయ పొలాల్లో కన్నా తమ పొలంలో తక్కువగా ఉందని కృష్ణ తెలిపారు. సోప్ షాంపూని రెండు సార్లు పిచికారీ చేశారు. వేపచక్క 3 కిలోలు, 12 లీటర్ల గోమూత్రం కలిపి 3 పొంగులు పొంగిస్తే 8–9 లీటర్ల కషాయం వస్తుంది. కాచిన తెల్లారి 20 లీటర్ల పంపునకు ఒక లీటరు కషాయాన్ని, 1 లీటరు గోమూత్రం, 18 లీటర్ల నీటిని కలిపి పత్తిపై పిచికారీ చేస్తున్నారు. ఈ రబీలో మినుము, పెసర, గోధుమను సాగు చేయనున్నామన్నారు. మిర్చిలో అంతరపంటలుగా జొన్న, సజ్జ గత ఏడాది ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన ఎల్‌సిఎ 625 నాటు రకం మిర్చి (వరుసల మధ్య 36 అంగుళాలు, మొక్కల మధ్య 1.5 అంగుళాల దూరం)లో జొన్న, సజ్జ (3–4 మిరప మొక్కలకు ఒక జొన్న, సజ్జ మొక్కలు నాటారు) అంతర పంటలుగా వేసి మిర్చిలో 12 క్వింటాళ్ల దిగుబడులు సాధించానని కృష్ణ తెలిపారు. జొన్న, సజ్జ అంతరపంటగా వేయడం వల్ల ఫిబ్రవరి తర్వాత ఎండ తీవ్రత నుంచి మిర్చి పంటకు నీడ దొరకడంతో ఒక కాపు ఎక్కువగా వచ్చిందన్నారు. ఈ రకం మిరప విత్తనాన్ని తిరిగి వాడుకోవచ్చని, అయితే వేరే పొలంలో పండిన లేదా లాం ఫాం నుంచి విత్తనాలు తెచ్చి వేసుకుంటే మంచిదన్నారు. వేప చెక్క+గోమూత్ర కషాయాన్ని అమావాస్యకు ముందు ఒకసారి, తర్వాత మరోసారి ఈ కషాయాన్ని పిచికారీ చేసి మంచి ఫలితాలు సాధించామని కృష్ణ తెలిపారు. ప్రదర్శనా క్షేత్రం.. శిక్షణా కేంద్రం.. కృష్ణ, బాపిరాజు సోదరులు మక్కువతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ వరి, పత్తి, మిర్చి నుంచి చిరుధాన్యాలు, మామిడి తోటల వరకు బహుళ పంటలు సాగు చేస్తూ భళా అనిపించుకుంటుండటంతో వారి వ్యవసాయ క్షేత్రం వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలతో పాటు కర్ణాటకలోని బళ్లారి ప్రాంత రైతులకు సైతం ప్రదర్శన క్షేత్రంగా, రైతు శిక్షణా కేంద్రంగా రూపుదాల్చింది. సీజన్లో కనీసం రెండు సార్లు రైతులకు శిక్షణ ఇస్తున్నామని, నిరంతరం రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు ఫీల్డ్ విజిట్‌కు వస్తూ వుంటారని కృష్ణ గర్వంగా చెప్పారు. గ్రామంలో పెద్ద రైతు రసాయనిక వ్యవసాయానికి స్వస్తి పలికి ప్రకృతి వ్యవసాయం చేపట్టి, మిగతా రైతులకు తోడ్పాటునందిస్తూ ఉంటే ఆ గ్రామంలో చిన్న రైతులు అనుసరించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోల్మాన్పేటలో కూడా అదే జరుగుతోంది. ఇప్పటికి 150 మంది రైతులు ప్రకృతి వ్యవసాయ బాట పట్టారని కృష్ణ తెలిపారు. తాము జీవామృతం, ఘనజీవామృతం, తదితర కషాయాలను రైతులకు నామమాత్రపు ధరలకు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం తోడ్పాటుతో గ్రామంలో మిగతా రైతులను కూడా ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాని కృష్ణ ఆనందంగా చెప్పారు. స్ఫూర్తిదాయకమైన కృషి చేస్తున్న కృష్ణ సోదరులకు ‘సాగుబడి’ జేజేలు! – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్) వెయ్యి లీటర్ల బ్యారెల్స్‌లో జీవామృతం సరఫరా అలవాటైపోయిన రసాయనిక వ్యవసాయం వదిలేసి ప్రకృతి వ్యవసాయం చేపట్టే రైతుల్లో వారి ఆర్థిక స్తోమతను బట్టి ఎవరి బాధలు వాళ్లకుంటాయి. చిన్న రైతులకు ఉండే సమస్యలు ఒక రకమైతే, పెద్ద రైతులకు ఉండే సమస్యలు ఇంకో రకం. పాలేకర్ శిక్షణా తరగతుల్లో 200 లీటర్ల నీటిలో ఆవు పేడ, మూత్రం, బెల్లం, పప్పుల పిండి కలిపి ఎకరానికి సరిపడా జీవామృతం ఎలా తయారు చేసుకోవాలో చెబుతుంటారు. అయితే, ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన తొలినాళ్లలో ఈ సూచనలను కృష్ణ అలాగే పాటించారు. పొలం విస్తీర్ణం ఎక్కువ కావడంతో కొద్ది పరిమాణాల్లో చిన్న డ్రమ్ముల్లో చేసిన జీవామృతం సరిపోక పంట అనుకున్నంత దిగుబడినివ్వలేదు. దీంతో, ఇలా కాదని తమ పెద్ద వ్యవసాయ క్షేత్రానికి అనుగుణంగా జీవామృతం తయారీ పద్ధతిని కృష్ణ నేర్పుగా మార్చుకున్నారు. వెయ్యి లీటర్ల ఫైబర్ బ్యారెల్స్ తెప్పించి వాటిలో జీవామృతం తయారు చేసి భూములకు అందించడం ప్రారంభించిన తర్వాత సమస్య తీరింది. పంటల దిగుబడీ పెరిగింది. జీవామృతంతో కూడిన వెయ్యిలీటర్ల బ్యారెల్స్ మూడింటిని ఒక ట్రాలీలో తరలించి ఒక విడతకు 10–15 ఎకరాలకు అందిస్తుండడంతో ఇప్పుడు పుష్కలంగా జీవామృతం పంటలకు అందుతోంది. దీంతోపాటు పల్వరైజింగ్ మిషన్‌ను తెచ్చిన తర్వాత.. 135 ఎకరాలకు సరిపడా వివిధ రకాల కషాయాల తయారీ ప్రక్రియ కూడా సులభంగా మారిందని కృష్ణ సంతృప్తిగా చెప్పారు. ప్రకృతి వ్యవసాయమే నా సర్వస్వం ప్రకృతి వ్యవసాయమే నా సర్వస్వం. గతంలో రసాయన ఎరువులతో వ్యవసాయం చేసి నష్టాలను మూట కట్టుకున్నాను. సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో 2012 నుంచి తమ్ముడు బాపిరాజుతో కలసి 135 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అనేక మంది రైతులకు శిక్షణ కూడా ఇస్తున్నాం. మా గ్రామంలో దాదాపు 150 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 40 దేశవాళీ ఆవులను పోషిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం వల్ల నాణ్యమైన ఆహారాన్ని పండిస్తున్నాం. భూమి ఆరోగ్యం అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం కూడా ఈ పద్ధతిని ప్రోత్సహిస్తుండటం శుభపరిణామం. మా ఊళ్లో రైతులందరినీ ప్రకృతి వ్యవసాయదారులుగా మార్చాలని ప్రయత్నిస్తున్నాను. – ఆరిమిల్లి కృష్ణ (95533 42667), బీటెక్, ప్రకృతి వ్యవసాయదారుడు, కోల్‌మాన్‌పేట, కొసిగి మం, కర్నూలు జిల్లా జీవామృతాన్ని పొలానికి తరలించడానికి వాడుతున్న భారీ ట్యాంకులు -
విష రహిత సేద్యం..అందరి కర్తవ్యం
అనకాపల్లి: స్వాభావిక సేద్యం వైపు అన్నదాతలు అడుగులు వేస్తున్నారు. అదనపు భారమవుతున్న రసాయనిక ఎరువులకు స్వస్తి చెప్పి సేంద్రియ సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. పెట్టుబడులు పెరగడంతో రైతులే సొంతంగా దీనిని తయారు చేస్తున్నారు. ఇందుకు వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు తోడ్పాటు అందిస్తున్నారు. ఎడాపెడా రసాయనిక ఎరువుల వినియోగంతో భూములు నిస్సారమవుతున్నాయన్నది గ్రహిస్తున్న రైతులు సహజ ఎరువుల వాడకాన్ని విస్తృతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సేంద్రియ ఎరువుల వినియోగంపై ‘విషరహిత సేద్యం– మనందరి కర్తవ్యం’ నినాదంతో ప్రచారం చేస్తున్నామని అనకాపల్లి రైతుశిక్షణ కేంద్రం డీడీఏ గీతాశైలజ తెలిపారు. సహజ ఎరువుల వాడకంతో భూమిలోని జీవరాసులు, వానపాములు ఆరోగ్యంగా వ్యాప్తి చెంది భూమి సారవంతమవుతుందన్నారు. పంటలకు అవసరమైన పోషకాలు అందుతాయని, ఏపుగా పెరిగి మంచి దిగుబడులు ఉంటాయన్నారు. మొక్కలు బలంగా ఉండడం వలన వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటాయని, ఆయా పంటల దిగుబడులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందన్నారు. ఘన జీవామృతం తయారీ ఇలా.. ఇది పొడిగా ఉంటుంది. దీనిని గోనెసంచులలో ఆరు నెలలు వరకు నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. విత్తే ముందు ఈ మిశ్రమాన్ని బాగా పొడి చేసి వంద కిలోలు బాగా చివికిన ఆవుపేడలో కలిపి పొలంలో జల్లి కలియదున్నాలన్నారు. వంద కిలోల ఆవుపేడ, ఐదు లీటర్ల ఆవుమూత్రం, నాలుగులీటర్ల బెల్లం, నాలుగు లీటర్ల చెరకు రసం లేదా రెండు కిలోల బెల్లం, రెండుకిలోల శనగ లేదా ఉలవ లేదా మినుము లేదా పెసర పిండి, 500 గ్రాముల పొలం గట్టుమన్ను తీసుకుని వీటన్నింటినీ కొద్ది కొద్దిగా ఆవుమూత్రాన్ని జల్లుతూ చేతితో బాగా కలిపి పదిరోజులు నీడలో ఆరబెట్టాలి. ఇలా తయారైన ఘనజీవామృతాన్ని ఆరునెలలు వరకు నిల్వ చేసుకోవచ్చు. పంట దశలో కూడా దీనిని మొక్కలకు వేసుకోవచ్చు. ఈ ఘన జీవామృతాన్ని ఎరువుగా వినియోగించడం ద్వారా పంటకు అవసరమైన సూక్ష్మ, స్థూల పోషకాలు పుష్కలంగా అందుతాయి. చీడపీడలు, పురుగుల బెడద ఉండదు. ద్రవ జీవామృతం.. ఇది ద్రవరూపంలో ఉంటుంది. దీనిని 15రోజులకు ఒకసారి నేలకు నీటి ద్వారా అందించడంతోపాటు పంటమీద కూడా నీటిలో కలిపి పిచి కారీ చేసుకోవాలి. పది కిలోల ఆవుపేడ, ఐదు నుంచి 10 లీటర్ల ఆవు మూత్రం, రెండు లీటర్ల చెరకు రసం లేదా రెండు కిలోల బెల్లం, రెండు కిలోల పప్పుల పిండి, 200 లీటర్ల నీరు, దోసె డు పొలంగట్టు మన్ను ఒక తొట్టెలో వేసుకొని 48 గంటలపాటు ఉంచాలి. రోజూ 2, 3 సార్లు కర్రతో కుడివైపుకు కలియతిప్పాలి. ఇలా తయారైన ద్రవజీవామృతాన్ని వారం రోజులపాటు వాడుకోవాలి. ఇది ఒక ఎకరాకు సరిపోతుంది. ప్రతి 15రోజులకు ఒక సారి ద్రవజీవామృతాన్ని నీటితోపాటు భూమికి అందిస్తే భూమిలో 10–17 అడుగుల లోతులో నిద్రావస్థలో ఉన్న వానపాములు చైతన్యవంతమై చురుగ్గా పని చేయడం ప్రారంభిస్తాయి. తద్వారా భూమి సారవంతమవుతుంది. నేలలో సహజంగా ఉన్న ఎరువుల మూలకాలను జీవామృతం మొక్కలకు పుష్కలంగా అందించే ఏర్పాటు చేస్తుంది. -
ఫ్యామిలీ ఫార్మర్!
ఏడేళ్ల క్రితం ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ ఇచ్చిన శిక్షణ యువ రైతు జగదీశ్ రెడ్డి జీవితాన్ని మార్చేసింది. అంతకుముందు పదిహేనేళ్లుగా రసాయనిక వ్యవసాయం చేస్తున్న ఆయనకు అప్పటి వరకు తాను చేస్తున్న తప్పులేమిటో అర్థమయ్యాయి. రైతుగా తాను చేయాల్సిందేమిటో బోధపడింది. ఇక వెనక్కి చూడలేదు. 25 ఎకరాల పొలంలో వరి, మామిడి, వేరుశనగ, మినుము, కంది, కొర్రల వంటి పంటలను పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండిస్తున్నారు. దేశంలోని అనేక నగరాల్లో నివాసం ఉంటున్న కనీసం 50 కుటుంబాలకు ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని నేరుగా అందిస్తున్నారు. ఏటా రూ.7–8 లక్షల నికరాదాయం గడిస్తున్నారు. మరో 50 మంది సేంద్రియ రైతులతో కలిసి పనిచేస్తున్నారు. ప్రతి కుటుంబానికీ విధిగా ఉండాల్సింది వ్యాధులను నయం చేసే ‘ఫ్యామిలీ డాక్టర్’ కాదు.. జబ్బుల పాలు చేయని అమృతాహారాన్నందించే ‘ఫ్యామిలీ ఫార్మర్’ కావాలంటున్న జగదీశ్‌రెడ్డి నిజమైన ఫ్యామిలీ ఫార్మర్. న్యూఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐ.ఎ.ఆర్.ఐ.) ఆయనకు ఇటీవల ‘ఇన్నోవేటివ్ ఫార్మర్’ అవార్డును ప్రదానం చేసిన సందర్భంగా ప్రత్యేక కథనం.. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వై. జగదీశ్ రెడ్డి మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేయకుండానే పాతికేళ్ల క్రితం వ్యవసాయం చేపట్టారు. చిత్తూరుజిల్లా బంగారుపాళ్యం మండలం దండువారిపల్లె ఆయన స్వగ్రామం. గ్రామానికి దగ్గరగా కొంత, పది కిలోమీటర్ల దూరంలో కొండ కోనల్లో అడవికి దగ్గరగా మొగిలి గ్రామంలో మరికొంత పొలం ఉంది. మొత్తం పాతిక ఎకరాలు. వ్యవసాయ బావుల ఆధారంగా వ్యవసాయం చేస్తున్నారు. అడవికి దగ్గరగా ఉన్న పొలంలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. పదిహేనేళ్లు రసాయనిక ఎరువులు, పురుగుమందులతో వ్యయప్రయాసలకోర్చి వ్యవసాయం చేసి విసిగిపోయిన దశలో 2011లో పాలేకర్ శిక్షణా శిబిరంలో పాల్గొన్నాడు. ఆ శిక్షణ జగదీశ్ రెడ్డి జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. నేలతల్లితో, మొత్తం ప్రకృతితో తెగిపోయిన సంబంధం తిరిగి అనుసంధానమైన భావన మదిలో నిండింది. సొంత దేశీ ఆవుల పేడ, మూత్రం తదితరాలతో ఘనజీవామృతం, బీజామృతం, జీవామృతం, దశపత్రకషాయం.. వంటి ఉత్పాదకాలనే వాడుతున్నారు. బొత్తిగా రసాయనాలు వాడకుండా 15 ఎకరాల్లో (7.5 ఎకరాల్లో లేత తోట, 7.5 ఎకరాల్లో ముదురు తోట)మామిడి, ఆరెకరాల్లో వేరుశనగ, ఎకరంలో చెరకు, ఎకరంలో కొర్రలు, 3 ఎకరాల్లో వరి ప్రధాన పంటలుగా పండిస్తున్నారు. వీటిలో అనేక అంతరపంటలు వేస్తున్నారు. శ్రమ పెరిగానా ఖర్చు తగ్గిపోయింది. నాణ్యమైన దిగుబడులు వస్తున్నాయి. అటవీ జంతువుల దాడులు, కూలీల సమస్య వంటి అనేక సమస్యలతో సతమతమవుతూనే ప్రకృతి వ్యవసాయంలో మాధుర్యాన్ని చవిచూస్తున్నారాయన. తొలుత దిగుబడులు తక్కువగా వచ్చినా క్రమంగా సంతృప్తికరమైన దశకు పెరిగాయి. భూమిలో వానపాములు, సూక్ష్మజీవులకు పెద్ద పీట వేసే వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ ప్రకృతితో మమేకం కావడం.. రసాయనిక అవశేషాల్లేని నాణ్యమైన, పోషకాలతో కూడిన ఆ ఆహారాన్ని తిన్న వారిలో ఆరోగ్యం మెరుగవ్వడంతో జగదీశ్‌రెడ్డికి ప్రకృతి రైతుగా తన బాధ్యత ఎంత సమున్నతమైనదో ఎరుకలోకి వచ్చింది. మారుమూల గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పటికీ.. వివిధ రాష్ట్రాల్లో జరిగే సమావేశాలు, సదస్సుల్లో పాల్గొంటూ తరచూ వ్యవసాయదారులను, పౌష్టికాహార నిపుణులను, వైద్యులను కలుసుకుంటూ అనుభవాలను కలబోసుకోవడం జగదీశ్ రెడ్డికి ఇష్టమైన పని. ఆ పరిచయాలతో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లోని కుటుంబాలకు తాను పండించే నాణ్యమైన పోషక విలువలతో కూడిన రసాయన రహిత ఆహారోత్పత్తులను నేరుగా విక్రయించడం ప్రారంభించారు. ఇందుకోసం వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. రైతులకు తన అనుభవాలను పంచడం కూడా ఇందులో ఒక ముఖ్య విషయం. ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి ఆహారోత్పత్తుల ఆవశ్యకత గురించి రైతులకు తెలియజెప్పి.. సలహాలు సంప్రదింపుల ద్వారా ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి కృషి చేయడం ఆయనకు ఇష్టమైన వ్యాపకం. తన పొలంలో పండించిన ప్రకృతి వ్యవసాయోత్పత్తులను నగరవాసులకు విక్రయించడంతోపాటు.. మరో 50 మంది ప్రకృతి వ్యవసాయ దారుల నుంచి సేకరించిన ఉత్పత్తులను సైతం వివిధ నగరాల్లో వినియోగదారులకు నేరుగా విక్రయించేందుకు అనుసంధానకర్తగా జగదీశ్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రావాలంటే ధాన్యాలను నేరుగా కాకుండా శుద్ధిచేసి ఆహారోత్పత్తులుగా మార్చి అమ్ముకోవడం రైతులు నేర్చుకోవాలని ఆయన అంటుంటారు. బియ్యం, వేరుశనగలను ఎద్దు కట్టె గానుగ నూనెగా మార్చి అమ్ముకోవడం అవసరం అంటారు జగదీశ్ రెడ్డి. శుద్ధమైన గానుగ నూనె తీసిన తర్వాత వారం రోజులు ఎండలో ఉంచితే మరింత ఆరోగ్యదాయకంగా మారుతుందని, ఈ పద్ధతిలోనే తాను వేరుశనగ సంప్రదాయ గానుగ నూనెను ఉత్పత్తి చేస్తున్నానని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం మామిడి వాతావరణం అనుకూలించిందని, పూత కాలంలో వర్షం పడకపోవడం వల్ల కాపు బాగుందని ఆయన తెలిపారు. ఏనుగుల దాడి వల్ల రబీలో ఈ ఏడాది వరి సాగు చేయడం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు దెబ్బతినాల్సి వస్తున్నాదన్నారు. సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం తప్ప వేరే దారి కనపడటం లేదన్నారు. ప్రకృతి రైతుగా ఏడాదికి రూ. 7–8 లక్షల నికరాదాయం పొందుతూ, అంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఆత్మసంతృప్తితో జీవనం గడుపుతున్నానంటారు జగదీశ్‌రెడ్డి. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి విద్యార్థులు, రైతులు, సందర్శకులు తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తుండడం.. తన అనుభవాలను శాస్త్రవేత్తలు సైతం ఆసక్తిగా గమనించడం.. అవార్డులు, పురస్కారాల కన్నా ఎంతో సంతృప్తినిస్తున్నదని ఆయన అంటారు. తరచూ పొలానికి వచ్చే ఏడేళ్ల తన కుమారుడు పార్థురెడ్డిని ప్రకృతి వ్యవసాయదారుడిగా చూడాలన్నదే తన ఆశ అంటారాయన! నేషనల్ న్యూట్రిషన్ అవార్డు (2016–న్యూఢిల్లీ), గ్లోబల్ అవుట్ రీచ్ హెల్త్ కేర్ అవార్డు (2017–జైపూర్), ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు (2019–ఐ.ఎ.ఆర్.ఐ.)లను జగదీశ్వరరెడ్డి అందుకున్నారు. ప్రతి కుటుంబానికీ ఫార్మర్ ఉండాలి! సమాజంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ కన్నా ముఖ్యంగా ఫ్యామిలీ ఫార్మర్ ఉండాలి. ప్రభుత్వం వైద్యం కోసం, ఆసుపత్రుల కోసం ఎంత డబ్బు ఖర్చుపెట్టినా ప్రజలకు లభించేది ‘మెడికల్ కేర్’ మాత్రమే. అసలైన ‘హెల్త్ కేర్’ అందించగలిగిన వారు ప్రకృతి వ్యవసాయదారులు మాత్రమే. జబ్బు వచ్చాక బాగు చేసుకునే ప్రయత్నం చేయడం కన్నా జబ్బు రాకుండా ఉండే ఆహారాన్ని పండించి అందించడం ముఖ్యం. ప్రకృతి వ్యవసాయంలో నేల లోపలి పొరల నుంచి వానపాములు, సూక్ష్మజీవుల నుంచి సకల పోషకాలను తీసుకొని ప్రకృతి వ్యవసాయంలో పంటలు నిజమైన పోషకాలతో కూడిన గింజలు, కాయలు, పండ్లను మనకు అందిస్తున్నాయి. ఇటువంటి ఆహారాన్నందించే ఫ్యామిలీ ఫార్మరే ప్రతి కుటుంబానికీ కావాలిప్పుడు. – వై. జగదీశ్‌రెడ్డి(94400 44279), ప్రకృతి వ్యవసాయదారుడు, దండువారిపల్లె, బంగారుపాళ్యం మండలం, చిత్తూరు జిల్లా వేరుశనగ పంట చెరకు తోటలో జగదీశ్ రెడ్డి ఇన్పుట్స్: పద్మనాభరెడ్డి, సాక్షి, యాదమరి ఫొటోలు: శివశంకర్, సాక్షి, బంగారుపాళ్యం -
రెడ్ జామ టేస్ట్ సూపర్!
ఇంటిపంటల్లో విలక్షణ పండ్ల రకాలను పెంచటంపై హైదరాబాద్‌కు చెందిన సీనియర్ ఇంటిపంటల సాగుదారు వి.ఎం. నళినికి ఆసక్తి మెండు. 300 పైచిలుకు కుండీలతో కళకళలాడుతూ ఉండే ఆమె టెర్రస్ కిచెన్ గార్డెన్లో అరుదైన పండ్ల మొక్కల్లో రెడ్ మలేసియన్ జామ ఒకటి. ఈ మొక్కను ఆరేళ్ల క్రితం కొని, అడుగున్నర చుట్టుకొలత, అడుగున్నర ఎత్తు గల సిల్పాలిన్ గ్రోబాగ్‌లో నాటారు. కొబ్బరి పొట్టు, పశువుల ఎరువు, ఎర్రమట్టిని సమపాళ్లలో కలిపిన మట్టిమిశ్రమంలో మొక్క నాటారు. ఎండు గడ్డిను మట్టిపై ఎండపడకుండా ఆచ్ఛాదన చేశారు. 15–20 రోజులకోసారి జీవామృతం లేదా కంపోస్టు లేదా పశువుల ఎరువు రెండు గుప్పిళ్లు తప్పకుండా వేస్తూ పోషకాల లోపం రాకుండా చూసుకుంటారు. చీడపీడల జాడ లేదు. చక్కగా కాస్తున్నది. కాయలో గుజ్జు ఎక్కువ. గింజల సంఖ్య తక్కువే. అవి కూడా మెత్తగా ఉంటాయి. రుచి సూపర్‌గా ఉందని నళిని తెలిపారు. తమ కుటుంబానికి అవసరమైన పండ్లు, కూరగాయలను చాలా వరకూ ఆమె స్వయంగా సాగు చేసుకుంటున్నారు. -
ఒకే పంట సరికాదు! ఏ పంటైనా దిగుల్లేదు!
ఘనజీవామృతం, జీవామృతం, నీమాస్త్రం.. వీటితో ఏ పంటలోనైనా నిస్సందేహంగా మంచి నికరాదాయం పొందడం సాధ్యమేనా? అని అంటే.. ముమ్మాటికీ సాధ్యమేనంటున్నారు యువ రైతు శ్రీనివాసరెడ్డి. ఏడేళ్ల అనుభవం ఆయనకు ఇచ్చిన భరోసా ఏమిటంటే.. ఏదో ఒక పంటకే రైతు పరిమితం కాకూడదు. మార్కెట్ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు పంటల/తోటల సరళిని మార్చుకుంటూ వెళ్లడమే ఉత్తమ మార్కెటింగ్ వ్యూహమని అంటున్నారు శ్రీనివాసరెడ్డి. మార్కెట్ ఒడిదుడుకుల్లోనూ కరివేపాకు సాగులో.. ఏడాదికి ఎకరానికి కనీసం రూ. లక్షన్నర నికరాదాయం సాధిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏ పంటనైనా పండించొచ్చన్న భరోసాతో ఈ యువ రైతు గొప్ప ఆశావహ జీవితాన్ని నిర్మించుకోవడంపై ‘సాగుబడి’ కథనం. ప్రకాశం జిల్లా దర్శి మండలం చలివేంద్ర గ్రామానికి చెందిన రైతు బాదం మల్లారెడ్డి, పద్మల కుమారుడైన శ్రీనివాసరెడ్డి బీకాం చదివి మట్టినే నమ్ముకొని జీవితాన్ని పండించుకుంటున్నాడు. తాతల కాలం నాటి 18 ఎకరాల సొంత భూమిలో ఏడేళ్లుగా మనసుపెట్టి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరిస్తూ ఉద్యాన పంటల్లో స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్నారు. పాలేకర్ శిక్షణా తరగతుల్లో పాల్గొనడం.. యూట్యూబులో వీడియోలు చూడటం, ప్రకృతి వ్యవసాయ పుస్తకాలు చదవడం ద్వారా నేలతల్లి ఆరోగ్యమే రైతు, దేశ సౌభాగ్యమని గుర్తించి తదనుగుణంగా ధైర్యంగా ఏడేళ్ల క్రితమే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఐదెకరాల్లో కరివేపాకు, 11 ఎకరాల్లో దానిమ్మ, ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. కివీ పండ్ల సాగుపై తాజాగా దృష్టిసారిస్తున్నారు. కరివేపాకులో ఎకరానికి రూ. లక్షన్నర ఎకరంలో ఏడేళ్ల క్రితం కరివేపాకు నాటి జీవామృతం, ఘనజీవామృతంతో సాగు ప్రారంభించిన తొలి ఏడాదే సత్ఫలితాలు రావడంతో క్రమంగా విస్తరించారు. ప్రస్తుతం ఐదెకరాల్లో సాగు చేస్తున్నారు. బోదె పద్ధతిలో కరివేపాకు సాగు చేపట్టిన శ్రీనివాసరెడ్డి క్రమంగా పదెకరాలకు విస్తరించారు. అయితే, కరివేపాకుకు మార్కెట్ విస్తరించకపోవడంతో గత మూడేళ్లుగా దానిమ్మ వైపు దృష్టి మరల్చారు. కరివేపాకు ఏటా 3 కోతల్లో ఎకరానికి మొత్తం 18 టన్నుల దిగుబడి వస్తుంది. శీతాకాలంలో అత్యధికంగా కిలోకు రూ. 25 ధర పలుకుతుంది. ఎండాకాలంలో హాస్టళ్లు మూతపడతాయి, ఆకు పెరుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసలు అడిగే వారే ఉండరు. ఏదేమైనా మొత్తంగా సగటున కిలోకు రూ. పది ధర పలుకుతుందని, ఎకరానికి ఏటా రూ. లక్షన్నర వరకు నికరాదాయం పొందుతున్నానని శ్రీనివాసరెడ్డి తెలిపారు. రసాయనిక సేద్యంలో రూ. 50 వేలు అధికంగా ఖర్చవుతుందన్నారు. 11 ఎకరాల్లో దానిమ్మ సాగు దానిమ్మలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న శ్రీనివాసరెడ్డిని కొందరు రైతులు దానిమ్మ పంటకు ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి రాదని నిరాశపరిచారు. అయితే, నిరాశ చెందకుండా మూడేళ్ల క్రితం 4 ఎకరాల్లో దానిమ్మ నాటాడు. ఏడాదిన్నర క్రితం 3 ఎకరాలు, 2 నెలల క్రితం 4 ఎకరాల్లో దానిమ్మ నాటాడు. రసాయనిక మందులు వాడకుండా జీవామృతం, ద్రావణాలు, కషాయాలతోనే రెండు కోతల్లో ఖర్చులు వచ్చాయి. ఈ దఫా మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాడు. బోర్లు అడుగంటి, బావి నీరు కూడా చాలకపోవడంతో మూడు కిలోమీటర్ల దూరంలో రెండెకరాలు కొనుగోలు చేసి బోర్లు వేసి పైప్‌లైన్ ద్వారా బావిలోకి ఆ నీటిని తరలించి.. బావి నుంచి 18 ఎకరాలకు డ్రిప్ ద్వారా నీటి తడులు పెడుతున్నారు. రైతులకు సూచనలు, సలహాలు శ్రీనివాసరెడ్డి వద్ద ఆరు దేశీ ఆవులున్నాయి. కరివేపాకుకు 15 రోజులకోసారి జీవామృతం డ్రిప్ ద్వారా ఇస్తారు. వారానికోసారి వేపనూనె, నీమాస్త్రం.. 20 రోజులకోసారి ముడినూనెల పిచికారీ చేయడం వల్ల కరివేపాకు మంచి నాణ్యత, రంగు వస్తున్నాయని తెలిపారు. తండ్రి మల్లారెడ్డి ఆవుల సంరక్షణ బాధ్యతలు చూస్తూ కుమారునికి సూచనలు, సలహాలు అందిస్తుంటారు. ఏడేళ్లుగా ప్రకృతి సాగు వల్ల భూసారం పెరిగింది. పొలంలో ఎక్కడ మట్టి తీసి చూసినా తమ విసర్జితాలతో భూసారం పెంచే వానపాములు కనిపిస్తాయి. ఆవుల మూత్రం, పేడతో తానే కాక ఇతరులకు ద్రావణాలు, కషాయాలు తయారు చేసి ఇస్తున్నాడు. ఎప్పుడూ ఒకే ఉద్యాన పంటపై ఆధారపడటం కన్నా అనేక పంటలపై దృష్టిపెట్టడం రైతుకు శ్రేయస్కరమని ఆయన విశ్వాసం. ఏడాది క్రితం ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ నాటారు. ఇప్పుడు కివీ పండ్ల సాగుపై దృష్టిసారిస్తున్నానన్నాడు. శ్రీనివాసరెడ్డి వద్ద నుంచి రైతులు స్వయంగా వచ్చి, సోషల్ మీడియా ద్వారా కూడా సలహాలు తీసుకుంటూ ఉండటం విశేషం. – మేడగం రామాంజనేయరెడ్డి ,సాక్షి, దర్శి, ప్రకాశం జిల్లా డ్రాగన్ ఫ్రూట్ తోటలో శ్రీనివాసరెడ్డి.. బావిలోకి బోరు నీరు.. పొలం వానపాముల మయం -
దేశవిదేశాల్లో డోర్ డెలివరీ!
ముగ్గురు బిడ్డల తల్లి ఆరిఫా రఫీ.. సేంద్రియ మామిడి సేద్యంలో కష్టానికి తగిన లాభాల కమ్మదనాన్ని ఆస్వాదిస్తున్న అరుదైన మహిళా రైతు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం లేకపోయినా సేంద్రియ సేద్యం చేస్తూనే నేర్చుకుంటూ ఒక్కో అడుగూ ముందుకు నడిచిన రైతు ఆమె. రసాయనాలు వాడకుండా పండించడం విశేషం. దేశవిదేశాల్లో, ముఖ్యంగా అమెరికా మార్కెట్లలోకి నేరుగా అడుగుపెట్టగలగడం అంతకంటే విశేషం. విదేశాల్లోనూ డోర్ డెలివరీలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. తెలుగు నేల గర్వించదగిన మహిళా రైతు ఆరిఫా రఫీ! ఆమెకు, ఆమెకు వెన్నుదన్నుగా ఉన్న కుటుంబానికి పవిత్ర రంజాన్ మాసంలో ‘సాక్షి సాగుబడి’ సగర్వంగా సలాం చెబుతోంది!! ఆరిఫా.. హైదరాబాద్ నగరంలోనే పుట్టి పెరిగిన మహిళ. ఎమ్మే చదివారు. వ్యవసాయ నేపథ్యం లేదు. అయితే, కర్నూలు జిల్లా వ్యవసాయ కుటుంబానికి చెందిన రఫీని పెళ్లాడి, దుబాయ్‌లో కొన్నాళ్లున్న తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ముగ్గురు సంతానం. అబ్బాయి.. తర్వాత ఇద్దరు అమ్మాయిలు. పిల్లలను చూసుకోవడం కోసం బ్యాంక్ పీవో ఉద్యోగాన్ని ఏడాదికే వదిలేశారు. అటువంటి పరిస్థితుల్లో పదేళ్ల క్రితం సేంద్రియ మామిడి సాగు వైపు దృష్టి సారించారు. ఫ్రెండ్స్‌తో కలసి యాదగిరిగుట్ట దగ్గర మల్లాపూర్‌లో 21 ఎకరాలు కొని మామిడి నాటారు. చేవెళ్ల దగ్గర 20 ఎకరాల్లో కూడా దశల వారీగా మామిడి నాటారు. మామిడి తోటల సాగు పనుల వద్ద నుంచి దేశవిదేశాల్లో ఆన్లైన్ మార్కెటింగ్ పనుల వరకు ఆరిఫాయే స్వయంగా చూసుకుంటున్నారు. ప్రైవేటు టెలికం కంపెనీలో డీజీఎంగా పనిచేస్తున్న తన భర్త రఫీ పూర్తి సహాయ సహకారాలతోనే తాను రాణిస్తున్నానని ఆమె అన్నారు. ఏఆర్4 ఆర్గానిక్ మాంగో ఫామ్స్ సీఈవో ఆరిఫా ‘సాక్షి సాగుబడి’తో పంచుకున్న అనుభవాలు ఆమె మాటల్లోనే.. ‘‘నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరగడం వల్ల వ్యవసాయం తెలియదు. మా మామగారు రైతు. మా వారికి వ్యవసాయం మీద ఆసక్తి ఉండేది. చేవెళ్ల దగ్గర భూమి కొన్నారు. డెయిరీ పెడదామనుకున్నా.. కుదరలేదు. తర్వాత ఫ్రెండ్స్‌తో కలసి యాదగిరిగుట్ట దగ్గర మల్లాపూర్‌లో భూమి తీసుకున్నాం. మన యూనివర్సిటీ సైంటిస్టులను కలిస్తే.. ఆ భూమి పనికిరాదు.. సేంద్రియ సేద్యం సాధ్యం కాదు. తోటలకు సరిపడా నత్రజనిని అందించలేరన్నారు. తమిళనాడు, కర్ణాటక వ్యవసాయ అధికారులను కలిశాం. సేంద్రియ మామిడి తోటలు పెట్టమన్నారు. కొంచెం ఖరీదైనా పంచగవ్య వాడితే మంచి ఫలితాలు వస్తాయని ప్రోత్సహించారు. జీవామృతం, ఫిష్ అమినో యాసిడ్ వాడుతున్నాం. బయోడైనమిక్ వ్యవసాయ పద్ధతిని పాటిస్తున్నాం. యాదగిరిగుట్ట, చేవెళ్లలో కలిపి 41 ఎకరాల్లో మొత్తం 22 రకాల మామిడి రకాలు వేశాం. ఏటా కొన్ని ఎకరాల్లో మొక్కలు పెట్టాం. బంగినపల్లి 30“30, హిమాయత్ 24“24, దసేరి 18“18 అడుగుల దూరంలో నాటాం. ఏడాదికి కొన్ని ఎకరాల్లో తోటలు పెడుతూ వచ్చాం. హిమాయత్ అంటే ఇష్టం. ఎక్కువ మొక్కలు అవే పెట్టాం. మల్లాపూర్ తోటలో కేసర్, దసేరి బాగా వస్తున్నాయి. గత ఏడాది 18–20 టన్నుల మామిడి పండ్ల దిగుమతి వచ్చింది. చేవెళ్ల తోటలు లేతవి కావడంతో ఎక్కువగా మల్లాపూర్ తోట నుంచే దిగుబడి వస్తోంది. వర్షాలు, పూత, పిందె.. ఆలస్యం కావడం వల్ల ఈ ఏడాది దిగుబడి 40–50% తగ్గింది. జూన్ తొలి వారం వరకు కోస్తాం. 10–12 టన్నులు రావచ్చు. మాకు 7 వేలకు పైగా కస్టమర్ బేస్ ఉంది. 1,500 మంది యాక్టివ్ కొనుగోలుదారులున్నారు. ఎక్కువ మంది హైదరాబాదీయులే. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబైవాసులూ ఉన్నారు. మా వెబ్సైట్లో బుక్ చేసుకున్న వారికి దేశవ్యాప్తంగా ఆరేళ్లుగా డోర్‌డెలివరీ చేస్తున్నాం. అదేవిధంగా సింగపూర్, దుబాయ్‌తోపాటు అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో వినియోగదారులకూ మూడేళ్లుగా నేరుగా డోర్ డెలివరీ చేస్తున్నాం. పండును చూడకుండా, ముట్టుకోకుండానే ఆన్లైన్లోనే విక్రయించడంలో తొలుత కొన్ని సమస్యలు వచ్చాయి. అయితే, పండ్ల నాణ్యత విషయంలో రాజీలేని ధోరణే మాపై వినియోగదారులకు విశ్వాసాన్ని పెంచింది. గత ఏడాది 8 షిప్‌మెంట్స్ వెళ్లాయి. ఈ ఏడాది ఇప్పటికి 3 వెళ్లాయి.. మరో రెండు ఉంటాయి. పిల్లలకు ఇబ్బంది అవుతుందని ఉద్యోగం వద్దనుకున్నాను. కానీ, తోటలు పెట్టడం ప్రారంభించినప్పుడు ఇంతస్థాయిలో ఆన్లైన్ మార్కెటింగ్/ షిప్‌మెంట్స్ చేయగలమని ఊహించలేదు! రెండో అమ్మాయి స్కూలింగ్ ఇప్పుడే పూర్తయింది. బొప్పాయి, మునగ, సీతాఫలాల గురించి కూడా ఆలోచిద్దామనుకుంటున్నాను. మా సంపాదనలో 2.5% బాలికా విద్యకు ఖర్చుపెడుతున్నాం..’’ అంటున్న ఆరిఫా రఫీకి సలాములు! (0-9-9-1-23 40-4-04 www.ar4mangoes.com) అమెరికాకు ఎగుమతి అవుతున్న మాంగో బాక్సులు, పిల్లలు, భర్త రఫీతో ఆరిఫా -
యూట్యూబ్ సేద్యం
తాము బాగుండాలి. భూమి బాగుండాలి. సమాజం అంతా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో యువ రైతు సోదరులు దండవేని నరేష్, సురేష్ నడుము బిగించారు. జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలంలోని అల్లీపూర్ వారి స్వగ్రామం. 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో తల్లిదండ్రులు తోటి రైతుల మాదిరిగానే విరివిగా రసాయనిక ఎరువులు వాడటంతో భూమి తేమను నిలుపుకునే శక్తిని కోల్పోయింది. దీనికి తోడు వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో నీళ్లు లేక పంటలు పండలేదు. దీంతో, ఇంటి అప్పులు వడ్డీలతో కలిపి రూ.16 లక్షలకు పెరిగాయి. డిగ్రీ చదివిన అన్న నరేష్ దుబాయ్ వెళ్లాడు. కానీ, రెండు, మూడేళ్ల తర్వాత స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. తమ్ముడు సురేష్ పదో తరగతి పూర్తి చేసి, రసాయన ఎరువులు వాడుతూ వ్యవసాయం చేస్తుండేవాడు. తదనంతరం ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకొని, ఆ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న రైతుల పొలాలను సందర్శించి అవగాహన పెంచుకున్నారు. దీనికి తోడు యూట్యూబ్ ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తెలుసుకొని ఆచరించడం మొదలుపెట్టారు. పిచ్చోడని ఇంట్లో వాళ్లే తిట్టారు..! ప్రకృతి సాగు పద్ధతిలో తొలి రెండేళ్లు అంతంతమాత్రంగానే పంట పండింది. ఆ ఏడాది పంటలకు ధరలు బాగున్నాయి. దీంతో, ఇంట్లోవాళ్లు ఇదేం పద్దతి, పంట కూడా రావడం లేదని, ఇద్దరు అన్నదమ్ములు పిచ్చోళ్లమాదిరిగా తయారయ్యారు అంటూ తిట్టారు. మా ఊరోళ్లు అయితే, ఈ పద్దతిలో మీరు వ్యవసాయం చేస్తే ఉన్న భూమి అమ్ముడు ఖాయం అంటూ ముఖం మీదే చెప్పడం చేసారు. అయినప్పటికి, మేము చేసే పనులను మేము చేసుకుంటూ పోయేవాళ్లం. గత రెండేళ్ల నుండి మిగత రైతులు పొలాలకు ఏదో ఒక జబ్బు వచ్చి పంట పోయేది. కానీ మా పొలంలో ఎప్పుడూ దెబ్బతినలేదు. ఇది చూసిన తర్వాత మా మీద నమ్మకం కుదిరి కుటుంబసభ్యులు సహకరించడం మొదలుపెట్టారు. పందిళ్ల కింద కూడా తోటలు.. గత నాలుగేళ్లుగా 2 ఎకరాలలో మామిడి, 4 ఎకరాలలో వరి, 2 ఎకరాలలో కూరగాయలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. మూడు ఆవుల మూత్రం, పేడతో ఘనజీవామృతం, జీవామృతం తయారు చేస్తున్నారు. తెగుళ్లు, పురుగుల నివారణకు అగ్నిస్త్రం, నీమాస్త్రం, దశపర్ణ కషాయం వాడతున్నారు.బీరకాయ, సొరకాయ, కాకర కాయలను పందిరి పద్దతిలో సాగు చేస్తున్నారు. ఆ పందిళ్ల కింద పాలకూర, తోటకూర, టమాట, బెండ, గోరు చిక్కుడు సాగు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ దుకాణం ఏర్పాటు చేసి మార్కెట్ రేటు కంటే 20 శాతం అదనపు ధరకు అమ్ముతున్నారు. బియ్యం, కందిపప్పు, శనగలు, పసుపు, కారం, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, నువ్వులను కూడా విక్రయిస్తున్నారు. వాకింగ్ క్లబ్‌ల వద్ద కూడా రసాయన అవశేషాల్లేని తమ ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నారు. మట్టి ద్రావణం.. సీవీఆర్ పద్ధతిలో భూమి పై నుంచి సేకరించిన 7 కిలోల మట్టి, భూమి 2 అడుగుల లోతు నుంచి తీసిన 7 కిలోల మట్టిని 200 లీటర్ల నీటిలో కలపాలి. కొంత సేపటి తర్వాత, గుడ్డతో ఆ మట్టి ద్రావణాన్ని వడపోసి పంటలపై పిచికారీ చేస్తే, మొక్కలకు అవసరమైన పోషకాలు అందుతాయి. ఇలా తయారు చేసిన మట్టి ద్రావణాన్ని వరి, కూరగాయలు, పండ్ల తోటలకు పిచికారీ చేస్తున్నారు. ఫిష్ అమినోయాసిడ్ ద్రావణం: కిలో చేపల(పనికిరాని వ్యర్థాల)ను చిన్న ముక్కలు చేసి, వీటికి కిలో బెల్లం కలిపి డ్రమ్ములో మురగబెట్టాలి. ఉదయం, సాయంత్రం కలుపుతూ ఉండాలి. 15 రోజుల తర్వాత గుడ్డలో వడపోసి, వచ్చిన ద్రావణాన్ని కూరగాయలు, వరి పొలానికి పిచికారీ చేస్తున్నారు. మొక్కల పెరుగుదలకు ల్యాబ్ కుండలో బియ్యం కడిగిన నీరు ఒక లీటరుకు 3 లీటర్ల అవు పాలను కలిపి.. నాలుగు రోజుల పాటు చల్లని ప్రదేశంలో ఉంచాలి. దీనివల్ల పైన పెరుగు గడ్డలాగా పేరుకుంటుంది. దాన్ని తీసివేసి కింది ద్రావణాన్ని మొక్కలకు పిచికారీ చేస్తున్నారు. లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా(లాబ్) అంటారు. ఇది మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. కూరగాయల సాగు ఇలా.. ఆవు పేడ, ఆవు మూత్రంతో తయారు చేసిన ఘనజీవామృతాన్ని ఎకరానికి వంద కిలోల చొప్పున దుక్కిలో చల్లారు. కూరగాయ çపంటలపై ప్రతి 15 రోజుల కొకసారి జీవామృతాన్ని పిచికారీ చేస్తున్నారు. నీమాస్త్రం, అగ్నిస్త్రం, దశపత్ర కషాయాలతో తెగుళ్లను నియంత్రించారు. మొక్కల పెరుగుదలకు ‘ల్యాబ్’ను ఉపయోగించడంతో కూరగాయలు ఏపుగా పెరుగుతున్నాయి. వరి పంట కోసం... వరి పొలం దుక్కిలో ఘనజీవామృతం వాడారు. ప్రతి 15 రోజుల కొకసారి జీవామృతాన్ని నీటితో కలిపి ఇస్తున్నారు. నెల రోజుల తర్వాత ఫిష్ అమినోయాసిడ్‌ను పిచికారీ చేశారు. మొక్కల పెరుగుదలకు చాలా ఉపయోగపడింది. మొగి పురుగు నివారణకు నీమాస్త్రం, అగ్నిస్త్రం వాడారు. వరి పొట్ట దశలో సీవీఆర్ పద్ధతిలో మట్టి ద్రావణంతో పాటు పుల్లటి మజ్జిగను పిచికారీ చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయి. మామిడి పంటకు.. ప్రతి 20 రోజుల కొకసారి డ్రిప్ ద్వారా జీవామృతం ఇస్తున్నారు. పూత దశలో జీవామృతాన్ని పిచికారీ చేశారు. ముందస్తు జాగ్రత్తగా తెగుళ్లు, పురుగుల నివారణకు అగ్నిస్త్రం, దశపర్ణ కషాయం, వరి పిండి ద్రావణాన్ని పిచికారీ చేశారు. మామిడి చెట్ల మొదళ్ల దగ్గర తేమ త్వరగా ఆరిపోకుండా ఉండేందుకు పసుపు ఆకును ఆచ్ఛాదనగా వేశారు. పసుపు ఆకు తేమను కాపాడటంతో పాటు నెమ్మదిగా కుళ్లి సేంద్రియ ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. మా తోట వద్దకు వచ్చి చూడమంటాం! గతంలో రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడి చేతులు కాల్చుకున్నాం. మూడు ఆవులను కొనుగోలు చేసి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. పండించిన కూరగాయలు, బియ్యం తదితర ఉత్పత్తులను నేరుగా జనం వద్దకే వెళ్లి అమ్ముకుంటున్నాం. రసాయనాలు వాడకుండా పండించినవేనా అన్న అనుమానం ఉంటే.. వచ్చి మా తోటను చూడండని చెబుతుంటాం. ప్రతి రైతూ కొద్ది భాగంలోనైనే ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరించడం మొదలు పెట్టాలి. ఇది భూమికి, రైతుకు.. అందరికీ మంచిది. ఆరోగ్యకరమైన సమాజమే మా లక్ష్యం. – దండవేని నరేష్, సురేష్ (96409 63372) అల్లీపూర్, రాయికల్ మండలం, జగిత్యాల జిల్లా – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి అగ్రికల్చర్, జగిత్యాల, ఫొటో: ఏలేటి శైలేందర్ రెడ్డి -
‘ఇంటిపంట’ స్ఫూర్తితో బడిపంట!
పిల్లలకు రసాయనిక ఎరువులు లేకుండా, పురుగుమందులు లేకుండా సేంద్రియ సేద్యమనేది ఒక కల్టివేషన్ మెథడ్‌గా చెబితే.. భవిష్యత్తులో ఈ పిల్లలే బడులుగా మారిపోతారు! ఇన్నాళ్లూ రసాయనాలతో వ్యవసాయం చేస్తూ నష్టపోతున్న పెద్దలు..ఆ బడుల్లో పాఠాలు నేర్చుకుంటారు.. వ్యవసాయం బాగుపడుతుంది.. దేశం బాగుపడుతుందన్న మంచి ఆలోచనతో ‘ఇంటిపంట’ స్ఫూర్తితో మొదలు పెట్టిన ఈ కార్యక్రమం.. ‘బడిపంట’గా మొదలయ్యింది. వర్థిల్లాలి. అందుకే ఈ కథనం.. ‘సాక్షి’ దినపత్రికలో గత ఏడేళ్లుగా ప్రచురితమవుతున్న ‘ఇంటిపంట’ కథనాల స్ఫూర్తితో గుంటూరు నల్లచెరువులోని కలాం థెరిస్సా ఐడియల్ స్కూల్ తన విద్యార్థులకు సేంద్రియ ‘బడిపంట’లపై పాఠాలు చెబుతూ వారిలో సామాజిక స్పృహను పెంపొందిస్తోంది. ప్రాథమికోన్నత, ఉన్నత తరగతుల విద్యార్థులకు రసాయనిక అవశేషాల్లేని ప్రకృతి ఆహారం ప్రాధాన్యతను తెలియజెప్తూ ‘బడిపంట’లను సాగు చేస్తున్నది. భవనం టెర్రస్ మీద గ్రోబ్యాగ్స్‌లో మట్టి, ఘనజీవామృతం, జీవామృతంతో బడిపంటల సాగుకు గత ఏడాది ఖరీఫ్‌లో శ్రీకారం చుట్టారు. మొదట్లో ఆకుకూరలు, కూరగాయలను విద్యార్థులతో స్కూలు భవనంపైనే గ్రోబ్యాగ్స్, బియ్యం బస్తాలలో సాగు చేయించారు. ఈ ఏడాది కూరగాయలతోపాటు మొక్కజొన్న, కొర్ర, సామలు, ఊదలు, అరికలు వంటి సిరిధాన్యాలను సైతం సాగు చేయిస్తున్నారు. 6–9 తరగతుల విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా కొన్ని గ్రోబ్యాగ్స్‌ను, విత్తనాలు ఇచ్చి వారి ఇళ్ల దగ్గర ఇంటిపంటలు పెంచేలా ప్రోత్సహిస్తున్నారు. పెంచిన పంటలను విద్యార్థులకే పంచిపెడుతున్నారు. వ్యవసాయ విశ్రాంత విస్తరణాధికారి సత్యనారాయణ మూర్తి(94915 82181) మార్గదర్శకత్వంలో స్కూలు కరస్పాండెంట్ షేక్ మస్తాన్ ‘బడిపంట’ కార్యక్రమాన్ని చేపట్టారు. కొర్ర వంటి సిరిధాన్యాలను తాము ఇంతకుముందెన్నడూ చూడలేదని విద్యార్థులు మురిసిపోతూ చెప్పారు. అంతేకాదు.. పంట పొలాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 20 మంది అన్నదాతలను ఆహ్వానించి గత ఏడాది ఘనంగా సత్కరించడం ద్వారా అన్నదాతల్లో, విద్యార్థులలో స్ఫూర్తిని నింపడం విశేషం. పద్మశ్రీ పాలేకర్ ప్రశంసలు అందుకున్న ఈ స్కూలులో ‘బడిపంట’లను పలు స్కూలు యాజమాన్యాలు సందర్శించాయని మూర్తి తెలిపారు. ఇటీవల స్కూలు వార్షికోత్సవంలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, పప్పులు, కూరగాయలతోనే విందు ఏర్పాటు చేయడం శుభపరిణామం. స్కూలు యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులకు జేజేలు! మా ఇంటిపంటల రుచి బాగుంది! ఇంటిదగ్గర 11 గ్రోబ్యాగ్స్‌లో కొర్రలు, అలసందలు, మొక్కజొన్నలు పండిస్తున్నా. ఇంతకుముందు ఆకుకూరలు పండించి, వండుకు తిన్నాం. రుచి బాగుంది. పదిరోజులకోసారి స్కూల్లోనే జీవామృతం తయారు చేసుకొని తెచ్చి పోస్తున్నా. మంచి పని చేస్తున్నారు, మున్ముందు ఈ అనుభవం పనికొస్తుంది. బాగా చెయ్యమని మా అమ్మానాన్న అంటున్నారు. తర్వాత వంకాయలు పండిస్తా. అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతా. – షేక్ సల్మా, 9వ తరగతి, నల్లచెరువు, గుంటూరు తన ఇంటిపంటలకు నీరు పోస్తున్న సల్మా ఇంటి పైన సామ,కొర్ర పండిస్తున్నా.. స్కూల్లో గ్రోబ్యాగ్స్‌లో మిరపకాయలు, బెండకాయలు, టమాటాలు, మొక్కజొన్న పండించాం. ప్రాజెక్టులో భాగంగా ఇంటిదగ్గర సామ, కొర్ర, అరికలు వంటి సిరిధాన్యాలు ఇప్పుడు కొన్ని గ్రోబ్యాగ్స్‌లో వేశాను. కంకులు వచ్చాయి. పురుగుమందులు, ఎరువులు వేయకుండా పంటలు పండిస్తే ఆరోగ్యకరమని తెలుసుకున్నాను. మా అమ్మానాన్నా కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇక ముందు కూడా ఇంటిపంటలు పండిస్తాను. – వీర్ల ప్రభు, 9వ తరగతి, నల్లచెరువు, గుంటూరు తమ ఇంటి మేడపైన కొర్ర కంకులు చూపుతున్న ప్రభు ఈ కాయగూరలు తింటే ఆరోగ్యం జీవామృతంతో పండిస్తే కాయగూరలు విషపూరితం కాకుండా ఉంటాయని మా బడిపంట ద్వారా తెలుసుకు న్నాను. వీటిని తింటే ఆరోగ్యం బాగుంటుంది. మంచిది. హేమంత్ సాయి భార్గవ్,6వ తరగతి, నల్లచెరువు, గుంటూరు ఎప్పటికీ ఇంటిపంటలు పండిస్తా! మెంతి విత్తనాలు వేస్తే వారంలో మెంతి కూర వచ్చింది. అందరికీ ఇచ్చా. తోటకూర కూడా జీవామృతం వేసి పెంచాను. మా స్కూల్లో చెప్పటం వల్ల రోగాలు రాకుండా పంటలు ఎలా పెంచాలో తెలిసింది. పెద్దయ్యాక కూడా వేస్తా. ఎస్.యామిని, 7వ తరగతి, నల్లచెరువు, గుంటూరు చైతన్యం కోసమే ‘బడిపంట’! సాక్షి ఇంటిపంట, సాగుబడి కథనాల స్ఫూర్తితో రెండు సీజన్ల నుంచి సేంద్రియ ‘బడిపంట’ల సాగును మా విద్యార్థులకు పరిచయం చేస్తున్నాం. మొదట ఆకుకూరలు, కూరగాయలతో ప్రారంభించాం. వ్యాధులను సైతం నయం చేయగల సిరిధాన్యాలను కూడా ఇప్పుడు స్కూల్లోను, పిల్లల ఇళ్ల దగ్గర కూడా గ్రోబ్యాగ్స్‌లో సాగు చేయిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను సత్కరించాం. పిల్లలకు పంటల సాగు సులువేనని తెలియజెప్పడంతోపాటు ప్రకృతి ఆహారంపై చైతన్యం కలిగించాలన్నదే మా ప్రయత్నం. షేక్ మస్తాన్ (70360 29365), కరస్పాండెంట్,కలాం థెరిస్సా ఐడియల్ స్కూల్, నల్లచెరువు, గుంటూరు నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
అమృతాహారం.. ఆర్థికానందం!
అడపా వెంకట రమణ చైతన్యవంతుడైన రైతు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని భోగాపురం ఆయన స్వగ్రామం. సొంత పొలంలో నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ.. సంతోషంగా ఉన్నారు. ‘సాక్షి’లో ప్రతి మంగళవారం ప్రచురితమవుతున్న ‘సాగుబడి’ కథనాల ద్వారా పొందిన స్ఫూర్తితోనే ప్రకృతి వ్యవసాయం చేపట్టానని, అప్పటి నుంచీ ‘సాగుబడి’ పేజీలన్నిటినీ సేకరించి దాచుకుంటూ మళ్లీ మళ్లీ చదువుకుంటున్నానని వెంకట రమణ సంతోషంగా చెప్పారు.రసాయనాలు వాడకుండా పండించిన బియ్యం తినడం వల్ల తనకున్న ఆస్తమా, డస్ట్ ఎలర్జీ పూర్తిగా పోయాయని, భూమి తల్లితోపాటు తన ఆరోగ్యం కూడా బాగైందని ఈ విలేకరితో ముఖతా చెబుతున్నప్పుడు ఆయన కళ్లలో కృతజ్ఞతాపూర్వకమైన సంతృప్తి, ఆనందం కనిపించింది. వెంకట రమణ తొలినాళ్లలో ఒడిదుడుకులను, ఇరుగు పొరుగు వారి ఎగతాళి మాటలను లక్ష్యపెట్టకుండా ముందడుగు వేసి.. అమృతాహారాన్ని అపురూపంగా పండిస్తున్న ఒక రైతుగా గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఆర్థికానందాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా పొందుతున్నారు.తన ప్రకృతి వ్యవసాయ ప్రస్థానం గురించి ఆయన మాటల్లోనే.. ‘‘సాక్షి సాగుబడిలో ప్రచురితమైన ‘జీవితేచ్ఛకు నార్వోసి నీర్వెట్టి..’ అనే కథనం నాలుగేళ్ల క్రితం నన్ను కదిలించింది. అదే సంవత్సరం నుంచే ప్రకృతి వ్యవసాయం చేపట్టాను. ప్రతి వారం సాగుబడి కథనాలు చదివి, అవగాహన చేసుకుంటున్నాను. పాటించాల్సిన మెలకువలు, పద్ధతులను సవివరంగా వస్తున్న కథనాలతో సొంతంగా అన్ని సేంద్రియ ఎరువులు తయారు చేసుకోగలుగుతున్నాను.. ఎక్కడెక్కడో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుల క«థనాలతో అదే బాటలో తాము పయనించడానికి సాక్షి సాగుబడి మార్గదర్శిగా మారింది. తొలి ఏడాదే మా సొంత పొలం ఆరెకరాల్లో వరిని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వేశాను. పిండీ(రసాయనిక ఎరువులు), పురుగుమందులు కొట్టిన తోటి రైతులకు ఎకరానికి 30 బస్తాల ధాన్యం పండితే నాకు 15 బస్తాలు పండాయి(నాలుగో ఏడాదికి ఎకరా దిగుబడి 25 బస్తాలకు పెరిగింది). పిండెయ్యకపోతే ఎలా పండుతుంది? అంటూ ప్రత్తిపాడు– రాపర్తి గ్రామాల రైతులు తెగ ఎగతాళి చేశారు. ఇది పనికొచ్చే వ్యవసాయం కాదన్నారు. అయితే, మార్కెట్లో సాధారణ ధరకే ధాన్యం అమ్ముకోవాల్సి వచ్చింది. రసాయనిక అవశేషాల్లేని బియ్యం అని చెప్పి అమ్ముకోవడం తెలియలేదు. ఆవేశంతో ఒకేసారి ఆరెకరాలు వేయడం తప్పని అర్థమైంది. తర్వాత నుంచి రెండెకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే ఏలేరు కాల్వ నీటితో సార్వా, దాళ్వా ఊడుస్తున్నాను. ఇప్పుడు ఎకరానికి ఖాయంగా 25 బస్తాలు పండిస్తున్నా. చీడపీడలొస్తాయేమోనన్న బెంగ లేదు. రెండేళ్లుగా అయితే పురుగు కషాయాల అవసరం కూడా నాకు రాలేదు. కలుపు మందులు చల్లటం లేదు. నిశ్చింతగా పంట పండుతుంది. మూడో పంటగా మినుములు వేస్తున్నా. వర్షాలు దెబ్బతీయకపోతే చేతికి మినుములు వస్తాయి. లేదంటే భూసారం పెంచడానికి భూమిలో కలిపి దున్నేస్తున్నాను.. నేను చిన్నప్పుడు వర్షాధారంగా పిండి వేయకుండానే మా అమ్మానాన్నా పంటలు పండించే వారు. పెద్దయ్యేటప్పటికి రసాయనిక వ్యవసాయం పుంజుకుంది. రెండు పంటలకూ కలిపి ఎకరానికి 14 బస్తాల రసాయనిక ఎరువులు వేస్తున్నారు. రెండు సార్లు గుళికలు, ఐదారుసార్లు పురుగుమందులు చల్లుతున్నారు. రెండు పంటలకు ఎకరానికి రూ. 50 వేలు ఖర్చవుతున్నది. సార్వాలో 30–35 బస్తాలు, దాళ్వాలో 27 బస్తాలు పండిస్తున్నారు. వాళ్లు బస్తా ధాన్యం మహా అయితే, రూ. 1,400కు అమ్ముతున్నారు. ప్రకృతి వ్యవసాయంలో నాకు ఎకరానికి రెండు పంటలకు కలిపి రూ. 20 వేలు ఖర్చవుతుంది. సార్వా, దాళ్వా కలిపి 50 బస్తాలు పండించి, క్వింటా ధాన్యం రూ. 2,000కు అమ్ముతున్నా. వాళ్లకన్నా నాకే నికరాదాయం ఎక్కువగా వస్తున్నది. వాళ్లు మార్కెట్‌కు తీసుకెళ్లి ధర ఎంతుంటే అంతకు అమ్ముకోవాలి. నేను మార్కెట్ కోసం వెతుక్కోనక్కరలేదు. ఖాతాలున్నాయి. వాళ్లే ఇంటికి వచ్చి నేను చెప్పిన ధరకు తీసుకెళ్తున్నారు..పిండేసిన బియ్యం తినేటప్పుడు నాకు ఆస్తమా, డస్ట్ ఎలర్జీ ఉండేవి. ప్రకృతి ఆహారం తిన్నాక అవి పోయాయి. మా చేనును చూస్తుంటే పసిపాప నవ్వును చూసినట్టుంటుంది. ఎటెళ్లి వచ్చినా చేలోకి వెళ్లి 10 నిమిషాలు గట్టుమీద కూర్చుంటే కానీ ఊసుపోదు..’’ – వెలుగుల సూర్య వెంకట సత్యవరప్రసాద్, సాక్షి, పిఠాపురం, తూ.గో. జిల్లా నేను ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన రెండో ఏడాది మా ఇరుగు పొరుగు వరి పొలాలకు ఎండాకు తెగులు వచ్చింది. ఎకరానికి 10 బస్తాలు కూడా రాలేదు. అయితే, మా పొలానికి ఎండాకు తెగులు రాలేదు. నా దిగుబడి తగ్గలేదు. ఇది చూసిన తర్వాత రైతుల్లో ఆలోచన మొదలైంది. ఏమో అనుకున్నాం గానీ ప్రకృతి వ్యవసాయంలో ఇంత శక్తి ఉందా? అంటూ నోరెళ్లబెట్టారు. అయితే, కౌలు రైతులు నష్టాల భయంతో ముందుకు రాలేకపోతున్నారు. ఎకరానికి కౌలు పది బస్తాలు. అందువల్ల వాళ్లు వెనకాడుతున్నారు. ఎరువుల మీద సబ్సిడీని రైతులకు నేరుగా నగదు రూపంలో వరుసగా మూడేళ్లు ఇస్తేగానీ కౌలు రైతులు మారలేరు. భూమికి, రైతుకు తల్లీబిడ్డకున్న అనుబంధం ఉంది. ప్రకృతి వ్యవసాయంతో భూమిని బతికించి, రైతును బతికించుకోవాలి.. (రైతు వెంకట రమణను 99899 84347 నంబరులో సంప్రదించవచ్చు). జీవామృతం కలుపుతున్న వెంకట రమణ నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
భూమి బాగుంటేనే రైతు బాగుండేది!
ఓ వైపు వర్షాభావ పరిస్థితులు, మరో వైపు పెరుగుతున్న పెట్టుబడులతో రైతులకు ఆదాయం రాక, అప్పుల ఊబిలో చిక్కుకుపోయి, వ్యవసాయం అంటేనే పారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లుగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తూ, ఉన్న వనరులతోనే అధిక నికరాదాయం పొందుతున్నారు ప్రకృతి వ్యవసాయదారుడు మిట్టపెల్లి రాములు. భూమిని రసాయనాలతో పాడు చేయటం మాని.. జీవామృతంతో సారవంతం చేస్తే వ్యవసాయదారుడి జీవితం ఆనందంగా ఉంటుందని చాటిచెబుతున్నారు. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న రైతు సంతోషంగా ఉంటాడనడానికి మిట్టపెల్లి రాములే నిదర్శనం. జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ మండలంలోని తుంగూర్ గ్రామమే రాములు స్వస్థలం. దుబాయ్ వెళ్లి 15 ఏళ్లు కార్మికుడిగా పనిచేసి 20 ఏళ్ల క్రితమే తిరిగి వచ్చారు. అప్పట్లోనే గ్రామంలో దాదాపు 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. భూమిని చదును చేయించి, 10 ఎకరాల మామిడి తోటలో 600 చెట్లు నాటారు. రెండెకరాల్లో వరిని రసాయనిక పద్ధతిలో సాగు చేశారు. రెండు బావులు తవ్వారు. బంగెనపల్లి, దశేరి, హిమాయత్, కేసరి వంటి మామిడి చెట్లతోపాటు ఉసిరి, జామ, బొప్పాయి, బత్తాయి, మునగ తదితర చెట్లు ఉన్నాయి. ‘సాక్షి సాగుబడి’ ద్వారా పాలేకర్ ప్రకృతి వ్యవసాయాన్ని గురించి తెలుసుకొని, కరీంనగర్లో జరిగిన పాలేకర్ శిక్షణకు హాజరయ్యారు. మహారాష్ట్ర వెళ్లి అక్కడ కొందరు రైతుల క్షేత్రాలను పరిశీలించి అవగాహన పెంచుకున్నారు. నాలుగేళ్లుగా అనుసరిస్తున్నారు. మామిడి తోటలకు జీవామృతాన్ని వర్షాకాలం ప్రారంభం నుంచి నెలకోమారు ఇస్తుంటారు. దోమ ఎక్కువగా ఉన్నప్పుడు అగ్ని అస్త్రం పిచికారీ చేస్తారు. దశపర్ణ కషాయాన్ని పూత దశకు ముందు పిచికారీ చేస్తారు. అలాగే, వరి సాగుకు ముందు.. జనుము పెంచి పొలంలో కలియ దున్నుతారు. బీజామృతం తయారు చేసి విత్తనాలను విత్తనశుద్ధి చేస్తారు. నాటు వేసే ముందు ఎకరానికి క్వింటాల్ ఘన జీవామృతం వేస్తారు. 20 రోజులకొకసారి జీవామృతాన్ని నీటితో కలిపి ఇస్తుంటారు. ఇటీవల తయారు చేస్తున్న వర్మీవాష్‌ను లేత మామిడి మొక్కలకు అందిస్తున్నారు. గతంలో 2 ఆవులను కొన్నారు. ఇప్పుడు వాటి సంతతి 20కి పెరిగాయి. ఒక్కో ఆవును ఉదయం ఓ మామిడి చెట్టు నీడన, సాయంత్రం ఓ చెట్టు దగ్గర కట్టేస్తుంటారు. చెట్ల చుట్టూ ఉండే పచ్చిగడ్డిని తినటంతోపాటు పేడ, మూత్రం విసర్జించటం ద్వారా నేలను సారవంతం చేస్తున్నాయి. నీటి నిల్వ కోసం గుంతను తవ్వారు. జీవామృతం నేరుగా డ్రిప్ ద్వారా వెళ్లేలా ఏర్పాటు చేశారు. గత నాలుగేళ్లుగా ఏనాడూ మామిడి తోటను ట్రాక్టర్‌తో గానీ, నాగలితో గానీ దున్నలేదు. సొంత వరి విత్తనాన్నే వాడుతున్నారు. ఎకరానికి 30 క్వింటాళ్ల వరి ధాన్యం దిగుబడి వస్తున్నది. మర ఆడించి నేరుగా వినియోగదారులకు బియ్యం అమ్ముతున్నారు. మామిడి కాయలను తోట దగ్గరే అమ్ముతున్నారు. ఎడాపెడా ఖర్చులు పెట్టాల్సిన పని లేకుండా.. హైరానా పడకుండా ప్రశాంతంగా వ్యవసాయం చేస్తూ.. రసాయనిక అవశేషాల్లేని దిగుబడితోపాటు అధిక నికరాదాయం పొందుతున్నారు. రైతును నిశ్చింతగా బతికించేది ప్రకృతి వ్యవసాయమే! ప్రకృతి వ్యవసాయం పరిచయం అయిన తర్వాత గత నాలుగేళ్లుగా రసాయనాలు వాడలేదు. ఈ ఏడాది అందరి వరి పొలాలకు దోమ పోటు వచ్చినా మా పొలానికి ఏ చీడపీడా రాలేదు. నాలుగేళ్లుగా పెద్దగా ఖర్చు పెట్టింది లేదు. నన్ను చూసి మా గ్రామంలో నలుగురు, ఐదుగురు రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంతో సాగు ఖర్చులు తగ్గించుకుంటేనే రైతు నిశ్చింతగా బతకగలిగేది. తరచూ మా తోటను సందర్శిస్తున్న రైతులకు నా అనుభవాలను పంచుతున్నాను. – మిట్టపెల్లి రాములు (81878 23316), తుంగూరు, బీర్పూర్(మం.), జగిత్యాల జిల్లా – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్, జగిత్యాల జిల్లా -
‘సేంద్రియ’మే బెస్ట్
పంట సాగులో శాస్త్రీయత పురాతన పద్ధతులే శ్రేయస్కరమని నిరూపిస్తున్న అన్నదాతలు పర్యావరణ పరిరక్షణకు దోహదమంటున్న శాస్త్రవేత్తలు ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ అనే ఆంశం అన్ని వర్గాల్లోనూ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. వాతావరణ కాలుష్యం వల్ల నెలకుంటున్న ఆందోళనకర పరిస్థితులు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. రసాయనిక క్రిమి సంహారక మందుల వినియోగం వల్ల పర్యావరణానికి ఎక్కువగా హాని జరుగుతోందనేది శాస్త్రీయంగా నిరూపితమైంది. ఈ నేపథ్యంలో సుస్థిర వ్యవసాయంతో పర్యావరణ కాలుష్యం నివారణ సాధ్యమన్న విషయాన్ని శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్నారు. దీంతో పర్యావరణ పరిరక్షణపై ప్రజలను చైతన్యపరిచేందుకు టింబక్టు కలెక్టివ్ స్వచ్ఛంద సంస్థ చర్యలు చేపట్టింది. - రొద్దం: నేల, నీటిని సంరక్షిస్తూ.. భూసారాన్ని పెంచే విధానాలపై రైతుల్లో రొద్దంలోని టింబక్టు సంస్థ చైతన్యం తీసుకువస్తోంది. ఇందు కోసం ప్రత్యేకంగా ధరణి సొసైటీ పేరుతో ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఆ సంస్థ ఏర్పాటు చేసింది. సుస్థిర వ్యవసాయం దిశగా రైతులను నడిపిస్తూ పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టింది. సేంద్రియ ఎరువుల తయారీ, వినియోగంపై ప్రత్యేకంగా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తోంది. ధరణి సొసైటీ పర్యవేక్షణలో రొద్దం మండల వ్యాప్తంగా మండల వ్యాప్తంగా 140 మంది రైతులు 430 ఎకరాల్లో ఆరకులు, 129 ఎకరాల్లో కొర్ర, 30 ఎకరాల్లో బరిగ, 210 ఎకరాల్లో నూనె గింజలు, 530 ఎకరాల్లో వేరుశనగ, 30 ఎకరాల్లో పెసర పంటల సాగు చేపట్టారు. ఈ పంటలన్నీ సేంద్రియ ఎరువులతోనే సాగు చేయడం గమనార్హం. రసాయన ఎరువుల దుష్పలితాలు ఆరు దశాబ్దాల క్రితం కేవలం సేంద్రియ ఎరువులతోనే ఆహార ధాన్యాలను రైతులు ఉత్పత్తి చేసేవారు. ఆ తర్వాత వచ్చిన హరిత విప్లవం కారణంగా రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల వినియోగం పెరిగిపోయింది. అప్పటి పరిస్థితులను బట్టి రసాయనిక ఎరువుల వినియోగంపై రైతుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అప్పటి ప్రభుత్వాలకు దాదాపు 39 సంత్సరాలు పట్టింది. రసాయన ఎరువులు, పురుగు మందులు అధికంగా వాడడంతో భూములు నిస్సారంగా మారి, వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. ముప్ప అని తెలిసినా.. ప్రభుత్వాలే హరిత విప్లవం పేరుతో రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల వినియోగాన్ని అప్పట్లో ప్రోత్సహిస్తూ వచ్చాయి. భూమిలో ఏముంది? సారవంతమైన భూమిలో కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి భూమిలోని సేంద్రియ పదార్థాన్ని కుళ్లింపజేసి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందిస్తుంటాయి. రైజోబియం అనే బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని మొక్క వేర్ల బుడిపెలలో నిల్వ చేసి మొక్కలకు అవసరమైనప్పుడు అందిస్తూ ఉంటుంది. మరికొన్ని రకాల సూక్ష్మజీవులు నేలలోని అనేక మలినాలను మొక్కలకు కావాల్సిన పోషకాలుగా మారుస్తుంటాయి. అంతేకాక ఇవి మొక్కల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడినప్పుడు పంటలకు మేలు చేస్తున్న కొన్ని సూక్ష్మజీవులు అంతరించిపోతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు రసాయనిక క్రిమి సంహారక మందుల వినియోగం పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటికి బదులు భూసారాన్ని పెంచే సేంద్రియ ఎరువులు, కషాయాల వినియోగం సుస్థిరమని శాస్త్రవేత్తలు సైతం పేర్కొంటున్నారు. సేంద్రియ ఎరువులు అంటే.. దిబ్బ ఎరువు, వర్మీ కంపోస్టు, ఆకులు అలములు, పొడి జీవామృతం, పంచగవ్వ లాంటివి భూమిలో సూక్ష్మక్రిములను పెంచి పోషించడమే కాకుండా భూమిని సారవంతం చేయడంలో తోడ్పడుతాయి. వీటిని సేంద్రియ ఎరువులుగా పిలుస్తుంటారు. తెగుళ్ల నివారణకు కషాయం సుస్థిర వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వినియోగంతో పాటు సేంద్రియ విధానంలోనే తయారు చేసిన కషాయాలను పిచికారీ చేయడం ద్వారా తెగుళ్ల బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చు. విష తుల్యంకాని ఈ కషాయాలు పురుగులను చంపకుండా పొలాలనుంచి వాటిని తరిమేస్తుంటాయి. పంటను పురుగులు ఆశించకుండా కాపాడుతాయి. ఈ కషాయాలు మన చుట్టుపక్కల దొరికే వనరులతో తయారు చేసుకోవచ్చు. ఆకులతో తయారు చేసే కషాయం పంటను ఆశించి ఆకు తినే పురుగులు, రసం పీల్చు పురుగులను నివారిస్తుంది. కషాయాల తయారీ ఇలా.. ఆకులపై గుడ్లు పెట్టకుండా చేస్తుంది. పశువులు మేయనివి, పాలుకారేవి, చేదైన తదితర ఐదురకాల ఆకులను తీసుకుని ముద్దలా నూరి తొట్టిలో వేయాలి. ఈ ముద్ద మునిగిపోయే వరకూ పశువుల గంజు పోయాలి. రోజుకు ఒకసారి కర్రతో కలియతిప్పుతూ ఐదు రోజుల తర్వాత ఈ మిశ్రమాన్ని వడగట్టి, ఒక లీటరు కషాయాన్ని పది లీటర్ల నీటిలో కలుపుకుని పంటలపై పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే అందులో అర కిలో కారం పొడి లేదా, పావు కిలో పసుపు పొడి కలపుకుని వాడుకోవాలి. వేపకషాయం పిచికారీ చేస్తే 150 రకాల పురుగులు పంటలను ఆశించకుండా పరుగులు తీస్తాయి. 10 కిలోల వేపగింజలను మెత్తగా రుబ్బి పిండి చేసి మూటలో కట్టి బకెట్ నీళ్లలో ఒక రాత్రంతా నానబెట్టాలి. అనంతరం మూట నుంచి ద్రావణాన్ని పిండి, 100 గ్రాముల సబ్బుపొడి, 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరం పొలంలో పిచికారీ చేయాలి. ఒక లీటరు నీటికి 30 మి.లీటర్ల వేపనూనె, సబ్బు పొడి కలిపి పిచికారీ చేస్తే ఆకుముడత, పేనుబంక, తెల్లదోమ, కాండం తొలిచే పురుగులు నివారణ అవుతాయి. పంట పూతదశలో ఉన్నప్పుడు పది లీటర్ల మజ్జిగను పది రోజుల పాటు పులియబెట్టి, అందులో వంద గ్రాముల సీకాయపొడి కలిపి పెట్టుకోవాలి. ఈ ద్రావణం ఒక లీటరుకు పది లీటర్ల నీటిని కలిపి పంటలపై పిచికారీ చేస్తే పూత, గింజ నిలకడగా ఉంటాయి. 10 కిలోల పేడ, 10 లీటర్ల గంజు, 2 కిలోల కందిపిండి, 2 కిలోల బెల్లం, సారవంతమైన మట్టిని నీరుపోసి రెండు రోజులు ఒక డ్రమ్ములో మురగబెట్టడం ద్వారా వచ్చే జీవామృతాన్ని రోజుకు రెండు సార్లు ఈ ద్రావణాన్ని కలియపెడుతూ వారం రోజుల్లోపు వాడాలి. వడగట్టిన లీటరు ద్రావణానికి 10 లీటర్ల నీటిని కలుపుకుని పంటలపై పిచికారీ చేయాలి. ఐదు కిలోల పేడ, అరకిలో నెయ్యి, ఒక కిలో బెల్లం, పెరుగు కలిపి మూడు రోజులు నానబెట్టడం ద్వారా వచ్చే కషాయానికి నాల్గో రోజు మూడు లీటర్ల ఆవు గంజు, రెండు లీటర్ల ఆవు పాలు, రెండు లీటర్ల ఆవు పెరుగు కలపాలి. దీనిని ప్రతి రోజూ బాగా కలియతిప్పుతూ ఉంటే పంచగవ్వ ఔషధం తయారవుతుంది. ఇది ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది. మూడు లీటర్ల పంచగవ్వను 100 లీటర్ల నీటిలో కలుపుకుని పంటలపై పిచికారీ చేసుకోవచ్చు. దీని పంట ఏపుగా పెరుగుతుంది.