సొరకాయలు కోస్తున్న రైతు నరేష్, బీరకాయలు కోస్తున్న రైతు సురేష్
తాము బాగుండాలి. భూమి బాగుండాలి. సమాజం అంతా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో యువ రైతు సోదరులు దండవేని నరేష్, సురేష్ నడుము బిగించారు. జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలంలోని అల్లీపూర్ వారి స్వగ్రామం. 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో తల్లిదండ్రులు తోటి రైతుల మాదిరిగానే విరివిగా రసాయనిక ఎరువులు వాడటంతో భూమి తేమను నిలుపుకునే శక్తిని కోల్పోయింది. దీనికి తోడు వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో నీళ్లు లేక పంటలు పండలేదు.
దీంతో, ఇంటి అప్పులు వడ్డీలతో కలిపి రూ.16 లక్షలకు పెరిగాయి. డిగ్రీ చదివిన అన్న నరేష్ దుబాయ్ వెళ్లాడు. కానీ, రెండు, మూడేళ్ల తర్వాత స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. తమ్ముడు సురేష్ పదో తరగతి పూర్తి చేసి, రసాయన ఎరువులు వాడుతూ వ్యవసాయం చేస్తుండేవాడు. తదనంతరం ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకొని, ఆ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న రైతుల పొలాలను సందర్శించి అవగాహన పెంచుకున్నారు. దీనికి తోడు యూట్యూబ్ ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తెలుసుకొని ఆచరించడం మొదలుపెట్టారు.
పిచ్చోడని ఇంట్లో వాళ్లే తిట్టారు..!
ప్రకృతి సాగు పద్ధతిలో తొలి రెండేళ్లు అంతంతమాత్రంగానే పంట పండింది. ఆ ఏడాది పంటలకు ధరలు బాగున్నాయి. దీంతో, ఇంట్లోవాళ్లు ఇదేం పద్దతి, పంట కూడా రావడం లేదని, ఇద్దరు అన్నదమ్ములు పిచ్చోళ్లమాదిరిగా తయారయ్యారు అంటూ తిట్టారు. మా ఊరోళ్లు అయితే, ఈ పద్దతిలో మీరు వ్యవసాయం చేస్తే ఉన్న భూమి అమ్ముడు ఖాయం అంటూ ముఖం మీదే చెప్పడం చేసారు. అయినప్పటికి, మేము చేసే పనులను మేము చేసుకుంటూ పోయేవాళ్లం. గత రెండేళ్ల నుండి మిగత రైతులు పొలాలకు ఏదో ఒక జబ్బు వచ్చి పంట పోయేది. కానీ మా పొలంలో ఎప్పుడూ దెబ్బతినలేదు. ఇది చూసిన తర్వాత మా మీద నమ్మకం కుదిరి కుటుంబసభ్యులు సహకరించడం మొదలుపెట్టారు.
పందిళ్ల కింద కూడా తోటలు..
గత నాలుగేళ్లుగా 2 ఎకరాలలో మామిడి, 4 ఎకరాలలో వరి, 2 ఎకరాలలో కూరగాయలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. మూడు ఆవుల మూత్రం, పేడతో ఘనజీవామృతం, జీవామృతం తయారు చేస్తున్నారు. తెగుళ్లు, పురుగుల నివారణకు అగ్నిస్త్రం, నీమాస్త్రం, దశపర్ణ కషాయం వాడతున్నారు.బీరకాయ, సొరకాయ, కాకర కాయలను పందిరి పద్దతిలో సాగు చేస్తున్నారు. ఆ పందిళ్ల కింద పాలకూర, తోటకూర, టమాట, బెండ, గోరు చిక్కుడు సాగు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ దుకాణం ఏర్పాటు చేసి మార్కెట్ రేటు కంటే 20 శాతం అదనపు ధరకు అమ్ముతున్నారు. బియ్యం, కందిపప్పు, శనగలు, పసుపు, కారం, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, నువ్వులను కూడా విక్రయిస్తున్నారు. వాకింగ్ క్లబ్‌ల వద్ద కూడా రసాయన అవశేషాల్లేని తమ ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నారు.
మట్టి ద్రావణం..
సీవీఆర్ పద్ధతిలో భూమి పై నుంచి సేకరించిన 7 కిలోల మట్టి, భూమి 2 అడుగుల లోతు నుంచి తీసిన 7 కిలోల మట్టిని 200 లీటర్ల నీటిలో కలపాలి. కొంత సేపటి తర్వాత, గుడ్డతో ఆ మట్టి ద్రావణాన్ని వడపోసి పంటలపై పిచికారీ చేస్తే, మొక్కలకు అవసరమైన పోషకాలు అందుతాయి. ఇలా తయారు చేసిన మట్టి ద్రావణాన్ని వరి, కూరగాయలు, పండ్ల తోటలకు పిచికారీ చేస్తున్నారు.
ఫిష్ అమినోయాసిడ్ ద్రావణం:
కిలో చేపల(పనికిరాని వ్యర్థాల)ను చిన్న ముక్కలు చేసి, వీటికి కిలో బెల్లం కలిపి డ్రమ్ములో మురగబెట్టాలి. ఉదయం, సాయంత్రం కలుపుతూ ఉండాలి. 15 రోజుల తర్వాత గుడ్డలో వడపోసి, వచ్చిన ద్రావణాన్ని కూరగాయలు, వరి పొలానికి పిచికారీ చేస్తున్నారు.
మొక్కల పెరుగుదలకు ల్యాబ్
కుండలో బియ్యం కడిగిన నీరు ఒక లీటరుకు 3 లీటర్ల అవు పాలను కలిపి.. నాలుగు రోజుల పాటు చల్లని ప్రదేశంలో ఉంచాలి. దీనివల్ల పైన పెరుగు గడ్డలాగా పేరుకుంటుంది. దాన్ని తీసివేసి కింది ద్రావణాన్ని మొక్కలకు పిచికారీ చేస్తున్నారు. లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా(లాబ్) అంటారు. ఇది మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
కూరగాయల సాగు ఇలా..
ఆవు పేడ, ఆవు మూత్రంతో తయారు చేసిన ఘనజీవామృతాన్ని ఎకరానికి వంద కిలోల చొప్పున దుక్కిలో చల్లారు. కూరగాయ çపంటలపై ప్రతి 15 రోజుల కొకసారి జీవామృతాన్ని పిచికారీ చేస్తున్నారు. నీమాస్త్రం, అగ్నిస్త్రం, దశపత్ర కషాయాలతో తెగుళ్లను నియంత్రించారు. మొక్కల పెరుగుదలకు ‘ల్యాబ్’ను ఉపయోగించడంతో కూరగాయలు ఏపుగా పెరుగుతున్నాయి.
వరి పంట కోసం...
వరి పొలం దుక్కిలో ఘనజీవామృతం వాడారు. ప్రతి 15 రోజుల కొకసారి జీవామృతాన్ని నీటితో కలిపి ఇస్తున్నారు. నెల రోజుల తర్వాత ఫిష్ అమినోయాసిడ్‌ను పిచికారీ చేశారు. మొక్కల పెరుగుదలకు చాలా ఉపయోగపడింది. మొగి పురుగు నివారణకు నీమాస్త్రం, అగ్నిస్త్రం వాడారు. వరి పొట్ట దశలో సీవీఆర్ పద్ధతిలో మట్టి ద్రావణంతో పాటు పుల్లటి మజ్జిగను పిచికారీ చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయి.
మామిడి పంటకు..
ప్రతి 20 రోజుల కొకసారి డ్రిప్ ద్వారా జీవామృతం ఇస్తున్నారు. పూత దశలో జీవామృతాన్ని పిచికారీ చేశారు. ముందస్తు జాగ్రత్తగా తెగుళ్లు, పురుగుల నివారణకు అగ్నిస్త్రం, దశపర్ణ కషాయం, వరి పిండి ద్రావణాన్ని పిచికారీ చేశారు. మామిడి చెట్ల మొదళ్ల దగ్గర తేమ త్వరగా ఆరిపోకుండా ఉండేందుకు పసుపు ఆకును ఆచ్ఛాదనగా వేశారు. పసుపు ఆకు తేమను కాపాడటంతో పాటు నెమ్మదిగా కుళ్లి సేంద్రియ ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది.
మా తోట వద్దకు వచ్చి చూడమంటాం!
గతంలో రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడి చేతులు కాల్చుకున్నాం. మూడు ఆవులను కొనుగోలు చేసి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. పండించిన కూరగాయలు, బియ్యం తదితర ఉత్పత్తులను నేరుగా జనం వద్దకే వెళ్లి అమ్ముకుంటున్నాం. రసాయనాలు వాడకుండా పండించినవేనా అన్న అనుమానం ఉంటే.. వచ్చి మా తోటను చూడండని చెబుతుంటాం. ప్రతి రైతూ కొద్ది భాగంలోనైనే ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరించడం మొదలు పెట్టాలి. ఇది భూమికి, రైతుకు.. అందరికీ మంచిది. ఆరోగ్యకరమైన సమాజమే మా లక్ష్యం.
– దండవేని నరేష్, సురేష్ (96409 63372) అల్లీపూర్, రాయికల్ మండలం, జగిత్యాల జిల్లా
– పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి అగ్రికల్చర్, జగిత్యాల, ఫొటో: ఏలేటి శైలేందర్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment