వెంకటేశ్వరరావు
కందకాలు తవ్వించుకోమని చెబితే వినిపించుకుని అనూహ్యమైన రీతిలో సాగు నీటి భద్రత సాధించిన సొంత భూముల రైతులు చాలా మంది కనిపిస్తున్నారు. అయితే, కౌలు రైతులు కూడా కందకాలు తవ్వించుకోవడం అరుదైన విషయం. రామిశెట్టి వెంకటేశ్వరరావు(95020 50975), డా. కంచర్ల ప్రవీణ్(87128 45501).. అనే మిత్రులు చాలా సంవత్సరాలు విదేశాల్లో ఉద్యోగాలు చేసి స్వదేశం వచ్చేసి ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షారాజిపేటలో 12 ఎకరాల భూమిని పదేళ్ల పాటు కౌలుకు తీసుకున్నారు.
3 బోర్లు వేస్తే 2 ఇంచుల నీళ్లు వచ్చాయి. అయితే, ఇసుకపాళ్లు ఎక్కువగా ఉన్న ఎర్ర నేల కావడంతో మంచి దిగుబడులు తీయాలంటే వాన నీటి సంరక్షణ ద్వారా సాగు నీటి భద్రత సాధించడం అతిముఖ్యమని భావించారు. గూగుల్ సెర్చ్ చేస్తే.. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం, సాక్షి ఆధ్వర్యంలో సాగు భూమిలో అంతటా కందకాలు తవ్వుకునే పద్ధతి గురించి తెలిసింది. సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074)ని సంప్రదించి.. 2017 మే/జూన్‌లో ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో మీటరు లోతు, మీటరు వెడల్పున కందకాలు తవ్వించారు.
పుష్కలంగా వర్షాలు పడడంతో అనేకసార్లు కందకాలు నిండాయి. ఆరు నెలల్లో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. కలబంద+ఉల్లి, ఆపిల్ బెర్, చెరకు, మునగాకు, పందిరి కూరగాయలను సాగు చేస్తున్నారు. ‘అంతకుముందు డ్రిప్ ద్వారా 3 వాల్వులకు సరిపోని నీటి ప్రెజర్, 6–7 వాల్వులకు పెరిగింది. పక్క తోటల వాళ్లను అడిగితే తమకు తేడా లేదన్నారు. అప్పుడు మాకు అర్థమైంది. కందకాలు తవ్వి వర్షపు నీటిని ఇంకింపజేయడం వల్లనే ప్రెజర్ రెట్టింపైంది. డ్రిప్ నీటి ప్రెజర్ ఈ ఎండాకాలంలో కూడా తగ్గలేదు..’ అని వెంకటేశ్వరరావు ఇటీవల ‘సాగుబడి’తో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment