వాన నీటి సుల్తాన్‌ | Oasis in the desert! | Sakshi
Sakshi News home page

వాన నీటి సుల్తాన్‌

Published Tue, May 29 2018 12:19 AM | Last Updated on Tue, May 29 2018 12:36 AM

Oasis in the desert! - Sakshi

రాబోయేది వానా కాలం. వాన వస్తుంది... వెళుతుంది అనుకుంటున్నారా? మధ్యలో చాలా పని చేయవచ్చు. వానను వాగు చేయొచ్చు. వరద చేయొచ్చు. బంధించి సంవత్సరం పొడవునా పనికి వచ్చే గింజలు ఇచ్చే జీవజలం కూడా చేయవచ్చు. అనంతపురం జిల్లా నీటి వసతి లేని జిల్లా అని అందరూ అంటారు. కాని ఈ రైతు తన పొలంలో నీటిని బంధించాడు. వాన నీటినే దాహానికీ సేద్యానికీ నిలువ చేయగలిగాడు. ఇవాళ అక్కడ మామిడి పండుతోంది. అంతేనా... చుట్టు పక్కల అడవుల నుంచి పక్షులు, పశువులు వచ్చి నట్ట నడెండలో ఈ వయాసిస్సులో దప్పిక తీర్చుకొని పోతున్నాయి. నూర్‌ మహమ్మద్‌ ఇది ఎలా సాధించాడో ఇంటర్వ్యూలో చెప్పాడు.

ప్రశ్న: నూర్‌మహమ్మద్‌ గారూ.. ఎడతెగని కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో మీ తోటను ఎడారిలో ఒయాసిస్సుగా మార్చారు గదా.. మీ కృషి ఎప్పుడు  ప్రారంభమైంది..?
నూర్‌ మహమ్మద్‌: నేను వ్యవసాయ శాఖలో విస్తరణాధికారిగా పనిచేస్తుండగా బుక్కపట్నం మండలంలో 8 ఎకరాల భూమి కొన్నాను. అప్పట్లో అది బీడు భూమి. ఈ బీడు ఎందుకు తీసుకున్నారు? అని అందరూ అనేవారు. నీళ్లు చుక్క లేకుండా ఈ భూమిని ఏం చేసుకుంటావు? అని అడిగేవారు. నిజమే, నీటి వసతి లేని భూమి వృధానే. కానీ, ఫ్రయత్నిస్తే ఎడారిలో కూడా నీళ్లు సాధించవచ్చు. మబ్బుల్లో వాన ఉంటుంది కదా.. చాలు అనుకున్నాను. డిపార్ట్‌మెంట్‌లో నేను భూవనరుల సంరక్షణ విభాగంలో పనిచేసే వాడిని కనుక, ప్రతి నీటి బొట్టు విలువ తెలుసు కనుక ఎవరేమన్నా పట్టించుకోకుండా పదేళ్ల క్రితం నుంచి నీటి సంరక్షణ పనులు మొదలుపెట్టాను. అప్పట్లోనే లక్షన్నర రూపాయల వరకు ఖర్చు చేశా. భూగర్భంలో నీటిని దాచుకోవడానికి స్టెప్‌ బై స్టెప్‌ పని చేయడం మొదలుపెట్టా.

ప్రశ్న:ఎలా మొదలుపెట్టారు..?
మా బీడు భూమిలో నుంచి ఒక వంక వెళుతూ ఉంది. మొదట దానిపైన చెక్‌డ్యాం నిర్మించాం. తర్వాత తోట మధ్యలో అక్కడక్కడా 2.5 మీటర్ల వెడల్పు, మీటరు లోతులో మట్టికట్టలు కట్టాం. మట్టికట్ట చివరన మలుపులో నీటి కుంట తవ్వాం. అవి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మాకు జూన్, జూలై నెలల్లోనే వర్షం ఎక్కువ పడుతుంది. పది రోజుల వాన ఒకేసారి పడుతూ ఉంటుంది. అంత పెద్ద వర్షానికి వచ్చే నీటి వరదను ఆపగలిగేలా మట్టి కట్టలు వేశాం.

ప్రశ్న:కందకాలు ఎప్పుడు తవ్వారు?
సాక్షి టీవీ, పేపరు ద్వారా కందకాల గురించి చదివి తెలుసుకున్న తర్వాత గత ఏడాది తవ్వాం. రెండు మీటర్ల లోతు, రెండు మీటర్ల వెడల్పున తోట చుట్టూ తవ్వాం.

ప్రశ్న:మీరు చేపట్టిన వాన నీటి సంరక్షణ పనుల ప్రభావం ఎలా ఉంది?
చాలా బాగుంది. నేను పెట్టిన ప్రతి రూపాయికీ కొన్ని వందల రెట్లు ప్రతిఫలం దక్కింది. మా దిగువన కిలోమీటరున్నర వరకూ భూగర్భ జలాలు రీచార్జ్‌ అయ్యాయి. దిగువ రైతులకూ నీటి భద్రత చేకూరింది.

ప్రశ్న:మీ తోటకు ఎంత మేలు జరిగింది?
మా 8 ఎకరాల తోటలో 9 రకాల మామిడి చెట్లు 500 వరకు ఉంటాయి. మా తోట ఎంతో బాగుంది. పచ్చగా, ఆరోగ్యంగా మంచి దిగుబడి వస్తోంది. ఏటా నికరంగా రూ. పది లక్షల ఆదాయం వస్తున్నది. మాకు ఎప్పుడూ నీటి కరువు లేదు. మా మండలంలో గత ఏడాది 250 ఎకరాల్లో మామిడి తోటలు నీరు లేక నిలువునా ఎండిపోయాయి. మా పొలంలో కురిసిన వానలో నుంచి చినుకు కూడా బయటకు పోకుండా జాగ్రత్త పడటం వల్లనే ఇది సాధ్యమైంది.

ప్రశ్న:మీ తోట దగ్గర పశువులకు, అటవీ జంతువులకూ నీరు అందుబాటులో ఉంచారట కదా..?
అవును సార్‌. మాకు చాలా సంతోషం కలిగించే సంగతి ఇది. మా తోట దగ్గర్లో ఉన్న అడవిలో కూడా జంతువులు తాగడానికి నీరు లేదు. తోట ఎదుట సిమెంటు తొట్టిని నిర్మించాం. అందులో ఎప్పుడూ నీళ్లు ఉండేలా చూస్తున్నాం. పక్షులు కూడా వచ్చి దప్పిక తీర్చుకుంటాయి. రాత్రుళ్లు అటవీ జంతువులు వచ్చి దాహం తీర్చుకుంటుంటాయి.

ప్రశ్న:రైతులు ఎలా స్పందిస్తున్నారు..?
పది మందికీ ఉపయోగపడే పని చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాంత రైతులంతా మాతో బాగుంటారు. చాలా మంది వచ్చి చూసి వెళుతూ ఉంటారు. మా తోట గురించి ఎవరైనా కొత్తవారు వచ్చి అడిగితే.. సాయిబు తోట అనో మరోటో అనరు. ఆప్యాయంగా ‘సార్‌ తోట’ అని చెబుతారు.

కరువు నేలలో సిరులు పండించవచ్చంటున్న నూర్‌ మహమ్మద్‌,  ఇంత వేసవిలోనూ ఇన్ని నీళ్లున్నాయి


 

ఎడారిలో ఒయాసిస్సు!
ఎడారీకరణ ముప్పును ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లాలో కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలు నిరంతర కరువు మండలాలు. రబీ కాలంలో జిల్లా సగటు వర్షపాతం 100 ఎం.ఎం. ఉంటుంది. ఈ మండలాల్లో 20 ఎం.ఎం.కు మించదు. ఈ కారణంగా కరువు మండలాల జాబితాలో గత నాలుగైదేళ్లుగా ఈ మండలాలు క్రమం తప్పకుండా చోటుచేసుకుంటున్నాయి. గత ఏడాది ఈ ప్రాంతంలో 250 ఎకరాల్లో మామిడి తోటలు నిలువునా ఎండిపోయాయి. కటిక కరువు తాండవించే అటువంటి ప్రాంతంలో మామిడి రైతు నూర్‌మహమ్మద్, అతని కుమారుడు అజీజ్‌ ఎడారిలో ఒయాసిస్సును సృష్టించారు. ముందుచూపుతో పదేళ్ల క్రితం నుంచి చేపట్టిన నీటి సంరక్షణ పనులు ఈ అద్భుతాన్ని ఆవిష్కరింపజేశాయి.


కొత్తచెరువుకు చెందిన నూర్‌మహమ్మద్, ఆయన కుమారుడు అజీజ్‌ బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి సమీపంలోని తమ 8 ఎకరాల తోటలో మామిడి సాగు చేస్తున్నారు. వాన నీటి సంరక్షణ చర్యల ద్వారా జలసిరులను ఒడిసిపడుతున్నారు. గత పదేళ్లుగా తమ పొలంలో కురిసిన ఒక్క చుక్కను కూడా బయటకు పోకుండా పూర్తిగా భూమిలోపలికి ఇంకింపజేస్తున్నారు. ఫలితంగా వీరి తోటలో నీటి కుంటల్లో పుష్కలంగా నీరు ఉంది. సేంద్రియ పద్ధతుల్లో సాగవుతున్న మామిడి చెట్లు నిండైన పండ్ల కాపుతో కళకళలాడుతూ లాభాల సిరులు తెచ్చిపెడుతున్నాయి.అంతేకాదు, కిలో మీటరు దూరం వరకు భూగర్భ జలాలు 250 అడుగుల్లోనే అందుబాటులోకి వచ్చాయి.

అడవిలో కూడా తాగడానికి చుక్క నీరు దొరకని పరిస్థితుల్లో వీరి తోట బయట నీటి తొట్టిని ఏర్పాటు చేసి పశువులు, అటవీ జంతువుల దాహం తీర్చుతుండడం ప్రశంసనీయం. నూర్‌మహమ్మద్‌ వ్యవసాయ శాఖలో విస్తరణాధికారిగా ఉద్యోగం చేసి రిటైరయ్యారు. ఉద్యోగంలో ఉండగానే పాతికేళ్ల క్రితం 8 ఎకరాల మామిడి తోటను కొనుగోలు చేశారు. కరువు తీవ్రమవుతున్న దశలో పదేళ్ల క్రితం నుంచి ముందుచూపుతో వాన నీటి సంరక్షణ పనులు చేపట్టారు. తోట చుట్టూ 2 మీ. లోతు, 2 మీ. వెడల్పుతో కందకాలు తవ్వారు. తోట మధ్యలో నుంచి వెళ్తున్న వంకపై చెక్‌ డ్యాం నిర్మించారు. 40 మీటర్లకు ఒకచోట వాలుకు అడ్డంగా మట్టికట్టలు వేశారు. తోట నాలుగు వైపులా నాలుగు నీటి కుంటలు తవ్వించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక్క చుక్క నీరు కూడా బయటకుపోకుండా నేలలో ఇంకిపోయేలా పకడ్బందీగా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఎండాకాలంలో సైతం చెక్‌డ్యామ్‌ వద్ద నీరు నిల్వ ఉండటం విశేషం.

మామిడి తోట ఎలాంటి పరిస్థితుల్లోనూ దెబ్బ తినకుండా నీటి భద్రత నెలకొంది. రెండు బోర్లలోనూ నీళ్లు పుష్కలంగా ఉండటం వలన డ్రిప్‌ కూడా లేకుండా చెట్టు పాది నిండా నీళ్లు పెడుతున్నారు. 25 సంవత్సరాల వయస్సుగల చెట్టుకు 40 నుంచి 50 కిలోల పశువుల ఎరువు వేస్తున్నారు. దీంతోపాటు, కుమారుడు అజీజ్‌ సహాయంతో వర్మీ కంపోస్ట్‌(ఎర్రల ఎరువు)ను తోటలోనే తయారు చేసి వేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. చీడపీడల నివారణ కోసం పుల్లని మజ్జిగను చెట్టు మొత్తం తడిసే విధంగా పిచ్చికారీ చేస్తున్నారు. 8 ఎకరాలలో సంవత్సరానికి ఖర్చులు పోను రూ. 10 లక్షల వరకు నికరాదాయం వస్తోందని నూర్‌మహ్మద్‌ తెలిపారు. సేంద్రియ ఎరువుల వాడకం, పుష్కలంగా నీటి తడులు ఇవ్వటం వల్ల కాయలు బాగా పెద్దవిగా ఉండటంతో పాటు అధిక దిగుబడులు వస్తున్నాయని తెలిపారు.

‘తలమార్పిడి’తో చెట్లకు పునరుజ్జీవం!
కాత రాని, పనికిరాని చెట్లను 3 మీటర్ల ఎత్తున కోసి.. మల్లిక, బాదుషా వంటి మేలు జాతి మొక్కలను అంటు కట్టి మంచి ఫలితాలు సాధిస్తున్నాం. ఒక చెట్టుకు 10–15 వరకు అంట్లు కడుతున్నాం. ఇలా ‘తలమార్పిడి’తో అంటుకట్టిన చెట్లు మూడేళ్లలోనే పూర్తిస్థాయి కాపును ఇస్తున్నాయి.

ఇతర రైతులు కూడా ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు మాత్రమే వాడుతున్నాం. రసాయనిక ఎరువులు ఎన్నడూ వాడలేదు. కాయ మంచి సైజు వస్తున్నది. ఖర్చులన్నీ పోను ఏడాదికి రూ. 10 లక్షల నికరాదాయం వస్తున్నది.  
– నూర్‌మహ్మద్‌ (94409 83644), కొత్తచెరువు, అనంతపురం జిల్లా

                                       కుమారుడు అజీజ్‌తో నూర్‌మహమ్మద్‌
– కడప గంగిరెడ్డి, సాక్షి, బుక్కపట్నం, అనంతపురం జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement