Mango Gardens
-
ఖమ్మం జిల్లాలో విషాదం.. మామిడితోటలో కుటుంబం ఆత్మహత్య
సాక్షి, ఖమ్మం జిల్లా: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. పెనుబల్లి మండలం పాత కారాయిగూడెం గ్రామానికి చెందిన పోట్రు వెంకట కృష్ణారావు సుహాసిని దంపతులకు ఇద్దరు సంతానం. కొడుకు కార్తిక్ బెంగుళూరులో జాబ్ చేస్తుండగా, కూతురు అమృత ఇంటర్ పూర్తి చేసుకొని బిటెక్‌లో సీట్ కోసం ఎదురు చూస్తూ ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటుంది. వెంకట కృష్ణారావు తనకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కృష్ణారావు భార్య సుహసిని గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతుంది. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నెల రోజుల క్రితం కడుపు నొప్పికి సంబంధించిన సర్జరీ కూడా చేపించుకున్నారు. కడుపులో ఉన్న గడ్డను తొలిగించిన వైద్యులు టెస్టులకు పంపించారు. టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయని హాస్పటల్ నుండి సమాచారం రావటంతో వెంకట కృష్ణారావు తన భార్య, కూతురుని బైక్‌పై తీసుకుని హాస్పటల్‌కు వెళ్లారు. రిపోర్ట్స్‌లో క్యాన్సర్ అని నిర్ధారణ అవటంతో మనస్తాపానికి గురైన ముగ్గురూ అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో తిరువూరులో ఆత్మహత్య చేసుకునేందుకు కొత్త తాడులు, చిన్న పీటలు(Chairs) కొనుగోలు చేసి వాటన్నింటినీ సంచిలో వేసుకుని ఇంటికి చేరుకున్నారు. బెంగుళూరులో జాబ్ చేస్తున్న కొడుకు కార్తీక్‌ను కూడా నిన్ననే ఇంటికి పిలిపించారు. అయితే రాత్రి సమయంలో కుమారుడిని ఇంటి దగ్గరే ఉంచి కృష్ణారావు తన భార్య సుహసిని, కూతురు అమృతని బైక్ ఎక్కించుకొని గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరం లోని తమ పొలం పక్కనే ఉన్న మామిడి తోటలోకి వెళ్ళి తమతో తెచ్చుకున్న సామగ్రితో చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డారు. చదవండి: భర్తను యాదాద్రికి పంపించి.. హైదరాబాద్‌లో తల్లీకూతురు ఆత్మహత్య భార్య సుహసినికి క్యాన్సర్ వ్యాధి సొకటంతో మనోవేదనకు గురైన ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, విచారణ చేపడతామని సత్తుపల్లి రూరల్ సీఐ హాణుక్ తెలిపారు. ఘటన స్థలాన్ని కల్లూరు ఏసీపీ రామానుజం పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వ హాస్పటల్ లోని మార్చురీకి తరలించారు. గ్రామంలో అన్యోన్యంగా జీవించే వెంకట కృష్ణారావు కుటుంబ సభ్యులు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు అన్న సమాచారంతో గ్రామస్థులు పెద్దసంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
వెలుగులోకి అ‘పూర్వ’ చరిత్ర
సాక్షి, అమరావతి: కాకినాడ జిల్లా తుని సమీపంలోని గొంపకొండ వద్ద క్రీస్తు శకం 12వ శతాబ్దం నాటి చారిత్రక ఆనవాళ్లు బయపడ్డాయి. గతంలో రైతులు పొలాలను చదును చేస్తుండగా.. రాతి కుండలు, ప్రమిదలు, శిలాఫలకాలు బయటపడ్డాయి. కొండవాలున ఉన్న ఇక్కడి జీడి, మామిడి తోటల్లో వెలుగుచూసిన ఈ శిథిలాలను సాధారణ రాళ్లుగా భావించి చెల్లాచెదురుగా పడేశారు. నాటి రాతి తొట్టెలను అక్కడి రైతులు ఇప్పటికీ వినియోగిస్తుండటం విశేషం. తుప్పలు, డొంకల్లో పడివున్న ఆ శిథిలాలను ‘సాక్షి’ ప్రతినిధి పరిశీలించగా.. అవి ఓ ఆలయానికి చెందిన శిల్ప చెక్కడాలుగా తేలాయి. అక్కడే పురాతన ఇటుకలు, గుడి శిథిలాలు, రాతి శాసనాలు సైతం బయల్పడ్డాయి. వాటిని సేకరించి పురావస్తు శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసిన నిపుణుడికి పంపించగా.. అవి యలమంచిలి చాళుక్యుల కాలం నాటివని తేల్చారు. గుడి, ఇటుకలు, విగ్రహాలు క్రీ.శ. 800 సంవత్సరం నాటివని, తెలుగు శాసనాలు 1240 సంవత్సరం నాటివని గుర్తించారు. మట్టిలో 1200 ఏళ్ల నాటి గుడి తుని–నర్సీపట్నం మార్గంలో తుని నుంచి 12 కి.మీ. వెళితే.. (కోటనందూరుకు 2 కి.మీ. దూరంలో) గొంపకొండ ఉంది. కొండను ఆనుకుని జీడి, మామిడి తోటలున్నాయి. రోడ్డును ఆనుకుని ఉన్న ఓ దేవత విగ్రహం (గొంప తల్లిగా పిలుస్తారు) ఉంది. స్థానికంగా మరికొన్ని విగ్రహాలు, శాసనాలు కూడా ఉన్నట్టు స్థానికులు చెప్పారు. అక్కడికెళ్లి పరిశీలించగా.. అద్భుతమైన రాతి కట్టడాలు విరిగిపోయి, మట్టిలో కూరుకుపోయాయి. రాయిని తొలిచి చేసిన నీటి తొట్టెలని రైతులు ఇప్పటికీ వినియోగిస్తున్నారు. ఈ ప్రాంతంలో గతంలో పట్టణం ఉండేదని, అగ్ని ప్రమాదం లేదా మశూచి వంటి భయంకరమైన వ్యాధితో ప్రజలు వలసపోయి ఉంటారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడి ఆలయం నిరాదరణకు గురై ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. అనంతర కాలంలో ఈ ప్రాంతంలో పొలం పనులు చేపట్టిన రైతులు గుడి రాళ్లను సరిహద్దు కంచెగా మార్చుకున్నారు. తవ్వకాల్లో దొరికిన విగ్రహాలను స్థానిక దేవతలుగా పూజిస్తున్నారు. తవ్వకాల్లో తెలుగు లిపితో ఉన్న శాసనాలు, పద్మాలు చెక్కిన స్తంభాలు, వివిధ ఆకృతుల్లో ఉన్న రాతి ఫలకాలు, విష్ణుమూర్తి విగ్రహం, మహిషాసురమర్దని, భైరవ శిల్పాలు బయటపడ్డాయి. ఈ శిల్ప సంపద సుమారు క్రీ.శ 800 నుంచి 1240 సంవత్సరాల మధ్య విలసిల్లిన ఆలయానికి చెందినదని పురావస్తు నిపుణులు గుర్తించారు. యలమంచిలి చాళుక్యుల పాలనా కాలంలో ఈ ప్రాంతంలో ‘జననాథపట్నం’ అనే పట్టణం ఉండేదని.. తర్వాత ఇక్కడి ప్రజలు వలసపోయినట్టు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లలేని వారు మాత్రం సమీపంలోనే ‘జగన్నాథపురం’ అనే గ్రామాన్ని నిర్మించుకోగా.. ఇప్పటికీ అదే పేరుతో చలామణిలో ఉంది. కాగా, ఇక్కడ లభించిన భైరవ, విష్ణు విగ్రహాలను సైతం స్థానికులు స్త్రీ మూర్తులుగా కొలవడం గమనార్హం. ఇక్కడ లభించిన విగ్రహాలు, శాసనాలు, కట్టడాలను పురావస్తు పరిశోధకులు పరిశీలన జరపడం ద్వారా గత చరిత్రను వెలికి తీయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఆనవాళ్లు నివ్వెర పరుస్తున్నాయి అడవిని తలపిస్తున్న ఈ ప్రాంతంలో ఇంత గొప్ప చారిత్రక సంపద ఉందంటే ఆశ్చర్యకరంగా ఉంది. శిల్పాలను పరిశీలిస్తే క్రీ.శ. 800 సంవత్సరం నాటివని తెలుస్తోంది. తెలుగు శాసనాలు క్రీ.శ. 1200–40 నాటివిగా భావిస్తున్నాం. ఇటుకలు 40 గీ30 గీ6 సెం.మీ. వ్యాసార్ధంలో ఉన్నాయి. రాయిని తొలిచి చేసిన నీటి తొట్టె (గోలెం) కూడా ఓ అద్భుతమనే చెప్పొచ్చు. మహిషాన్ని ఎడమ కాలితో తొక్కుతూ, శూలంతో గుచ్చుతూ, ఖడ్గంతో నరుకుతున్న మహిషాసురమర్దిని శిల్పం, వింజడలు, కపాల మాల, ఢమరుకం, ఖడ్గం, శూలం, పాత్ర ధరించి నగ్నంగా ఉన్న భైరవ శిల్పం కనిపిస్తున్నాయి. ఇవి క్రీ.శ. 9–12 శతాబ్దాలలో యలమంచిలి చాళుక్యుల శైలిని తెలియజేస్తున్నాయి. ఇక్కడ లభించిన మరో అద్భుతం శాసనం. ఇందులో లిపి తెలుగును పోలి ఉన్నప్పటికీ తెలుగు కాదు. ఇక్కడ మరింత లోతుగా పరిశోధనలు చేస్తే గొప్ప సంస్కృతి బయటపడే అవకాశం ఉంది. – డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో -
‘బుర్ర’కు పదును పెట్టి.. కోతులను తరిమి!
పలమనేరు: మామిడి తోటలో బీభత్సం సృష్టిస్తున్న వానరాల నుంచి పండ్లను కాపాడుకునేందుకు ఆ రైతు వినూత్న ప్రయత్నం చేసి సఫలీకృతుడయ్యాడు. పలమనేరు మండలంలోని రంగినాయునిపల్లికి చెందిన సుబ్రమణ్యం నాయుడుకు 20 ఎకరాల మామిడి తోపుంది. ఇప్పుడు కాయలు పక్వానికి వచ్చి త్వరలో కోత కోయాల్సి ఉంది. కోతుల కారణంగా పంటను ఎలా కాపాడుకోవాలనుకునే క్రమంలో కర్ణాటకలోని ముళబాగిలు ప్రాంతంలో వానరాలు భయపడే బొమ్మలను విక్రయిస్తున్నారని తెలుసుకున్నాడు. అక్కడకు వెళ్ళి రూ.500 పెట్టి భయంకరమైన, వికృతమైన తల ఆకారాన్ని తెచ్చుకున్నాడు. దాన్ని రైతు తలకు బిగించుకొని కోతుల వద్దకెళితే అవి భయపడి పారిపోతున్నాయి. ఆ వికృతమైన తలవైపునకు కోతులు అసలు చూడడం లేదని రైతు తెలిపాడు. కోతులను తరిమేస్తున్న ఈ బొమ్మను చూసేందుకు చుట్టుపక్క రైతులు కూడా ఆసక్తిగా వస్తున్నారు. -
మామిడి తోట రక్షణ కంచెకు చిరుత బలి
కోలారు: ఇనుప కంచెకు చిక్కి చిరుత మరణించిన ఘటన తలగుంద గ్రామంలో చోటు చేసుకుంది. రైతు రామకృష్ణప్ప మామిడి తోటకు రక్షణగా ముళ్ల కంచె వేశాడు. బుధవారం రాత్రి అటుగా వచ్చిన చిరుత కంచెను దాటే ప్రయత్నంలో చిక్కుకుని మృత్యువాత పడింది. గురువారం అటవీశాఖ అధికారులు చేరుకుని పరిశీలించి కళేబరానికి పోస్టుమార్టంఅనంతరం అటవీ ప్రాంతంలో ఖననం చేశారు. -
పండు ఈగకు ‘వలపు వల!’
సాక్షి, అమరావతి బ్యూరో: పులిని బంధించడానికి బోను ఏర్పాటు చేస్తారు. అందులో మాంసాన్ని ఎరగా వేస్తారు. ఆ మాంసాన్ని తినడానికి వచ్చిన పులి బోనులో చిక్కుతుంది. ఇప్పుడు మామిడిని దెబ్బతీస్తున్న పండు ఈగల నియంత్రణకు సరికొత్త ఎరను ప్రయోగిస్తున్నారు. ఈ ఎరతో రైతులు సత్ఫలితాలు పొందుతున్నారు. ఏమిటా ఎర? ఏమా కథ? మామిడికాయ పక్వానికి వచ్చాక లోపలికి పండు ఈగ ప్రవేశిస్తుంది. లోపల తల్లి ఈగ పిల్లలను పెట్టి కాయ పండాక రసాన్ని పీల్చేస్తుంది. ఇలాంటి కాయల కొనుగోలుకు వ్యాపారులు, ఎగుమతిదార్లు ముందుకురాక రైతులు నష్టపోతున్నారు. కోతకొచ్చే దశలో సగటున నాలుగో వంతు మామిడిని ఈ పండు ఈగ దెబ్బతీస్తోంది. ఏళ్ల తరబడి వేధిస్తున్న ఈ సమస్యపై డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని నూజివీడు మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ‘ఫ్రూట్ ఫ్లై లూర్’ పేరిట ఓ ఎరను అందుబాటులోకి తెచ్చారు. ఆడ ఈగ సంపర్కానికి సన్నద్ధమయ్యే సమయంలో ఒక రకమైన వాసన విడుదల చేస్తుంది. ఆ వాసనకు ఆకర్షించిన మగ ఈగ.. ఆడ ఈగ వెంటపడుతుంది. క్రిమిసంహారకమందు, రసాయనాలతో రూపొందించిన ఈ లూర్ ఆడ ఈగ సంపర్కానికి ముందు విడుదల చేసే వాసనను పోలి ఉంటుంది. ఈ లూర్ (ఎర)ను ఒక ట్రాప్ బాక్సులో ఉంచి మామిడి చెట్టుకు కడతారు. ఆ బాక్సులో ఆడ ఈగలున్నాయని భ్రమించి మగ పండు ఈగలు ట్రాప్ బాక్సులోకి వెళ్లి ఆ క్రిమిసంహారక ద్రవంలో చిక్కుకుని చనిపోతాయి. సహజంగా ఆడ పండు ఈగలకంటే మగ ఈగల సంతతే అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని శాస్త్రవేత్తలు సంతాన ఉత్పత్తికి కారణమయ్యే మగ పండు ఈగలను నియంత్రించేందుకు ఈ లూర్‌ను గత మార్చి నెల నుంచి విస్తృతంగా అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పదివేల లూర్‌లను ఉద్యానశాఖ ద్వారా పంపిణీ చేశారు. ఒకసారి ట్రాప్ బాక్స్‌లో వేసిన లూర్ నెలరోజుల పాటు ప్రభావం చూపుతుంది. ఇక ఆడ పండు ఈగల నియంత్రణకు కూడా ఈ శాస్త్రవేత్తలు మరో ద్రావణాన్ని సూచిస్తున్నారు. పులిసిన కల్లు, బెల్లం, మలాథియాన్‌తో తయారు చేసిన ద్రావణాన్ని మామిడి తోటలో ఉంచితే ఆడ పండు ఈగలు దాన్ని ఆకర్షించి చనిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ధర కూడా స్వల్పమే.. ఇక ఈ లూర్ ధర కూడా రైతుకు అందుబాటులోనే ఉంది. లూర్ రూ.40, ట్రాప్ బాక్స్ రూ.100 చొప్పున రైతులకు అందజేస్తున్నారు. ఒక ఎకరం తోటకు నాలుగైదు ఏర్పాటు చేస్తే సరిపోతుంది. ఇలా ఒక ఎకరం మామిడి తోటకు వీటి ఖర్చు గరిష్టంగా రూ.700కు మించదు. ఎకరం తోటలో సగటున 4 టన్నుల దిగుబడి వస్తుంది. ఇందులో కనీసం ఒక టన్ను పండు ఈగ బారిన పడుతుంది. అంటే రైతుకు ఎకరానికి దాదాపు రూ.10 వేలు నష్టం వాటిల్లుతుంది. లూర్కు రూ.700 వెచ్చిస్తే రైతుకు కనీసం రూ.9 వేలు ఆదా అవుతుంది. రాష్ట్రంలో 3.74 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మామిడి ఉంది. ఏటా 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. ఇందులో కనీసం 10 లక్షల టన్నుల మామిడిని పండు ఈగ దెబ్బతీస్తోందని అంచనా. ఇలా ఏటా రాష్ట్రంలో పండు ఈగ సుమారు రూ.1,000 కోట్ల విలువైన మామిడి పంటను నాశనం చేస్తోంది. పండు ఈగతో ఏటా నష్టపోతున్న రైతు ఈ స్వల్ప ఖర్చుతో నివారణ మార్గం లభించడంతో లూర్‌పై ఆసక్తి పెంచుకుంటున్నారని నూజివీడు ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు ‘సాక్షి’కి చెప్పారు. రైతులకు అవగాహన కల్పిస్తున్నాం పండు ఈగతో నష్టపోకుండా అందుబాటులోకి తెచ్చిన ఫ్రూట్ ఫ్లై లూర్‌పై మామిడి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ ఈగ బారిన పడ్డ మామిడిని ఎగుమతిదార్లు తీసుకోక ఆశించినంతగా ఎగుమతులు జరగడం లేదు. ఎగుమతులు పెంచడంతోపాటు రైతులకు పండు ఈగ బెడద తగ్గించే ఉద్దేశంతో ఫ్రూట్ ఫ్లై లూర్‌ను విస్తృతం చేస్తున్నాం. ఈ ఏడాది తొలిసారిగా రాష్ట్రంలో 10 వేలకు పైగా లూర్‌లను అందించాం. – బీకేఎం లక్ష్మి, సీనియర్ సైంటిస్ట్, హెడ్, మామిడి పరిశోధన స్థానం, నూజివీడు లూర్‌తో సత్ఫలితాలు.. ఏళ్ల తరబడి పండు ఈగ బెడదను ఎదుర్కొంటున్నాం. ఏటా నాలుగో వంతు పంటను పండు ఈగ దెబ్బతీస్తోంది. ఇన్నాళ్లు వీటి నివారణకు మంటలు వేయడం, టైర్లు కాల్చడం వంటివి చేసేవాళ్లం. అయినా ఆశించిన ఫలితం ఉండేది కాదు. ఇప్పుడు లూర్‌తో పండు ఈగల నివారణ సాధ్యమవుతోంది. నేను 5 ఎకరాల్లో 30 ఫ్రూట్ ఫ్లై లూర్‌లను ఏర్పాటు చేశాను. సత్ఫలితాలివ్వడంతో పండు ఈగ బెడద తప్పింది. – చెలికాని మురళీకృష్ణారావు, రైతు, కోటపాడు, కృష్ణాజిల్లా చదవండి: ఏపీ: 400 మంది ప్రాణాలను కాపాడిన పోలీసులు ఏలూరు: కార్పొరేషన్ ఎలక్షన్ కౌంటింగ్‌కు హైకోర్టు అనుమతి -
ఎమ్మెల్యే పొలంబాట
చిత్తూరు రూరల్ :ఎప్పుడూ ప్రజాసేవ, అభివృద్ధి కార్యక్రమాలతో బిజీగా కనిపించే పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు ఆదివారం పొలం బాటపట్టారు. చిత్తూరు మండలం 5 వెంకటాపురం(పిళ్లారిమిట్ట) గ్రామంలోని తన పొలంలో వేరుశనగ పంట వేశారు. ఆదివారం పొద్దునే ఆవులను మేతకు తోలుకెళ్లి పంటను పరిశీలించారు. పొలంలో ఉన్న మామిడి చెట్ల కొమ్మలను కొద్దిసేపు కత్తిరించారు. -
గాలివానతో కుప్పకూలిన మామిడి మార్కెట్
కోహెడ/హయత్‌నగర్: గాలివాన బీభత్సానికి రంగారెడ్డి జిల్లా కోహెడలోని మామిడి మార్కెట్ షెడ్లు కూలిపోయాయి. దీంతో అక్కడ మామిడి ప్యాక్ చేస్తున్న సుమారు 30 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వీరిని దగ్గరలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రూ.56 లక్షలతో 4 రేకుల షెడ్లను ఇటీవలే నిర్మించారు. సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో సోమవారం సాయంత్రం వచ్చిన గాలివానకు అవి తట్టుకోలేకపోయాయి. ఒక్క షెడ్డు పూర్తిగా కూలిపోగా, మిగిలిన 3 షెడ్లపై రేకులు కొట్టుకుపోయాయి. ఘటన జరిగిన సమయంలో సుమారు 1000 టన్నుల మామిడి మార్కెట్లో ఉంది. దీని విలువ రూ.1.60 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు తెలి పాయి. కాయలన్నీ దెబ్బతిన్నాయని రైతులు, వ్యాపారులు చెప్పారు. విషయం తెలుసుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిలు ఘటనా స్థలానికి వచ్చారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అధికారులతో మాట్లాడుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇద్దరికి తీవ్ర గాయాలు : షెడ్డు కూలిన ఘటనలో తొర్రూర్‌కు చెందిన తిమ్మమ్మ, నాగోల్ జైపురి కాలనీకి చెందిన అన్వేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మల్లేష్, శ్రీహరి, రేణుక, లక్ష్మి, తిరుపతమ్మ, అనిల్‌కుమార్, సలీం షేక్, హజీ పాషా, గౌస్ పాషా, నర్సింహ్మా, మల్లమ్మ, హనుమంతు, శివ, ఆంజనేయులు, యాదగిరి, యాద య్య, మమత, లక్ష్మి, సునీత, హైమవతి, షేక్ దస్తగిరి, అంజమ్మ, నీలా, సత్తయ్య, యాద య్య, నర్సమ్మ, బుజ్జ మ్మ, జుబేర్ ఖాన్ ఉన్నారు. వీరిలో కొందరు కోహెడకు మరికొందరు సింగరేణి కాలనీకి చెందినవారు. ప్రస్తుతం వీరు హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో, వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. ఘటనా స్థలిని పరిశీలించిన ఆయన.. కమీషన్లకు ఆశపడి నాణ్యత లేని షెడ్లను నిర్మించారని ఆరోపించారు. చికిత్స పొందుతున్న బాలిక నేడు పలు జిల్లాల్లో వడగాడ్పులు మూడు ప్రాంతాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సోమవారం ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండంలలో 44 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలావుండగా మంగళవారం కొమురంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. అలాగే తూర్పు మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు వరకు తూర్పు విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావాలతో తెలంగాణలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
చెట్టెక్కి మామిడి కాయలు కోసిన గాలి
సాక్షి,బళ్లారి: మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి సరదాగా మామిడి చెట్టు ఎక్కి కాయలు కోసి భార్యకు, ఆమె కుటుంబ సభ్యులకు పంచి పెట్టారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. గాలి జనార్ధనరెడ్డి ఇటీవల తన మామ పరమేశ్వరరెడ్డిగారి ఊరైన కర్నూలు జిల్లా కాకనూరుకు భార్య సమేతంగా వెళ్లారు. తన మామకు చెందిన మామిడి తోటకు వెళ్లి సరదాగా గడిపారు. బాల్యంలో చెట్లు ఎక్కిన ఘటనలను గుర్తు చేసుకొని ఆ మధురమైన జ్ఞాపకాలను అందరితో పంచుకున్నారు. అనంతరం స్వయంగా మామిడి చెట్టు ఎక్కారు. భార్యను కూడా చెట్టు ఎక్కించి సరదాగా గడిపారు. అనంతరం మామిడి పండ్లను కోసి అందరికీ పంచి పెట్టారు. వీడియో తీసిన ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. -
మామిడి పోతోంది!
జిల్లాలో మామిడి తోటలు ఎండిపోతున్నాయి.. విపరీతమైన ఎండలకు చెట్లు మాడిపోతున్నాయి. మూడేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. సాగునీటి బోర్లలో చుక్కనీరు లేక బోరుమంటున్నాయి. కన్నబిడ్డలతో సమానంగా పెంచిన మామిడి చెట్లు కళ్ల ముందే ఎండిపోతుంటే మామిడి రైతులు కుమిలిపోతున్నారు. చేసేది లేక తోటలను వదిలేస్తున్నారు. మరోవైపు ప్రతికూల వాతావరణం దిగుబడిపై పెను ప్రభావమే చూపింది. పుత్తూరు: మామిడి సాగు జూదంలా మారిపోయిం ది.. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా మామిడి రైతుకు కాలం కలిసి రాలేదు. సాగు ఖర్చులు తక్కువగా ఉండడం, ధరలు ఆశాజనకంగా ఉండడంతో పాటు నీటి అవసరం తక్కువ కావడంతో జిల్లా రైతులు సంప్రదాయ పంటల స్థానంలో మామిడి సాగు వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. దీంతో జిల్లాలో మామిడి సాగు విస్తీర్ణం దశాబ్ద కాలంలో గణనీయంగా పెరిగింది. కేవలం మామిడి సాగును ఆసరా చేసుకుని జీవితాలను గడుపుతున్న రైతుల సంఖ్య కూడా క్రమంగా పెరిగిపోయింది. మాడిపోతున్న తోటలు గతంలో ఎన్నడూ లేని విధంగా మామిడి తోటలు ఈ ఏడాది ఎండితున్నాయి. కొన్నేళ్లుగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలమట్టం జిల్లాలో అథఃపాతాళానికి పడిపోయింది. గత ఏడాది మే నాటికి 17.96 మీటర్లుగా ఉన్న భూగర్భ జలమట్టం ఈ ఏడాది మేలో 28.17 మీటర్లకు పడిపోయింది. దీంతో బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు స్థోమత లేని రైతులు తోటలను వదిలేశారు. ఎర్రావారిపాళెం మండలం వీఆర్ అగ్రహారం గ్రామానికి చెందిన రైతు నారాయణకు ఉన్న 12 ఎకరాల మామిడి తోట పూర్తిగా ఎండిపోవడంతో గత్యంతర లేక కూలి పనులకు పోతుండడం మామిడి రైతుల పరిస్థితికి అద్దం పడుతోంది. తుడిచిపెట్టుకుపోయిన దిగుబడి మరోవైపు ఈ ఏడాది ప్రతికూల వాతావరణం మామిడి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. సాధారణంగా జిల్లాలో డిసెంబర్, జనవరి ఆఖరు నాటికి చెట్లుకు పూత వస్తుంది. ఇందుకు పగటిపూట 30 డిగ్రీల లోపు రాత్రి పూట 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనుకూలిస్తాయి. అయితే ఈ ఏడాది మార్చి వరకు కూడా పూత రాకపోవడంతో వచ్చిన పూత సైతం అధిక ఉష్ణోగ్రతల కారణంగా రాలిపోయిందని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరికొన్ని తోటల్లో వచ్చిన పూతలో మగపూలు ఎక్కువగా రావడంతో పిందె కట్టలేకపోయిందని అధికారులు వివరిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మామిడి రైతుకు వాతావరణం ప్రతిబంధకంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది జిల్లాలో 30 శాతం మించి మామిడి దిగుబడి వచ్చే పరిస్థితి లేదని వారు అంచనా చేస్తున్నారు. నీరందించలేకున్నారు కాయలు కాసే ముందు చెట్లు నిలువునా ఎండిపోతుంటే అన్నదాత గుండె తరుక్కుపోతోంది. కొందరు రైతులు ట్యాంకర్ల ద్వారా మామిడి చెట్లకు నీరందించాలనుకుంటే ఆ ఖర్చు భరించలేకున్నారు. ఒక్క ట్యాంకరుకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అంత స్థోమత లేక వదిలేస్తున్నారు. అప్పో సప్పో చేసి బోర్లు వేసుకుందామంటే చాలాచోట్ల వెయ్యి అడుగులు డ్రిల్ చేసినా నీటి జాడ కానరావడం లేదు. వర్షాలు కురిస్తేనే.. అధిక ఉష్ణోగ్రతల కారణంగా మా మిడి తోటలు ఎండిపోతున్నాయి. కనీసం 15 రోజులకు ఒకసారైనా ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందించాలని రైతులకు సూచిస్తున్నాం. వేరే ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. రైతులు ప్రభుత్వం సబ్సిడీపై మంజూరు చేస్తున్న ఫారం పాండ్స్‌ను ఏర్పాటు చేసుకుంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు తోటలను సంరక్షించుకోవచ్చు. మళ్లీ వర్షాలు కురిస్తే తోటలు పునరుజ్జీవం పొందే అవకాశం ఉంది. రైతులు భయపడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. – నరేష్‌కుమార్‌రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి, పుత్తూరు మూడెకరాల తోట ఎండిపోయింది నీటి వసతి లేకపోవడంతో మూడెకరాల్లో ఉన్న మా మామిడి తోట ఎండిపోయింది. ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలంటే చాలా ఖర్చుతో కూడినది కావడంతో అలాగే వదిలేశాను. కొత్తగా బోరు వేసుకుందామన్నా మా ప్రాంతంలో నీళ్లు పడతాయనే నమ్మకం కూడా లేదు. మా పరిస్థితి ఘోరంగా ఉంది. ఎలా బతకాలో తెలియక అయోమయంలో పడిపోయాం. ఆనందరెడ్డి, మామిడి రైతు, టీకేఎం పురం -
మామి‘ఢీ’లా
వేసవి కాలం ప్రత్యేకం. రుచిలో మధురాతి మధురం. ఈ ఫలరాజం నమ్ముకున్న అన్నదాతకు లాభాల మాధుర్యాన్ని చవి చూపించే సందర్భాలు ఏటా ఉండవు. ఒక ఏడాది కాపునిస్తే మరో ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. ఈ దఫా జిల్లాలో మామిడి సాగు కష్టంగా మారింది. తీవ్ర వర్షాభావంతో మామిడి తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి పోయి తడులు తడిపే పరిస్థితి లేదు. ట్యాంకర్లు ద్వారా నీరు పోయాలన్నా దొరకని పరిస్థితి. అధిక వ్యయం భరించలేని స్థితిలో రైతన్న కూరుకుపోయాడు. జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల మామిడి తోటలు కళ్ల ముందే ఎండుపోతుంటే.. రైతులు కన్న ఆశలు అడియాసలవుతున్నాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఉదయగిరి: జిల్లాలో 25 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఒకప్పుడు మామిడి సాగు లాభాసాటిగా ఉండేది. రానురాను వర్షాలు తగ్గిపోవడంతో వర్షాధారంపై ఆధార పడడంతో ఈ సాగులో ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నాయి. నీరులేక తోటలు ఎండిపోయి రైతులు నష్టాలపాలయ్యారు. మూడేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితి దయనీయంగా మారింది. చుక్క నీరులేక తోటలు ఎండిపోతున్నాయి. మొదట రెండేళ్లు కొంత మేర తోటలను కాపాడుకున్న రైతులు ఈ ఏడాది మరింత దుర్భిక్షం నెలకొనడంతో తడులు అందించే పరిస్థితి కూడా కనిపించడం లేదు. 40 ఏళ్ల పాటు ఫలసాయం అందించే మామిడి తోటలు పట్టుమని పదేళ్లు కూడా గడవక ముందే ఎండిపోతున్నాయి. మామిడినే నమ్ముకున్న అనేక కుటుంబాలు ఆర్థిక కష్టాల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి. భారంగా మారిన తోటల పెంపకం జిల్లాలో 10 వేల హెక్టార్లులో మామిడి తోటలు ఉన్నాయి. ముఖ్యంగా కావలి, ఉదయగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలోని పలు మండలాల్లో తోటలు సాగులో ఉన్నాయి. ముఖ్యంగా మెట్ట ప్రాంతంలో తోటలు నిలువునా ఎండుతున్నాయి. కలిగిరి, వింజమూరు, జలదంకి, ఆత్మకూరు, ఏఎస్ పేట, -
మామిడి.. అరకొర దిగుబడి!
ప్రకాశం, కందుకూరు: డివిజన్లోని కందుకూరు ఉద్యానవనశాఖ పరిధిలో దాదాపు 20 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. వీటిలో ఉలవపాడు మండలంలో 5850 ఎకరాల్లో, గుడ్లూరు 4100 ఎకరాలు, కందుకూరు 1900, వలేటివారిపాలెం 1065, టంగుటూరు 820, సింగరాయకొండ 1557లతో పాటు పొన్నలూరు తదితర మండలాల్లో మామిడి తోటలున్నాయి. గతంలో దాదాపు 25 వేల ఎకరాలకు పైగానే మామిడి తోటలు ఈ ప్రాంతంలో ఉండేవి. ఏడాదంతా ఎదురు చూసినా కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కానీ ప్రతి ఏడాది నష్టాలే వస్తుండడంతో రైతులు క్రమంగా తోటలు తొలగిస్తున్నారు. గత ఐదేళ్ల కాలంలో మామిడి రైతులు చెట్లు నరికేసి ఇతర పంటల వైపు మొగ్గుచూపసాగారు. ఈ ఏడాది దిగుబడి దారుణం కందుకూరు ప్రాంతాన్ని గత ఐదేళ్లుగా తీవ్ర వర్షాభావం వెంటాడుతోంది. అరకొర మెట్ట పంటలు తప్పా ఇతర ఏ పంటలు కూడా పండే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ప్రభావం క్రమంగా మామిడి రైతుల మీద కూడా పడింది. ఈ ఏడాది గత నాలుగుగైదు నెలలుగా ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. దీంతో మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కనీసం పూత కూడా రాలేదు. ఆ ప్రభావం కాస్త ఇప్పుడు దిగుబడి మీద పడింది. వర్షాలు క్రమంగా పడి వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి దాదాపు 5 నుంచి 6 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది ఎకరానికి ఒక టన్ను దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. వేల ఎకరాల్లో ఇప్పటి వరకు కనీసం పూత కూడా రాలేదు. చెట్లు ఎండిపోయాయి. వీటిని కాపాడుకునే పరిస్థితి కూడా రైతుల్లో లేదు. దీంతో రైతులు చేతులెత్తేశారు. దీంతో ఈ ఏడాది మామిడి దిగుబడి దారుణంగా పడిపోయింది. దిగుబడి ప్రభావంతో రైతులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. కందుకూరు డివిజన్ నుంచి ప్రతి ఏడాది దాదాపు 76 వేల మెట్రిక్ టన్నుల మామిడి దిగుబడి వస్తుంది. ఇందులో ఉలవపాడు, గుడ్లూరు మండలాల నుంచి అధికంగా దిగుబడి వస్తుంది. అయితే గత కొన్ని సంవత్సరాలు ఈ దిగుబడులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రతి ఏడాది సరాసరిన 10 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి తగ్గుతున్నట్లు ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగుమతులపైన ప్రభావం ఈ ప్రాంతం నుంచి దేశ వ్యాప్తంగా ఈ సీజన్లో మామిడి ఎగుమతులు జోరుగా సాగుతాయి. ప్రధానంగా ఉలవపాడు కేంద్రంగా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ వంటి ప్రాంతాలకు భారీగా ఎగుమతులు ఉంటాయి. దీంతో దాదాపు సీజన్ మూడు, నాలుగు నెలల పాటు మార్కెట్ ఉత్సాహంగా సాగుతుంది. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి కానరావడం లేదు. మార్కెట్లోకి కాయలు రావడమే గగనంగా మారింది. అత్యంత నాణ్యమైన పేరుగాంచిన మామిడి రకాలు ఈ ప్రాంతంలోనే దొరుకుతాయి. బంగినపల్లి, చెరుకురసాలు, చోటాపురి, ఇమామిపసందు వంటి తదితర రకాలు పండుతాయి. కానీ ఈ రకాలు ఏవి కూడా ప్రస్తుతం దొరికే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో మామిడి ఎగుమతులపై కూడా ప్రభావం పడనుంది. ఇక సామాన్యుడు మామిడి రుచిని ఆస్వాదించడం అంత సులువు కాదు ఈ ఏడాది. -
మామిడిని ఆశించే తెగుళ్లకు సేంద్రియ పద్ధతుల్లో నివారణ
బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు, మసి తెగులు.. ఇవి మామిడి తోటల్లో కనిపించే ప్రధాన తెగుళ్లు. వీటి నివారణకు సేంద్రియ పద్ధతుల్లో రైతులు అనుసరించదగిన నివారణ చర్యలను సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి. రాజశేఖర్ (83329 45368) ఇలా సూచిస్తున్నారు. బూడిద తెగులు (పౌడరీ మిల్ డ్లూ్య) లక్షణాలు: కాడలపై, పూల మీద, చిరుపిందెల మీద తెల్లని పౌడరు లాంటి బూజు ఏర్పడుతుంది. ఈ బూజు వల్ల పూలు, పిందెలు వడలిపోయి రాలిపోతాయి. పంటకు నష్టం కలుగుతుంది. నివారణ: ∙పూత, మొగ్గలు కనిపించిన వెంటనే లీటరు నీటికి 3 గ్రాములు ‘నీటిలో కరిగే గంధకా’న్ని కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి ►శొంఠిపాల కషాయం కూడా ఒకసారి పిచికారీ చేయవచ్చు. ఆకుమచ్చ తెగులు లక్షణాలు: ఈ తెగులు కొల్లోటోట్రైకం అనే బూజు (శిలీంధ్రం) వల్ల వస్తుంది. వర్షాలు లేదా పొగమంచు అధికంగా ఉన్న సమయాల్లో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా మచ్చలు కలిసిపోయి ఆకులు త్వరగా పండుబారి రాలిపోతాయి. లేత రెమ్మలపై నల్లని మచ్చలు ఏర్పడి పూలగుత్తులు, పూలు మాడిపోతాయి. తెగులు సోకిన కాయలపై నల్లటి గుంత మచ్చలు ఏర్పడి కాయలు కుళ్లిపోతాయి. నివారణ: పూత దశకు ముందే ఎండిన కొమ్మలను తీసివేసి వాటిని నాశనం చేయాలి ∙బోర్డో మిశ్రమం 1 శాతం లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ చెట్లపై పిచికారీ చేయాలి ∙బాగా పులిసిన పుల్లని మజ్జిగ 6 లీటర్లు + 100 గ్రాముల ఇంగువను 100 లీటర్ల నీటిలో కలిపి చెట్లపై 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. మసి తెగులు (సూటీ మోల్డ్) లక్షణాలు: ఈ తెగులు ‘క్యాప్నోడియం’ అనే శిలీంధ్రం ద్వారా వస్తుంది. రసం పీల్చే తేనెమంచు పురుగు, పిండినల్లి విసర్జించిన తియ్యని పదార్థం ఆకుల మీద పిందెలు, కాయల మీద పడి నల్లటి మసిలా పెరుగుతుంది. దీనివల్ల కిరణజన్య సంయోగ క్రియకు అంతరాయం కలుగుతుంది. కాయ సైజు తగ్గిపోయి, రాలిపోతాయి. నివారణ: రసం పీల్చే పురుగులను 5 శాతం వేప కషాయం లేదా నీమాస్త్రం ఉపయోగించి అరికట్టాలి. 2 కిలోల గంజి పొడి(స్టార్చి)ని 5 లీటర్ల వేడి నీటిలో కలిపి, దీనికి 100 లీటర్ల నీటిని చేర్చి గంజి ద్రావణం తయారు చేయాలి. గంజి ద్రావణాన్ని మసి తెగులు సోకిన చెట్ల కొమ్మలకు, ఆకులపై కాయలపై బాగా తడిసేటట్లు పిచికారీ చేయాలి. నీమాస్త్రం రసంపీల్చే, ఇతర చిన్న చిన్న పురుగుల నివారణకు నీమాస్త్రం పనికివస్తుంది. 5 కిలోల పచ్చి వేపాకు ముద్ద (బాగా నూరిన) లేదా 5 కిలోల ఎండు ఆకులు లేదా వేప పండ్ల పొడిని 100 లీటర్ల నీటిలో వేయాలి. అందులో 5 లీటర్ల గో మూత్రం, 1 కిలో ఆవు పేడను కలపాలి. తర్వాత ఒక కర్ర సహాయంతో బాగా కలపాలి. 24 గంటల వరకు మూత పెట్టి మురగబెట్టాలి. ఆ తర్వాత గుడ్డతో వడకట్టుకొని, పంటలకు పిచికారీ చేసుకోవాలి. -
రాజతోట రహస్యం.. పనివారంతా పెళ్లికాని యువతులే
విశాఖపట్నం, కోటవురట్ల(పాయకరావుపేట): ఎస్.రాయవరం మండలం గుడివాడకు చెందిన టీడీపీ నాయకుడు పేరిచర్ల శ్రీపతిరాజు కోటవురట్ల మండలం అల్లుమియ్యపాలేనికి సమీపంలో కొన్నేళ్ల క్రితం వందలాది ఎకరాలు కొనుగోలు చేశారు. జీడి, మామిడితో పాటు బొప్పాయి. అంతర పంటలు సాగుచేస్తున్నారు. మామిడి తోట చుట్టూ సోలార్ విద్యుత్‌తో పటిష్టమైన భద్రతా వలయం. లోపల అధునాతన గెస్ట్‌హౌస్. సామాన్యులకు ఇందులోకి ప్రవేశం ఉండదు. రాత్రి కాగానే వేటకుక్కలు మామిడి తోటలో పహారా కాస్తాయని పలువురు చెబుతుంటారు. రాత్రిళ్లు లోపలకు ప్రవేశించాలంటే ప్రాణాలపై ఆశ వదులుకోవడమే అంటారు. అక్కడ అంత రహస్యం ఏం ఉందో ఎవ్వరికీ అంతుబట్టని విషయం. పనివారంతా పెళ్లికాని యువతులే... ఈ ఫామ్‌హౌస్‌లో పనిచేసేవారంతా పెళ్లికాని యువతులే. వీరు తోటలో తిరిగేందుకు ఎలక్ట్రికల్ స్కూటీలు ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫామ్‌హౌస్‌లో పనిచేస్తారని స్థానికులు చెబుతుంటారు. ఇందులోకి టీడీపీ నేతలు, మంత్రులు, ఎమ్మేల్యేలకు మాత్రమే ప్రవేశం ఉంటుందనేది అందరికీ తెలిసిన సత్యం. శనివారం రాత్రి అటవీ అధికారుల దాడితో అసలు గుట్టు బయటపడింది. గెస్ట్‌హౌస్‌లో వన్యప్రాణులను పెంచుతున్నట్టు సమాచారం తెలుసుకున్న ఫారెస్టు రేంజర్ బీవీ రమణ సిబ్బందితో దాడి చేసి పలు వన్యప్రాణులను పట్టుకున్నారు. ఈ దాడిలో ఐదు కణుజులు, దుప్పి, నెమళ్లు, కొండగొర్రె పట్టుబడ్డాయి. తోట యజమానిపై కేసు వన్యప్రాణుల సంఘటనలో తోట యజమాని శ్రీపతిరాజుపై అటవీ వన్యప్రాణుల చట్ట కింద కేసు నమోదు చేస్తున్నాం. లొంగిపొమ్మని అతనికి నోటీసు జారీ చేశాం. లొంగిపోని ఎడల పోలీసుల సహకారంతో అతనిని అరెస్టు చేస్తాం. – జి.శేఖర్‌బాబు, డీఎఫ్‌వో, నర్సీపట్నం -
తలమార్పిడి చేస్తే కల్పవృక్షమే
కడప అగ్రికల్చర్ : పురాణాల్లో ప్రస్తావనకు వచ్చే కల్పవృక్షం కోరిన కోరికలు తీరుస్తుందో లేదో తెలియదుగానీ మామిడి తోటల్లో ఎక్కువ వయసున్న ముదురు మామిడి చెట్లకు తల మార్పిడి (టాప్ వర్కింగ్) చేస్తే అవి నిజంగానే కోరిన కాయలు ఇస్తాయి. నమ్మశక్యం కాకపోయినా ఈ పద్ధతిని అనుసరించి ఇప్పుడు అనేక మంది మామిడి రైతులు రూపాయి రాబడిరాని తోటల నుంచి అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. ముదురు మామిడి చెట్ల నుంచి ఆశించిన దిగుబడి రాదన్న విషయం రైతులందరికీ తెలిసిందే. వీటిని తొలగించి వెంటనే కొత్త మొక్కలు నాటినా వాటి నుంచి దిగుబడి, రాబడి పొందడానికి కనీసం ఐదారు సంవత్సరాలు పడుతుంది. పైగా ఇది ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. అంతేకాక కొత్తగా వేసే తోటలను సంరక్షించేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. దీనికి బదులుగా ముదురు చెట్లకే తలమార్పిడి చేస్తే రెండు సంవత్సరాలలో పంట దిగుబడి (కాపు) తీసుకోవచ్చు. దీనివల్ల కాలం కలిసి రావడమే కాకుండా లాభసాటి రకం కాని చెట్ల కొమ్మలకు నాణ్యమైన, వాణిజ్య పరమైన రకాలను అంట్లు కట్టి మంచి మేలైన దిగుబడి, రాబడి పొందవచ్చు. రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేట నియోజక వర్గాల్లో అధిక విస్తీర్ణంలోను, మిగతా నియోజక వర్గాల్లో తక్కువ విస్తీర్ణంలో మామిడి తోటలు సాగయ్యాయి. వీటిలో చాలా వరకు ముదురు తోటలే ఉంటున్నాయి. వీటి నుంచి సరైన ఆదాయం రాక కొందరు తోటలను వదిలేయగా మరి కొందరు వచ్చిన కాడికే దిగుబడి అంటూ సరి పుచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో ఉద్యానశాఖ తలమార్పిడి పద్ధతిని ప్రచారంలోకి తెచ్చింది. దీనిని అమలు చేసే తోటలకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. దీంతో రైతులు ఈ ప్రక్రియపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తలమార్పిడి పద్ధతి గురించి జిల్లా ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు వెంకటేశ్వరరెడ్డి, రవీంద్రనాధరెడ్డి పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఆ సలహాలు...సూచనలు ఏమిటో వారి మాటల్లోనే.. ఎలా చేయాలంటే...: ముదురు తోటల్లో చెట్ల కొమ్మలను నాలుగైదు అడుగులు ఉంచి మిగిలిన భాగాన్ని తొలగించాలి. ఆ పెద్ద కొమ్మకు ఒక చిన్నకొమ్మ మాత్రమే ఉంచి మిగిలిన వాటిని కత్తిరించాలి. కొమ్మలను కత్తిరించే సమయంలో కొమ్మ చీలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొమ్మలను వాలుగా కత్తిరించి వర్షపు నీరు నిలువకుండా జారిపోతుంది. దీనివల్ల చీడపీడలు పెద్దగా సోకవు. కత్తిరించిన భాగాలకు వెంటనే బోర్డోపేస్టు పూయాలి. ఇలా కత్తిరించిన కొమ్మలపై రెండు మూడు నెలలకు పెన్సిల్ మందంతో ఇగురు కొమ్మలు పుట్టుకొస్తాయి. ఆ కొత్త కొమ్మల్లో 20 కొమ్మల వరకు ఉంచి మిగిలిన వాటిని తొలగించాలి. అంటుకట్టడం...:కొత్తగా వచ్చిన కొమ్మలకు మనకు కావలసిన రకాల తల్లి చెట్ల నుంచి సేకరించిన పుల్లలను అంటుకట్టుకోవాలి. కొమ్మల మీద కొంచెం ఏటవాలుగా పై భాగంలో నాలుగైదు సెంటీమీటర్ల పొడవున పైనుంచి కిందకు పదునైన చాకుతో కోయాలి. ఇలా కొమ్మమీద పెట్టిన గాటుతో కావాల్సిన రకం పుల్లలను ఉంచి పాలిథిన్ పేపరుతో గట్టిగా చుట్టాలి. కొద్ది రోజుల తరువాత చిగురు తొడిగిన అంటు పుల్ల రెమ్మలు గాలికి విరిగిపోకుండా చిన్న ౖసైజు తాళ్లతో కట్టాలి. అంటు కట్టినప్పుడు మొక్కకు పోషక పదార్థాలు బాగా అందుతాయి. సెప్టెంబర్ నెలాఖరు లోపల తల మార్పిడి చేసి అంటుకట్టుకుంటే మంచిది. ఈ ప్రక్రియను శీతాకాలంలో చేయడం మంచిదికాదు. ఉద్యానశాఖ సబ్సిడీ : ముదురు తోటలను రైతులు సొంతంగా పునరుద్ధరించుకోవడానికి తలమార్పిడి చేస్తే హెక్టారుకు రూ.25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇందులో ఉద్యానశాఖ హెక్టారుకు రూ.17,500 సబ్సిడీ ఇస్తుంది. మరి కొంత మొత్తానికి సూక్ష్మపోషక ఎరువులు వ్యవసాయశాఖ ఇస్తుంది. ఆయా ముదురు తోటలు ఉన్న రైతులు సమీప మండల ఉద్యానశాఖ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకుంటే తప్పని సరిగా ముదురుతోటలకు తలమార్పిడి చేయించుకోవచ్చు. పనికిరాని చెట్లే అనుకుంటే.. ముదురు తోటల నుంచి ఎలాంటి ఫలసాయం రాకపోవడంతో వాటికి ఎరువులు వేయకుండా, మందులు కొట్టకుండా వదిలేశానని లక్కిరెడ్డిపల్లెకు చెందిన రైతులు నారాయణరాజు అన్నారు. అయితే ముదురు చెట్లలో తలమార్పిడి విధానం గురించి ఉద్యానశాఖ అధికారులు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్‌లో ముదురు తోటల్లోని చెట్లను ఎట్లా కాపునకు తీసుకురావచ్చు, దిగుబడి ఎలా తీయవచ్చు, ఎలా కత్తిరింపులు చేసుకోవాలి, ఎప్పుడు చెట్లు కత్తిరించుకోవాలనే విషయాలు చెప్పారు. ఆ ప్రకారం చెట్లను కత్తిరింపులు చేసుకుని తోటను సాగులోకి తెచ్చుకున్నాను. ఇప్పుడు కొత్త తోటలకు వచ్చిన విధంగా పంట దిగుబడి వస్తున్నది చెబుతుంటే సంతోషంగా ఉంది. ముదురు చెట్లకు తలమార్పిడి చేసుకుంటేనే ఆదాయం తోటలో కొన్ని చెట్లు ముదురు చెట్లైపోయాయి. వాటిని ఏం చేయాలో తెలియక సతమతం అయ్యేవాణ్ణి. ఉద్యానశాఖ అధికారుల సూచలనల మేరకు శిక్షణ కార్యక్రమంలో విషయాలను తెలుసుకుని ముదురు చెట్లకు తలమార్పిడి చేసి మల్లిక, బేనిషా, నీలీషా, మల్గోవా, చెరకు రసం, కాలేపాడు, ఇమామ్ పసంద్, బెంగుళూరా, రుమానీ, ఇలా పలు రకాల అంట్లను తల్లి చెట్లకు కట్టించాను. ఇప్పుడు మంచి దిగుబడిని ఇస్తున్నాయి.– నరసింహారెడ్డి, మామిడి రైతు, నందిమండలం, పెండ్లిమర్రి మండలం -
వాన నీటి సుల్తాన్
రాబోయేది వానా కాలం. వాన వస్తుంది... వెళుతుంది అనుకుంటున్నారా? మధ్యలో చాలా పని చేయవచ్చు. వానను వాగు చేయొచ్చు. వరద చేయొచ్చు. బంధించి సంవత్సరం పొడవునా పనికి వచ్చే గింజలు ఇచ్చే జీవజలం కూడా చేయవచ్చు. అనంతపురం జిల్లా నీటి వసతి లేని జిల్లా అని అందరూ అంటారు. కాని ఈ రైతు తన పొలంలో నీటిని బంధించాడు. వాన నీటినే దాహానికీ సేద్యానికీ నిలువ చేయగలిగాడు. ఇవాళ అక్కడ మామిడి పండుతోంది. అంతేనా... చుట్టు పక్కల అడవుల నుంచి పక్షులు, పశువులు వచ్చి నట్ట నడెండలో ఈ వయాసిస్సులో దప్పిక తీర్చుకొని పోతున్నాయి. నూర్ మహమ్మద్ ఇది ఎలా సాధించాడో ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రశ్న: నూర్‌మహమ్మద్ గారూ.. ఎడతెగని కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో మీ తోటను ఎడారిలో ఒయాసిస్సుగా మార్చారు గదా.. మీ కృషి ఎప్పుడు ప్రారంభమైంది..? నూర్ మహమ్మద్: నేను వ్యవసాయ శాఖలో విస్తరణాధికారిగా పనిచేస్తుండగా బుక్కపట్నం మండలంలో 8 ఎకరాల భూమి కొన్నాను. అప్పట్లో అది బీడు భూమి. ఈ బీడు ఎందుకు తీసుకున్నారు? అని అందరూ అనేవారు. నీళ్లు చుక్క లేకుండా ఈ భూమిని ఏం చేసుకుంటావు? అని అడిగేవారు. నిజమే, నీటి వసతి లేని భూమి వృధానే. కానీ, ఫ్రయత్నిస్తే ఎడారిలో కూడా నీళ్లు సాధించవచ్చు. మబ్బుల్లో వాన ఉంటుంది కదా.. చాలు అనుకున్నాను. డిపార్ట్మెంట్లో నేను భూవనరుల సంరక్షణ విభాగంలో పనిచేసే వాడిని కనుక, ప్రతి నీటి బొట్టు విలువ తెలుసు కనుక ఎవరేమన్నా పట్టించుకోకుండా పదేళ్ల క్రితం నుంచి నీటి సంరక్షణ పనులు మొదలుపెట్టాను. అప్పట్లోనే లక్షన్నర రూపాయల వరకు ఖర్చు చేశా. భూగర్భంలో నీటిని దాచుకోవడానికి స్టెప్ బై స్టెప్ పని చేయడం మొదలుపెట్టా. ప్రశ్న:ఎలా మొదలుపెట్టారు..? మా బీడు భూమిలో నుంచి ఒక వంక వెళుతూ ఉంది. మొదట దానిపైన చెక్‌డ్యాం నిర్మించాం. తర్వాత తోట మధ్యలో అక్కడక్కడా 2.5 మీటర్ల వెడల్పు, మీటరు లోతులో మట్టికట్టలు కట్టాం. మట్టికట్ట చివరన మలుపులో నీటి కుంట తవ్వాం. అవి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మాకు జూన్, జూలై నెలల్లోనే వర్షం ఎక్కువ పడుతుంది. పది రోజుల వాన ఒకేసారి పడుతూ ఉంటుంది. అంత పెద్ద వర్షానికి వచ్చే నీటి వరదను ఆపగలిగేలా మట్టి కట్టలు వేశాం. ప్రశ్న:కందకాలు ఎప్పుడు తవ్వారు? సాక్షి టీవీ, పేపరు ద్వారా కందకాల గురించి చదివి తెలుసుకున్న తర్వాత గత ఏడాది తవ్వాం. రెండు మీటర్ల లోతు, రెండు మీటర్ల వెడల్పున తోట చుట్టూ తవ్వాం. ప్రశ్న:మీరు చేపట్టిన వాన నీటి సంరక్షణ పనుల ప్రభావం ఎలా ఉంది? చాలా బాగుంది. నేను పెట్టిన ప్రతి రూపాయికీ కొన్ని వందల రెట్లు ప్రతిఫలం దక్కింది. మా దిగువన కిలోమీటరున్నర వరకూ భూగర్భ జలాలు రీచార్జ్ అయ్యాయి. దిగువ రైతులకూ నీటి భద్రత చేకూరింది. ప్రశ్న:మీ తోటకు ఎంత మేలు జరిగింది? మా 8 ఎకరాల తోటలో 9 రకాల మామిడి చెట్లు 500 వరకు ఉంటాయి. మా తోట ఎంతో బాగుంది. పచ్చగా, ఆరోగ్యంగా మంచి దిగుబడి వస్తోంది. ఏటా నికరంగా రూ. పది లక్షల ఆదాయం వస్తున్నది. మాకు ఎప్పుడూ నీటి కరువు లేదు. మా మండలంలో గత ఏడాది 250 ఎకరాల్లో మామిడి తోటలు నీరు లేక నిలువునా ఎండిపోయాయి. మా పొలంలో కురిసిన వానలో నుంచి చినుకు కూడా బయటకు పోకుండా జాగ్రత్త పడటం వల్లనే ఇది సాధ్యమైంది. ప్రశ్న:మీ తోట దగ్గర పశువులకు, అటవీ జంతువులకూ నీరు అందుబాటులో ఉంచారట కదా..? అవును సార్. మాకు చాలా సంతోషం కలిగించే సంగతి ఇది. మా తోట దగ్గర్లో ఉన్న అడవిలో కూడా జంతువులు తాగడానికి నీరు లేదు. తోట ఎదుట సిమెంటు తొట్టిని నిర్మించాం. అందులో ఎప్పుడూ నీళ్లు ఉండేలా చూస్తున్నాం. పక్షులు కూడా వచ్చి దప్పిక తీర్చుకుంటాయి. రాత్రుళ్లు అటవీ జంతువులు వచ్చి దాహం తీర్చుకుంటుంటాయి. ప్రశ్న:రైతులు ఎలా స్పందిస్తున్నారు..? పది మందికీ ఉపయోగపడే పని చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాంత రైతులంతా మాతో బాగుంటారు. చాలా మంది వచ్చి చూసి వెళుతూ ఉంటారు. మా తోట గురించి ఎవరైనా కొత్తవారు వచ్చి అడిగితే.. సాయిబు తోట అనో మరోటో అనరు. ఆప్యాయంగా ‘సార్ తోట’ అని చెబుతారు. కరువు నేలలో సిరులు పండించవచ్చంటున్న నూర్ మహమ్మద్, ఇంత వేసవిలోనూ ఇన్ని నీళ్లున్నాయి ఎడారిలో ఒయాసిస్సు! ఎడారీకరణ ముప్పును ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లాలో కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలు నిరంతర కరువు మండలాలు. రబీ కాలంలో జిల్లా సగటు వర్షపాతం 100 ఎం.ఎం. ఉంటుంది. ఈ మండలాల్లో 20 ఎం.ఎం.కు మించదు. ఈ కారణంగా కరువు మండలాల జాబితాలో గత నాలుగైదేళ్లుగా ఈ మండలాలు క్రమం తప్పకుండా చోటుచేసుకుంటున్నాయి. గత ఏడాది ఈ ప్రాంతంలో 250 ఎకరాల్లో మామిడి తోటలు నిలువునా ఎండిపోయాయి. కటిక కరువు తాండవించే అటువంటి ప్రాంతంలో మామిడి రైతు నూర్‌మహమ్మద్, అతని కుమారుడు అజీజ్ ఎడారిలో ఒయాసిస్సును సృష్టించారు. ముందుచూపుతో పదేళ్ల క్రితం నుంచి చేపట్టిన నీటి సంరక్షణ పనులు ఈ అద్భుతాన్ని ఆవిష్కరింపజేశాయి. కొత్తచెరువుకు చెందిన నూర్‌మహమ్మద్, ఆయన కుమారుడు అజీజ్ బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి సమీపంలోని తమ 8 ఎకరాల తోటలో మామిడి సాగు చేస్తున్నారు. వాన నీటి సంరక్షణ చర్యల ద్వారా జలసిరులను ఒడిసిపడుతున్నారు. గత పదేళ్లుగా తమ పొలంలో కురిసిన ఒక్క చుక్కను కూడా బయటకు పోకుండా పూర్తిగా భూమిలోపలికి ఇంకింపజేస్తున్నారు. ఫలితంగా వీరి తోటలో నీటి కుంటల్లో పుష్కలంగా నీరు ఉంది. సేంద్రియ పద్ధతుల్లో సాగవుతున్న మామిడి చెట్లు నిండైన పండ్ల కాపుతో కళకళలాడుతూ లాభాల సిరులు తెచ్చిపెడుతున్నాయి.అంతేకాదు, కిలో మీటరు దూరం వరకు భూగర్భ జలాలు 250 అడుగుల్లోనే అందుబాటులోకి వచ్చాయి. అడవిలో కూడా తాగడానికి చుక్క నీరు దొరకని పరిస్థితుల్లో వీరి తోట బయట నీటి తొట్టిని ఏర్పాటు చేసి పశువులు, అటవీ జంతువుల దాహం తీర్చుతుండడం ప్రశంసనీయం. నూర్‌మహమ్మద్ వ్యవసాయ శాఖలో విస్తరణాధికారిగా ఉద్యోగం చేసి రిటైరయ్యారు. ఉద్యోగంలో ఉండగానే పాతికేళ్ల క్రితం 8 ఎకరాల మామిడి తోటను కొనుగోలు చేశారు. కరువు తీవ్రమవుతున్న దశలో పదేళ్ల క్రితం నుంచి ముందుచూపుతో వాన నీటి సంరక్షణ పనులు చేపట్టారు. తోట చుట్టూ 2 మీ. లోతు, 2 మీ. వెడల్పుతో కందకాలు తవ్వారు. తోట మధ్యలో నుంచి వెళ్తున్న వంకపై చెక్ డ్యాం నిర్మించారు. 40 మీటర్లకు ఒకచోట వాలుకు అడ్డంగా మట్టికట్టలు వేశారు. తోట నాలుగు వైపులా నాలుగు నీటి కుంటలు తవ్వించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక్క చుక్క నీరు కూడా బయటకుపోకుండా నేలలో ఇంకిపోయేలా పకడ్బందీగా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఎండాకాలంలో సైతం చెక్‌డ్యామ్ వద్ద నీరు నిల్వ ఉండటం విశేషం. మామిడి తోట ఎలాంటి పరిస్థితుల్లోనూ దెబ్బ తినకుండా నీటి భద్రత నెలకొంది. రెండు బోర్లలోనూ నీళ్లు పుష్కలంగా ఉండటం వలన డ్రిప్ కూడా లేకుండా చెట్టు పాది నిండా నీళ్లు పెడుతున్నారు. 25 సంవత్సరాల వయస్సుగల చెట్టుకు 40 నుంచి 50 కిలోల పశువుల ఎరువు వేస్తున్నారు. దీంతోపాటు, కుమారుడు అజీజ్ సహాయంతో వర్మీ కంపోస్ట్(ఎర్రల ఎరువు)ను తోటలోనే తయారు చేసి వేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. చీడపీడల నివారణ కోసం పుల్లని మజ్జిగను చెట్టు మొత్తం తడిసే విధంగా పిచ్చికారీ చేస్తున్నారు. 8 ఎకరాలలో సంవత్సరానికి ఖర్చులు పోను రూ. 10 లక్షల వరకు నికరాదాయం వస్తోందని నూర్‌మహ్మద్ తెలిపారు. సేంద్రియ ఎరువుల వాడకం, పుష్కలంగా నీటి తడులు ఇవ్వటం వల్ల కాయలు బాగా పెద్దవిగా ఉండటంతో పాటు అధిక దిగుబడులు వస్తున్నాయని తెలిపారు. ‘తలమార్పిడి’తో చెట్లకు పునరుజ్జీవం! కాత రాని, పనికిరాని చెట్లను 3 మీటర్ల ఎత్తున కోసి.. మల్లిక, బాదుషా వంటి మేలు జాతి మొక్కలను అంటు కట్టి మంచి ఫలితాలు సాధిస్తున్నాం. ఒక చెట్టుకు 10–15 వరకు అంట్లు కడుతున్నాం. ఇలా ‘తలమార్పిడి’తో అంటుకట్టిన చెట్లు మూడేళ్లలోనే పూర్తిస్థాయి కాపును ఇస్తున్నాయి. ఇతర రైతులు కూడా ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు మాత్రమే వాడుతున్నాం. రసాయనిక ఎరువులు ఎన్నడూ వాడలేదు. కాయ మంచి సైజు వస్తున్నది. ఖర్చులన్నీ పోను ఏడాదికి రూ. 10 లక్షల నికరాదాయం వస్తున్నది. – నూర్‌మహ్మద్ (94409 83644), కొత్తచెరువు, అనంతపురం జిల్లా కుమారుడు అజీజ్‌తో నూర్‌మహమ్మద్ – కడప గంగిరెడ్డి, సాక్షి, బుక్కపట్నం, అనంతపురం జిల్లా -
మామిడి రైతులను నిండా ముంచిన అకాల వర్షం
-
వడగళ్ల వానతో.. రైతుకు కడగండ్లు
కేశంపేట: ఆదివారం తెల్లవారు జామున ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కురిసిన వర్షం రైతులకు కన్నీటిని మిగిల్చింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చె సమయానికి వడగళ్ల వర్షం రూపంలో రైతుకు కడగండ్లను మిగిల్చింది. ఆదివారం మండలంలో 28.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలంలో కురిసిన వడగండ్ల వర్షానికి వరి పూర్తిగా నీట మునిగింది. బోర్లలో నీరు ఇంకిపోవడంతో ట్యాంకర్ల ద్వారా వరి పంటను బతికించుకున్నామని, అకాల వర్షం పంటంతా తడిసిముద్దవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వడగండ్ల వాన రూపంలో పంటలు పడవడంతో పాపిరెడ్డిగూడ గ్రామంలో రైతు అబ్బి రవి కన్నీరు పెట్టుకున్నారు. అంతే కాకుండా ఈదురు గాలులకు మామిడికాయలు నేలరాలాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. కందుకూరులో భారీ వర్షం కందుకూరు: మండల పరిధిలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. 24.2 మి.మీ వర్షపాతం నమోదైంది. కాగా వర్షంతో పాటు ఈదురు గాలులతో లేమూరు, సరస్వతిగూడ, గూడూరు, అగర్మియాగూడ తదితర గ్రామాల పరిధిలోని తోటల్లో మామిడికాయలు నేలరాలి రైతులు నష్టపోయారు. ఈ ఏడాది అతి తక్కువగా కాత ఉండడం ప్రస్తుతం ఈదుర గాలులకు కాయలు నేల రాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా పులిమామిడి పరిసర ప్రాంతాల్లో తెల్లవారు జామున స్వల్పంగా వడగళ్లు కురిశాయి. చేసిన అప్పులు తీరేదెలా.. తలకొండపల్లి(కల్వకుర్తి): అకాలవర్షంతో రైతులు తలలు పట్టుకున్నారు. మండలవ్యాప్తంగా సుమారుగా 500 ఎకారాలకు పైగా వరిపంట దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తలకొండపల్లి, పడకల్, మెదక్‌పల్లి, వెల్జాల్, చంద్రధన, చుక్కాపూర్, తాళ్లగుట్టతండా, తదితర గ్రామాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఓ మోస్తారు వర్షం కురిసింది. దీంతో కల్లు రాజేశ్వర్‌రెడ్డి 6 ఎకరాల్లో, జబ్బార్, సేవ్య, తార్యా, హూమ్లా, శక్రు, పుల్యా, రాములు, చందు, బాటా, తదితర రైతులకు సంబందించి సుమారుగా 300 ఎకరాలకు పైగా వరి పంట దెబ్బతిందని రైతులు బావురుమంటున్నారు. వడగండ్లవానకు కళ్ల ముందే పంట నాశనమైందని, దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న పంట వివరాలు సేకరించి ప్రభుత్వపరంగా నష్ట పరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు. -
మామిడిని కాపాడుకుందాం!
వాతావరణం మారిపోయింది. అసాధారణ వాతావరణం మామిడిౖ రైతు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది. సంక్రాంతి సమయంలో చుట్టుముట్టిన దట్టమైన పొగమంచు పూతను దెబ్బతీసింది. ఇప్పుడేమో రాత్రి పూట వణికించే చలి, పగటి పూట అధిక ఉష్ణోగ్రత మామిడి రైతుపై పగబట్టినట్టే కనిపిస్తున్నాయి. పూత ఆలస్యం కావడం, తీరా వచ్చిన పిందెలు కూడా రాలిపోతుండడంతో రైతులు కలవరపడుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రత సాధారణం కన్నా ఐదారు డిగ్రీలు తక్కువగా ఉండటం.. పగటి ఉష్ణోగ్రత సాధారణం కన్నా ఎక్కువగా ఉండటం వంటి విపరిణామాలు ఆశలను తుంచేస్తున్నాయి. తేనెమంచు, తదితరæ చీడపీడలు రసాయనిక మందులు చల్లే రైతులను అల్లాడిస్తున్నాయి. అయితే, ప్రకృతి వ్యవసాయదారుల పరిస్థితి మెరుగ్గానే ఉంది. సేంద్రియ తోటల్లో చీడపీడల బెడద లేదు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా వాతావరణ మార్పులను దీటుగా ఎదుర్కోవచ్చని, మామిడి తోటలను కాపాడుకోవచ్చని వీరి అనుభవాలు చెబుతున్నాయి.. చలి పెరిగినా పూత బాగుంది.. గత ఏడాది ఆగస్టు తర్వాత వర్షాలేవు. కరువొచ్చింది. చలి కూడా తక్కువే. ఈ ఏడాది వర్షాలు బాగున్నాయి. చలి పెరిగింది. పూత బాగుంది. గత ఏడాదికన్నా రెట్టింపు దిగుబడి వస్తుందనుకుంటున్నాను. మా తోట పదెకరాలు. 14 ఏళ్ల నాటిది. మొదటి నుంచీ మనసబు ఫుకుఒకా ప్రకృతి వ్యవసాయ పద్ధతిని పాటిస్తున్నా. అసలు నీరు పెట్టలేదు. కలుపు తీయకుండా సజీవ ఆచ్ఛాదన చేస్తున్నాం. వాన నీటి సంరక్షణకు ఇంకుడుగుంటలు తీశాం. కలుపుమందులు, రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడట్లేదు. మా చెట్లకు ఎటువంటి తెగుళ్లూ లేవు. వేపనూనె కూడా పిచికారీ చేయట్లేదు. నీరు ఎప్పుడూ పెట్టలేదు. మా ప్రాంతంలో నీరు పెట్టిన తోటలు చిగుళ్లతో గుబురుగా ఉన్నాయి, తేనెమంచు పురుగు వచ్చింది. రసం పీల్చే పురుగుల వల్ల ఆకులు కూడా రాలిపోతున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వల్ల రోగనిరోధక శక్తి ఆ చెట్లకు తక్కువగా ఉండటం వల్ల అన్ని రకాల పురుగులు, తెగుళ్లూ వస్తుంటాయి. మాకు ఆ బెడద లేదు. మా తోటలో ఎకరానికి 99 చొప్పున చిన్న రసం చెట్లున్నాయి. మాది కరువు ప్రాంతాలకూ సరిపోయే అధిక సాంద్రత పద్ధతి. ఎటు చూసినా 21 అడుగులకో చెట్టు నాటాం. పంట అయిపోగానే ప్రూనింగ్ చేస్తాం. గాలిదుమ్ములను తట్టుకుంటుంది. కాయ రాలుడు చాలా తక్కువ. కరువును తట్టుకొని, గాలులను తట్టుకొని దీర్ఘకాలం దిగుబడులనిచ్చే విధంగా ఇన్‌సిటు గ్రాఫ్టింగ్ పద్ధతిని అనుసరిస్తున్నాం. – ఎల్.జి.బి.ఎస్. రామరాజు (94401 06567), కొత్తూరు తాడేపల్లి, విజయవాడ రూరల్ మండలం ఆవు పిడకల పొగ వేస్తున్నాం.. మా 20 ఎకరాల తోట 30 ఏళ్ల నాటిది. వెయ్యి చెట్లున్నాయి. ఐదేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం. 80% బేనిషాన్(బంగినపల్లి) చెట్లున్నాయి. ఈ ఏడాది చాలా చెట్లకు 80% పూత వచ్చింది. పిందె బాగానే వచ్చింది. అయితే, కొన్ని చెట్లకు చిగుళ్లు వచ్చాయి, పూత 25% మాత్రమే వచ్చింది. గత ఏడాది పూత ఎక్కువగానే వచ్చినా నిలబడింది తక్కువ. ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియటం లేదు. ఇప్పటికి మా తోటకు తెగుళ్లు ఏమీ రాలేదు. పూత రాకముందు పది రోజులకోసారి ఆవు మూత్రం కలిపిన నీటిని పిచికారీ చేశాం. ఇప్పుడు పిచికారీలు చేయడం లేదు. నీరు ఇవ్వడం లేదు. చీడపీడలు రాకుండా పది రోజులకోసారి పిడకల పొగ వేస్తున్నాం. సాయంత్రపు వేళలో ఐదెకరాలకు ఒక చోట కిలో ఆవు పిడకలు, పావు కిలో నెయ్యి, పచ్చి ఆకులు వేసి పిడకల పొగ వేస్తున్నాం. పూత, పిందెలు రాలిపోకుండా రక్షించుకోవడానికి పిడకల పొగ ఉపయోగపడుతున్నది. తేనెమంచు పురుగు కూడా రాలేదు. ఏ చెట్టుపైనైనా వచ్చిందన్న అనుమానం వస్తే ఆ దగ్గర్లో పిడకల పొగ పెడుతున్నాం. పిచికారీలు చేయడం లేదు. వడగళ్ల వాన రాకుండా ఉంటే ఈ ఏడాది మంచి దిగుబడే వస్తుందనుకుంటున్నాం. – సుధామోహన్ (93947 47100), బొమ్మరాజుపేట, శామీర్‌పేట మండలం, మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లా వేస్ట్ డీ కంపోజర్ వల్ల తోట బాగుంది.. మా 60 ఎకరాల సేంద్రియ తోటలో 1500 మామిడి చెట్లు, 1500 కొబ్బరి చెట్లున్నాయి. 1995 నుంచి సేంద్రియ, బయోడైనమిక్ పద్ధతిలో సాగు చేస్తున్నాం. ఇప్పుడు జీవామృతం, ఘనజీవామృతం, వేస్ట్ డీ కంపోజర్‌ను విరివిగా వాడుతున్నాం. జాతీయ, అంతర్జాతీయ సేంద్రియ సర్టిఫికేషన్లు ఉన్నాయి. మా తోటలో పల్ప్ రకం మామిడి చెట్లు ఎక్కువగా ఉన్నాయి. రసాలు తక్కువ. గత మూడేళ్లుగా మా చెట్లకు ఎటువంటి తెగుళ్లూ ఎరుగం. కాయకు చివరన ముడ్డిపుచ్చు వస్తుంటుంది. మాకు అది అసలు లేనే లేదు. ‘సాక్షి సాగుబడి’ ద్వారా వేస్ట్ డీ కంపోజర్ ద్రావణం గురించి తెలుసుకొని గత అక్టోబర్ నుంచి దాదాపు రోజు మార్చి రోజు వాడుతున్నాం. వెయ్యి లీటర్ల ట్యాంకులు 24 చోట్ల ఏర్పాటు చేసి.. పావు గంటలో చెట్లన్నిటికీ ఈ ద్రావణాన్ని ఇచ్చే ఏర్పాటు చేశాం. ఇప్పుడు తోట చాలా ఆరోగ్యంగా ఉంది. ఏ తెగుళ్లూ లేవు. అప్పుడప్పుడూ ఘనజీవామృతం వేస్తున్నాం. జీవామృతం ఇస్తున్నాం. అయితే, వేస్ట్ డీ కంపోజర్‌ను జీవామృతంతో కలపకుండా విడిగా ఇస్తున్నాం. మా తోటలో మామిడి చెట్లు ప్రతి ఏటా కాస్తున్నాయి. కాయకోతలు పూర్తవ్వగానే ప్రూనింగ్ చేసి, ఎండుపుల్ల తీసేసి.. సక్రమంగా పోషణ ఇస్తాం. మళ్లీ ఏడాదీ కాపు వస్తుంది. వాతావరణంలో చాలా మార్పు వచ్చింది. ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహకు అందటం లేదు. రసాయనిక వ్యవసాయం చేసే రైతులు మామిడి తోటల్లో ఈ ఏడాది తెగుళ్లతో పిందె రాలిపోతున్నది. ఇప్పటికే 8,9 సార్లు పురుగుమందులను పిచికారీ చేసినా, పిందె రాలుతూనే ఉంది. వాతావరణ మార్పులను దీటుగా ఎదుర్కోవడానికి సేంద్రియ వ్యవసాయం తోడ్పడుతుంది. – చలసాని దత్తు (94414 73246), నూజివీడు, కృష్ణా జిల్లా పది రోజులకోసారి కషాయం పిచికారీ.. ఈ ఏడాది జనవరిలో 3 రోజుల పాటు దట్టమైన పొగమంచు కురిసి మామిడి పూతను దెబ్బతీసింది. దీని ప్రభావం వల్ల కొన్ని చెట్లకు పూత 50% వస్తే, మరికొన్నిటికి ఇంకా తక్కువే వచ్చింది. మాకున్న 30 ఎకరాలలో చాలా ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయాన్నే చేస్తున్నాను. 310 మామిడి చెట్లున్నాయి. గత ఏడాది 70% చెట్లకు పూత, కాత చాలా బాగా వచ్చింది. లోకల్‌గా కిలో రూ. 100–120 వరకు అమ్మాం. అమెరికా, జర్మనీ, సింగపూర్‌కు కూడా పంపాం. ఖర్చులు పోను రూ. 8 లక్షల నికరాదాయం వచ్చింది. ఈ ఏడాది పూతే తక్కువగా వచ్చింది. పూతరాక ముందు నవంబర్ నుంచే 15 రోజులకోసారి కషాయాలు, జీవామృతం పిచికారీ చేస్తున్నాం. తేనెమంచు పురుగు రాలేదు. 20 ఆకులను కుళ్లబెట్టి తయారు చేసుకున్న కషాయం, జీవామృతం, పులిసిన మజ్జిగ, దేశీ ఆవు పాలు–శొంఠి–ఇంగువ ద్రావణం, కొబ్బరి నీరు, సప్తధాన్యాంకుర కషాయం.. అదొకసారి ఇదొకసారి 7–10 రోజులకోసారి పిచికారీ చేస్తున్నాం. పిందె రాలడం ఆగే వరకు, పిందెలు గోలికాయ సైజుకు పెరిగే వరకు కొడుతూ ఉంటాం. అయినా గత ఏడాది బూడిద తెగులు కంట్రోల్ కాలేదు. – బీరం వెంకట్రామారెడ్డి (98498 04527), సింగోంటం, మహబూబ్‌నగర్ జిల్లా వాతావరణం మారింది.. పూత, లేత పిందె మాడిపోతున్నది.. మా 8 ఎకరాలలోని 18 ఏళ్ల మామిడి తోటలో 500 చెట్లున్నాయి. సొంతంగా తయారు చేసుకునే జీవన ఎరువులు, జీవామృతంతో వ్యవసాయం చేస్తున్నాను. సగటున 40 టన్నుల దిగుబడి వచ్చేది.. రెండేళ్లుగా 25 టన్నులకు పడిపోయింది. మూడేళ్లుగా వాతావరణం మారిపోయింది. ఈ ఏడాది ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు మరీ ఎక్కువై.. పూత, పిందెకు గొడ్డలిపెట్టులా మారాయి. ఈ రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రత(సాధారణంగా 23–24 డిగ్రీలు ఉండాల్సింది) 19 డిగ్రీలకు తగ్గింది. పగటి ఉష్ణోగ్రత (ఉగాది లోపల 35 డిగ్రీలు ఉండాల్సింది) 38–39 డిగ్రీలకు పెరిగింది. గత రెండేళ్లు దిగుబడి తగ్గినా పూత సమయానికి వచ్చింది. ఈ ఏడాది పూత 25–30 రోజులు ఆలస్యంగా వచ్చింది. దశేరి, హిమాయత్ కన్నా బంగినపల్లి పూత ఆలస్యంగా వస్తుంది. బంగినపల్లి చిన్న పిందె దశలో ఉంది. ఇప్పుడున్న లేత పిందె, లేత ఆకులు కూడా మాడి, రాలిపోతున్నాయి. ఇందులో 80% రాలిపోయే అవకాశం ఉంది. పిందెలను నిలబెట్టుకునేందుకు మామిడి చెట్లపై వేప నూనె, వర్టిసెల్లం లఖానియా(జీవన శిలీంధ్ర నాశిని)లను నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 20,000–50,000 పీపీఎం గల వేపనూనె అర లీటరు, వర్టిసెల్లం లఖానియా 0.5% ద్రావణం అర లీటరు చొప్పున 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వారం వ్యవధిలో మరోసారి పిచికారీ చేయాలి. ఇందులో ఎమల్సిఫయర్ కలపకూడదు. ఎమల్సిఫయర్ కలిపితే వేడి పెరుగుతుంది. 10,000 పీపీఎం లోపు ఉండే వేప నూనె నీటిలో కరగదు కాబట్టి ఎమల్సిఫయర్ కలుపుతుంటాము. 20,000–50,000 పీపీఎం వేపనూనెకు అవసరం లేదు. వర్టిసెల్లం లఖానియా.. రసం పీల్చే పురుగులన్నిటినీ సమర్థవంతంగా అరికడుతుంది. తేనెమంచు పురుగు, బూడిద తెగులు, పేనుబంక, పాముపొడ(లీఫ్‌మైనర్)లను అరికడుతుంది, నిరోధిస్తుంది. – కొక్కు అశోక్‌కుమార్ (98661 92761), సేంద్రియ మామిడి రైతు, ఒగులాపురం, మల్యాల మండలం, జగిత్యాల జిల్లా నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
తీరని నష్టం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అకాలవర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. మూడు రోజుల వ్యవధిలో కురిసిన వర్షాలు రైతులకు విషాదాన్ని మిగిల్చాయి. ఎడతెరిపిలేకుండా కురిసిన వానలు.. వడగళ్లతో జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గాలి వానలతో మామిడితోటలు దారుణంగా దెబ్బతిన్నాయి. కోతకొచ్చిన వరి, కొద్దిరోజుల్లో చేతికిరావాల్సిన మామిడి వాన బారిన పడింది. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లావ్యాప్తంగా 4,910 ఎకరాల విస్తీర్ణంలో పంటలకు నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనాలు రూపొందించిన జిల్లా యంత్రాంగం నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. జిల్లాలోని 14 మండలాల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు రూ.కోట్లలో పంటనష్టం సంభవించిందని లెక్క తేల్చింది. యాచారం, మొయినాబాద్, కందుకూరు, కీసర, ఘట్కేసర్, మంచాల, హయత్‌నగర్ మండలాల్లో వరి పైరు నేలకొరిగినట్లు వ్యవసాయాధికారులు అంచనాలు వేశారు. జిల్లాలో కూరగాయలు, ఉద్యానతోటలు అకాల వర్షాలకు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పూలు, పండ్ల తోటలు తుడుచుకుపోయాయి. చేవెళ్ల ప్రాంతంలో కూరగాయలు, పూల తోటలకు భారీగా నష్టం చేకూరింది. 116 హెక్టార్ల విస్తీర్ణంలో కూరగాయ పంటలు నీటిపాలు కావడం రైతాంగాన్ని కుంగదీశాయి. జిల్లావ్యాప్తంగా దాదాపు 5,052.80 హెక్టార్ల విస్తీర్ణంలో పండ్లు, కూరగాయ తోటలు 50శాతానికి పైగా దెబ్బతిన్నట్లు నిర్ధారించిన అధికారులు.. 448.20 హెక్టార్లలో 50శాతం లోపు నష్టం వాటిల్లినట్లు తేల్చారు. అకాల వర్షాలకు 1,201 మంది పూలు, కూరగాయ రైతులు నష్టపోయినట్లు ఉద్యాన శాఖ అధికారులు గుర్తించారు. యాచారం, కీసర, శామీర్‌పేట, మేడ్చల్ తదితర మండలాల్లో వర్షానికంటే వడగళ్లు భారీగా పడడం అన్నదాతల్లో విషాదాన్ని మిగిల్చింది. పంటల నష్టంపై అంచనాలు రూపొందించినప్పటికీ, కుండపోత వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు సంబంధించిన నష్టం అంచనాలను పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖలు ఇంకా తయారు చేయలేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చెరువుల పునరుద్ధరణ (మిషన్ కాకతీయ) పనులు వర్షాలతో అర్ధంతరంగా నిలిచిపోయాయి. ప్రతిపాదిత చెరువుల్లోకి వర్షపు నీరు చేరడంతో పనులు ఆగిపోయాయి. వర్షం తెరిపిఇస్తే కానీ ఇవి ప్రారంభమమ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఇదిలావుండగా శంకర్‌పల్లిలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను బుధవారం రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి పరిశీలించారు. -
మామిడి తోటలకు పురుగుల దెబ్బ
డీజీపేట, (సీఎస్‌పురం) : మామిడి తోటలపై పురుగులు దాడి చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులు ఉద్యానపంటల వైపు దృష్టి సారించారు. మెగా వాటర్‌షెడ్ పథకం కింద డీజీపేటలో 24 ఎకరాలు, ఉప్పలపాడు, కొండబోయినపల్లిలో 38, రేగులచెలకలో 15 ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేశారు. మరో 300 ఎకరాల్లో సాగు చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా 11 పంచాయతీల పరిధిలో 504 ఎకరాల్లో మామిడి తోటల సాగుకు రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో వెంగనగుంట, పెదగోగులపల్లిల్లో 30 ఎకరాల్లో మామిడి తోటల సాగు చేపట్టారు. ఇవి కాక మరో 298 ఎకరాల్లో గతంలో మామిడి తోటలు సాగు చేశారు. అయితే ప్రస్తుతం వర్షాకాలం రావడం, మంచు పడుతుండటంతో మామిడి తోటలపై పురుగులు దాడి చేస్తున్నాయి. ఆకుపచ్చ రంగులో రెండు, మూడు అంగుళాల మేర ఉన్న పురుగులు చిగుర్లతో పాటు ఆకులను కూడా తినేస్తున్నాయి. ఈ పురుగులు పగలు కనిపించడం లేదని..రాత్రివేళల్లోనే చెట్లపై దాడి చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేరుపురుగు చేరి ఏపుగా పెరిగిన అనేక మొక్కలు నిలువునా ఎండిపోతున్నాయని వాపోతున్నారు. నివారణకు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. బయట దుకాణాల్లో వారిచ్చిన మందులు తెచ్చి వాడితే రెండు రోజులు పురుగులు తగ్గుతాయనీ, ఆపై మళ్లీ దాడి చేస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ఆచూకీలేని ఉద్యానవన శాఖ అధికారులు: మండలంలో ఉద్యానవన శాఖ అధికారుల చిరునామా కరువైంది. బత్తాయి తోటలు ఎండిపోయినా..పసుపు పంటకు తెగుళ్లు సోకినా పట్టించుకునేవారు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వడం మాట అటుంచి.. కనీసం అధికారిక కార్యక్రమాలైన పొలం పిలుస్తోంది, జన్మభూమిలకు కూడా హాజరుకావడం లేదు. దీనిపై ఉద్యానవన శాఖ జేడీ పీ జెన్నమ్మను సాక్షి వివరణ కోరగా...త్వరలో ఉద్యానవన శాఖాధికారులను నియమిస్తామన్నారు. పురుగుల దాడి నుంచి మామిడి చెట్లను కాపాడుకునేందుకు మొక్కల మొదళ్లలో గుళికల మందు వేయాలని సూచించారు.