సాక్షి, ఖమ్మం జిల్లా: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. పెనుబల్లి మండలం పాత కారాయిగూడెం గ్రామానికి చెందిన పోట్రు వెంకట కృష్ణారావు సుహాసిని దంపతులకు ఇద్దరు సంతానం. కొడుకు కార్తిక్ బెంగుళూరులో జాబ్ చేస్తుండగా, కూతురు అమృత ఇంటర్ పూర్తి చేసుకొని బిటెక్‌లో సీట్ కోసం ఎదురు చూస్తూ ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటుంది. వెంకట కృష్ణారావు తనకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
కృష్ణారావు భార్య సుహసిని గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతుంది. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నెల రోజుల క్రితం కడుపు నొప్పికి సంబంధించిన సర్జరీ కూడా చేపించుకున్నారు. కడుపులో ఉన్న గడ్డను తొలిగించిన వైద్యులు టెస్టులకు పంపించారు. టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయని హాస్పటల్ నుండి సమాచారం రావటంతో వెంకట కృష్ణారావు తన భార్య, కూతురుని బైక్‌పై తీసుకుని హాస్పటల్‌కు వెళ్లారు. రిపోర్ట్స్‌లో క్యాన్సర్ అని నిర్ధారణ అవటంతో మనస్తాపానికి గురైన ముగ్గురూ అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో తిరువూరులో ఆత్మహత్య చేసుకునేందుకు కొత్త తాడులు, చిన్న పీటలు(Chairs) కొనుగోలు చేసి వాటన్నింటినీ సంచిలో వేసుకుని ఇంటికి చేరుకున్నారు.
బెంగుళూరులో జాబ్ చేస్తున్న కొడుకు కార్తీక్‌ను కూడా నిన్ననే ఇంటికి పిలిపించారు. అయితే రాత్రి సమయంలో కుమారుడిని ఇంటి దగ్గరే ఉంచి కృష్ణారావు తన భార్య సుహసిని, కూతురు అమృతని బైక్ ఎక్కించుకొని గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరం లోని తమ పొలం పక్కనే ఉన్న మామిడి తోటలోకి వెళ్ళి తమతో తెచ్చుకున్న సామగ్రితో చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డారు.
చదవండి: భర్తను యాదాద్రికి పంపించి.. హైదరాబాద్‌లో తల్లీకూతురు ఆత్మహత్య
భార్య సుహసినికి క్యాన్సర్ వ్యాధి సొకటంతో మనోవేదనకు గురైన ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, విచారణ చేపడతామని సత్తుపల్లి రూరల్ సీఐ హాణుక్ తెలిపారు. ఘటన స్థలాన్ని కల్లూరు ఏసీపీ రామానుజం పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వ హాస్పటల్ లోని మార్చురీకి తరలించారు.
గ్రామంలో అన్యోన్యంగా జీవించే వెంకట కృష్ణారావు కుటుంబ సభ్యులు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు అన్న సమాచారంతో గ్రామస్థులు పెద్దసంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment