మామిడి చెట్టుకు కట్టిన ఫ్రూట్ ఫ్లై లూర్ ట్రాప్ బాక్స్రై- రైతులకు లూర్‌పై అవగాహన కల్పిస్తున్న అధికారులు
సాక్షి, అమరావతి బ్యూరో: పులిని బంధించడానికి బోను ఏర్పాటు చేస్తారు. అందులో మాంసాన్ని ఎరగా వేస్తారు. ఆ మాంసాన్ని తినడానికి వచ్చిన పులి బోనులో చిక్కుతుంది. ఇప్పుడు మామిడిని దెబ్బతీస్తున్న పండు ఈగల నియంత్రణకు సరికొత్త ఎరను ప్రయోగిస్తున్నారు. ఈ ఎరతో రైతులు సత్ఫలితాలు పొందుతున్నారు. ఏమిటా ఎర? ఏమా కథ?
మామిడికాయ పక్వానికి వచ్చాక లోపలికి పండు ఈగ ప్రవేశిస్తుంది. లోపల తల్లి ఈగ పిల్లలను పెట్టి కాయ పండాక రసాన్ని పీల్చేస్తుంది. ఇలాంటి కాయల కొనుగోలుకు వ్యాపారులు, ఎగుమతిదార్లు ముందుకురాక రైతులు నష్టపోతున్నారు.
కోతకొచ్చే దశలో సగటున నాలుగో వంతు మామిడిని ఈ పండు ఈగ దెబ్బతీస్తోంది. ఏళ్ల తరబడి వేధిస్తున్న ఈ సమస్యపై డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని నూజివీడు మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ‘ఫ్రూట్ ఫ్లై లూర్’ పేరిట ఓ ఎరను అందుబాటులోకి తెచ్చారు. ఆడ ఈగ సంపర్కానికి సన్నద్ధమయ్యే సమయంలో ఒక రకమైన వాసన విడుదల చేస్తుంది. ఆ వాసనకు ఆకర్షించిన మగ ఈగ.. ఆడ ఈగ వెంటపడుతుంది. క్రిమిసంహారకమందు, రసాయనాలతో రూపొందించిన ఈ లూర్ ఆడ ఈగ సంపర్కానికి ముందు విడుదల చేసే వాసనను పోలి ఉంటుంది. ఈ లూర్ (ఎర)ను ఒక ట్రాప్ బాక్సులో ఉంచి మామిడి చెట్టుకు కడతారు.
ఆ బాక్సులో ఆడ ఈగలున్నాయని భ్రమించి మగ పండు ఈగలు ట్రాప్ బాక్సులోకి వెళ్లి ఆ క్రిమిసంహారక ద్రవంలో చిక్కుకుని చనిపోతాయి. సహజంగా ఆడ పండు ఈగలకంటే మగ ఈగల సంతతే అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని శాస్త్రవేత్తలు సంతాన ఉత్పత్తికి కారణమయ్యే మగ పండు ఈగలను నియంత్రించేందుకు ఈ లూర్‌ను గత మార్చి నెల నుంచి విస్తృతంగా అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పదివేల లూర్‌లను ఉద్యానశాఖ ద్వారా పంపిణీ చేశారు. ఒకసారి ట్రాప్ బాక్స్‌లో వేసిన లూర్ నెలరోజుల పాటు ప్రభావం చూపుతుంది. ఇక ఆడ పండు ఈగల నియంత్రణకు కూడా ఈ శాస్త్రవేత్తలు మరో ద్రావణాన్ని సూచిస్తున్నారు. పులిసిన కల్లు, బెల్లం, మలాథియాన్‌తో తయారు చేసిన ద్రావణాన్ని మామిడి తోటలో ఉంచితే ఆడ పండు ఈగలు దాన్ని ఆకర్షించి చనిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ధర కూడా స్వల్పమే..
ఇక ఈ లూర్ ధర కూడా రైతుకు అందుబాటులోనే ఉంది. లూర్ రూ.40, ట్రాప్ బాక్స్ రూ.100 చొప్పున రైతులకు అందజేస్తున్నారు. ఒక ఎకరం తోటకు నాలుగైదు ఏర్పాటు చేస్తే సరిపోతుంది. ఇలా ఒక ఎకరం మామిడి తోటకు వీటి ఖర్చు గరిష్టంగా రూ.700కు మించదు. ఎకరం తోటలో సగటున 4 టన్నుల దిగుబడి వస్తుంది. ఇందులో కనీసం ఒక టన్ను పండు ఈగ బారిన పడుతుంది. అంటే రైతుకు ఎకరానికి దాదాపు రూ.10 వేలు నష్టం వాటిల్లుతుంది. లూర్‌కు రూ.700 వెచ్చిస్తే రైతుకు కనీసం రూ.9 వేలు ఆదా అవుతుంది. రాష్ట్రంలో 3.74 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మామిడి ఉంది. ఏటా 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. ఇందులో కనీసం 10 లక్షల టన్నుల మామిడిని పండు ఈగ దెబ్బతీస్తోందని అంచనా. ఇలా ఏటా రాష్ట్రంలో పండు ఈగ సుమారు రూ.1,000 కోట్ల విలువైన మామిడి పంటను నాశనం చేస్తోంది. పండు ఈగతో ఏటా నష్టపోతున్న రైతు ఈ స్వల్ప ఖర్చుతో నివారణ మార్గం లభించడంతో లూర్‌పై ఆసక్తి పెంచుకుంటున్నారని నూజివీడు ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు ‘సాక్షి’కి చెప్పారు.
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం
పండు ఈగతో నష్టపోకుండా అందుబాటులోకి తెచ్చిన ఫ్రూట్ ఫ్లై లూర్‌పై మామిడి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ ఈగ బారిన పడ్డ మామిడిని ఎగుమతిదార్లు తీసుకోక ఆశించినంతగా ఎగుమతులు జరగడం లేదు. ఎగుమతులు పెంచడంతోపాటు రైతులకు పండు ఈగ బెడద తగ్గించే ఉద్దేశంతో ఫ్రూట్ ఫ్లై లూర్‌ను విస్తృతం చేస్తున్నాం. ఈ ఏడాది తొలిసారిగా రాష్ట్రంలో 10 వేలకు పైగా లూర్‌లను అందించాం.
– బీకేఎం లక్ష్మి, సీనియర్ సైంటిస్ట్, హెడ్, మామిడి పరిశోధన స్థానం, నూజివీడు
లూర్‌తో సత్ఫలితాలు..
ఏళ్ల తరబడి పండు ఈగ బెడదను ఎదుర్కొంటున్నాం. ఏటా నాలుగో వంతు పంటను పండు ఈగ దెబ్బతీస్తోంది. ఇన్నాళ్లు వీటి నివారణకు మంటలు వేయడం, టైర్లు కాల్చడం వంటివి చేసేవాళ్లం. అయినా ఆశించిన ఫలితం ఉండేది కాదు. ఇప్పుడు లూర్‌తో పండు ఈగల నివారణ సాధ్యమవుతోంది. నేను 5 ఎకరాల్లో 30 ఫ్రూట్ ఫ్లై లూర్‌లను ఏర్పాటు చేశాను. సత్ఫలితాలివ్వడంతో పండు ఈగ బెడద తప్పింది.
– చెలికాని మురళీకృష్ణారావు, రైతు, కోటపాడు, కృష్ణాజిల్లా
చదవండి: ఏపీ: 400 మంది ప్రాణాలను కాపాడిన పోలీసులు
ఏలూరు: కార్పొరేషన్ ఎలక్షన్ కౌంటింగ్‌కు హైకోర్టు అనుమతి
Comments
Please login to add a commentAdd a comment