సైన్స్ ప్రయోగం ఒకటి ఒకసారి విఫలమైతే రెండోసారి చేస్తారు. అది విఫలమైతే మరోసారి.. ఇలా ఎన్నోసార్లు ఎన్నో పద్ధతుల్లో ప్రయోగాలు చేస్తుంటారు. కాని, ఒకే ప్రయోగాన్ని దాదాపు వందేళ్లుగా చేయటాన్ని చూశారా? ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయంలో, ప్రొఫెసర్ థామస్ పార్నెల్ 1927లో ప్రారంభించిన ‘పిచ్ డ్రాప్’ ప్రయోగం ఇప్పటికీ జరుగుతూనే ఉంది.
ఇటీవల దీనిని ప్రపంచంలో అత్యంత నెమ్మదిగా సాగుతున్న ప్రయోగశాల ప్రయోగంగా గిన్నిస్ బుక్‌లో చేర్చారు. ప్రొఫెసర్ పార్నెల్, విద్యార్థులకు ఘనపదార్థాలుగా కనిపించేవన్నీ, నిజానికి ఘన పదార్థాలు కావని నిరూపించడానికి ఈ ప్రయోగాన్ని క్వీన్స్ లాండ్ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. ఇందుకోసం, పడవల్లో సీల్ చేయడానికి ఉపయోగించే మందపాటి తారు ద్రవాన్ని ఎంచుకున్నాడు. ముందుగా తారు పదార్థాన్ని వేడి చేసి, ఒక గాజు గరాటులో పోసి, సుమారు మూడు సంవత్సరాలపాటు అలాగే ఉంచాడు. గరాటులో ఆ ద్రవం ఘన స్థితికి వచ్చిన తర్వాత, 1930లో, గరాటు కింద గొట్టాన్ని కత్తిరించాడు.
అప్పటి నుంచి పిచ్ పదార్థం దశాబ్దానికి ఒక చుక్క కిందకు పడుతోంది. ఇప్పటివరకు, ప్రయోగం ప్రారంభించిన ఇన్నేళ్లలోనూ కేవలం తొమ్మిది చుక్కలే కిందకు పడ్డాయి. చివరిగా ఏప్రిల్ 2014లో పడింది. అయితే, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్ ప్రకారం, ఈ ప్రయోగం కేవలం ప్రదర్శనకు మాత్రమే ఏర్పాటు చేశారు. తారును ఉంచడానికి నిర్దిష్ట పరిస్థితులేవీ లేవు. వేర్వేరు సమయాల్లో వచ్చే ఉష్ణోగ్రత మార్పులే దీనిని ప్రభావితం చేస్తూన్నాయని కొంతమంది వాదన. ప్రస్తుతం మళ్లీ మరో దశాబ్దం ముగుస్తుండటంతో ఈ ప్రయోగంపై మరోసారి ఆసక్తి చెలరేగింది. చూడాలి మరి మరో చుక్క గరాటు నుంచి కిందకు ఎప్పుడు పడుతుందో!
Comments
Please login to add a commentAdd a comment