మంచుతో నిప్పు పుట్టించవచ్చా? అదెలా సాధ్యం?
నిప్పు- నీరు ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైనవి. నిప్పు ఉన్న చోట నీరు ఉండదు. నీరు ఉన్న చోట నిప్పు ఉండలేదు. అయితే ఐస్తో కూడా నిప్పు పెట్టొచ్చని చెబితే నమ్ముతారా? సైన్స్ సహాయంతో ఈ అద్భుతం ఎలా జరుగుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
సైన్స్ చేసే ఈ అద్భుతం 6వ తరగతి పుస్తకంలో దాగి ఉంది. ఈ ప్రయోగం కుంభాకార లెన్స్ చుట్టూ తిరుగుతుంది. లెన్స్ ఉపయోగించి సూర్యకాంతి సహాయంతో నిప్పును మండించడాన్ని మీరు చూసే ఉంటారు. మంచుతో నిప్పును పుట్టించే ప్రయోగం కూడా ఇలానే సాగుతుంది.
మంచుతో నిప్పు పుట్టించాలంటే ముందుగా పారదర్శక మంచు అవసరం. ఈ పారదర్శక మంచు ముక్క కుంభాకార లెన్స్ మాదిరిగా పని చేస్తుంది. ఈ మంచు ముక్క నుంచి సూర్యకాంతిని బయటకు ప్రసరింపజేసి, అది కాగితంపై పడేలా చేస్తే, కొంత సమయం తరువాత ఆ కాగితం నుండి పొగ రావడం ప్రారంభమవుతుంది. తరువాత కాగితంపై మంటలు వ్యాపించడాన్ని గమనించవచ్చు.
మంచును కుంభాకార లెన్స్గా ఉపయోగించి, మంటలను పుట్టించవచ్చని తెలుసుకున్నాం. అయితే మంచును కుంభాకార లెన్స్గా ఎలా తయారు చేయాలనే ప్రశ్న ఎదురవుతుంది. ఇందుకోసం ముందుగా పారదర్శక మంచు ముక్కను తీసుకోవాలి. చాకు సాయంతో ఆ మంచుకు లెన్స్ ఆకారాన్ని ఇవ్వాలి. తర్వాత చేతులతో రుద్ది లెన్స్ మాదిరిగా తయారు చేయాలి.
లెన్స్ ఎంత పెద్దదిగా ఉంటే నిప్పు అంత ప్రకాశవంతంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. లెన్స్ మందం 2 అంగుళాలు, వ్యాసం 6 అంగుళాలు ఉంటే అప్పుడు నిప్పు వేగంగా వ్యాపిస్తుంది.