
ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం ఎంత ముఖ్యమో, వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవటం కూడా అంతే ముఖ్యం. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, తానేంటో నిరూపించుకుంది లీపాక్షి ఎల్లవాడి. నేడు సెలబ్రిటీలకు ఫేవరెట్ స్టయిలిస్ట్‌గా మారిన ఆమె విశేషాలు..
నిజం చెప్పాలంటే, పదహారేళ్ల నా ఈ కెరీర్‌లో ‘ఐ మేడ్ ఇట్’ అనే క్షణం ఇంకా రాలేదు. కేవలం, కొన్ని క్షణాలు మాత్రమే గర్వంగా అనిపించాయి. కాని, నేను సాధించాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయి. – లీపాక్షి ఎల్లవాడి(Leepakshi Ellawadi)
ఢిల్లీలో పుట్టిపెరిగిన లీపాక్షి ఎల్లవాడి. లండన్‌లో ఫ్యాషన్ కోర్సు చేసి, తిరిగి స్వదేశం వచ్చి, కెరీర్ స్టార్ చేసింది. తొలి అవకాశమే అమితాభ్ బచ్చన్ నటించిన ‘బుడ్ఢా హోగా తేరా బాప్’ సినిమాకు లీపాక్షి కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేసింది. బ్లాక్ అండ్ వైట్‌తో పాటు, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్‌తో మ్యాజిక్ చేసి, అమితాభ్‌ను సూపర్ చార్మింగ్‌గా చూపించి, ప్రశంసలు అందుకుంది. ఇక అప్పటి నుంచి ఆమె వెనుతిరిగి చూడలేదు. వరుస సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తూ, బాలీవుడ్ సెలబ్రిటీలకు ఫేవరెట్ స్టయిలిస్ట్‌గా మారింది.
ఇలా తను మారడానికి కారణం తను ఫాలో అయ్యే ఆ మూడు సూత్రాలేనట.. ‘ఒకటి: కొత్త డిజైనర్లు, స్టయిలిస్ట్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవటం. రెండు: చివరి నిమిషంలో కూడా మార్పులు చేయడానికి కావాల్సిన వనరులతో సిద్ధంగా ఉండటం. మూడు: ట్రెండ్ గేమ్‌ను ఫాలో అవటం’ అని తన సీక్రెట్ ఫార్ములాను వివరించింది లీపాక్షి.
అందుకే, లీపాక్షితో స్టయిలింగ్ చేయించుకోవడానికి చాలామంది స్టార్స్ ఇష్టపడతారు. అమితాభ్‌తోపాటు షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కియారా ఆడ్వాణీ, కార్తిక్ ఆర్యన్, సిద్ధార్థ్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి బాలీవుడ్ స్టార్స్‌కు లీపాక్షీ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment