స్టయిలింగ్‌లో తాన్యా ఘావ్రీతో పోటీ అంటే కొంచెం కష్టమే! శాంపుల్‌కి జాన్వీ కపూర్, అనన్య పాండేలను చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది! అందుకే తాన్యాను ఇండియన్ స్టయిలింగ్ ఇండస్ట్రీ డ్రైవింగ్ ఫోర్స్‌గా కొనియాడుతుంటారు.
తాన్యా ఘావ్రీ.. మాజీ టెస్ట్ క్రికెటర్ కర్షణ్ ఘావ్రీ కూతురు. ముంబైలో పుట్టిపెరిగింది. ఇంటర్ అయిపోయాక.. చాలామంది విద్యార్థుల్లాగే తాన్యా కూడా చదువుల చౌరస్తాలో నిలబడిపోయింది అయోమయంగా.. ఏ దారిన వెళ్లాలో తెలియక! తన బలాబలాలను బేరీజువేసుకుందోసారి. తనకు క్రియేటివ్ బోన్ ఉన్నట్లు అర్థమైంది. అందుకే ఫ్యాషన్ వైపు మళ్లింది. న్యూయార్క్, పార్సన్స్ ఆఫ్ స్కూల్లో ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది.
ఇండియా తిరిగొచ్చాక ఎస్‌ఎన్‌డీటీ (శ్రీమతి నాథీబాయీ దామోదర్ ఠాకర్సీ) యూనివర్సిటీలో దుస్తుల తయారీ డిజైన్‌కి దరఖాస్తు పెట్టుకుంది. ఆ కోర్స్ అయిపోగానే అవకాశాలు క్యూ కడతాయనే ఉద్దేశంతో! కానీ చదువైపోయిన రెండున్నరేళ్లకు వచ్చింది ఒక చాన్స్.. ‘ఆయశా’ అనే హిందీ సినిమాకు అసిస్టెంట్ స్టయిలిస్ట్‌గా! ఆ చిత్రానికి స్టయిలిస్ట్ పర్నియా కురేశీ. ఆమెకు సహకారం అందించడమే తాన్యా పని. దానికి ముందు ఆ రెండున్నరేళ్లు.. ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్‌లో, స్టయిలిస్ట్‌లు అనాయితా ష్రాఫ్, అర్చనా వాలావల్కర్‌లాంటి వాళ్ల దగ్గర ఇంటర్న్‌షిప్ చేసింది.
ఆమె స్టయిలింగ్ జర్నీ మొదలైంది మాత్రం ‘ఆయశా’ సినిమాతోనే! అందులోని కథానాయిక సోనమ్ కపూర్‌కి తాన్యా పనితనం నచ్చింది. తన పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకుంది. తాన్యా స్టయిలింగ్‌తో సోనమ్ ఫ్యాషన్ ఐకాన్ అయింది. అది గమనించిన ఐశ్వర్యా రాయ్ బచన్.. తనకూ స్టయిలింగ్ చేసిపెట్టమని తాన్యాను కోరింది. ఆ అపురూప సౌందర్యరాశికి అప్ టు డేట్ ఫ్యాషన్‌ని టచప్ చేసి.. అక్కాచెల్లెళ్లు కరిష్మా, కరీనా కపూర్ల దృష్టిలో పడింది తాన్యా. వాళ్ల నుంచీ సేమ్ రిక్వెస్ట్ అందుకుంది. ఫిజిక్‌ని బట్టే ఫ్యాషన్, సౌకర్యాన్ని బట్టే స్టయిల్ అని నమ్మే తాన్యా ఆ సూత్రాన్నే అప్లయ్ చేసి కపూర్ సిస్టర్స్ అపియరెన్స్‌నే మార్చేసింది.
వాళ్ల వయసులో చెరో పదేళ్లు తగ్గించేసింది. ఆశ్చర్యపోయింది కరిష్మా, కరీనాల ఆప్తురాలు మలైకా అరోరా! సీక్రేట్ ఏంటని అడిగింది. తాన్యా అడ్రస్ చెప్పారు వాళ్లు. వెళ్లి వాలింది మలైకా! తాన్యాకు మారు మాట్లాడే చాన్స్ ఇవ్వకుండా తన వెంట రమ్మంది. అప్పటి నుంచి మలైకాకూ స్టయిలింగ్ సర్వీస్ ఇవ్వడం మొదలుపెట్టింది తాన్యా. ఆ డిమాండ్‌ను కత్రినా కైఫ్ కూడా గుర్తించింది. ఉఫ్.. ఇలా చెప్పుకుంటూ పోతే మాధురీ దీక్షిత్, సారా అలీఖాన్, జాన్వీ కపూర్, అనన్యా పాండే, దిశా పాట్నీ, శ్రద్ధా కపూర్, కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ఫ్రీదా పింటోలూ చేరి ఆ జాబితా పెరిగిపోతుంది.
తాను ఎస్‌ఎన్‌డీటీలో జాయిన్ అయ్యేముందు ఊహించుకున్నట్టే తనను అవకాశాల వెల్లువ ముంచెత్తుతోంది. ఈ అచీవ్‌మెంట్ వయసు పదిహేనేళ్లు. స్టార్స్‌కి మెరుగులు అద్దుతూనే అంట్రప్రెన్యూర్‌షిప్ గురించీ ఆలోచించింది. పెళ్లిళ్లు, పేరంటాలు, పండగలు, పబ్బాలకు డిజైనర్ దుస్తులను అందించే ‘ధూమ్ ధామ్ వెడ్డింగ్స్’ అనే కంపెనీనీ స్థాపించి అంట్రప్రెన్యూర్‌గానూ మారింది.
"నా వర్క్‌ని రొటీన్‌గా ఎప్పుడూ ఫీలవను. ఏ రోజుకు ఆ రోజు కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చినట్టు భావిస్తాను. అందుకే వర్క్‌ని బాగా ఎంజాయ్ చేస్తాను. నేనెప్పటికీ మరచిపోలేని ఈవెంట్.. ఆస్కార్ పార్టీ కోసం ఫ్రీదా పింటోకి స్టయిల్ చేయడం. నా పర్సనల్ స్టయిల్ విషయానికి వస్తే జీన్స్, స్కర్ట్స్, షర్ట్స్, బ్లౌజెస్.. ఏ డ్రెస్ అయినా నాకు ఓకే. అయితే ఏదైనా ఓవర్ సైజ్డ్ స్టఫ్‌నే ఇష్టపడతా. నేను షార్ట్‌గా ఉంటాను కాబట్టి.. షార్ట్ డ్రెస్‌లు వేసుకుని ఓవర్ సైజ్డ్ షర్ట్‌తో కానీ జాకెట్‌తో కానీ నా హైట్‌ని బ్యాలెన్స్ చేస్తా"! – తాన్యా ఘావ్రీ
Comments
Please login to add a commentAdd a comment