ఈశా అమీన్.. కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టయిలిస్ట్!
స్వస్థలం మంగళూరు అయినా ముంబైలో స్థిరపడిన కుటుంబం ఆమెది. ఇష్టాయిష్టాలు, అభిరుచులు ఏర్పడుతున్న వయసులో ఫ్యాషన్ పట్ల ఆసక్తిని పెంచుకుంది. తగ్గట్టుగానే నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. యూరోపియన్ ఎక్స్‌పోర్ట్ హౌస్‌లో డిజైనర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. అందులో పనిచేస్తున్నప్పుడే డిజైన్‌కి సంబంధించి పలు బ్రాండ్లతో సమావేశమవడానికి తరచుగా యూరప్‌కి ప్రయాణం చేసేది. ఆ సమయంలోనే వివిధ కంపెనీల యాడ్ షూట్స్‌నీ పర్యవేక్షించాల్సి వచ్చేది. అప్పుడే అక్కడ స్టయిలింగ్ ట్రెండ్‌ని గమనించి, అవసరమైనప్పుడు షూట్స్‌లో మోడల్స్‌కి స్టయిలింగ్ కూడా చేసేది. దాంతో స్టయిలింగ్‌నీ కెరీర్‌గా మలచుకోవచ్చనుకుంది. వెంటనే రంగంలోకి దిగింది.
ఓ వైపు డిజైనర్‌గా పనిచేస్తూనే, వీలుచిక్కినప్పుడల్లా స్టయిలింగ్ ప్రాజెక్ట్స్‌నీ తీసుకోవడం స్టార్ట్ చేసింది. అలా ఆమె తొలిసారి స్టయిలింగ్ చేసిన సెలబ్రిటీ.. స్పోర్ట్స్ స్టార్ సానియా మీర్జా. ఓ అవార్డ్ ఫంక్షన్ కోసం సానియాకు స్టయిలింగ్ చేసి గ్లామర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ దృష్టిలో పడింది. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పోటీదారులకు స్టయిలింగ్ చేసే ఆఫర్ వచ్చింది. ఆ అసైన్‌మెంట్‌లో ఉన్నప్పుడే ఫిల్మ్‌ఫేర్, ఫోర్బ్స్, ఫెమినా, స్టార్‌డస్ట్, ఎగ్జిబిట్ లాంటి పత్రికల ముఖచిత్రాల మోడల్స్‌కీ కాస్ట్యూమ్ డిజైన్, స్టయిలింగ్ చేసే చాన్స్ దొరికింది.
ఇక అక్కడి నుంచి ఈశాకు వెనక్కి మళ్లే అగత్యమే రాలేదు. ఆమె పనితీరుకు బాలీవుడ్, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ముచ్చటపడ్డాయి. సింగ్ ఈజ్ బ్లింగ్, ఆదత్, మణిదన్, బోగన్ లాంటి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా ఆమెకు టైటిల్ కార్డ్ ఇచ్చాయి. ఇంకోవైపు ఎండార్స్‌మెంట్స్, అవార్డ్ ఫంక్షన్స్, మ్యారేజ్ ఈవెంట్స్ కోసం సెలబ్రిటీలకు డ్రెస్ డిజైన్‌తో పాటు స్టయిలింగ్ చేసే అవకాశాలూ రాసాగాయి. హెవీ కాస్ట్యూమ్స్, ఊపిరి సలపని యాక్ససరీస్‌తో కాకుండా లైట్ వెయిట్.. కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్, మినిమమ్ యాక్ససరీస్‌తో కంఫర్ట్‌గా ఉండే ఆమె డిజైన్స్ అండ్ స్టయిలింగ్‌కి బాలీవుడ్ తారలు ఇంప్రెస్ అయ్యారు.
కరిశ్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్, ఆలియా భట్, విక్కీ కౌశల్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, లారా దత్తా, బిపాశా బసు, చిత్రాంగదా సింగ్, రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసూజా, నీరజ్ చోప్రా, ఇషాన్ ఖట్టర్, వరుణ్ ధవన్, అమీ జాక్సన్, పూజా హెగ్డే, కార్తిక్ ఆర్యన్, నర్గిస్ ఫఖ్రీ, కల్కి కొచ్లిన్, తమన్నా, రియా చక్రవర్తి, సంజనా సంఘీ, అనుప్రియా గోయెంకా, కరిశ్మా తన్నా లాంటి తారలు ఆమెను తమ డ్రెస్ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకున్నారు. సెలబ్రిటీలకు ఈశా.. స్టయిలింగ్ చేసే కంటే ముందు వాళ్ల వ్యక్తిత్వాన్ని, వాళ్లకున్న ఇమేజ్‌ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.
తర్వాత వాళ్ల శరీరాకృతి, కలర్ టోన్, వాళ్ల వైబ్.. సౌకర్యం వంటివన్నీ పరిశీలించి, తదనుగుణంగానే డ్రెస్ డిజైనింగ్ గానీ.. స్టయిలింగ్ గానీ చేస్తుంది. ఇంత ఎఫర్ట్ పెడుతుంది కాబట్టే సెలబ్రిటీల దృష్టిలో ఆమె పర్‌ఫెక్ట్ స్టయిలిస్ట్ అయింది. తన పనికి ప్రేరణ, స్ఫూర్తి ప్రయాణాలే అని చెబుతుంది. మహిళల కంఫర్ట్ వేర్ కోసం ‘ఈశా అమీన్’ పేరుతోనే ఒక లేబుల్‌ని లాంచ్ చేసింది. లగ్జరీ వెడ్డింగ్ స్టయిల్ కోసం ‘ద స్టయిల్ ఎలివేటర్’ అనే కన్సల్టెన్సీనీ స్థాపించింది. పెటా వీగన్ ఫ్యాషన్ క్యాంపెయిన్‌లో పాల్గొన్న ఏకైక ఇండియన్ స్టయిలిస్ట్‌గా గౌరవం దక్కించుకుంది.
స్టయిల్ అంటే నా దృష్టిలో ఒక ఫామ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. సెలబ్రిటీస్‌లో సైఫ్ అలీ ఖాన్‌కి స్టయిలింగ్ చేయడాన్ని చాలా ఇష్టపడతాను. ఆయనతో వర్క్ అంటే భలే సరదాగా ఉంటుంది. సైఫ్.. క్లాసియెస్ట్ అండ్ నైసెస్ట్ పర్సన్!
– ఈశా అమీన్
Comments
Please login to add a commentAdd a comment