సావియో జాన్ పరేరా.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హెయిర్ స్టయిలిస్ట్. బాలీవుడ్ స్టార్స్, స్పోర్ట్స్ లెజెండ్స్ జుట్టు ఆయన చేతుల్లోనే ఉంటుంది. సినిమా ప్రమోషన్, అవార్డ్ ఫంక్షన్, రెడ్ కార్పెట్ వాక్.. ఏ ఈవెంట్‌కైనా.. సావియో వచ్చి సెలబ్రిటీల కొప్పు ముడిస్తేనే వాళ్లు గడప దాటేది! అంతెందుకు ఇంగ్లిష్ యాక్ట్రెస్ లిజ్ హార్లీ.. తన పెళ్లిలో కేశాలంకరణకు ఏరికోరి మరీ సావియో జాన్‌నే అపాయింట్ చేసుకుంది! అదీ ఈ ముంబై వాసి రెప్యుటేషన్!!
హెయిర్ డ్రెసింగ్‌లో సావియోది దాదాపు ముప్పై ఏళ్ల అనుభవం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ హెయిర్ డ్రెసర్స్, హెయిర్ స్టయిలిస్ట్‌లు అందరి దగ్గరా శిక్షణ పొంది వచ్చాడు. నైపుణ్యం సాధించాడు. హెయిర్ సెలూన్స్ పెట్టాడు. ఫ్యాషన్ షోస్‌కి, అడ్వర్టయిజ్‌మెంట్ క్యాంపెయిన్స్‌కి, ఎల్, వోగ్, హార్పర్స్ బజార్, కాస్మోపాలిటన్ లాంటి మేగజీన్స్ ఫొటో షూట్స్‌కి పనిచేశాడు. బాంబే టైమ్స్, హిందుస్తాన్ టైమ్స్, మిడ్–డే, ముంబై మిర్రర్, సినీ బ్లిట్జ్ వంటి పత్రికలకు కాలమ్స్ రాస్తుంటాడు. జూమ్, ఎన్‌డీటీవీ గుడ్ టైమ్స్ వంటి చానల్స్‌కీ పానలిస్ట్‌గా ఉన్నాడు.
ఎన్నో బ్యూటీ కాంటెస్ట్‌లకు జడ్జిగా వ్యవహరించాడు. ఎన్నో బాలీవుడ్ చిత్రాలకు హెయిర్ డ్రెసర్‌గా పనిచేశాడు. ప్రియంకా చోప్రా, ప్రీతి జింటా, కంగనా రనౌత్, సోనాక్షీ సిన్హా, శిల్పా శెట్టీ, నేహా ధూపియా, అదితీరావ్ హైదరీ, డింపుల్ కపాడియా, మేరీ కోమ్, ఇంతియాజ్ అలీ, యువరాజ్ సింగ్ లాంటి సెలబ్రిటీలకు పర్సనల్ హెయిర్ డ్రెసర్‌గా ఉన్నాడు. హెయిర్ డ్రెసింగ్‌లో మెలకువలు సంపాదించుకోవాలనుకునేవాళ్ల కోసం ‘సావియో జాన్ పరేరా.. ది అకాడమీ’నీ నెలకొల్పాడు. జాతీయ, అంతర్జాతీయ అవార్డులెన్నో గెలుచుకున్నాడు.
‘నాకు పనే దైవం. అందులో నిత్యం ఏదో కొత్తదనాన్ని చూపించడానికి ఇష్టపడతాను. నా క్లయింట్స్ కాన్ఫిడెన్స్‌ను పెంచే స్టయిల్స్‌ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తుంటా. స్టయిల్ అనేది వ్యక్తిగతం. పరిశీలన, మెలకువలతో ఎవరికివారే తమదైన సిగ్నేచర్ స్టయిల్‌ని క్రియేట్ చేసుకోవాలి. అలాంటి సృజనకు ఆకాశం కూడా హద్దు కాదు. స్టయిల్ అనేది ఒక ఐడెంటిటీ. అది వ్యక్తిత్వాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది’ అంటాడు
సావియో జాన్ పరేరా.
Comments
Please login to add a commentAdd a comment