సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అకాలవర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. మూడు రోజుల వ్యవధిలో కురిసిన వర్షాలు రైతులకు విషాదాన్ని మిగిల్చాయి. ఎడతెరిపిలేకుండా కురిసిన వానలు.. వడగళ్లతో జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గాలి వానలతో మామిడితోటలు దారుణంగా దెబ్బతిన్నాయి. కోతకొచ్చిన వరి, కొద్దిరోజుల్లో చేతికిరావాల్సిన మామిడి వాన బారిన పడింది.
ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లావ్యాప్తంగా 4,910 ఎకరాల విస్తీర్ణంలో పంటలకు నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనాలు రూపొందించిన జిల్లా యంత్రాంగం నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. జిల్లాలోని 14 మండలాల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు రూ.కోట్లలో పంటనష్టం సంభవించిందని లెక్క తేల్చింది. యాచారం, మొయినాబాద్, కందుకూరు, కీసర, ఘట్‌కేసర్, మంచాల, హయత్‌నగర్ మండలాల్లో వరి పైరు నేలకొరిగినట్లు
వ్యవసాయాధికారులు అంచనాలు వేశారు. జిల్లాలో కూరగాయలు, ఉద్యానతోటలు అకాల వర్షాలకు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పూలు, పండ్ల తోటలు తుడుచుకుపోయాయి. చేవెళ్ల ప్రాంతంలో కూరగాయలు, పూల తోటలకు భారీగా నష్టం చేకూరింది. 116 హెక్టార్ల విస్తీర్ణంలో కూరగాయ పంటలు నీటిపాలు కావడం రైతాంగాన్ని కుంగదీశాయి. జిల్లావ్యాప్తంగా దాదాపు 5,052.80 హెక్టార్ల విస్తీర్ణంలో పండ్లు, కూరగాయ తోటలు 50శాతానికి పైగా దెబ్బతిన్నట్లు నిర్ధారించిన అధికారులు.. 448.20 హెక్టార్లలో 50శాతం లోపు నష్టం వాటిల్లినట్లు తేల్చారు. అకాల వర్షాలకు 1,201 మంది పూలు, కూరగాయ రైతులు నష్టపోయినట్లు ఉద్యాన శాఖ అధికారులు గుర్తించారు.
యాచారం, కీసర, శామీర్‌పేట, మేడ్చల్ తదితర మండలాల్లో వర్షానికంటే వడగళ్లు భారీగా పడడం అన్నదాతల్లో విషాదాన్ని మిగిల్చింది. పంటల నష్టంపై అంచనాలు రూపొందించినప్పటికీ, కుండపోత వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు సంబంధించిన నష్టం అంచనాలను పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖలు ఇంకా తయారు చేయలేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చెరువుల పునరుద్ధరణ (మిషన్ కాకతీయ) పనులు వర్షాలతో అర్ధంతరంగా నిలిచిపోయాయి.
ప్రతిపాదిత చెరువుల్లోకి వర్షపు నీరు చేరడంతో పనులు ఆగిపోయాయి. వర్షం తెరిపిఇస్తే కానీ ఇవి ప్రారంభమమ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఇదిలావుండగా శంకర్‌పల్లిలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను బుధవారం రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి పరిశీలించారు.
తీరని నష్టం!
Published Wed, Apr 15 2015 11:56 PM | Last Updated on Thu, May 24 2018 1:55 PM
Advertisement
Advertisement