సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రభుత్వ ప్రోత్సాహంతో అంతరపంటగా మెట్ట ప్రాంతంలో ప్రారంభమైన కోకో సాగు ప్రస్థానం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధాన పంటగా మారింది. ఆయిల్‌పామ్, కొబ్బరికి అంతరపంటగా రైతుకు రెట్టింపు ఆదాయం కోసం ప్రభుత్వం కోకో సాగును ప్రోత్సహిస్తుంది. అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉండటం, సాగు నిర్వహణ తక్కువగా ఉండటం, సాగుకు సంబంధించి మొదటి మూడేళ్లు ప్రభుత్వ ప్రోత్సాహం ఉండడంతో జిల్లాలో కోకో సాగు గణనీయంగా పెరుగుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా 39,714 హెక్టార్లల్లో కోకో సాగు ఉండగా కేవలం ఏలూరు జిల్లాలోని 4 మండలాల్లోనే 14,364 హెక్టార్లలో కోకో సాగవుతుండడం విశేషం. 1990లో పశ్చిమగోదావరి జిల్లాకు పరిచయమైన కోకో సాగు ఏటా క్రమేపీ పెరుగుతూ వస్తుంది. అత్యధికంగా ఏలూరు జిల్లాలో వెయ్యి హెక్టార్లు సాగు చేయనున్నారు.
ఆయిల్‌పామ్ తరహాలోనే కోకో మొక్కలు కూడా కంపెనీల ద్వారానే రైతులకు పంపిణీ చేసి మొదటి మూడేళ్లు ప్రభుత్వమే నిర్వహణ ఖర్చులు చెల్లిస్తుండడం, అంతరపంటగా మంచి డిమాండ్ ఉండడంతో సాగు విస్తీర్ణంపై జిల్లాలో రైతులు ఆసక్తి చూపుతున్నారు. సౌత్ ఆఫ్రికాకు చెందిన కోకోను 1990లో కేంద్ర ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ కాజునట్ అండ్ కోకో డెవలప్‌మెంట్ ద్వారా దేశానికి పరిచయం చేసింది.
ప్రస్తుతం ఏలూరు జిల్లాలో మాండలీజ్ కంపెనీ ద్వారా జిల్లాలో కోకో సాగుకు సంబంధించి మొక్కలు సరఫరా చేస్తున్నారు. కొబ్బరి, ఆయిల్‌పామ్‌లో అంతరపంటగా ఎకరాకు సగటున రూ.80 వేల వరకు ఆదాయం సమకూరుతుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో దిగుబడి అత్యధికంగా ఉంది. అంతరపంటగా ఉన్నప్పటికీ మొక్కలకు సబ్సిడీలు, మొదటి మూడేళ్ల నిర్వహణ ఖర్చులు ప్రభుత్వం ఇస్తుండటం అలాగే 4వ సంవత్సరం నుంచి 30 ఏళ్ల వరకు మంచి దిగుబడి ఇస్తుండడంతో సాగుకు డిమాండ్ పెరిగింది.
చాక్లెట్ల తయారీలో కీలకం
ప్రధానంగా కోకోను చాక్లెట్ల తయారీలో వినియోగిస్తుంటారు. జిల్లాలో మాండలీజ్ కంపెనీ కోకోను కొనుగోలు చేసి తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ యూనిట్‌లో చాక్లెట్ల తయారీలో వినియోగిస్తున్నారు. దాదాపు 8 ప్రధాన కంపెనీలకు సంబంధించి 50కు పైగా రకాల చాక్లెట్లలో కోకోను అధికంగా వినియోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా ప్రోత్సహిస్తుంది.
దేశంలో ఏపీ నంబర్‌వన్
కోకో సాగులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఏపీలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు మొదటి స్థానంలో ఉన్నాయి. రాష్ట్రంలో 39,714 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న కోకో సాగు ఏటా సగటున 10,903.20 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. తమిళనాడులో 32,080 హెక్టార్లలో 2,802.45 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. అలాగే కేరళ రాష్ట్రంలో 17,366 హెక్టార్లలో సాగు జరుగుతుండగా 9,647.40 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది.
అలాగే కర్ణాటకలో 14,216 హెక్టార్లలో 3,719.10 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుంది. రాష్ట్రంలో హెక్టారుకు సగటున 950 కిలోలు, తమిళనాడులో 350 కిలోలు, కర్ణాటకలో 525, కేరళలో 850 కిలోలు దిగుబడి వస్తుంది. దేశ వ్యాప్తంగా 4 దక్షిణాది రాష్ట్రాల్లో 97,563 హెక్టార్లలో కోకో సాగు విస్తీర్ణం ఉండగా ప్రతి ఏటా 2,07,072.15 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం కిలో ధర రూ.205గా ఉంది.
అంతరపంటగా ప్రోత్సాహం
కొబ్బరి, ఆయిల్‌పామ్‌లో అంతరపంటగా కోకో బాగా ఉపయుక్తంగా ఉండడంతో ఉద్యానశాఖ ద్వారా పభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో అత్యధికంగా సాగు విస్తీర్ణం ఉంది.
– ఎ.దుర్గేష్, ఉద్యానశాఖ ఇన్‌చార్జి డిప్యూటీ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment