గొంపకొండ వద్ద లభించిన యలమంచిలి చాణుక్యుల శాసనం
సాక్షి, అమరావతి: కాకినాడ జిల్లా తుని సమీపంలోని గొంపకొండ వద్ద క్రీస్తు శకం 12వ శతాబ్దం నాటి చారిత్రక ఆనవాళ్లు బయపడ్డాయి. గతంలో రైతులు పొలాలను చదును చేస్తుండగా.. రాతి కుండలు, ప్రమిదలు, శిలాఫలకాలు బయటపడ్డాయి. కొండవాలున ఉన్న ఇక్కడి జీడి, మామిడి తోటల్లో వెలుగుచూసిన ఈ శిథిలాలను సాధారణ రాళ్లుగా భావించి చెల్లాచెదురుగా పడేశారు. నాటి రాతి తొట్టెలను అక్కడి రైతులు ఇప్పటికీ వినియోగిస్తుండటం విశేషం.
తుప్పలు, డొంకల్లో పడివున్న ఆ శిథిలాలను ‘సాక్షి’ ప్రతినిధి పరిశీలించగా.. అవి ఓ ఆలయానికి చెందిన శిల్ప చెక్కడాలుగా తేలాయి. అక్కడే పురాతన ఇటుకలు, గుడి శిథిలాలు, రాతి శాసనాలు సైతం బయల్పడ్డాయి. వాటిని సేకరించి పురావస్తు శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసిన నిపుణుడికి పంపించగా.. అవి యలమంచిలి చాళుక్యుల కాలం నాటివని తేల్చారు. గుడి, ఇటుకలు, విగ్రహాలు క్రీ.శ. 800 సంవత్సరం నాటివని, తెలుగు శాసనాలు 1240 సంవత్సరం నాటివని గుర్తించారు.
మట్టిలో 1200 ఏళ్ల నాటి గుడి
తుని–నర్సీపట్నం మార్గంలో తుని నుంచి 12 కి.మీ. వెళితే.. (కోటనందూరుకు 2 కి.మీ. దూరంలో) గొంపకొండ ఉంది. కొండను ఆనుకుని జీడి, మామిడి తోటలున్నాయి. రోడ్డును ఆనుకుని ఉన్న ఓ దేవత విగ్రహం (గొంప తల్లిగా పిలుస్తారు) ఉంది. స్థానికంగా మరికొన్ని విగ్రహాలు, శాసనాలు కూడా ఉన్నట్టు స్థానికులు చెప్పారు. అక్కడికెళ్లి పరిశీలించగా.. అద్భుతమైన రాతి కట్టడాలు విరిగిపోయి, మట్టిలో కూరుకుపోయాయి. రాయిని తొలిచి చేసిన నీటి తొట్టెలని రైతులు ఇప్పటికీ వినియోగిస్తున్నారు.
ఈ ప్రాంతంలో గతంలో పట్టణం ఉండేదని, అగ్ని ప్రమాదం లేదా మశూచి వంటి భయంకరమైన వ్యాధితో ప్రజలు వలసపోయి ఉంటారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడి ఆలయం నిరాదరణకు గురై ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. అనంతర కాలంలో ఈ ప్రాంతంలో పొలం పనులు చేపట్టిన రైతులు గుడి రాళ్లను సరిహద్దు కంచెగా మార్చుకున్నారు. తవ్వకాల్లో దొరికిన విగ్రహాలను స్థానిక దేవతలుగా పూజిస్తున్నారు.
తవ్వకాల్లో తెలుగు లిపితో ఉన్న శాసనాలు, పద్మాలు చెక్కిన స్తంభాలు, వివిధ ఆకృతుల్లో ఉన్న రాతి ఫలకాలు, విష్ణుమూర్తి విగ్రహం, మహిషాసురమర్దని, భైరవ శిల్పాలు బయటపడ్డాయి. ఈ శిల్ప సంపద సుమారు క్రీ.శ 800 నుంచి 1240 సంవత్సరాల మధ్య విలసిల్లిన ఆలయానికి చెందినదని పురావస్తు నిపుణులు గుర్తించారు. యలమంచిలి చాళుక్యుల పాలనా కాలంలో ఈ ప్రాంతంలో ‘జననాథపట్నం’ అనే పట్టణం ఉండేదని.. తర్వాత ఇక్కడి ప్రజలు వలసపోయినట్టు చెబుతున్నారు.
ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లలేని వారు మాత్రం సమీపంలోనే ‘జగన్నాథపురం’ అనే గ్రామాన్ని నిర్మించుకోగా.. ఇప్పటికీ అదే పేరుతో చలామణిలో ఉంది. కాగా, ఇక్కడ లభించిన భైరవ, విష్ణు విగ్రహాలను సైతం స్థానికులు స్త్రీ మూర్తులుగా కొలవడం గమనార్హం. ఇక్కడ లభించిన విగ్రహాలు, శాసనాలు, కట్టడాలను పురావస్తు పరిశోధకులు పరిశీలన జరపడం ద్వారా గత చరిత్రను వెలికి తీయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
ఆనవాళ్లు నివ్వెర పరుస్తున్నాయి
అడవిని తలపిస్తున్న ఈ ప్రాంతంలో ఇంత గొప్ప చారిత్రక సంపద ఉందంటే ఆశ్చర్యకరంగా ఉంది. శిల్పాలను పరిశీలిస్తే క్రీ.శ. 800 సంవత్సరం నాటివని తెలుస్తోంది. తెలుగు శాసనాలు క్రీ.శ. 1200–40 నాటివిగా భావిస్తున్నాం. ఇటుకలు 40 గీ30 గీ6 సెం.మీ. వ్యాసార్ధంలో ఉన్నాయి. రాయిని తొలిచి చేసిన నీటి తొట్టె (గోలెం) కూడా ఓ అద్భుతమనే చెప్పొచ్చు.
మహిషాన్ని ఎడమ కాలితో తొక్కుతూ, శూలంతో గుచ్చుతూ, ఖడ్గంతో నరుకుతున్న మహిషాసురమర్దిని శిల్పం, వింజడలు, కపాల మాల, ఢమరుకం, ఖడ్గం, శూలం, పాత్ర ధరించి నగ్నంగా ఉన్న భైరవ శిల్పం కనిపిస్తున్నాయి. ఇవి క్రీ.శ. 9–12 శతాబ్దాలలో యలమంచిలి చాళుక్యుల శైలిని తెలియజేస్తున్నాయి. ఇక్కడ లభించిన మరో అద్భుతం శాసనం. ఇందులో లిపి తెలుగును పోలి ఉన్నప్పటికీ తెలుగు కాదు. ఇక్కడ మరింత లోతుగా పరిశోధనలు చేస్తే గొప్ప సంస్కృతి బయటపడే అవకాశం ఉంది.
– డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో
Comments
Please login to add a commentAdd a comment