water conservation
-
అడుగు అడుగులోనూ నీటి పొదుపు!
ఒకవైపు వర్షాభావం... మరోవైపు అడుగంటిన భూగర్భ జలాలు... వచ్చేసిన వేసవి. ఇంకా రెండు మూడు నెలలు గడవాలి ఈ వేసవిలో నీరు ముఖ్యం. బెంగళూరు ఇప్పటికే అనుభవిస్తోంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తక్కువ నీటితో బాగానే ఉండొచ్చు అని బెంగళూరు డాక్టర్ దివ్యాశర్మ రాసిన ‘ఎక్స్’ పోస్టు వైరల్ అయ్యింది. అది అందరికీ శిరోధార్యం. ఆమె చేసిన నీటి పొదుపు సూచనలు. ఎక్కడ నీటి ట్యాంకర్లు కనిపించవో, ఎక్కడ స్త్రీలు కుళాయిల దగ్గర ప్లాస్టిక్ బిందెలతో తగాదాలు పడరో, ఎక్కడ పల్లెటూరి మనుషులు నెత్తిన కడవలతో మైళ్లకు మైళ్లు నడవరో, ఎక్కడ ప్రతి ఇంటిలో అవసరమైన నీరు అందుబాటులో ఉంటుందో అదే సుభిక్షితమైన ప్రాంతం. ‘ఎడతెగక పారే ఏరు’ లేని ఊరిని చప్పున వదిలిపెట్టమన్నాడు సుమతీ శతకకారుడు. నీరు జీవనాధారం. నీరు నిత్యావసరం. కాని నేటికీ తాగునీళ్లు అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. దానికి తోడు కరువు పరిస్థితి తోడైతే... వేసవి వచ్చిపడితే? స్త్రీలదే భారం నీటి సమస్య ఎప్పుడూ స్త్రీల సమస్య. ఇంట్లో ఉండేది స్త్రీలు, ఇంటి పనులకు నీటిని ఉపయోగించాల్సిన వారు స్త్రీలు కనుక నీటి బెంగ స్త్రీలదే. పురుషుడు తాను ‘బయట సంపాదించాలి కాబట్టి’ ఇంట్లో ఉండే స్త్రీ నీటి బాధలు పడాల్సిందే అనే భావజాలం ఇంకా పోలేదు. నీటి బాధల్లో చేయూతనిచ్చే పురుషులు ఉన్నా అధికశాతం స్త్రీలే ఈ బాధలు పడతారు. ఇంట్లో నీళ్లు లేకపోతే పురుషుడి చేత తిట్లు తింటారు. నీళ్లు తేవడంలో పిల్లల సాయం అందకపోతే నడుములు విరగ్గొట్టుకునేలా నీరు మోస్తారు. ప్రస్తుతం రెండు పనులు తప్పక జరగాలి. 1. నీటి సమస్య ఇంట్లో తీర్చడానికి పురుషుడు సమాన భాగస్వామ్యం వహించేలా చైతన్యపరచడం. 2. ప్రతి ఇంట్లో నీటి పొదుపు కోసం ప్రతి కుటుంబ సభ్యుడు చైతన్యవంతం కావడం. నీరు వృథా చేయడం అంటే? కొందరు ఉంటారు... సింక్ దగ్గర నిలబడి ట్యాప్ తిప్పి బ్రష్ చేయడం మొదలెడతారు. ఇక బ్రషింగ్ అవుతున్నంత సేపు ట్యాప్ నుంచి నీరు వృథా కావాల్సిందే. మరికొందరు బాత్రూమ్ ఫ్లోర్ మీద రోజుకు రెండు ఫుల్ బకెట్లు కుమ్మరిస్తారు శుభ్రత కోసం. మరికొందరు సగం బకెటు స్నానం చేసి మిగిలిన సగాన్ని వృథాగా వదిలేస్తారు. ఆ తర్వాత వచ్చిన కుటుంబ సభ్యులు ఆ నీరు స్నానానికి వాడలేక కమోడ్‌లో పారబోస్తారు. మరికొందరు టాయిలెట్ మీద కూచుని ఏమీ తోచక స్ప్రే గన్ చేత పట్టి నీటిని ప్రెస్ చేస్తూ ఆటలాడుతూ ఉంటారు. మరికొందరు రోజుకు రెండు సార్లు షవర్ తిప్పి ఆరాముగా స్నానం చేస్తారు. మరికొందరు గిన్నెలు కడుగుతున్నంత సేపు వాష్ ఏరియాలో ట్యాప్ తిప్పే ఉంచుతారు. ఇంకొందరు కిచెన్ సింక్‌లో చిన్న గ్లాస్ కడగాలన్నా ట్యాప్ తిప్పి అర బకెట్ నీళ్లు సింక్‌లో వృథాగా పోనిస్తారు. ఇక ఉతికిన బట్టలను మూడుసార్లు జాడించేవారు ఇంకొందరు. ఒక్క నీటిబొట్టు కూడా సృష్టించలేని మనకు ఇన్ని నీళ్లు వృథా చేసే హక్కు లేదు. పొదుపే మిగులు నీళ్లు ఎక్కువ కావాలనుకుంటే తక్కువ ఖర్చు చేయాలి. అప్పుడు తక్కువ ఉన్నా ఎక్కువ అనిపిస్తాయి. ఇప్పుడు బెంగళూరు నగరం నీటి కరువుతో ఇబ్బందులు పడుతోంది. నీరు వృథా చేసేవారికి జరిమానాలు విధిస్తున్నారు. నీరు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలో అక్కడి డెర్మటాలజిస్ట్ డాక్టర్ శర్మ ఇటీవల ‘ఎక్స్’ (ట్విటర్)లో రాసిన పొదుపు పోస్ట్ అందరికీ నచ్చింది. ‘మాకు నీళ్లు సమృద్ధి ఎప్పుడూ. కాని మేము నీటిని పొదుపుగా వాడతాము. రొటీన్‌కు ఏ భంగం కలగకుండా నీటిని పొదుపుగా వాడొచ్చు’ అని పొదుపు చిట్కాలు చెప్పిందామె. ఇవీ ఆ పొదుపు చిట్కాలు ► బాత్రూమ్స్లో షవర్స్ బంద్ చేయాలి. బకెట్లో పట్టుకుని స్నానం చేయాలి. షవర్లో చాలా నీళ్లు వృథా అవుతాయి. పైగా ఎక్కువ సేపు నీళ్లలో నానడం కూడా చర్మానికి మంచిది కాదు. కొందరు రోజుకు రెండుసార్లు స్నానం చేస్తారు. ఒకసారి స్నానం వల్ల లోటేం జరగదు. ► ట్యాప్‌లకు ఎరీటర్లు బిగించాలి. ట్యాప్‌లు తిప్పితే నీళ్లు భళ్లున వస్తాయి. వృ«థా అవుతాయి. అదే అన్ని ట్యాప్‌లకు ఎరీటర్లు (చిల్లుల పరికరం) బిగిస్తే నీళ్లు జల్లుగా పడతాయి. పొదుపు అవుతాయి. ముఖ్యంగా అంట్లు తోమేప్పుడు చాలా నీళ్లు పొదుపు అవుతాయి. ► ఆర్ఓల నుంచి ఫిల్టర్ సమయంలో వృథాగా పోయే నీటిని పట్టి మొక్కలకు పోయాలి. మాప్ పెట్టడానికి ఉపయోగించాలి. Ü వాషింగ్ మిషన్‌ను ఒకటీ అరా బట్టల కోసం కాకుండా ఫుల్‌లోడ్‌తో ఉపయోగించాలి. ► కార్ వాషింగ్‌కు నీటిని వృథా చేయకుండా తడి బట్టతో తుడుచుకోవాలి. ► డిష్ వాషర్ ఉపయోగించడం వల్ల నీళ్ళు తక్కువ ఖర్చు అవుతాయి. అంట్లు తోమితే 60 లీటర్ల నీళ్లు కనీసం పడతాయి. డిష్ వాషర్లో 10 లీటర్లు సరిపోతాయి. ► ప్లంబర్ని పిలిచి అన్నీ లీకులను చెక్ చేయించాలి. ► పిల్లలకు నీటి విలువ తెలియచెప్పి నీళ్లు వృ«థా చేయకుండా చూడాలి. -
బెంగళూరు దాహార్తి!
దేశంలో నీటి ఎద్దడి నిత్యజీవిత వ్యథగా పరిణమించి చాలా కాలమైంది. అది స్థలకాలాదులను అధిగమించింది. దాని బారిన పడని నగరమంటూ లేదు. బెంగళూరు దాహార్తి అందులో భాగమే. అది జనాభారీత్యా దేశంలో మూడో అతి పెద్ద నగరం. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో అది దేశానికే ఐటీ రాజధాని. కానీ తాగటానికి గుక్కెడు నీళ్లు కరువైతే ఆ భుజకీర్తులన్నీ దేనికి పనికొస్తాయి? 500 ఏళ్లనాటి ఆ నగరం గొంతెండి నీళ్ల కోసం అలమటిస్తోంది. టెకీలంతా నగరాన్నొదిలి స్వస్థలాల నుంచి పనిచేయటం మొదలుపెట్టారు. అపార్ట్మెంట్లన్నీ బేల చూపులు చూస్తున్నాయి. కోచింగ్ సెంటర్లు ఆన్లైన్ క్లాసులకు మళ్లాయి. రోడ్డుపై పోయే నీటి ట్యాంకర్ల వెనక జనం పరుగు లెడుతున్నారు. ఇది పరీక్షల కాలమైనా విద్యార్థులకు నీటి అన్వేషణ ముఖ్యమైపోయింది. కావేరి పరివాహ ప్రాంతాన్ని కరువు కాటేయటంతో నగరానికి వచ్చే నీరు తగ్గింది. భూగర్భ జలాలు అడుగంటాయి. మార్చి నెలాఖరుకు రావాల్సిన ఉష్ణోగ్రతలు బెంగళూరును ఫిబ్రవరి మూడోవారంలోనే పలకరించాయి. కోటిన్నర జనాభాగల ఆ నగరంలో వాల్‌మార్ట్ మొదలుకొని గూగుల్ వరకూ ఎన్నో అంతర్జాతీయ సంస్థలున్నాయి. ఇవిగాక బోలెడు స్టార్టప్‌లు కొలువుదీరాయి. బెంగళూరుకు సగటున రోజుకు కనీసం 185 కోట్ల లీటర్ల నీరు లభిస్తుండగా కనీసం మరో 168 కోట్ల లీటర్లు అవసరమని అంచనా. కానీ ఎక్కడుంది లభ్యత? ఇది దిక్కుతోచని స్థితి. ఆరా తీస్తే బెంగళూరు నగరానిది కూడా దేశంలోని అన్ని నగరాల వ్యథే. మౌలిక సదుపాయాల కల్పనపై కనీస స్థాయి దృష్టిపెట్టకుండా దశాబ్దాలుగా అభివృద్ధిని కేంద్రీకరించిన పర్యవసానమే ప్రస్తుత కష్టాలకు మూలకారణం. అభివృద్ధి పేరు చెప్పి వెనకా ముందూ చూడకుండా హరిత ప్రాంతాలను హరించటంవల్ల వర్షాలు గణనీయంగా తగ్గాయి. పెరుగుతున్న జనాభా పేరు చెప్పి ఆవాసప్రాంతాలను విస్తరించటం, అందుకోసం చెరువులనూ, సరస్సులనూ మాయం చేయటం అలవాటైపోయింది. 1961 నాటికి బెంగళూరు నగర పరిసరాల్లో 262 సరస్సులుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 81కి పడిపోయింది. వాస్తవానికి ఆ సరస్సుల్లో ఇప్పటికీ జీవంతో వున్నవి కేవలం 33 మాత్రమే. జనావాసాలకు అననుకూల ప్రాంతాల్లో వుండటంవల్లే ఇవి బతికిపోయాయి. మిగిలినవి పేరుకు సరస్సులుగా వున్నా వాటిలో చుక్క నీరు కూడా కనబడదు. ఇంకా దారుణం... ఇప్పుడున్న సరస్సుల్లో 90 శాతం కాలుష్యం కారణంగా పనికిరాకపోవచ్చని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనంలో తేలింది. లీటర్ నీటిలో కనీసం 4 మిల్లీగ్రాముల ఆక్సిజన్ వుంటేనే ఆ నీరు మెరుగ్గా వున్నట్టు లెక్క. కానీ అంతకన్నా తక్కువ స్థాయిలో ఆక్సిజన్ వున్నదని నిపుణులు తేల్చారు. ఎన్నడో 1971లో ఇరాన్‌లోని రాంసర్లో నీటి వనరుల సంరక్షణపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో కుదిరిన ఒడంబడికపై సంతకం చేసిన దేశాల్లో భారత్ కూడావుంది. కానీ దానికి అనుగుణంగా శ్రద్ధాసక్తులు కనబరిచిన దాఖలా లేదు. 2030 నాటికి నీటి అవసరాలు రెట్టింపవుతాయని నీతి ఆయోగ్ నివేదిక 2018లో చెప్పింది. మన దేశంలో కేవలం రక్షిత మంచినీరు అందక ఏటా 2 లక్షలమంది మరణిస్తున్నారని వివరించింది. అంతకు రెండేళ్లముందు దక్షిణ కన్నడ జిల్లాలోని మూద్బిద్రీలో సరస్సులపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. హరిత ఆచ్ఛాదనగా వున్న పట్టణ అడవులు, తడి నేలలు వగైరాలను పట్టణీకరణ కోసం మూడు దశాబ్దాలుగా డీ నోటిఫై చేస్తున్నారనీ, ఇది బెంగళూరుకు ముప్పు కలిగిస్తుందనీ సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. కానీ ఏళ్లు గడు స్తున్నకొద్దీ ఆ ధోరణి మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. అసలు పట్టణీకరణలో స్థానిక జీవావరణం, పర్యావరణం, నీటి లభ్యత వగైరాలకు చోటేలేదు. వాటిపై ఎలాంటి అధ్యయనమూ లేదు. కేంద్రీకృత అభివృద్ధి వల్ల జనాభా అనేక రెట్లు పెరగటం, దాంతోపాటే మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్థం కావటం తరచు కనబడుతున్న వాస్తవం. స్థానికంగా వుండే చెరువులు, సరస్సులు వగైరాల్లో మురుగు నీరు విడిచిపెట్టే దురలవాటుతో అటు నీటి వనరులూ నాశనమవుతున్నాయి, ఇటు భూగర్భ జలాలు సైతం కాలుష్యం బారిన పడుతున్నాయి. నగరాలు నేల చూపులు విడిచిపెడుతున్న తీరు ఆందోళనకరం. నేల విడిచి ఆకాశంలోకి దూసుకుపోయే నగరాలకు చుక్కలు కనబడటం ఖాయమని కేప్‌టౌన్ అనుభవాలు ఆరేళ్ల క్రితమే చెప్పాయి. దక్షిణ అట్లాంటిక్ సముద్ర తీరాన దక్షిణాఫ్రికాలో వున్న ఆ నగరంలో కళ్లు చెదిరే స్థాయిలో భారీ భవంతులు దర్శనమిస్తాయి. ప్రపంచం నలుమూలల నుంచీ తరలివచ్చే వినియోగ వస్తువులతో అక్కడి మహా దుకాణాలు మెరిసిపోతుంటాయి. ఏటా కనీసం 20 లక్షలమంది ఆ నగర అందచందాల్ని చూడటానికి తరలివస్తారని అంచనా. 46 లక్షల జనాభాగల ఆ నగరం 2018లో నీటి సంక్షోభంలో చిక్కుకుని గుడ్లు తేలేసింది. ఇళ్లకూ, దుకాణ సముదాయాలకూ, కార్యాలయాలకూ నీటి సరఫరాను పూర్తిగా నిలిపేసింది. 200 నీటి కేంద్రాలవద్ద రోజుకు మనిషికి 25 లీటర్ల నీరిస్తామని అన్ని అవసరాలనూ దాంతోనే తీర్చుకోవాలని ప్రకటించింది. నీటి సంరక్షణను ఒక సంస్కృతిగా మార్చుకుని ఇప్పుడిప్పుడే కుదుటపడటం మొదలెట్టింది. కేప్‌టౌన్ కష్టాలూ, వాటిని ఆ నగరం అధిగమించిన తీరూ అధ్యయనం చేయటం ఒక్క బెంగళూరుకు మాత్రమే కాదు... అన్ని మెట్రొపాలిటన్ నగరాలకూ తక్షణావసరం. నీటి వృథాను, నష్టాలను అరికట్టడంలో... కాలాను గుణమైన ప్రణాళికల రూపకల్పనలో స్థానిక సంస్థల చొరవను పెంచితేనే ఈ సమస్యను అధిగమించగలమని పాలకులు గుర్తించటం మంచిది. -
జల సంరక్షణతోనే భవిష్యత్తుకు భరోసా
సాక్షి, న్యూఢిల్లీ: నీటిని కాపాడుకోవడం ద్వారానే భవిష్యత్తును కాపాడుకోగలమని, అప్పుడే అందరం కలసికట్టుగా జీవించగలుగుతామని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. జల సంరక్షణ రోజువారీ జీవితంలో అంతర్భాగం కావాలని, నీటి సంరక్షణకు ప్రాధాన్యమివ్వడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఉదాహరణగా నిలవాలని ఆయన ప్రజాప్రతినిధులకు, పౌరులకు పిలుపునిచ్చారు. నీటి వనరుల నిర్వహణపై సమగ్ర విధానాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర జలశక్తి శాఖ జాతీయ జల అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు 4వ జాతీయ జల అవార్డులను పురస్కార గ్రహీతలకు అందించారు. దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం గ్రామం, ఉత్తమ జిల్లాల కేటగిరీలో ఆదిలాబాద్ (3వ స్థానం), హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం, క్యాంపస్ అవార్డులను అందుకున్నాయి. అలాగే, జాతీయ జల అవార్డుల్లో మూడో ఉత్తమ రాష్ట్రంగా బిహార్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ అవార్డును పంచుకోగా, ఉత్తమ రాష్ట్రాల విభాగంలో మధ్యప్రదేశ్ తొలిస్థానంలో నిలిచింది. -
జలసంరక్షణలో జాతీయ అవార్డు
సూపర్‌బజార్(కొత్తగూడెం) : జల సంరక్షణ విభాగంలో ములకలపల్లి మండలం జగన్నాథపురం గ్రామానికి జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు రాగా, ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ ప్లీనరీ హాల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ గడ్డం భవాని, కార్యదర్శి షేక్ ఇబ్రహీం శనివారం పురస్కారం స్వీకరించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 11 కేటగిరీల్లో 41 మంది విజేతలను ప్రకటించగా జల సంరక్షణలో ఉత్తమ పంచాయతీగా జగన్నాథపురం నిలిచిన విషయం తెలిసిందే. గ్రామానికి అవార్డు రావడం పట్ల కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు. ప్రశంసపత్రంతో పాటు నగదు బహుమతి అందుకున్నారని తెలిపారు. జాతీయస్థాయిలో జల సంరక్షణలో మొదటి స్థానం సాధించేందుకు కృషి చేసిన ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, సహకరించిన ప్రజలను ఆయన అభినందించారు. జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ అధ్వర్యంలో 2018 నుంచి జల, నీటి వనరుల నిర్వహణ అవార్డులు అందజేస్తున్నారని పేర్కొన్నారు. -
భూగర్భజలాల్లో 650.22 టీఎంసీలు మిగులు
సాక్షి, అమరావతి: ప్రస్తుత నీటి సంవత్సరంలో రాష్ట్రంలో భూగర్భజలాల్లో 650.22 టీఎంసీలు మిగిలాయి. నీటి సంవత్సరం జూన్ 1తో ప్రారంభమై మరుసటి ఏడాది మే 31తో ముగుస్తుంది. ప్రస్తుత అంటే 2022–23 నీటి సంవత్సరం మరో మూడురోజుల్లో ముగియనుంది. రాష్ట్రంలో ప్రస్తుత నీటి సంవత్సరంలో నైరుతి, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల సగటున 967 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 1,046.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలు సమృద్ధిగా కురవడం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలసంరక్షణ చర్యల వల్ల రికార్డు స్థాయిలో వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకింది. భూగర్భజలాలు 961.42 టీఎంసీలయ్యాయి. ఇందులో సాగు, తాగు, గృహ తదితర అవసరాలకు 913.35 టీఎంసీలు వినియోగించుకోవడానికి వీలుందని భూగర్భజలవనరుల అధికారులు లెక్కగట్టారు. కానీ నీటి సంవత్సరం ముగింపు దశకు చేరుకునేటప్పటికి అంటే ఆదివారానికి కేవలం 263.13 టీఎంసీల భూగర్భజలాలను మాత్రమే ప్రజలు వినియోగించుకున్నారు. దీంతో భూగర్భజలాల్లో 650.22 టీఎంసీలు మిగిలాయి. జలసంరక్షణ చర్యల ద్వారా వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భంలోకి ఇంకేలా చేసి, భూగర్భజలాలను పెంచడంతోపాటు వాటిని పొదుపుగా వినియోగించుకోవడం ద్వారా భూగర్భజలాల పరిరక్షణలో మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని అధికారవర్గాలు తెలిపాయి. రబీలోనే భారీగా తోడివేత అక్టోబర్ ఆఖరుకు వర్షాకాలం ముగిసిన తరువాత నవంబర్‌లో రాష్ట్రంలో భూగర్భజలాలు సగటున 6.13 మీటర్లలో లభ్యమయ్యేవి. రాష్ట్రంలో 15 లక్షల వ్యవసాయ బోరుబావులను భూగర్భజలవనరుల శాఖ జియోట్యాగింగ్ చేసింది. వాటికి అదనంగా మరో లక్షకుపైగా వ్యవసాయ బోరుబావులు ఉంటాయని అంచనా. భూగర్భజలమట్టాన్ని 1,806 పిజియోమీటర్ల ద్వారా భూగర్భజలవనరుల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు లెక్కిస్తూ పర్యవేక్షిస్తున్నారు. రబీలో, వేసవిలో సాగు, తాగు, గృహ అవసరాల కోసం బోరుబావుల నుంచి భారీ ఎత్తున ప్రజలు నీటిని తోడేశారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 3.95 మీటర్ల మేర భూగర్భజలాలను తోడేయగా, నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 0.37 మీటర్ల మేర భూగర్భజలాలను వినియోగించుకున్నారు. వర్షాభావ ప్రాంతాలైన అనంతపురం జిల్లాలో 2.79, శ్రీసత్యసాయి జిల్లాలో 3.29 మీటర్ల మేర రబీలో భూగర్భజలాలను వినియోగించుకున్నారు. నవంబర్ నుంచి మే వరకు సగటున 2.54 మీటర్ల మేర భూగర్భజలాలను వాడుకోవడంతో భూగర్భజలమట్టం 8.67 మీటర్లకు పడిపోయింది. బాపట్లలో కనిష్ఠం.. ఏలూరులో గరిష్ఠం.. నీటి సంవత్సరం ముగిసేటప్పటికి రాష్ట్రంలో సగటున 8.67 మీటర్లలో భూగర్భజలాలు లభ్యమవుతున్నాయి. బాపట్ల జిల్లాలో కనిష్ఠంగా 3.59 మీటర్లలోనే భూగర్భజలాలు లభ్యమవుతుండగా.. ఏలూరు జిల్లాలో గరిష్ఠంగా 20.95 మీటర్ల లోతుకు వెళ్తేగానీ భూగర్భజలాలు దొరకని పరిస్థితి. వర్షాభావ ప్రాంతాలైన అనంతపురం జిల్లాలో 7.84, శ్రీసత్యసాయి జిల్లాలో 8.35 మీటర్లలోనే భూగర్భజలాలు లభ్యమవుతుండటం గమనార్హం. జూన్ 1 నుంచి కొత్త నీటి సంవత్సరం 2023–24 ప్రారంభమవుతుంది. గతేడాదిలానే ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న వాతావరణశాఖ అంచనాల నేపథ్యంలో.. భూగర్భజలాలు పుష్కలంగా పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. -
జలకళ తీసుకువచ్చింది
బ్యాంకింగ్ రంగంలో క్షణం తీరిక లేని పనుల్లో ఉండేది వేదిక భండార్కర్. ఆ ఊపిరి సలపని పనుల్లో ఆమెకు కాస్త ఉపశమనం సామాజికసేవ. బ్యాంకింగ్ రంగాన్ని వదిలి సామాజికసేవా రంగం దారిని ఎంచుకున్న వేదిక... ‘సామాజిక సేవ మనకు వినయాన్ని నేర్పుతుంది. మనుసులో నుంచి మానవత్వ భావన పోకుండా కాపాడుతుంది. మరిన్ని మంచి పనులు చేయాలనే ఉత్సాహాన్ని ఎప్పుడూ ఇస్తుంది’ అంటోంది... ‘సామాజిక సేవారంగంలో పనిచేస్తానని కలలో కూడా అనుకోలేదు’ అంటుంది ముంబైకి చెందిన వేదిక భండార్కర్. ‘స్టార్ బ్యాంకర్’గా పేరు తెచ్చుకున్న వేదిక జేపీ మోర్గాన్‌లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ హెడ్‌గా పనిచేసింది. ఆ తరువాత మరో కంపెనీలో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో పనిచేసింది. తన వృత్తిపనుల్లో తలమునకలయ్యే వేదిక తొలిసారిగా ముంబైలోని ‘జై వకీల్ ఫౌండేషన్’తో కలిసి పనిచేసింది. ఆ తరువాత ‘దస్రా’ అనే స్వచ్ఛందసంస్థతో కలిసి జార్ఖండ్, బిహార్ గ్రామీణ ప్రాంతాలలో మహిళలు, బాలికల విద్య, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంది. ‘అపుడప్పుడు’ అన్నట్లుగా ఉండే ఆమె సామాజికసేవలు ఆతరువాత నిత్యకృత్యం అయ్యాయి. అలాంటి సమయంలోనే తమ సంస్థకు ఇండియాలో సారథ్యం వహించమని ‘వాటర్.ఆర్గ్’ నుంచి పిలుపు వచ్చింది. మిస్సోరీ (యూఎస్) కేంద్రంగా పనిచేసే స్వచ్ఛందసంస్థ ‘వాటర్.ఆర్గ్’ సురక్షిత నీరు, జలసంరక్షణ, పారిశుద్ధ్యంకు సంబంధించి ఎన్నో దేశాల్లో పనిచేస్తోంది. ఆ సంస్థ నుంచి ఆహ్వానం అందినప్పుడు నిరాకరించడానికి వేదికకు ఏ కారణం కనిపించలేదు. ఒప్పుకోవడానికి మాత్రం చాలా కారణాలు కనిపించాయి. అందులో ప్రధానమైనది... ‘పేదప్రజలకు సేవ చేసే అవకాశం దొరుకుతుంది’ ‘వాటర్.ఆర్గ్’ సారథ్య బాధ్యతలు చేపట్టే ముందు నీటి సంక్షోభం గురించి లోతుగా అధ్యయనం చేసింది వేదిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ వో) గణాంకాల ప్రకారం సురక్షితమైన నీటి సౌకర్యానికి నోచుకోని ప్రజలు కోట్లలో ఉన్నారు. నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు మహిళలు. నీటి కోసం గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించక తప్పని పరిస్థితుల వల్ల ఆ సమయాన్ని ఇతర ప్రయోజనకర పనులకోసం కేటాయించలేకపోతున్నారు. ‘మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా దృష్టి పెడతాను’ అంటున్న వేదిక ఆ సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తోంది. మరుగుదొడ్లు నిర్మించుకోవడం నుంచి వాటర్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవడం వరకు ‘వాటర్.ఆర్గ్’ ద్వారా సహాయపడుతోంది. ఒకసారి క్షేత్రపర్యటనలో భాగంగా కర్ణాటకలోని ఒక గ్రామానికి వెళ్లింది వేదిక. ఒక మహిళ తన పదకొండు సంవత్సరాల కూతురు గురించి చెప్పింది. ఆ అమ్మాయి చదువుకోడానికి వేరే ఊళ్లో బంధువుల ఇంట్లో ఉంటుంది. అయితే బడికి సెలవులు వచ్చినా ఆ అమ్మాయి ఇంటికి రావడానికి మాత్రం ఇష్టపడడం లేదు. దీనికి కారణం వారి ఇంట్లో టాయిలెట్ సౌకర్యం లేకపోవడం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మహిళ టాయిలెట్ నిర్మించుకోవడానికి సహకరించింది వేదిక. ఆ గృహిణి కళ్లలో కనిపించిన మెరుపును దగ్గర నుంచి చూసింది. ‘బ్యాంకర్‌గా క్లయింట్స్ ఆదాయం ఒక స్థాయి నుంచి మరో స్థాయి పెరగడానికి కృషి చేశాను. ఇప్పుడు...తమకున్న వనరులతోనే సౌకర్యవంతమైన జీవితం ఎలా గడపవచ్చు అనే విషయంలో సామాన్య ప్రజలతో కలిసి పనిచేస్తున్నాను’ అంటుంది వేదిక. ఒకప్పుడు ‘స్టార్ బ్యాంకర్’గా బ్యాంకింగ్ రంగంలో ఎన్నో విజయాలు సాధించిన వేదిక భండార్కర్ ఇప్పుడు ‘నీటిని మించిన అత్యున్నత పెట్టుబడి ఏదీ లేదు’ అంటూ జలసంరక్షణపై ఊరూరా ప్రచారం చేస్తోంది. -
ఇలాగైతే ‘నీళ్లు నమలాల్సిందే’
సాక్షి, అమరావతి: వరద జలాలను ఒడిసి పట్టడం.. భూగర్భ జలాలను పెంపొందించడం వంటి జల సంరక్షణ చర్యలు చేపట్టకపోతే దేశంలో తీవ్ర జల సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తలసరి నీటి లభ్యత పెరగడం లేదనే అంశాన్ని స్పష్టంచేసింది. తలసరి నీటి లభ్యత 2001లో 1,816 క్యూబిక్ మీటర్లు (ఒక క్యూబిక్ మీటర్ వెయ్యి లీటర్లకు సమానం) ఉంటే.. 2021 నాటికి 1,486 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోవడాన్ని గుర్తు చేసింది. నీటి లభ్యతను పెంచే చర్యలు చేపట్టకపోతే.. 2031 నాటికి 1,367 క్యూబిక్ మీటర్లకు, 2041 నాటికి 1,282 క్యూబిక్ మీటర్లకు, 2051 నాటికి 1,228 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోతుందని అంచనా వేసింది. ఇలాగైతే.. కష్టమే! పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్‌లో సాగునీటికే కాదు.. తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు తప్పవని కేంద్ర జలసంఘం ఆందోళన వ్యక్తం చేసింది. సాగునీటి సమస్య పంటల సాగుపై ప్రభావం చూపుతుందని.. ఇది ఆహార సంక్షోభానికి దారి తీస్తుందని పేర్కొంది. నీటి లభ్యతను పెంచేలా వరద నీటిని ఒడిసిపట్టి జలాశయాల్లో నిల్వ చేయడం, జల సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా జల సంక్షోభాన్ని నివారించవచ్చనని కేంద్రానికి సూచించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దేశంలో మరిన్ని రిజర్వాయర్లు నిర్మించి.. నదీ జలాలను మళ్లించి వాటిని నింపడం ద్వారా నీటి లభ్యతను పెంచుకోవాలని స్పష్టం చేసింది. నీటి పారుదల సౌకర్యాలను మెరుగుపర్చుకోకుంటే ఆహార ధాన్యాల దిగుబడి పెరగదని తేల్చింది. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగకుంటే ఆహార సంక్షోభానికి దారి తీస్తుందని హెచ్చరించింది. సీడబ్ల్యూసీ అధ్యయనంలో ఏం తేలిందంటే ♦ దేశంలో ఏటా సగటున 1,298.60 మి.మీ. వర్షపాతం కురుస్తోంది. తద్వారా 1,37,002.08 టీఎంసీల నీరు లభ్యమవుతోంది. ♦ వర్షపాతం వల్ల గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా నదుల్లో ప్రవాహం రూపంలో 70,591.75 టీఎంసీలు లభిస్తుండగా.. ప్రస్తుతం జలాశయాల ద్వారా 24,367.43 టీఎంసీలను మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. ♦ ఏటా 46,224.32 టీఎంసీలు కడలిలో కలిసిపోతున్నాయి. అంటే వాడుకుంటున్న నీటి కంటే దాదాపు రెండు రెట్లు అధికంగా నదీ జలాలు కడలిలో కలుస్తున్నట్టు వెల్లడవుతోంది. ♦ దేశవ్యాప్తంగా వివిధ నదులపై నిర్మించిన 5,745 డ్యామ్‌ల నీటి నిల్వ సామర్థ్యం 9,103.34 టీఎంసీలు. ఈ డ్యామ్‌లలో నీటిని నిల్వ చేస్తూ సాగు, తాగునీటి అవసరాల కోసం 24,367.43 టీఎంసీలను మాత్రమే వాడుకుంటున్నాం. ♦ ఆంధ్రప్రదేశ్‌లో 166 డ్యామ్‌ల నిల్వ సామర్థ్యం 983.59 టీఎంసీలు. అన్ని జిల్లాల్లో కలిపి 1.05 కోట్ల ఎకరాలకు నీళ్లందించేలా ఆయకట్టును రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. -
వాతావరణ మార్పులపై ప్రజా ఉద్యమం
వాషింగ్టన్: వాతావరణ మార్పుల సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ అంశంపై ప్రపంచ బ్యాంకు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి శనివారం ఆయన వీడియో లింక్ ద్వారా ప్రసంగించారు. ‘‘వాతావరణ మార్పులను అడ్డుకోవడం ప్రభుత్వాల స్థాయిలో జరగాల్సిన పని అని చాలామంది భావిస్తారు. ఇందులో వ్యక్తిగతంగా తామేమీ చేయలేమని అనుకుంటారు. కానీ ఈ విషయంలో మనమంతా ఎంతో చేయగలం. కేవలం సదస్సుల ద్వారా ఏమీ జరగదు. ఈ పోరు చర్చా వేదికల నుంచి ప్రతి ఇంట్లోనూ డిన్నర్ టేబుళ్ల దాకా వెళ్లాలి. అప్పుడే అది ప్రజా ఉద్యమంగా మారుతుంది. ఈ విషయంలో భారత ప్రజలు కొన్నేళ్లుగా ఎంతో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. జల పరిరక్షణ, సహజ సాగు, చిరుధాన్యాల వాడకం, ఆరోగ్యకరమైన జీవన విధానం, లింగ సమానత్వ సాధన, స్వచ్ఛత, సూక్ష్మసేద్యం వంటివాటిని ఓ ఉద్యమంగా చేపట్టి విజయవంతం చేస్తున్నారు. అన్ని దేశాల్లోనూ ఇలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించడంలో అంతర్జాతీయ సంస్థలది కీలక పాత్ర’’ అన్నారు. -
జన భాగస్వామ్యంతోనే జల సంరక్షణ
న్యూఢిల్లీ: దేశంలో జల సంరక్షణ విషయంలో కేవలం ప్రభుత్వం తీసుకొనే చర్యలే సరిపోవని, ప్రజలందరి భాగసామ్యంతోనే అది సాధ్యమవుతుందని, ఆశించిన ఫలితాలు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జల సంరక్షణ ఉద్యమంతో అనుసంధానమైతేనే ప్రజలకు ఇందులోని తీవ్రత, ప్రాధాన్యం తెలుస్తుందని అన్నారు. కార్యక్రమ ఉద్దేశం అర్థమైతే వారు దాన్ని సొంతం చేసుకుంటారని తెలిపారు. గురువారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నిర్వహించిన రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రుల తొలి జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, భాగస్వామ్యానికి నీరు ఒక కీలకాంశం కావాలని చెప్పారు. దేశంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో నీటి పంపకాలపై ముందుగానే దృష్టి పెట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల మధ్య నడుమ దశాబ్దాలుగా జల వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘వాటర్ విజన్–2047’ మన రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం జలం అనేది రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. మనం నిర్దేశించుకున్న సమ్మిళిత లక్ష్యాల సాధనకు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే 25 ఏళ్లలో సాగించబోయే ‘అమృతకాల’ ప్రయాణంలో ‘వాటర్ విజన్–2047’ అనేది అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎక్కువ శాతం పనులు జల సంరక్షణ దిశగానే జరగాలని చెప్పారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రులకు సూచించారు. ప్రజలతోపాటు సామాజిక సంస్థలు, పౌర సంస్థలు సైతం జల సంరక్షణ ఉద్యమాల్లో పాలుపంచుకోవాలని కోరారు. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం అంటే దాని అర్థం ప్రభుత్వపరంగా పారదర్శకత తగ్గించడం కాదన్నారు. అలాగే మొత్తం బాధ్యతను ప్రజలపై మోపడం కాదని తేల్చిచెప్పారు. జల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడానికి స్థానికంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతి జిల్లాలో అమృత సరోవరాలు ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో 75 అమృత సరోవరాలు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని నరేంద్ర మోదీ తెలియజేశారు. ఇప్పటికే 25,000 సరోవరాలు నిర్మించినట్లు చెప్పారు. ప్రతి సరోవరం కనీసం ఎకరం వైశాల్యంలో ఉంటుందని, ఇందులో 10,000 క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేయొచ్చని అన్నారు. జల సంరక్షణకు జియో–సెన్సింగ్, జియో–మ్యాపింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలు వాడుకోవాలని సూచించారు. టెక్నాలజీ–పరిశ్రమలు–స్టార్టప్‌లను అనుసంధాస్తే చక్కటి ఫలితాలు వస్తాయన్నారు. నమామి గంగా మిషన్ తరహాలో నదుల ప్రక్షాళనకు రాష్ట్రాలు సైతం నడుం బిగించాలని ప్రధానమంత్రి విన్నవించారు. నదుల, జల వనరులను కాపాడుకోవాలన్నారు. ప్రతి రాష్ట్రంలో చెత్త నిర్మూలన, మురుగునీటి శుద్ధి కోసం నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. తాజా నీటిని సంరక్షించుకోవడం, మురుగునీటిని శుద్ధి చేసి మళ్లీ వాడుకోవడం పర్యావరణానికి చాలా మేలు చేస్తుందని వివరించారు. ‘ప్రైమ్ మినిస్టర్ అగ్రికల్చర్ ఇరిగేషన్ స్కీమ్’ కింద 70 లక్షల హెక్టార్లకుపైగా భూమిని సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకొచ్చామని ప్రధాని మోదీ తెలిపారు. -
భూగర్భ జలం పుష్కలం.. నీటి సంరక్షణలో దేశంలో అగ్రగామి ఆంధ్రప్రదేశ్
ఎండిన బోరు బావికి జీవకళ ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు భీమేష్. అనంతపురం జిల్లా పుట్లూరుకు చెందిన రైతు. ఆరు ఎకరాలు పొలం ఉంది. గతంలో 1,250 అడుగులు తవ్విన బోరు బావి ఎండిపోవడంతో పొలం బీడుగా మారింది. 2020 నాటికి పుట్లూరు మండలంలో భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయి. మూడేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటం, వాన నీటిని ఒడిసిపట్టి చెరువులను నింపుతుండటంతో ఎండిన భీమేష్ బోరుబావికి జలకళ వచ్చింది. నాలుగు ఎకరాల్లో బత్తాయి, రెండు ఎకరాల్లో వేరుశెనగ సాగు చేసిన భీమేష్ రెండో పంటగా మొక్కజొన్న సాగుకు సిద్ధమయ్యాడు. సాక్షి, అమరావతి: పాతాళగంగ పైపైకి వస్తోంది. ఎండిన బోరు బావుల నుంచి జలధారలు ఉబికి వస్తున్నాయి. రాష్ట్రంలో సగటున 5.83 మీటర్లు అంటే కేవలం 19.13 అడుగుల్లోనే నీళ్లు లభ్యమవుతుండటంతో భూగర్భ జల వనరులలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. పొదుపుగా వినియోగించుకోవడం ద్వారా భూగర్భ జలాల సంరక్షణలోనూ ప్రథమ స్థానంలో నిలిచింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం భారీగా తోడేస్తుండటంతో భూగర్భ జలమట్టాలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయి. దేశవ్యాప్తంగా భూగర్భ జలాలపై రాష్ట్రాల భూగర్భ జలవనరుల శాఖలు, కేంద్ర భూగర్భ జలమండలి విభాగం ఈ ఏడాది నిర్వహించిన సంయుక్త సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో 667 మండలాల పరిధిలో 1,669 ఫిజియో మీటర్ల ద్వారా భూగర్భ జలాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధ్యయనం చేశారు. జలసంరక్షణలో ఏపీ టాప్... ► నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల విస్తారంగా వర్షాలు పడటంతో దేశంలో భూగర్భ జలాలు సగటున 15,453.69 టీఎంసీలు పెరిగాయి. ఇందులో సగటున 14,058.06 టీఎంసీలను సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం వాడుకోవచ్చు. అయితే 8,445.85 టీఎంసీలు (60.80 శాతం) మాత్రమే వినియోగిస్తున్నారు. ► రాష్ట్రంలో సగటున 741 మిల్లీమీటర్ల వర్షపాతానికిగానూ నైరుతి రుతుపవనాల కాలం ముగిసే నాటికి, అంటే అక్టోబర్ ఆఖరుకు 799.03 మి.మీ. వర్షపాతం కురిసింది. సాధారణ కంటే 7.9 శాతం అధిక వర్షపాతం కురిసింది. రుతుపవనాల కాలం ప్రారంభమయ్యే నాటికి అంటే 2022 మే 30 నాటికి రాష్ట్రంలో సగటున 8.33 మీటర్లలో భూగర్భ జలమట్టాలు ఉండగా రుతుపవనాలు తిరోగమించే అక్టోబర్ 31 నాటికి సగటున 5.83 మీటర్ల లోతులోనే నీళ్లు లభ్యమవుతున్నాయి. సగటున 2.5 మీటర్ల (8.21 అడుగులు) మేర రాష్ట్రంలో భూగర్భ జలమట్టం పెరిగింది. ► రాష్ట్రంలో ఈ ఏడాది భూగర్భ జలమట్టం అత్యధికంగా 5.56 మీటర్ల మేర శ్రీసత్యసాయి జిల్లాలో పెరిగింది. శ్రీకాకుళం జిల్లా రెండో స్థానం (4.82 మీటర్లు), ఏలూరు జిల్లా మూడో స్థానం (4.43 మీటర్లు)లో నిలవగా 0.62 మీటర్లు తగ్గడం ద్వారా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ► భూగర్భ జలాలు 637 మండలాలలో పుష్కలంగా లభ్యమవుతున్నాయి. మరో 19 మండలాల్లో జలమట్టం సమస్యాత్మకంగానూ, ఐదు మండలాల్లో అత్యంత సమస్యాత్మకంగానూ, ఆరు మండలాల్లో ఆందోళనకర స్థాయిలో ఉంది. ఈ ఆరు మండలాల పరిధిలోని 387 గ్రామాల్లో ఎడాపెడా భూగర్భ జలాలను తోడివేయడమే దీనికి కారణం. ► రాష్ట్రంలో భూగర్భ జలాలు 961.61 టీఎంసీల మేర పెరిగాయి. ఇందులో 913.23 టీఎంసీలను వివిధ అవసరాల కోసం వాడుకోవచ్చు. అయితే ఏటా సగటున 15 లక్షల బోరు బావుల ద్వారా సాగు, తాగు నీటి అవసరాల కోసం 263.09 టీఎంసీలు (28.8 శాతం) మాత్రమే వాడుకుంటున్నారు. దేశంలో సగటున 60.8 శాతం మేర భూగర్భ జలాలను వాడుకుంటుండగా, రాష్ట్రంలో 28.8 శాతం మాత్రమే వినియోగించుకుంటున్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భంలో భద్రపరచడం, పొదుపుగా వాడకం ద్వారా నీటి సంరక్షణలో ఏపీ అగ్రగామిగా నిలిచింది. లభ్యతలో విజయనగరం ప్రథమ స్థానం రాష్ట్రంలో భూగర్భ జలాల లభ్యతలో విజయనగరం జిల్లా తొలి స్థానంలో నిలవగా, ఏలూరు జిల్లా చివరి స్థానంలో ఉంది. కేవలం 1.99 మీటర్ల (6.5 అడుగులు)లో విజయనగరం జిల్లాలో భూగర్భ జలాలు లభిస్తున్నాయి. బాపట్ల జిల్లా రెండో స్థానంలో (2.21 మీటర్లు), డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మూడో స్థానంలో(2.33 మీటర్లు) నిలిచాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఏలూరు జిల్లాలో భూగర్భ జలమట్టం 17.94 మీటర్లకు (58.85 అడుగులు) దిగజారడం గమనార్హం. తీవ్ర వర్షాభావ ప్రాంతంలోని రాయలసీమ కంటే ఏలూరు జిల్లాలో భూగర్భ జలాల లభ్యత తక్కువగా ఉంది. -
బొట్టు బొట్టుకూ లెక్క
సాక్షి, అమరావతి: వరదను ఒడిసి పట్టి.. పొదుపుగా వాడుకోవడం ద్వారా జలవనరులను సంరక్షించుకోవడానికి ఏపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. వర్షపాతం, అంతర్రాష్ట్ర నదుల ద్వారా వచ్చే ప్రవాహాన్ని.. ఆవిరి, కడలిలో కలుస్తున్న జలాలు, సాగు, గృహ, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం వాడుకుంటున్న నీరు.. ప్రాజెక్టుల్లో, చెరువుల్లో, భూగర్భంలో లభ్యతగా ఉన్న నీటి లెక్కలను రోజూ లెక్కిస్తోంది. తద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేసి.. జలవనరులను సమర్థవంతంగా పరిరక్షిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్ (ఆంధ్రప్రదేశ్ వాటర్ రీసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్)ను ఏర్పాటుచేసింది. అంతేకాదు.. జలసంరక్షణలో అత్యుత్తమంగా పనిచేస్తున్నందుకు ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. నీటి లెక్కలు ఇలా.. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1తో ప్రారంభమై మార్చి 31తో ముగుస్తుంది. కానీ, నీటి సంవత్సరం ఏటా జూన్ 1న ప్రారంభమై మే 31తో ముగుస్తుంది. నీటి లెక్కలను కూడా జూన్ 1 నుంచి లెక్కిస్తారు. అది ఎలాగంటే.. ► రాష్ట్రంలో రోజూ కురిసే వర్షాన్ని రెయిన్ గేజ్‌ల ద్వారా కొలుస్తున్నారు. ► అంతర్రాష్ట్ర నదుల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించే నీటిని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హైడ్రలాజికల్ అబ్జర్వేషన్ సెంటర్లలో ఏర్పాటుచేసిన గేజ్‌ల ద్వారా లెక్కిస్తుంది. ఇదే రీతిలో కడలిలో కలిసే జలాలను లెక్కిస్తుంది. ► ఆవిరయ్యే నీటిని ఎవాపరీమీటర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లెక్కిస్తుంది. ► ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు విడుదల చేసే నీటిని.. తాగు, గృహ, పారిశ్రామిక అవసరాల కోసం వాడుకునే నీటిని టెలీమీటర్ల ద్వారా గణిస్తారు. ► ఫీజియోమీటర్ల ద్వారా భూగర్భంలో ఇంకే నీటిని లెక్కిస్తుంది. ..ఇలా రాష్ట్రంలో రెయిన్ గేజ్‌ల నుంచి ఫీజియోమీటర్ల వరకూ అన్నింటినీ ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్‌తో అనుసంధానం చేసింది. జూన్ 1 నుంచి మే 31 వరకూ రోజూ నీటి రాక, పోకను లెక్కించి.. లభ్యతగా ఉన్న నీటి వివరాలను వెల్లడిస్తుంది. 7,994.32 టీఎంసీల ప్రవాహం.. రాష్ట్రంలో ఈ ఏడాది సగటున 855 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుందని అంచనా వేశారు. కానీ, ఇప్పటికే 977.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీని ద్వారా 5,476.39 టీఎంసీల ప్రవాహం వచ్చింది. గోదావరి, కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధార తదితర అంతర్రాష్ట్ర నదుల ద్వారా రాష్ట్రంలోకి ఇప్పటివరకూ 2,517.93 టీఎంసీల ప్రవాహం వచ్చింది. అంటే.. ఆదివారం నాటికి రాష్ట్రంలోకి మొత్తం 7,994.32 టీఎంసీల ప్రవాహం వచ్చింది. ఇందులో ఆదివారం నాటికి ఆవిరి రూపంలో 2,829.9 టీఎంసీలు ఖర్చయ్యాయి. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, గొట్టా బ్యారేజీ, నారాయణపురం ఆనకట్ట ద్వారా గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి జలాలు 2,780.6 టీఎంసీలు కడలిలో కలిశాయి. అంటే.. అంతర్రాష్ట్ర నదుల ద్వారా రాష్ట్రంలోకి వచ్చిన ప్రవాహం కంటే 262.23 టీఎంసీలు అధికంగా సముద్రంలో కలిసినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు.. సాగు, తాగు, గృహ, పారిశ్రామిక అవసరాల కోసం ఇప్పటిదాకా 780.15 టీఎంసీలే వాడుకోవడం గమనార్హం. -
మహా గంగ
మనిషి బతకాలంటే గాలి తర్వాత అంత ముఖ్యమైనది నీటిచుక్క. గాలి మన చుట్టూ ఆవరించి ఉంటుంది. మరి నీరు... అవి మన దగ్గరకు రావు, మనమే నీటి దగ్గరకు వెళ్లాలి. అందుకే ప్రాచీన నాగరకతలు నీటి ఆధారంగానే విస్తృతమయ్యాయి. మరి ఈ ఆధునిక కాలానికి ఏమైంది? మనిషి టెక్నాలజీని అందిపుచ్చుకున్నాడు. తానున్న చోటుకే నీటి తెచ్చుకునే టెక్నాలజీని అభివృద్ధి చేసుకుని కొండ మీద కూడా కాలు మీద కాలేసుకుని జీవిస్తున్నాడు. మరి భూగర్భంలో జలం పాతాళానికి ఇంకిపోతే ఏం చేయాలి? బిందెలు తలమీద పెట్టుకుని నీటిబొట్టును వెతుక్కుంటూ మైళ్లకు మైళ్ల దూరం నడిచి వెళ్లాలి. మహారాష్ట్ర గ్రామాల పరిస్థితి అదే. ఇరవై ఏళ్ల కిందట అయితే మరీ దుర్భరంగా ఉండేది. అక్కడి నీటి ఎద్దడిని నివారించడానికి విశాల మనస్కులు వస్తూనే ఉన్నారు. వారికి చేతనైంత మేర గంగను పునఃప్రతిష్ఠించి జనం గొంతు తడుపుతున్నారు. బెంగళూరుకు చెందిన జయశ్రీ అయితే ఏకంగా రెండు వందల గ్రామాల దాహార్తిని తీర్చింది. నీటి కొరతతో గంగవెర్రులెత్తుతున్న మహారాష్ట్ర గ్రామాల పాలిట గంగాభవానిగా మారింది. తిరిగి ఇవ్వాల్సిన సమయం జయశ్రీ వయసు 72. బెంగళూరులో పుట్టి పెరిగింది. చదువుకునే రోజుల్లో ఆసక్తి కొద్దీ ఒక ఎన్జీవోలో ఉద్యోగం చేసింది. పెళ్లి తర్వాత భర్తతోపాటు యూకేకి వెళ్లి పోయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు కుటుంబంతో తిరిగి ఇండియాకి వచ్చిందామె. ఆమె తండ్రి నిర్వహిస్తున్న జేఆర్‌రావు అండ్ కో బాధ్యతలను చేపట్టింది. అది ఇంజనీరింగ్ పరికరాలు తయారు చేసే పరిశ్రమ. దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి ఆర్డర్లు వస్తుంటాయి. పరిశ్రమ నిర్వహణలో మంచి పట్టు వచ్చేసింది. 2006లో ఓరోజు... ఆమె జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన చోటు చేసుకుంది. ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. మెషినరీ పరికరాల అమ్మకంలో నికరంగా లక్ష రూపాయలు మిగిలాయి. జయశ్రీ సంతోషంగా ఇంటికి వచ్చింది. రోజూ కూరగాయలిచ్చే అతడు వచ్చాడు. ఐదు రూపాయలు తగ్గింపు కోసం బాగా బేరం చేసింది. ఆమె కోరినట్లే ఐదు రూపాయలు తగ్గించి కూరగాయలిచ్చి వెళ్లిపోయాడతడు. అప్పుడు ఆమెలో ఆత్మావలోకనం మొదలైంది. ‘నేనేం చేశాను. లక్ష రూపాయలు లాభంతో సంతోషంగా ఇంటికి వచ్చాను. బేరం చేయకుండా కూరగాయలు కొని ఉంటే కూరగాయలమ్మే అతడు కూడా ఎంతో కొంత సంతోషంగా ఇంటికి వెళ్లే వాడు కదా’ అనుకుంది. మన జీవిక కోసం సమాజం నుంచి తీసుకుంటాం. అలాగే సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన సందర్భాలను కూడా గమనింపు లో ఉంచుకోవాలి’ అనుకుందా క్షణంలో. ఆ ఆలోచన అక్కడితో ఆగిపోలేదు. ఏం చేయాలి? ఎలా చేయాలి అని గట్టిగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. నాటి చిత్రమే నేటికీ జయశ్రీకి తాను పెళ్లికి ముందు పని చేసిన మహారాష్ట్ర గ్రామాలు గుర్తుకు వచ్చాయి. నీటి కోసం బిందె తల మీద పెట్టుకుని నడుస్తున్న మహిళల ఫొటోలు పేపర్లలో చూసిన సంగతి గుర్తు వచ్చింది. ఒకసారి ఆ గ్రామాలకు వెళ్లి చూసింది. వెంటనే పని మొదలు పెట్టింది జయశ్రీ. సమావేశం ఏర్పాటు చేసి తాను ఏం చేయదలుచుకున్నాననేది గ్రామస్థులకు వివరించడమే పెద్ద సమస్య అయింది. మీటింగ్ అంటే ఎవరూ వచ్చే వాళ్ల కాదు. గ్రామస్థులను కూర్చోబెట్టడానికి రకరకాల మార్గాల్లో ప్రయత్నించింది. చివరికి ఒక దీపావళికి ప్రమిదలు తయారు చేసే అవకాశం కల్పించడంతో మహిళలు వచ్చారు. వారికి ప్రమిదలు చేసినందుకు డబ్బు ఇవ్వడంతోపాటు నీటి సంరక్షణ కోసం తాను చేయదలుచుకున్న విషయాన్ని కూడా చెప్పి వారిని సమాధాన పరిచింది. ఎండిపోయిన నీటి కుంటల పూడిక తీయించడానికి రంగం సిద్ధం చేసింది. యంత్రాల సహకారం ఆమె వంతు భాగస్వామ్యం– శ్రమదానం గ్రామస్థుల భాగస్వామ్యం. ఈ అంగీకారంతో ఒక్కో గ్రామంలో ఉన్న చెరువులు, కుంటలు, సరస్సులు, కాలువలు శుభ్రపడ్డాయి. తర్వాతి వర్షాకాలం నీటితో కళకళలాడాయి. అలాగ ఒక ఊరి తర్వాత మరో ఊరు... అలా రెండు వందల గ్రామాల్లో నీటి సంరక్షణను విజయవంతంగా పూర్తి చేసింది జయశ్రీ. వాటర్ కన్సర్వేషన్ స్ప్రింగ్ బాక్స్ గ్రామస్తులను చైతన్యపరుస్తున్న జయశ్రీ జయశ్రీ -
Kalpana Ramesh: జల కల్పనకు ఊతం!
‘‘75వ స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకొని బన్సిలాల్‌పేట్ మెట్లబావిని పునరుద్ధరించేందుకు 75 మందికి పైగా స్థానిక జనం పాల్గొనడం చాలా సంతోషంగా అనిపించింది’’ అంటూ ఆకాశం నుంచి రాలే ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టేందుకు కృషి చేస్తున్న కల్పనా రమేష్ ఆనందంగా వివరించారు. హైదరాబాద్‌లో పాడుబడిన బావులను పునరుద్ధరిస్తూ, చెరువులు–కుంటలను సంరక్షిస్తూ, వాన నీటితో భూగర్భజలాలను పెంచడానికి కృషి చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒంగోలులో పుట్టి పెరిగిన కల్పన వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్. ఇంటీరియర్ ఆర్కిటెక్ట్ స్టూడియో కూడా నిర్విహిస్తున్న కల్పనా రమేష్ నీటి వైపుగా వేసిన అడుగుల గురించి వివరించారు. ‘‘ఐదేళ్ల క్రితం కుటుంబంతో అమెరికా నుండి భారత్‌కు వచ్చాను. హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు చుట్టూ పచ్చదనం కావాలనుకున్నాను. కానీ, అప్పటికి ట్యాంకర్లతోనే నీటిని తెప్పించుకునే పరిస్థితి. ఆ నీళ్లలో హానికారకాలున్నాయని గుర్తించాను. ఈ పరిస్థితి ని ఎలాగైనా మార్చాలనుకున్నాను. మా డాబా మీద వర్షపు నీటిని నిల్వ ఉంచేలా జాగ్రత్తలు తీసుకున్నాను. వాడిన నీళ్లు వృథాపోకుండా రీఛార్జ్, రీయూజ్, రీసైకిల్ పద్ధతిని అనుసరించాను. ఏడాదిలోనే మా ఇల్లు, మా ఇంటి చుట్టుపక్కల వాతావరణం చల్లదనం, పచ్చదనం తో ఆహ్లాదకరంగా మారిపోయింది. బడి పిల్లలకు అవగాహన తరగతులు ఎప్పుడైతే ఈ ఆనందం మేం చవి చూస్తున్నామో, నాటి నుంచి మా కాలనీవాసులూ ఇదే పద్ధతిని అనుసరించారు. దీంతో సమాజానికి నా వంతు సాయం చేయాలని, వాటర్ రీసైక్లింగ్ పై జనాల్లో అవగాహన పెంచుతూ వస్తున్నాను. ఇందుకు స్కూళ్లు, కాలేజీల్లోనూ దాదాపు 70 వేల మంది పిల్లలకు అవగాహన క్లాసులు తీసుకున్నాను. పాఠశాలల నుంచి పిల్లలే స్వచ్ఛందంగా ఈ నీటి యజ్ఞంలో పాల్గొనేలా చేశాను. చెరువుల సంరక్షణ నగరంలో రియల్ ఎస్టేట్ కారణంగా వందల చెరువులు కాంక్రీట్ వనంలో కలిసిపోయాయి. ఇంకొన్ని ఇరుకైపోయాయి. కొన్ని మురుగు కు కేంద్రాలయ్యాయి. గోపీనగర్ చెరువు ఇందుకు ఉదాహరణ. దీనికోసం స్త్రీలనే బృందాలుగా ఏర్పాటు చేయడంతో, వారంతా చెరువు చెత్తను ఆటోల్లో డంప్‌యార్డ్ కు తరలించడం మొదలుపెట్టారు. పది రోజుల్లోనే ఆ చెరువును పరిశుభ్రంగా మార్చేశారు. పాత బావులను తిరిగి వాడుకునేలా.. గచ్చిబౌలిలో మసీద్ వద్ద ఉన్న పాత బావి కొన్నేళ్లుగా చెత్తకు డంప్‌యార్డ్‌గా మారింది. పూర్తిగా చెత్త తొలగించి, ఆ చుట్టుపక్కల ఇళ్ల రూఫ్ నుంచి వర్షపు నీళ్లు బావిలో పడేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడు మసీదుకు వచ్చేవారు కూడా బావి నీళ్లు వాడుతున్నామని చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇలాగే.. కోకాపేట్, కొండాపూర్, గచ్చిబౌలి, బన్సీలాల్‌పేట్.. ప్రాంతాల్లోని ప్రాచీన బావులను వాడుకలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను చేశాం. ఇంకుడు గుంతలు, పాత బావులు... ఇతరత్రా విధానాల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకుంటే నీటి ఎద్దడి రాదు. అంతా ప్రభుత్వమే చేయాలనుకోకుండా ఎవరికి వారు ఈ పనులు చేపడితే ఎంతో మంచిది. ప్రతి ఒక్కరూ ఒక వాటర్ వారియర్ ప్రజల్లో ఉండే నిర్లక్ష్యం ఎలా ఉంటుందో, దానిని ఎలా దూరం చేయాలో ఒక ఉదాహరణ కుడికుంట చెరువు. ఆ చెరువును బాగు చేయడానికి ముందు స్థానికులతో చర్చించాను. ప్రతి ఒక్కరూ ఒక వాటర్ వారియర్ కావాలని కోరాను. అందరం కలిసి చెరువు నుంచి వంద టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాం. చెరువులను, బావులను శుభ్రం చేయాలనుకున్నప్పుడు దీని వల్ల నాకేదో ప్రయోజనం ఉందన్నారు కొందరు. అపుడు బాధేసింది. కానీ నా భర్త రమేష్ ఇచ్చిన సలహాలు, మద్దతు నన్ను బలవంతురాలిని చేశాయి. అలా ‘లివ్ ది లేక్స్ ఇనిషియేటివ్’ను ప్రారంభించా. నీరు మనిషి ప్రాథమిక హక్కు. నీటి నిల్వపై అవగాహనతో పాటు అపార్ట్మెంట్స్, ఆఫీసులకు అండగా నిలుస్తున్నా. పాడైన బోర్లను బాగు చేసేందుకు 10కె బోర్స్ కార్యక్రమాన్ని చేపట్టా. ఇంటి ఆవరణలోనే రీ చార్జ్ పిట్లు ఏర్పాటు చేస్తున్నాను. జీహెచ్ఎంసీ, కొన్ని ఎన్జీవోలతో కలిసి పనిచేస్తున్నాను. నగరంలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన సిటీ లేక్ యాక్షన్ కమిటీ టు కన్సర్వ్ లేక్స్’లో ఉన్నాను’ అని వివరించారు ఈ వాటర్ వారియర్. కల్పన జల సంరక్షణ మంత్రం ‘రీసైకిల్, రీఛార్జ్, రీయూజ్.’ చెప్పడమే కాదు ఆచరణలో చేసి చూపుతున్నారు. మొదటి అడుగు ఒంటరిదే అయినా సంకల్పం బలంగా ఉంటే వేల అడుగులు జతకలుస్తాయి అంటున్న కల్పనారమేష్ అందుకు అసలైన ఉదాహరణ. ఇది వర్షాకాలం. నీటి నిల్వలు పెంచుకోవడానికి సరైన కాలం అంటున్నారు కల్పన. -
నీటి సంరక్షణ అందరి బాధ్యత
న్యూఢిల్లీ: దేశంలో నీటి సంరక్షణ అందరి బాధ్యతని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రుతుపవనాలు ప్రవేశించడానికి ముందే చెరువులు, కాల్వలు, సరస్సుల్లో పూడికలు తీసి ప్రతీ వాన చినుకుని సంరక్షించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఆదివారం మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని వాన చినుకులు ఎప్పుడు పడినా, ఎక్కడ పడినా బొట్టు బొట్టు ఒడిసిపట్టి సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. వాన నీటిని పూర్తిగా సద్వినియోగం చేయడం కోసం చెరువులు, కాల్వలు నిర్వహణపై కేంద్ర జల మంత్రిత్వ శాఖ క్యాచ్ ది రెయిన్ అనే 100 రోజుల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌కు చెందిన బబితా రాజ్పుట్ నీటి సంరక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని అభినందించారు. తమ గ్రామంలో ఎండిపోయిన చెరువులకి జలకళ తీసుకువస్తున్న ఆమె కృషి అందరికీ ఆదర్శమన్నారు. తమిళం నేర్చుకోనందుకు బాధగా ఉంది ప్రపంచంలోనే అత్యంత పురాతమైన భాషల్లో ఒకటైన తమిళం నేర్చుకోలేకపోయినందుకు చాలా బాధగా ఉందని ప్రధాని∙మోదీ అన్నారు. తమిళం చాలా అందమైన భాషని, సుసంపన్నమైన సాహి త్యం ఉన్న ఆ భాషని నేర్చుకోలేకపోవడం లోటుగా ఉంటుందని చెప్పారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు అపర్ణ రెడ్డిజీ అడిగిన ఓ చ్రిన్న ప్రశ్న అయినప్పటికీ తనని వెంటాడిందని అన్నారు. ‘‘మీరు చాలా ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధానిగా కూడా ఉన్నారు. జీవితంలో ఏదైనా మిస్ అయ్యారా’’అని ఆమె ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా కష్టమైందన్నారు. ఆ తర్వా త ఆలోచిస్తే తమిళ భాషని నేర్చుకోవడం మిస్ అయినట్టుగా అనిపించిందని ప్రధాని వివరించారు. పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి ప్రస్తావన ఈ సందర్భంగా ప్రధాని హైదరాబాద్ రైతు పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. వెంకటరెడ్డి లాంటి వ్యక్తుల నుంచి స్ఫూర్తిని పొందాలని సూచించారు. డి–విటమిన్ అధికంగా ఉండే వరి, గోధుమ రకాలను వెంకటరెడ్డి అభివృద్ధి చేశారని చెప్పారు. ప్రపంచ మేధో సంపత్తి హక్కుల సంస్థ నుంచి పేటెంట్ కూడా పొందారని తెలిపారు. ఆయనను గత ఏడాది పద్మశ్రీతో గౌరవించుకోవడం గర్వకారణమన్నారు. -
ప్రతి నీటి చుక్కనూ ఒడిసిపట్టాలి
సాక్షి, హైదరాబాద్: ప్రతి నీటి బొట్టు అమూల్యమైందని, దాన్ని ఒడిసి పట్టాలని రాష్ట్ర మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు వాన నీటి సంరక్షణ కార్యక్రమాలను చేపట్టాలని, దీనికి ప్రజలంతా కలసి రావాలన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం, నీటి సంరక్షణపై ఈ వేసవిలోనే కార్యక్రమాలు చేపట్టాలని, ఇది రానున్న వర్షాకాలంలో సత్ఫలితాలు ఇస్తుందని మంత్రి సూచించారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లో జలమండలి నిర్మించిన థీమ్ పార్కును సందర్శించిన మంత్రి, అక్కడే జలమండలి చేపట్టిన ప్రాజెక్టులపై, బోర్డు కార్యకాలాపాలపై సమీక్ష జరిపారు. థీమ్ పార్కులో ఏర్పాటు చేసిన పలు రకాల నమూనాలను మంత్రి తిలకించారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కు.. నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అద్భుతమైన వేదికగా నిలుస్తుందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ఎన్నో వ్యయప్రయాసలు పడి జలమండలి వందల కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా, గోదావరి నుంచి నీటిని తీసుకొచ్చి, నగర వాసులకు సరఫరా చేస్తుందన్నారు. ఈ నీటిని ప్రజలు వృథా చేస్తే ప్రభుత్వానికి నష్టంతో పాటు రానున్న రోజుల్లో కష్టాలు తప్పవని తెలిపారు. మంచినీటి వృథాను అరికట్టడానికి జలమండలి రూపొందించిన వాక్ కార్యక్రమం అద్భుతంగా ఉందన్నారు. ప్రజలు, అధికారులు సమష్టిగా నీటి వృథాపై అవగాహన కార్యక్రమాలు చేపట్ట డం శుభ పరిణామమని మంత్రి అన్నారు. జలమండలి క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వర కు తయారుచేసిన యూనిఫామ్ జాకెట్‌ను, ‘వాక్’ వివరాలు నమోదు చేసుకోవడానికి రూ పొందించిన డైరీని కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎంఏయూడీ ప్రిన్సిపాల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, జలమండలి ఎండీ ఎం. దానకిషోర్, జలమండలి డైరెక్టర్లు పాల్గొన్నారు. -
‘నీరు’గారుతున్న పథకాలు
సాక్షి, న్యూఢిల్లీ : నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు పిలుపునిచ్చారు. అంతవరకు బాగానే ఉంది. ప్రభుత్వం కూడా ఆ దిశగా సమగ్రమైన చర్యలు తీసుకోవాలి. వాతావరణ సమతౌల్యతను కాపాడడంతోపాటు దేశంలో జల సంరక్షణ కోసం గత రెండు దశాబ్దాలుగా నిపుణులు జాగ్రత్తగా రూపొందించిన విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2015లో అనూహ్యంగా మార్చి వేశారు. ‘ప్రధాన మంత్రి కృషి సించాయ యోజన’ పేరిట ఆయన ప్రభుత్వం కొత్త వ్యవసాయ స్కీమ్‌ను ప్రారంభించి, జల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ‘ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్’ స్కీమ్‌ను వ్యవసాయ స్కీమ్‌లో కలిపేసింది. వాటర్షెడ్కు కేటాయించిన నిధులను వ్యవసాయానికి మళ్లించింది. ఇది చాలా ప్రతికూలమైన పరిణామంగా పేర్కొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. దేశంలో మూడొంతుల భూభాగం నీటి సదుపాయం లేని మెట్టభూములని, వాటికి అనుకూలంగానే ఇంతకుముందు వాటర్‌షెడ్ మేనేజ్మెంట్ స్కీమ్‌ను రూపొందించినట్లు వారు చెబుతున్నారు. తాత్కాలిక ప్రయోజనాలను ఆశిస్తే భవిష్యత్తులో తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. దేశంలో జల సంరక్షణ కోసం 1980లో మార్గదర్శకాలను రూపొందించి, వాటిని ఓ స్కీమ్‌గా మలిచేందుకు దాదాపు రెండు దశాబ్దాలు పట్టిందని, ఫలితంగా 2009లో వాటర్‌షెడ్ స్కీమ్ ప్రారంభమైందని వారు చెబుతున్నారు. అలాగే గతంలో మోదీ ప్రభుత్వం మంచినీటి పథకాలకు కేటాయించిన నిధులను ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ కింద చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణానికి కేటాయించారని, దాని వల్ల నీటి పథకాలకు 80 శాతం నిధులు తగ్గిపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా నిధులు మళ్లించడం పట్ల 2016లో పార్లమెంటరీ కమిటీ సంబంధిత మంత్రిత్వ శాఖను విమర్శించింది. దేశంలో స్వచ్ఛ భారత్ కింద నిర్మించిన ప్రతి పది మరుగుదొడ్లలో ఆరింటికి నీటి సదుపాయం లేదని 2017లో కేంద్ర ప్రభుత్వ నివేదికనే వెల్లడించింది. నీటి సదుపాయం లేని మరుగు దొడ్ల వల్ల ఏం ప్రయోజనమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కొత్త పథకాలను చేపట్టక పోయినా ఫర్వాలేదుగానీ, ఉన్న పథకాలను నీరుగార్చవద్దని వారు అభిప్రాయపడుతున్నారు. -
మహోద్యమంగా జలసంరక్షణ
న్యూఢిల్లీ: దేశంలో జల సంరక్షణను ఓ మహోద్యమంగా చేపట్టాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజలంతా వర్షపునీటిని సంరక్షించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పలు నదులు, జలాశయాలు ఎండిపోయి ప్రజలు నీటికి కటకటలాడుతున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆదివారం నిర్వహించిన తొలి మాసాంతపు మన్‌కీ బాత్(మనసులో మాట) కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. నీటి పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఒకే విధానం పాటించడం సరైన పద్ధతి కాదని మోదీ అభిప్రాయపడ్డారు. ఒక్కో ప్రాంతంలో అక్కడి స్థానిక పరిస్థితులకు తగ్గట్లు ప్రతీ నీటిచుక్కను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే నీటి వనరుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న ఎన్జీవోలు, ఇతర సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పించాలని, జలసంరక్షణ పద్ధతులను అందరికీ వివరించాలని కోరారు. ప్రస్తుతం భారత్‌లో కురుస్తున్న వర్షంలో కేవలం 8 శాతం నీటిని సద్వినియోగం చేసుకోగలుగుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు జలశక్తి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశామన్నారు. గ్రామసభలను ఏర్పాటుచేసి ప్రజలంతా జల సంరక్షణ విషయంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. జలసంరక్షణ చర్యల్ని ప్రజలంతా ‘జన్‌శక్తి4జల్‌శక్తి’ అనే హ్యాష్‌ట్యాగ్ ద్వారా పంచుకోవాలని సూచించారు. 2014 అక్టోబర్ 3 నుంచి 2019, ఫిబ్రవరి 24 వరకు 53 సార్లు ‘మన్‌కీ బాత్’ కార్యక్రమాన్ని నిర్వహించిన మోదీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిలిపివేశారు. కేదార్‌నాథ్‌ను అందుకే దర్శించుకున్నా.. సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి తనను గెలిపించిన ప్రజలకు ప్రధాని మోదీ ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పారు. ‘ఈ ఏడాది ఫిబ్రవరి 24న మన్‌కీబాత్ కార్యక్రమంలో ఓ 3–4 నెలల తర్వాత మళ్లీ కలుసుకుందామని చెప్పాను. ఈ నమ్మకం మోదీది కాదు. ఇది మీరునాపై ఉంచిన నమ్మకం. ఈ నమ్మకానికి మీరే మూలకారణం. నన్ను మళ్లీ గెలిపించి ఇక్కడకు తీసుకొచ్చారు. మరోసారి మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు’ అని మోదీ తెలిపారు. ‘మన్‌కీ బాత్’ ఆగిపోయిన సమయంలో తనకు ప్రజలతో సంభాషించే అవకాశం లేకుండాపోయిందనీ, అసౌకర్యంగా, ఒంటరిగా అనిపించిందని వెల్లడించారు. ‘ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ కేదార్నాథ్, బద్రీనాథ్‌లను దర్శించుకున్నాను. ఎన్నికల మధ్యలో ఎందుకు వెళ్లారని నన్ను చాలామంది అడిగారు. రాజకీయ ప్రచారం కోసమే వెళ్లానని కొందరు అనుకున్నారు. కానీ నా అంతరాత్మను కలుసుకోవడానికి, నన్ను నేను సమీక్షించుకోవడానికే కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్లాను. అక్కడ ధ్యానం చేయడం మన్‌కీబాత్ కార్యక్రమం లేనిలోటును పూడ్చింది’ అన్నారు. మోదీ నోట ‘ఊటకుంట’ అడ్డాకుల (దేవరకద్ర): ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మహబూబ్‌నగర్ జిల్లాలోని తిమ్మాయిపల్లితండా శివారులో నిర్మించిన ఊటకుంటను ప్రస్తావించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించిన ఈ ఊటకుంట సత్ఫలితాలు ఇస్తోందని వ్యాఖ్యానించారు. వర్షాలు కురిసినప్పుడు నీరు వృథాగా వెళ్లకుండా ఉండేందుకుగాను 4–5 ఏళ్ల క్రితం ఈ కుంటను నిర్మించారు. దీనికి అనుబంధంగా మరో రెండింటిని ఏర్పాటుచేశారు. దీనివల్ల వర్షం కురిసినప్పుడు గుట్టల పైనుంచి వచ్చే వర్షపునీరు కుంటలోనే నిలిచి పరిసరాల్లో ఉండే బోరుబావుల్లో నీటిమట్టం పెరుగుతోంది. పెద్దపెద్ద చెరువుల వల్ల కలిగే ప్రయోజనాలు ఉపాధిహామీలో చిన్న కుంటలతోనూ లభిస్తున్నాయని చెబుతూ మోదీ ఈ ఊటకుంటను ప్రస్తావించారు. ప్రజాస్వామ్య గొప్పతనం తెలియట్లేదు.. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘రోజూ సమయానికి భోజనం చేసే వ్యక్తికి ఆకలి కేకలు ఎలా ఉంటాయో తెలియదు. అలాగే ప్రస్తుతం ప్రజాస్వామ్య హక్కులను హాయిగా అనుభవిస్తున్న ప్రజలకు వాటి విలువ పోగొట్టుకుంటే తప్ప బోధపడదు. ఏదైనా మన దగ్గరున్నప్పుడు దాని విలువను అర్థం చేసుకోలేం. ఎమర్జెన్సీ సమయంలో ప్రతీపౌరుడికి తమకు సంబంధించినదేమో లాక్కున్న భావన కలిగింది. దీంతో 1977లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేవలం ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటేశారు. అత్యంత గొప్పదైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండటం నిజంగా మన అదృష్టమే. కానీ దాన్ని మనం తగినరీతిలో గౌరవించడం లేదు’ అని తెలిపారు. ఇటీవలి ఎన్నికల్లో ఏకంగా 61 కోట్ల మంది ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నారని ప్రధాని వెల్లడించారు. ఈ సంఖ్య అమెరికా జనాభాకు రెట్టింపని తెలిపారు. భారత్‌లోని మొత్తం ఓటర్ల సంఖ్య యూరప్ ఖండం జనాభా కంటే ఎక్కువన్నారు. ఈ ఎన్నికల్లో పురుషులతో సమానంగా మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారనీ, ప్రస్తుతం పార్లమెంటులో 78 మంది మహిళా ఎంపీలు ఉన్నారని చెప్పారు. ప్రజలంతా గూగుల్ ద్వారా ఎక్కువ పుస్తకాలు చదవాలన్నారు. ఈ సందర్భంగా గూగుల్‌ను ‘గూగుల్ గురు’గా ప్రధాని అభివర్ణించారు. -
‘మన్‌కీ బాత్’లో దేశ ప్రజలతో ముచ్చటించిన మోదీ
-
రెండోసారి ప్రధాని అయ్యాక తొలిసారి..
సాక్షి, న్యూఢిల్లీ: మేరే ప్యారీ దేశ్ వాసియోం... అంటూ 130 కోట్లమంది భారతీయుల్ని ప్రధాని నరేంద్రమోదీ మరోసారి పలకరించారు. లోక్‌సభ ఎన్నికల ముందు విరామం ఇచ్చిన రేడియో కార్యక్రమం మన్‌కీ బాత్‌కి తిరిగి శ్రీకారం చుట్టారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత రేడియో ద్వారా తొలిసారి తన మనసులోని మాటను దేశప్రజలతో పంచుకున్నారు. దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న నీటి సమస్యను మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. జలసంరక్షణకు కలసికట్టుగా కృషిచేద్దామని పిలుపునిచ్చారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అందుకు మూడు కీలక సూచనలు చేశారు ప్రధాని మోదీ. నీటి పరిరక్షణపై పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలని ప్రముఖులకు పిలుపునిచ్చారు. సంప్రదాయ జలసంరక్షణ పద్ధతులను తెలియజేయాలని కోరారు. జలసంరక్షణకు కృషిచేస్తున్న ఎన్జీవోలు, వ్యక్తుల గురించి తెలిస్తే వారి వివరాలు అందరికీ తెలిసేలా చేయాలని విజ్ఞప్తిచేశారు. జలసంరక్షణకు సంబంధించిన ఏ సమాచారం అయినా హ్యాష్‌టాగ్ జన్‌శక్తి ఫర్ జల్శక్తికి అప్లోడ్ చేయాలని సూచించారు. మన్‌కీ బాత్‌ని తాను ఎంతో మిస్ అయ్యాయని ప్రధాని మోదీ తెలిపారు. ఈ ఆదివారం కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూశానని చెప్పారు. ఎంతోమంది ప్రజలు మన్‌కీ బాత్‌ను మిస్సవుతున్నట్టు తనకు చెప్పారని తెలిపారు. 130 కోట్లమంది భారతీయుల ఆత్మబలానికి ఈ కార్యక్రమం నిరదర్శనమన్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు ఫిబ్రవరిలో మన్‌కీ బాత్‌కి విరామం ఇస్తూ మళ్లీ వస్తా అని చెబితే... చాలామంది తనది అతివిశ్వాసం అనుకున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కాని ప్రజలపై తనకి ఎప్పుడూ విశ్వాసం ఉందని తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో భారతీయులు ఓటుహక్కు వినియోగించుకున్నారని... ప్రజాస్వామ్యంపై ప్రజలకున్న నమ్మకానికి ఇది గీటురాయని తొలి మన్‌కీ బాత్‌లో పేర్కొన్నారు ప్రధాని మోదీ. -
దేశవ్యాప్తంగా ‘చతుర్విధ జల సంరక్షణ’
రాజస్తాన్ నుంచి సాక్షి ప్రతినిధి: ఎడారి రాష్ట్రం రాజస్తాన్‌లో సత్ఫలితాలిస్తున్న చతుర్విధ జల సంరక్షణ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని కేంద్రం యోచిస్తోంది. 2016 నుంచి ఇప్పటి వరకు 3 విడతల్లో 4 లక్షల జల సంరక్షణ నిర్మాణాలను పూర్తిచేయడంతోపాటు,1.5 కోట్ల మొక్కలను నాటి, వాటిని పరిరక్షించారు. చతుర్విధ జల సంరక్షణ కార్యక్రమాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ.. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలుచేసేందుకు కార్యాచరణ రూపొందించాలని నీతి ఆయోగ్‌ను ఆదేశించారు. సంబంధిత పథకం తీరుతెన్నులపై నీతిఆయోగ్ అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది. రాజస్తాన్ రివర్ బేసిన్, స్టేట్ వాటర్ రిసోర్సెస్ ప్లానింగ్ అథారిటీకి చైర్మన్‌గా ఉన్న తెలంగాణకు చెందిన శ్రీరాం వెదిరె.. చతుర్విధ జల సంరక్షణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాన నీటి చుక్కలను ఒడిసిపట్టి వాటిని భూమిలో ఇంకేలా చేసేందుకు 3 రకాలుగా కందకాలు తవ్వడం, వాటి కింది భాగంలో చిన్న చిన్న ఊట చెలిమలు సృష్టించడం, ఇంకా కింది ప్రాంతంలో చెరువులు, చెక్ డ్యాములు నిర్మించడం ఈ చతుర్విధ జల ప్రక్రియలో భాగం. -
బోరు తవ్వడానికి ముందే కందకాలు!
పండ్ల తోట వేయాలనుకున్న భూమిలో బోరు వేయడానికి ముందే కందకాలు తవ్వించుకొని.. వాన నీటి సంరక్షణ ద్వారా భూగర్భ జలాన్ని పెంపొందించుకున్న ఓ రైతు గాథ ఇది. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన మేరెడ్డి ప్రవీణ్‌కుమార్ రెడ్డి తన 5 ఎకరాల ఎర్ర భూమిలో పండ్ల తోట నాటాలనుకున్నారు. అయితే, వర్షపాతం తక్కువగా ఉండే ఆ ప్రాంతంలో బోర్లు వేసినా పెద్దగా నీరు రావటం లేదు. తన పొరుగు పొలంలో ఒక రైతు 2, 3 బోర్లు వేసినా వ్యవసాయానికి సరిపోయేంత నీరు రావడం లేదు. ఇది గమనించిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తొలుత తన భూమిలో కందకాలు తవ్వించుకోవడం విశేషం. తన సోదరుడు, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074), అధ్యక్షులు సంగెం చంద్రమౌళి(98495 66009)లను రెండేళ్ల క్రితం వెంటబెట్టుకెళ్లి వాలుకు అడ్డంగా, ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో, మీటరు లోతు మీటరు వెడల్పున కందకాలు తీయించారు. కందకం 25 మీటర్ల పొడవున తవ్విన తర్వాత 5 మీటర్ల ఖాళీ వదిలి ఆ తర్వాత.. అదే వరుసలో మరో కందకం తవ్వించారు. తర్వాత ఏడాది వర్షాలు పడినప్పుడు భూమిలో కురిసిన ప్రతి నీటి బొట్టూ కందకాల ద్వారా భూమిలోకి ఇంకి భూగర్భ నీటి మట్టం పెరిగింది. గత ఏడాది బోరు వేయడంతో రెండించుల నీరు పడింది. తదనంతరం 5 ఎకరాలకు ఫెన్సింగ్ వేయించారు. ప్రస్తుతం పండ్ల తోట నాటడానికి సిద్ధమవుతున్నారు. పండ్ల మొక్కల మధ్యలో అంతరపంటగా చిరుధాన్యాలను సాగు చేయాలని భావిస్తున్నానని ప్రవీణ్‌కుమార్ రెడ్డి(99636 41978) తెలిపారు. కందకాల వల్లనే తన భూమిలోని బోరులో నీరు పుష్కలంగా వస్తున్న విషయం తెలిసి కూడా ఇతర రైతుల్లో ఆలోచన రావటం లేదని, కందకాలు తవ్వితే భూమి వృథా అవుతుందని ఆలోచిస్తున్నారని అన్నారు. కందకాల ద్వారా వాన నీటి సంరక్షణ ప్రయోజనాలను రైతులకు వివరించి వారిలో చైతన్యం తెచ్చేందుకు తమ గ్రామంలో సదస్సు నిర్వహించాలని కూడా ఆయన భావిస్తుండటం ప్రశంసనీయం. -
కందకాల ద్వారా పరిశ్రమకు, తోటకు నీటి భద్రత!
ఈ ఏడాది చెప్పుకోదగ్గ వర్షం కురవకపోయినా.. సంగారెడ్డి జిల్లా పసలవాది గ్రామ పరిధిలో ఒక పరిశ్రమకు, దాని పక్కనే ఉన్న మామిడి తోట, వరి పొలానికి నీటి కొరత లేదు! ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఇది నిజం. ఇందులో మాయ మంత్రాలేమీ లేవు. ఇది కేవలం కందకాల మహత్మ్యం! అది 13.5 ఎకరాల భూమి. అందులో రెండెకరాల విస్తీర్ణంలో నిర్మించిన పెద్ద ఇండస్ట్రియల్ షెడ్ ఉంది. కొద్ది సంవత్సరాల క్రితం దీన్ని వత్సవాయి కేశవరాజు కొనుగోలు చేశారు. అప్పటికి ఒకటే బోరు ఉంది. మరో 4, 5 చోట్ల బోరు వేశారు. చుక్క నీరు పడలేదు. ఇక ఉన్న బోరే దిక్కయింది. స్టెయిన్లెస్ స్టీల్ పైపుల తయారీ పరిశ్రమ అది. పరిశ్రమకు నీరు అవసరం ఉంటుంది. ఆరు ఎకరాల్లో మామిడి మొక్కలు నాటారు. మిగతా భూమిలో కంది తదితర పంటలు పండించే వారు. ఎండాకాలంలో బోరుకు నీరు తగినంత అందేది కాదు. ఆగి, ఆగి పోసేది. అటువంటి పరిస్థితుల్లో మిత్రుడు ప్రకాశ్‌రెడ్డి సూచన మేరకు వాన నీటి సంరక్షణ చేపట్టి నీటి భద్రత పొందాలన్న ఆలోచన కలిగింది. కందకాలతో స్వల్ప ఖర్చుతోనే నీటి భద్రత పొందవచ్చని ‘సాక్షి’ దినపత్రిక ద్వారా తెలుసుకొని.. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షులు సంగెం చంద్రమౌళి(984 956 6009)ని సంప్రదించి, ఆయన పర్యవేక్షణలో 2015లో కందకాలు తవ్వించారు. ఇండస్ట్రియల్ షెడ్‌పై నుంచి పడే వర్షపు నీరు మొత్తం అంతకు ముందు వృథాగా బయటకు వెళ్లిపోయేది. ఆ నీటిని మొత్తాన్నీ భూమిలోకి ఇంకేలా చంద్రమౌళి దగ్గరుండి మీటరు లోతు, మీటరు వెడల్పున కందకాలు తవ్వించారు. కందకాలు నిండినా నీరు బయటకు పోకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. అప్పటి నుంచి ఎంత వర్షం పడినా నీరంతా భూమిలోకి ఇంకుతూ ఉన్నది. ఫలితంగా నీటికి వెతుక్కోవాల్సిన పని లేకుండాపోయిందని కేశవరాజు ‘సాగుబడి’కి తెలిపారు.పరిశ్రమకు, డ్రిప్‌తో పెరుగుతున్న మామిడి తోటకు ఈ మూడేళ్లలో ఎటువంటి నీటి కొరతా రాలేదన్నారు. మామిడితోపాటు జామ, బత్తాయి మొక్కలు సైతం నాటామని, సేంద్రియ పద్ధతుల్లో జీవామృతం తదితరాలతోనే సాగు చేస్తున్నామన్నారు. కందకాలు తవ్వి చుక్క నీరు వృథాగా పోకుండా ఇంకింపజేయడం వల్ల నీటికి కొరత లేకుండా పనులు సాఫీగా జరుగుతున్నాయన్నారు. ఈ ఏడాది ఇంతవరకు చెప్పుకోదగ్గ వర్షం పడకపోయినప్పటికీ.. నీటి కొరత లేని కారణంగా.. రెండెకరాల్లో తెలంగాణ సోనా వరి సాగు చేస్తున్నామని కేశవరాజు (98489 90129) సంతోషంగా చెప్పారు. -
కందకాలతో నీటి లభ్యత పెరిగింది!
కందకాలు తవ్వించుకోమని చెబితే వినిపించుకుని అనూహ్యమైన రీతిలో సాగు నీటి భద్రత సాధించిన సొంత భూముల రైతులు చాలా మంది కనిపిస్తున్నారు. అయితే, కౌలు రైతులు కూడా కందకాలు తవ్వించుకోవడం అరుదైన విషయం. రామిశెట్టి వెంకటేశ్వరరావు(95020 50975), డా. కంచర్ల ప్రవీణ్(87128 45501).. అనే మిత్రులు చాలా సంవత్సరాలు విదేశాల్లో ఉద్యోగాలు చేసి స్వదేశం వచ్చేసి ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షారాజిపేటలో 12 ఎకరాల భూమిని పదేళ్ల పాటు కౌలుకు తీసుకున్నారు. 3 బోర్లు వేస్తే 2 ఇంచుల నీళ్లు వచ్చాయి. అయితే, ఇసుకపాళ్లు ఎక్కువగా ఉన్న ఎర్ర నేల కావడంతో మంచి దిగుబడులు తీయాలంటే వాన నీటి సంరక్షణ ద్వారా సాగు నీటి భద్రత సాధించడం అతిముఖ్యమని భావించారు. గూగుల్ సెర్చ్ చేస్తే.. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం, సాక్షి ఆధ్వర్యంలో సాగు భూమిలో అంతటా కందకాలు తవ్వుకునే పద్ధతి గురించి తెలిసింది. సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074)ని సంప్రదించి.. 2017 మే/జూన్‌లో ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో మీటరు లోతు, మీటరు వెడల్పున కందకాలు తవ్వించారు. పుష్కలంగా వర్షాలు పడడంతో అనేకసార్లు కందకాలు నిండాయి. ఆరు నెలల్లో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. కలబంద+ఉల్లి, ఆపిల్ బెర్, చెరకు, మునగాకు, పందిరి కూరగాయలను సాగు చేస్తున్నారు. ‘అంతకుముందు డ్రిప్ ద్వారా 3 వాల్వులకు సరిపోని నీటి ప్రెజర్, 6–7 వాల్వులకు పెరిగింది. పక్క తోటల వాళ్లను అడిగితే తమకు తేడా లేదన్నారు. అప్పుడు మాకు అర్థమైంది. కందకాలు తవ్వి వర్షపు నీటిని ఇంకింపజేయడం వల్లనే ప్రెజర్ రెట్టింపైంది. డ్రిప్ నీటి ప్రెజర్ ఈ ఎండాకాలంలో కూడా తగ్గలేదు..’ అని వెంకటేశ్వరరావు ఇటీవల ‘సాగుబడి’తో చెప్పారు. -
వాన నీటి సుల్తాన్
రాబోయేది వానా కాలం. వాన వస్తుంది... వెళుతుంది అనుకుంటున్నారా? మధ్యలో చాలా పని చేయవచ్చు. వానను వాగు చేయొచ్చు. వరద చేయొచ్చు. బంధించి సంవత్సరం పొడవునా పనికి వచ్చే గింజలు ఇచ్చే జీవజలం కూడా చేయవచ్చు. అనంతపురం జిల్లా నీటి వసతి లేని జిల్లా అని అందరూ అంటారు. కాని ఈ రైతు తన పొలంలో నీటిని బంధించాడు. వాన నీటినే దాహానికీ సేద్యానికీ నిలువ చేయగలిగాడు. ఇవాళ అక్కడ మామిడి పండుతోంది. అంతేనా... చుట్టు పక్కల అడవుల నుంచి పక్షులు, పశువులు వచ్చి నట్ట నడెండలో ఈ వయాసిస్సులో దప్పిక తీర్చుకొని పోతున్నాయి. నూర్ మహమ్మద్ ఇది ఎలా సాధించాడో ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రశ్న: నూర్‌మహమ్మద్ గారూ.. ఎడతెగని కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో మీ తోటను ఎడారిలో ఒయాసిస్సుగా మార్చారు గదా.. మీ కృషి ఎప్పుడు ప్రారంభమైంది..? నూర్ మహమ్మద్: నేను వ్యవసాయ శాఖలో విస్తరణాధికారిగా పనిచేస్తుండగా బుక్కపట్నం మండలంలో 8 ఎకరాల భూమి కొన్నాను. అప్పట్లో అది బీడు భూమి. ఈ బీడు ఎందుకు తీసుకున్నారు? అని అందరూ అనేవారు. నీళ్లు చుక్క లేకుండా ఈ భూమిని ఏం చేసుకుంటావు? అని అడిగేవారు. నిజమే, నీటి వసతి లేని భూమి వృధానే. కానీ, ఫ్రయత్నిస్తే ఎడారిలో కూడా నీళ్లు సాధించవచ్చు. మబ్బుల్లో వాన ఉంటుంది కదా.. చాలు అనుకున్నాను. డిపార్ట్మెంట్లో నేను భూవనరుల సంరక్షణ విభాగంలో పనిచేసే వాడిని కనుక, ప్రతి నీటి బొట్టు విలువ తెలుసు కనుక ఎవరేమన్నా పట్టించుకోకుండా పదేళ్ల క్రితం నుంచి నీటి సంరక్షణ పనులు మొదలుపెట్టాను. అప్పట్లోనే లక్షన్నర రూపాయల వరకు ఖర్చు చేశా. భూగర్భంలో నీటిని దాచుకోవడానికి స్టెప్ బై స్టెప్ పని చేయడం మొదలుపెట్టా. ప్రశ్న:ఎలా మొదలుపెట్టారు..? మా బీడు భూమిలో నుంచి ఒక వంక వెళుతూ ఉంది. మొదట దానిపైన చెక్‌డ్యాం నిర్మించాం. తర్వాత తోట మధ్యలో అక్కడక్కడా 2.5 మీటర్ల వెడల్పు, మీటరు లోతులో మట్టికట్టలు కట్టాం. మట్టికట్ట చివరన మలుపులో నీటి కుంట తవ్వాం. అవి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మాకు జూన్, జూలై నెలల్లోనే వర్షం ఎక్కువ పడుతుంది. పది రోజుల వాన ఒకేసారి పడుతూ ఉంటుంది. అంత పెద్ద వర్షానికి వచ్చే నీటి వరదను ఆపగలిగేలా మట్టి కట్టలు వేశాం. ప్రశ్న:కందకాలు ఎప్పుడు తవ్వారు? సాక్షి టీవీ, పేపరు ద్వారా కందకాల గురించి చదివి తెలుసుకున్న తర్వాత గత ఏడాది తవ్వాం. రెండు మీటర్ల లోతు, రెండు మీటర్ల వెడల్పున తోట చుట్టూ తవ్వాం. ప్రశ్న:మీరు చేపట్టిన వాన నీటి సంరక్షణ పనుల ప్రభావం ఎలా ఉంది? చాలా బాగుంది. నేను పెట్టిన ప్రతి రూపాయికీ కొన్ని వందల రెట్లు ప్రతిఫలం దక్కింది. మా దిగువన కిలోమీటరున్నర వరకూ భూగర్భ జలాలు రీచార్జ్ అయ్యాయి. దిగువ రైతులకూ నీటి భద్రత చేకూరింది. ప్రశ్న:మీ తోటకు ఎంత మేలు జరిగింది? మా 8 ఎకరాల తోటలో 9 రకాల మామిడి చెట్లు 500 వరకు ఉంటాయి. మా తోట ఎంతో బాగుంది. పచ్చగా, ఆరోగ్యంగా మంచి దిగుబడి వస్తోంది. ఏటా నికరంగా రూ. పది లక్షల ఆదాయం వస్తున్నది. మాకు ఎప్పుడూ నీటి కరువు లేదు. మా మండలంలో గత ఏడాది 250 ఎకరాల్లో మామిడి తోటలు నీరు లేక నిలువునా ఎండిపోయాయి. మా పొలంలో కురిసిన వానలో నుంచి చినుకు కూడా బయటకు పోకుండా జాగ్రత్త పడటం వల్లనే ఇది సాధ్యమైంది. ప్రశ్న:మీ తోట దగ్గర పశువులకు, అటవీ జంతువులకూ నీరు అందుబాటులో ఉంచారట కదా..? అవును సార్. మాకు చాలా సంతోషం కలిగించే సంగతి ఇది. మా తోట దగ్గర్లో ఉన్న అడవిలో కూడా జంతువులు తాగడానికి నీరు లేదు. తోట ఎదుట సిమెంటు తొట్టిని నిర్మించాం. అందులో ఎప్పుడూ నీళ్లు ఉండేలా చూస్తున్నాం. పక్షులు కూడా వచ్చి దప్పిక తీర్చుకుంటాయి. రాత్రుళ్లు అటవీ జంతువులు వచ్చి దాహం తీర్చుకుంటుంటాయి. ప్రశ్న:రైతులు ఎలా స్పందిస్తున్నారు..? పది మందికీ ఉపయోగపడే పని చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాంత రైతులంతా మాతో బాగుంటారు. చాలా మంది వచ్చి చూసి వెళుతూ ఉంటారు. మా తోట గురించి ఎవరైనా కొత్తవారు వచ్చి అడిగితే.. సాయిబు తోట అనో మరోటో అనరు. ఆప్యాయంగా ‘సార్ తోట’ అని చెబుతారు. కరువు నేలలో సిరులు పండించవచ్చంటున్న నూర్ మహమ్మద్, ఇంత వేసవిలోనూ ఇన్ని నీళ్లున్నాయి ఎడారిలో ఒయాసిస్సు! ఎడారీకరణ ముప్పును ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లాలో కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలు నిరంతర కరువు మండలాలు. రబీ కాలంలో జిల్లా సగటు వర్షపాతం 100 ఎం.ఎం. ఉంటుంది. ఈ మండలాల్లో 20 ఎం.ఎం.కు మించదు. ఈ కారణంగా కరువు మండలాల జాబితాలో గత నాలుగైదేళ్లుగా ఈ మండలాలు క్రమం తప్పకుండా చోటుచేసుకుంటున్నాయి. గత ఏడాది ఈ ప్రాంతంలో 250 ఎకరాల్లో మామిడి తోటలు నిలువునా ఎండిపోయాయి. కటిక కరువు తాండవించే అటువంటి ప్రాంతంలో మామిడి రైతు నూర్‌మహమ్మద్, అతని కుమారుడు అజీజ్ ఎడారిలో ఒయాసిస్సును సృష్టించారు. ముందుచూపుతో పదేళ్ల క్రితం నుంచి చేపట్టిన నీటి సంరక్షణ పనులు ఈ అద్భుతాన్ని ఆవిష్కరింపజేశాయి. కొత్తచెరువుకు చెందిన నూర్‌మహమ్మద్, ఆయన కుమారుడు అజీజ్ బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి సమీపంలోని తమ 8 ఎకరాల తోటలో మామిడి సాగు చేస్తున్నారు. వాన నీటి సంరక్షణ చర్యల ద్వారా జలసిరులను ఒడిసిపడుతున్నారు. గత పదేళ్లుగా తమ పొలంలో కురిసిన ఒక్క చుక్కను కూడా బయటకు పోకుండా పూర్తిగా భూమిలోపలికి ఇంకింపజేస్తున్నారు. ఫలితంగా వీరి తోటలో నీటి కుంటల్లో పుష్కలంగా నీరు ఉంది. సేంద్రియ పద్ధతుల్లో సాగవుతున్న మామిడి చెట్లు నిండైన పండ్ల కాపుతో కళకళలాడుతూ లాభాల సిరులు తెచ్చిపెడుతున్నాయి.అంతేకాదు, కిలో మీటరు దూరం వరకు భూగర్భ జలాలు 250 అడుగుల్లోనే అందుబాటులోకి వచ్చాయి. అడవిలో కూడా తాగడానికి చుక్క నీరు దొరకని పరిస్థితుల్లో వీరి తోట బయట నీటి తొట్టిని ఏర్పాటు చేసి పశువులు, అటవీ జంతువుల దాహం తీర్చుతుండడం ప్రశంసనీయం. నూర్‌మహమ్మద్ వ్యవసాయ శాఖలో విస్తరణాధికారిగా ఉద్యోగం చేసి రిటైరయ్యారు. ఉద్యోగంలో ఉండగానే పాతికేళ్ల క్రితం 8 ఎకరాల మామిడి తోటను కొనుగోలు చేశారు. కరువు తీవ్రమవుతున్న దశలో పదేళ్ల క్రితం నుంచి ముందుచూపుతో వాన నీటి సంరక్షణ పనులు చేపట్టారు. తోట చుట్టూ 2 మీ. లోతు, 2 మీ. వెడల్పుతో కందకాలు తవ్వారు. తోట మధ్యలో నుంచి వెళ్తున్న వంకపై చెక్ డ్యాం నిర్మించారు. 40 మీటర్లకు ఒకచోట వాలుకు అడ్డంగా మట్టికట్టలు వేశారు. తోట నాలుగు వైపులా నాలుగు నీటి కుంటలు తవ్వించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక్క చుక్క నీరు కూడా బయటకుపోకుండా నేలలో ఇంకిపోయేలా పకడ్బందీగా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఎండాకాలంలో సైతం చెక్‌డ్యామ్ వద్ద నీరు నిల్వ ఉండటం విశేషం. మామిడి తోట ఎలాంటి పరిస్థితుల్లోనూ దెబ్బ తినకుండా నీటి భద్రత నెలకొంది. రెండు బోర్లలోనూ నీళ్లు పుష్కలంగా ఉండటం వలన డ్రిప్ కూడా లేకుండా చెట్టు పాది నిండా నీళ్లు పెడుతున్నారు. 25 సంవత్సరాల వయస్సుగల చెట్టుకు 40 నుంచి 50 కిలోల పశువుల ఎరువు వేస్తున్నారు. దీంతోపాటు, కుమారుడు అజీజ్ సహాయంతో వర్మీ కంపోస్ట్(ఎర్రల ఎరువు)ను తోటలోనే తయారు చేసి వేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. చీడపీడల నివారణ కోసం పుల్లని మజ్జిగను చెట్టు మొత్తం తడిసే విధంగా పిచ్చికారీ చేస్తున్నారు. 8 ఎకరాలలో సంవత్సరానికి ఖర్చులు పోను రూ. 10 లక్షల వరకు నికరాదాయం వస్తోందని నూర్‌మహ్మద్ తెలిపారు. సేంద్రియ ఎరువుల వాడకం, పుష్కలంగా నీటి తడులు ఇవ్వటం వల్ల కాయలు బాగా పెద్దవిగా ఉండటంతో పాటు అధిక దిగుబడులు వస్తున్నాయని తెలిపారు. ‘తలమార్పిడి’తో చెట్లకు పునరుజ్జీవం! కాత రాని, పనికిరాని చెట్లను 3 మీటర్ల ఎత్తున కోసి.. మల్లిక, బాదుషా వంటి మేలు జాతి మొక్కలను అంటు కట్టి మంచి ఫలితాలు సాధిస్తున్నాం. ఒక చెట్టుకు 10–15 వరకు అంట్లు కడుతున్నాం. ఇలా ‘తలమార్పిడి’తో అంటుకట్టిన చెట్లు మూడేళ్లలోనే పూర్తిస్థాయి కాపును ఇస్తున్నాయి. ఇతర రైతులు కూడా ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు మాత్రమే వాడుతున్నాం. రసాయనిక ఎరువులు ఎన్నడూ వాడలేదు. కాయ మంచి సైజు వస్తున్నది. ఖర్చులన్నీ పోను ఏడాదికి రూ. 10 లక్షల నికరాదాయం వస్తున్నది. – నూర్‌మహ్మద్ (94409 83644), కొత్తచెరువు, అనంతపురం జిల్లా కుమారుడు అజీజ్‌తో నూర్‌మహమ్మద్ – కడప గంగిరెడ్డి, సాక్షి, బుక్కపట్నం, అనంతపురం జిల్లా -
పరి పరిశోధన
కొత్త కాంక్రీట్‌తో జల సంరక్షణ సులువు! వాన చినుకులన్నీ నేలలోకి ఇంకితే భూగర్భ జలం వృద్ధి చెందుతుంది. అందరికీ మేలు జరుగుతుంది. కానీ.. నగరాల్లో అంగుళం ఖాళీ లేకుండా వేసే కాంక్రీట్ రోడ్ల కారణంగా నీరంతా కొట్టుకుపోతోంది. అయితే వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనల కారణంగా ఈ చిక్కు సమస్య త్వరలోనే పరిష్కారం కానుంది. దృఢమైన కాంక్రీట్ ద్వారా కూడా నీళ్లు సులువుగా జారిపోయేలా వీరు ఓ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడం దీనికి కారణం. ఏటికేడాదీ పెరిగిపోతున్న కార్బన్ ఫైబర్ వ్యర్థాలతోనే ఈ ఘనతను సాధించడం విశేషం. కాంక్రీట్ ద్వారా నీరు కొద్దిమోతాదులో ఇంకేందుకు అవకాశమున్నప్పటికీ ఇది కాస్తా కాంక్రీట్ దృఢత్వంపై ప్రభావం చూపుతుంది. కొద్దికాలానికే కాంక్రీట్ కొట్టుకుపోతుంది. ఈ నేపథ్యంలో కార్ల్ ఇంగ్లండ్, సొమాయా నాసిరీలు కార్బన్ ఫైబర్ వ్యర్థాలతో కొత్త రకం కాంక్రీట్‌ను తయారు చేశారు. ఇది దృఢంగా ఉండటమే కాకుండా సాధారణ కాంక్రీట్ కంటే ఎక్కువ మోతాదులో నీరు భూమిలోకి ఇంకేలా రంధ్రాలు కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పరిశోధన శాలలో ఈ కొత్త కాంక్రీట్ బాగా పనిచేసినప్పటికీ.. సాధారణ పరిస్థితుల్లో ఎలా వ్యవహరిస్తుందో పరీక్షించాల్సి ఉందని.. ఆ తరువాత విస్తృత స్థాయి వాడకానికి సిద్ధం చేయవచ్చునని నాసిరీ అంటున్నారు. దెబ్బతిన్న గుండెను సరిచేసేందుకు కొత్త పద్ధతి తోక తెగిపోతే మళ్లీ పెంచుకోగల శక్తి బల్లులకు సొంతం. అలాగే కొన్ని రకాల చేపలు తమ గుండె కణజాలాన్ని మళ్లీ అభివృద్ధి చేసుకోగలవు. మనిషికీ ఇలాంటి శక్తి ఉంటే.. అనేక గుండెజబ్బులకు మెరుగైన, సులువైన చికిత్స సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ పనిలోనే ఉన్నారు గ్లాడ్స్టోన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన వివేక్ శ్రీవాస్తవ. మన శరీరంలో కార్డియోమయోసైట్స్ అనే కణాలు కొన్ని ఉంటాయి. పిండ దశలో గుండె ఏర్పడేందుకు గణనీయంగా విభజితమయ్యే ఈ కణాలు.. ఆ తరువాత మాత్రం విభజనకు గురికావు. కార్డియోమయోసైట్స్కు మళ్లీ ఆ శక్తిని అందించేందుకు శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా వివేక్ శ్రీవాస్తవ ఇందులో విజయం సాధించారు. జంతువులపై చేసిన ప్రయోగాల్లో కార్డియోమయోసైట్స్ విభజితమవడమే కాకుండా దెబ్బతిన్న గుండె కణజాలాన్ని మరమ్మతు కూడా చేసినట్లు శ్రీవాస్తవ ప్రకటించారు. కార్డియోమయోసైట్స్ విభజనకు సంబంధించి మొత్తం నాలుగు జన్యువులు పనిచేస్తున్నట్లు గుర్తించిన ఈయన వాటిని పూర్తిస్థాయిలో పనిచేసేలా చేయడం ద్వారా కణాలు వేగంగా విభజితమయ్యేలా చేయగలిగారు. కార్డియోమయోసైట్స్ విభజనను కచ్చితంగా నియంత్రించడం ఎలాగో అర్థం చేసుకోవడం ద్వారా ఈ పద్ధతిని మనుషుల్లోనూ ఉపయోగించవచ్చునని, తద్వారా గుండె పనిచేయని స్థితికి చేరుకున్న వారికీ సాంత్వన చేకూర్చడం వీలవుతుందని శ్రీవాస్తవ అంటున్నారు. వెలుగులు ఒడిసి పడతాయి... సూర్యుడి నుంచి వెలువడే వెలుగును వంద శాతం విద్యుత్తుగా మారిస్తే.. ఈ భూమ్మీద పెట్రోలు, డీజిల్ వంటివి అస్సలు అవసరం ఉండదు. కాకపోతే ఎంతటి గొప్ప సోలార్ ప్యానెలైనా కేవలం 25 శాతాన్ని మాత్రమే విద్యుత్తుగా మార్చగలవు. ఈ నేపథ్యంలో జర్మనీలోని బ్రాన్ష్వెగ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన ఆవిష్కరణ చేశారు. అన్ని దిక్కుల నుంచి వెలుతురును తీసుకుని అతితక్కువ ప్రదేశంలోకి కేంద్రీకరించగలిగే సరికొత్త పరికరాన్ని అభివృద్ధి చేశారు. వీటిని వరుసగా పేర్చడం ద్వారా సూర్యకిరణాల్లోని అన్నిరకాల కాంతిని విద్యుత్తుగా మార్చవచ్చు. ఈ పరికరం మొక్కల్లో వెలుతురును ఒడిసిపట్టే కణాల మాదిరిగా పనిచేస్తుందని ఫోటాన్లను శోషించుకుని ఇతర కణాలకు చేరవేస్తాయని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త పీటర్ జోమో వల్లా తెలిపారు. దాదాపు 80 శాతం కాంతిని చిన్న ప్రదేశంలోకి కేంద్రీకరించగల ఈ పరికరాలతో భవిష్యత్తులో అతితక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయగల సోలార్ కాన్సెంట్రేటర్స్ను తయారు చేయవచ్చునని ఆయన వివరించారు. ప్రస్తుతం తాము నీలిరంగు కాంతిని శోషించుకుని మళ్లించగలిగేలా చేయగలిగామని.. ఇతర రంగులకు కూడా ఈ పద్ధతిని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.