ఒకవైపు వర్షాభావం... మరోవైపు అడుగంటిన భూగర్భ జలాలు... వచ్చేసిన వేసవి. ఇంకా రెండు మూడు నెలలు గడవాలి ఈ వేసవిలో నీరు ముఖ్యం. బెంగళూరు ఇప్పటికే అనుభవిస్తోంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తక్కువ నీటితో బాగానే ఉండొచ్చు అని బెంగళూరు డాక్టర్ దివ్యాశర్మ రాసిన ‘ఎక్స్’ పోస్టు వైరల్ అయ్యింది. అది అందరికీ శిరోధార్యం. ఆమె చేసిన నీటి పొదుపు సూచనలు.
ఎక్కడ నీటి ట్యాంకర్లు కనిపించవో, ఎక్కడ స్త్రీలు కుళాయిల దగ్గర ప్లాస్టిక్ బిందెలతో తగాదాలు పడరో, ఎక్కడ పల్లెటూరి మనుషులు నెత్తిన కడవలతో మైళ్లకు మైళ్లు నడవరో, ఎక్కడ ప్రతి ఇంటిలో అవసరమైన నీరు అందుబాటులో ఉంటుందో అదే సుభిక్షితమైన ప్రాంతం. ‘ఎడతెగక పారే ఏరు’ లేని ఊరిని చప్పున వదిలిపెట్టమన్నాడు సుమతీ శతకకారుడు. నీరు జీవనాధారం. నీరు నిత్యావసరం. కాని నేటికీ తాగునీళ్లు అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. దానికి తోడు కరువు పరిస్థితి తోడైతే... వేసవి వచ్చిపడితే?
స్త్రీలదే భారం
నీటి సమస్య ఎప్పుడూ స్త్రీల సమస్య. ఇంట్లో ఉండేది స్త్రీలు, ఇంటి పనులకు నీటిని ఉపయోగించాల్సిన వారు స్త్రీలు కనుక నీటి బెంగ స్త్రీలదే. పురుషుడు తాను ‘బయట సంపాదించాలి కాబట్టి’ ఇంట్లో ఉండే స్త్రీ నీటి బాధలు పడాల్సిందే అనే భావజాలం ఇంకా పోలేదు. నీటి బాధల్లో చేయూతనిచ్చే పురుషులు ఉన్నా అధికశాతం స్త్రీలే ఈ బాధలు పడతారు. ఇంట్లో నీళ్లు లేకపోతే పురుషుడి చేత తిట్లు తింటారు. నీళ్లు తేవడంలో పిల్లల సాయం అందకపోతే నడుములు విరగ్గొట్టుకునేలా నీరు మోస్తారు. ప్రస్తుతం రెండు పనులు తప్పక జరగాలి.
1. నీటి సమస్య ఇంట్లో తీర్చడానికి పురుషుడు సమాన భాగస్వామ్యం వహించేలా చైతన్యపరచడం.
2. ప్రతి ఇంట్లో నీటి పొదుపు కోసం ప్రతి కుటుంబ సభ్యుడు చైతన్యవంతం కావడం.
నీరు వృథా చేయడం అంటే?
కొందరు ఉంటారు... సింక్ దగ్గర నిలబడి ట్యాప్ తిప్పి బ్రష్ చేయడం మొదలెడతారు. ఇక బ్రషింగ్ అవుతున్నంత సేపు ట్యాప్ నుంచి నీరు వృథా కావాల్సిందే. మరికొందరు బాత్‌రూమ్ ఫ్లోర్ మీద రోజుకు రెండు ఫుల్ బకెట్లు కుమ్మరిస్తారు శుభ్రత కోసం. మరికొందరు సగం బకెటు స్నానం చేసి మిగిలిన సగాన్ని వృథాగా వదిలేస్తారు. ఆ తర్వాత వచ్చిన కుటుంబ సభ్యులు ఆ నీరు స్నానానికి వాడలేక కమోడ్‌లో పారబోస్తారు.
మరికొందరు టాయిలెట్ మీద కూచుని ఏమీ తోచక స్ప్రే గన్ చేత పట్టి నీటిని ప్రెస్ చేస్తూ ఆటలాడుతూ ఉంటారు. మరికొందరు రోజుకు రెండు సార్లు షవర్ తిప్పి ఆరాముగా స్నానం చేస్తారు. మరికొందరు గిన్నెలు కడుగుతున్నంత సేపు వాష్ ఏరియాలో ట్యాప్ తిప్పే ఉంచుతారు. ఇంకొందరు కిచెన్ సింక్‌లో చిన్న గ్లాస్ కడగాలన్నా ట్యాప్ తిప్పి అర బకెట్ నీళ్లు సింక్‌లో వృథాగా పోనిస్తారు. ఇక ఉతికిన బట్టలను మూడుసార్లు జాడించేవారు ఇంకొందరు. ఒక్క నీటిబొట్టు కూడా సృష్టించలేని మనకు ఇన్ని నీళ్లు వృథా చేసే హక్కు లేదు.
పొదుపే మిగులు
నీళ్లు ఎక్కువ కావాలనుకుంటే తక్కువ ఖర్చు చేయాలి. అప్పుడు తక్కువ ఉన్నా ఎక్కువ అనిపిస్తాయి. ఇప్పుడు బెంగళూరు నగరం నీటి కరువుతో ఇబ్బందులు పడుతోంది. నీరు వృథా చేసేవారికి జరిమానాలు విధిస్తున్నారు. నీరు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలో అక్కడి డెర్మటాలజిస్ట్ డాక్టర్ శర్మ ఇటీవల ‘ఎక్స్’ (ట్విటర్)లో రాసిన పొదుపు పోస్ట్ అందరికీ నచ్చింది. ‘మాకు నీళ్లు సమృద్ధి ఎప్పుడూ. కాని మేము నీటిని పొదుపుగా వాడతాము. రొటీన్‌కు ఏ భంగం కలగకుండా నీటిని పొదుపుగా వాడొచ్చు’ అని పొదుపు చిట్కాలు చెప్పిందామె.
ఇవీ ఆ పొదుపు చిట్కాలు
► బాత్‌రూమ్స్‌లో షవర్స్ బంద్ చేయాలి. బకెట్‌లో పట్టుకుని స్నానం చేయాలి. షవర్‌లో చాలా నీళ్లు వృథా అవుతాయి. పైగా ఎక్కువ సేపు నీళ్లలో నానడం కూడా చర్మానికి మంచిది కాదు. కొందరు రోజుకు రెండుసార్లు స్నానం చేస్తారు. ఒకసారి స్నానం వల్ల లోటేం జరగదు.
► ట్యాప్‌లకు ఎరీటర్‌లు బిగించాలి. ట్యాప్‌లు తిప్పితే నీళ్లు భళ్లున వస్తాయి. వృ«థా అవుతాయి. అదే అన్ని ట్యాప్‌లకు ఎరీటర్లు (చిల్లుల పరికరం) బిగిస్తే నీళ్లు జల్లుగా పడతాయి. పొదుపు అవుతాయి. ముఖ్యంగా అంట్లు తోమేప్పుడు చాలా నీళ్లు పొదుపు అవుతాయి.
► ఆర్‌ఓల నుంచి ఫిల్టర్ సమయంలో వృథాగా పోయే నీటిని పట్టి మొక్కలకు పోయాలి. మాప్ పెట్టడానికి ఉపయోగించాలి. Ü వాషింగ్ మిషన్‌ను ఒకటీ అరా బట్టల కోసం కాకుండా ఫుల్‌లోడ్‌తో ఉపయోగించాలి.
► కార్ వాషింగ్‌కు నీటిని వృథా చేయకుండా తడి బట్టతో తుడుచుకోవాలి.
► డిష్ వాషర్ ఉపయోగించడం వల్ల నీళ్ళు తక్కువ ఖర్చు అవుతాయి. అంట్లు తోమితే 60 లీటర్ల నీళ్లు కనీసం పడతాయి. డిష్ వాషర్‌లో 10 లీటర్లు సరిపోతాయి.
► ప్లంబర్‌ని పిలిచి అన్నీ లీకులను చెక్ చేయించాలి.
► పిల్లలకు నీటి విలువ తెలియచెప్పి నీళ్లు వృ«థా చేయకుండా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment