water saving method
-
అడుగు అడుగులోనూ నీటి పొదుపు!
ఒకవైపు వర్షాభావం... మరోవైపు అడుగంటిన భూగర్భ జలాలు... వచ్చేసిన వేసవి. ఇంకా రెండు మూడు నెలలు గడవాలి ఈ వేసవిలో నీరు ముఖ్యం. బెంగళూరు ఇప్పటికే అనుభవిస్తోంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తక్కువ నీటితో బాగానే ఉండొచ్చు అని బెంగళూరు డాక్టర్ దివ్యాశర్మ రాసిన ‘ఎక్స్’ పోస్టు వైరల్ అయ్యింది. అది అందరికీ శిరోధార్యం. ఆమె చేసిన నీటి పొదుపు సూచనలు. ఎక్కడ నీటి ట్యాంకర్లు కనిపించవో, ఎక్కడ స్త్రీలు కుళాయిల దగ్గర ప్లాస్టిక్ బిందెలతో తగాదాలు పడరో, ఎక్కడ పల్లెటూరి మనుషులు నెత్తిన కడవలతో మైళ్లకు మైళ్లు నడవరో, ఎక్కడ ప్రతి ఇంటిలో అవసరమైన నీరు అందుబాటులో ఉంటుందో అదే సుభిక్షితమైన ప్రాంతం. ‘ఎడతెగక పారే ఏరు’ లేని ఊరిని చప్పున వదిలిపెట్టమన్నాడు సుమతీ శతకకారుడు. నీరు జీవనాధారం. నీరు నిత్యావసరం. కాని నేటికీ తాగునీళ్లు అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. దానికి తోడు కరువు పరిస్థితి తోడైతే... వేసవి వచ్చిపడితే? స్త్రీలదే భారం నీటి సమస్య ఎప్పుడూ స్త్రీల సమస్య. ఇంట్లో ఉండేది స్త్రీలు, ఇంటి పనులకు నీటిని ఉపయోగించాల్సిన వారు స్త్రీలు కనుక నీటి బెంగ స్త్రీలదే. పురుషుడు తాను ‘బయట సంపాదించాలి కాబట్టి’ ఇంట్లో ఉండే స్త్రీ నీటి బాధలు పడాల్సిందే అనే భావజాలం ఇంకా పోలేదు. నీటి బాధల్లో చేయూతనిచ్చే పురుషులు ఉన్నా అధికశాతం స్త్రీలే ఈ బాధలు పడతారు. ఇంట్లో నీళ్లు లేకపోతే పురుషుడి చేత తిట్లు తింటారు. నీళ్లు తేవడంలో పిల్లల సాయం అందకపోతే నడుములు విరగ్గొట్టుకునేలా నీరు మోస్తారు. ప్రస్తుతం రెండు పనులు తప్పక జరగాలి. 1. నీటి సమస్య ఇంట్లో తీర్చడానికి పురుషుడు సమాన భాగస్వామ్యం వహించేలా చైతన్యపరచడం. 2. ప్రతి ఇంట్లో నీటి పొదుపు కోసం ప్రతి కుటుంబ సభ్యుడు చైతన్యవంతం కావడం. నీరు వృథా చేయడం అంటే? కొందరు ఉంటారు... సింక్ దగ్గర నిలబడి ట్యాప్ తిప్పి బ్రష్ చేయడం మొదలెడతారు. ఇక బ్రషింగ్ అవుతున్నంత సేపు ట్యాప్ నుంచి నీరు వృథా కావాల్సిందే. మరికొందరు బాత్రూమ్ ఫ్లోర్ మీద రోజుకు రెండు ఫుల్ బకెట్లు కుమ్మరిస్తారు శుభ్రత కోసం. మరికొందరు సగం బకెటు స్నానం చేసి మిగిలిన సగాన్ని వృథాగా వదిలేస్తారు. ఆ తర్వాత వచ్చిన కుటుంబ సభ్యులు ఆ నీరు స్నానానికి వాడలేక కమోడ్‌లో పారబోస్తారు. మరికొందరు టాయిలెట్ మీద కూచుని ఏమీ తోచక స్ప్రే గన్ చేత పట్టి నీటిని ప్రెస్ చేస్తూ ఆటలాడుతూ ఉంటారు. మరికొందరు రోజుకు రెండు సార్లు షవర్ తిప్పి ఆరాముగా స్నానం చేస్తారు. మరికొందరు గిన్నెలు కడుగుతున్నంత సేపు వాష్ ఏరియాలో ట్యాప్ తిప్పే ఉంచుతారు. ఇంకొందరు కిచెన్ సింక్‌లో చిన్న గ్లాస్ కడగాలన్నా ట్యాప్ తిప్పి అర బకెట్ నీళ్లు సింక్‌లో వృథాగా పోనిస్తారు. ఇక ఉతికిన బట్టలను మూడుసార్లు జాడించేవారు ఇంకొందరు. ఒక్క నీటిబొట్టు కూడా సృష్టించలేని మనకు ఇన్ని నీళ్లు వృథా చేసే హక్కు లేదు. పొదుపే మిగులు నీళ్లు ఎక్కువ కావాలనుకుంటే తక్కువ ఖర్చు చేయాలి. అప్పుడు తక్కువ ఉన్నా ఎక్కువ అనిపిస్తాయి. ఇప్పుడు బెంగళూరు నగరం నీటి కరువుతో ఇబ్బందులు పడుతోంది. నీరు వృథా చేసేవారికి జరిమానాలు విధిస్తున్నారు. నీరు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలో అక్కడి డెర్మటాలజిస్ట్ డాక్టర్ శర్మ ఇటీవల ‘ఎక్స్’ (ట్విటర్)లో రాసిన పొదుపు పోస్ట్ అందరికీ నచ్చింది. ‘మాకు నీళ్లు సమృద్ధి ఎప్పుడూ. కాని మేము నీటిని పొదుపుగా వాడతాము. రొటీన్‌కు ఏ భంగం కలగకుండా నీటిని పొదుపుగా వాడొచ్చు’ అని పొదుపు చిట్కాలు చెప్పిందామె. ఇవీ ఆ పొదుపు చిట్కాలు ► బాత్రూమ్స్లో షవర్స్ బంద్ చేయాలి. బకెట్లో పట్టుకుని స్నానం చేయాలి. షవర్లో చాలా నీళ్లు వృథా అవుతాయి. పైగా ఎక్కువ సేపు నీళ్లలో నానడం కూడా చర్మానికి మంచిది కాదు. కొందరు రోజుకు రెండుసార్లు స్నానం చేస్తారు. ఒకసారి స్నానం వల్ల లోటేం జరగదు. ► ట్యాప్‌లకు ఎరీటర్లు బిగించాలి. ట్యాప్‌లు తిప్పితే నీళ్లు భళ్లున వస్తాయి. వృ«థా అవుతాయి. అదే అన్ని ట్యాప్‌లకు ఎరీటర్లు (చిల్లుల పరికరం) బిగిస్తే నీళ్లు జల్లుగా పడతాయి. పొదుపు అవుతాయి. ముఖ్యంగా అంట్లు తోమేప్పుడు చాలా నీళ్లు పొదుపు అవుతాయి. ► ఆర్ఓల నుంచి ఫిల్టర్ సమయంలో వృథాగా పోయే నీటిని పట్టి మొక్కలకు పోయాలి. మాప్ పెట్టడానికి ఉపయోగించాలి. Ü వాషింగ్ మిషన్‌ను ఒకటీ అరా బట్టల కోసం కాకుండా ఫుల్‌లోడ్‌తో ఉపయోగించాలి. ► కార్ వాషింగ్‌కు నీటిని వృథా చేయకుండా తడి బట్టతో తుడుచుకోవాలి. ► డిష్ వాషర్ ఉపయోగించడం వల్ల నీళ్ళు తక్కువ ఖర్చు అవుతాయి. అంట్లు తోమితే 60 లీటర్ల నీళ్లు కనీసం పడతాయి. డిష్ వాషర్లో 10 లీటర్లు సరిపోతాయి. ► ప్లంబర్ని పిలిచి అన్నీ లీకులను చెక్ చేయించాలి. ► పిల్లలకు నీటి విలువ తెలియచెప్పి నీళ్లు వృ«థా చేయకుండా చూడాలి. -
తక్కువ ఖర్చు.. వెంటనే నీటి భద్రత!
మెట్ట భూముల్లో ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో.. మీటరు లోతు మీటరు వెడల్పున.. కందకాలు తవ్వుకోవడం వల్ల.. అతి తక్కువ ఖర్చు (ఎకరానికి రూ. 2–3 వేల)తో తవ్విన కొద్ది నెలల్లోనే సాగు నీటి భద్రత సాధించవచ్చని నల్లగొండ మండలం గుళ్లపల్లి గ్రామానికి చెందిన రైతు, విశ్రాంత ప్రిన్సిపల్ పాలవరపు భగవంతరెడ్డి అనుభవపూర్వకంగా చెబుతున్నారు. రైతుల సంక్షేమం కోసం భారీగా ఖర్చు పెడుతున్న ప్రభుత్వాలు చిన్న రైతుల మెట్ట భూముల్లో కందకాలు తవ్విస్తే ఎంతో మేలు జరుగుతుందని ఆయన సూచిస్తున్నారు. నల్లగొండకు 5 కి.మీ. దూరంలోని తమ 13 ఎకరాల ఎర్ర భూమిలో తవ్విన రెండు బోర్లకు నీటి లభ్యత తక్కువగా ఉండటంతో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంగెం చంద్రమౌళి(98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074)లను 2016 జూన్‌లో భగవంతరెడ్డి సంప్రదించారు. వారు స్వయంగా పొలానికి వచ్చి వాలుకు అడ్డంగా కందకాలు తవ్వించారు. 13 ఎకరాలకు కలిపి రూ. 30 వేలకన్నా తక్కువే ఖర్చయింది. 2016 వర్షాకాలంలో కందకాలు 4,5 సార్లు నిండాయి. కందకాలు తవ్విన 3,4 నెలల్లోనే భూగర్భ జలమట్టం బాగా పెరిగిందని భగవంతరెడ్డి తెలిపారు. 2017 వర్షాకాలంలో కూడా కందకాలు 2,3 సార్లు నిండాయి. దీంతో ఎండాకాలం కూడా నీరు పుష్కలంగా ఉండటంతో నిశ్చింతగా కూరగాయ తోటలను సాగు చేస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పక్కన పొలంలో వరి సాగు చేస్తున్న రైతుల బోర్లలో నీరు రాక పొలం ఎండిపోయే పరిస్థితి వచ్చింది. రెండు నెలల పాటు తమ బోర్ల నుంచే నీటిని ఉచితంగా ఇచ్చామని, ఆ రైతుకు మంచి దిగుబడి రావడం తమకూ సంతోషాన్నిచ్చిందని వివరించారు. ఈ ఏడాది తమ ఇరుగు పొరుగు రైతుల బోర్లలో కూడా నీటి లభ్యత పెరిగిందని ఆయన సంతోషంగా చెప్పారు. ఇది తమ పొలంలో తవ్విన కందకాల వల్ల భూగర్భంలోకి ఇంకిన వర్షపు నీటి వల్లనే సాధ్యపడిందన్నది నూటికి నూరు శాతం వాస్తవమన్నారు. అయితే, రైతులకు కందకాలతో వర్షపు నీటి సంరక్షణపై అవగాహన లోపించిందని, చిన్న రైతుల భూముల్లో ప్రభుత్వమే కందకాలు తవ్వించడం చాలా అవసరమని భగవంతరెడ్డి(94404 05082) సూచిస్తున్నారు. భగవంతరెడ్డి -
కందకాలతో జలసిరి!
లక్షలు పోసి బోర్లు తవ్వించినా లభించని సాగు నీటి భద్రత.. పొలంలో కందకాలు, నీటి కుంటలు తవ్విస్తే మండు వేసవిలోనూ జలకళ కనువిందు చేస్తున్నదంటూ పండ్ల తోటల రైతు సాదినేని శ్రీనివాసరావు సంతోషంగా చెప్పారు. శ్రీనివాసరావు తన 8 మంది స్నేహితులతో కలిసి 2009లో గుంటూరు జిల్లా కరువు పీడిత పల్నాడు ప్రాంతంలోని వెల్దుర్తి మండలం శివలింగాపురంలో 90 ఎకరాల ఎర్రనేల కొనుగోలు చేసి 600–800 అడుగుల లోతున 5 బోర్లు వేసి.. మామిడి, బత్తాయి మొక్కలు నాటారు.తొలుత బాగా పోసిన బోర్లు 2012 నాటికి బోర్లన్నీ ఎండిపోయాయి. పలువురు నిపుణులను పిలిపించి 10 బోర్లు వేస్తే ఒక్కదాంట్లోనే కొంచెం నీరు కనిపించింది.భారీ ఖర్చుతో దూరపు పొలాల్లోని బోర్ల దగ్గర నుంచి పైప్‌లైన్ వేసి తోటలు చనిపోకుండా కాపాడుకున్నారు. పక్కన ఒక బత్తాయి తోట ఎండిపోయింది కూడా. సుమారు 8 మంది దఫాలుగా పలువురు నిపుణులను తీసుకెళ్లి తోట చూపించారు. అప్పటికే బోర్లు తవ్వడానికి రూ. 25 లక్షల వరకు ఖర్చుపెట్టిన శ్రీనివాసరావు బృందం.. ఇక బత్తాయి తోట వదిలేయడానికి సిద్ధపడిన దశలో.. శాస్త్రవేత్త డా. వి. రాంప్రకాశ్ సూచన మేరకు మూడు చెరువులు తవ్వించడంతో ఉపశమనం కలిగింది. ఆ తర్వాత తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంగెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డితో కలసి ‘చేను కిందే చెరువు’ పేరిట ‘సాక్షి’ నిర్వహించిన ప్రచారోద్యమం శ్రీనివాసరావు దృష్టికి వచ్చింది. చంద్రమౌళి, శ్యాంప్రసాద్‌రెడ్డి మార్గదర్శకత్వంలో 2017 ఏప్రిల్‌లో పొలం అంతటా ప్రతి 30 మీటర్లకు ఒక వరుస(వాలుకు అడ్డంగా మీటరు లోతు, మీటరు వెడల్పు, 25 మీటర్ల పొడవున) కందకాలు తవ్వించారు. ఎకరానికి రూ. 6 వేల వరకు ఖర్చయింది. తొలి సీజన్లోనే భారీ వర్షాలు కురవడంతో మూడు సార్లు కందకాలు నిండాయి. 680 ఎం.ఎం. వార్షిక వర్షపాతం నమోదవుతున్నా, భూమి లోపలికి నీరు అంతగా ఇంకదు. భారీ వర్షం కురిసిన మూడో రోజే పంటలు బెట్టకొచ్చేవి. అయితే, కందకాలు తీసిన తర్వాత భారీ వర్షం కురిసినప్పుడు కూడా చుక్క నీరు పొలం బయటకు పోలేదని శ్రీనివాసరావు తెలిపారు. ఎకరానికి 20 లక్షల లీటర్ల చొప్పున వర్షపు నీరు కందకాల్లో ఎక్కడికక్కడే భూమిలోకి ఇంకింది. అంతకుముందు అనేక ఏళ్లపాటు పడిన నీటి కష్టాలు కందకాల పుణ్యమా అని ఒక్క సీజన్లోనే తీరిపోయాయని ఆయన సంబరపడుతున్నారు. ప్రస్తుతం 4 బోర్లు 2 ఇంచుల నీరు పోస్తున్నాయి. అయితే, వర్షం నీరు బాగా ఇంకడంతో బత్తాయి, మామిడి తోటలకు ఇచ్చే నీటిలో 40%–60% వరకు తగ్గించారు. చెరువుల్లో నీటిని అందిస్తున్నారు. వేసవిలోనూ బోర్ల ద్వారా భూగర్భ నీటిని తోడాల్సిన అవసరం రాకపోవడం విశేషం. చెరువుల్లోకి నీరు ఊరటం కళ్లారా చూసిన వెల్దుర్తి ప్రాంతవాసులు ఆశ్చర్యపోతున్నారని ఆయన తెలిపారు. కందకాల ప్రభావం వల్ల మామిడి చెట్ల పెరుగుదల రెట్టింపైందన్నారు. లక్షల ఖర్చుతో బోర్లు వేయడం కన్నా స్వల్ప ఖర్చుతో కందకాలు తవ్వుకుంటే నిస్సందేహంగా చేను కిందే చెరువు ఏర్పడుతుందని, నీటి కొర ఉండదని శ్రీనివాసరావు(99490 99055) అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ప్రభుత్వ అధికారులెవరూ సహాయపడక పోవడం విడ్డూరమన్నారు. -
కందకాలే కరువుకు విరుగుడు!
కరువు కోరల నుంచి రైతులను రక్షించడానికి వ్యవసాయ భూముల్లో కందకాలు తీసుకోవడమే ఉత్తమ మార్గమనడానికి ప్రబల నిదర్శనం తన మామిడి తోటేనని నీటిపారుదల శాఖ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ సంగెం చంద్రమౌళి స్వానుభవంతో తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామపరిధిలో 3.5 ఎకరాల భూమిని గత ఏడాది వేసవిలో కొనుగోలు చేశారు. 500–650 అడుగుల లోతున రెండు బోర్లు వేసినా.. డస్ట్ తప్ప నీటి చుక్క కానరాలేదు. వాన నీటిని సంరక్షించుకుంటే తప్ప నీటి భద్రత సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చారు. పొలంలో ప్రతి 50 మీటర్లకు ఒక చోట వాలుకు అడ్డంగా మీటరు లోతు, మీటరు వెడల్పున 2017 మేలో కందకాలు తవ్వించారు. ఎకరానికి రూ. 5 వేల వరకు ఖర్చయింది. వర్షాలు కురవడంతో కందకాల ద్వారా వర్షపు నీరు పుష్కలంగా భూమిలోకి ఇంకింది. భూగర్భ జలమట్టం పెరిగింది. నీటి కొరత తీరడంతో గత జూలైలో మామిడి మొక్కలు నాటారు. డ్రిప్ ద్వారా పొదుపుగా నీటిని అందిస్తున్నారు. గెస్ట్ హౌస్ కూడా నిర్మించారు. అయినా, ఇంత వేసవిలోనూ నీటి కొరత లేదని చంద్రమౌళి సంతోషంగా చెప్పారు. పొలాల్లో కురిసి వృథాగా పోతున్న వర్షపు నీటిని ఎక్కడికక్కడ భూమి లోపలికి ఇంకించుకుంటే ప్రతి రైతూ కరువును విజయవంతంగా అధిగమించవచ్చని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అయిన సంగెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి (రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) గత కొన్నేళ్లుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘సాక్షి’తో కలసి గతంలో వరుసగా రెండేళ్లు తెలుగు రాష్ట్రాల్లో ‘చేను కిందే చెరువు’ ప్రచారోద్యమాన్ని నిర్వహించి వేలాది మంది రైతుల్లో చైతన్యం నింపిన సంగతి తెలిసిందే. వేలాది ఎకరాల్లో పొలాలను స్వయంగా పరిశీలించి కందకాలు తవ్వించిన చంద్రమౌళి తన పొలంలోనూ కందకాలు తవ్వించి రైతులకు ఆదర్శప్రాయుడిగా నిలిచారు. ఎకరానికి రూ. 5 వేలు చాలు.. సాగు యోగ్యమైన భూముల్లో తెలంగాణ రాష్ట్రమంతటా ఎకరానికి రూ. 5వేల ఖర్చుతో కందకాలు తవ్వడానికి రూ. 8 వేల కోట్లు ఖర్చవుతుందని, వృథాగా పోతున్న 850 టీఎంసీల నీటిని భూమిలోకి ఇంకింపజేయవచ్చని ఆయన అంటున్నారు. భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ కలిపి అందించే నీరు 600 టీఎంసీలేనన్నారు. ఎకరానికి పంటకు రూ. 4 వేల చొప్పున రైతుకు పెట్టుబడిగా ఇస్తున్న ప్రభుత్వం.. ప్రతి రైతూ కందకాలు తవ్వుకోవడం తప్పని సరి చేస్తే ఒక్క ఏడాదిలోనే సాగునీటి భద్రత చేకూరుతుందని ఆయన సూచిస్తున్నారు. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్‌లోని సాగు యోగ్యమైన భూములన్నిటిలో కందకాలు తవ్విస్తే రూ.10 వేల కోట్లు ఖర్చవుతుందని, 950 టీఎంసీల నీటిని భూమిలోకి ఎక్కడికక్కడ ఇంకింపజేయవచ్చని చంద్రమౌళి (98495 66009) సూచిస్తున్నారు. చంద్రమౌళి మామిడి తోటలో కందకం -
ప్లాస్టిక్ బాల్స్‌తో వాటర్ సేవింగ్
-
ప్లాస్టిక్ బాల్స్‌తో వాటర్ సేవింగ్
-
ప్లాస్టిక్ బాల్స్‌తో వాటర్ సేవింగ్
లాస్ ఏంజెలిస్: ఈసారి కరవు కాటకాలతో అల్లాడిపోతున్న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో మంచినీటి వనరులను రక్షించుకునేందుకు వినూత్న ప్రక్రియను చేపట్టారు. 75 ఎకరాల్లో విస్తరించివున్న లాస్ ఏంజెలిస్ మంచినీటి రిజర్వాయర్‌లో తీవ్రమైన ఎండల కారణంగా నీరు ఆవిరైపోకుండా ఉండేందుకు ప్లాస్టిక్ బాల్స్‌ను వాటిల్లోకి వదిలారు. పెద్ద పరిమాణంలోని ఆపిల్ అంతా ఉండే ప్లాస్టిక్ బాల్స్‌ను దాదాపు పదికోట్లు వదిలినట్లు లాస్ ఏంజెలిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ పవర్ అధికారులు తెలిపారు. ఎండకు నీరు ఆవిరికాకుండా ఉండడంతోపాటు రసాయనిక చర్యలవల్ల నీరు కలుషితం కాకుండా ఉంటుందని, నల్ల రంగు బాల్స్‌ను వాడడంవల్ల సూర్యుడి అల్ట్రా వాయిలెట్ కిరణాలు కూడా నీటిపై ప్రభావం చూపవని అధికారులు వివరించారు. అంతేకాకుండా పక్షులు, ఇతర జంతువులు కూడా రిజర్వాయర్‌లోకి ప్రవేశించకుండా ఈ ప్లాస్టిక్ బాల్స్ అడ్డుకుంటాయని వారు చెప్పారు. తాము తీసుకున్న ఈ చర్య వల్ల ఏడాదికి 30 కోట్ల గ్యాలన్ల నీటిని పరిరక్షించుకోవచ్చని, ఈ నీటితో 8100 మంది ప్రజలకు ఏడాదిపాటు మంచినీటిని సరఫరా చేయొచ్చని వివరించారు. పైగా ఈ తరహా విధానం ద్వారా తమకు ఏడాదికి రూ.2,500 కోట్లు కలిసొస్తాయని చెబుతున్నారు. కానీ, పర్యావరణ సమతౌల్యం మాత్రం వారు విస్మరిస్తున్నారు. పశు పక్షాదుల దాహార్తిని తీర్చే తరుణోపాయం గురించి కూడా ఆలోచించడం లేదు.