మామిడి తోటలో నీటితో నిండిన కందకాలు (ఫైల్)
లక్షలు పోసి బోర్లు తవ్వించినా లభించని సాగు నీటి భద్రత.. పొలంలో కందకాలు, నీటి కుంటలు తవ్విస్తే మండు వేసవిలోనూ జలకళ కనువిందు చేస్తున్నదంటూ పండ్ల తోటల రైతు సాదినేని శ్రీనివాసరావు సంతోషంగా చెప్పారు. శ్రీనివాసరావు తన 8 మంది స్నేహితులతో కలిసి 2009లో గుంటూరు జిల్లా కరువు పీడిత పల్నాడు ప్రాంతంలోని వెల్దుర్తి మండలం శివలింగాపురంలో 90 ఎకరాల ఎర్రనేల కొనుగోలు చేసి 600–800 అడుగుల లోతున 5 బోర్లు వేసి.. మామిడి, బత్తాయి మొక్కలు నాటారు.తొలుత బాగా పోసిన బోర్లు 2012 నాటికి బోర్లన్నీ ఎండిపోయాయి.
పలువురు నిపుణులను పిలిపించి 10 బోర్లు వేస్తే ఒక్కదాంట్లోనే కొంచెం నీరు కనిపించింది.భారీ ఖర్చుతో దూరపు పొలాల్లోని బోర్ల దగ్గర నుంచి పైప్‌లైన్ వేసి తోటలు చనిపోకుండా కాపాడుకున్నారు. పక్కన ఒక బత్తాయి తోట ఎండిపోయింది కూడా. సుమారు 8 మంది దఫాలుగా పలువురు నిపుణులను తీసుకెళ్లి తోట చూపించారు. అప్పటికే బోర్లు తవ్వడానికి రూ. 25 లక్షల వరకు ఖర్చుపెట్టిన శ్రీనివాసరావు బృందం.. ఇక బత్తాయి తోట వదిలేయడానికి సిద్ధపడిన దశలో.. శాస్త్రవేత్త డా. వి. రాంప్రకాశ్ సూచన మేరకు మూడు చెరువులు తవ్వించడంతో ఉపశమనం కలిగింది.
ఆ తర్వాత తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంగెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డితో కలసి ‘చేను కిందే చెరువు’ పేరిట ‘సాక్షి’ నిర్వహించిన ప్రచారోద్యమం శ్రీనివాసరావు దృష్టికి వచ్చింది. చంద్రమౌళి, శ్యాంప్రసాద్‌రెడ్డి మార్గదర్శకత్వంలో 2017 ఏప్రిల్‌లో పొలం అంతటా ప్రతి 30 మీటర్లకు ఒక వరుస(వాలుకు అడ్డంగా మీటరు లోతు, మీటరు వెడల్పు, 25 మీటర్ల పొడవున) కందకాలు తవ్వించారు. ఎకరానికి రూ. 6 వేల వరకు ఖర్చయింది.
తొలి సీజన్‌లోనే భారీ వర్షాలు కురవడంతో మూడు సార్లు కందకాలు నిండాయి. 680 ఎం.ఎం. వార్షిక వర్షపాతం నమోదవుతున్నా, భూమి లోపలికి నీరు అంతగా ఇంకదు. భారీ వర్షం కురిసిన మూడో రోజే పంటలు బెట్టకొచ్చేవి. అయితే, కందకాలు తీసిన తర్వాత భారీ వర్షం కురిసినప్పుడు కూడా చుక్క నీరు పొలం బయటకు పోలేదని శ్రీనివాసరావు తెలిపారు. ఎకరానికి 20 లక్షల లీటర్ల చొప్పున వర్షపు నీరు కందకాల్లో ఎక్కడికక్కడే భూమిలోకి ఇంకింది.
అంతకుముందు అనేక ఏళ్లపాటు పడిన నీటి కష్టాలు కందకాల పుణ్యమా అని ఒక్క సీజన్‌లోనే తీరిపోయాయని ఆయన సంబరపడుతున్నారు. ప్రస్తుతం 4 బోర్లు 2 ఇంచుల నీరు పోస్తున్నాయి. అయితే, వర్షం నీరు బాగా ఇంకడంతో బత్తాయి, మామిడి తోటలకు ఇచ్చే నీటిలో 40%–60% వరకు తగ్గించారు. చెరువుల్లో నీటిని అందిస్తున్నారు. వేసవిలోనూ బోర్ల ద్వారా భూగర్భ నీటిని తోడాల్సిన అవసరం రాకపోవడం విశేషం.
చెరువుల్లోకి నీరు ఊరటం కళ్లారా చూసిన వెల్దుర్తి ప్రాంతవాసులు ఆశ్చర్యపోతున్నారని ఆయన తెలిపారు. కందకాల ప్రభావం వల్ల మామిడి చెట్ల పెరుగుదల రెట్టింపైందన్నారు. లక్షల ఖర్చుతో బోర్లు వేయడం కన్నా స్వల్ప ఖర్చుతో కందకాలు తవ్వుకుంటే నిస్సందేహంగా చేను కిందే చెరువు ఏర్పడుతుందని, నీటి కొర ఉండదని శ్రీనివాసరావు(99490 99055) అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ప్రభుత్వ అధికారులెవరూ సహాయపడక పోవడం విడ్డూరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment