కందకాల వద్ద శైలజ, కుంటలో నిల్వ చేసుకున్న బోరు నీరు
‘వర్షానికి కరువు లేకపోయినా ఎండాకాలం పంటలకు సాగు నీటి కరువు వెంటాడుతూ ఉండేది. కానీ కందకాలు తవ్వుకున్న తర్వాత ఈ ఏడాది ఎండాకాలం కూడా బోర్లలో పుష్కలంగా నీరు ఉండడంతో నిశ్చింతగా ఉన్నామ’ని అంటున్నారు వై.వి. కృష్ణమోహన్, శైలజ రైతు దంపతులు. సిద్ధిపేట జిల్లా జగ్దేవ్‌పూర్ మండలం చాట్లపల్లి గ్రామ పరిధిలో వీరు ఏడేళ్ల క్రితం 43 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. 2013లో ఆరెకరాల్లో మామిడి మొక్కలు నాటారు. మిగతా పొలంలో మొక్కజొన్న తదితర పంటలు పండిస్తున్నారు. ఐదు బోర్లు వేశారు. ఆ ప్రాంతంలో ఏటా 800 ఎం.ఎం. వర్షం కురుస్తుంది. వర్షానికి ఎప్పుడూ కరువు లేదు. కానీ, ఎండాకాలం వచ్చే సరికి బోర్లు ఎండిపోవడం షరామామూలుగా మారింది. పెట్టిన తోటను ఎండాకాలం కాపాడుకోగలమా లేదా అన్న అభద్రత వెంటాడుతూ ఉండేది. బోర్ల ద్వారా నీటిని తోడి నిల్వ చేసుకుందామని రెండు నీటికుంటలు తవ్వించుకొని ప్లాస్టిక్ షీట్ పరిచారు. అయితే, ఎండాకాలం వచ్చేసరికి బోర్లు ఎండిపోతుండడంతో ఈ నీటి కుంటలు వృథాగా మారాయి.
ఈ నేపథ్యంలో కందకాల ద్వారా నీటి భద్రత పొందవచ్చని సాక్షి కథనం ద్వారా తెలుసుకున్నారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల వేదిక పెద్దలు సంగెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి, గోలి దామోదర్‌రెడ్డిలను సంప్రదించారు. 2017 మే నెలలో సుమారు రూ. 40 వేలు ఖర్చుపెట్టి వాలుకు అడ్డంగా, మీటరు లోతు, మీటరు వెడల్పున కందకాలు తవ్వించారు. నీరు పొలం దాటి బయటకు పోకుండా చూడడానికి మరో రెండు నీటి కుంటలను సైతం తవ్వించారు. గత ఖరీఫ్‌కాలంలోను, అక్టోబర్–సెప్టెంబర్‌లోనూ కురిసిన వర్షాలకు అనేక సార్లు కందకాలు నిండి భూమిలోపలికి వర్షపు నీరు ఇంకింది. దీంతో భూగర్భ జల మట్టం పెరిగింది. ఈ కారణంగా ఈ ఏడాది రోహిణీకార్తెలో కూడా బోర్లలో పుష్కలంగా నీరు ఉంది. 3 నీటికుంటల్లో 80 లక్షల లీటర్ల నీరు నిల్వ ఉంది.
వర్షం కురిసినప్పుడు కందకాల ద్వారా భూమికి నీటిని తాపినందువల్ల నీటి కరువు మాయమైందని కృష్ణమోహన్ సంతోషంగా చెప్పారు. కేవలం రూ. 40 వేల ఖర్చుతో కందకాలు తవ్వడం వల్ల నీటి కొరత లేకుండా పోవడం విశేషం. ప్రస్తుతం 10 ఎకరాల్లో మామిడి, 10 ఎకరాల్లో నిమ్మ, 5 ఎకరాల్లో జామ, ఉసిరి తోటలున్నాయి. ఈ ఏడాది 2 ఎకరాల్లో వరుసగా 3 పంటలు తొలిసారి వరి సాగు చేశామని కృష్ణమోహన్ వివరించారు. తమ పక్క పొలంలో ఎప్పుడూ లేనిది రెండు బోర్లలో నీరు వస్తున్నాయని కూడా తెలిపారు. కందకాల ద్వారా సాగు నీటి భద్రత పొందవచ్చన్న తన అనుభవాన్ని పరిసర గ్రామాల్లో రైతులకు తెలియజెప్పేందుకు సదస్సులు నిర్వహించాలనుకుంటున్నట్లు కృష్ణమోహన్(99490 55225) తెలిపారు.
కృష్ణమోహన్
Comments
Please login to add a commentAdd a comment