Water saving
-
అడుగు అడుగులోనూ నీటి పొదుపు!
ఒకవైపు వర్షాభావం... మరోవైపు అడుగంటిన భూగర్భ జలాలు... వచ్చేసిన వేసవి. ఇంకా రెండు మూడు నెలలు గడవాలి ఈ వేసవిలో నీరు ముఖ్యం. బెంగళూరు ఇప్పటికే అనుభవిస్తోంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తక్కువ నీటితో బాగానే ఉండొచ్చు అని బెంగళూరు డాక్టర్ దివ్యాశర్మ రాసిన ‘ఎక్స్’ పోస్టు వైరల్ అయ్యింది. అది అందరికీ శిరోధార్యం. ఆమె చేసిన నీటి పొదుపు సూచనలు. ఎక్కడ నీటి ట్యాంకర్లు కనిపించవో, ఎక్కడ స్త్రీలు కుళాయిల దగ్గర ప్లాస్టిక్ బిందెలతో తగాదాలు పడరో, ఎక్కడ పల్లెటూరి మనుషులు నెత్తిన కడవలతో మైళ్లకు మైళ్లు నడవరో, ఎక్కడ ప్రతి ఇంటిలో అవసరమైన నీరు అందుబాటులో ఉంటుందో అదే సుభిక్షితమైన ప్రాంతం. ‘ఎడతెగక పారే ఏరు’ లేని ఊరిని చప్పున వదిలిపెట్టమన్నాడు సుమతీ శతకకారుడు. నీరు జీవనాధారం. నీరు నిత్యావసరం. కాని నేటికీ తాగునీళ్లు అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. దానికి తోడు కరువు పరిస్థితి తోడైతే... వేసవి వచ్చిపడితే? స్త్రీలదే భారం నీటి సమస్య ఎప్పుడూ స్త్రీల సమస్య. ఇంట్లో ఉండేది స్త్రీలు, ఇంటి పనులకు నీటిని ఉపయోగించాల్సిన వారు స్త్రీలు కనుక నీటి బెంగ స్త్రీలదే. పురుషుడు తాను ‘బయట సంపాదించాలి కాబట్టి’ ఇంట్లో ఉండే స్త్రీ నీటి బాధలు పడాల్సిందే అనే భావజాలం ఇంకా పోలేదు. నీటి బాధల్లో చేయూతనిచ్చే పురుషులు ఉన్నా అధికశాతం స్త్రీలే ఈ బాధలు పడతారు. ఇంట్లో నీళ్లు లేకపోతే పురుషుడి చేత తిట్లు తింటారు. నీళ్లు తేవడంలో పిల్లల సాయం అందకపోతే నడుములు విరగ్గొట్టుకునేలా నీరు మోస్తారు. ప్రస్తుతం రెండు పనులు తప్పక జరగాలి. 1. నీటి సమస్య ఇంట్లో తీర్చడానికి పురుషుడు సమాన భాగస్వామ్యం వహించేలా చైతన్యపరచడం. 2. ప్రతి ఇంట్లో నీటి పొదుపు కోసం ప్రతి కుటుంబ సభ్యుడు చైతన్యవంతం కావడం. నీరు వృథా చేయడం అంటే? కొందరు ఉంటారు... సింక్ దగ్గర నిలబడి ట్యాప్ తిప్పి బ్రష్ చేయడం మొదలెడతారు. ఇక బ్రషింగ్ అవుతున్నంత సేపు ట్యాప్ నుంచి నీరు వృథా కావాల్సిందే. మరికొందరు బాత్రూమ్ ఫ్లోర్ మీద రోజుకు రెండు ఫుల్ బకెట్లు కుమ్మరిస్తారు శుభ్రత కోసం. మరికొందరు సగం బకెటు స్నానం చేసి మిగిలిన సగాన్ని వృథాగా వదిలేస్తారు. ఆ తర్వాత వచ్చిన కుటుంబ సభ్యులు ఆ నీరు స్నానానికి వాడలేక కమోడ్‌లో పారబోస్తారు. మరికొందరు టాయిలెట్ మీద కూచుని ఏమీ తోచక స్ప్రే గన్ చేత పట్టి నీటిని ప్రెస్ చేస్తూ ఆటలాడుతూ ఉంటారు. మరికొందరు రోజుకు రెండు సార్లు షవర్ తిప్పి ఆరాముగా స్నానం చేస్తారు. మరికొందరు గిన్నెలు కడుగుతున్నంత సేపు వాష్ ఏరియాలో ట్యాప్ తిప్పే ఉంచుతారు. ఇంకొందరు కిచెన్ సింక్‌లో చిన్న గ్లాస్ కడగాలన్నా ట్యాప్ తిప్పి అర బకెట్ నీళ్లు సింక్‌లో వృథాగా పోనిస్తారు. ఇక ఉతికిన బట్టలను మూడుసార్లు జాడించేవారు ఇంకొందరు. ఒక్క నీటిబొట్టు కూడా సృష్టించలేని మనకు ఇన్ని నీళ్లు వృథా చేసే హక్కు లేదు. పొదుపే మిగులు నీళ్లు ఎక్కువ కావాలనుకుంటే తక్కువ ఖర్చు చేయాలి. అప్పుడు తక్కువ ఉన్నా ఎక్కువ అనిపిస్తాయి. ఇప్పుడు బెంగళూరు నగరం నీటి కరువుతో ఇబ్బందులు పడుతోంది. నీరు వృథా చేసేవారికి జరిమానాలు విధిస్తున్నారు. నీరు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలో అక్కడి డెర్మటాలజిస్ట్ డాక్టర్ శర్మ ఇటీవల ‘ఎక్స్’ (ట్విటర్)లో రాసిన పొదుపు పోస్ట్ అందరికీ నచ్చింది. ‘మాకు నీళ్లు సమృద్ధి ఎప్పుడూ. కాని మేము నీటిని పొదుపుగా వాడతాము. రొటీన్‌కు ఏ భంగం కలగకుండా నీటిని పొదుపుగా వాడొచ్చు’ అని పొదుపు చిట్కాలు చెప్పిందామె. ఇవీ ఆ పొదుపు చిట్కాలు ► బాత్రూమ్స్లో షవర్స్ బంద్ చేయాలి. బకెట్లో పట్టుకుని స్నానం చేయాలి. షవర్లో చాలా నీళ్లు వృథా అవుతాయి. పైగా ఎక్కువ సేపు నీళ్లలో నానడం కూడా చర్మానికి మంచిది కాదు. కొందరు రోజుకు రెండుసార్లు స్నానం చేస్తారు. ఒకసారి స్నానం వల్ల లోటేం జరగదు. ► ట్యాప్‌లకు ఎరీటర్లు బిగించాలి. ట్యాప్‌లు తిప్పితే నీళ్లు భళ్లున వస్తాయి. వృ«థా అవుతాయి. అదే అన్ని ట్యాప్‌లకు ఎరీటర్లు (చిల్లుల పరికరం) బిగిస్తే నీళ్లు జల్లుగా పడతాయి. పొదుపు అవుతాయి. ముఖ్యంగా అంట్లు తోమేప్పుడు చాలా నీళ్లు పొదుపు అవుతాయి. ► ఆర్ఓల నుంచి ఫిల్టర్ సమయంలో వృథాగా పోయే నీటిని పట్టి మొక్కలకు పోయాలి. మాప్ పెట్టడానికి ఉపయోగించాలి. Ü వాషింగ్ మిషన్‌ను ఒకటీ అరా బట్టల కోసం కాకుండా ఫుల్‌లోడ్‌తో ఉపయోగించాలి. ► కార్ వాషింగ్‌కు నీటిని వృథా చేయకుండా తడి బట్టతో తుడుచుకోవాలి. ► డిష్ వాషర్ ఉపయోగించడం వల్ల నీళ్ళు తక్కువ ఖర్చు అవుతాయి. అంట్లు తోమితే 60 లీటర్ల నీళ్లు కనీసం పడతాయి. డిష్ వాషర్లో 10 లీటర్లు సరిపోతాయి. ► ప్లంబర్ని పిలిచి అన్నీ లీకులను చెక్ చేయించాలి. ► పిల్లలకు నీటి విలువ తెలియచెప్పి నీళ్లు వృ«థా చేయకుండా చూడాలి. -
నీటి బొట్టు.. ఒడిసి పట్టు
సాక్షి, మహబూబాబాద్ :: జీవరాశి మనగడకు జలమే ఆధారం.. నీరే ప్రాణధారం.. అది అమృత తుల్యం. విలువైన నీటిని తెలిసే కొందరు. తెలియక మరికొందరు వృథా చేస్తుంటారు.. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల్లో చెరువులు,కుంటల్లో నీరు ఇంకిపోతోంది. ప్రాజెక్టులు అడుగంటాయి. భూగర్భ జలాలు పాతాలానికి పడిపోతున్నాయి.అసలే వేసవి కావడంతో మండుతున్న ఎండలతో బోరుబావులు, ఎండిపోతున్నాయి. దీంతో తాగు నీటి సమస్య రోజురోజుకు ఉధృత రూపం దాలుస్తోంది. నీరు పుష్కలంగా అందుబాటులో ఉన్నపుడు దాని విలువను గుర్తించకుండా యథేచ్ఛగా వినియోగించిన వారు అదే నీరు దొరకని పరిస్థితుల్లో గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు.ఇప్పటికీ మేలుకోక ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారే గాని, సమస్య పునరావృతం కాకుండా చూసుకోవడం లేదు. మానవాళికి మనుగడనిస్తున్న నీటి ప్రాముఖ్యతను గుర్తించిన ప్రపంచ దేశాలు. నీటి సంరక్షణ కోసం చేపటాల్సిన కార్యక్రమాన్ని వివరించేందుకు ఏటా మార్చి 22న ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. వృథాగా పోతున్న నీళ్లు ప్రతి గ్రామంలో మంచినీటి కులాయిలు, తాగునీటి నల్లాలు, పైపులైన్ల లీకేజీల వద్ద పెద్ద ఎత్తున నీరు వృథాగాపోతోంది. మనం భవిష్యత్ తరాలకు నీటిని అందించాలంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముంది. ప్రపంచ నీటి దినోత్సవాన్ని అంతర్జాతీయంగా పాటించాలన్న ఆలోచన, పర్యావరణం, ప్రగతి అనే అంశంపై 1992లో రియోడిజెనేరోలో జరిగిన ఐక్యరాజ్యసమితి మహాసభ (యుఎన్సీఈడీ ) లో రూపుదిద్దుకున్నది. ఇందులో భాగంగా 2010 సంవత్సరాన్ని ఆరోగ్యవంతమైన ప్రపంచంకోసం పరిశుభ్రమైన నీరు అనే నిర్దిష్ట భావనతో నీటి పొదుపుకు సంబంధించిన సూత్రాలను పాటించాలని సూచిస్తోంది. ప్రతిరోజూ , మనకు కనీసం 30–50 లీటర్ల పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు అవసరం. ఇప్పటికీ 88.4 కోట్ల మంది( 884 మిలియన్ల మంది) ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదంటే అతిశయోక్తి లేదు. చాలామందికి స్వచ్ఛమైన నీరు దొరకక వ్యర్థమైన నీటినే వినియోగించి పలు రోగాల పాలవుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్న దిశా సంస్థ.. మహబూబాబాద్ జిల్లాకు చెందిన దిశ సేవా సంస్థ సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, చేపడుతోంది. ప్రతీ వేసవి కాలం నీటి ఎద్దడి, వాడుకునే విధానం, మంచినీటి అవసరాలపై మానుకోట జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ సంస్థ నిర్వాహకులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాగునీటిని వృథా చేయొద్దు.. ముందు తరాలకు అందిద్దామని సూచనలు చేస్తున్నారు. పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక ప్రగతి , కొత్తరకాల కాలుష్యానికి మూలమవుతున్న తీరును ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతీ రంగంలో నీరు ప్రధానమైనది. వ్యవసాయం, పరిశ్రమల్లో నీటిని పొదుపుగా వాడుకుంటేనే శ్రేయస్కరమని, భవిష్యత్ తరాలకు అందేలా కృషి చేయాలని పర్యావరణ నిపుణులు తెలుపుతున్నారు. మొక్కలు నాటాలి ఖాళీ స్థలంలో విడివిడిగా మొక్కలు నాటాలి. ఉన్న చెట్లను పరిరక్షించాలి. ఈ చర్యల ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గిం చవచ్చు. దీంతో సకా లంలో వర్షాలు కురిసి చెరువులు, కుంటల నిండా నీళ్లు ఉంటాయి. తద్వారా నీరు ఇంకిపోకుండా వేసవి కాలంలో ఉపయోగపడుతాయి. – దైద వెంకన్న, వన ప్రేమికుడు, మానుకోట -
కందకాల పుణ్యమా అని బోర్లలో కంటిన్యూగా నీళ్లు!
కందకాలు తవ్వుకున్నందు వల్లనే ఈ వేసవిలో తమ తోటలో నీటికి కరువు లేకుండా బోర్లు నిరాటంకంగా నీటిని అందిస్తున్నాయని ఉద్యాన తోటల ప్రకృతి వ్యవసాయదారుడు మంచికట్ల సత్యం ఘంటాపథంగా చెబుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం పటేల్‌గూడెం వద్ద 13 ఎకరాల్లో బొప్పాయి, దానిమ్మ, జామ, మామిడి తోటలను ఆయన సాగు చేస్తున్నారు. వాననీటి సంరక్షణ ప్రాధాన్యాన్ని గుర్తెరిగిన ఈ రైతు.. పండ్ల మొక్కలు నాటక ముందే కందకాలు తవ్వుకొని సాగునీటి భద్రత పొందడం విశేషం. 2016 జూలైలో భూమిని కొనుగోలు చేశారు. కందకాల గురించి ‘సాక్షి సాగుబడి’ ద్వారా తెలుసుకున్న ఆయన తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం గౌరవాధ్యక్షులు సంగెం చంద్రమౌళి(98495 66009), వర్కింగ్ ప్రెసిడెంట్ దామోదర్‌రెడ్డి(94407 02029)లను వెంటబెట్టుకెళ్లి వారి సూచనల ప్రకారం కందకాలు తవ్వించుకున్నారు. 3 బోర్లు వేయించారు. కందకాలలో నుంచి పొంగిపొర్లిన నీరు వృథాగా పోకుండా చూసుకోవడానికి నీటి కుంటను సైతం తవ్వించారు. భూమి వాలు ఎక్కువగా ఉన్నచోట 30 మీటర్లకు ఒక వరుసలో, వాలు తక్కువగా ఉన్నచోట 50 మీటర్లకు ఒక వరుసలో.. మీటరు లోతు, మీటరు వెడల్పున పొలం అంతటా కందకాలు తవ్వించారు. కందకాల మధ్యలో ట్రాక్టర్లు, బండ్లు వెళ్లడానికి 20 మీటర్ల మేరకు ఖాళీ వదిలారు. కందకాలు తవ్విన తర్వాత అనేకసార్లు వర్షాలు కురవడంతో నీరు పుష్కలంగా భూమిలోకి ఇంకిందని, అందువల్లనే ఈ ఎండాకాలం కూడా తమ బోర్లు ఒకటిన్నర ఇంచుకు తగ్గకుండా, నిరంతరాయంగా నీటిని అందిస్తున్నాయని సత్యం వివరాంచారు. 2017లో నెలరోజులు వర్షాలు అదేపనిగా కురిసినప్పుడు కూడా చుక్క నీరు తోట దాటి బయటకుపోలేదని, అందువల్లే సాగునీటికి ఢోకాలేకుండా ఉందన్నారు. బోర్ల నుంచి ముందు నీటిని ప్లాస్టిక్ షీట్ వేసిన నీటి కుంటలోకి తోడి పెట్టుకొని.. అవసరం మేరకు పండ్ల తోటలకు అందిస్తున్నారు. తమ ప్రాంతంలోని తోటల్లో బోర్లు కొన్ని ఎండిపోగా, మిగతావి ఆగి ఆగి పోస్తున్నాయని, తమకు ఆ సమస్య రాకపోవడానికి కందకాలే కారణమని సత్యం భావిస్తున్నారు. భూమి మీద పడిన ప్రతి చినుకునూ కందకాల ద్వారా భూమి లోపలికి ఇంకింపజేసుకుంటే రైతులకు నీటి కొరత అనే సమస్యే రాదన్నారు. అయితే, రైతులు కందకాల ప్రాధాన్యం గురించి తెలుసుకోలేకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని సత్యం(79810 82542) అంటున్నారు. -
జల సంరక్షణపై రైతులకు అవగాహన
గుర్రంపోడు : వర్షపు నీటిని భూమిలోకి ఇంకింప జేయడం ద్వారానే భూగర్భజలాలు వృద్ధి చెందుతాయని తెలంగాణ జల సంరక్షణ వేదిక అధ్యక్షుడు అయ్యప్ప మాసాజీ అన్నారు. సోమవారం మండలంలోని మక్కపల్లిలో జల సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రతి రైతు కందకాలను, వాలుకు అడ్డంగా నీటి గుంతలను తవ్వుకోవాలన్నారు. వర్షపు నీటిని భూమిలో ఇంకింప జేసుకుంటే బోరు బావుల్లో నీరు సరిపడా లభ్యమవుతుందని తెలిపారు. రైతులు వర్షపు నీటిని సంరక్షించుకునేందుకు తమ పొలాల్లో సామూహికంగా కందకాలు తవ్వుకోవాలని సూచించారు. కందకాలు తవ్వుకున్న ప్రాంతాల్లో గతంలో ఎండిన బావుల్లో నీరు లభిస్తుందని అన్నారు. వాలుకు అడ్డంగా దున్నుకోవడం, రాతికట్టడాలు లాంటి జలసంరక్షణ పద్ధతులు పాటించాలని తెలిపారు. వర్షాకాలంలో వృ«థా అయ్యే నీటిని నేలలో ఇంకింప జేస్తే కరువు సమస్య నుంచి విముక్తి పొందవచ్చన్నారు. భాస్కర్‌రెడ్డి అనే రైతు వ్యవసాయ క్షేత్రంతో జల సంరక్షణకు గాను పలు సూచనలు ఇచ్చారు. సమావేశంలో సర్పంచ్ లెంకల అశోక్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
వ్యక్తి తలచుకుంటే అద్భుతాలు చేయొచ్చు: చంద్రబాబు
*కాటన్ స్ఫూర్తితో కరువురహిత రాష్ట్రం *జల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత టెలికాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శ రాష్ట్రంగా రూపొందించడంలో ప్రభుత్వం చేస్తున్న కృషికి అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజానీకం తోడ్పాటును అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం ఎనిమిది వేలమందితో జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఒక్క వ్యక్తి తలుచుకుంటే ఎన్ని అద్భుతాలు చేయవచ్చో కాటన్ మహశయుడు రుజువు చేశారన్నారు. బ్రిటీష్ ప్రభుత్వం వ్యతిరేకించినా కాటన్ లెక్క చేయకుండా గోదావరి జిల్లాలను ధాన్యాగారాలుగా మార్చారని తెలిపారు. సాంకేతికతే లేని ఆ రోజుల్లోనే గుర్రంపై తిరిగి కాటన్ జల వనరులను అభివృద్ధి చేసిన విషయం ప్రస్తావిస్తూ, సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత కాలంలో ఇంకెంతో అభివృద్ధి సాధించవచ్చునని చెప్పారు. గ్రామకార్యదర్శి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు, సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు, ఎంపీటీసీ మెంబరు నుంచి ఎమ్మెల్యే వరకు అందరూ ఒక స్ఫూర్తితో పనిచేసి, రాష్ట్రం నుంచి కరవును శాశ్వతంగా పారదోలాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. వాడవాడలా చంద్రన్నబాట, ఇంటింటా ఇంకుడుగుంత, ప్రతి పొలంలో పంటకుంట తదితర కార్యక్రమాల ద్వారా ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేయాలని సూచించారు. సకాలంలో వర్షాలు పడటం శుభసూచకమని అంటూ, నేలపై పడిన ప్రతి వర్షపు చినుకు భూమిలో ఇంకేలా పంటకుంటలు, ఇంకుడు గుంతల తవ్వకం పనులను వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాలలో మండుటెండను కూడా లెక్కచేయకుండా పర్యటన పూర్తి చేశానన్నారు. నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాలలో కూడా త్వరలో పర్యటించి పరిస్థితులు తెలుసుకుంటానని చెప్పారు. ఇప్పటివరకు మంజూరుచేసిన 5లక్షల పంటకుంటల తవ్వకాన్ని 50 రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నిర్ధేశించారు. చురుకుగా ఉన్న 3లక్షల శ్రమశక్తి సంఘాలు తలా 3 కుంటలు తవ్వితే 10లక్షల పంటకుంటల తవ్వకం లక్ష్యాన్ని సునాయసంగా నెరవేర్చుకోవచ్చునని చెప్పారు. 2015 మే నెలలో భూగర్భంలో 100 టీఎంసీలు నిల్వ ఉండటం రాష్ట్ర రైతాంగానికి సానుకూలాంశమని అన్నారు. ఈ ఏడాది ఆ నిల్వలు మరింత పెరిగేలా అందరూ దృష్టి పెట్టాలని సూచించారు. విజయనగరం జిల్లాలో 1000 చెక్‌డ్యాములు నిర్మిస్తే కరవు అనేది శాశ్వతంగా కనుమరుగు అవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. పంటకుంటలు, ఇంకుడుగుంతల తవ్వకం వల్ల నీటి సమస్య తొలగిపోతుందని అన్నారు. చెట్ల పెంపకం వల్ల పర్యావరణం మెరుగు పడుతుందంటూ, గత ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా హెలికాప్టర్ ద్వారా విత్తనాలు జల్లి అడవులు పెంచాలని దిశానిర్దేశం చేశారు. పాఠశాలలు, కళాశాలలు, దేవాలయాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఇంకుడు గుంతల తవ్వకం, మొక్కలు నాటడం యుద్ధ ప్రాతిపదికన జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు గ్రామాలలో వ్యర్ధాల్ని కంపోస్టుగా మార్చి పొలాలలో సేంద్రీయ ఎరువుగా వినియోగించాలని చెప్పారు. రాష్ట్రంలో 10 క్లష్టర్లను తీసుకుని ‘వేస్టు టు ఎనర్జీ’ ప్లాంట్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ ప్లాంట్ల ద్వారా స్వచ్ఛాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని చేరుకోగలమని అన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు రామాంజనేయులు, జవహర్‌రెడ్డి, శశిభూషణ్, ఇంకా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎంపీటీసీలు, ఆయాశాఖల ఉద్యోగులు టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. -
విజయనగరానికి పొంచి ఉన్న నీటి గండం!
నెల్లిమర్ల: విజయనగరం మున్సిపాలిటీకి చెందిన ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకు నెల్లిమర్లలోని చంపావతి నదిలో రామతీర్ధం మంచినీటి పథకాన్ని సుమారు రెండు దశాబ్దాల క్రితం నిర్మించారు. దీని కోసం నదిలో ఊటబావులను స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమీపంలోను న్న మాస్టర్ పంప్‌హౌస్ నుంచి స్థానిక ఆర్వోబీ కింద నుంచి మిమ్స్ మీదుగా పట్టణానికి పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఈ పంప్‌హౌస్ ద్వారా విజయనగరం పట్టణంలో సుమారు లక్ష మందికి ప్రతిరోజూ 15 మిలియన్ లీటర్ల తాగునీరు సరఫరా అవుతోంది. పైపులైను వెళ్లే స్థలమంతా ప్రభుత్వానిదే. అయితే నెల్లిమర్ల రెవెన్యూ అధికారులు అనాలోచితంగా వ్య వహరించారు. పైపులైను వెళుతున్న ప్రభుత్వ స్థలాన్ని... ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేశారు. ఇక్కడి ఆర్వోబీకి సమీపంలోనున్న ఈ స్థలంలో కొంతభాగాన్ని రెండేళ్ల క్రితం కొం డవెలగాడకు చెందిన వెయిట్లిఫ్టర్లకు కేటాయించారు. మిగి లిన స్థలాన్ని కూడా ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేస్తున్నారు. ఇటీవల పలు గ్రామాలకు చెందిన వారికి ఇదే స్థలంలో పది పట్టాలు పంపిణీ చేశారు. ఆ స్థలంలో ఇప్పటికే కొంతమంది ఇళ్లు నిర్మించుకోగా..మరికొంతమంది పునాదులు వేస్తున్నారు. అలాగే ఈ స్థలాన్ని ఆనుకుని ఉన్న మరికొంత స్థలాన్ని ఇస్కాన్ అనే ఆధ్యాత్మిక సంస్థకు అధికారులు మూడేళ్ల క్రితం అప్పగించారు. ఇక్కడ కూడా ప్రస్తుతం భవనాల నిర్మాణం జరుగుతోంది. రెండింటికీ మధ్యనున్న స్థలంలో పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఎస్ఈ కార్యాలయ భవనం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఎనిమిదడుగుల లోతులో అప్పట్లో పైపులైన్లు ఏర్పాటు చేశారు. సాధారణ భవనాలకు ఐదడుగుల వర కూ పునాదులు తవ్వుతారు, పెద్ద భవ ంతులకు ఆరు నుంచి ఎనిమిది అడుగుల వరకూ తవ్వే అవకాశం ఉంది. పునాదులు తవ్వే సమయంలో కూడా పైపులైన్ పగిలిపోయే అవకాశం ఉం ది. నిర్మాణాలన్నీ పూర్తయితే తాగునీ టి పైపులైనుకు ఇబ్బంది తప్పదు. ఎప్పుడైనా పైపులైను పాడైతే ..ఇదే స్థలంలో తవ్వి రిపేరు చేయాలి. పైపులైను వెళ్లే స్థలమంతా ఇళ్ల నిర్మాణాలతో నిండిపోతే మరమ్మతులు చేపట్టేందుకు అవకాశమే ఉండదు. దీంతో పట్టణానికి తాగునీటి సరఫరా ప్రశ్నార్ధకంగా మారుతుంది. పూర్తయిన ఇళ్ల మాట అటుంచితే, ఇప్పటికైనా అధికారులు కళ్లుతెరిచి పైపులైను స్థలంలో చేపడుతున్న భవనాలు, ఇళ్ల నిర్మాణాలను నిలిపివేసేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విజయనగరం మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగరపంచాయతీ అధికారులు ఇప్పుడైనా స్పంది స్తారో లేదో వేచి చూడాల్సిందే.