వ్యక్తి తలచుకుంటే అద్భుతాలు చేయొచ్చు: చంద్రబాబు
*కాటన్ స్ఫూర్తితో కరువురహిత రాష్ట్రం
*జల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత టెలికాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శ రాష్ట్రంగా రూపొందించడంలో ప్రభుత్వం చేస్తున్న కృషికి అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజానీకం తోడ్పాటును అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం ఎనిమిది వేలమందితో జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఒక్క వ్యక్తి తలుచుకుంటే ఎన్ని అద్భుతాలు చేయవచ్చో కాటన్ మహశయుడు రుజువు చేశారన్నారు. బ్రిటీష్ ప్రభుత్వం వ్యతిరేకించినా కాటన్ లెక్క చేయకుండా గోదావరి జిల్లాలను ధాన్యాగారాలుగా మార్చారని తెలిపారు. సాంకేతికతే లేని ఆ రోజుల్లోనే గుర్రంపై తిరిగి కాటన్ జల వనరులను అభివృద్ధి చేసిన విషయం ప్రస్తావిస్తూ, సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత కాలంలో ఇంకెంతో అభివృద్ధి సాధించవచ్చునని చెప్పారు.
గ్రామకార్యదర్శి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు, సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు, ఎంపీటీసీ మెంబరు నుంచి ఎమ్మెల్యే వరకు అందరూ ఒక స్ఫూర్తితో పనిచేసి, రాష్ట్రం నుంచి కరవును శాశ్వతంగా పారదోలాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. వాడవాడలా చంద్రన్నబాట, ఇంటింటా ఇంకుడుగుంత, ప్రతి పొలంలో పంటకుంట తదితర కార్యక్రమాల ద్వారా ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేయాలని సూచించారు. సకాలంలో వర్షాలు పడటం శుభసూచకమని అంటూ, నేలపై పడిన ప్రతి వర్షపు చినుకు భూమిలో ఇంకేలా పంటకుంటలు, ఇంకుడు గుంతల తవ్వకం పనులను వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాలలో మండుటెండను కూడా లెక్కచేయకుండా పర్యటన పూర్తి చేశానన్నారు.
నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాలలో కూడా త్వరలో పర్యటించి పరిస్థితులు తెలుసుకుంటానని చెప్పారు. ఇప్పటివరకు మంజూరుచేసిన 5లక్షల పంటకుంటల తవ్వకాన్ని 50 రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నిర్ధేశించారు. చురుకుగా ఉన్న 3లక్షల శ్రమశక్తి సంఘాలు తలా 3 కుంటలు తవ్వితే 10లక్షల పంటకుంటల తవ్వకం లక్ష్యాన్ని సునాయసంగా నెరవేర్చుకోవచ్చునని చెప్పారు. 2015 మే నెలలో భూగర్భంలో 100 టీఎంసీలు నిల్వ ఉండటం రాష్ట్ర రైతాంగానికి సానుకూలాంశమని అన్నారు. ఈ ఏడాది ఆ నిల్వలు మరింత పెరిగేలా అందరూ దృష్టి పెట్టాలని సూచించారు.
విజయనగరం జిల్లాలో 1000 చెక్‌డ్యాములు నిర్మిస్తే కరవు అనేది శాశ్వతంగా కనుమరుగు అవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. పంటకుంటలు, ఇంకుడుగుంతల తవ్వకం వల్ల నీటి సమస్య తొలగిపోతుందని అన్నారు. చెట్ల పెంపకం వల్ల పర్యావరణం మెరుగు పడుతుందంటూ, గత ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా హెలికాప్టర్ ద్వారా విత్తనాలు జల్లి అడవులు పెంచాలని దిశానిర్దేశం చేశారు.
పాఠశాలలు, కళాశాలలు, దేవాలయాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఇంకుడు గుంతల తవ్వకం, మొక్కలు నాటడం యుద్ధ ప్రాతిపదికన జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు గ్రామాలలో వ్యర్ధాల్ని కంపోస్టుగా మార్చి పొలాలలో సేంద్రీయ ఎరువుగా వినియోగించాలని చెప్పారు. రాష్ట్రంలో 10 క్లష్టర్లను తీసుకుని ‘వేస్టు టు ఎనర్జీ’ ప్లాంట్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ ప్లాంట్ల ద్వారా స్వచ్ఛాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని చేరుకోగలమని అన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు రామాంజనేయులు, జవహర్‌రెడ్డి, శశిభూషణ్, ఇంకా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎంపీటీసీలు, ఆయాశాఖల ఉద్యోగులు టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.