సత్యం తోటలో కందకాలు (ఫైల్), మంచికట్ల సత్యం
కందకాలు తవ్వుకున్నందు వల్లనే ఈ వేసవిలో తమ తోటలో నీటికి కరువు లేకుండా బోర్లు నిరాటంకంగా నీటిని అందిస్తున్నాయని ఉద్యాన తోటల ప్రకృతి వ్యవసాయదారుడు మంచికట్ల సత్యం ఘంటాపథంగా చెబుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం పటేల్‌గూడెం వద్ద 13 ఎకరాల్లో బొప్పాయి, దానిమ్మ, జామ, మామిడి తోటలను ఆయన సాగు చేస్తున్నారు. వాననీటి సంరక్షణ ప్రాధాన్యాన్ని గుర్తెరిగిన ఈ రైతు.. పండ్ల మొక్కలు నాటక ముందే కందకాలు తవ్వుకొని సాగునీటి భద్రత పొందడం విశేషం.
2016 జూలైలో భూమిని కొనుగోలు చేశారు. కందకాల గురించి ‘సాక్షి సాగుబడి’ ద్వారా తెలుసుకున్న ఆయన తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం గౌరవాధ్యక్షులు సంగెం చంద్రమౌళి(98495 66009), వర్కింగ్ ప్రెసిడెంట్ దామోదర్‌రెడ్డి(94407 02029)లను వెంటబెట్టుకెళ్లి వారి సూచనల ప్రకారం కందకాలు తవ్వించుకున్నారు. 3 బోర్లు వేయించారు. కందకాలలో నుంచి పొంగిపొర్లిన నీరు వృథాగా పోకుండా చూసుకోవడానికి నీటి కుంటను సైతం తవ్వించారు.
భూమి వాలు ఎక్కువగా ఉన్నచోట 30 మీటర్లకు ఒక వరుసలో, వాలు తక్కువగా ఉన్నచోట 50 మీటర్లకు ఒక వరుసలో.. మీటరు లోతు, మీటరు వెడల్పున పొలం అంతటా కందకాలు తవ్వించారు. కందకాల మధ్యలో ట్రాక్టర్లు, బండ్లు వెళ్లడానికి 20 మీటర్ల మేరకు ఖాళీ వదిలారు. కందకాలు తవ్విన తర్వాత అనేకసార్లు వర్షాలు కురవడంతో నీరు పుష్కలంగా భూమిలోకి ఇంకిందని, అందువల్లనే ఈ ఎండాకాలం కూడా తమ బోర్లు ఒకటిన్నర ఇంచుకు తగ్గకుండా, నిరంతరాయంగా నీటిని అందిస్తున్నాయని సత్యం వివరాంచారు.
2017లో నెలరోజులు వర్షాలు అదేపనిగా కురిసినప్పుడు కూడా చుక్క నీరు తోట దాటి బయటకుపోలేదని, అందువల్లే సాగునీటికి ఢోకాలేకుండా ఉందన్నారు. బోర్ల నుంచి ముందు నీటిని ప్లాస్టిక్ షీట్ వేసిన నీటి కుంటలోకి తోడి పెట్టుకొని.. అవసరం మేరకు పండ్ల తోటలకు అందిస్తున్నారు. తమ ప్రాంతంలోని తోటల్లో బోర్లు కొన్ని ఎండిపోగా, మిగతావి ఆగి ఆగి పోస్తున్నాయని, తమకు ఆ సమస్య రాకపోవడానికి కందకాలే కారణమని సత్యం భావిస్తున్నారు. భూమి మీద పడిన ప్రతి చినుకునూ కందకాల ద్వారా భూమి లోపలికి ఇంకింపజేసుకుంటే రైతులకు నీటి కొరత అనే సమస్యే రాదన్నారు. అయితే, రైతులు కందకాల ప్రాధాన్యం గురించి తెలుసుకోలేకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని సత్యం(79810 82542) అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment