Fruit plants
-
పనిలో ఉంటే మనసూ బాగుంటుంది
స్త్రీలకు రిటైర్మెంట్ వయసు వస్తే వారు మనుమల, మనమరాళ్ల బాగోగుల్లో పడాల్సి వస్తుంది. లేదా కొడుకు దగ్గరో కూతురు దగ్గరో ఉంటూ టీవీ చూస్తూ కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. ‘కాని అలా ఉంటే బోర్. ఏదైనా ప్రయోజనకరమైన పని చేస్తే సంతోషంగా ఉంటుంది... మనసూ బాగుంటుంది’ అంటుంది అనంతలక్ష్మి. రిటైర్ అయ్యాక రైతుగా కూడా మారిన ఆమె పచ్చని పరిసరాల్లో ఉంటూ తనూ ఒక చెట్టులా నీడను పంచుతోంది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామానికి చెందిన కొమ్మినేని అనంతలక్ష్మి వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎంగా చేరి, సూపర్వైజర్గా తన సర్వీసునంతా గ్రామీణ ప్రాంతాల్లోనే చేసి రిటైర్ అయ్యింది. ఇద్దరు పిల్లలు. జీవితం చక్కగా ఒక ఒడ్డుకు చేరింది. ఇక ఏ పనీ చేయకుండా ఆమె కాలక్షేపం చేయవచ్చు. కాని ఆమె అలా ఉండలేకపోయింది. వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఏర్పడ్డ అనుబంధాలు వదులుకోలేకపోయింది. వారి కోసం పని చేస్తూనే ఉండాలని అనుకుంది. కష్టమనుకుంటే కుదరదు ‘ఎ.ఎన్.ఎమ్‌గా ఉద్యోగం అంటే పల్లె పల్లె తిరగాలి. నా పరిధిలో నాలుగూళ్లు ఉండేవి. వైద్య పరంగా ఎవరెలా ఉన్నారో కనుక్కుంటూ రోజంతా తిరుగుతూనే ఉండేదాన్ని’ అంటుంది అనంతలక్ష్మి. ‘ఆ రోజుల్లో కుటుంబ అవసరాలు తీరాలంటే నేనూ ఉద్యోగం చేయక తప్పని పరిస్థితులు. పిల్లలు చిన్నవాళ్లు. వాళ్లని వెంటేసుకుని ఊరూరు తిరిగిన రోజులూ ఉన్నాయి. కష్టం అనుకుంటే ఏ పనీ చేయలేం. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండటమే కాదు, మనకంటూ సొంత పని అంటూ ఉండాలి. ఎవరి మీదా ఆధారపడకూడదనే మనస్తత్వం నాది. ఎఎన్ఎమ్ నుంచి సూపర్వైజర్గా చేసి, రిటైర్ అయ్యాను’ అంటుందామె. ప్రయత్నాలు ఫలవంతం ‘పిల్లలిద్దరూ జీవితంలో స్థిరపడ్డారు. ఉద్యోగంలో రిటైర్మెంట్ వచ్చింది. పాతికేళ్లకు పైగా విధులు నిర్వర్తించిన దాన్ని. ఒక్కసారిగా ఖాళీగా ఇంట్లో కూర్చోవాలంటే ఇబ్బందిగానే అనిపించింది. కొన్ని రోజులు ఏం చేయాలో అర్థం కాలేదు. ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో కొద్దిపాటి పొలం ఉంది. రోజూ కాసేపు పొలం వద్దకు వెళ్లేదాన్ని. కూరగాయల సాగు, పండ్ల మొక్కలను నాటడం వంటి పనులు చేయడం మొదలుపెట్టాను. పల్లెలూ, పంటపొలాల్లో తిరుగుతున్నప్పుడు నా దృష్టి రైతులు చేసే పని మీద ఉండేది. నాకు తెలియకుండానే గమనింపు కూడా పెరిగింది. నేను కూరగాయలు, పండ్ల మొక్కల పెంపకం మొదలుపెట్టినప్పుడు నాకు మరో కొత్త జీవితం మొదలైనట్టనిపించింది. రెండేళ్లుగా వ్యవసాయంలో చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫలితమివ్వడం మొదలుపెట్టాయి. ఇంటికి వాడుకోగా, మిగిలిన వాటిని అవసరమైనవారికి ఇస్తూ వస్తున్నాను’ అందామె. మరవని సేవ.. ‘విశ్రాంత జీవనం వచ్చింది కదా అని చేసిన పనిని మర్చిపోలేం. అలాగే గ్రామాలవాళ్లు కూడా మర్చిపోరు. వారికి అవసరమైన వైద్య సేవలు అడుగుతూ ఉంటారు. నాకు అందరూ తెలుసు కాబట్టి నేనే స్వయంగా అడిగి తెలుసుకుంటుంటాను. వైద్యపరమైన ఏ చిన్న అవసరం వచ్చినా ముందుంటాను. ఊళ్లోనే వైద్య అవసరాలలో ఉన్నవారిని గమనించి, అవగాహన కల్పిస్తుంటాను. పొలంలో పండిన కూరగాయలు, పండ్లు రోడ్డు మీద ఓ వైపుగా పెట్టేస్తాను. అవసరమైన వాళ్లు ఆగి తీసుకెళుతుంటారు. కొందరు డబ్బిచ్చి తీసుకెళుతుంటారు. వీటితోపాటు ఈ మధ్య రెండు ఆవులతో పశు పోషణ కూడా మొదలుపెట్టాను. మట్టి పనిలో సంతోషాన్ని, నలుగురికి మేలు చేయడంలో సంతృప్తిని పొందుతున్నాను. పనిలో ఉంటే మనసూ బాగుంటుంది. ఆ పనిని నలుగురు మెచ్చుకుంటే మరింత ఉత్సాహం వస్తుంది. మలివయసులో నలుగురికి మేలు చేసే పనులను ఎంచుకుంటే జీవితంలో ఏ చీకూ చింత లేకుండా గడిచిపోతుందని నా జీవితమే నాకు నేర్పించింది’ అని వివరించింది అనంతలక్ష్మి. విశ్రాంత జీవనం వచ్చింది కదా అని చేసిన పనిని మర్చిపోలేం. అలాగే గ్రామాలవాళ్లు కూడా మర్చిపోరు. వారికి అవసరమైన వైద్యసేవలు అడుగుతూ ఉంటారు. నాకు అందరూ తెలుసు కాబట్టి నేనే స్వయంగా అడిగి తెలుసుకుంటుంటాను. వైద్యపరమైన ఏ చిన్న అవసరం వచ్చినా ముందుంటాను. – సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి -
టీచరమ్మ స్కూలు సేద్యం.. ‘థ్యాంక్స్ టు కోవిడ్’
పిల్లలకు పాఠాలు చెప్తే వాళ్లు భవిష్యత్ ఫలాలు ఇస్తారు. కాని ఖాళీగా ఉన్న స్థలంలో పంటలు వేస్తే ఇప్పుడే వారు ఆరోగ్యంగా తిని ఎదుగుతారు. బెంగళూరులోని ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌కి ఆ ఆలోచనే వచ్చింది. వెంటనే ఆ బడి ఆవరణంతా సేంద్రియ సేద్యం మొదలెట్టింది. ఇంకేముంది... రోజుకు కిలోల కొద్ది పండ్లో, కాయలో, కూరలో దిగుబడికి వస్తున్నాయి. నేలకు పాఠం చెప్తే అది తెచ్చుకున్న ఆకుపచ్చటి మార్కులు ఇవి. స్కూల్లో తోట పెంచితే రెండు రకాల సీతాకోక చిలుకలు కనిపిస్తాయి. ఒక రకం యూనిఫామ్ వేసుకున్నవి. ఒక రకం రంగు రంగుల రెక్కలల్లారుస్తూ మొక్కలపై వాలేవి. పిల్లలకు ఏ మంచి చూపినా ఇష్టమే. వారు ఆడమంటే ఆడతారు. పాడమంటే పాడతారు. మొక్కలు పెంచమంటే పెంచుతారు. క్లాసుల్లో వేసి సిలబస్‌లు రుబ్బడమే చదువుగా మారాక పిల్లలకు బెండకాయ చెట్టు, వంకాయ మొలకా కూడా తెలియకుండా పోతున్నాయి. ‘థ్యాంక్స్ టు కోవిడ్’ అంటారు సుశీలా సంతోష్. ఆమె బెంగళూరులోని ఎలహంకలో ఉన్న విశ్వ విద్యాపీఠ్ స్కూల్‌కు డైరెక్టర్. ఆ స్కూల్‌కు మరో రెండు క్యాంపస్‌లు ఉన్నా ఎలహంక బాధ్యతలు చూస్తున్న సుశీలా సంతోష్ చేసిన పని ఇప్పుడు తీగలు, పాదులుగా మారి స్కూల్‌ను కళకళలాడిస్తూ ఉంది. ‘2021 మార్చి ఏప్రిల్ నుంచి లాక్డౌన్ మొదలయ్యింది. 1400 మంది పిల్లలు చదివే క్యాంపస్ మాది. మధ్యాహ్నం భోజనాలు మా స్కూల్లోనే చేస్తారు. కనుక స్టాఫ్ ఎక్కువ. కాని లాక్డౌన్ వల్ల బస్ డ్రైవర్లు, ఆయాలు, వంట మాస్టర్లు, అడెండర్లు అందరూ పనిలేని వారయ్యారు. వారంత చుట్టుపక్కల పల్లెల వారు. పని పోతుందేమోనని భయపడ్డారు. కాని వారిని మేము తీసేయ దలుచుకోలేదు. అలాగని ఖాళీగా పెడితే వారికి కూడా తోచదు. అలా వచ్చిన ఆలోచనే ఆర్గానిక్ ఫార్మింగ్. స్కూలు తోట. పదండి... ఏదైనా పండిద్దాం అన్నాను వారితో. అప్పుడు చూడాలి వారి ముఖం’ అంటుంది సుశీలా సంతోష్. స్కూలులో ప్రెయర్ గ్రౌండ్ తప్ప మిగిలిన ఏ ప్రదేశమైనా పంట యోగ్యం చేయాలని వారు నిశ్చయించుకున్నారు. ‘ఇంతకు ముందు వీరిలో కొందరికి సేద్యం తెలుసు కనుక మా పని సులువయ్యింది’ అంటారు సుశీల. ఆమె సారధ్యంలో స్కూల్ పెరడు, బిల్డింగుల మధ్య ఉన్న ఖాళీ స్థలం, కాంపౌండ్ వాల్స్‌కు ఆనుకుని ఉండే నేల... ఇంకా ఎక్కడెక్కడ ఏ స్థలం ఉన్నా అదంతా కాయగూరలు, పండ్ల మొక్కలు, ఇవి కాకుండా 40 రకాల హెర్బల్ ప్లాంట్లు వేసి వాటి బాగోగులు చూడటం మొదలెట్టారు. ‘మాకు చాలా పెద్ద కిచెన్ ఉంది. దాని టెర్రస్‌ను కూడా తోటగా మార్చాం’ అన్నారు సుశీల. స్కూలులోపల ఉన్న నీటి వ్యవస్థనే కాక వంట గదిలో వాడగా పారేసే నీటిని కూడా సద్వినియోగం చేసుకుంటూ (ఆ నీరు అరటికి చాలా ఉపయోగం) 200 అరటి చెట్లు పెంచడం మొదలెట్టారు. ఇవి కాకుండా ఆకు కూరలు, కాయగూరలు, క్యారెట్, క్యాబేజీ వంటివి కూడా పండించ సాగారు. ‘మూడు నెలల్లోనే ఏదో ఒక కాయగూర కనిపించడం మొదలెట్టింది. స్టాఫ్ మధ్యాహ్న భోజనానికి వాడగా మిగిలినవి చుట్టుపక్కల వారికి పంచడం మొదలెట్టాం. మరి కొన్నాళ్లకు మేమే వాటితో వండిన భోజనాన్ని కోవిడ్ పేషెంట్స్‌కు సాధారణ రేట్లకు అమ్మాం. ఆరోగ్యకరమైన భోజనం తక్కువ ధరకు కాబట్టి సంతోషంగా తీసుకున్నారు. మా స్టాఫ్‌కు ఇదంతా మంచి యాక్టివిటీని ఇచ్చింది’ అంటారు సుశీల. ఈ సంవత్సర కాలంలో స్కూలు ఆవరణలో సీజనల్ పండ్లు, కాయగూరలు స్కూల్ స్టాఫ్ తమ అనుభవం కొద్దీ పండిస్తూ స్కూలు ఆవరణను ఒక పంట పొలంలా మార్చారు. ‘ఇప్పుడు స్కూల్‌కు వచ్చిన పిల్లలు ఇదంతా చూసి సంబరపడుతున్నారు. వారిని మేము ఈ సేద్యంలో ఇన్వాల్వ్ చేయదలిచాం. స్కూల్ కొరికులం కూడా ఆ మేరకు మార్చాం. పిల్లలకు పంటల గురించి తెలియాలి. తమ తిండిని తాము పండించుకోవడమే కాదు నలుగురి కోసం పండించడం కూడా వారికి రావాలి. మార్కెట్లోని తట్టలో కాకుండా కళ్లెదురుగా ఉంటే మొక్కకి టొమాటోనో, తీగకి కాకరో వేళ్లాడుతూ కనిపిస్తే వాళ్లు పొందే ఆనందం వేరు’ అంటారు సుశీల. మన దగ్గర కూడా చాలా స్కూళ్లల్లో ఎంతో ఖాళీ స్థలం ఉంటుంది. ‘స్కూలు సేద్యం’ కొంత మంది టీచర్లు ప్రోత్సహిస్తుంటారు. కాని ప్రతి స్కూల్లో సుశీల లాంటి మోటివేటర్లు ఉంటే సిబ్బంది పూనుకుంటే ప్రతి స్కూలు ఒక సేంద్రియ పంటపొలం అవుతుంది. మధ్యాహ్న భోజనం మరింత రుచికరం అవుతుంది. ఇలాంటి స్కూళ్లను గ్రీన్ స్కూల్స్ అనొచ్చేమో. -
ఒకటికి పది పంటలు!
ప్రతాప్ వృత్తిరీత్యా న్యాయవాది. రసాయన ఎరువులతో పండించిన పంట తినడం వల్ల మానవాళి మనుగడకు ఏర్పడుతున్న ముప్పును గుర్తించారు. అందుకే సేంద్రియ సాగును తన ప్రవృత్తిగా ఎంచుకున్నారు. ప్రతాప్ ప్రకృతి వ్యవసాయం చేస్తూ విషతుల్యమైన ఆహార పదార్థాల బారి నుంచి తన కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నారు. తనకున్న పదెకరాల వ్యవసాయ క్షేత్రాన్ని పూర్తిగా ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దారు. మంచిర్యాల జిల్లా కేంద్ర శివారులోని హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలో ఆయన క్షేత్రం ఉంది. వరి, మొక్కజొన్న, సజ్జలతోపాటు దాదాపు 50 రకాల పండ్ల మొక్కలు, పప్పుదినుసులు, కూరగాయలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. సుభాష్ పాలేకర్ ప్రకృతివ్యవసాయ సూత్రాలు, ‘సాక్షి సాగుబడి’ కథనాల స్ఫూర్తితో గత ఏడేళ్లుగా పంటల సాగు చేస్తూ.. అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఎకరన్నర విస్తీర్ణంలో మామిడి బత్తాయి (మొసంబి), సంత్ర, సపోట, ఆపిల్ బెర్, దానిమ్మ, అంజీర, సీతాఫలం, జామ, అరటి, బొప్పాయి తదితర పండ్ల తోటలు... ఎకరన్నరలో చిరుధాన్యాలు... ఎకరన్నరలో వరి... ఎకరన్నరలో పప్పుదినుసులు... రెండు ఎకరాల్లో కూరగాయల పందిళ్లు... రెండు ఎకరాల్లో వాణిజ్య పంటలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో.. పది ఎకరాల నల్లరేగడి భూమిలో పూర్తి సొంత వనరులతో తయారు చేసుకునే సహజ ఎరువులు వాడుతూ ప్రతాప్ వ్యవసాయం చేస్తున్నారు. రెండు ఆవులు, నాలుగు ఎద్దులు, ఒక గేదెను పెంచుతున్నారు. పేడ, మూత్రంతో జీవామృతం, ఘనాజీవామృతం, వర్మీ కంపోస్టు తయారు చేసి పంటలకు వేస్తున్నారు. పచ్చిరొట్ట ఎరువులను వాడుతూ మంచి దిగుడులు సాధిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో మెళకువలను ఇతర రైతులకు తెలియజెప్పేందుకు ప్రతి జూన్ నెలలో రైతులకు తన సేంద్రియ క్షేత్రంలో ప్రదర్శన ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకం వల్ల కలిగే నష్టాలను వివరిస్తున్నారు. రసాయన ఎరువులతో ఇటు మనుషులకు తినే తిండిలో, అటు పండించే పంట భూమికి నష్టాలు వాటిల్లుతాయని విడమరుస్తున్నారు. కూరగాయల సాగులో దిగుబడి రెట్టింపు భూమిని పైపైన దున్ని మాగిన ఆవు పేడను వేస్తారు. ఎకరా పొలాన్ని మడులుగా విభిజించి, ఒక్కో మడిలో ఒక్కో రకం కూరగాయ పంటను సాగు చేస్తున్నారు. దేశవాళీ వంగడాలతో పాటు సంకర రకాలను సాగు చేస్తున్నారు. బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తారు. రెండు వారాలకోసారి ఎకరాకు 200 లీటర్ల జీవామృతాన్ని నీటి ద్వారా అందిస్తారు. చీడపీడల నివారణకు కషాయాలు వాడుతున్నారు. పురుగును గుడ్డుదశలోనే నివారించేందుకు నీమాస్త్రం, వేప పిండి వాడుతున్నారు. అయినా పురుగు ఆశిస్తే అగ్ని అస్త్రం ద్రావణం పిచికారీ చేస్తారు. లద్దె పురుగు నివారణకు బ్రహ్మాస్త్రం వాడుతున్నారు. 20 లీటర్ల కషాయాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేస్తున్నారు. వారానికి రెండు కోతలు తెగుతున్నాయి. కిలో రూ.20 నుంచి రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు. కూరగాయల సాగుకు ఎకరాకు రూ. 6 వేల నుంచి 8 వేల వరకు ఖర్చు అవుతుండగా, రూ. 60 నుంచి రూ. 70 వేల వరకు నికరాదాయం లభిస్తోంది. కూరగాయలు పండించిన చోట తర్వాత ఏడాది వరి పండిస్తున్నారు. వరి పండించిన చోట తర్వాత ఏడాది కూరగాయలు పండిస్తున్నారు. దీనివల్ల పంట దిగుబడులు బాగున్నాయని ప్రతాప్ చెబుతున్నారు. ప్రకృతి సేద్యం చేసిన తొలి నాళ్లతో పొల్చితే దిగుబడి రెండింతలైంది. అప్పట్లో కూరగాయలు వారానికో కోత తెగితే ఇప్పుడు రెండు కోతలు తెగుతున్నాయి. పూర్తి సొంతంగా తయారు చేసుకున్న ఎరువులతో సాగుచేయడంతో బియ్యం, పప్పుదినుసులు, కూరగాయలు, పండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందంటున్నారు. సేంద్రియ పంటను మంచిర్యాలలో విక్రయిస్తున్నారు. కొంత మంది ఫోన్ ద్వారా సంప్రదించి సీజన్ల వారీగా కొనుగోలు చేస్తున్నారు. ఆదాయం అధికం.. ప్రతాప్ సాగు చేస్తున్న ఎకరం మామిడి తోటలో 60 చెట్లున్నాయి. 15ఏళ్లపాటు రసాయనిక సేద్యంలో ఉన్న తోటను ప్రకృతి సేద్యంలోకి మార్చారు. చెట్ల మధ్య ఎటు చూసినా 45 అడుగుల స్థలం ఉంటుంది. గాలి, వెలుతురు పుష్కలంగా లభిస్తుంది. తొలకరిలో చెట్టుకు ఐదులీటర్ల జీవామృతం పోస్తారు. 10 కిలోల ఆవుపేడ వేసి చెట్ల చుట్టూ దున్నుతున్నారు. పూతదశలో బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం పిచికారీ చేస్తారు. ఫిబ్రవరిలో పిందెదశలో, పురుగుదశలో మరోసారి పిచికారీ చేస్తారు. రసాయనిక సేద్యంలో వచ్చే దిగుబడిలో కంటే ఎక్కువగానే దీని ద్వారా దిగుబడి వస్తోంది. రసాయనిక ఎరువులు, పురుగుల మందులకు ఎకరాకు రూ. 20 వేల వరకు ఖర్చువుతుంది. ప్రకృతి సేద్యంలో రూ. 5 వేల నుంచి 8 వేలకు మించి ఉండదు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చెట్లు బాగుంటే రసాయన సేద్యంలో కన్నా ప్రకృతి సేద్యంలో రెండురెట్లు అధికంగా దిగుబడి తీయవచ్చని ప్రతాప్ తెలిపారు. పాడికి దిగుల్లేదు.. ఎరువులూ కొనక్కర్లేదు! మా వ్యవసాయానికి రెండు ఆవులు, నాలుగు ఎద్దులు, ఒక గేదె పట్టుగొమ్మగా నిలుస్తున్నాయి. వీటికి పొలం నుంచే గడ్డి అందుతుంది. పాడికి దిగుల్లేదు. వీటి పేడ, మూత్రంతో జీవామృతం, ఘనాజీవామృతం, వర్మీ కంపోస్టు తయారు చేసి పంటలకు వేస్తున్నాం. ఎరువులు, పురుగుమందులు కొనాల్సిన అవసరం లేకుండా పోయింది. రసాయన ఎరువుల పంటలతో భూ సారం దెబ్బతినడమే కాకుండా, ఆ పంటలు ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నాయి. అందుకే ప్రకృతి సేద్యం చేస్తున్నా. నా క్షేత్రంలో జూన్‌లో రైతులకు శిక్షణ ఇస్తున్నా. జీవన ఎరువులు, పురుగుమందుల తయారీ లాబ్ పెట్టి రైతులకు స్వల్ప ధరకే ఇవ్వాలనుకుంటున్నా. ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం రాయితీలు ఇచ్చి, మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే, రసాయనాల్లేని పంటలతో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చు. – కే వీ ప్రతాప్ (98499 89117), గుడిపేట, హాజీపూర్ మం., మంచిర్యాల జిల్లా నువ్వు చేను, పందిరి బీర తోట, వ్యవసాయ క్షేత్రంలో..ఆవుతో ప్రతాప్ –ఆది వెంకట రమణారావు, సాక్షి, మంచిర్యాల ఫొటో జర్నలిస్టు: Vð ల్లు నర్సయ్య -
ఉద్యానానికి ఊతం
కడప అగ్రికల్చర్ : సంప్రదాయ పంటలతో పోల్చితే పండ్లు, కూరగాయల తోటల నుంచి రైతులకు స్థిరమైన ఆదాయం అందుతోంది. అతివృష్టిŠ, అనావృష్టి పరిస్థితుల ప్రభావం ఉద్యాన పంటలపై అంతగా ఉండకపోవడంతో దిగుబడులకు ఎలాంటి ఢోకా లేదు. రైతులకు కరువు పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ఉద్యానశాఖ పండ్లు, కూరగాయ పంటల సాగును ప్రోత్సహిస్తోంది. జిల్లాలో నీటి వనరులున్న బోరుబావుల కింద, నదీతీర ప్రాంతాల రైతులు సూక్ష్మ సేద్యంతో పండ్లు, కూరగాయ తోటలను సాగు చేసుకుని ఆదాయం పొందుతున్నారు. ఉద్యానశాఖ కూడా ఆయా రైతులకు పంటల సాగుపై శిక్షణ ఇచ్చి మెలకువలు నేర్పించి సాగుకు చేయూతనిస్తోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం (ఎంఐడీహెచ్), రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా నిధులను మంజూరు చేసింది. ఉద్యాన తోటల సాగుకు సింహ భాగం కేంద్ర ప్రభుత్వ ని«ధులు పథకాలకు సమకూరుతుండగా, రాష్ట్రాభివృద్ధి ప్రణాళిక కింద అరకొరగానే నిధులు మంజూరయ్యాయి. రైతులు అనాదిగా వరి, వేరుశనగ, కంది, మినుము, పెసర తదితర పంటలు సాగు చేసినా వానలు కురవక దిగుబడులు రాక పెట్టుబడులు కూడా రాక తీవ్రంగా నష్టపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ దశలో వ్యవసాయ పంటల నుంచి రైతులు ఉద్యాన పంటల సాగువైపు దృషి సారిస్తున్నారు. 52817.7 పథక యూనిట్లకు..... రూ.38.03 కోట్లు మంజూరు.. జిల్లాలోని ఉద్యానశాఖ–1,2 డివిజన్లలో పండ్లు, కూరగాయతోటలు, పథల్లో ఇతరత్రా ఆర్థిక అవసరాల కోసం నిధుల నివేదికలను తయారు చేశారు. జిల్లా ఉద్యానశాఖ రూ.41 కోట్లు అవసరమవుతాయని ప్రతి పాదనలు పంపగా రూ.38.03 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం (ఎంఐడీహెచ్) కింద రూ.25.70 కోట్ల ని«ధులు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద రూ.11 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాభివృద్ధి ప్రణాళికలో రూ.1.33 కోట్లు మంజూరయ్యాయి. దీంట్లో ఇప్పటికి జిల్లా ఉద్యానశాఖ 1, 2లో 52817.7 యూనిట్లకు రూ.24.46 కోట్లు ఖర్చు చేశారు. జిల్లాకు మంజూరైన నిధులు ఖర్చు చేయగానే మరిన్ని నిధులు మళ్లీ వస్తాయని అధికారులు అంటున్నారు. కేంద్ర నిధులు అధికంగా వస్తున్నాయని, రాష్ట్ర నిధులే అరకొరగా ఉంటున్నాయని శాఖలోని కిందిస్థాయి అధికారులు అభిప్రాయపడుతున్నారు. అరటి, జామ, దానిమ్మ పంటపైనే రైతుల ఆసక్తి.. జిల్లాలో కొద్దొ గొప్పో నీటి వనరులున్న ప్రాంతాల రైతులు అరటి, జామ, దానిమ్మ పంటలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రధానంగా రైతులు ఆయా పంటలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తుండడం గమనార్హం. అరటి, జామ, దానిమ్మ పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో రైతులు ఆ పంటలపైనే దృష్టి సారించారు. జిల్లాలో అరటి 22,641 హెక్టార్లలోను, దానిమ్మ 700 హెక్టార్లు, జామ తోటలు 500 హెక్టార్లలోను సాగయ్యాయి. ఉద్యానశాఖ సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తుండడంతో చిన్న, సన్నకారు రైతులు ఆయా పంటలను సాగు చేసుకుని లబ్ధి పొందుతున్నారు. ఎకరాకు ఎంత హీనంగా వేసుకున్నా పెట్టుబడులు, ఇతర ఖర్చులు పోను అరటికి రూ.2 లక్షలు, దానిమ్మకు రూ.3లక్షలు, జామకు రూ.2 లక్షలు ఆదాయం వస్తుండడంతో రైతులు ఆ దిశగా ఆయా పంటలపైనే దృష్టి సారిస్తున్నారు. బిందు సేద్యంతో పంటల సాగు.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బిందు సేద్యానికి అధిక సబ్సిడీలను ఇచ్చి ప్రోత్సహించారు. దీంతో రైతులకు పండ్లతోటలకు, కూరగాయ తోటలకు నీటి మడవలు వేసే పద్ధతి లేకుండా పోయింది. బిందు సేద్యంతో కేవలం మోటారు ఆన్ చేయగానే అమర్చిన పైపుల నుంచి నీరు లేటర్ల ద్వారా చెట్లకు, మొక్కలకు చేరుతుంటాయి. దీంతో రైతులు కేవలం నీరు సక్రమంగా పోతోందా? లేదా చూసుకుంటే సరిపోతుంది. ఈ విధానం అందుబాటులోకి వచ్చిన తరువాత రైతు పని సులభమైంది. మోటారు ఆన్‌చేసి ఇతరత్రా పొలం పనులు చేసుకోవడానికి ఎంతో వీలుంటోంది. దీనివల్ల రైతులు పండ్లతోటల సాగుకు పూనుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పండ్లతోటల సాగు బాగా పెరిగింది. ఆయా పంటల్లో కలుపు కూడా అంతగా పెరగదు. ఎరువులు కూడా నేరుగా మొక్కలకు, చెట్లకు చేరేలా చేసుకునే వీలుంటోంది. ఉద్యానశాఖ అమలు చేస్తున్న పథకాల తీరు ఇలా.. జిల్లాలో ఉద్యానశాఖ సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం(ఎంఐడీహెచ్), రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, రాష్ట్రాభివృద్ధి ప్రణాళిక పథకాల ద్వారా పండ్లతోటల్లో మొక్కలు నాటుకున్నది మొదలు మూడు సంవత్సరాల పాటు నిర్వహణ ఖర్చులు, పంటల విస్తరణ, సస్యరక్షణ, రక్షిత సేద్యం, నీటి కుంటల(ఫాంపాండ్స్) ఏర్పాటు, కోతలో గ్రేడింగ్ కేంద్రాలు (ప్యాక్ హౌస్‌లు), యాంత్రీకరణ పరికరాలు, కోత అనంతరం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, పంట ఉత్పాదక సంఘాలు, పాత తోటల పునరుద్ధరణ, కూరగాయల సాగు, ఉతకర్రలతో సాగు, శాశ్వత పందిళ్లలో తీగజాతి కూరగాయల సాగు, మార్కెట్‌కు పండ్లు, కూరగాయలను చేరవేసే ప్లాస్టిక్ క్రేట్స్, చిరు సంచుల విత్తనాలు తదితర పథకాలను అమలు చేస్తున్నారు. వీటిని చిన్న, సన్నకారు రైతులే కాక పెద్ద రైతులు వినియోగించుకుంటూ మంచి దిగుబడులు తీస్తూ ఆదాయం పొందుతున్నారు. -
ప్రయాస లేని ఇంటిపంటలు!
‘మనిషి చెయ్యి పెడితేనే మొక్కలకు నష్టం జరుగుతుంది. మొక్కలు మనిషి జోక్యాన్ని ఆశించవు. వాటి నైజం బతకటమే కదా. నేను చేసేదేమి ఉంది? ఇది నా అనుభవం..’ అంటున్నారు సీనియర్ అర్బన్ పర్మాకల్చర్ నిపుణురాలు నాదెండ్ల లక్ష్మి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు పదిలో స్వగృహంలో నివాసం ఉంటున్న ఆమె గత ఐదేళ్లుగా అర్బన్ పర్మాకల్చర్ పద్ధతుల్లో పెరటి తోటను స్వతంత్రంగా పెరిగేలా తీర్చిదిద్దారు. ఆ పెరటి తోటలో మొలిచే చాలా రకాల వార్షిక పంటలు ప్రతి ఏటా విత్తనాలు వేయకుండానే మొలిచి మంచి దిగుబడులను ఇస్తున్నాయి! తన పెరటి తోటలో గత మూడేళ్లుగా ఎటువంటి విత్తనాలనూ పనిగట్టుకొని వేయలేదని, అంతకుముందు వరుసగా రెండేళ్లు నాటిన మొక్కలు, వేసిన విత్తనాలే ప్రతి ఏటా వాటంతట అవే మొలకెత్తి, సంతృప్తికరమైన ఫలసాయాన్ని అందిస్తున్నాయని లక్ష్మి వివరించారు. విత్తిన మొదటి ఏడాది పంట తీసుకోరు! ఆమె గార్డెన్లో ప్రస్తుతం అనేక కుండీల్లో వంగ మొక్కలున్నాయి. అయితే, ఆమె తన పెరటి తోటలో ఐదేళ్ల క్రితం వంగ విత్తనాలేశారు. ఆమె పెట్టుకున్న నియమం ఏమిటంటే.. ఏ రకం విత్తనాలైతే కొత్తగా తెచ్చి పెరటి తోటలో చేర్చుతారో ఆ మొక్కల కాయలను తొలి ఏడాది ముట్టుకోరు. అవే పెరిగి, పండి రాలిపోయి భూమిలో కలిసిపోతాయి. అనుకూలమైన వాతావరణం ఏర్పడినప్పుడు ఆ విత్తనాలు మళ్లీ మొలకెత్తి, ఫలసాయాన్ని అందిస్తాయి. ప్రతి ఏటా కొన్ని కాయలను విత్తనాలకు వదిలేస్తారు. వాటిని పనిగట్టుకొని దాచిపెట్టి విత్తటం ఉండదు. అవే మట్టిలో కలిసిపోయి.. తిరిగి మొలకెత్తుతూ ఉంటాయి. ఉదాహరణకు.. ఇప్పుడు కొన్ని కుండీల్లో వంగ మొక్కలున్నాయి. సుమారు 5 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న పెరట్లో కొన్ని సిమెంటు రింగ్‌లు, కొన్ని పెద్ద కుండీలు ఉన్నాయి. చాలా మొక్కలు నేలపైనే పెరుగుతున్నాయి. విత్తనాలు పడి మట్టిలో ఉండి వాటంతటవే తిరిగి మొలుస్తుంటాయి. మొలిచిన మొక్కలకు పరిమితంగా ఆలనాపాలనా చేయడమే తప్ప పెద్దగా చేయాల్సిందేమీ లేదని లక్ష్మి అంటున్నారు. సీజన్లో వంగ మొక్కలు అక్కడక్కడా మొలుస్తాయి. మొలిచిన మొక్కను తీసి కుండీల్లోకి చేర్చుతారు.. ఏడాది పొడవునా రాలిన ఆకులతో లీఫ్ కంపోస్టు తయారు చేసి, ఎప్పటికప్పుడు మొక్కలకు వేస్తూ ఉంటారు. తగుమాత్రంగా నీరందిస్తారు. అంతే.. ఇక వాటంతట అవే పెరుగుతూ దిగుబడినిస్తాయి. వంగ, టమాటా మొక్కలను మాత్రమే పీకి కుండీల్లో నాటుతారు. మిగతా కూరగాయలు, ఆకుకూరలు, బొప్పాయి వంటి పండ్ల మొక్కలు ఎక్కడ మొలిస్తే అక్కడే పెరిగి ఫలసాయాన్నిస్తుంటాయని లక్ష్మి వివరించారు. అందుకే తనది ప్రయాస పడి సాగు చేయని (డూ నథింగ్) పెరటి తోట అంటారామె. భూసారం.. జీవవైవిధ్యం.. భూమిలో వానపాములు, సూక్ష్మజీవరాశి పుష్కలంగా పెరిగేలా సారవంతం చేయడం.. ఆకులు అలములతో ఆచ్ఛాదన కల్పించడం.. వీలైనన్ని ఎక్కువ రకాల (బహువార్షిక, ఏక వార్షిక, స్వల్పకాలిక) పంటల జాతులను కిచెన్ గార్డెన్‌లోకి చేర్చితే చాలు.. అదేపనిగా ప్రతిరోజూ పనిగట్టుకొని పెద్దగా ప్రయాస పడి మొక్కల పనుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని లక్ష్మి చెబుతున్నారు. 2013లో అర్బన్ పర్మాకల్చర్ వర్క్‌షాపును తన ఇంట్లోనే నిర్వహించానని, అప్పటి నుంచి శాశ్వత వ్యవసాయ సూత్రాలను ప్రయాస లేకుండా తు.చ. తప్పకుండా అనుసరిస్తున్నానన్నారు. ఆమె పెరటి తోటలో బొప్పాయి, ప్యాషన్ ఫ్రూట్, దొండ, పొట్ల, అలసంద, 3 రకాల చిక్కుళ్లు, పచ్చిమిర్చి, క్యాప్సికం, వంగ, టమాటాతోపాటు తోటకూర, పాలకూర, మెంతికూర, 3 రకాల బచ్చలికూర మొక్కలున్నాయి. మునగచెట్టు పూలు, పిందెలతో కనువిందు చేస్తుంది. అవకాడొ వంటి అరుదైన పండ్ల మొక్కలూ ఉన్నాయి. తన పెరట్లో ఎందుకనో గాని దేశవాళీ బొప్పాయి మొక్కలు విత్తనాలు వేయకపోయినా రెండేళ్లకోసారి మాత్రమే పుట్టి పెరిగి పండ్లనిస్తున్నాయని లక్ష్మి తెలిపారు. మగ చెట్టును ఒకదాన్ని ఉంచి మిగతావి తీసేస్తానన్నారు. గుత్తిగా పూలు వస్తే అది మగ చెట్టని, పిందెతో కూడిన పూవు ఒకటే వస్తే అది ఆడ చెట్టని గుర్తించాలన్నారు. ఐదారేళ్ల క్రితం వంగ విత్తనాలు వేసి పెంచానని, తర్వాత విత్తనం వేయలేదని, ప్రతి ఏటా గార్డెన్లో అక్కడక్కడా మొలిచిన వంగ మొక్కలను పీకి కుండీల్లో నాటుతానన్నారు. దేశవాళీ టమాటా రకాల విత్తనాలు కొన్ని సంవత్సరాల క్రితం వేశానని, తర్వాత నుంచి వాటికవే మొలుస్తుంటాయని, మొక్కలను తీసి కుండీల్లో నాటి, లీఫ్ కంపోస్టు, నీరు తగినంత అందించడమే తాను చేస్తున్నానన్నారు. రెండు టమాటా మొక్కలుంటే చాలు తమ నలుగురికీ సరిపోయే అన్ని కాయలు కాస్తాయన్నారు. చలికాలంలో 70% తమ కుటుంబానికి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తమ ఇంట్లో పండినవే సరిపోతాయని, వేసవిలో పూర్తిగా మార్కెట్లోనే కొంటామని లక్ష్మి(laxmi_nad@yahoo. com) తెలిపారు. బొప్పాయి మగ పూలు, బొప్పాయి ఆడ పువ్వు, కాప్సికం, ప్యాషన్ ఫ్రూట్ మునగ వైభవం, చిక్కుడు పాదు, వాటికవే మొలిచినవి, తేనెతుట్టె -
కట్నంగా 1001 మొక్కలు
కేంద్రపర (ఒడిషా): ఒడిషాలోని కేంద్రపర జిల్లాలో ఓ ప్రకృతి ప్రేమికుడు కట్నానికి బదులుగా 1001 మొక్కలు అమ్మాయి తల్లిదండ్రుల నుంచి అందుకున్నాడు. 33 ఏళ్ల సరోజ్కాంత బిశ్వాల్ అనే ఈ స్కూల్ టీచర్ ఈ విధంగా ప్రకృతిపై తన ఇష్టాన్ని చాటుకున్నాడు. కట్నానికి తాను బద్ధ వ్యతిరేకినని, దానికి బదులుగా తనకు ఈ పండ్ల మొక్కలు ఇవ్వాలని వధువు తరఫు వారిని కోరినట్లు బిశ్వాల్ చెప్పారు. శనివారం ఆయన వివాహం జరిగింది. బిశ్వాల్ వివాహం టపాసులు కాల్చడం లాంటి ఆడంబరాలు లేకుండా జరిగిందని వధువు గ్రామస్తులు చెప్పారు. కట్నం నిరాకరించి, ఇలా మొక్కలు తీసుకోవడం తన భార్య రష్మిరేఖకు చాలా సంతోషం కలిగించిందని బిశ్వాల్ చెప్పారు. రష్మిరేఖ కూడా ఉపాధ్యాయురాలే. -
పండ్ల మొక్కలకు ప్రాముఖ్యత
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది హరితహారంలో కోతులకు ఆహారాన్ని ఇచ్చే పండ్ల మొక్కలకు ప్రాముఖ్యత ఇస్తామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) పీకే ఝా అన్నారు. గత ఏడాది హరితహారం కింద రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు 90 శాతం బతికాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ‘సాక్షి’ప్రతినిధితో మాట్లాడారు. ప్రకృతిలో పండ్ల మొక్కలు తగ్గిపోవడం, మరోవైపు మనుషులు జంక్ ఫుడ్‌ను ఫీడ్‌గా ఇవ్వటం వలన కోతులు వనాలు వదిలి ఊళ్ల మీదకు మళ్లాయని, తిరిగి వాటిని వనాల్లోకి పంపాలంటే సాధ్యమైనన్ని ఎక్కువ పండ్ల మొక్కలు పెంచటం ఒక్కటే మార్గమని చెప్పారు. ‘‘కోతులు ఇష్టంగా తినే 25 రకాల పండ్ల మొక్కలను గుర్తించాం, వాటిని రాష్ట్రవ్యాప్తంగా వివిధ నర్సరీలతో పెంచుతున్నాం. ఈసారి రుతుపవనాలు ఆశాజనకంగానే ఉన్నాయి. మొక్కలతో మేం సిద్ధంగా ఉన్నాం. ఈ ఏడాది 39.5 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడి హరితహారం ప్రారంభ తేదీని నిర్ణయిస్తాం. అటవీ భూములు ఉన్నచోట వందకు వంద శాతం పండ్ల మొక్కలనే నాటుతామని, అటవీ భూములు లేనిచోట కనీసం 20 శాతం కోతులు తినే పండ్ల మొక్కలు కచ్చితంగా నాటాలనే నిబంధన పెట్టుకున్నాం. మనుషులు కోతులకు కృత్రిమ ఆహారం ఇవ్వొద్దని, దీనికి అలవాటు పడిన కోతులు సహజ ఆహార అన్వేషణ మరిచిపోయి ఊళ్ల మీదకు మళ్లుతున్నాయని’’ఝా అన్నారు. శాటిలైట్ ఫోటోల ద్వారా రాష్ట్రంలో 565 స్క్వేర్ కిలోమీటర్ల మేరకు పచ్చదనం పెరిగినట్లు నిర్ధారణ అయింది. ఈ ఏడాది గూగుల్ శాటిలైట్ విడుదల చేసిన చిత్రాల్లో గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు మాత్రమే 100 స్క్వేర్ కిలోమీటర్లకు పైగా పచ్చదనం విస్తరించిన రాష్ట్రాలుగా గుర్తింపు పొందాయి. మా పనితనానికి ఇది అద్భుతమైన గుర్తింపు. బంగారు తెలంగాణలో మా భాగస్వామ్యం బలంగా ఉండాలనే ఆశయంతో అటవీ శాఖ ఉద్యోగులు, అధికారులు సమష్టిగా పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్న జల ప్రాజెక్టులకోసం మా అధికారుల చొరవ, కృషిని అభినందిస్తున్నారు. కాళేశ్వరం, సీతారామసాగర్, పాలమూరు ఎత్తిపోతల పథకానికి అత్యంత వేగంగా అటవీ అనుమతులను సాధించటంలో అధికారులు రాత్రింబవళ్లు కృషి చేశారు. కేంద్ర అటవీ శాఖ నుంచి జల ప్రాజెక్టులకు ఇంత వేగంగా అటవీ అనుమతులు గతంలో నేనెప్పుడూ చూడలేదని ఝా చెప్పారు. అటవీ భూముల రక్షణే ధ్యేయంగా.. ఎకోపార్కులు, అర్బన్ ఫారెస్టు పార్కు ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ప్రజలకు అడవుల మీద, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యతల మీద అవగాహన కలిగించటమే ఎకో పార్కుల ఉద్దేశం. హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని అటవీ భూములను రక్షించుకుంటూ.. ప్రజలకు స్వచ్ఛమెన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందించే లక్ష్యంతో నే అర్బన్ ఫారెస్టు పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే కొండాపూర్‌లో పాలపిట్ట సైక్లింగ్ ఉద్యానవనం, బర్డ్ పార్కును అభి వృద్ధి చేశాం. 40 రకాలకు చెందిన దాదాపు 7,500 మొక్కలను ఈ పార్కులో కొత్తగా పెంచుతున్నాం. కండ్లకోయ పార్కు వినియోగంలోకి వచ్చింది. కవాల్ టైగర్ రిజర్వు ప్రాజెక్టు సమీపంలో మంచిర్యాల జిల్లా చింతగూడ గ్రామంలో కొత్త పర్యావరణ, పర్యాటక ప్రాజెక్టు కోసం ఆరు ఎకరాల భూమిని గోదావరి నది దగ్గర సేకరించి, పర్యాటక స్థల అభివృద్ధి కోసం టెండర్లు పిలిచాం. నల్లగొండ జిల్లాలోని వైజాగ్ కాలనీలో నాగార్జునసాగర్ తీర ప్రాంతంలో మరొక పర్యావరణ ప్రాజెక్టు కోసం భూమి గుర్తించాం. ప్రతిపాదనలు కీలక దశలో ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ అడవులను దట్టమైన అటవీ ప్రాంతంగా మార్చాలనేది ముఖ్య మంత్రి ఆకాంక్ష. సుమారు 3,470 హెక్టార్లలో అటవీ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో రక్షించటంతో పాటు పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. ఆక్రమణలకు గురికాకుండా దాదాపు 40 కి.మీ పొడవునా సీ త్రూ వాల్‌ను నిర్మిస్తాం. వెదురు పరిశ్రమ (బ్యాంబూ లంబర్ ఇండస్ట్రీ) ఏర్పాటుకోసం రూ.22.4 కోట్ల పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనలు కీలక దశలో ఉన్నాయి. ఇదివరకు కాగితం తయారీ కోసం పేపర్ మిల్లులు వెదురును కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసేవి. ప్రస్తుతం టెక్నాలజీ మార్పు కారణంగా వీటికి డిమాండ్ లేదు. బ్యాంబూ లంబర్ ఇండస్ట్రీని స్థాపించి ఈ ప్లాంటేషన్లలో లభించే వెదురును పూర్తిగా ఉపయోగించుకుంటే ఇది రైతులకు ఆదాయాన్ని పెంచుతుంది అని ఝా చెప్పారు. -
కందకాల పుణ్యమా అని బోర్లలో కంటిన్యూగా నీళ్లు!
కందకాలు తవ్వుకున్నందు వల్లనే ఈ వేసవిలో తమ తోటలో నీటికి కరువు లేకుండా బోర్లు నిరాటంకంగా నీటిని అందిస్తున్నాయని ఉద్యాన తోటల ప్రకృతి వ్యవసాయదారుడు మంచికట్ల సత్యం ఘంటాపథంగా చెబుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం పటేల్‌గూడెం వద్ద 13 ఎకరాల్లో బొప్పాయి, దానిమ్మ, జామ, మామిడి తోటలను ఆయన సాగు చేస్తున్నారు. వాననీటి సంరక్షణ ప్రాధాన్యాన్ని గుర్తెరిగిన ఈ రైతు.. పండ్ల మొక్కలు నాటక ముందే కందకాలు తవ్వుకొని సాగునీటి భద్రత పొందడం విశేషం. 2016 జూలైలో భూమిని కొనుగోలు చేశారు. కందకాల గురించి ‘సాక్షి సాగుబడి’ ద్వారా తెలుసుకున్న ఆయన తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం గౌరవాధ్యక్షులు సంగెం చంద్రమౌళి(98495 66009), వర్కింగ్ ప్రెసిడెంట్ దామోదర్‌రెడ్డి(94407 02029)లను వెంటబెట్టుకెళ్లి వారి సూచనల ప్రకారం కందకాలు తవ్వించుకున్నారు. 3 బోర్లు వేయించారు. కందకాలలో నుంచి పొంగిపొర్లిన నీరు వృథాగా పోకుండా చూసుకోవడానికి నీటి కుంటను సైతం తవ్వించారు. భూమి వాలు ఎక్కువగా ఉన్నచోట 30 మీటర్లకు ఒక వరుసలో, వాలు తక్కువగా ఉన్నచోట 50 మీటర్లకు ఒక వరుసలో.. మీటరు లోతు, మీటరు వెడల్పున పొలం అంతటా కందకాలు తవ్వించారు. కందకాల మధ్యలో ట్రాక్టర్లు, బండ్లు వెళ్లడానికి 20 మీటర్ల మేరకు ఖాళీ వదిలారు. కందకాలు తవ్విన తర్వాత అనేకసార్లు వర్షాలు కురవడంతో నీరు పుష్కలంగా భూమిలోకి ఇంకిందని, అందువల్లనే ఈ ఎండాకాలం కూడా తమ బోర్లు ఒకటిన్నర ఇంచుకు తగ్గకుండా, నిరంతరాయంగా నీటిని అందిస్తున్నాయని సత్యం వివరాంచారు. 2017లో నెలరోజులు వర్షాలు అదేపనిగా కురిసినప్పుడు కూడా చుక్క నీరు తోట దాటి బయటకుపోలేదని, అందువల్లే సాగునీటికి ఢోకాలేకుండా ఉందన్నారు. బోర్ల నుంచి ముందు నీటిని ప్లాస్టిక్ షీట్ వేసిన నీటి కుంటలోకి తోడి పెట్టుకొని.. అవసరం మేరకు పండ్ల తోటలకు అందిస్తున్నారు. తమ ప్రాంతంలోని తోటల్లో బోర్లు కొన్ని ఎండిపోగా, మిగతావి ఆగి ఆగి పోస్తున్నాయని, తమకు ఆ సమస్య రాకపోవడానికి కందకాలే కారణమని సత్యం భావిస్తున్నారు. భూమి మీద పడిన ప్రతి చినుకునూ కందకాల ద్వారా భూమి లోపలికి ఇంకింపజేసుకుంటే రైతులకు నీటి కొరత అనే సమస్యే రాదన్నారు. అయితే, రైతులు కందకాల ప్రాధాన్యం గురించి తెలుసుకోలేకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని సత్యం(79810 82542) అంటున్నారు. -
విరివిగా మొక్కలు నాటాలి
చేగుంట: అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్కరు మొక్కలను నాటి హరితహారాన్ని విజయవంతం చేయాలని మెదక్ ఆర్డీఓ మెంచు నగేశ్ పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని చిన్నశివునూర్ డంపుయార్డు సమీపంలోని ఖాళీ స్థలంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ... విద్యార్థులు, యువకులు, వృద్ధులు అన్ని వయసుల వారు విరివిగా మొక్కలు నాటాలన్నారు. ఒక్కో మండలంలో లక్షల మొక్కలు నాటి వాటిని పెరిగి పెద్దగా మారేలా సంరక్షించాలని సూచించారు. అధికారులు సైతం విభాగాలుగా ఏర్పడి అన్ని గ్రామాల్లో ఎక్కువ సంఖ్యల్లో మొక్కలు నాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అల్లి రమ, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది సుజాత, వైస్ చైర్మన్ ఎం శ్రీనివాస్, ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ నిర్మల, ఏపీఓ ఆదినారాయణ, పంచాయతీ కార్యదర్శి బక్కప్ప, నాయకులు జనగామ అంజాగౌడ్, రమేశ్ గౌడ్, ఉప్పరి నాగులు, కుమ్మరి స్వామి తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటిన ఏఎంసీ డైరెక్టర్ దుబ్బాక: హరిత హారంలో భాగంగా మంగళవారం దుబ్బాక మండలం పోతారెడ్డిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పేరుడి దయాకర్‌రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరిత హారంలో మొక్కలు నాటడడంలో రాష్ట్రంలోనే దుబ్బాక నియోజక వర్గాన్ని మొదటి స్థానంలో నిలపడానికి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందన్నారు. హరిత ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గోప కైలాసం, నాయకులు పాతూరి చిన్న శ్రీనివాస్‌గౌడ్, ఎండీ జాకీర్, జూకంటి రాజిరెడ్డి, గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బెస్త భూమయ్య, బండి మురళి గౌడ్, దమ్మగౌని శ్రీనివాస్ గౌడ్, మాస్తి సిద్ధిరాములు, జంగం శంకర్ పాల్గొన్నారు. భవిష్యత్తు తరాల కోసమే హరితహారం మిరుదొడ్డి: భవిష్యత్తు తరాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారాన్ని నిర్వహిస్తోందని ఎంపీపీ పంజాల కవిత శ్రీనివాస్‌గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నంట బాపురెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మోతె శివారులో గల ప్రభుత్వ భూమిలో వివిధ రకాల పండ్ల మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు పాటుపాడాలని కోరారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. కార్యక్రమంలోవ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వంజరి శ్రీనివాస్, ఇన్చార్జి ఎంపీడీఓ నీలకంఠ మఠం నగేష్, సర్పంచ్ కోరంపల్లి విజయలక్ష్మి వెంకట్‌రెడ్డి, భూంపల్లి ఎస్ఐ పి.ప్రసాద్, ఉపాధి హామీ ఏపీఓ శంకరయ్య, మండల సాక్షర భారత్ కోకన్వీనర్ బొంగాని రాములు, కార్యదర్శి అశోక్, నాయకులు సిద్ది భూపతిగౌడ్ పాల్గొన్నారు. -
ఏయే పంటలను ఎలా విత్తుకోవాలి?
‘అన్నపూర్ణ’ ప్రకృతి వ్యవసాయ పంటల నమూనా ప్రకారం కందకాలు, మట్టి పరుపులు, కాలువలు, పండ్ల మొక్కలకు గుంతలు తవ్వడం.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలను గత వారం తెలుసుకున్నాం. ఇప్పుడు మట్టి పరుపుల్లో విత్తే పంటల గురించి తెలుసుకుందాం...అర ఎకరంలో అన్నపూర్ణ పంటల నమూనా కుటుంబ ఆహార భద్రత, ఆరోగ్య భద్రతకు ఉద్దేశించింది. కాబట్టి, అర ఎకరం(50 సెంట్ల) భూమిలో సిద్ధం చేసుకున్న మట్టి పరుపుల్లో అనేక రకాల ఆహార పంటలను విత్తుకునేలా ప్రణాళికలు వేసుకోవాలి. అర ఎకరంలోని అన్ని మట్టి పరుపుల్లోనూ నిర్ణీత దూరంలో పండ్ల మొక్కలు నాటుకోవాలి. ఆ తర్వాత ఒక పావు ఎకరంలోని మట్టి పరుపుల్లో కూరగాయ పంటలు, మిగతా పావు ఎకరంలోని మట్టి పరుపుల్లో తిండిగింజలు/పప్పులు/నూనెగింజల పంటలను విత్తుకోవాలి. పండ్ల మొక్కలు: గట్టు నుంచి 6 అడుగుల స్థలం వదిలిపెట్టి పండ్ల మొక్కలు నాటాలి. తూర్పు నుంచి పడమరకు లేదా పడమర నుంచి తూర్పుకు ప్రతి ఐదో మట్టి పరుపు మధ్యలో మామిడి మొక్క నాటుకోవాలి. అంటే..1వ, 5వ, 9వ.. మట్టి పరుపుల్లో మామిడి మొక్కలు నాటాలి. మామిడి నుంచి 9 అడుగుల దూరంలో మునగ/ అరటి/బొప్పాయి/కరివేపాకు నాటాలి. మామిడి నుంచి 18 అడుగులకు జామ/నిమ్మ/సపోట/బత్తాయి/సీతాఫలం/ రామాఫలం/దానిమ్మ తది తర మొక్కలలో ఏదో ఒక రకం నాటుకోవాలి. దక్షిణం నుంచి ఉత్తరానికి లేదా ఉత్తరం నుంచి దక్షిణానికి మామిడి మొక్క నుంచి 36 అడుగులకు మళ్లీ మామిడి/పనస/ఉసిరి మొక్కల్లో ఏదో ఒక రకం మొక్కను మట్టి పరుపుల్లో నాటుకోవాలి. ఈ వరుసలో 18 అడుగులకు, 9 అడుగులకు ఎటువంటి పండ్ల మొక్కలు నాటకూడదు. కూరగాయలు: కూరగాయల కోసం కేటాయించిన పావు ఎకరం(25 సెంట్ల)లో పండ్ల మొక్కలు నాటుకున్న మట్టి పరుపుల్లో దుంపజాతి/ ఆకుకూరలు పంట మార్పిడి విధానం పాటిస్తూ విత్తుకోవాలి. 2వ మట్టి పరుపులో ఆకుకూరలు 3, 4వ మట్టి పరుపుల్లో కాయగూరలు టమోటా/ వంగ/మిరప/కాలీఫ్లవర్/క్యాబేజీ/నూల్‌కోల్/నేలచిక్కుడు మొదలైన వాటిని వేసుకోవాలి. ఒక రకమైన పంట వేసిన మట్టి పరుపులో పంట తీసిన తరువాత అదేరకమైన పంట కాకుండా పంటను మారుస్తూ నాటుకోవాలి. దీని వలన ఒక పంటకు సోకిన పురుగులు, తెగుళ్లు తొందరగా పక్క పరుపు మీదకు వ్యాప్తి చెందకుండా అరికట్టగలుగుతాం. తిండి గింజలు/పప్పులు/నూనెగింజల పంటలు: మిగిలిన పావు ఎకరం భూమిలో పండ్ల మొక్కలు నాటుకున్న మట్టి పరుపుల్లో నీడ ఎక్కువ అవసరమైన దుంప జాతి, పప్పు జాతుల పంటలు విత్తుకోవాలి. పండ్ల మొక్కల్లేని మట్టి పరుపుల్లో చోడి/వరి/జొన్న/కొర్ర/సజ్జ/ఊదలు మొదలైన పంటలు లేదా నూనె జాతులైన నువ్వులు/వేరుశనగ/పొద్దుతిరుగుడు/అవిశె తదితర పంటలు లేదా పప్పు జాతు లైన పెసర/మినుము/ఉలవ/బొబ్బర్లు/ కొమ్ముశెనగ/ బఠాణి/అనుములు మొదలైనవి ఏక పంటగా లేదా కొన్ని పంటలు కలిపి విత్తుకోవాలి. ఒక మట్టి పరుపులో ఈ సీజన్లో వేసిన పంటలను వచ్చే సీజన్లో వేయకూడదు. పంటల మార్పిడి చేస్తూ వేరే రకం పంటలు వేసుకోవాలి. అంతర పంటలు వేసేదెలా? 1.ఎక్కువ పంటకాలం కలిగిన, ఎక్కువ ఎత్తు పెరిగే పంటల్లో తక్కువ పంట కాలం, తక్కువ ఎత్తు పెరిగే పంటలను విత్తుకోవడాన్ని లేదా ప్రధాన పంటకంటే ముందుగానే ఫలసాయమందించే, తక్కువ పంటకాలం కలిగిన పంటలను అంతర పంటలని అంటారు.2. కూర గాయల కోసం కేటాయించిన పావు ఎకరంలోని మట్టి పరుపుల్లో పండ్ల మొక్కలు నాటుకున్న తర్వాత సామ, కంద, ఉల్లి, కేరట్, బీట్రూట్, బంగాళాదుంపలు, పసుపు, అల్లం మొదలైన దుంప జాతులను అంతర పంటలుగా వేసుకోవాలి. ఏటా ఒక్కసారైనా పప్పు జాతుల పంటలను విత్తుకోవాలి. 3. పండ్ల మొక్కలు నాటుకున్న మట్టి పరుపుల్లో అల్లం, పసుపు, నేల పనసలతోపాటు పప్పు జాతులను తప్పనిసరిగా విత్తుకోవాలి. అంతర పంటలు.. కంది: కందిలో అంతరపంటగా జొన్న, వేరుశనగ, రాగి, కొర్ర, పెసర, మినుము, ఉలవ, బొబ్బర్లు, నేలచిక్కుడు వేసుకోవచ్చు. జొన్న: వేరుశనగ, రాగి, కొర్ర, పెసర, మినుము, ఉలవ, బొబ్బర్లు, నేల చిక్కుడు మొదలైనవి. కొర్ర: వేరుశనగ, సోయాచిక్కుళ్లు, బొబ్బర్లు, పెసర, మినుము. బెండ: నూల్‌కోల్, క్యారెట్, టమోటా, క్యాబేజీ, కాలీఫ్లవర్, కొత్తిమీర, గోంగూర, తోటకూర, పాలకూర, ఉల్లి. వంగ: ఆకుకూరలు, నూల్‌కోల్, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఉల్లి, వెల్లుల్లి. మిరప: ఆకుకూరలు, ఉల్లి, వెల్లుల్లి. నువ్వు: పెసర/మినుము/ఉలవ మొదలైన వాటిని విత్తుకోవచ్చు. అంతర పంటల్లో నేల వివిధ పంటలతో కప్పబడి ఉంటుంది. అంతర పంటల వల్ల ‘సజీవ ఆచ్ఛాదన’ ఏర్పడి నేలలో తేమ ఆరిపోకుండా ఉంటుంది. భూమి సారవంతమవుతుంది. ప్రకృతి వైపరీత్యాలకు ఒక పంట పోయినా 2వ పంట చేతికి వస్తుంది. రసాయనాల అవశేషాలు లేని ఆహారం లభిస్తుంది. (‘జట్టు’ సౌజన్యంతో.. వచ్చే వారం మరికొన్ని విషయాలు) - ‘సాగుబడి’ డెస్క్ అన్ని ప్రాంతాలకూ అనుకూలమైనదేనా? అధిక (1000-1200 మి.మీ.) వర్షపాతం నమోదయ్యే ఉత్తరాంధ్రలో ‘అన్నపూర్ణ’ ప్రకృతి వ్యవసాయ పంటల నమూనాను మీరు అమలు చేస్తున్నారు. ఇంతకన్నా తక్కువ వర్షంపడే ఇతర ప్రాంతాలకు కూడా ఇది అనుకూలంగా ఉంటుందా?‘అన్నపూర్ణ’ పంటల నమూనా వర్షపాతం ఎక్కువ నమోదయ్యే ప్రాంతాలకన్నా తక్కువ వర్షం కురిసే ప్రాంతాలకే ఎక్కువ ఉపయోగకరం. అర ఎకరంలో ఏర్పాటు చేసిన కందకాలు, కాలువలు అత్యధిక వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేస్తాయి. వర్షపు నీరు వృథా కాదు. మట్టిపరుపుల చుట్టూ తవ్వే కందకం చుట్టుకొలత సుమారుగా 200 మీటర్లు (0.45 మీ. వెడల్పు, 0.30 మీ. లోతు). మట్టి పరుపుల మధ్య కాలువల పొడవు 616 మీటర్లు (0.60 మీ. వెడల్పు, 0.30 మీ. లోతు). కందకాలు (27.135 క్యూబిక్ మీటర్లు), కాలువల (110.88 క్యూబిక్ మీటర్లు) ద్వారా.. మొత్తం 138 క్యూబిక్ మీటర్ల గుంతల ద్వారా నీటిని భూమిలోకి ఇంకింపజేస్తున్నామన్న మాట. ఈ విధంగా భూగర్భ జలాలు పెంచుకొని మెరుగైన ఉత్పాదకత సాధించవచ్చు. వత్తుగా పంటలు వేయడం (సజీవ ఆచ్ఛాదన) వల్ల మట్టిలో తేమ త్వరగా ఆరిపోకుండా చూస్తున్నాం. కాబట్టి, వర్షపాతం తక్కువ ఉండే ప్రాంతాల్లోనూ ఈ నమూనాలో పంటలు సాగు చేయవచ్చు. - డి. పారినాయుడు (94401 64289), ‘జట్టు’ వ్యవస్థాపకులు, ‘అన్నపూర్ణ’ నమూనా రూపశిల్పి శిక్షణ పొందగోరే రైతు సోదరులు, సంస్థలు సంప్రదించాల్సిన చిరునామా: జట్టు ఆశ్రమం, తోటపల్లి పోస్టు, రావి వలస(ఎస్.ఓ.), పార్వతీపురం వయా, విజయనగరం జిల్లా- 535525. ఫోన్: 08963 227228 (ఉ. 9 గం. నుంచి రాత్రి 8 గం. వరకు). ఎం. నూకంనాయుడు(ప్రాజెక్టు మేనేజర్)- 94400 94384 email;jattutrust1@gmail.com