
అంతరించి పోతున్న అటవీ పండ్ల మొక్కలకు ప్రాణం.. ములుగు అటవీ కళాశాలలో 2 ఎకరాల్లో వైల్డ్ ఫ్రూట్ గార్డెన్
వివిధ ప్రాంతాల్లో 70 రకాల అటవీ మొక్కల సేకరణ.. అడవుల్లో కోతులకు ఆహారాన్ని సమృద్ధిగా చేయటమే లక్ష్యం
సాక్షి, సిద్దిపేట: అమ్మలాంటి అడవి మనిషి అత్యాశకు అంతరించిపోయే దుస్థితికి చేరుకుంది. దీంతో అడవినే ఆవాసంగా చేసుకొని బ్రతికే జంతువులు జనావాసాల్లోకి చొచ్చుకొస్తున్నాయి. ముఖ్యంగా వానరాలు అడవుల్లో ఆహారం దొరక్క గ్రామాలపై దండెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ వినూత్న ప్రయత్నం చేస్తోంది.
అంతరించిపోతున్న అటవీ పండ్ల మొక్కలకు ప్రాణం పోసి కళాశాల ప్రాంగణంలో 2 ఎకరాల విస్తీర్ణంలో వైల్డ్ ఫ్రూట్ గార్డెన్‌ను పెంచుతున్నారు. 70 రకాల అరుదైన పండ్ల మొక్కలతో ఈ గార్డెన్ అలరారుతోంది. మామిడి, జామ, ద్రాక్ష, సంత్ర, దానిమ్మ లాంటి అందరికీ తెలిసిన చెట్లతోపాటు దట్టమైన అడవుల్లో పెరిగే ఫాల్–సా, లక్ష్మణ ఫలం, నారపండు, బొట్కు, కలిమి పండు, చిన్న కలింగ, నల్ల జీడి, నార మామిడి, బుడ్డ ధరణి, గార్సినియా, తెల్ల నేరడు వంటి చెట్లను కూడా ఈ గార్డెన్‌లో పెంచుతున్నారు.
ఒక్కో పండ్ల రకం 5 మొక్కల చొప్పున మొత్తం 350 మొక్కలు ఈ గార్డెన్‌లో ఉన్నాయి. ప్రతి మొక్క వద్ద దాని పేరు, శాస్త్రీయ నామం, నాటినవారి పేరుతో నేమ్ బోర్డులను ఏర్పాటు చేశారు.
ఫాల్–సా
ఈ చెట్లు ఎక్కువగా శ్రీలంకలోనూ, మన అమ్రాబాద్ అడవుల్లోనూ పెరుగుతాయి. ఇవి అచ్చం పరికి పండ్ల మాదిరిగా ఉంటాయి. ఈ చెట్టు సుమారు 6 ఫీట్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ పండ్లను ఆయుర్వేద మందులలో సైతం వినియోగిస్తారు.
బొట్కు..
ఈ పండును కోతులు ఇష్టంగా తింటాయి. మధ్యప్రదేశ్ అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. ఇది ఇప్పకాయ మాదిరిగా ఉంటుంది. నొప్పులకు, వాపులకు ఈ చెట్టు ఆకుల రసాన్ని వినియోగిస్తారు.
కలిమి పండు..
ఇది చెర్రీ పండు మాదిరిగా ఉంటుంది. వికారాబాద్ అడవుల్లో అధికంగా పెరుగుతుంది. దీనిని వికారాబాద్ నుంచి తీసుకువచ్చారు. ఈ పండును ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తారు. కోతులు, పక్షులు ఇష్టంగా తింటాయి.
గార్సినియా
కర్ణాటక, మహారాష్ట్ర అడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఆ ప్రాంతాల్లో చింతపండుగా వినియోగిస్తారు. ఈ మొక్కలను కర్ణాటక అడవుల్లో నుంచి తీసుకువచ్చారు. వీటిని కోతులు, పక్షులు, మనుషులు ఇష్టంగా తింటారు.
వివిధ అడవుల్లో సేకరించాం
అడవుల్లో పలు రకాల అటవీ పండ్ల చెట్లు అంతరించి పోవడంతో కోతులకు తిండి లభించడం లేదు. దీంతో అవి జనావాసాల్లోకి వస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ అడవుల్లో వివిధ పండ్ల గింజలను సేకరించి వాటి ద్వారా మొక్కలను పెంచుతున్నాం. ఇప్పటివరకు 70 రకాల అడవి పండ్ల మొక్కలను నాటాం.
ఇంకా 30 రకాల మొక్కలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇలా ఉత్పత్తి అయిన తర్వాత అడవుల్లో మొక్కలను నాటుతాం. దీంతో కోతులు మళ్లీ అడవుల బాట పట్టే అవకాశం ఉంది. అలాగే కొత్త తరానికి సైతం ఆ పండ్లు తెలుస్తాయి. – డాక్టర్ హరీశ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అటవీ కళాశాల, పరిశోధన సంస్థ, ములుగు
Comments
Please login to add a commentAdd a comment