Fruit garden
-
Wonder of Science: బాప్రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!!
రేగి పండ్లు, నేరేడు పండ్లు తినాలంటే ఆయా సీజన్లకోసం ఎదురు చూడకతప్పదు. సీజన్ వెళ్లిపోయాక మళ్లీ కావాలంటే ఎక్కడా దొరకవు. ఏ ఋతువులో పండేవి ఆ ఋతువులోనే దొరుకుతాయి. ఒకే చెట్టుకి 40 రకాల పండ్లు అన్ని కాలాల్లో కాస్తే! ఊహ బాగానే ఉంది కానీ.. ఒకే చెట్టుకి రకరకాల పండ్లు ఎలా సాధ్యం అని అలోచిస్తున్నారా? ఇది కల కాదు.. అబద్ధం అంతకన్నాకాదు. నిజంగానే ఓ వ్యక్తి ఒకే చెట్లుకి 40 రకాల పండ్లు కాయించాడు. పెన్సిల్వేనియాలోని రీడింగ్ సిటీకి చెందిన సామ్ వాన్ అకెన్ అనే వ్యక్తి ఈ రకమైన చెట్లను పెంచుతున్నాడు. జన్యుపరంగా ఒకేరకమైన మొక్కలను అంటుకట్టడం ద్వారా ఇది సాధ్యపడిందట. విత్తనాలు ఉండే పండ్ల మొక్కలను జన్యుపరంగా అంటుకట్టడం ద్వారా ఈ చెట్టును సృష్టించాడు. ఇది ఒక రకమైన సైన్స్ ఎక్పరిమెంట్ అని చెప్పవచ్చు. ఈ చెట్టు కూడా మామూలు చెట్లలాగానే పెరుగుతుంది. ఐతే వసంత (స్ప్రింగ్), వేసని (సమ్మర్) ఋతువుల్లో మాత్రం ఈ చెట్టు అందాలు చూడటానికి రెండు కళ్లు సరిపోవట. పింక్ కలర్లో చూపరులను ఆకట్టుకుంటుంది. తర్వాత నెలల్లోనే ఈ చెట్టు రేగు, పీచెస్, ఆప్రికాట్ పండ్లు, నేరేడు పండు, బాదం.. ఇలా 40 రకాల పండ్లు కేవలం మూడేళ్లకే కాయడం మొదలు పెడుతుందట. ఈ ప్రక్రియ మొత్తాన్ని శామ్ వాన్ అకెన్ మాత్రం దీనిని ఆర్ట్ వర్క్‌లా భావిస్తానని చెబుతున్నాడు. 40 రకాల పండ్ల చెట్టును సృష్టించడానికి వివిధ రకాల విత్తన పండ్ల మొక్కలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. పారిశ్రామికీకరణ, ఏకీకృత సంస్కృతి వల్ల ఆహార ఉత్పత్తిలో వైవిధ్యాన్ని గుర్తించాను. వాణిజ్యపరంగా తక్కువ లాభదాయకమైన అనేక పండ్ల జాతులు కనుమరుగవుతున్నాయనే విషయం కనుగొన్నాను. రైతులు, పండ్ల తోటలు పెంచే వారినుంచి సేకరించిన మొక్కల ఆధారంగా 40 పండ్ల చెట్లను సృష్టించానని అకెన్ చెప్పుకొచ్చాడు. ఇది నమ్మశక్యం కానప్పటికీ.. అతను ఈ విధమైన మొక్కలు అనేకం సృష్టించాడు. అమెరికాలోని అర్కన్సాస్, కెంటుకీ, మైనే, మసాచుసెట్స్, న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియాలో వాన్ అకెన్ చెట్లను చూడవచ్చు. అంతేకాకుండా వివిధ రకాల పండ్ల చెట్లను పెంచడం, సాగు చేయడం, శుభ్రపరచడం.. చాలా సమయం, స్థలం వృధా అవుతుంది. కోరిన పండ్లన్నీ ఒకే చెట్టుకి కాస్తే.. అనే అతని వినూత్న ఆలోచన నుంచే ఈ చెట్టు ఉద్భవించింది. చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !! -
బోరు తవ్వడానికి ముందే కందకాలు!
పండ్ల తోట వేయాలనుకున్న భూమిలో బోరు వేయడానికి ముందే కందకాలు తవ్వించుకొని.. వాన నీటి సంరక్షణ ద్వారా భూగర్భ జలాన్ని పెంపొందించుకున్న ఓ రైతు గాథ ఇది. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన మేరెడ్డి ప్రవీణ్‌కుమార్ రెడ్డి తన 5 ఎకరాల ఎర్ర భూమిలో పండ్ల తోట నాటాలనుకున్నారు. అయితే, వర్షపాతం తక్కువగా ఉండే ఆ ప్రాంతంలో బోర్లు వేసినా పెద్దగా నీరు రావటం లేదు. తన పొరుగు పొలంలో ఒక రైతు 2, 3 బోర్లు వేసినా వ్యవసాయానికి సరిపోయేంత నీరు రావడం లేదు. ఇది గమనించిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తొలుత తన భూమిలో కందకాలు తవ్వించుకోవడం విశేషం. తన సోదరుడు, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074), అధ్యక్షులు సంగెం చంద్రమౌళి(98495 66009)లను రెండేళ్ల క్రితం వెంటబెట్టుకెళ్లి వాలుకు అడ్డంగా, ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో, మీటరు లోతు మీటరు వెడల్పున కందకాలు తీయించారు. కందకం 25 మీటర్ల పొడవున తవ్విన తర్వాత 5 మీటర్ల ఖాళీ వదిలి ఆ తర్వాత.. అదే వరుసలో మరో కందకం తవ్వించారు. తర్వాత ఏడాది వర్షాలు పడినప్పుడు భూమిలో కురిసిన ప్రతి నీటి బొట్టూ కందకాల ద్వారా భూమిలోకి ఇంకి భూగర్భ నీటి మట్టం పెరిగింది. గత ఏడాది బోరు వేయడంతో రెండించుల నీరు పడింది. తదనంతరం 5 ఎకరాలకు ఫెన్సింగ్ వేయించారు. ప్రస్తుతం పండ్ల తోట నాటడానికి సిద్ధమవుతున్నారు. పండ్ల మొక్కల మధ్యలో అంతరపంటగా చిరుధాన్యాలను సాగు చేయాలని భావిస్తున్నానని ప్రవీణ్‌కుమార్ రెడ్డి(99636 41978) తెలిపారు. కందకాల వల్లనే తన భూమిలోని బోరులో నీరు పుష్కలంగా వస్తున్న విషయం తెలిసి కూడా ఇతర రైతుల్లో ఆలోచన రావటం లేదని, కందకాలు తవ్వితే భూమి వృథా అవుతుందని ఆలోచిస్తున్నారని అన్నారు. కందకాల ద్వారా వాన నీటి సంరక్షణ ప్రయోజనాలను రైతులకు వివరించి వారిలో చైతన్యం తెచ్చేందుకు తమ గ్రామంలో సదస్సు నిర్వహించాలని కూడా ఆయన భావిస్తుండటం ప్రశంసనీయం. -
ప్రకృతి సేద్యపు చుక్కాని!
- చౌడు భూమిలోనూ చక్కని దిగుబడులు - పాలేకర్ శిక్షణతో సాగు పద్ధతి మార్చుకున్న విశ్రాంత వ్యవసాయ సంయుక్త సంచాలకుడు స్తంభాద్రిరెడ్డి పొలంలో నేల, నీరు చౌడు మయం అయినప్పుడు ఎవుసం (వ్యవసాయం) సాగేదెలా?.. భూమిని నమ్ముకున్న రైతు బతుకు బండి సజావుగా సాగేదెలా?? ఒక సాధారణ చిన్న రైతుకు ఈ సమస్యను సమూలంగా పెకలించే సరైన దారి దొరకడం కష్టమే. కానీ.. వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీ చదువుకొని, వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేసి, సంయుక్త సంచాలకుడిగా రిటైరైన సూదిని స్తంభాద్రి రెడ్డికి కూడా చౌడు చాలాకాలం జటిల సమస్యగానే మిగిలిపోయింది. అయితే, ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ సమస్యకు సమాధానం దొరికిందని తన పొలంలో కళకళలాడుతున్న పంటలను చూపుతూ సంతోషంగా చెబుతున్నారు స్తంభాద్రి రెడ్డి. పాలేకర్ శిక్షణ పొందిన తర్వాత ఘన జీవామృతం, జీవామతృం వాడుతూ చౌడు సమస్యను అధిగమించి సంతృప్తికరంగా దిగుబడి తీస్తున్నారు. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్రమంతా తిరిగి రైతులకు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు. దిక్కుతోచని బడుగు రైతులకు ప్రకృతి వ్యవసాయం ద్వారా వెలుగుబాట చూపుతున్నారు. సూదిని స్తంభాద్రి రెడ్డి స్వస్థలం మాడుగుల. మొన్నటి వరకు మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ప్రస్తుతం శంషాబాద్ జిల్లాలోకి వచ్చింది. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయనకు 12 ఎకరాల భూమి ఉంది. అది ఎర్ర దుబ్బ నేల. చెరువు కింద ఉండడంతో భూగర్భ జలానికి ఎప్పుడూ కరువు రాలేదు. ఒకే బోరుతో 12 ఎకరాలు సాగవుతోంది. అయినా, భూమిలోను, అందులోని నీటి లోనూ చౌడు ఉండడంతో పంటలు అంతంత మాత్రంగానే పండుతుండేవి. వ్యవసాయశాస్త్రంలో పట్టభద్రుడైన స్తంభాద్రిరెడ్డి వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేసి సంయుక్త సంచాలకుడిగా రిటైరయ్యారు. విశ్రాంత జీవితం ప్రారంభించిన తర్వాత మనసు వ్యవసాయంపైకి మళ్లింది. చౌడు భూమి కావడంతో తనకు తెలిసిన రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. ఆ పూర్వరంగంలో (2008) సుభాష్ పాలేకర్ తిరుపతిలో నిర్వహించిన శిక్షణకు హాజరై ప్రకృతి వ్యవసాయం మూలసూత్రాలను తెలుసుకొని, తమ పొలాన్ని ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చారు. పండ్ల తోటలో అంతర పంటలు అది ప్రధానంగా మిశ్రమ పండ్ల తోట. మామిడి, జామ, నేరేడు, యాపిల్ బెర్.. ఉన్నాయి. కంది (పీఆర్‌జి 736), ఉలవ, పెసర, మునగ వంటి అంతరపంటలుగా సాగు చేస్తున్నారు. ఈ ద్విదళ జాతి అంతర పంటలు ఫలసాయాన్నివ్వడంతోపాటు గాలిలోని నత్రజనిని గ్రహించి భూమిని సారవంతం చేస్తాయి. మూడెకరాల్లో పదేళ్ల నాడు నాటిన 140 మామిడి చెట్లున్నాయి. వాటి మధ్యలో భూమిని కప్పి ఉండేందుకు జీలుగ, ఉలవ వేశారు. నేరేడు చెట్లు 30 వరకు ఉన్నాయి. నాటు రకం ఇచ్చినంత కచ్చితమైన దిగుబడి గ్రాఫ్టెడ్ చెట్లు ఇవ్వడం లేదన్నది స్తంభాద్రి రెడ్డి అనుభవం. నాలుగైదు కుంటల్లో వరి సాగులో ఉంది. జనుము/జీలుగ వేసి 40 రోజులకు భూమిలో కలియదున్నడం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, పుల్లమజ్జిగ, చీడపీడలకు కషాయాలతోనే సేద్యం జరుగుతోంది. ద్రవ జీవామృతంతోనే.. వంద రోజుల తెలంగాణ సన్నాల (ఆర్ఎన్ఆర్15048) వరి పంట కోటాకు (ఫ్లాగ్ లీఫ్) దశలో ఉంది. పోషక లోపాలు లేకుండా కళకళలాడుతున్నది. ఐదేళ్లుగా వరిని ఏటా రెండు పంటలు పండిస్తున్నానని, ఈ ఏడాది వరి నాట్లకు ముందు ఘనజీవామృతం కూడా వేయలేదని స్తంభాద్రి రెడ్డి తెలిపారు. ద్రవ జీవామృతాన్ని రెండు సార్లు నీటితోపాటు పారించడం, మూడు సార్లు పిచికారీ చేయడం తప్ప వరి పంటకు చేసిందేమీ లేదన్నారు. ఈ ఏడాది పరిస్థితులు అనుకూలించక పచ్చిరొట్ట పైరు కూడా అంతగా పెరగలేదన్నారు. చౌడు వల్ల భూమిలో తొలుత కొన్ని పంటలు సరిగ్గా రాలేదని, ఆవు పేడ - మూత్రంతో తయారు చేసిన జీవామృతం వేస్తుండడం వల్ల భూమి స్వభావంలో సానుకూల మార్పు వచ్చిందన్నారు. ఈ ఏడాది ఎకరానికి 25 బస్తాల ధాన్యం దిగుబడి వస్తుందని ఆయన భావిస్తున్నారు. మామిడి చెట్టుకు నెలకు 5 లీటర్ల ద్రవ జీవామృతం పోస్తున్నామని, ప్రస్తుతం చిగుర్లు వస్తున్నందున 15 రోజులకోసారి జీవామృతం పిచికారీ చేయాలనుకుంటున్నాను. ఎండుపుల్ల, ఇతర చీడపీడల సమస్యలు లేవు. లీఫ్ వెబ్బర్ కనిపించినప్పుడు.. కత్తితో ఆ గూడును లాగేసి చిందర వందర చేస్తున్నాం. మందులేవీ వాడటం లేదని స్తంభాద్రి వివరించారు. కాలం చాలా మారింది.. అందుకు అనుగుణంగా సుస్థిర వ్యవసాయం దిశగా మన వ్యవసాయం కూడా మారాలి. అప్పుడే మానవాళికి ఆహార భద్రత చేకూరుతుందని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) వంటి అంతర్జాతీయ సంస్థలు, సేంద్రియ వ్యవసాయ శాస్త్రవేత్తలు చెవిన ఇల్లు కట్టుకొని చెబుతూనే ఉన్నాయి. అయితే, వ్యవసాయంలో ఏయే మార్పులు వస్తే బడుగు రైతుకు కచ్చితమైన నికరాదాయాన్ని, ఆహార భద్రతను అందించడంతోపాటు.. భూమికి, పర్యావరణానికి మేలు జరిగేదీ స్తంభాద్రి రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుందని డా. పులికంటి వెంకటేశ్వరరావు అన్నారు. డా. రావు ఇటీవల స్తంభాద్రి రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఆచార్య ఎన్జీరంగా వర్సీటీలో ‘డీన్ ఆఫ్ అగ్రికల్చర్’గా రిటైరైన ఆయన.. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని అకాడమీ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (ఏకలవ్య ఫౌండేషన్)కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు : రమేశ్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ భూముల పునరుద్ధరణకు ప్రకృతి సేద్యం ఉత్తమ మార్గం! 40 ఏళ్లుగా రసాయనిక వ్యవసాయంతో భూమిని క్రమంగా నిస్సారంగా మార్చాం. భూముల నాశనం ఎంత తీవ్ర స్థాయికి చేరిందంటే ఎరువు వేసినా మొక్క తీసుకోలేనంత దశకు వెళ్లింది. వేసిన రసాయనిక ఎరువు 90% వృథా అవుతున్నది. రైతుకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయే తప్ప ఫలితం ఉండటం లేదు. ఇటువంటి సంక్షోభ దశలో భూముల పునరుద్ధరణకు, మంచి దిగుబడి పొందడానికి ప్రకృతి వ్యవసాయం చక్కని పరిష్కారం. స్తంభాద్రి రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రమే ఇందుకు నిదర్శనం. జీవామృతం తప్ప ఏమీ వాడకపోయినా వరి, మామిడి తదితర పంటల్లో పోషక లోపాలు, చీడపీడలు లేవు. పంటలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. చౌడు సమస్య తీరింది. జీవామృతం వల్ల మొక్కల వేళ్లు పోషకాలను సజావుగా తీసుకోగలిగే పరిస్థితి ఏర్పడింది. నత్రజని పుష్కలంగా అందడంతో కీలకమైన కోటాకు దశలో వరి పంట పచ్చగా, ముచ్చటగా ఉంది. జింక్, మెగ్నీషియం లోపాలు, ఎండుపుల్ల సమస్యల్లేకుండా మామిడి చెట్లు పచ్చగా ఉన్నాయి. జీవామృతం, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు కలిపి వాడితే ఏ భూముల్లోనైనా, ఏ పంటలోనైనా ప్రకృతి వ్యవసాయం కచ్చితమైన సత్ఫలితాలనిస్తుంది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే రైతుకు, సమాజానికి మేలు జరుగుతుంది. - డా. పులికంటి వెంకటేశ్వరరావు, మొక్కల శరీర ధర్మ శాస్త్ర నిపుణులు, రిటైర్డ్ ‘డీన్ ఆఫ్ అగ్రికల్చర్’, ఆచార్య ఎన్జీరంగా వర్సీటీ, హైదరాబాద్ మొబైల్: 94901 92672 pvraophy@gmail.com ప్రకృతి వ్యవసాయంతో రైతుకు కచ్చితమైన నికరాదాయం ఖాయం! చౌడు సమస్యను అధిగమించడానికి ప్రకృతి వ్యవసాయం దోహదపడింది. ఆవు పేడ, మూత్రం జీవామృతంలో వాడటం వల్ల భూమి స్వభావం పంటలకు అనుకూలంగా మారింది, భూసారం పెరిగింది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, శిలీంధ్ర నాశనులు కొనే ఖర్చు తప్పింది. పరిస్థితులు ఎలా ఉన్నా కచ్చితమైన నికరాదాయం ప్రకృతి సేద్యం వల్లనే సాధ్యమవుతుందన్నది స్వానుభవం నేర్పిన పాఠం. గత ఏడాది 3 ఎకరాల మామిడి తోట నుంచి రూ. 1.45 లక్షల ఆదాయం వచ్చింది. ప్రకృతి వ్యవసాయం వల్ల భూమికి, రైతుకే కాదు.. పర్యావరణ సమతుల్యత నెలకొని ఎనలేని మేలు జరగుతుంది. అందుకే ఈ వ్యవసాయాన్ని శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసి మరీ రైతులకు నేర్పిస్తున్నాం. - సూదిని స్తంభాద్రి రెడ్డి (94402 82102), మాడుగుల, శంషాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం 25 నుంచి 3 రోజులు పాలేకర్‌తో క్షేత్ర సందర్శన మహారాష్ట్రలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో చక్కటి దిగుబడులిస్తున్న నారింజ, బత్తాయి, అరటి, మిరప, పత్తి, చెరకు, పసుపు, కంది, కూరగాయల తోటలను సుభాష్ పాలేకర్‌తో కలసి సందర్శించాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. ఈ నెల 25, 26, 27 తేదీల్లో నాగపూర్, అమరావతి జిల్లాల్లోని 5 తాలూకాల్లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల సందర్శన కార్యక్రమం ఖరారైంది. 3 రోజులకు భోజన వసతులకు ఒక్కొక్కరు రూ. 300 చెల్లిస్తే చాలు. వివరాలకు (హిందీ).. రాహుల్ చౌదరి - 097654 02121, మనోజ్ జాంజల్ - 098225 15913, నీలేశ్ చిక్లే - 075070 98811లను సంప్రదించవచ్చు. ప్రకృతి వ్యవసాయంపై బెంగళూరులో 3 నెలల శిక్షణ శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ ట్రస్టు ప్రకృతి వ్యవసాయంపై యువతకు 3 నెలల పాటు ఆశ్రమ శిక్షణ ఇవ్వనుంది. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో ఉండి రోజుకు 5 గంటల పాటు శిక్షణ పొందాల్సి ఉంటుంది. కనీసం పదో తరగతి పాసైన 18-35 ఏళ్ల మధ్య వయస్కులైన యువతీయువకులు శిక్షణకు అర్హులు. శిక్షణ పొందే వారు రుసుము, భోజన వసతి సదుపాయాలకు గాను 3 నెలలకు కలిపి మొత్తం రూ. 6 వేలు చెల్లించాల్సి ఉంటుంది. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్ ఇస్తారు. కొందరికి దేశంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో సూపర్వైజర్లుగా నియమించే అవకాశం ఉంది. ఇతర వివరాలకు.. శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ ట్రస్టు (బెంగళూరు) బాధ్యులను సంప్రదించవచ్చు. ఫోన్ : 080- 28432965 training.ssiast@gmail.com; website: www.ssiast.com సేంద్రియ సేద్యంపై మార్కాపురంలో నేడు శిక్షణ - ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో - నాగపూర్ శాస్త్రవేత్తలతో ప్రత్యేక శిక్షణ - 18న మార్కాపురంలో, 19న దద్దవాడలో - సేంద్రియ సేద్యంపై అవగాహన కార్యక్రమాలు సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహించే ఉదాత్త లక్ష్యంతో ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురంలోని జార్జి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఈ నెల 18 (మంగళవారం)న రైతులకు శిక్షణా శిబిరం జరగనుంది. సన్సద్ ఆదర్శ్ గ్రామీణ యోజన అమలులో భాగంగా కొమరోలు మండలం దద్దవాడ పంచాయతీని ఎంపీ సుబ్బారెడ్డి దత్తత తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గించి సేంద్రియ సేద్యం వైపు రైతులను మళ్లించేందుకు 1,500 మంది రైతులకు మార్కాపురంలో 18న శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు శిక్షణ ఉంటుంది. 19వ తేదీన కొమరోలు మండలం దద్దవాడలోని సేంద్రియ వ్యవసాయ ప్రదర్శన క్షేత్రంలో అవగాహన కార్యక్రమం జరుగుతుంది. ట్రైకోడెర్మా విరిడి, ఇతర సేంద్రియ ఉత్పత్తులతో సులభంగా సేంద్రియ ఎరువుల తయారీ, వాడకంపై రైతులకు ప్రత్యక్ష శిక్షణ ఇస్తారు. కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోని నాగపూర్ (మహారాష్ట్ర)కు చెందిన సేంద్రియ వ్యవసాయ ప్రాంతీయ కేంద్రం సంచాలకులు డా. ఎ.ఎస్. రాజ్‌పుత్, శాస్త్రవేత్తలు డా. వి. ప్రవీణ్‌కుమార్, డి.కె. శర్మ ఈ రెండు రోజుల్లో రైతులకు శిక్షణ ఇస్తారు. దర్శి కేవీకే సీనియర్ శాస్త్రవేత్త డా. వరప్రసాద్, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డా. శారద, ఐటీసీకి చెందిన నిపుణులు సురేశ్, సునీల్ తదితరులు పాల్గొంటారు. మరిన్ని వివరాలకు జార్జి ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రిన్సిపాల్ ప్రొ. సి.హెచ్. రాజబాబు (94401 81910)ను సంప్రదించవచ్చు. -
మేడపైన 17 జాతుల పండ్ల తోట!
ఏడాది పొడవునా లేదా కొద్ది నెలల పాటు ఇంటిపట్టున సేంద్రియ కూరగాయలు, ఆకు కూరలు పండించుకుంటున్న వారి సంఖ్య నగరాలు, పట్టణాలతోపాటు గ్రామా ల్లోనూ పెరుగుతూ ఉంది. అయితే, మేడపైన కుండీలు, ప్లాస్టిక్ కంటెయినర్లలో పండ్ల చెట్లను తెంపు లేకుండా ఏళ్ల తరబడి సాగు చేయడం.. నలుగురు కుటుంబానికి సరిపడా రకరకాల పండ్లు పండించుకోవడం మాత్రం నిస్సందేహంగా కత్తి మీద సామే! మేడపైన పండ్ల తోటను మండే ఎండల్లోనూ కంటికి రెప్పలా కాపాడుకోవడమూ అంత సులభమేమీ కాదు. ఈ అసాధ్యాన్ని హైదరాబాద్‌లోని మెహదీపట్నానికి చెందిన వనమామళి నళిని మొక్కలపై తనకున్న ప్రేమతో, ప్రకృతి సేద్య పద్ధతులతో సుసాధ్యం చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా ఇంటిపైనే ఆమె 17 జాతుల పండ్ల మొక్కలను 30కు పైగా కుండీల్లో పెంచుతున్నారు. మూడేళ్లు దాటిన మొక్కలన్నీ ప్రతి కాపులోనూ 20 నుంచి 30 వరకూ పండ్లనిస్తున్నాయి. ప్రతి జాతిలోనూ రెండు, మూడు వేర్వేరు రకాల(ఉదా: జామలో 3 రకాలు, మామిడిలో ఏటా రెండు సార్లు కాపునిచ్చే పునాస మామిడి, మూడు సార్లు కాపునిచ్చే థాయ్ మ్యాంగో..) పండ్ల మొక్కలను ప్రణాళి కాబద్ధంగా ఎంపికచేసుకొని పెంచుతున్నారు. ఒక మొక్క కాపు పూర్తయ్యే సరికి మరో మొక్క కాయలు పక్వానికి వస్తున్నాయని, ఏడాది పొడవునా ఈ పండ్లే తింటున్నామని నళిని (nalini.vmw@gmail.com) తెలిపారు. ఇంటిపంటల్లోనూ పండ్ల మొక్కలు నాటుకోవడానికి ఇది మంచి తరుణం. - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్ -
గడ్డుకాలమే..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో పండ్ల తోటల సాగుకు కష్టకాలం వచ్చింది. సీజన్లో మొహం చూడని వానల కారణంగా పండ్ల తోటలు భవిష్యత్‌లో పుట్టెడు కష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. దేశంలోనే బత్తాయి సాగులో ప్రథమస్థానంలో ఉన్న జిల్లాలో ఈసారి దిగుబడి తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పండ్ల తోటలకు అవసరమైన తేమశాతం వాతావరణంలో తగ్గడంతో కాత దశలో పెద్దఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఇటీవల నివేదిక కూడా పంపారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో 25 శాతం భూముల్లో పండ్లతోటలు సాగు చేస్తున్న రైతాంగంలో ఆందోళన నెలకొంది. వానలు లేవు.. నీళ్లు లేవు జిల్లాలో దాదాపు 3లక్షలకు పైగా ఎకరాల్లో మామిడి, బత్తాయి, నిమ్మ తోటలు సాగు చేస్తున్నారు. ఈ పంటల ద్వారా జిల్లాలో యేటా 25.6లక్షల మెట్రిక్ టన్నుల పండ్లు ఉత్పత్తి అవుతాయన్నది ఉద్యానవన శాఖ అధికారుల లెక్క. అయితే వర్షాధారంతో పాటు భూగర్భ జలాలు, ముఖ్యంగా వాతావరణంలో తేమ శాతంపై ఆధారపడి పండించే పండ్లతోటలకు ఈసారి ఆ మూడూ లేకుండా పోయాయి. వర్షాలు లేక, భూగర్భ జలాలు తగ్గిపోవడంతో భూమిలో ఉన్న తేమ శాతం కూడా ఆవిరి అయిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే చాలా చోట్లా పండ్ల తోటల కొమ్ములు ఎండిపోవడం కూడా ప్రారంభమైంది. కనీసం వర్షాలు రెండు, మూడు రోజులకు కూడా పడని సందర్భాలు పదుల సంఖ్యలో ఉండడంతో ఈ సీజన్లో పండ్ల తోటల దాహం తీరే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అసలు పండ్లు కాసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. జిల్లాలో సాగులో ఉన్న పండ్ల తోటల్లో 30 నుంచి 70 శాతం తోటల్లో అసలు పండ్లు కాసే పరిస్థితి లేకుండా పోయింది. అప్పుడప్పుడూ వర్షాలు కురువకుండా ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో దాదాపు 50 శాతం పండ్లు రాలే అవకాశాలు కూడా లేకపోలేదు. తడి లేకపోతే ‘ఇత్తడే’ ముఖ్యంగా జిల్లాలో ప్రధాన పంటలయిన బత్తాయి, నిమ్మ పంటలకు భవిష్యత్ గడ్డు కాలమేనని ఉద్యానవనశాఖ అధికారులే చెబుతున్నారు. ఈ రెండు పంట మొక్కల మధ్యన ఉండే తేమ ఒత్తిడి కారణంగా వేరుకుళ్లు తెగులు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రెండు పంటల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని అధికారుల నివేదికలు చెబుతున్నాయి. వర్షాలు ఇప్పుడు కూడా రాకపోతే ఈ రెండు పంటలు కాసే మార్చి 2015, ఆగస్టు 2015ల్లో భారీ నష్టం జరగనుందని అంచనా. ఈ పరిస్థితుల్లో నీటి ని గ్రహించే తత్వం తక్కువగా ఉన్న జిల్లా భూముల్లో మరో 30 నుంచి 45 రోజుల పాటు వానలు రాకపోతే పెద్ద ఎత్తున పండ్ల రైతులు నష్టపోనున్నారు. ఈ పరిస్థితుల్లో పామ్‌పాండ్స్ కోసం ఇచ్చే సబ్సిడీని విస్తృత పర్చాలని, పండ్ల రైతుందరికీ దీనిని వర్తింపజేయాలని, అదే విధంగా భూమిలోని తేమను ఆవిరి చేయకుండా నివారించే మల్చింగ్ సామగ్రి (పాలిథీన్ మెటీరియల్)ని అందరికీ అందజేయాలని రైతులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణం ‘తెలంగాణ జిల్లాల్లో 35శాతం పండ్ల తోటలు మన జిల్లాలోనే ఉన్నాయి. కరువు కాటకాలను ఎదుర్కొంటున్న జిల్లా రైతాంగం తక్కువ నీటితో సాగయ్యే పండ్లతోటలను రైతులు ఎంచుకున్నారు. తోటలకు మార్కెటింగ్, కోల్డ్‌స్టోరేజీ, జ్యూస్ఫ్యాక్టరీలు లాంటి సౌకర్యాలు కల్పించలేదు. భూగర్భ జలాలను కాపాడే జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో జిల్లాలో గతంలో 4లక్షల ఎకరాల్లో సాగయిన బత్తాయి ఇప్పుడు 2లక్షల ఎకరాలకు వచ్చింది. వాస్తవంగా 500 హెక్టార్లకు ఒక ఉద్యాన అధికారి ఉండాల్సి ఉండగా, జిల్లా మొత్తంలో కూడా ఐదారుగురు లేరు. చీడపీడలను నివారించే సలహాలిచ్చేవారు లేరు. కరువు కారణంగా 2010, 2013లో 50 వేల ఎకరాల బత్తాయి తోటలు పూర్తిస్థాయిలో ఎండిపోయాయి. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. ఎన్నిసార్లు కరువు వచ్చినా చెరువులు లేదా కుంటలు నింపే కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేపట్టలేదు. అందుకే ఇప్పుడు బత్తాయి రైతు, పండ్ల తోటల రైతు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.’ - మల్లు నాగార్జున్‌రెడ్డి, పండ్లతోటల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
వేప నూనెతో ఎన్నో ప్రయోజనాలు
వేపనూనె... వేప పిండి... ఇవి రెండూ రైతులకు సుపరిచితమే. వీటి వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపైనా అవగాహన ఉంది. అయితే వినియోగంలో మాత్రం అంతగా చొరవ చూపడంలేదు. వేపనూనె వినియోగిస్తే పైరును చీడపీడలు ఆశించవు. రసాయన మందుల వాడకం తగ్గుతుంది. సాగు ఖర్చులు కలిసొస్తాయి. వేపనూనె వినియోగం, దాని వల్ల కలిగే ప్రయోజనాలు కంకిపాడు ఏవో లంక శ్రీనివాస్ మాటల్లో.. వేపనూనెలో అజాడిరిక్టన్ అనే పదార్థం ఉంటుంది. ఇది చేదుగా ఉంటుంది. దీనిని వాడితే మొక్కలు కూడా చేదెక్కుతాయి. దీని వల్ల మొక్కలను తినేందుకు పురుగులు ఆశించవు. వేప నూనె, వేపపిండి వినియోగిస్తే పైరులను ఆశించే చీడపీడలను నివారించొచ్చు. దీంతో పురుగు మందుల వినియోగం ఖర్చు తగ్గుతుంది. వేపనూనె ద్వారా పంటకు అవసరమైన చేవ సమృద్ధిగా అందుతుంది. ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గడంతో రైతుకు పెట్టుబడులపై వ్యయం ఆదా అవుతుంది. గతంలో వేపనూనె వినియోగం తక్కువగా ఉండేది. ప్రస్తుతం రైతుల్లో అవగాహన పెరగటంతో వినియోగం కొద్దిగా పెరిగింది. వేపనూనె వినియోగం, దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. - కంకిపాడు ఇలా వాడుకోవాలి.. వేప నూనెను పంట పొలంలో నేరుగా కానీ, యూరియా, పురుగు మందుల్లో కానీ కలిపి వినియోగించాలి. పంట ఏదైనా సరే, ఏ సమయంలో నైనా వేప నూనె వాడితే పంటకు మేలు చేకూరుతుంది. యూరియా, పురుగు మందు, సూక్ష్మధాతు మిశ్రమాల్లో వేపనూనె కలిపి వాడుకోవచ్చు. యూరియా 50 కిలోల బస్తాకు అర లీటరు నుంచి లీటరు వరకూ వేప నూనె, వేప పిండి అయితే 50 కిలోల బస్తాకు 10 కిలోల వరకూ కలిపి వాడుకోవాలి. యూరియా భూమిలో త్వరగా కరిగిపోకుండా చూస్తుంది. నత్రజని మొక్కకు ఎక్కువ సమయం అందే విధంగా చూడటం వేప నూనె ద్వారానే సాధ్యం. నత్రజని వృథా కాకుండా నిరోధిస్తుంది. పంటలకు కీడుచేసే పురుగు సంతతిని నివారిస్తుంది. పురుగుకు చెందిన గుడ్లు పొదగకుండా వాటిని నిర్వీర్యం చేయటంలో దోహదపడుతుంది. దీని వల్ల అధికంగా పురుగు మందులు వినియోగించాల్సిన అవసరం ఉండదు. వేప నూనె వాడకంతో నత్రజని ఎరువులు వినియోగం తగ్గుతుంది. వ్యవసాయ పెట్టుబడుల్లో ఖర్చులో 20 శాతం, పురుగు మందుల వినియోగం ఖర్చులో 40 శాతం తగ్గుతుంది. నత్రజని వృథా కాకుండా ఉండటమే కాకుండా, మొక్క చేదు ఎక్కటం వల్ల పురుగు వ్యాప్తి నిరోధించటానికి దోహదపడుతుంది. పండ్ల తోటల్లో వినియోగం ఇలా.. పండ్ల తోటల్లో అయితే వేప నూనెను చిన్న ప్లాస్టిక్ సంచుల్లో నింపి మొక్క వేరుకు తగిలించాలి. వేరు ద్వారా నూనె మొక్కకు నేరుగా చేరుతుంది. దీని వల్ల పురుగును నివారించుకోవచ్చు. గానుగ నుంచి తెచ్చిన వేప పిండి పండ్ల తోటలకు పనికిరాదు. వేపనూనెనే వినియోగించాలి. అరటి, పసుపు, కంద, మిర్చి తోటల్లో ఆముదపు పిండి, గానుగ పిండి, పొగాకు పిండితో పాటుగా వేప పిండి కలిపి చల్లుకుంటే పంటకు ఉపయుక్తంగా ఉంటుంది. మొక్క ఎదుగుదలకు, పురుగు నియంత్రణకు పిండి దోహదపడుతుంది. వ్యవసాయ శాఖ 50 శాతం సబ్సిడీపై వేపనూనె అందిస్తుంది. లీటరు రూ.100 చొప్పున విక్రయిస్తోంది. వేప పిండి మాత్రం వ్యవసాయ శాఖ ద్వారా సరఫరా లేదు. బయటి మార్కెట్లో 40 కిలోల వేప పిండి బస్తా రూ.600 నుంచి రూ.800 వరకూ ధర పలుకుతోంది. లంక శ్రీనివాస్ 88866 13370 -
మొండి తెగుళ్లకు ‘జీవ’ చికిత్స!
పండ్ల తోటల్లో యాంటీ బయోటి క్స్‌కు లొంగని మొండి తెగుళ్లను సమర్థవంతంగా నిలువరిస్తున్న ప్రోబయోటిక్స్ దానిమ్మ, బత్తాయి, నిమ్మ, మామిడి.. అంతా బాగుంటే రైతుకు అధికాదాయాన్నిచ్చే ఉద్యాన పంటలు. అయితే, రసాయనిక ఎరువులు, పురుగుమందులపై అతిగా ఆధారపడి ఈ పంటలను సాగు చేసే రైతుల ఆశలు వమ్ము అవుతున్న సందర్భాలు తరచూ తారసపడుతున్నాయి. మందులకు తట్టుకునే శక్తిని పెంచుకుంటూ మొండికేస్తున్న బ్యాక్టీరియా, శిలీంద్రపు తెగుళ్లే ఈ దుస్థితికి కారణం. ఈ తెగుళ్ల నివారణకు వాడుతున్న శిలీంద్ర నాశక మందు మోతాదు పెంచుతున్న కొద్దీ తెగుళ్ల తీవ్రత పెరుగుతోంది తప్ప ఫలితం ఉండడం లేదు. విసిగిపోయిన రైతులు కొందరు తోటలు తీసేయాల్సిన పరిస్థితి నెలకొంటున్నది. రైతుల ఆశలను కూలదోస్తున్న ఈ సమస్యకు పరిష్కారమే లేదా? ఉంది! యాంటీ బయోటిక్ రసాయనానికి బదులుగా.. జీవామృతం, పంచగవ్య వంటి ప్రోబయోటిక్స్ వాడి, తక్కువ ఖర్చుతో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చని ప్రొ. శ్యాం సుందర్‌రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అసాధారణ వాతావరణ పరిస్థితులుంటే తప్ప జీవామృతంతో ఈ తెగుళ్లు పత్తాలేకుండా పోతాయంటున్నారు. దానిమ్మ దిగుబడిని ఆంత్రాక్నోస్, బ్యాక్టీరియా మచ్చ తెగులు 50-100% వరకు దెబ్బతీస్తున్నది. ఆకులపై మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోవడం, కాయలపై కూడా మచ్చలు ఏర్పడడంతో సమస్య జటిలంగా మారింది. నెలకోసారి, తెగులు ఉధృతిని బట్టి వారానికోసారి కూడా దీన్ని పిచికారీ చేస్తున్నారు. ఎకరానికి ఏడాదికి రూ. 30 వేల నుంచి 50 వేల వరకు ఖర్చు పెట్టినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. దానిమ్మ సాగులో అపారమైన అనుభవం కలిగిన, వనరులకు కొరత లేని రైతులకు తప్ప సాధారణ రైతులు, కొత్తగా సాగు ప్రారంభించిన వారికి ఆంత్రాక్నోస్, బ్యాక్టీరియా మచ్చ తెగుళ్లు శాపంగా మారి.. తోటలు తీసేయాల్సిన పరిస్థితి వస్తోంది. బత్తాయి/ నిమ్మ తోటల్లో గజ్జి తెగులు బత్తాయి, నిమ్మ తోటల్లో గజ్జి తెగులు సమస్యగా ఉంది. దీన్ని అరికట్టడానికి యాంటీబయోటిక్ మందును 3-5 సార్లు పిచికారీ చేస్తున్నారు. యాంటీబయోటిక్ వాడకం వల్ల నష్టాలు: యాంటీబయోటిక్స్, శిలీంద్రనాశకాలను చెట్లపై చల్లడం వల్ల తెలుగు కారక సూక్ష్మజీవులతోపాటు, ఆకుల ఉపరితలంపై ఉండి రక్షణ కల్పించే మేలు చేసే సూక్ష్మజీవులు సైతం చనిపోతాయి. ఈ మందు చల్లినప్పుడు, వర్షం పడినప్పుడు ఆకుల మీద నుంచి కారి భూమి మీద పడినప్పుడు నేలలోని సూక్ష్మజీవులు నశిస్తాయి. బ్యాక్టీరియాలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి.. తెగులు విజృంభిస్తుంది. ఇవీ ప్రోబయోటిక్స్: జీవామృతం, పంచగవ్య(2-5% అంటే.. వంద లీటర్ల నీటిలో 2 నుంచి 5 లీటర్ల పంచగవ్య కలిపి పిచికారీ చేయాలి), కునప జలం(2-5% పిచికారీ చేయాలి). ఇవన్నీ చీడపీడలను అరికట్టడంతోపాటు పంటలకు పోషకాలను అందించే ప్రోబయోటిక్సే. జీవామృతం ఎలా వాడాలి? పంటలపై జీవామృతాన్ని 10,15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. జీవామృతాన్ని 1:4 మోతాదులో నీటిలో కలిపి చెట్టు పూర్తిగా తడిచి నీరు కారేంత వరకు పిచికారీ చేయాలి. ముందు నుంచే పిచికారీ చేస్తే ఆకుమచ్చ, శిలీంద్రపు తెగుళ్లు పంటల దరిచేరవు. ఈ తెగుళ్లు సోకిన చెట్లపై జీవామృతాన్ని వడకట్టి పిచికారీ చేస్తే సమర్థవంతంగా అదుపులోకి వస్తాయి. ఆకులపై ఏర్పడిన మచ్చలు పోతాయి. దానిమ్మ, మామిడి, పసుపు వంటి పంటలకు ఆశించే ఆంత్రాక్నోస్ అనే శిలీంద్రపు తెగులు వల్ల మచ్చలు ఏర్పడిన ఆకులు, కాయలు కుళ్లిపోతాయి. జీవామృతాన్ని పిచికారీ చేస్తే ఇది కూడా పోతుంది. జీవామృతం తయారీ ఇలా.. 200 లీటర్ల నీరు + 10 కిలోల నాటు ఆవు పేడ + 10 లీటర్ల నాటు ఆవు మూత్రం + కిలో బెల్లం + కిలో ఏవైనా పప్పుల పిండి + గట్టు మట్టి గుప్పెడు.. వీటిని డ్రమ్ము/ తొట్టిలో పోసి కుడి వైపునకు (గడియారపు ముల్లు తిరిగే విధంగా) తిప్పాలి. డ్రమ్మును ఎండ తగలకుండా నీడన ఉంచాలి. ఉదయం, సాయంత్రం ఒక నిమిషం పాటు కర్రతో కుడి వైపునకు కలియ తిప్పుతూ ఉండాలి. కలిపిన 48 గంటలకు జీవామృతం వాడకానికి సిద్ధం అవుతుంది. అప్పటి నుంచి 7 రోజుల్లోగా వాడేయాలి. జీవామృతంలో నేలకు, చెట్లకు మేలు చేసే కోటానుకోట్ల సూక్ష్మజీవుల సముదాయం, సూక్ష్మపోషకాలు, అమైనో ఆమ్లాలుంటాయి. దీన్ని పిచికారీ చేసినా, నేలపైన పోసినా చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది. సేంద్రియ ఎరువులూ వాడాలి జీవామృతం ద్వారా 100% ఫలితాలను పొందాలంటే.. భూమిలో సేంద్రియ కర్బనం బాగుండాలి. ఇందుకోసం సేంద్రియ ఎరువులు కూడా విధిగా వాడాలి. ఎకరానికి 10-20 టన్నుల చివికిన పశువుల ఎరువు లేదా 2-5 టన్నుల వర్మీ కంపోస్టు లేదా టన్ను మేరకు కానుగ / ఆముదం / వేప పిండి వేయాలి. రసాయనిక నత్రజని ఎరువులు అతిగా వాడితే బ్యాక్టీరియా, శిలీంద్రపు తెగుళ్ల ఉధృతి పెరుగుతుందే గానీ తగ్గదు. ఒకవేళ రసాయనిక ఎరువులు అనివార్యంగా వాడాల్సి వస్తే.. అతితక్కువ మోతాదులో, విడతల వారీగా వాడుకోవాలి. 10 రోజులకోసారి కిలో వాడేకన్నా.. రోజుకో వంద గ్రాములు వాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మల్చింగ్‌తో సాగునీటి ఆదా, కలుపు సమస్యకు చెక్! జీవామృతం, సేంద్రియ ఎరువులతోపాటు గడ్డిని, రొట్టను నేలపై ఆచ్ఛాదన(మల్చింగ్)గా వేయడం వల్ల చెట్లకు మేలు కలిగించే సూక్ష్మజీవులు భూమిలో వృద్ధి చెందడానికి అనుకూలమైన సూక్ష్మ వాతావరణం ఏర్పడుతుంది. మల్చింగ్ వల్ల సాగునీరు ఆదా కావడమే కాకుండా కలుపును కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. నేలపై వేసిన గడ్డి కుళ్లి, మంచి ఎరువుగా మారి నేలను సారవంతం చేస్తుంది. వరి గడ్డి, వరి పొట్టు, జంబుగడ్డి, చెరకు ఆకు, కొబ్బరి పీచు, అడవి చెట్ల నుంచి సేకరించిన ఆకులు.. తదితరాలను మల్చింగ్గా ఉపయోగించవచ్చు. అధిక మోతాదులో మల్చింగ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు రైతులు ఎవరికివారు తమ పొలంలోని 10-20% విస్తీర్ణంలో జనుము, జీలుగ, మొక్కజొన్న, అలసంద వంటి పచ్చిరొట్ట పైర్లను విత్తుకొని.. ప్రతి 45 రోజులకోసారి కోసి మల్చింగ్ కోసం వాడుకోవచ్చు. జనుము 65 రోజులు పెరిగిన తర్వాత కోసి.. మల్చింగ్గా వాడుకోవడం మరీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ మామిడిపై బ్యాక్టీరియా ఆకుమచ్చ బనేషాన్ మామిడి చెట్ల ఆకులపై బ్యాక్టీరియా మచ్చలు ఏర్పడుతున్నాయి. ఆకులు పండుబారి రాలిపోతాయి. ఆకులు తక్కువ ఉండడం వల్ల కాయలు సరిగ్గా పెరగవు. ఎండ నేరుగా పడడం వల్ల కాయలు పసుపు పచ్చగా మారుతుంటాయి. దీన్ని ఎవరూ అంతగా గుర్తించడం లేదు. దానిమ్మ పూత, పిందె దశలో జీవామృతం పిచికారీ చేయొద్దు! దానిమ్మ తోట పూత, పిందె దశలో ఉన్నప్పుడు జీవామృతం పిచికారీ చేయరాదని, అలా చేస్తే పూత, చిన్న పిందెలు రాలిపోతున్నట్లు తమ పరిశీలనలో తేలిందని ప్రొ. శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు. పూత, పిందె ఏర్పడుతున్న ఆ నెల రోజులపాటు జీవామృతాన్ని పిచికారీ చేయరాదని, నీటిలో కలిపి నేల మీద పోయవచ్చు. తోట లేతగా ఉన్నప్పుడు, కాపు వద్దను కున్నప్పుడు పూత, పిందెలను తీసెయ్యడానికి జీవామృతం పిచికారీ చేయొచ్చు. జీవామృతంతో నీటిని 1:1 నుంచి 1:4 పాళ్లలో కలిపి పిచికారీ చేస్తే వాటంతట అవే రాలిపోతాయన్నారు. రైతుకు కూలీల ఖర్చు తగ్గడమే కాకుండా.. రాలినవి త్వరగా కుళ్లి సేంద్రియ ఎరువుగా మారతాయన్నారు. జీవామృతంతో అద్భుత ఫలితాలు! ఉద్యాన పంటల్లో జీవామృతం, పంచగవ్య, కుణపజలం, ఉపయుక్త సూ క్ష్మజీవులు(ఈఎంలు), స్థానిక ఉపయుక్త సూక్ష్మజీవులు (ఐఎంవోలు), బయోడైన మిక్ ద్రావణాలు, పులిసిన కల్లు, పులిసిన మజ్జిగ.. చేప, కోడిగుడ్ల అమైనో ఆమ్లాలు తదితర ప్రోబయోటిక్స్‌తో ఐఐఐటీ(హైదరాబాద్)లో, రైతుల తోటల్లో విస్తృత ప్రయోగాలు చేస్తున్నాం. జీవామృతం అందరూ సులభంగా, తక్కువ సమయంలో తయారుచేసుకోగలిగినది. ఆకులపై ఆశించే బ్యాక్టీరియా, శిలీంద్రపు తెగుళ్లను ఇది ఎంతో సమర్థ వంతంగా అరికట్టగలుగుతున్నది. జీవామృతం వాడు తున్న తోటల్లో సూక్ష్మపోషక లోపాలు కనిపించడం చాలా అరుదు. పంచగవ్య కూడా ఆకుమచ్చ తెగుళ్ల నివారణలో అద్భుత ఫలితాలనిస్తున్నది. - ప్రొఫెసర్ జి. శ్యాంసుందర్‌రెడ్డి, రైతు, సస్య వైద్యుడుః ఐఐఐటీ - హైదరాబాద్, మొబైల్: 99082 24649. shyamiiit@gmail.com -
తెగనమ్మేకన్నా తిరిగి వాడటం మిన్న!
పండ్ల తోటల్లో వాడి.. తీసేసిన లేటరల్ పైపులను తెగనమ్ముకుంటున్న రైతులు వీటిని ఇతర పంటల్లో పునర్వినియోగానికి తోడ్పడుతున్న స్వచ్ఛంద సంస్థలు రైతులు ఉపయోగించే బిందు సేద్య పరికరాలు, లేటరల్స్ పదేళ్లు పనిచేస్తాయని అంచనా.అయితే, కొన్ని పండ్ల తోటల్లో వేసినవి వివిధ కారణాల వల్ల నాలుగైదేళ్లకే నిరుపయోగంగా మారుతున్నాయి. వీటిని తిరిగి ఇతర పంటల్లో వాడుకోవడం ఎలాగో తెలియకపోవడంతో.. కొందరు రైతులు లేటరల్ పైపులను అతి తక్కువ ధరకే పాత సామాను వ్యాపారులకు అమ్మేస్తూ తీవ్రంగా నష్టపడుతున్నారు. అయితే, పండ్ల తోటల్లో వాడి తీసేసిన లేటరల్ పైపులకు స్వల్ప మార్పులు, చేర్పులు చేసి, ఇతర పంటల సాగుకు కొన్నేళ్లపాటు చక్కగా తిరిగి వినియోగించుకునే మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 5 ఎకరాల పండ్ల తోటల్లో వాడిన లేటరల్ పైపులకు కొన్ని మార్పులు చేసి ఒక ఎకరంలో ఆరుతడి, కూరగాయ పంటలకు వాడుకోవచ్చు. లేటరల్ పైపులను తిరిగి వినియోగించుకోవడంలో రైతులకు సుస్థిర భూగర్భజల యాజమాన్యం (సుగమ్) ప్రాజెక్టు ఉపయోగపడుతోంది. సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ (సీడబ్ల్యూఎస్), రిడ్స్ స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కోటంక గ్రామ రైతులు లేటరల్ పైపులను తిరిగి వినియోగించుకుంటున్నారు. కోటంకలో రైతులు 450 ఎకరాల్లో 54 వేల చీనీ చెట్లను పెంచారు. కొన్నేళ్ల తర్వాత బోర్లు ఎండిపోయి ఎంతో ఆశతో పెంచుకున్న చెట్లను విధిలేక నరికేశారు. 5 ఎకరాల్లో రూ.75 వేలతో అమర్చుకున్న లేటరల్ పైపులను, పరికరాలను రూ.4,500కే అమ్మేశారు. దాచి ఉంచుకున్న కొద్దిమంది రైతులు మాత్రం స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో వీటిని కూరగాయ పంటలకు అనువుగా మార్చి వాడుకుంటున్నారు. అప్పటికే తోటలు ఎండిపోయి నష్టపోయి ఉన్న రైతులు ఈ లేటరల్స్‌ను వేరే పంటలకు వాడుకోవాలంటే మరికొంత ఖర్చవుతుంది. అయితే, ఈ ఖర్చులో కొంత మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలు (కొన్ని జిల్లాల్లో మాత్రమే) చెల్లిస్తుండడం రైతులకు ఊరట కలుగుతోంది. ఇలా లబ్ధిపొందిన కోటంకకు చెందిన రైతుల్లో వై.రామలింగారెడ్డి(94900 29375) ఒకరు. ఆయన ఇలా చెప్పారు: ‘బోరు కింద 5 ఎకరాల్లో చీనీ (బత్తాయి) మొక్కలు నాటి. బిందు సేద్య పరికరాలను సబ్సిడీపై తీసుకొని అమర్చాను. బోరులో నీరు తగ్గిపోవటం, తెగులు సోకడంతో చీనీ చెట్లను నరికి వేశా. 5 ఎకరాల పండ్ల తోటలో వాడిన లేటరల్ను 1 ఎకరంలో కూరగాయ పంటలకు తిరిగి వేసుకోవడానికి ‘సుగమ్’ ప్రాజెక్టు సిబ్బంది తోడ్పడ్డారు. ఖర్చులో రూ.10,328ను సీడబ్ల్యూఎస్ సంస్థ ఇవ్వగా, మరో రూ.4,450లు నేను భరించాను. బటన్ డ్రిప్పర్లు వాడితే ఈ ఖర్చు తగ్గుతుంది. మరో పది మంది రైతులు కూడా లేటరల్ పైపులను తిరిగి వాడుకుంటున్నారు..’ - జె.ఆదినారాయణ, న్యూస్‌లైన్, గార్లదిన్నె, అనంతపురం పాత లేటరల్స్ వాడకంపై శిక్షణ రైతు దగ్గర ఉన్న పాత లేటరల్ పైపులను తిరిగి ఇన్స్టాల్ చేయడానికి మా సంస్థ ఉచితంగా సాంకేతిక సహకారం అందిస్తుంది. వీటిని తిరిగి ఇన్స్టాల్ చేయడానికి అవసరమైన ఇతర పరికరాల కొనుగోలుకు ఎకరానికి రూ.7 వేల నుంచి 10 వేలు ఖర్చవుతుంది. అనంతపురం, వరంగల్ జిల్లాల్లో రైతులకైతే ఈ ఖర్చులో కొంత భాగాన్ని మా సంస్థ ఆర్థిక సాయంగా అందిస్తుంది. ఇతర జిల్లాల రైతులకు ఆర్థిక సహాయం చేయలేకపోయినా.. రైతుల దగ్గరున్న పాత లేటరల్ పైపులను ఉచితంగానే ఇన్స్టాల్ చేయిస్తాం. అయితే, ప్రస్తుతం ఇన్స్టాల్ చేసే నిపుణుల కొరత ఉంది. దీనిపై యువ రైతులు, గ్రామీణ యువకులకు 2 రోజుల శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం. శిక్షణ పొందదల చిన వారు సంప్రదించాల్సిన చిరునామా: సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ (సుగమ్ ప్రాజెక్టు), 12-13-451, వీధి నం:1, తార్నాక, సికింద్రాబాద్. ఫోన్: 040-27007906 - పి. రజనీకాంత్ (98495 75147), సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్, ‘సుగమ్’ ప్రాజెక్టు