మొండి తెగుళ్లకు ‘జీవ’ చికిత్స! | Refractory disease 'biological' treatment! | Sakshi
Sakshi News home page

మొండి తెగుళ్లకు ‘జీవ’ చికిత్స!

Published Sun, Jun 22 2014 11:48 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

మొండి తెగుళ్లకు ‘జీవ’ చికిత్స! - Sakshi

మొండి తెగుళ్లకు ‘జీవ’ చికిత్స!

పండ్ల తోటల్లో యాంటీ బయోటి క్స్‌కు లొంగని మొండి తెగుళ్లను సమర్థవంతంగా నిలువరిస్తున్న ప్రోబయోటిక్స్ దానిమ్మ, బత్తాయి, నిమ్మ, మామిడి.. అంతా బాగుంటే రైతుకు అధికాదాయాన్నిచ్చే ఉద్యాన పంటలు. అయితే, రసాయనిక ఎరువులు, పురుగుమందులపై అతిగా ఆధారపడి ఈ పంటలను సాగు చేసే రైతుల ఆశలు వమ్ము అవుతున్న సందర్భాలు తరచూ తారసపడుతున్నాయి.
 
 మందులకు తట్టుకునే శక్తిని పెంచుకుంటూ మొండికేస్తున్న బ్యాక్టీరియా, శిలీంద్రపు తెగుళ్లే ఈ దుస్థితికి కారణం. ఈ తెగుళ్ల నివారణకు వాడుతున్న శిలీంద్ర నాశక మందు మోతాదు పెంచుతున్న కొద్దీ తెగుళ్ల తీవ్రత పెరుగుతోంది తప్ప ఫలితం ఉండడం లేదు.
 
 విసిగిపోయిన రైతులు కొందరు తోటలు తీసేయాల్సిన పరిస్థితి నెలకొంటున్నది. రైతుల ఆశలను కూలదోస్తున్న ఈ సమస్యకు పరిష్కారమే లేదా? ఉంది! యాంటీ బయోటిక్ రసాయనానికి బదులుగా.. జీవామృతం, పంచగవ్య వంటి ప్రోబయోటిక్స్ వాడి, తక్కువ ఖర్చుతో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చని ప్రొ. శ్యాం సుందర్‌రెడ్డి  స్పష్టం చేస్తున్నారు. అసాధారణ వాతావరణ పరిస్థితులుంటే తప్ప జీవామృతంతో ఈ తెగుళ్లు పత్తాలేకుండా పోతాయంటున్నారు.

 
 దానిమ్మ దిగుబడిని ఆంత్రాక్నోస్, బ్యాక్టీరియా మచ్చ తెగులు 50-100% వరకు దెబ్బతీస్తున్నది.   ఆకులపై మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోవడం, కాయలపై కూడా మచ్చలు ఏర్పడడంతో సమస్య జటిలంగా మారింది.  నెలకోసారి, తెగులు ఉధృతిని బట్టి వారానికోసారి కూడా దీన్ని పిచికారీ చేస్తున్నారు. ఎకరానికి ఏడాదికి రూ. 30 వేల నుంచి 50 వేల వరకు ఖర్చు పెట్టినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. దానిమ్మ సాగులో అపారమైన అనుభవం కలిగిన, వనరులకు కొరత లేని రైతులకు తప్ప సాధారణ రైతులు, కొత్తగా సాగు ప్రారంభించిన వారికి ఆంత్రాక్నోస్, బ్యాక్టీరియా మచ్చ తెగుళ్లు శాపంగా మారి.. తోటలు తీసేయాల్సిన పరిస్థితి వస్తోంది. బత్తాయి/ నిమ్మ తోటల్లో గజ్జి తెగులు బత్తాయి, నిమ్మ తోటల్లో గజ్జి తెగులు సమస్యగా ఉంది. దీన్ని అరికట్టడానికి యాంటీబయోటిక్ మందును 3-5 సార్లు పిచికారీ చేస్తున్నారు.
 
 యాంటీబయోటిక్ వాడకం వల్ల నష్టాలు:
 యాంటీబయోటిక్స్, శిలీంద్రనాశకాలను చెట్లపై చల్లడం వల్ల తెలుగు కారక సూక్ష్మజీవులతోపాటు, ఆకుల ఉపరితలంపై ఉండి రక్షణ కల్పించే మేలు చేసే సూక్ష్మజీవులు సైతం చనిపోతాయి. ఈ మందు చల్లినప్పుడు, వర్షం పడినప్పుడు ఆకుల మీద నుంచి కారి భూమి మీద పడినప్పుడు నేలలోని సూక్ష్మజీవులు నశిస్తాయి. బ్యాక్టీరియాలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి.. తెగులు విజృంభిస్తుంది.
 
 ఇవీ ప్రోబయోటిక్స్:
 జీవామృతం, పంచగవ్య(2-5% అంటే.. వంద లీటర్ల నీటిలో 2 నుంచి 5 లీటర్ల పంచగవ్య కలిపి పిచికారీ చేయాలి), కునప జలం(2-5% పిచికారీ చేయాలి). ఇవన్నీ చీడపీడలను అరికట్టడంతోపాటు పంటలకు పోషకాలను అందించే ప్రోబయోటిక్సే.
 
 జీవామృతం ఎలా వాడాలి?
 పంటలపై జీవామృతాన్ని 10,15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. జీవామృతాన్ని 1:4 మోతాదులో నీటిలో కలిపి చెట్టు పూర్తిగా తడిచి నీరు కారేంత వరకు పిచికారీ చేయాలి. ముందు నుంచే పిచికారీ చేస్తే ఆకుమచ్చ, శిలీంద్రపు తెగుళ్లు పంటల దరిచేరవు. ఈ తెగుళ్లు సోకిన చెట్లపై జీవామృతాన్ని వడకట్టి పిచికారీ చేస్తే సమర్థవంతంగా అదుపులోకి వస్తాయి. ఆకులపై ఏర్పడిన మచ్చలు పోతాయి. దానిమ్మ, మామిడి, పసుపు వంటి పంటలకు ఆశించే ఆంత్రాక్నోస్ అనే శిలీంద్రపు తెగులు వల్ల మచ్చలు ఏర్పడిన ఆకులు, కాయలు కుళ్లిపోతాయి. జీవామృతాన్ని పిచికారీ చేస్తే ఇది కూడా పోతుంది.
 
 జీవామృతం తయారీ ఇలా..
 200 లీటర్ల నీరు + 10 కిలోల నాటు ఆవు పేడ + 10 లీటర్ల నాటు ఆవు మూత్రం + కిలో బెల్లం + కిలో ఏవైనా పప్పుల పిండి + గట్టు మట్టి గుప్పెడు.. వీటిని డ్రమ్ము/ తొట్టిలో పోసి కుడి వైపునకు (గడియారపు ముల్లు తిరిగే విధంగా) తిప్పాలి. డ్రమ్మును ఎండ తగలకుండా నీడన ఉంచాలి. ఉదయం, సాయంత్రం ఒక నిమిషం పాటు కర్రతో కుడి వైపునకు కలియ తిప్పుతూ ఉండాలి. కలిపిన 48 గంటలకు జీవామృతం వాడకానికి సిద్ధం అవుతుంది. అప్పటి నుంచి 7 రోజుల్లోగా వాడేయాలి. జీవామృతంలో నేలకు, చెట్లకు మేలు చేసే కోటానుకోట్ల సూక్ష్మజీవుల సముదాయం, సూక్ష్మపోషకాలు, అమైనో ఆమ్లాలుంటాయి. దీన్ని పిచికారీ చేసినా, నేలపైన పోసినా చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
 
 సేంద్రియ ఎరువులూ వాడాలి
 జీవామృతం ద్వారా 100% ఫలితాలను పొందాలంటే.. భూమిలో సేంద్రియ కర్బనం బాగుండాలి. ఇందుకోసం సేంద్రియ ఎరువులు కూడా విధిగా వాడాలి. ఎకరానికి 10-20 టన్నుల చివికిన పశువుల ఎరువు లేదా 2-5 టన్నుల వర్మీ కంపోస్టు లేదా టన్ను మేరకు కానుగ / ఆముదం / వేప పిండి వేయాలి. రసాయనిక నత్రజని ఎరువులు అతిగా వాడితే బ్యాక్టీరియా, శిలీంద్రపు తెగుళ్ల ఉధృతి పెరుగుతుందే గానీ తగ్గదు. ఒకవేళ రసాయనిక ఎరువులు అనివార్యంగా వాడాల్సి వస్తే.. అతితక్కువ మోతాదులో, విడతల వారీగా వాడుకోవాలి. 10 రోజులకోసారి కిలో వాడేకన్నా.. రోజుకో వంద గ్రాములు వాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
 
 మల్చింగ్‌తో సాగునీటి ఆదా, కలుపు సమస్యకు చెక్!
 జీవామృతం, సేంద్రియ ఎరువులతోపాటు గడ్డిని, రొట్టను నేలపై ఆచ్ఛాదన(మల్చింగ్)గా వేయడం వల్ల చెట్లకు మేలు కలిగించే సూక్ష్మజీవులు భూమిలో వృద్ధి చెందడానికి అనుకూలమైన సూక్ష్మ వాతావరణం ఏర్పడుతుంది.
 
 మల్చింగ్ వల్ల సాగునీరు ఆదా కావడమే కాకుండా కలుపును కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. నేలపై వేసిన గడ్డి కుళ్లి, మంచి ఎరువుగా మారి నేలను సారవంతం చేస్తుంది. వరి గడ్డి, వరి పొట్టు, జంబుగడ్డి, చెరకు ఆకు, కొబ్బరి పీచు, అడవి చెట్ల నుంచి సేకరించిన ఆకులు.. తదితరాలను మల్చింగ్‌గా ఉపయోగించవచ్చు.
 
 అధిక మోతాదులో మల్చింగ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు రైతులు ఎవరికివారు తమ పొలంలోని 10-20% విస్తీర్ణంలో  జనుము, జీలుగ, మొక్కజొన్న, అలసంద వంటి పచ్చిరొట్ట పైర్లను విత్తుకొని.. ప్రతి 45 రోజులకోసారి కోసి మల్చింగ్ కోసం వాడుకోవచ్చు. జనుము 65 రోజులు పెరిగిన తర్వాత కోసి.. మల్చింగ్‌గా వాడుకోవడం మరీ మంచిదని నిపుణులు చెబుతున్నారు.
 - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
 
 మామిడిపై బ్యాక్టీరియా ఆకుమచ్చ
 బనేషాన్ మామిడి చెట్ల ఆకులపై బ్యాక్టీరియా మచ్చలు ఏర్పడుతున్నాయి. ఆకులు పండుబారి రాలిపోతాయి. ఆకులు తక్కువ ఉండడం వల్ల కాయలు సరిగ్గా పెరగవు. ఎండ నేరుగా పడడం వల్ల కాయలు పసుపు పచ్చగా మారుతుంటాయి. దీన్ని ఎవరూ అంతగా గుర్తించడం లేదు.
 
 దానిమ్మ పూత, పిందె దశలో జీవామృతం పిచికారీ చేయొద్దు!
 దానిమ్మ తోట పూత, పిందె దశలో ఉన్నప్పుడు జీవామృతం పిచికారీ చేయరాదని, అలా చేస్తే పూత, చిన్న పిందెలు రాలిపోతున్నట్లు తమ పరిశీలనలో తేలిందని ప్రొ. శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు. పూత, పిందె ఏర్పడుతున్న ఆ నెల రోజులపాటు జీవామృతాన్ని పిచికారీ చేయరాదని, నీటిలో కలిపి నేల మీద పోయవచ్చు.
 
 తోట లేతగా ఉన్నప్పుడు, కాపు వద్దను కున్నప్పుడు పూత, పిందెలను తీసెయ్యడానికి జీవామృతం పిచికారీ చేయొచ్చు. జీవామృతంతో నీటిని 1:1 నుంచి 1:4 పాళ్లలో కలిపి పిచికారీ చేస్తే వాటంతట అవే రాలిపోతాయన్నారు. రైతుకు కూలీల ఖర్చు తగ్గడమే కాకుండా.. రాలినవి త్వరగా కుళ్లి సేంద్రియ ఎరువుగా మారతాయన్నారు.
 
 జీవామృతంతో అద్భుత ఫలితాలు!
 ఉద్యాన పంటల్లో జీవామృతం, పంచగవ్య, కుణపజలం, ఉపయుక్త సూ క్ష్మజీవులు(ఈఎంలు), స్థానిక ఉపయుక్త సూక్ష్మజీవులు (ఐఎంవోలు), బయోడైన మిక్ ద్రావణాలు, పులిసిన కల్లు, పులిసిన మజ్జిగ.. చేప, కోడిగుడ్ల అమైనో ఆమ్లాలు తదితర ప్రోబయోటిక్స్‌తో ఐఐఐటీ(హైదరాబాద్)లో, రైతుల తోటల్లో విస్తృత ప్రయోగాలు చేస్తున్నాం.
 
 జీవామృతం అందరూ సులభంగా, తక్కువ సమయంలో తయారుచేసుకోగలిగినది. ఆకులపై ఆశించే బ్యాక్టీరియా, శిలీంద్రపు తెగుళ్లను ఇది ఎంతో సమర్థ వంతంగా అరికట్టగలుగుతున్నది. జీవామృతం వాడు తున్న తోటల్లో సూక్ష్మపోషక లోపాలు కనిపించడం చాలా అరుదు. పంచగవ్య కూడా ఆకుమచ్చ తెగుళ్ల నివారణలో అద్భుత ఫలితాలనిస్తున్నది.
 - ప్రొఫెసర్ జి. శ్యాంసుందర్‌రెడ్డి,
 రైతు, సస్య వైద్యుడుః ఐఐఐటీ - హైదరాబాద్,
  మొబైల్: 99082 24649
. shyamiiit@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement