దాచిపెట్టుకుందామన్నా... దాచిపెట్టుకోలేరు... | special story to pickles | Sakshi
Sakshi News home page

దాచిపెట్టుకుందామన్నా... దాచిపెట్టుకోలేరు...

Published Sat, Mar 16 2019 1:20 AM | Last Updated on Sat, Mar 16 2019 1:20 AM

special story to pickles - Sakshi

అంత రుచిగా ఉంటేఎవరైనా దాచిపెట్టుకుంటారా! కంచం నాకేస్తారు. పంచినంత పంచేస్తారు. నిలవ పచ్చళ్లు కావు కదా మరి! ఇలా చేసుకోండి. ఒక వారం అలా లాగించేయండి. వారం వరకు మిగిల్తే కదా! అంతే మరి! అంత రుచిగా ఉంటే వారం వరకు మిగుల్తాయా! అందుకే దాచుకోవడం కష్టమే కదా!

అల్లంపచ్చడి

కావలసినవి
అల్లం – 100 గ్రా.; ఉప్పు – తగినంత; నిమ్మరసం – 3 టీ స్పూన్లు; మిరపకారం: టేబుల్‌ స్పూను; తరిగిన పచ్చిమిర్చి – 4.

తయారీ:
►అల్లం శుభ్రంగా కడిగి, తడిపోయేవరకు ఆరబెట్టాలి
►తొక్క తీసి సన్నగా పొడవుగా ముక్కలు చేయాలి
►ఒక పాత్రలో అల్లం ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి, పదినిమిషాల తరవాత, తరిగిన పచ్చిమిర్చి, కారం, నిమ్మరసం వేసి కలియబెట్టాలి
►గాజు సీసాలోకి తీసుకుని మూతపెట్టి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచాలి
►పరాఠాలోకి రుచిగా ఉంటుంది.



టొమాటోఆవకాయ

కావలసినవి: టొమాటోలు – 2 కిలోలు; నువ్వుల నూనె – పావు కేజీ; ఇంగువ – అర టీ స్పూను; ఆవ పిండి – ఒక టేబుల్‌ స్పూను; మెంతి పిండి – అర టీ స్పూను; మిరప కారం – 2 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – తగినంత.

పోపు కోసం: నూనె – ఒక టేబుల్‌ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 10 (ముక్కలు చేయాలి).

తయారీ:
►టొమాటోలను శుభ్రంగా కడిగి, నీడలో ఆరబోయాలి
►పూర్తిగా తడి పోయాక చిన్న చిన్న ముక్కలుగా తరగాలి
►స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక టొమాటో ముక్కలు, ఉప్పు వేయాలి
►టొమాటో ముక్కలలో తడి పోయి బాగా చిక్కగా అయ్యేవరకు సన్నటి మంట మీద ఉంచాలి
►బాగా చిక్కగా అయ్యాక మిరప కారం, ఆవ పిండి, మెంతి పిండి, ఇంగువ వేసి కలియబెట్టి దింపేయాలి
►స్టౌ మీద చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి చిటపటలాడే వరకు వేయించి తీసేసి, సిద్ధంగా ఉన్న టొమాటో ఆవకాయలో వేసి కలపాలి
►చల్లారాక గాలిచొరని సీసాలోకి తీసుకోవాలి ∙నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటుంది.

ముక్కలపచ్చడి

కావలసినవి: మామిడికాయలు – 3; మెంతులు – పావు టీ స్పూను; ఆవాలు – ఒక టేబుల్‌ స్పూను; వెల్లుల్లి రేకలు – 12 (మిక్సీలో వేసి మెత్తగా చేయాలి); పసుపు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – పావు కప్పు.

పోపు కోసం: నూనె – 4 టేబుల్‌ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); ఇంగువ – కొద్దిగా; వెల్లుల్లి రేకలు – 3; కరివేపాకు – రెండు రెమ్మలు.

తయారీ:
►మామిడికాయలను నీళ్లలో వేసి పావు గంట తరవాత శుభ్రంగా కడిగి బయటకు తీయాలి
►పొడి వస్త్రంతో తుడవాలి
►మధ్యకు రెండుగా తరిగి, చిన్నచిన్న ముక్కలుగా చేయాలి
►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక మెంతులు వేసి దోరగా వేయించాలి
►ఆవాలు జత చేసి రెండూ కలిపి వేయించి దింపి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి
►ఒక పాత్రలో తరిగిన మామిడికాయ ముక్కలు, పసుపు, ఉప్పు, మిరప కారం, ఆవ + మెంతి పొడి వేసి కలపాలి
►వెల్లుల్లి ముద్ద జత చేసి మరోమారు కలియబెట్టాలి
►స్టౌ మీద బాణలిలో నాలుగు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి చిటపటలాడేవరకు వేయించాక, ఇంగువ వేసి కలియబెట్టాక, ముక్కల పచ్చడి మీద వేసి కలపాలి.

ద్రాక్ష ఆవకాయ

కావలసినవి: పుల్లటి ద్రాక్ష – కిలో; ఆవపిండి∙–  టేబుల్‌ స్పూను; మిరప కారం – 4 టీ స్పూన్లు; ఉప్పు – 2 టీ స్పూన్లు; జీలకర్ర పొడి – 2 టీ స్పూన్లు; వెల్లుల్లి రేకలు – 10; నూనె – తగినంత; ఇంగువ – తగినంత

తయారీ:
►ద్రాక్షలను శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి
►నిలువుగా రెండు ముక్కలుగా కట్‌ చేయాలి
►ఒక గిన్నెలో ఆవపొడి, మిరప కారం, ఉప్పు, జీలకర్ర పొడి, వెల్లుల్లి రేకలను వేసి కలపాలి
►ఈ మిశ్రమంలో ద్రాక్షముక్కలను వేసి కలియబెట్టాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కొద్దిగా కాగాక ఇంగువ వేసి కలిపి దింపేయాలి
►ద్రాక్ష ఆవకాయలో నూనె పోసి కలియబెట్టి, మరుసటి రోజు వాడుకోవాలి
►ఇది రెండు మూడు రోజుల కంటె నిల్వ ఉండదు.

నిమ్మకాయ పచ్చడి

కావలసినవి : నిమ్మకాయలు – 6; మిరప కారం – 50 గ్రా.; ఆవపిండి ∙– రెండు టీ స్పూన్లు; మెంతిపిండి – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను.

పోపు కోసం : ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండుమిర్చి – 4 (ముక్కలు చేయాలి).
తయారీ:
►నిమ్మకాయలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రం మీద నీడలో ఆరబోయాలి
►నిమ్మకాయలను చిన్నచిన్న ముక్కలుగా తరగాలి
►ఒక గాజు సీసా లేదా జాడీలో నిమ్మకాయ ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి రెండు రోజులు ఉంచేయాలి
►మూడోరోజు సీసా మూత తీసి నిమ్మకాయ ముక్కలను పై నుంచి కిందికి ఒకసారి బాగా కలపాలి
►ఆవపిండి, మెంతిపిండి, మిరప కారం జత చేయాలి
►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగాక ఇంగువ వేసి కలపాలి
►ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి కలిపి చిటపటలాడాక దింపేయాలి
►నిమ్మకాయ ముక్కలకు జత చేయాలి
►ఈ పచ్చడి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది.

మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ పచ్చడి

కావలసినవి: మామిడి కాయ ముక్కలు – రెండు కప్పులు; క్యారట్‌ ముక్కలు – అర కప్పు; బీన్స్‌ ముక్కలు – అర కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను.

పేస్ట్‌ కోసం: వెల్లుల్లి రేకలు – 20; అల్లం – చిన్న ముక్క; మిరియాలు – ఒక టేబుల్‌ స్పూను; గసగసాలు – 2 టేబుల్‌ స్పూన్లు; జీడి పప్పులు – 50 గ్రా.; కొత్తిమీర తరుగు – అర కప్పు; పుదీనా తరుగు – పావు కపు; నిమ్మరసం – ఒక టేబుల్‌ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 20; పసుపు – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను ; ఉప్పు – తగినంత.

తయారీ:
►మిక్సీలో వెల్లుల్లి రేకలు, అల్లం, మిరియాలు, గసగసాలు, జీడి పప్పులు, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, తరిగిన పచ్చి మిర్చి, పసుపు వేసి మెత్తగా పేస్ట్‌ చేయాలి
►ఒక పాత్రలో కూరగాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి
►నిమ్మరసం జత చేసి మరోమారు కలపాలి
►తయారుచేసుకున్న పేస్ట్, ఇంగువ జత చేసి మరోమారు కలపాలి
►రెండు గంటల తరవాత ఉపయోగించుకోవాలి
►ఈ పచ్చడి పెరుగన్నంలోకి రుచిగా ఉంటుంది.

దబ్బకాయ పచ్చడి

కావలసినవి: దబ్బకాయలు – 2; పచ్చి మిర్చి – 100 గ్రా.; మెంతులు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; మెంతి పొడి – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను.

పోపు కోసం: ఎండు మిర్చి – 20; ఇంగువ – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; నూనె – 3 టేబుల్‌ స్పూన్లు.

తయారీ:
►దబ్బకాయల తొక్కలు తీసి, తొనలను చిన్నచిన్న ముక్కలుగా చేసి ఒక గిన్నెలో వేయాలి
►పచ్చి మిర్చిని శుభ్రంగా కడగాలి
►తొడిమలు తీసి, మధ్యకు చీల్చి, దబ్బకాయ తొనలకు జత చేయాలి
►తగినంత ఉప్పు, పసుపు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించి దింపేయాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక ఇంగువ, ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక దింపి, ఉడికించిన దబ్బకాయ పచ్చడిలో వేసి కలపాలి
►మెంతి పొడి జత చేసి కలియబెట్టాలి
►చల్లారాక గాలిచొరని సీసాలోకి తీసుకోవాలి
►వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది (మరిన్ని రోజులు కావాలనుకుంటే ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు)

నారింజ పచ్చడి

కావలసినవి: నారింజ కాయలు – 4; మిరప కారం – టేబుల్‌ స్పూను; మెంతి పొడి – అర టీ స్పూను; ఆవపిండి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – 3 టేబుల్‌ స్పూన్లు; ఇంగువ – అర టీ స్పూను.

పోపు కోసం: నూనె – ఒక టేబుల్‌ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 10 (ముక్కలు చేయాలి).

తయారీ:
►నారింజ కాయ తొక్క తీసి తొనలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి
►పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి మధ్యకు చీల్చాలి (తొడిమలు తీసేయాలి)
►నారింజ తొనలకు పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి
►తగినంత ఉప్పు, పసుపు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించి దింపేయాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక ఇంగువ, ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక దింపి, ఉడికించిన నారింజకాయ పచ్చడిలో వేసి కలపాలి
►మెంతి పొడి జత చేసి కలియబెట్టాలి
►చల్లారాక గాలిచొరని సీసాలోకి తీసుకోవాలి
►వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది (మరిన్ని రోజులు కావాలనుకుంటే ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు)

జామకాయ పచ్చడి

కావలసినవి: జామకాయలు – పావు కిలో; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఆవ పొడి – ఒక కప్పు; వెల్లుల్లి రెబ్బలు – పావు కప్పు; జీలకర్ర పొడి – పావు కప్పు; ఉప్పు – తగినంత; మిరప కారం – తగినంత; కరివేపాకు – రెండు Æðమ్మలు; ఎండు మిర్చి – 4; నూనె – ఒక కప్పు

తయారీ:
►జామకాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి
►ఒక పాత్రలో జామకాయ ముక్కలు, ఆవపిండి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి
►ఉప్పు, మిరప కారం జత చేసి మరోమారు కలపాలి
►స్టౌ మీద బాణలిలో ఒక కప్పు నూనె వేసి కాగాక, జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి
►కరివేపాకు వేసి మరోమారు వేయించి దింపేసి, జామ కాయ పచ్చడిలో వేసి కలపాలి
►చల్లారాక గాలిచొరని సీసాలోకి తీసుకుని నిల్వ చేయాలి
►ఈ పచ్చడి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది

దోస ఆవకాయ

కావలసినవి: దోస కాయలు – కిలో; ఆవ పొడి – ఒక టేబుల్‌ స్పూను; మెంతి పొడి – అర టీ స్పూను; మిరప కారం – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు.

తయారీ:
►దోస కాయలను శుభ్రంగా కడిగి తడిపోయేవరకు ఆరబెట్టాలి
►దోస కాయను మధ్యకు తరిగి, గింజలను తీసేయాలి
►దోస కాయలను చిన్నచిన్న ముక్కలుగా తరగాలి (తొక్క తీయకూడదు)
►ఒక పాత్రలో దోస కాయ ముక్కలు, ఆవ పొడి, మెంతి పొడి, మిరప కారం, ఉప్పు వేసి కలియబెట్టాలి
►నూనె పోసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి
►మూడో రోజున మరోసారి కలిపి వేడివేడి అన్నంలో తింటే రుచిగా ఉంటుంది
►దోస ఆవకాయ వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది.

క్యారట్‌ పచ్చడి

కావలసినవి: క్యారట్‌ స్లయిసెస్‌ – ఒక కప్పు; ఆవ నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; ఇంగువ – పావు టీ స్పూను; సోంపు పొడి – అర టీ స్పూను; మెంతులు – రెండు టీ స్పూన్లు; ఆవ పొడి – 2 టీ స్పూన్లు; మిరప కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత.

తయారీ:
►ఒక పాత్రలో సోంపు పొడి, మెంతులు, ఆవ పొడి, మిరప కారం, ఉప్పు వేసి బాగా కలపాలి
►క్యారట్‌ స్లయిసెస్‌ జత చేసి మరోమారు కలపాలి
►స్టౌ మీద బాణలిలో ఆవ నూనె వేసి కొద్దిగా కాగాక ఇంగువ వేసి, కలిపి, వెంటనే దింపేసి, క్యారట్‌ పచ్చడి మీద వేసి కలపాలి
►ఈ పచ్చడి అన్నం, పరాఠా, పూరీ, పుల్కాలలోకి రుచిగా ఉంటుంది. (తయారు చేసిన వెంటనే ఫ్రిజ్‌లో ఉంచాలి. లేదంటే పాడైపోతుంది)

పెసర ఆవకాయ

కావలసినవి : మామిడి కాయలు – 2; పెసర పప్పు – 100 గ్రా.; మిరప కారం – 50 గ్రా.; ఉప్పు – తగినంత; నూనె – 3 టేబుల్‌ స్పూన్లు.

తయారీ:
►మామిడికాయలను శుభ్రంగా కడిగి తడిపోయేవరకు ఆరబెట్టాలి
►చిన్నచిన్న ముక్కలుగా తరగాలి
►స్టౌ మీద బాణలిలో పెసర పప్పు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
►మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి
►ఒక పాత్రలో మామిడి కాయ ముక్కలు, మిరప కారం, పెసర పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి
►నువ్వుల నూనె వేసి మరోమారు కలియబెట్టి, మూడు రోజుల తర్వాత వాడుకోవాలి
►వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది
►ఈ ఆవకాయ పది రోజుల కంటె నిల్వ ఉండదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement