pickles
-
కేన్సర్‌ని జయించి..ఇవాళ రూ. 39 లక్షల వ్యాపార సామ్రాజ్యం..!
సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు లేదా సంన్నకుటుంబాల వాళ్లు కేన్సర్ బారినపడి జయించడం అనేది వేరు. ఎందుకంటే అత్యాధునిక వైద్యం పొందే ఆర్థిక స్థోమత వారికి ఉంటుంది. ఆ వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చులు తట్టుకోగలరు. కేవలం వాళ్లు ధైర్యంగా చికిత్స చేయించుకుంటే చాలు. అదే సామాన్యుడు.. అందులోనూ ఓ మధ్య తరగతివాడు ఇలాంటి కేన్సర్ బారినపడితే అతడి పరిస్థితి తలకిందులైపోవడం లేదా కుటుంబమే రోడ్డున పడిపోతుంది. ఇక్కడ అలానే ఓ మధ్యతరగతికి చెందిన భార్యభర్తలిద్దరూ కేన్సర్ బారిన పడ్డారు. అయితే వారిద్దరూ కేన్సర్‌ని జయించి ఏకంగా లక్షల టర్నోవర్ చేసేలా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. వారెవరంటే.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరానికి చెందిన దంపతులు లవీనా జైన్(Laveena Jain), ఆమె భర్త ఓ ప్రైవేటు వ్యాపారంతో జీవనం సాగిస్తున్నారు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. హాయిగా సాగిపోతున్న వారి జీవితంలోకి కేన్సర్(cancer) మహమ్మారి ఒక్క కుదుపు కుదిపేసింది. భార్యభర్తలిద్దరూ 2010లో కేన్సర్ బారినపడినట్లు నిర్ధారణ అయ్యింది. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి ఈ వ్యాధికి చికిత్స తీసుకోవడం అంటే తలకు మించిన భారమే. అందులోనూ ఇరువురు కేన్సర్ బారినపడ్డారు. లవీనాకు రొమ్ము కేన్సర్(Breast Cancer), ఆమె భర్తకు నోటి కేన్సర్(Mouth Cancer)..ఇలా ఇద్దరికి అయ్యే చికిత్సా ఖర్చులు, మరోవైపు కుటుంబ పోషణ, పిల్లల చదువులు ఇవన్నీంటిని ఎలా నిర్వహించాలన్న ప్రశ్నలే ఆ దంపతులను వేధించాయి. ఏదో రకంగా ఇద్దరం దీన్నుంచి బయటపడితే పిల్లలని చూసుగోలమన్నా నిశ్చయానికి వచ్చి స్నేహితులు, తెలిసిన వాళ్లు బంధువుల దగ్గర అందినకాడికి అప్పులు తెచ్చి మరీ వైద్యం చేయించుకున్నారు. నిజానికి అవి తీర్చగలుగుతామా అన్న ఆలోచన లేకుండానే ఆ దంపతులు ముందు ఈ మహమ్మారిపై గెలవాలన్న సంకల్పంతో పోరాడారు. అలా ఇద్దరు కఠినమైన కీమోథెరపీ, రేడియోథెరపీలు చేయించుకుని కోలుకున్నారు. ఇక అక్కడ నుంచి ఆర్థిక కష్టాలు మాములుగా మొదలవ్వలేదు. కుటుంబాన్ని ఎలా నడపాలన్నిది అర్థం కాలేదు. ఆ వ్యాధి నుంచి బయటపడ్డామంటే..మరోవైపు తినడానికే గుప్పుడు బియ్యం లేని గడ్డు పరిస్థితుల్లో కూరుకుపోయారు. ఆ మహ్మమ్మారి మిగిల్చిన ఆర్థిక కష్టాలు తాళ్లలేక చనిపోవాలన్నంత నరకయాతన అనుభవించారు. అయితే లవీనా కేన్సర్ నుంచి కోలుకుని మాములు స్థితికి వచ్చింది గానీ ఆమె భర్తకి మాత్రం నోటి కేన్సర్ కారణంగా మాట రావడానికి టైం పడుతుందని చెప్పారు వైద్యులు. మరోవైపు చుట్టుముడుతున్న ఈ కష్టాల మధ్య ఆ దంపతులు తమ ఇంటిని అమ్మక తప్పలేదు. అలాంటి పరిస్థితిలో లవీనాకు తన చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్న పాకనైపుణ్యం గుర్తొచ్చింది. సరదాగా నేర్చుకున్న ఆహార సంరక్షణ కోర్సు ఇలా ఉపయోగపడుతుందని లవీనా ఊహించలేదు. ఆ కోర్సులో భాగంగా మురబ్బా, ఊరగాయలు, జామ్‌లు తయారు చేయడం నేర్చుకున్న కళే తనకు ఆధారం అని భావించింది లవీనా. సరిగ్గా ఆ సమయంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆహార సంరక్షణకు సంబంధించిన వందరోజుల ఉపాధి అభివృద్ధి కార్యక్రమం చేపట్టింది. వెంటనే లవీనా అందులో జాయిన్ అయ్యి శిక్షణ తీసుకుంది. అయితే వ్యాపారం పెట్టేందుకు ఆమె వద్ద కేవలం రూ. 1500/-లు మాత్రమే ఉన్నాయి. దాంతోనే 'లవీనాస్ ట్రిప్టి ఫుడ్స్' అనే పచ్చళ్ల ఫుడ్స్టార్టప్ని ప్రారంభించింది. లవీనా స్వయంగా ఇంట్లో తయారు చేసే స్క్వాష్, జామ్‌లు, ఊరగాయలు విక్రయించేది. అయితే విక్రయాలు అంత ఈజీగా జరగలేదు. తయారుచేయడమే ఈజీ వాటిని ప్రజల వద్దకు చేరేలా చేయడమే అత్యంత కష్టమని తెలిసిందామెకు. అసలు వ్యాపార కిటుకేంటో తెలియక ఎన్నో ఇక్కట్లు పడింది. ఎలా ప్రజలకు తన వ్యాపారం గురించి తెలిపి విక్రయాలు ఊపందుకునేలా చేయాలన్నది ఆమెకు ఓ పెద్ద టాస్క్‌లా మారింది. అయితే స్థానిక కిట్టి పార్టీల ద్వారా తన వ్యాపారం గురించి ప్రచారం చేసుకోవడం..శ్యాంపుల్ బాటిల్స్ ఇవ్వడం వంటివి చేయడంతో అమ్మకాలు మొదలయ్యాయి. అలా ఒకరినుంచి ఒకరికి ఆమె చేసే పచ్చళ్లు, జామ్‌ల గురించి తెలియడం మొదలై వ్యాపారం ఊపందుకుని లాభాలు రావడం మొదలైంది. ఆ లాభాలతో అప్పులు తీర్చడం మొదలు పెట్టడమే గాక కుటుంబ ఆర్థికంగా స్ట్రాంగ్ ఉండేలా చేసింది. అయితే ఈ బతుకుపోరాటం కారణంగా ఆమె కొడుకు డ్రీమ్ పక్కన పెట్టి తన వ్యాపారం ప్రచారంలో పాలుపంచుకోక తప్పలేదు. అతడే తనకు చేదుడు వాదోడుగా ఉండి వ్యాపారాన్ని చూసుకోవడంతోనే తన వ్యాపారం ఇంతలా విస్తరించిందని అంటోంది లవీనా. ప్రస్తుతం ఆమె వ్యాపారం రూ. 34 లక్షల టర్నోవర్‌తో దూసుకుపోతోంది. ఇక ఆమె కుమారుడు కిన్షుక్ (30) మాట్లాడుతూ..సీఏ చేయాలనేది తన డ్రీమ్ అని కానీ ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా చేయలేకపోయానని చెప్పాడు. తమ కుంటుంబాన్ని ఆదుకోవడానికి బంధువులు ఎవరు ముందుకు రాకపోవడంతో మా అమ్మ ప్రయత్నానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చానని చెప్పుకొచ్చారు. తమ వ్యాపారం గురించి ఇంటి ఇంటికి తిరుగుతున్నప్పుడు ఎదురైన అవమానాలను గుర్తుచేసుకుంటూ..వ్యాపారం నిర్వహించడం అంత ఈజీ కాదని అర్థమైందంటూ చెప్పుకొచ్చాడు. తాను ప్రజల్లోకి తమ పచ్చళ్ల వ్యాపారం ఎలా తీసుకెళ్లగలను, వారితో చెప్పడం ఎలా అని బాధపడుతుంటే తన తండ్రి మాట్లాడలేని స్థితిలో కూడా సైగలతో ఓ బస్సు ఎక్కినప్పుడు ప్రయాణికుడితో మాటలు ఎలా కలుపుతావో అలానే అనుకుని మాట్లాడు చాలు అన్నారు. ఆ ఒక్క మాట తనను ఎంతగానో ప్రేరేపించి.. ఎన్నో ఆర్డర్లు అందుకునేలా చేసిందని భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు కిన్షుక్. ఈ కథ ఎంతటి గడ్డు పరిస్థితుల్లోనైనా సరే.. గివ్ అప్ ఇవ్వకూడదని, అచంచలమైన సంకల్పం, ఆశతో పోరాడితే గెలుపు తలుపు తప్పక తెరుచుకుంటుందనడానికి ఈ 50 ఏళ్ల కేన్సర్ వారియర్ లవీనా జైన్ కథే ఉదాహరణ. (చదవండి: కేన్సర్‌ని ముందే పసిగట్టే స్ర్రీనింగ్ పరీక్షలేమిటి..? ఎప్పుడు చేయించాలంటే..) -
ఆహా ఆవకాయ! ఒక ముద్ద పడిందంటే.. ఈ రుచులను ఎప్పుడైనా ట్రై చేశారా? (ఫొటోలు)
-
చట్నీ డే: చట్నీ, పచ్చళ్లు, పొడుల మధ్య వ్యత్యాసం..?
భారతదేశంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు ఉన్నాయి. ప్రాంతాల వారీగా విభిన్న రుచులతో కూడిన ఆహారం ఆస్వాదిస్తారు. అవన్నీ సంప్రదాయాలకు అనుగుణంగా ఆరోగ్య స్ప్రుహతో ఏర్పరచుకున్న మధురమైన రెసిపీలు. అందులో ప్రముఖంగా ఆకర్షించేవి చట్నీలు, పచ్చళ్లు, పొడులు, ఆవకాయ తదితరాలు. అబ్బా..! అవి తినేందుకు ఎంతలా స్పైసీగా నోరు మండుతున్న వదులబుద్ధి కాదు. ఎన్ని కూరలు ఉన్నా.. పక్కన కొద్దిగా పచ్చడి లేదా ఏదో ఒక చట్నీ, కొంచెం పొడి ఉంటేగానే భోజనం సంపూర్ణంగా ఉండదు. ఇలా ఇన్ని రకాల పదార్థాల కలయికతో తింటే పొట్ట నిండుగా, మనసు హాయిగా ఉంటుంది. అందుకే మన విభిన్న రుచులను గుర్తించేలా ప్రతి ఏడాది సెప్టెంబర్ 24న చట్నీ డే గా ఏర్పాటు చేసి మరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ రోజు విభిన్న చట్నీలతో విందులు ఏర్పాటు చేసుకుని మన పురాతన సంప్రదాయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చట్నీ, పొడులు, ఆవకాయ, పచ్చళ్ల మధ్య తేడా ఏంటో సవివరంగా చూద్దాం..!.చట్నీచట్నీ అనే పదం 'చాట్నీ' అనే పదం నుండి ఉద్భవించింది, దీని అర్థం 'నొక్కడం'. ఇది మొఘల్ సామ్రాజ్య చరిత్రలో పాతుకుపోయింది. పాలకుడు షాజహాన్ అనారోగ్యానికి గురైనప్పుడు తొలిసారిగా ఈ చట్నీ అనే వంటకం వచ్చిందని అంటారు. ఆ సమయంలో ఆయన అనారోగ్యం నయం అయ్యేందుకు ఆస్థాన వైద్యులు సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన చట్నీ తినాల్సిందిగా సూచించారు. అలా వంట వాళ్లు షాజహాన్ కోసం పుదీనాతో చట్నీ చేసి పెట్టారు. అయితే బిట్రీష్ పాలనలో చట్నీ అనేదానికి వేరే అర్థాన్ని సంతరించుకుంది. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో పండే మామిడిపండ్లు, చింతపండు వంటి వాటిని ఇంగ్లండ్‌కి ప్రిజర్వేటివ్‌గా తరలించే క్రమంలో ఒక విధమైన స్వీట్నెస్ లిక్విడ్ రూపంలో తరలించింది. దాన్నే వాళ్లు చట్నీ అనిపిలిచేవారు. ఇది యూరోపియన్ చట్నీల సంప్రదాయంగా చెప్పొచ్చు. పచ్చడి..ఇది ఉప్పునీటిలో నిల్వ ఉంచేందుకు ఉపయోగించింది కాస్త ఊరగాయ పచ్చడిగా రూపాంతరం చెందింది. మోసొటొటేమియా నాగరికత నుంచి ఈ విధమైన ఆహార సంరక్షణ ఉండేది. 'పికెల్' అనే పదం డచ్ పదం 'పెకెల్' నుంచి వచ్చింది. దీని అర్థం ఉప్పునీరు. భారత్‌లో దోసకాయ, మామిడికాయ వంటి వాటిని ఉప్పువేసి ఇలా నిల్వ ఉంచేవారు. ఆ తర్వాత వాటిని వివిధ మసాల దినుసులతో పచ్చడిగా చేయడం వంటివి చేశారు. ఆవకాయ...ఈ పదం పర్షియన్ పదం నుంచి వచ్చింది. పోర్చుగీస్ వైద్యుడు గార్సియా ఓర్టా రచనలలో ఈ పదం గురించి వినిపిస్తుంది. శరీరానికి వేడి కలిగించే వంటకంగా రూపొందించారు. అయితే దీన్ని నూనె మసాలా దినుసులతో నిల్వ చేస్తారు. ఊరగాయ పద్ధతిలోనే.. కాకపోతే ఇక్కడ అధికంగా నూనెతో భద్రపరచడం జరుగుతుంది. ఇక్కడ నూనె, వివిధ మసాలాతో తయారు చేస్తారు.పొడి..దక్షిణ భారత పాకశాస్త్ర నిపుణుల క్రియేటివిటీనే ఈ పొడిగా చెప్పొచ్చు. దీన్ని కొందరూ చట్నీగా పిలుస్తారు కూడా. ఇది విజయనగర రాజవంశం సాహిత్యం, తమిళ గ్రంథాల్లోనూ ఎక్కువగా ఈ పొడుల ప్రస్తావన వినిపిస్తుంది. 'పొడి' అనే పదానికి తెలుగు, తమిళ, మలయాళంలో అర్థం మెత్తటి పౌడర్ అని అర్థం. ఆంధ్రప్రదేశ్‌లో నువ్వుల పొడి, కారప్పొడి ఫేమస్. వీటిని నెయ్యి లేదా నూనెతో తింటే ఉంటుంది రుచి.. అంటుంటేనే నోటిలో నీళ్లూరిపోతుంటాయి. ఎక్కువగా దోస, ఇడ్లీల, వేడి వేడి అన్నంలోనూ తింటుంటారు. అంతేగాదు పలుచోట్ల కాకరకాయ పొడి, బీరకాయ పొట్టు పొడి, కంది పొడి వంటి వివిధ రకాల పొడులు కూడా చేస్తుంటారు. (చదవండి: మిస్ యూనివర్స్ ఇండియా 2024గా రియా సింఘా! 'తాజ్ మహల్ కిరీటం"..!) -
మరణశయ్యపై భర్తకు మాట...తోడుగా కోడలు : 67 ఏళ్ల వయసులో
అబ్బ! వంటలు భలే ఉన్నాయండి..అంటూ అతిథులు లొట్టలేసుకుంటూ తింటూ ఉంటే కష్టపడి వండిన వారి ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. కేరళలోని అలప్పూలో నివసించే మహిళ ఫిలోకు కూడా అంతే. పెళ్లిళ్లు, పేరంటాలు, పార్టీలు అంటే చాలు కష్టపడి వెజ్.. నాన్ వెజ్ పచ్చళ్లు తయారు చేసి ఇచ్చేసేది. ఆమె పికెల్స్కు విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే ఆమె చేతి మహిమను అర్థం చేసుకోవచ్చు. మధ్యలో ఆటంకాలొచ్చినా.. చివరికి భర్తకిచ్చిన మాట నెరవేర్చాలనే ఉద్దేశంతో వ్యాపారవేత్తగా మారిపోయింది. బెటర్ ఇండియా అందించిన వివరాల ప్రకారం స్టోరీ ఏంటంటే..ఫిలో ఇంటర్ అయిపోయిన వెంటనే ఒక ఇంటికి భార్యగా వెళ్లిపోయింది. చిన్నప్పటినుంచి వంటలు చేయడం ఆసక్తి. ఇక పచ్చళ్లలో ఆమె చేయని ప్రయోగం లేదని చెప్పవచ్చు. అలాగే ఏదైనా చేయాలనే గాఢమైన కోరిక ఉండేది. ఆ కోరికతోనే 2015లో భర్త, కోడలు టిన్సీ సాయంతో ఊరగాయ వ్యాపారాన్ని మొదలు పెట్టింది. కానీ మొదట్లో పెద్దగా విజయంసాధించలేదు. మళ్లీ తిరిగి కోడలి సహకారంతో ఫిలో 60 ఏళ్ల వయసులో వ్యాపారవేత్తగా అవతరించింది. అత్తాకోడళ్లు ద్వయం విజయవంతంగా వ్యాపారాన్ని నడిపించారు. View this post on Instagram A post shared by മുഹമ്മ ക്കാരൻ (@muhammakkar)కేవలం ఫేస్బుక్ పేజీతో చిన్న స్థాయిలోనే వ్యాపారాన్ని ప్రారంభించారు. చికెన్, స్వీట్ లైమ్, బీఫ్ వంటి రెండు మూడు రకాల ఊరగాయలను విక్రయించేవారు. కేవలం నోటి మాట ద్వారానే అయినా వ్యాపారం బాగానే సాగింది. మళ్లీ అనుకోకుండా భర్త థామస్ అనారోగ్యం కారణంగా వ్యాపారాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. కేన్సర్‌తో బాధపడుతూ మూడు నెలలు ఆయన ఆసుపత్రికి పరిమితమయ్యారు. ఆ తరువాత కూడా చికిత్స కోసం తరచుగా వెల్లూరుకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో వ్యాపారం ముందుకు సాగలేదు. ఇదంతా గమనించిన థామస్ తన భార్యకు ఒకటే మాట చెప్పారు. ‘ఫిలో.. నీలో చాలా టాలెంట్ ఉంది. నీ పచ్చళ్లు అందరికీ నచ్చుతాయి. ఆ సామర్థ్యం నీ దగ్గర ఉంది. వ్యాపారాన్ని కొనసాగించు. ఏదో ఒకరోజు కచ్చితంగా నువ్వు గొప్పదానివి అవుతావు. నామాట విను’’ అంటూ తన కోరికను వెల్లడించారు.ఆ మాటలే వేదమంత్రాలయ్యాయి. ఈ సారి పకడ్బందీగా రంగంలోకి దిగారు అత్తాకోడళ్లు. 2018లో కొత్త అవతార్‌లో లోగో, ప్యాకేజింగ్ మార్చేసి, ‘ఫిలోస్ పికిల్స్’ స్టార్ట్ చేశారు. దీనికి తోడు ముఖ్యమైన FSSAI (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఫుడ్ లైసెన్స్ తెచ్చుకున్నారు. 10వేల రూపాయల పెట్టుబడితో మళ్లీ పచ్చళ్ల తయారీ మొదలు పెట్టారు. స్థానిక సూపర్ మార్కెట్లకు అందించే వారు. ఇది ప్రచారానికి బాగా ఉపయోగపడింది. ఫుడ్ బ్లాగర్ మృణాల్ దాస్ వెంగలాట్ 2019లో వారి ఉత్పత్తుల గురించి ఒక వీడియోను పోస్ట్ చేసారు. ఇది మంచి ఆర్డర్లను తెచ్చిపెట్టింది. దీంతో ఒక ఇన్‌స్టా పేజీని కూడా స్టార్ట్ చేశారు. ఇక అప్పట్నించి విదేశాలకు సైతం రుచికరమైన పచ్చళ్లను సరఫరా చేస్తూ వ్యాపారంలో రాణిస్తున్నారు. రొయ్యల ఊరగాయ, చేపలు, మాంసం ఊరగాయలు, చెమ్మీన్ చమ్మంతి పొడి (ఎండిన రొయ్యల పొడి) బెస్ట్ సెల్లర్స్‌గా నిలిచాయి. మామిడి, నిమ్మకాయ. సీజన్ల వారీగా, అనేక కూరగాయల ఊరగాయలను కూడా తయారు చేస్తారు. చాలా శ్రద్ధగా ప్రేమతో పచ్చళ్లు తయారు చేస్తాం అంటారు ఫిలో. ‘‘జీవితం అంతా బాధ్యతలతోనే గడిచిపోయింది. 60 ఏళ్లు దాటాక విసుగు, అలసట వస్తుంది..దీంతో ఈ వయసులో ఏం చేస్తాంలే అనుకుంటాం. కానీ ఈ ధోరణి మారాలి. మన నైపుణ్యంపై దృష్టి పెట్టాలి. అలా నేను ఫిలోస్ ప్రారంభించాక, ఒత్తిడి, ఆందోళన మాటుమాయమైంది. కొత్త ఉత్సాహం వచ్చింది. గౌరవం, ప్రేమ లభిస్తోంది’’ అంటారామె ఆ స్వర్గంనుంచి తన భర్త కేజే థామస్ తనను, తన విజయాన్ని చూస్తూ ఉంటాడనే ఆశతో. -
ఆవురావురుగా... కమ్మని ఆవకాయ!
ఎండాకాలం... మే నెల సగం అయిపోయింది. మామిడి కాయలు టెంక కట్టి ఎదురు చూస్తున్నాయి. జాడీలు స్నానాలు చేసి ఎండలో సేదదీరుతుంటాయి. ఇంట్లో మిక్సీలు గిర్ర్ర్ అంటూ గోల చేస్తుంటాయి. మామిడి కాయలు కొట్టే కత్తి పుల్లబారి పదునుదేలింది. ముక్కలు కొట్టండి... పళ్లెంలో వేయండి... కారం కలపండి. జాడీలకెత్తండి... పళ్లెంలో వేడి వేడి అన్నం వేసి కలపండి. ఇంటిల్లిపాదీ ఆవురావురుమని తినకపోతే అడగండి.ఆంధ్రా ఆవకాయ..కావలసినవి..పచ్చి మామిడి ముక్కలు – కేజీ;పచ్చి శనగలు – 50 గ్రాములు;సన్న ఆవాలు –పావు కేజీ;మెంతులు – రెండు టేబుల్ స్పూన్లు;గుంటూరు మిరపపొడి –పావు కేజీ;ఉప్పు – నూట యాభై గ్రాములు;పసుపు – టేబుల్ స్పూన్;నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె –పావు కేజీ.తయారీ..ఆవకాయ పెట్టడానికి ముందు రోజు మిరపకాయలు, ఆవాలు, మెంతులను విడిగా ఎండబెట్టాలి. మరునాడు ఉదయం ఆవాలను మిక్సీలో పొడి చేయాలి. మిరపపొడి రెడీమేడ్ది కూడా తీసుకోవచ్చు. కానీ ఆవాలు స్వయంగా చేసుకోవాలి.మామిడి కాయలను కడిగి తేమపోయే వరకు తుడిచి ఆరబెట్టాలి. బాగా ఆరిన తర్వాత కాయలకున్న తొడిమ తొలగించాలి.అప్పటికీ సొన కారుతుంటే శుభ్రమైన నూలు వస్త్రంతో తుడిచేయాలి. ఇలా సిద్ధం చేసుకున్న మామిడికాయలను టెంకతో సహా చిన్న ముక్కలు చేసుకోవాలి.శనగలను శుభ్రమైన వస్త్రంతో తుడిచి పక్కన పెట్టాలి.వెడల్పుగా ఉన్న పెద్దపాత్రలో మామిడి ముక్కలు వేయాలి. అందులో శనగలు, ఆవాల పొడి, మిరపపొడి, ఉప్పు, పసుపు వేసి అట్లకాడతో బాగా కలపాలి.మెంతులు కూడా వేసి బాగా కలపాలి. చివరగా నూనెపోసి ముక్కలకు ఒత్తిడికి కలగకుండా అడుగు నుంచి కలిపితే ఆవకాయ రెడీ. దీనిని పింగాణి జాడీలో పెట్టి అంచులకు తెల్లని శుభ్రమైన నూలు వస్త్రాన్ని కట్టాలి.ఆ పైన మూత పెట్టాలి. ఈ జాడీలోని ఆవకాయను రోజూ మూత తీయకూడదు. రోజువారీ వాడుకకు అవసరమైనంత చిన్న జాడీలోకి తీసుకుంటూ ఉంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.బెల్లం ఆవకాయ..కావలసినవి..మామిడి ముక్కలు – అర కేజీ; బెల్లం – అర కేజీ;మిరపపొడి– 200 గ్రాములు;ఉప్పు – 200 గ్రాములు;ఆవపిండి– 100 గ్రాములు;నూనె – 200 గ్రాములు.తయారీ..మామిడి కాయలను శుభ్రంగా కడిగి తుడిచి టెంకతో సహా ముక్కలు చేసుకోవాలి.బెల్లాన్ని తురిమి వెడల్పుపాత్రలో వేసి అందులో మామిడికాయ ముక్కలు, ఆవపిండి, మిరపపొడి, ఉప్పు, కప్పు నూనె వేసి కలపాలి.ఈ మిశ్రమాన్ని రెండు రోజులపాటు ఎండలో పెట్టాలి. బెల్లం కరిగిపాకంలా జిగురుగా వచ్చినట్లనిపిస్తే సరే, లేకపోతే మూడవ రోజు కూడా ఎండలో పెట్టాలి.పాకం వచ్చిన తర్వాత మిగిలిన నూనె కూడా వేసి బాగా కలిపి జాడీలోకి తీసుకోవాలి.ఈ బెల్లం ఆవకాయను పిల్లలు బాగా ఇష్టపడతారు. ఐరన్ రిచ్ ఫుడ్ కాబట్టి మహిళలు రోజూ తీసుకోవచ్చు.నువ్వుల ఆవకాయ..కావలసినవి..మామిడి కాయ ముక్కలు – 3 కప్పులు;నువ్వులు – ఒకటిన్నర కప్పులు;మిరపపొడి– ముప్పావు కప్పు;ఉప్పు–పావు కప్పు;పసుపు – అర టీ స్పూన్;వేరు శనగ నూనె – ఒకటిన్నర కప్పులు.తయారీ..నువ్వులను తయారీ దోరగా వేయించి చల్లారిన పొడి చేయాలి.మామిడి ముక్కలను వెడల్పుపాత్రలో వేసి అందులో నువ్వుల పొడి, మిరపపొడి, ఉప్పు, పసుపు వేసి అట్లకాడతో బాగా కలపాలి.ఉప్పు, కారం, నువ్వుపిండి సమంగా కలిసిన తర్వాత కప్పు నూనెపోసి మళ్లీ కలపాలి.ఈ మిశ్రమాన్ని జాడీలోకి తీసుకుని, మిగిలిన నూనెను పైన తేలేటట్లుపోయాలి.ఇందులో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వెల్లుల్లి ఆవకాయ..కావలసినవి..మామిడి కాయ ముక్కలు –పావు కేజీ లేదా (మీడియం సైజు కాయలు 3);వెల్లుల్లి – 200 గ్రాములు;ఉప్పు – 100 గ్రాములు;మిరపపొడి– 200 గ్రాములు;ఆవాలు – 150 గ్రాములు (ఎండబెట్టి పొడి చేయాలి);పసుపు – టీ స్పూన్;మెంతులు – టేబుల్ స్పూన్;నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె – కిలో.తయారీ..ఒకపాత్రలో నూనెపోసి మామిడి ముక్కలను వస్త్రంతో తుడిచి నూనెలో వేయాలి.వెల్లుల్లిపాయలను పొట్టు వలిచి ఒక ప్లేట్లో వేసి గాలికి ఆరనివ్వాలి.మరొకపాత్రలో మిరపపొడి, ఆవపిండి, ఉప్పు, పసుపు, మెంతులు వేసి సమంగా కలిసేవరకు కలపాలి. ఇప్పుడు వెల్లుల్లి రేకలను వేసి కలపాలి.మామిడి ముక్కల లోని నూనెను ఒక జాడీలోకి వంపాలి. ఇప్పుడు మామిడి ముక్కలలో ముందుగా కలిపి సిద్ధంగా ఉంచిన ఉప్పు, వెల్లుల్లి ఇతర పొడుల మిశ్రమాన్ని వేసి పొడులన్నీ మామిడి ముక్కలకు పట్టేలా కలపాలి.మామిడి ముక్కలను పట్టి ఉన్న నూనె ఈ పొడులను పీల్చుకుని కొంత తడి పొడిగా మారుతుంది.ఈ మిశ్రమాన్ని నూనె వంపుకున్న జాడీలో వేసి అదమాలి.నూనె పైకి తేలుతుంది. వెల్లుల్లి బ్లడ్ థిన్నర్. రక్తాన్ని పలచబరిచి రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా నివారిస్తుంది. కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ హాయిగా తినవచ్చు. -
సమ్మర్ సీజన్ కదా అని.. తొందరపడి పచ్చళ్లు పెట్టేస్తున్నారా!
మామిడి కాయల సీజన్ కదా.. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా మామిడి కాయలు కనిపిస్తున్నాయి. అలాగని తొందరపడి ఆవకాయ, మాగాయ పెట్టేయకూడదు. ఎందుకంటే ఎండలు ఇంకాస్త ముదరాలి. ఎండలతోపాటే మామిడి కాయలు కూడా బాగా టెంకపట్టాలి. అప్పుడయితేనే ఏడాదంతా నిల్వ ఉంటుంది ఆవకాయ. అయితే అప్పటిదాకా చూస్తూ ఊరుకోవాలా? ఏమక్కరలేదు. ఆవకాయ పెట్టేలోగా రెండు మూడు వారాల నుంచి నెలరోజుల దాకా తాజాగా ఉండే ఈ పచ్చళ్లు ట్రై చేద్దామా మరి! మ్యాంగో ఇన్స్టంట్ పికిల్.. కావలసినవి: పచ్చి మామిడికాయ – ఒకటి; కశ్మీర్ మిరప్పొడి – టేబుల్ స్పూన్; నువ్వుల నూనె– 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు– టీ స్పూన్; మెంతులు – అర టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; ఇంగువ – పావు టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్. తయారీ.. మామిడికాయను శుభ్రంగా కడిగి తుడిచి, సొన పోయేటట్లు తొడిమను తొలగించాలి. గింజను తొలగించి, తొక్కతో సహా ముక్కలు తరగాలి. ముక్కలకు ఉప్పు కలిపి పక్కన పెట్టాలి. సుమారు ఒక కప్పు ముక్కలు వస్తాయి. బాణలిలో మెంతులు వేసి (నూనె లేకుండా) దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అదే బాణలిలో నువ్వుల నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఇంగువ, మెంతిపొడి, మిరప్పొడి, పసుపు వేసి స్టవ్ ఆపేయాలి. వేడి తగ్గిన తర్వాత ఈ పోపును మామిడి ముక్కల్లో వేసి కలపాలి. అరగంట సేపటికి ఉప్పు, కారం, మసాలా దినుసుల రుచి ముక్కలకు పడుతుంది. ఈ పచ్చడిని తేమ లేని పాత్రలో నిల్వ చేసుకుంటే నాలుగు రోజుల వరకు తాజాగా ఉంటుంది. చనా మేథీ మ్యాంగో పికిల్.. కావలసినవి: పచ్చి మామిడి ముక్కలు – కప్పు; మామిడి తురుము – కప్పు; పచ్చి శనగలు – అర కప్పు; మెంతులు – అర కప్పు; ఆవాలు›– అర కప్పు; ఉప్పు – అర కప్పు; మిరప్పొడి– అర కప్పు, నూనె – కప్పు. తయారీ.. మందపాటి బాణలి వేడి చేసి పచ్చి శనగపప్పును దోరగా వేయించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత మెంతులు, ఆవాలను (నూనె లేకుండా) వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో మామిడి ముక్కలు, మామిడి తురుమును వేయాలి. అందులో శనగలు, మెంతిపొడి, ఆవపిండి, మిరప్పొడి, ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తడిలేని సీసాలో కూరినట్లు పెట్టి గట్టిగా మూతపెట్టాలి. మూడు రోజుల తర్వాత నూనెను మరిగించి చల్లార్చిన తర్వాత ఆ నూనెను సీసాలో ఉన్న మిశ్రమం పై నుంచి పోయాలి. ఈ పచ్చడిని మూడు రోజుల తర్వాత తినవచ్చు. నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇది గుజరాతీ శైలి మామిడి పచ్చడి. మామిడి తురుము పచ్చడి.. కావలసినవి: మామిడి తురుము – 2 కప్పులు; మిరప్పొడి– పావు కప్పు; ఉప్పు – పావు కప్పు; ఆవ పిండి– టేబుల్ స్పూన్; మెంతిపిండి– టేబుల్ స్పూన్; వెల్లుల్లి రేకల తురుము – టేబుల్ స్పూన్; నల్లజీలకర్ర (కలోంజి) – అర టీ స్పూన్; మెంతులు – టీ స్పూన్; ఇంగువ – అర టీ స్పూన్; ఆవ నూనె – పావు కప్పు; పసుపు – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్. తయారీ.. మామిడి తురుములో పసుపు, ఉప్పు, వెల్లుల్లి, కలోంజి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. బాణలి వేడి చేసి (నూనె లేకుండా) మెంతులు, జీలకర్ర వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేసి మామిడి తురుములో వేసి కలపాలి. ఇప్పుడు మామిడి తురుములో ఆవపిండి, మెంతిపిండి, మిరప్పొడి, నూనె వేసి కలిపి ఉప్పు సరి చూసుకోవాలి. అవసరమైతే మరికొంత ఉప్పు కలుపుకోవచ్చు. ఇది నాలుగు రోజుల నుంచి వారం వరకు తాజాగా ఉంటుంది. మామిడి తురుమును పలుచని వస్త్రంలో కట్టి నీరు పోయేటట్లు చేసిన తర్వాత మసాలా దినుసులు కలిపి, నూనె పైకి తేలేటంత మోతాదులో పోసినట్లయితే ఆ పచ్చడి నెలలపాటు నిల్వ ఉంటుంది. -
‘మామ్ మ్యాజిక్ పికెల్ ఇండియా’ గా.. సరోజ్ ప్రజాపతి
"మధ్యప్రదేశ్‌కు చెందిన సరోజ్ ప్రజాపతికి వీరాభిమానులు ఉన్నారు. అలా అని ఆమె సెలబ్రిటీ కాదు. ‘ఆమె పచ్చడి చేస్తే పండగే’ అన్నట్లుగా ఉండేది. తనలోని టాలెంట్‌ను ‘ఎంటర్ ప్రెన్యూర్షిప్’లోకి కన్వర్ట్ చేసి, 19 సంవత్సరాల కుమారుడితో కలిసి ‘మామ్ మ్యాజిక్ పికెల్ ఇండియా’ను స్టార్ట్ చేసింది. నెలకు రెండు లక్షల రూపాయల వరకు సంపాదిస్తోంది. 30 మంది మహిళలకు ఉపాధిని ఇస్తోంది." మధ్యప్రదేశ్‌లోని షాదోర అనే గ్రామంలో తన ఇంటిలో కాలక్షేపం కోసం టీవీ చానల్స్ మారుస్తోంది సరోజ్. ఈ క్రమంలో ఆమె దృష్టి ఒక బిజినెస్ ప్రోగ్రాంపై పడింది. పచ్చళ్ల వ్యాపారంలో విజయం సాధించిన బిహార్‌లోని ఇద్దరు మహిళలకు సంబంధించిన ప్రోగ్రాం అది. ఈప్రోగ్రాం ఆసక్తిగా చూస్తున్నప్పుడు ‘నేను మాత్రం వ్యాపారం ఎందుకు చేయకూడదు!’ అనుకుంది తనలో తాను. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సరోజ్‌కు ‘శభాష్’ అని అందరూ అభినందించే పని ఏదైనా చేయాలనే కోరిక ఎప్పటినుంచో ఉండేది. కాని దారి ఏమిటో తెలిసేది కాదు. ‘దారి ఏమిటో తెలియాలి అంటే ముందు నీలో ఉన్న శక్తి ఏమిటో నీకు తెలియాలి’ అంటారు పెద్దలు. టీవీప్రోగ్రాం తనలోని శక్తి, నైపుణ్యాన్ని గుర్తు తెచ్చింది. కుమారుడు అమిత్ ప్రజాపతితో తనకు వచ్చిన ఆలోచనను చెప్పింది సరోజ్. పందొమ్మిది సంవత్సరాల అమిత్ ‘బ్రాండ్ బిల్డింగ్’ అనే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నడుపుతున్నాడు. ‘మనకెందుకమ్మా వ్యాపారం. పెద్ద రిస్క్’ అనే మాట అమిత్ నోట వినిపించి ఉంటే కథ కంచికి వెళ్లి ఉండేది. గత సంవత్సరం ‘మామ్స్ మ్యాజిక్ పికిల్ ఇండియా’ పేరుతో ఊరగాయల వ్యాపారం మొదలుపెట్టింది సరోజ్. ‘మామ్స్ మ్యాజిక్ పికిల్ ఇండియా బ్రాండ్’ గురించి సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టాడు అమిత్. ఆన్లైన్, ఆఫ్‌లైన్ డిమాండ్ల నేపథ్యంలో తమ ఇల్లు చాలదని దగ్గరలోని పెద్ద స్థలంలో ఊరగాయలు తయారు చేయడం ప్రారంభించారు. ‘అమ్మ దగ్గర సంప్రదాయ వంటకాలతో పాటు ఊరగాయలు తయారు చేయడం నేర్చుకున్నాను. అది నన్ను వ్యాపారవేత్తను చేస్తుందని ఊహించలేదు. ఫస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది మామిడి కాయలు, కూరగాయలను స్థానికంగా కొనుగోలు చేస్తాను. ఊరగాయల తయారీలో రసాయనాలను ఉపయోగించం.’ అంటుంది సరోజ్. ‘మామిడి సీజన్లో మా ఇంటికి వచ్చే బంధువులు, స్నేహితులు వెళుతున్నప్పుడు ఊరగాయ జాడీని తీసుకువెళతారు. ఊరగాయ రుచి చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతం అంటారు. ఇది గుర్తు తెచ్చుకొని మామ్ పికెల్స్ అనేది పర్ఫెక్ట్ బిజినెస్ ఛాన్స్ అనుకున్నాను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లలో మా బిజినెస్‌కు సంబంధించిన పేజీలను క్రియేట్ చేశాను. మంచి స్పందన వచ్చింది. జాడీలను కొని లేబుల్స్ ప్రింట్ చేయించాను. మధ్యప్రదేశ్ నుంచే కాదు దేశం నలుమూలల నుంచి ఆర్డర్లు రావడం మొదలైంది’ అంటాడు అమిత్. పదిహేను సంవత్సరాల వయసులో తొలిసారిగా పచ్చి మామిడి కాయ పచ్చడి తయారు చేసి ఇంటిల్లిపాది ‘అద్భుతం’ అనేలా చేసింది సరోజ్. ఆనాటి ‘అద్భుతం’ ఇప్పటికీ అద్భుతాలు చేయిస్తూనే ఉంది. కేవలం మామిడికాయ ఊరగాయలతో మొదలైన వ్యాపారం అనతికాలంలోనే పచ్చిమిర్చి, నిమ్మకాయ, మిక్స్డ్ వెజిటబుల్... మొదలైన వాటిలోకి విస్తరించింది. అమ్మ చేతి నైపుణ్యానికి కుమారుడి డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ తోడు కావడంతో త్వరలోనే వ్యాపారం మంచి ఊపందుకుంది. నా కుటుంబం నా బలం! కుటుంబ సహాయసహకారాలు తోడైతే అవలీలగా విజయం సాధించవచ్చు అని చెప్పడానికి నేనే ఉదాహరణ. ఊరగాయల వ్యాపారం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మా ఆయన, అబ్బాయి ప్రోత్సాహకంగా మాట్లాడారు. ‘నువ్వు రుచి మీద దృష్టి పెట్టు చాలు. మిగిలినవి మేము చూసుకుంటాం’ అని ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించారు. ఒక టీవీ ప్రోగ్రాంలో విజేతల మాటలు విని ఆ స్ఫూర్తితో నేను కూడా వ్యాపారంలోకి దిగాను. దీనికి కారణం అప్పటికప్పుడు వచ్చిన ఉత్సాహం కాదు. నాకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి అనే పట్టుదల. నా వల్ల ఇతర మహిళలు కూడా ఉపాధి పొందడం సంతోషంగా ఉంది. – సరోజ్ ప్రజాపతి ఇవి చదవండి: Ameen Sayani: పాటల పూలమాలి వెళ్లిపోయాడు..! -
క్యాన్సర్ ముప్పుని తగ్గించే ఉసిరి.. పచ్చడి పెట్టుకోండిలా
తిన్న తిండి ఒంటికి పట్టేలా చేయడంతో ఉసిరి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచడం, క్యాన్సర్ ముప్పుని తగ్గించడంలో ఉసిరి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇన్ని సుగుణాలు ఉన్న ఉసిరి ప్రస్తుతం మార్కెట్లో దండిగా దొరుకుతోంది. అందుకే ఊరించే ఉసిరిని మరింత రుచిగా ఇలా చేసుకోమని చెబుతోంది ఈ వారం మన వంటిల్లు... స్పైసీ పచ్చడి తయారికి కావలసినవి: ఉసిరికాయలు – ఆరు; పచ్చి శనగపప్పు – పావు కప్పు; పచ్చిమిర్చి – మూడు; వెలుల్లి రెబ్బలు – నాలుగు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – టీస్పూను; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీస్పూను; పసుపు – పావు టీస్పూను; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెండు రెమ్మలు; కొత్తిమీర తరుగు – కాస్తంత తయారీ విధానమిలా: పచ్చిశనగపప్పుని శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ∙ఉసిరికాయలను శుభ్రంగా కడిగి గింజలు తీసేసి ముక్కలుగా తరుగుకోవాలి. ∙ఉసిరికాయ ముక్కలు, నానిన శనగపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లుపోసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ అయిన పచ్చడిని గిన్నెలోకి తీసుకోవాలి ∙బాణలిలో నూనె వేసి, ఆవాలు జీలకర్ర, ఇంగువ, పసుపు, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి ∙ఈ తాలింపుని పచ్చడిలో వేసి కలపాలి. చివరిగా కొత్తిమీర తరుగు వేసి కలిపితే స్పైసీ పచ్చడి రెడీ. చపాతీ, రోటీ, అన్నంలోకి ఈ పచ్చడి చాలా బావుంటుంది. -
నోరూరించే రొయ్యల పచ్చడి ఇలా చేస్తే..చక్కగా లాగించేస్తారు!
రొయ్యల పచ్చడికి కావలసినవి: ఎండు రొయ్యలు – కప్పు ఉల్లిపాయ – ఒకటి పచ్చిమిర్చి – ఐదు నూనె – టేబుల్ స్పూను కొత్తిమీర – పావు కప్పు జీలకర్ర – టేబుల్ స్పూను వెల్లుల్లి రెబ్బలు – పది ధనియాల పొడి – టేబుల్ స్పూను కారం – టేబుల్ స్పూను గరంమసాలా పొడి – అరటేబుల్ స్పూను. తయారీ విధానం: రొయ్యల తల, తోక తీసేసి పది నిమిషాలు నానబెట్టుకోవాలి నానిన రొయ్యలను ఇసుక లేకుండా శుభ్రంగా కడిగి నీరు లేకుండా పిండాలి∙ ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా తరిగి బాణలిలో వేయాలి∙ పచ్చిమిర్చిని కూడా దోరగా వేయించి తీసేయాలి∙ ఇదే బాణలిలో నూనె వేయాలి. కాగిన నూనెలో పిండిపెట్టుకున్న రొయ్యలను వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించాలి ఇప్పుడు మిక్సీజార్‌లో వేయించిన ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, వేయించిన రొయ్యలు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే రొయ్యల పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. (చదవండి: పిల్లల ఎముకలు బలంగా పెరగాలంటే..) -
చపాతీలోకి సూపర్ కాంబినేషన్.. సగ్గుబియ్యం పచ్చడి
సగ్గుబియ్యం పచ్చడి తయారీకి కావల్సినవి సగ్గుబియ్యం – అరకప్పు; పెరుగు – రెండున్నర కప్పులు; అల్లం తురుము –టేబుల్ స్పూను; క్యారట్ తురుము – రెండు టేబుల్ స్పూన్లు; ఆవాలు – టీస్పూను; జీలకర్ర – టీస్పూను; పచ్చిశనగపప్పు –టీస్పూను; పసుపు – అరటీస్పూను; కొత్తిమీర తరుగు – పావు కప్పు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – మూడు టీస్పూన్లు; కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – చిటికెడు. తయారీ విధానమిలా: ►సగ్గుబియ్యాన్ని పదినిమిషాల పాటు మీడియం మంట మీద వేయించి పక్కన పెట్టుకోవాలి. ► సగ్గుబియ్యం చల్లగా అయిన తరువాత పెరుగు వేసి కలపాలి. పెరుగు చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లుపోసుకోని ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి. ► సగ్గుబియ్యం పట్టుకుంటే మెత్తగా అయ్యేంతవరకు నానాక... కొత్తిమీర తరుగు , రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి ► బాణలిలో నూనెవేసి, వేడెక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి వేయించాలి. ► ఇవన్నీ వేగిన తరువాత పసుపు, ఇంగువ, క్యారట్ తరుగు వేసి నిమిషం పాటు వేయించి తీసేయాలి ► ఈ తాలింపు మిశ్రమాన్ని సగ్గుబియ్యం మిశ్రమంలో వేసి కలిపితే సగ్గుబియ్యం పచ్చడి రెడీ. అన్నం, చపాతీల్లోకి ఈ చట్నీ మంచి కాంబినేషన్. -
ఆరోగ్యానికి చాలా మంచిది.. కరివేపాకుతో పచ్చడి, టిఫిన్స్‌లో బావుంటుంది
కరివేపాకు పచ్చడి తయారీకి కావల్సినవి: కరివేపాకులు – రెండు కప్పులు; ఎండుమిర్చి – 10; చింతపండు – పెద్ద ఉసిరికాయ అంత పరిమాణం; పొట్టుతీసిన మినపగుళ్లు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; నువ్వులు – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; పచ్చికొబ్బరి తురుము – ముప్పావు కప్పు; బెల్లం – టేబుల్ స్పూను; ఉప్పు రుచికి సరిపడా. తయారీ విధానమిలా: ►బాణలిలో నూనెవేసి కాగనివ్వాలి. కాగిన నూనెలో మినపగుళ్లు, ఎండు మిర్చి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ► ఇదే బాణలిలో నువ్వులు వేసి దోరగా వేయించాలి. ఇవి వేగిన తరువాత కరివేపాకు ఆకులు, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించాలి. ► కరివేపాకు వేగిన తరువాత దించేసి, కొబ్బరి తురుము వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ► కరివేపాకు మిశ్రమం వేడి తగ్గిన తరువాత బెల్లం వేసి మెత్తగా నూరుకుంటే కరివేపాకు పచ్చడి రెడీ. అన్నం, చపాతీ, ఇడ్లీ, దోశల్లోకి బావుంటుంది. -
టిఫిన్స్‌లోకి నిమ్మకాయ ఇన్స్టంట్ పచ్చడి.. ఇలా చేసుకోండి
ఉల్లి, పల్లి, కొబ్బరి, వెల్లుల్లి, పుట్నాల పచ్చళ్లు తినితిని చప్పగా మారిన నాలుకకు ఊరించే చట్నీలు కనిపిస్తే ప్రాణం లేచివస్తుంది. అందుకే చూడగానే నోరూరించే చట్నీలతో ఈ వారం వంటిల్లు మీకోసం... నిమ్మకాయ ఇన్స్టంట్ పచ్చడి తయారికి కావల్సినవి: నిమ్మకాయలు – పది; బెల్లం – అరకప్పు; జీలకర్ర – నాలుగు టీస్పూన్లు; ఎండు మిర్చి – ఇరవై; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: ►నిమ్మకాయలను నాలుగు ముక్కలుగా కట్ చేయాలి.ముక్కల్లో ఉన్న గింజలన్నింటినీ తీసేయాలి (గింజలు ఉంటే పచ్చడి చేదుగా వస్తుంది). ► నిమ్మకాయ ముక్కలు, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా పేస్టుచేయాలి ► ఎండు మిర్చి, బెల్లంను కలిపి పొడిచేయాలి ∙ఇప్పుడు నిమ్మకాయ పేస్టులో ఎండుమిర్చి పొడి, రుచికి సరిపడా ఉప్పువేసి కలపాలి. ► తాలింపు కావాలంటే వేసుకోవచ్చు. తాలింపు లేకపోయినా బావుంటుంది. ► ఈ చట్నీని వెంటనే కూడా తినవచ్చు. కానీ రెండుమూడు రోజులు మాగాక మరింత రుచిగా ఉంటుంది. ► ఇడ్లీ,దోశ, పరాటా, చపాతీ, అన్నంలోకి ఈ చట్నీ చాలా బావుంటుంది. -
R Rajeshwari: కాదేది ఉపాధికనర్హం!
గృహిణిగా ఇంటి బాధ్యతలు మహిళలకు ఎలాగూ తప్పదు. ఇక ఆదాయ మార్గం గురించి ఆలోచించడం, వాటిని అమలులో పెట్టడం అంటే తగిన వనరులే కాదు ఇంటిల్లిపాదీ అందుకు సహకరించాలి. హైదరాబాద్ బండ్లగూడ నాగోల్‌లో ఉంటున్న ఆర్.రాజేశ్వరి ని కలిసినప్పుడు ‘పదేళ్లుగా చేస్తున్న పచ్చళ్లు, పొడుల వ్యాపారం... ఆదాయంతో పాటు బిజినెస్ ఉమన్‌గానూ గుర్తింపును తెచ్చిపెట్టింది’ అని వివరించింది. ‘మన ఇళ్లల్లో అన్ని కాలాల్లోనూ ఏవో ఒక పచ్చళ్లు పెట్టడం అనేది గృహిణులకు అలవాటైన పనే. ఇంట్లో నేనూ అలాగే చేస్తుండేదాన్ని. నా చేతి పచ్చళ్లు రుచికరంగా ఉంటాయని ఇంట్లోనూ, బంధుమిత్రులు, చుట్టుపక్కల వాళ్లు బాగా మెచ్చుకునేవారు. అడిగి మరీ చేయించుకునేవారు. దీనికితోడు నాకు తెలిసిన వాళ్లు విదేశాలకు వెళ్లినప్పుడు తమకు నచ్చిన పచ్చడి, పొడులు తయారు చేసిమ్మని అడిగేవారు. పదేళ్ల క్రితం... నోటి మాటతోనే ఒకరొకరుగా పచ్చళ్లు చేసిమ్మని అడిగేవారి సంఖ్య పెరగడం మొదలయ్యింది. దీనినే చిన్న వ్యాపారంగా మార్చుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను. మా ఊరు గుంటూరుకు వెళ్లినప్పుడల్లా అక్కడ రైతుల దగ్గరకు వెళ్లి, కావల్సిన సరుకులను నేరుగా పొలాల నుంచే సేకరించేదాన్ని. ఒకటే నియమం పెట్టుకున్నాను. కేవలం వెజ్ పచ్చళ్లును మాత్రమే పెట్టాలి. అలాగే, రసాయనిక ఎరువు వాడకుండా పండించిన ఆర్గానిక్ పంటల నుంచే సేకరించాలనుకున్నాను. నేరుగా రైతులను కలిసి, వారి ద్వారా పంటలను కొనుగోలు చేయడం, వాటిని బాగుచేయించి, తీసుకురావడమూ పెరిగింది. మిర్చి, పసుపు, మసాలా దినుసులు వంటివి ఏయే ప్రాంతాల్లో ఏయే ఏవి అధికంగా పండుతాయో తెలుసుకుని, ఆ దినుసులను సేకరిస్తూ ఉంటాను. ఒక్కరిగానే... మొదట్లో ఒక్కదాన్నే పచ్చళ్లకు అవసరమైనవన్నీ ఏర్పాటు చేసుకునేదాన్ని. అందుకు తగిన పనుల ప్లానింగ్ కూడా చేసుకున్నాను. మెల్లగా మార్కెట్ పెరుగుతుండటంతో సాయానికి మరొకరిని నియమించుకుని, పనులు చేస్తూ వచ్చాను. కామాక్షి ఫుడ్స్ పేరుతో పదేళ్ల క్రితం ఈ వ్యాపారాన్ని రిజస్టర్ చేయించుకొని, ఇప్పుడు నాతోపాటు మరో ముగ్గురు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాను. మొదట్లో అంతగా తెలియకపోయినా మార్కెట్ గురించి నాకు నేనుగానే ఓ అంచనా వేసుకుంటూ షాప్స్, ఆన్లైన్ ద్వారా వచ్చిన ఆర్డర్ల ద్వారానూ పచ్చళ్లు సిద్ధం చేస్తుంటాను. టొమాటో, గోంగూర, మాగాయ, నిమ్మకాయ, చింతకాయ.. వంటి పచ్చళ్లు, పొడుల తయారీ రోజూ ఉంటుంది. రోజూ ఉదయం నాలుగు గంటల నుంచే మొదలయ్యే నా దినచర్య తిరిగి, రాత్రి పదిగంటలకే పూర్తవుతుంది. నాకు ఇద్దరు పిల్లలు. మా వారు ఉద్యోగి. ఇల్లు, పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాను. ఏడాదికి ఇరవై లక్షల ఆదాయంతో ఈ మార్గం నాలో ఓ కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. నా చేత్తో నలుగురికి రుచికరమైన పచ్చళ్లను అందివ్వడమే కాదు, నాతో పాటు ఇంకొందరికి ఉపాధినివ్వడం సంతోషంగా ఉంది. ఆర్డర్లను బట్టి తయారీ విధానాన్ని ఎంచుకుంటాను కాబట్టి నష్టం అనే సమస్య ఎప్పుడూ రాలేదు. చేసే పనిలో ముందుగానే అంచనా ఉంటే అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఇంటితోపాటు సమర్థవంతంగా నిర్వర్తించే సత్తా మహిళలకెలాగూ ఉంటుంది’ అని వివరిస్తుంది రాజేశ్వరి. – నిర్మలారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
ధరల మంట, ఒక్కో మామిడికాయ రూ.10 పైనే.. పచ్చడి మెతుకులు కష్టమే!
సాక్షి, సిటీబ్యూరో: ఎండకాలం వచ్చిందంటే ఎవరింటా చూసినా మామిడికాయ పచ్చడి హడావిడి కనిపిస్తోంది. ఏడాదికి సరిపడా నిల్వ ఉండేలా పచ్చడిని తయారు చేసుకోవడం సర్వసాధారణం. అయితే ఈసారి మాత్రం ఏడాదికి తగ్గట్టుగా కొత్త ఆవకాయ పెట్టుకోవాలంటే జేబు చిలుము వదలాల్సిందే! పచ్చడికి ఇదే సీజన్ కావడంతో మామిడి కాయల అమ్మకాలతో మార్కెట్లు సందడిగా మారాయి. కాయలను ముక్కలు మొదలు మసాలా దినుసుల కొనుగోలు వరకు గృహిణులతో రాకతో మార్కెట్ కళకళలాడుతోంది. అయితే పచ్చడికి అవసరమైన సరుకులు ధరలు మాత్రం నింగినంటాయి. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా రెండింతలయ్యాయి. పచ్చడికి మూలమైన మామిడి కాయ ఒకటి రూ.10 పలికితే.. పెద్ద కాయ అయితే రూ.15–20 పలుకుతోంది. కాపు తక్కువగా ఉండడం వల్ల పచ్చడి కాయలకు డిమాండ్ పెరిగింది. దీంతో వీటి ధరలకు రెక్కలొచ్చాయి. ఇక మసాలా దినుసుల ధరలు సరేసరి. మిర్చి ధరలు గణనీయంగా పెరగడంతో కారంపొడి నిరుడితో పోలిస్తే రెట్టింపయింది. గతేడాది కిలో రూ.550 ఉండగా.. ఈసారి రూ.800 చేరుకుంది. మసాలాలు, కారమే కాదు అల్లం, వెల్లుల్లి ధరలు మూడింతలు పెరిగాయి. రిటైల్ మార్కెట్లో అల్లం కేజీ రూ. 180–200 కాగా వెల్లుల్లి కేజీ రూ.160 విక్రయిస్తున్నారు. అలాగే బ్రాండెడ్ వేరుశెనగ నూనె లీటర్ ప్యాకెట్ రూ.190–210, నువ్వుల నూనె కిలో రూ.410, మెంతిపొడి కిలో రూ.180, ఆవాలు కిలో 110, జీలకర్ర కిలో 600 రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి. దీంతో ఈసారి పెరిగిన ధరలు సామాన్య, పేద తరగతి ప్రజలకు పచ్చడి మెతుకులు కష్టంగానే కనిపిస్తున్నాయి. -
ఆవకాయ.. పచ్చడి తయారీ ఇలా! నూనెను మరిగించకుండా పచ్చిగా వేసినా
ఎండాకాలాన్ని వెంటాడుతూ వస్తుంది ఆవకాయ కాలం. మామిడి కాయలు చెట్టుకొమ్మలకు వేళ్లాడుతూ ఆకుల్లోంచి తొంగి చూస్తూ నోరూరిస్తుంటాయి. మామిడి కాయలతో చేసుకునే ఊరగాయలు పచ్చళ్లను చూద్దాం. నీళ్లూరుతున్న జిహ్వను లాలిద్దాం. ఆవకాయ కావలసినవి: ►మామిడికాయ ముక్కలు – 4 కప్పులు ►నూనె– 2 కప్పులు ►ఆవపిండి– కప్పు ►మిరప్పొడి– కప్పు (గుంటూరు కారం రుచికి బాగుంటుంది. కశ్మీరీ కారం వాడితే ఆకర్షణీయంగా కనిపిస్తుంది) ►ఉప్పు – కప్పు (కల్లుప్పును పొడి చేయాలి, టేబుల్ సాల్ట్ వేయాలనుకుంటే ముప్పావు కప్పు సరిపోతుంది) ►మెంతిపిండి – అర కప్పు ►వెల్లుల్లి రేకలు – అర కప్పు (పొట్టు వలిచినవి) ►ఆవాలు – పావు కప్పు. తయారీ: ►మామిడి కాయలను శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత పొడి వస్త్రంతో తుడవాలి. ►సొనపోవడానికి తొడిమలను తొలగించాలి. ►ఆ తర్వాత టెంకతో సహా ముక్కలు చేయాలి. ►మీడియం సైజు కాయను 12 ముక్కలు చేయవచ్చు. ►టెంకలోని గింజను తొలగించి, టెంకకు గింజకు మధ్య ఉండే పొరను కూడా తీసేసి ముక్కలను సిద్ధంగా పెట్టుకోవాలి. ►వెడల్పు పాత్ర తీసుకుని తేమలేకుండా శుభ్రంగా తుడిచి కొద్దిసేపు ఎండలో పెట్టాలి. ►ఆ తర్వాత ఆ పాత్రలో మిరప్పొడి, ఆవపిండి, మెంతి పిండి, ఉప్పు, వెల్లుల్లి రేకలు వేసి కలపాలి. ►అందులో మామిడికాయ ముక్కలను వేసి ఆవపిండి మిశ్రమం ముక్కలకు సమంగా పట్టే వరకు తడి లేని గరిటెతో కలపాలి. ►ఆవపిండి కారంలో ఉప్పు చూసుకుని రుచిని బట్టి అవసరమైతే కొద్దిగా కలుపుకోవాలి. ►బాణలిలో నూనె మరిగించి అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆపేయాలి. ►నూనె బాగా చల్లారిన తర్వాత ఆవకాయ ముక్కల్లో పోసి గరిటెతో కలపాలి. ►ఈ మిశ్రమాన్ని జాడీలో నింపాలి. ►ఆవకాయ మీద నూనె తేలుతూ ఉండాలి. గమనిక: నూనెను మరిగించకుండా పచ్చిగా కూడా వేసుకోవచ్చు. ఆవకాయ, ఇతర ఊరగాయలను నిల్వ చేసే జాడీలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి పది నిమిషాల సేపు ఎండలో ఉంచాలి. ఎండలో నుంచి తీసిన తర్వాత జాడీ వేడి తగ్గిన తరవాత మాత్రమే ఊరగాయలను నింపాలి. -
ఆవకాయబద్ద గొంతులో ఇరుక్కుని మహిళ పాట్లు! ఆశ్చర్యపోయిన వైద్యులు
ఆవకాయ పచ్చడి అంటే నోరూరని వారు ఎవరుంటారు. అలాంటి ఆవకాయ పచ్చడి ఒక మహిళను ఆస్పత్రి పాలయ్యేలా చేసింది. అసలేం జరిగిందంటే....ఇంగ్లాండ్‌కి చెందిన 57 ఏళ్ల మహిళ ఆవకాయ పచ్చడి వేసుకుని తింటున్నప్పుడూ పొరపాటున ఆవకాయ బద్ద గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆమె హుటాహుటినా ఇంగ్లాంగ్లోని ఎప్పమ్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులకు అసలు విషయం చెప్పి తాను తినలేకపోతున్నాను, మింగలేకపోతున్నానని వివరించింది. ఐతే వైద్యలు ఒక మెత్తని ఫ్రూట్ ఎలా ఇరుక్కుంటుందని కొట్టిపారేశారు. కానీ ఆ మహిళ తనకు చాలా ఇబ్బందిగా ఉందనడంతో.. ఆమెను పరీక్షించి చొంగకార్చుకునే అలావాటు ఉందని అందువల్ల మింగ లేకపోతుందని తేల్చి చెప్పారు. గొంతులో ఎలాంటిది ఇరుక్కోలేదని, గ్యాస్టిక్ సమస్య ఉన్నా ఇలానే ఉంటుందని అన్నారు వైద్యులు. ఒకవేళ నొప్పి మరింత ఎక్కువగా ఉంటే రమ్మని చెప్పి ఆ మహిళను పంపించేశారు. ఆ తర్వాత సదరు మహిళ కేవలం నాలుగు రోజుల్లో మళ్లీ ఆస్పత్రికి వచ్చి జాయిన్ అయ్యింది. ఈసారి ఆమె మరింత నొప్పితో మాట్లాడలేని స్థితికి చేరుకుంది. దీంతో వైద్యులు వెంటనే సీటీ స్కాన్‌చేసి చూడగా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఎందుకంటే స్కానింగ్‌లో ఆవకాయబద్ద గొంతులో గుచ్చుకోవడంతో అన్నవాహికలో నీరు చేరడం, ఛాతీలో గాలి ఉండటం వైద్యులు గుర్తించారు. దీంతో వెంటనే వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి గొంతులో ఇరుక్కున్న ఆవకాయబద్దను తొలగించారు. ఒక వారంపాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండి చికిత్స తీసుకుంది. ఐతే ఆమె ఈ విషయమై ఆస్పత్రి ట్రస్ట్‌కి ఫిర్యాదు చేసింది. దీంతో ట్రస్ట్ ఎలాంటి పళ్లు తినేటప్పుడూ జాగ్రత్తగా ఉండాలో వివరంగా ఒక జాబితా ఇవ్వాలని సదరు ఆస్పత్రి వైద్యులను ఆదేశించింది. ఇది చాలా హాస్యస్పదమైన విషయం, ఎందుకంటే ఇలాంటి ఘటనలు అత్యంత అరుదుగా సంభవించేవి అని డాక్టర్ రిచర్డ్ జెన్నింగ్స్ అన్నారు. సాధారణంగా మాంసం తింటే అందులోని ఎముకలు గట్టిగా ఉంటాయి కాబట్టి గుచ్చుకోవడం లేదా ఇరుక్కునే అవకాశం ఉంటుందని చెప్పగలం గానీ ఫలానా పండు వల్ల ఇలా జరుగుతుందని ఎలా చెప్పగలం అని అన్నారు. (చదవండి: చిన్నారులపై అత్యాచారం కేసులో ఒక వ్యక్తికి 129 ఏళ్లు జైలు శిక్ష) -
Health Tips: పచ్చళ్లు అతిగా తింటే అనర్థమే! ముఖ్యంగా పురుషులకు..!
What Happens If We Eat Pickles Everyday: వేడి వేడి అన్నంలో ఎర్రెర్రగా ఇంత ఆవకాయో, మాగాయో, ఇతర ఊరగాయ పచ్చళ్లో రోటిపచ్చళ్లో వేసుకుని తింటే వచ్చే రుచే వేరు. అందుకే అందరూ పచ్చళ్లకోసం నాలుక తెంపుకుంటూ ఉంటారు. అయితే రుచిగా ఉందని పచ్చడే పరమాన్నంలా రోజూ తింటూ ఉంటే ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులోనూ మహిళల కంటే మగవాళ్లకు ఈ ముప్పు మరికాస్త ఎక్కువ ఉంటుందంటున్నారు. ఇంతకూ ఆ ముప్పు ఎందుకో, ఏమిటో చూద్దాం... తక్కువగా తినండి! నవకాయ పిండి వంటలు చేసి నిండుగా విస్తరిలో వడ్డించినా పచ్చడికోసం వెతుక్కోవడం తెలుగు వారి స్వభావం. అన్నంలోనే కాదు, వేడివేడి ఉప్మా, దోసె, వడ, ఇడ్లీ.. ఇలా ఒకటేమిటి ప్రతిదానినీ పచ్చడితో లాగిస్తుంటారు. పచ్చళ్లు అతిగా తింటే అనర్థాలూ ఎక్కువేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేమిటో తెలుసుకుందాం... పచ్చళ్లను తక్కువగా తీసుకునే ప్రయత్నం చేద్దాం. బీపీ అమాంతం పెరిగితే! పచ్చళ్లు ఎక్కువగా తినడం వల్ల అవి నిల్వ ఉండటం కోసం వేసే ఉప్పు వల్ల ముప్పు పొంచి ఉంటుంది. బీపి ఉన్న వారికి అమాంతం పెరిగిపోతే, ఇంతవరకూ ఆ సమస్యే లేని వారికి అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. ప్రిజర్వేటివ్స్ వల్ల హైపర్ టెన్షన్ రోగులకు కూడా ప్రమాదకరమే. ముఖ్యంగా మార్కెట్లో కొనుగోలు చేసే పచ్చళ్లలో ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అదేవిధంగా పచ్చళ్లు ఎక్కువగా తింటే కడుపులో పుళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. పొట్టలో, పేగుల్లో పొంచి ఉండే కొవ్వు.. గుండెజబ్బులు మార్కెట్లో విక్రయించే పచ్చళ్లకు రుచి కోసం నూనె, మసాలా ఎక్కువగా వాడుతారు. ఇవి ఆరోగ్యానికి హాని చేకూరుస్తాయి. ఎక్కువ ఆయిల్ తీసుకోవడం వల్ల.. మసాలాల కారణంగా.. పైల్స్ వచ్చే ప్రమాదం ఉంది. వాటితోపాటు కొలెస్ట్రాల్ వంటి ఇతర అనారోగ్య సమస్యలూ తలెత్తుతాయి. తద్వారా గుండెజబ్బులు కాచుకుని ఉంటాయి. అందువల్ల పచ్చడి అంటే ఎంత ఇష్టం ఉన్నా, పరిమితంగానే పుచ్చుకోవడం మంచిది. మరీ తినాలనిపిస్తే సాధ్యమైనంతవరకూ ఇంట్లో చేసిన పచ్చళ్లను.. అది కూడా నూనె, ఉప్పు, కారం తక్కువ పాళ్లలో కలిపిన వాటిని... అదీ కొద్ది కొద్దిగానే తీసుకోవడం మంచిది. చదవండి: Pachi Batani Health Benefits: పురుషులు పచ్చి బఠానీలు ఎక్కువగా తిన్నారంటే.. Potassium Deficiency Symptoms: పొటాషియం లోపిస్తే జరిగేది ఇదే! వీటిని తింటే మేలు.. -
‘ఊపిరి’ సినిమాలో సీన్ మాదిరిగా, పికిల్ ఆర్ట్ 4 లక్షలు.. నెటిజన్ల ట్రోలింగ్
‘ఊపిరి’ సినిమా చూశారా? అందులో మోడర్న్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు వెళ్లిన హీరో... జనం వాటికి ఎందుకన్ని లక్షల పెడుతున్నారో అర్థంకాక.. నవ్వుకుంటాడు. ఇంటికొచ్చి తనూ ఓ పెయింటింగ్ వేసి లక్షలకు అమ్మేస్తాడు. గుర్తుందా? అచ్చం అలాంటి సంఘటనే ఆస్ట్రేలియా లో జరిగింది. ఆర్టిస్ట్ మాథ్యూ గ్రిఫిన్... మెక్‌డొనాల్డ్స్ చీజ్ బర్గర్ తింటుండగా, అందులోని ఓ పికిల్ పీస్ వెళ్లి సీలింగ్‌కు తగిలింది. తెల్లని సీలింగ్‌పై అదో అద్భుతమైన చిత్రంగా తోచిందతనికి. ఇంకేముంది... ఆ పాపులర్ పికిల్‌తో చిత్రాన్ని రూపొందించి.. ఓ ఆస్ట్రేలియన్ ఎగ్జిబిషన్లో ఉంచాడు. దానికి ‘పికిల్’ అని పేరు పెట్టి, రూ.4లక్షలు ధర నిర్ణయించాడు. సిడ్నీ ఎగ్జిబిషన్‌లోని ఫైన్ ఆర్ట్స్‌లో ప్రదర్శించిన 4 ఆర్ట్ వర్క్స్‌లో అదీ ఒకటి. జూలై 30 వరకు జరిగిన ఈ ఎగ్జిబిషన్ వివరాలను సిడ్నీ ఫైన్ ఆర్ట్స్ ఇన్ స్టాగ్రామ్ పేజ్‌లో పంచుకున్నారు. అంతే.. అది చూసిన నెటిజన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ‘నేను టీనేజర్‌గా ఉన్నప్పుడు మెక్‌డొనాల్డ్స్‌కు వెళ్లి అలా చేసినందుకు నన్ను పోలీసులు అక్కడి నుంచి తరిమారు. ఇప్పుడు మాత్రం కళాఖండమైంది’ అంటూ ఓ నెటిజన్ స్పందించారు. ఇక ‘ఇలాంటి ఆర్ట్‌వర్క్‌ను ఎలా ప్రదర్శిస్తారు?’ అంటూ చిరాకు పడ్డవారూ ఉన్నారు. అయితే ‘ఆన్లైన్లో ఆ పెయింటింగ్‌పై వచ్చిన హాస్యా స్పద స్పందనను పట్టించుకోవద్దు’ అంటున్నా డు ఫైన్ ఆర్ట్స్ డైరెక్టర్ ర్యాన్ మూరే. ఫన్నీగా ఉన్నంత మాత్రాన దానికున్న విలువ, దాని అర్థం మారిపోదని చెబుతున్నాడు. -
దిల్ ‘మ్యాంగో’మోర్... సమ్మర్ ఎండ్ పికిల్స్ ట్రెండ్
వేసవి ముగింపుకొచ్చింది. దాంతో పాటే సీజన్లో ఆవకాయ పచ్చడి తయారు చేసుకునే సమయం కూడా. ఆవకాయ అంటే ఒక పచ్చడి కాదు కొన్ని పచ్చళ్ల సమ్మేళనం. ఆ కొన్ని పచ్చళ్ల విశేషాలు... ► మామిడి ఆవకాయ తెలియనిదెవరికి?కనీస పదార్థాలతోనే చేసుకునేందుకు, ఎక్కువకాలం నిల్వఉంచుకునే వీలు వల్ల ఇది జాబితాలో అగ్రభాగంలో ఉంటుంది. ► బెల్లం తియ్యదనం, మామిడిలోని పుల్లదనం... కలిపిందే బెల్లం ఆవకాయ. అయితే బెల్లం నాణ్యత బాగుండాలనేది ఈ పచ్చడి పెట్టేటప్పుడు మర్చిపోకూడని విషయం. ► నువ్వులతో మామిడి పచ్చడి తయారు చేస్తారు. దీనినే నువ్వు ఆవకాయ అని కూడా అంటారు. కాకపోతే ఈ నువ్వులను పొడి రూపంలో వాడతారు. ► అల్లం ఆవకాయ వెల్లుల్లి పేస్ట్ మేళవింపు మరో రకం పచ్చడి. అయితే అల్లం తాజాగా ఉండాలి. పెరుగన్నంతో ఈ పచ్చడి అత్యుత్తమ కాంబినేషన్ . ► పల్లి ఆవకాయ నిల్వ పచ్చడి కాదు కానీ ఫ్రిజ్‌లో ఉంచితే ఓ వారం బాగానే ఉంటుంది. పల్లీలు నాణ్యతతో ఉంటే పచ్చడి మరింతగా నిల్వ ఉంటుంది. ► ఎక్కువ కాలం పచ్చడి నిల్వ ఉండాలనుకుంటే ఎండు మామిడి పచ్చడిని ఎంచుకోవాలి. ఎండబెట్టిన మామిడికాయలతో ఇది తయారు చేస్తారు. ► ఇవి గాక పెసర ఆవకాయ, మామిడి అల్లం ఊరగాయ, పండు మిరపకాయ నిల్వ పచ్చడి వంటివి కూడా ఈ సీజన్ లో ట్రై చేయొచ్చు. ‘‘చిన్నతనంలో ఇంటిలో పచ్చళ్లు తయారు చేసుకోవడం అంటే కుటుంబసభ్యులు, స్నేహితులను కలుసుకోవడం కూడా. భోజనం సమయంలో ఆవకాయ లేదా మరేదైనా పచ్చడి వాసన చూస్తేనే ఎక్కడా లేని ఆనందం కలిగేది’’ అని గోల్డ్‌డ్రాప్ డైరెక్టర్ మితేష్ లోహియా గుర్తు చేసుకున్నారు. -
పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టిన మామిడికాయ పచ్చడి.. క్షణికావేశంలో
సాక్షి, కరీంనగర్: రామడుగు మండలంలోని గోపాల్‌రావుపేటకు చెందిన ఇరుకు సాయిప్రియ(28) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. సాయిప్రియ–తిరుపతి దంపతులు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. సాయిప్రియ బీడీలు చేస్తుండగా తిరుపతి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గురువారం సాయంత్రం మామిడికాయ పచ్చడి విషయంలో దంపతుల మధ్య చిన్న గొడవ జరిగింది. సాయిప్రియ క్షణికావేశంలో వంట గదిలోకి వెళ్లి, ఒంటిపైన కిరోసిన్ పోసుకొని, నిప్పంటించుకుంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలు ఆర్పివేసే క్రమంలో భర్త తిరుపతి, తోటి కోడలికి గాయాలయ్యాయి. సాయిప్రియను కరీంనగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. శుక్రవారం మృతురాలి తండ్రి గంటి చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
తోతాపురి మామిడికాయలు, అరకేజీ బెల్లం.. రుచికరమైన ఆవకాయ రెసిపీ!
బెల్లం ఆవకాయను ఇష్టపడే వారు చాలా మందే ఉంటారు. మరి ఈ వంటకం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా! బెల్లం ఆవకాయ తయారీకి కావలసినవి: ►తోతాపురి మామిడికాయలు – ఐదు ►బెల్లం – అరకేజీ ►నువ్వులనూనె – పావుకేజీ ►ఆవాలు – పావు కేజీ ►కారం – కప్పు, ఉప్పు – కప్పు ►మెంతులు – రెండు టీస్పూన్లు ►పసుపు – రెండు టీస్పూన్లు ►ఇంగువ – అరటీస్పూను ►తొక్కతీసిన వెల్లుల్లి రెబ్బలు – కప్పు. బెల్లం ఆవకాయ తయారీ విధానం ►ముందుగా మామిడి కాయలను శుభ్రంగా కడిగి పొడిగా తుడుచుకోవాలి. ►కాయల్లో జీడి తీసేసి ముక్కలు చేసుకోవాలి. టెంకపైన ఉన్న జీడిపొరను తీసేసి శుభ్రంగా తుడవాలి. ►ఆవాలు, మెంతులను గంటపాటు ఎండబెట్టి పొడిచేసుకోవాలి ►ఇప్పుడు పెద్ద గిన్నెతీసుకుని ఆవపొడి, పసుపు, మెంతి పిండి, కారం, ఉప్పు వేసి కలపాలి. ►ఇప్పుడు బెల్లాన్ని సన్నగా తురిమి వేయాలి. దీనిలో ఇంగువ కూడా వేసి చక్కగా కలపాలి. ►ఇప్పుడు మామిడికాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి చేతితో కలపాలి. ►తర్వాత కొద్దిగా ఆయిల్ తీసి పక్కనపెట్టి, మిగతా ఆయిల్ వేసి కలపాలి. ►ఈ మిశ్రమాన్ని పొడి జాడీలో వేసి పైన మిగతా ఆయిల్ వేయాలి. ►మూడు రోజుల తరువాత పచ్చడిని ఒకసారి కలపాలి, జాడీలో నిల్వచేసుకోవాలి. చదవండి👉🏾Mango Pickle In Telugu: నోరూరించే నువ్వుల ఆవకాయ.. తొక్కుడు పచ్చడి.. తయారీ ఇలా చదవండి👉🏾Egg Bread Manchuria: గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి.. నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా రెసిపీ -
Recipes: నువ్వుల ఆవకాయ.. తొక్కుడు పచ్చడి.. తయారీ ఇలా!
అమ్మను, ఆవకాయను ఎప్పటికీ మర్చిపోలేమని తెలుగువారి నోటి నుంచి కామన్‌గా వినిపించే మాట. వంటల్లో ఏది బోర్ కొట్టినా ఆవకాయ మాత్రం ఎన్నిసార్లు తిన్నా మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అన్నంలో పప్పు, నెయ్యి ఆవకాయ కలుపుకుని తింటే స్వర్గానికి బెత్తెడు దూరమే అన్నట్టు ఉంటుంది. పెరుగన్నంలో ఆవకాయ ముక్కను నంచుకుంటే అమృతంలా అనిపిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లన్నీ నోరూరించే మామిడి కాయలు కళ కళలాడిపోతున్నాయి. మరోవైపు మహిళలంతా జాడీలను సిద్ధం చేసుకుని ఆవకాయ పెట్టడానికి హడావుడి పడుతున్నారు. ఏడాదిపాటు నిల్వ ఉండేలా వివిధ రకాల ఆవకాయలను ఎలా పడతారో చూద్దాం.... నువ్వుల ఆవకాయ కావలసినవి పచ్చిమామిడికాయ ముక్కలు – రెండు కేజీలు, నువ్వుపప్పు నూనె – కేజీ, జీలకర్ర – టేబుల్ స్పూను, మెంతులు – టేబుల్ స్పూను, ఆవాలు – టేబుల్ స్పూను, అల్లం – పావు కేజీ, వెల్లుల్లి – పావుకేజీ, కల్లుప్పు – అరకేజీ, ఆవపిండి – 200 గ్రాములు, నువ్వుపిండి – ఆరకేజీ, జీలకర్ర పొడి – వందగ్రాములు, మెంతిపిండి – రెండు టీస్పూన్లు, పసుపు – రెండు టీస్పూన్లు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు – అరకప్పు. తయారీ.. ముందుగా మామిడికాయ ముక్కల టెంక మీద ఉన్న సన్నని పొరను తీసేసి పొడి బట్టతో శుభ్రంగా తుడుచుకుని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిని తొక్క తీసి శుభ్రంగా కడిగి పేస్టుచేసి పక్కనపెట్టుకోవాలి. బాణలిని స్టవ్ మీద పెట్టి వేడెక్కిన తరువాత కేజీ నూనె పోయాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి దోరగా వేయించి బాణలిని స్టవ్ మీద నుంచి దించేసి పక్కనపెట్టుకోవాలి ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్టు వేసి తిప్పి చల్లారనివ్వాలి. కల్లుప్పుని గంటపాటు ఎండబెట్టి మిక్సీపట్టి మామిడికాయ ముక్కల్లో వేయాలి, దీనిలో ఆవపిండి, నువ్వుపిండి, జీలకర్రపొడి, మెంతిపిండి, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి చేతితో చక్కగా కలుపుకోవాలి. పొడులన్నీ కలిపాక పూర్తిగా చల్లారిన ఆయిల్ మిశ్రమం వేసి చక్కగా కలుపుకోవాలి. పచ్చడి కలిపేటప్పుడు ఆయిల్ సరిపోనట్లు కనిపిస్తుంది కానీ, మూడు రోజులకు ఆయిల్ పైకి తేలుతుంది. మూడోరోజు మూత తీసి పచ్చడిని మరోమారు కిందినుంచి పైదాకా బాగా కలుపుకోవాలి. ఉప్పు, ఆయిల్ సరిపోకపోతే ఇప్పుడు కలుపుకుని, గాజు లేదా పింగాణీ జాడీలో నిల్వ చేసుకోవాలి. తొక్కుడు పచ్చడి కావలసినవి పచ్చిమామిడికాయలు – నాలుగు, ఉప్పు – అరకప్పు, పసుపు – టీస్పూను, ఆవపిండి – రెండు టేబుల్ స్పూన్లు, ఆవపిండి – టీస్పూను, కారం – ముప్పావు కప్పు, పప్పునూనె – ఒకటిన్నర కప్పులు, వెల్లుల్లి రెబ్బలు – పావు కప్పు, ఆవాలు– పావు టీస్పూను , ఇంగువ – టీస్పూను. తయారీ.. మామిడికాయలను తొక్కతీసి ముక్కలుగా తరిగి మిక్సీజార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తురుముని కప్పుతో కొలుచుకోవాలి. ఇది మూడు కప్పులు అవుతుంది. ఈ తురుములో పసుపు, ఉప్పు వేసి కలిపి ఒకరోజంతా పక్కన పెట్టుకోవాలి. మరుసటిరోజు ఊరిన ఊటను వడగట్టి ఊటను వేరు వేరుగా, తురుముని విడివిడిగా ఎండబెట్టాలి. ఎండిన తురుముని ఊటలో వేసి బాగా కలపాలి. నూనెను వేడెక్కిన తరువాత ఆవాలు, వెల్లుల్లిపాయలను కచ్చాపచ్చాగా దంచుకుని వేయాలి. ఇంగువ వేసి స్టవ్ ఆపేయాలి. నూనెను చల్లారనివ్వాలి. ఇప్పుడు ఎండిన తురుములో కారం, ఆవపిండి, మెంతిపొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసాక చల్లారిన నూనె వేసి కలపాలి. ఉప్పు, నూనె తగ్గితే, కలుపుకొని, జాడీలో నిల్వ చేసుకోవాలి. చదవండి👉🏾Egg Bread Manchuria: గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి.. నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా తయారీ ఇలా! -
స్పెషల్ పికిల్స్: ‘‘ఊరగాయల ఊరు’’.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే
Pickle Village Usulumarru: ఊరగాయలనే నమ్ముకుని ఊరంతా బతుకుతోందంటే నమ్ముతారా. నమ్మకం కలగకపోతే ఓసారి ఆ గ్రామానికి వెళ్లాల్సిందే.పనులు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నసమయంలో బతుకుదెరువు కోసం ఓ కుటుంబం చేపట్టిన ఊరగాయల తయారీయే ఇప్పుడు ఆ ఊరికి ఉపాధి కల్పిస్తోంది. అక్కడి వారందరినీదర్జాగా బతికిస్తోంది. సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని సీజన్లలోనూ రకరకాల ఊరగాయలు తయారు చేయడం ఆ ఊరి ప్రత్యేకత. అక్కడ తయారయ్యే పచ్చళ్లకు లేబుల్ లేకపోయినా.. బ్రాండ్ మాత్రం ఉంది. ఆ ఊరి పేరు ఉసులుమర్రు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో కలిసిన పెరవలి మండలంలోని గ్రామమది. పెరవలి: ఊరగాయల ఊరుగా ఉసులుమర్రు పేరొందింది. గ్రామ జనాభా 2,500 కాగా.. వారిలో 1,600 మంది పచ్చళ్ల తయారీ, విక్రయాలలో నిమగ్నమవుతుంటారు. ఏడాది పొడవునా ఏదో రకం ఊరగాయ తయారు చేస్తూ నిత్యం కోలాహలంగా ఉంటుంది. చిన్నాపెద్ద.. ఆడ మగా అనే తేడా లేకుండా అందరూ ఈ పనిలో నిమగ్నమై ఉంటారు. మగవాళ్లు దూరప్రాంతాలకు వెళ్లి ఊరగాయల వ్యాపారాలు చేస్తుంటే.. మహిళలు ఇంటి వద్ద పిల్లలను చూసుకుంటూ ఊరగాయలు తయారు చేస్తుంటారు. సీజన్ల వారీగా ఆవకాయ, మాగాయ, టమాటా, ఉసిరి, అల్లం, గోంగూర, కాలీఫ్లవర్, పండుమిరప, నిమ్మ, దబ్బ, కాకర వంటి నిల్వ పచ్చళ్లు చేసి ఏడాది పొడవునా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. కేవలం ఈ ఒక్క గ్రామం నుంచే సుమారు 300 మంది వ్యాపారులు పుట్టుకురాగా.. ఏటా 200 టన్నులకు పైగా ఊరగాయల ఉత్పత్తి అమ్మకాలు జరుగుతున్నాయి. కిలో ఊరగాయ రూ.200–రూ.250కి విక్రయిస్తున్నారు. అందరికీ అదే ఉపాధి ఉసులుమర్రు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడిన గ్రామం. ఇక్కడ కేవలం వరి మాత్రమే పండిస్తారు. అందువల్ల ఏటా జూన్, జూలై, డిసెంబర్, జనవరి నెలల్లో మాత్రమే వ్యవసాయ పనులుంటాయి. ఈ పరిస్థితుల్లో గ్రామస్తులకు బతుకుదెరువు కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో సుమారు 40 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన పిళ్లా శ్రీరామమూర్తి కుటుంబం ఊరగాయలు తయారు చేసి ఊరూరా వెళ్లి విక్రయించడం ప్రారంభించారు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడంతో ఆయనే మరికొందరికి ఉపాధి కల్పిస్తూ వచ్చారు. అలా మొదలైన ఆ ఊరి ఊరగాయల ప్రస్థానం ఇప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, అస్సాం, బెంగాల్ రాష్ట్రాల వరకు విస్తరించింది. ఊరగాయల తయారీతో గ్రామస్తులందరికీ ఇప్పుడు నిత్యం పని దొరుకుతోంది. మహిళలకు రోజుకు రూ.300, పురుషులకు రూ.400 చొప్పున కనీస కూలి లభిస్తోంది. ఆటుపోట్లు ఎన్నొచ్చినా.. ఈ వ్యాపారంలో తాము ఎన్ని ఆటుపోట్లు, కష్టనష్టాలు ఎదుర్కొన్నా కేవలం తామిచ్చే నాణ్యత మాత్రమే తమను నిలబెట్టిందని గ్రామస్తులు సగర్వంగా చెబుతుంటారు. ఇక్కడి వ్యాపారులు తెలంగాణలోని బోధన్, హైదరాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలతోపాటు మన రాష్ట్రంలోని నెల్లూరు, గుంటూరు, విజయవాడ, తిరుపతి, ఒంగోలు, విశాఖ, ఒడిశా, అస్సాం, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు వెళుతుంటారు. అక్కడి హోటళ్లు, పికిల్స్ షాపులకు విక్రయిస్తుంటారు. వ్యాపారులంతా ఏడాదిలో 10 నెలలపాటు ఇతర ప్రాంతాల్లోనే ఉంటారు. కొందరు భార్యాబిడ్డలను వెంట తీసుకుని వెళతారు. మరికొందరు మాత్రం భార్యాబిడ్డలను గ్రామంలోనే ఉంచి సరుకు తయారు చేయించుకుంటారు. 20 ఏళ్ల నుంచి ఇదే వ్యాపారం 20 ఏళ్ల క్రితం మా నాన్నగారు ప్రారంభించిన పచ్చళ్ల వ్యాపారాన్ని నేటికీ కొనసాగిస్తున్నాం. ఏడాదిలో 10 నెలలు బయటి ప్రాంతాల్లోనే ఉంటాం. భార్యాబిడ్డలు ఇక్కడే ఉంటారు. ఈ వ్యాపారం వల్ల ఆస్తులైతే కూడగట్టలేం గానీ.. దర్జాగా బతకగలుగుతాం. – కొమ్మర వెంకటేశ్వరావు, వ్యాపారి ఇదే మాకు బతుకునిస్తోంది పిల్లల భవిష్యత్ కోసం మా వారు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఊరగాయల్ని విక్రయిస్తుంటే.. నేను ఊళ్లోనే ఉండి పిల్లలను చూసుకుంటూ పచ్చళ్లు తయారు చేసి పంపిస్తుంటా. బ్యాంకులు అప్పులు ఇవ్వవు. వడ్డీకి తెచ్చుకుని పెట్టుబడి పెట్టుకుంటాం. – కూనపురెడ్డి సత్యవతి పచ్చడి వ్యాపారి ఉసులుమర్రు ఈ వ్యాపారం అంత సులభం కాదు ఈ వ్యాపారంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇతర వ్యాపారాల మాదిరిగా పచ్చళ్ల వ్యాపారం చేయడం అంత సులభం కాదు. సుదూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అధికారుల వేధింపులు ఎదురవుతాయి. తృణమో ఫణమో ముట్టజెప్పి ముందుకు వెళుతుంటాం. ఈ వ్యాపారానికి బ్యాంకుల సహకారం ఏమాత్రం లేదు. రుణాలిస్తే మరింత మెరుగ్గా వ్యాపారాలు చేస్తాం. పెట్టుబడి కోసం ప్రైవేట్ అప్పులు చేయాల్సి వస్తోంది. వచ్చిన లాభం వడ్డీకే సరిపోతోంది. – ముత్యాల రామాంజనేయులు, వ్యాపారి -
Covid-19: ‘ఎర్ర చీమల చట్నీ’ వాడాలని చెప్పలేం
న్యూఢిల్లీ: కోవిడ్–19 చికిత్సలో గృహ వైద్యం/సంప్రదాయ వైద్య విధానాలను వాడాలంటూ తాము సూచించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్ చికిత్సలో ‘ఎర్రచీమల పచ్చడి’ని వినియోగించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన ఒక పిటిషన్‌ను జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం గురువారం తిరస్కరించింది. ‘సంప్రదాయ వైద్య విధానాలు, పద్ధతులు మనకు ఎన్నో తెలుసు. మన ఇళ్లలోనూ వీటిని వాడుతుంటాం. ఎవరి ఇళ్లలో వారు ఈ వైద్య విధానాలను సొంతం కోసం వినియోగించుకోవచ్చు. ఎవైనా దుష్ఫలితాలు ఉంటే వాటి బాధ్యత కూడా మీదే అవుతుంది. ఇలాంటి సంప్రదాయ పరిజ్ఞానాన్ని దేశ ప్రజలంతా వాడాలని మేం కోరలేము’అని పిటిషనర్, ఒడిశాకు చెందిన నయధిర్ పధియల్కు స్పష్టం చేసింది. ముందుగా కోవిడ్ టీకా వేయించుకోవాలని ఆయన్ని కోరిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ‘ఎర్ర చీమలు, పచ్చి మిర్చితో తయారు చేసే ఈ చట్నీ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర గిరిజన ప్రాంతాల్లో సంప్రదాయ వైద్య విధానంలో ఫ్లూ, దగ్గు, జలుబు, శ్వాస సమస్యలు, ఇతర రుగ్మతల నివారణకు వాడతారు. దీన్లో ఫారి్మక్ యాసిడ్, ప్రొటోన్, కాల్షియం, విటమిన్ బి12, జింక్ వంటివి ఉన్నాయి. ఇది కోవిడ్–19 చికిత్సలో ఇది ఉపయోగపడుతుంది’అని నయధర్ పధియల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ‘ఎర్ర చీమల చట్నీ’ని కోవిడ్ వైద్యంలో వాడేలా ఆదేశాలివ్వాలంటూ గత ఏడాది డిసెంబర్లో ఒడిశా హైకోర్టులో పిటిషన్ వేశారు. పరీశీలించిన న్యాయస్థానం..ఈ విధానంలో శాస్త్రీయతను ధ్రువీకరించాలని సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్)కు, ఆయుష్ శాఖకు ఆదేశాలిచ్చింది. ఈ రెండు విభాగాలు సమర్పించిన నివేదిక ఆధారంగా హైకోర్టు.. పధియల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీనిని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. చదవండి: తాలిబన్ల ప్రభుత్వ ప్రారంభోత్సవంలో మేము పాల్గొనం। -
కరోనాతో భర్తను కోల్పోయిన బామ్మ.. ఇప్పుడేం చేస్తున్నారంటే..
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కరోనాతో ఆప్తులను కోల్పోయిన బాధతోపాటు, తీరని ఆర్థిక ఇబ్బందులు వారిని కోలుకోలేని దెబ్బతీశాయి. అయితే స్వయంగా కరోనా బాధితురాలు, ఈ కష్టాలను స్వయంగా చూసిన 87 ఏళ్ల బామ్మ ‘పెద్దమనసు’ విశేషంగా నిలిచింది. ఆ వివరాలు.. కోవిడ్-19కారణంగా భర్త రాజ్‌కుమార్‌ను కోల్పోయిన ఉషాగుప్తా (87) మొదట్లో చాలా కృంగిపోయారు. ఆరు దశాబ్దాల తమ ప్రేమ సౌధం ఒక సెకనులో కూలిపోయినట్టుగా పుట్టెడు దుఃఖం ఆవిరించింది. చివరికి ఆ బాధను దిగమింగి, కరోనా బాధితులను ఆర్థికంగా ఆదుకునేందుకు నడుం బిగించారు. నడుం ఒంగిపోయిన తన వల్ల ఏమవుతుందిలే అని మిన్నకుండిపోలేదు. తన చేతనైన విద్య ద్వారా అసహాయులకు ఆపన్న హస్తం అందించేందుకు నిర్ణయించారు. అలా రూపుదిద్దుకున్నదే ‘పికెల్డ్ విత్ లవ్’ వ్యాపారం. ఉషా గుప్తా, రాజ్‌కుమార్ దంపతుల 60 ఏళ్ల వైవాహిక జీవితాన్ని చూసి ఆ కరోనాకు కన్నుకుట్టిందేమో.. ఇద్దరికీ ఒకేసారి మహమ్మారి వైరస్ సోకింది. అయితే ఉష కోలుకున్నప్పటికీ, ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రిలో 27 రోజులపాటు పోరాడిన ఆమె భర్త రాజ్‌కుమార్ కన్నుమూశారు. దీంతో ఉషాగుప్తా ఒక్కసారిగా అగాధంలోకి కూరుకు పోయినంత ఆవేదన చెందారు. భర్త మరణానికి తోడు, ఆక్సిజన్ కొరత, బెడ్లు దొరక్క ఢిల్లీ ఆసుపత్రిలో కరోనా బాధితుల కష్టాలను గుర్తు చేసుకుని మరింత చలించిపోయారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు చుట్టూ ఉన్న రోగులు, వారి బంధువుల నిస్సహాయతను చూసి కలత చెందారు. హాస్పిటల్లో చుట్టూ చాలా కష్టాలు చూశాను. ఆక్సిజన్ కొరత ఒకటైతే.. అక్కడున్నవారంతా ఏదో యుద్ధంలో ఉన్నట్టనిపించింది. అందరిలో చాలా అందోళన అంటూ తన అనుభవాలను ఉష గుర్తుచేసుకున్నారు “నా భర్తను కోల్పోయిన తరువాత సర్వం కోల్పోయిన వేదన అనుభవించాను. అదే సందర్భంలో కరోనా కుటుంబాలను ఎంత తీవ్రంగా ప్రభావితం చేసిందో ఈ సందర్భంగా చూశాను, ముఖ్యంగా ఆర్థికంగా ఎలాంటి అండ లేనివారిని చూస్తే బాధ అనిపింది. అందుకే తోచినంత సహాయపడాలని అనిపించింది’’ అని ఉషా చెప్పారు. పికెల్డ్ విత్ లవ్ ఉషాకుమొదటినుంచి రుచికరమైన వంటలు, పచ్చళ్లు చేయడం అలవాటు. అందుకే దాన్నే వృత్తిగా ఎంచుకున్నారు. ‘పికెల్డ్ విత్ లవ్’ పేరుతో ఈ నెలలోనే ( 2021, జూలై) పచ్చళ్ల వ్యాపారం మొదలు పెట్టారు. దీని ద్వారా వచ్చిన డబ్బులను బాధితులను అందిస్తూ తన పెద్ద మనసును చాటుకుంటున్నారు. ఇందులో ఉషా కుమార్తె తోడ్పాటుతో పాటు, మనవరాలు, ఢిల్లీకి చెందిన శిశువైద్యురాలు డా. రాధిక బాత్రా పాత్ర కూడా చాలా ఉంది. వాస్తవానికి భర్త పోయిన వేదనలో ఉన్న అమ్మమ్మకు స్వాంతనివ్వడంతోపాటు, బాధితుల కష్టాలను చూసి చలించిపోతున్న ఆమెకు ఊరట కలిగేలా ఏదైనా చేయాలని ఆలోచించారు. అలా పుట్టిందే ‘పికెల్డ్ విత్ లవ్’. చిన్నప్పటినుంచీ అమ్మమ్మ చేతి కమ్మనైన వంటలు, రకరకాల పచ్చళ్లేరుచే రాధికను ఈ వ్యాపారం వైపు ఆలోచించేలా చేసింది. ఎందుంటే అమ్మమ్మ చేతివంట ఎంత రుచిగా ఉంటుందో ఆమెకు బాగా తెలుసు. అందుకే అమ్మమ్మను ఆ వైపుగా ప్రోత్సహించారు. అంతేకాదు దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా స్వయంగా రాధిక దగ్గరుండి పూర్తి చేశారు. సంబంధిత వ్యక్తులు అనేక మందితో చర్చించి, బాటిల్స్ ఎక్కడ సేకరించాలి, లేబుల్స్, ఇలాంటి వ్యాపారానికి అవసరమైన అన్ని అనుమతులు, తదితర విషయాలపై సమాచారాన్ని సేకరించారు. వెంచర్ పేరు, లోగో సిద్ధం చేశారు. అంతే.. వెంచర్ అలా మొదలైందో లేదో, చీఫ్ చెఫ్ నానీకి అంతులేని క్రేజ్ వచ్చేసింది. సాధారణంగానే ప్రారంభ ఆర్డర్లన్నీ స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండే వచ్చాయి. కానీ, అనూహ్యంగా వారికి తెలియకుండానే 180 సీసాల ఊరగాయలు, చట్నీలు విక్రయించారు. ఇది వారిలో మరింత ఉత్సాహాన్ని పెంచింది. అమ్మమ్మ సాయంతో ఒకేసారి పది కిలోల మామడికాయ పచ్చడి పెట్టే సామర్థ్యం తనకు వచ్చిందంటూ డా. రాధిక సంతోషం వ్యక్తం చేశారు. మొదట్లో ఖట్టా ఆమ్ (పుల్ల మామిడి), తురిమిన మామిడి పచ్చడి, గులాబీ మీఠా ఆచార్ అనే మూడు రుచులతో ప్రారంభమైన ప్రస్తానం మిక్స్డ్ వెజిటబుల్ పికెల్, చింతకాయ పచ్చడి దాకా విస్తరించింది. ఇపుడు వీటికే ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయని డాక్టర్ రాధిక చెప్పారు. ప్రతి పచ్చడి బాటిల్‌ను అందమైన రిబ్బన్‌తో , ఉషా చేతితో రాసిన నోట్‌తో పంపించడం తమ పికెల్డ్ విత్ లవ్ స్పెషాల్టీ అని ఆమె చెప్పారు. అమ్మమ్మ గారి టాలెంట్ ఇంతటితో ఆగిపోలేదు. పలు రెసిపీలతో ‘ఇండియన్ శాకాహారీ వంజన్’ అనే కుక్‌బుక్ కూడా రాశారు ఉష. 200 గ్రాముల ఊరగాయను 150 రూపాయలకు విక్రయిస్తామని, ఇప్పటికి 20 వేల రూపాయలు సమకూరాయని ఉషా చెప్పారు. తనకు ప్రతి రూపాయి అపురూపమే.. చిన్న మొత్తంలో అయినా ఒకరికి సాయం చేయడం ఎంతో ఆనందాన్నిస్తోందంటారు ఉషా. అలాగే తన పచ్చళ్లకు లభిస్తున్న ఆదరణకు కూడా మరింత ఉత్సాహానిస్తోందన్నారు. ఆ శక్తి నిజంగా ప్రేమకు ఉండి ఉంటే.. కరోనాను తరిమికొట్టే శక్తి నిజంగా ప్రేమకు ఉండి ఉంటే.. తాతగారు చనిపోయేవారు కాదని, ఎపుడో రికవరీ అయ్యి ఇంటికి చేరేవారంటారు రాధిక భావోద్వేగంగా. ఎందుకంటే ఆసుపత్రిలో చేరిన తరువాత ఒక్క క్షణం కూడా ఆయనను విడిచి ఉండలేదు. అలా అమ్మమ్మ కోవిడ్‌నుంచి కోలుకుంటూ తాతగారిని కంటికి రెప్పలా చూసుకున్నా కానీ ఫలితం లేక పోయిందన్నారు తాత రూపాన్ని కళ్లనిండా నింపుకుంటూ... (ద బెటర్ ఇండియా కథనం ఆధారంగా) -
మేకింగ్ ఆఫ్ ఎ క్వీన్.. పచ్చళ్ల మహారాణి
నాలుగేళ్ల వయసులో తల్లి చనిపోయింది. చెల్లిని తీసుకుని అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లిపోయింది డుజోమ్. అక్కాచెల్లెళ్లు టీనేజ్ లోకి వస్తుండగా అమ్మమ్మ కూడా చనిపోయింది. మారుతల్లి ఉన్నా తల్లి కాలేకపోయింది. ఆమె దగ్గర కనాకష్టంగా బతికి ఇంటర్మీడియెట్ అవగానే రాజధాని ఇటానగర్ వెళ్లిపోయింది. అదే ఆమె జీవితానికి మలుపయింది. ఇప్పుడామె ‘పికిల్ క్వీన్’! పచ్చళ్ల సామ్రాజ్ఞి. బాగా డబ్బు సంపాదిస్తున్న వ్యాపారులు ఇంకొకర్ని తమ దారి లోకి రానివ్వరు. కానీ డుజోమ్.. నిరుపేద గృహిణుల స్వయం సమృద్ధి కోసం వారికి పచ్చళ్ల మేకింగ్‌లో, మార్కెటింగ్‌లో ఉచితంగా శిక్షణ ఇస్తోంది. యదే డుజోమ్ ఎనిమిదవ తరగతి చదువుతుండగా అమ్మమ్మ చనిపోవడంతో డుజోమ్, ఆమె చెల్లెలు మళ్లీ తండ్రి చెంతకే వారు చేరవలసి వచ్చింది. తండ్రి ఒక్కడే లేడు ఆ ఇంట్లో! ఇంకో ‘అమ్మ’ కూడా ఉంది. తనను, చెల్లిని ఆమె ఎంత హింసపెట్టిందో డుజోమ్ కొన్నిసార్లు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. డుజోమ్ ఇప్పుడు పచ్చళ్ల వ్యాపార సామ్రాజ్యానికి మహారాణి. ‘అరుణాచల్ పికిల్ హౌస్’ అంటే ఇప్పుడు ఆ రాష్ట్ర రాజధాని ఇటానగర్‌లో పెద్ద పేరు. అయితే పికిల్ హౌస్ ప్రారంభం రోజు ఒక్కరంటే ఒక్కరు కూడా అటువైపే రాలేదు! ‘పికిల్ క్వీన్’గా ప్రసిద్ధి చెందిన డుజోమ్ తన వ్యాపారం గురించి మాత్రమే చూసుకోవడం లేదు. ఆర్థికంగా అసహాయులైన గృహిణులనూ చూసుకుంటోంది. వారిని చేరదీసి పచ్చళ్ల తయారీలో శిక్షణ ఇస్తోంది. పచ్చళ్ల మార్కెటింగ్ గురించి టిప్స్ ఇస్తోంది. అలా ఇటానగర్‌లోని ఎందరో గృహిణులను గ్రూపులుగా చేసి, ఉపాధి నైపుణ్యాలను నేర్పిస్తోంది. అసలు ఇదంతా ఆమెకు ఎలా చేతనైనట్లు?! ‘‘జీవితంలో కష్టాలు తప్పవు. ఆ కష్టాల్లోనే పరిష్కారం దొరుకుతుంది. ఎప్పటికీ నిరాశ చెందకూడదు’’ అంటుంది డుజోమ్. డుజోమ్కు ఇప్పుడు 29 ఏళ్లు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ‘అరుణాచల్ పికిల్ హౌస్’ను ప్రారంభించింది. ఈ నాలుగు నెలల్లో పికిల్ క్వీన్ అయింది! ∙∙ పినతల్లి ఇంట్లోంచి వెళ్లిపోయిన ఈ పన్నెండేళ్లలో నెలకింతని డబ్బును దాచిపెట్టగలిగింది డుజోమ్. ఫుడ్ ప్రాసెసింగ్‌లో శిక్షణ తీసుకుంది. లేబుల్ మేకింగ్ నేర్చుకుంది. పదార్థాలను ఎలా నిల్వ ఉంచాలో తెలుసుకుంది. పచ్చళ్ల తయారీ మెళకువలను మణిపుర్ వెళ్లిప్పుడు అక్కడ కొంతమంది మహిళల నుంచి శ్రద్ధగా గ్రహించింది. అరుణాచల్‌ప్రదేశ్ తిరిగొచ్చాక పచ్చళ్ల తయారీ పద్ధతులలో శాస్త్రీయంగా శిక్షణ పొందింది. ఆ క్రమంలో పికిల్ హౌస్ అంకురార్పణ జరిగింది. ప్రస్తుతం ఎనిమిది మంది సిబ్బంది ఆమెకు చేదోడుగా ఉన్నారు. వారంతా గృహిణులు. లేమిలో, కుటుంబ సమస్యల కుంగుబాటులో ఉన్నవారు. వారిని పెట్టుబడి లేని భాగస్వాములుగా చేర్చుకుంది. అమ్మకాల వల్ల వస్తున్న లాభాలను వారికి పంచుతోంది. వ్యాపారాన్ని మరింతగా పెంచాలన్న ఆలోచనలో ఉంది. డుజోమ్ తనకు తానుగా వెజ్, నాన్‌వెజ్ పచ్చళ్లను రుచికరంగా తయారు చేయడంలో నిపుణురాలు. ప్రత్యేకించి ఆమె పెట్టే.. చేపలు, పోర్క్, చికెన్, అల్లం, వంకాయ, కాప్సికమ్, బంగాళదుంప, పనస, ముల్లంగి నిల్వ పచ్చళ్లు ప్రత్యేక గుర్తింపు పొందాయి. అలాగే డిమాండ్ కూడా. చెల్లెలు కూడా ఇప్పుడు ఆమెతోనే ఉంటోంది. ఇటానగర్ ఆమె అమ్మ తరఫు వారు ఉండే పట్టణం. అందుకనే డుజోమ్ అక్కడ స్థిరపడింది. -
హైదరాబాద్ టు అమెరికా ఆవకాయ యాత్ర..
సాక్షి, హైదరాబాద్: కరోనా పుణ్య మాని అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఉంటున్న తెలుగు వారికి అమ్మచేతి వంట తినే భాగ్యం కలిగింది. ఆవకాయ సహా అన్ని రకాల పచ్చళ్లు, కారంపొడులు, అల్లం–వెల్లుల్లి, పసుపు, చింతపండు, మిరియాలు, దాల్చినచెక్క వంటి మసాలా దినుసులు సైతం అమెరికాకు రివ్వున ఎగిరెళ్లిపోతున్నాయి. ఇక గారెలు, జంతికలు, అరిసెలు, సున్నుండలు, లడ్డూలు వంటి పిండివంటలతో పాటు మందుల సంగతి చెప్పనక్కర్లేదు. కరోనా విజృంభణతో అమెరికా సహా పలు దేశాల్లో లాక్డౌన్ విధిం చిన సంగతి తెలిసిందే. దీంతో చాలాచోట్ల ఇండియన్ స్టోర్స్ అందుబాటులో లేవు. మరోవైపు వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని బయటి వస్తువులను తెచ్చుకోవ డం కంటే ఇంట్లో చేసిన వంట కాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో హైదరాబాద్ లో ఉన్న తల్లిదండ్రులు అమెరికా లో ఉన్న తమ పిల్లలు, బంధువుల కోసం వివిధ రకాల ఆహార పదార్థాలను ఎగుమతి చేస్తున్నారు. ఎక్కువ అమెరికాకే.. అంతర్జాతీయ కొరియర్ సంస్థల ద్వారా విదేశాలకు ఎగుమతవుతున్న నిత్యావసరాల్లో 90 శాతానికిపైగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు వెళ్తుండగా మరో 10 శాతం కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, బ్రిటన్ తదితర దేశాలకు వెళ్తున్నాయి. యూరోప్ దేశాల్లో పన్నుల భారం ఎక్కువగా ఉండడంతో ఆ దేశాల్లో ఉన్న తమ వాళ్లకు హైదరాబాద్ నుంచి ఆయా వస్తువులను పంపించే వారి సంఖ్య తక్కువని కొరియర్ సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. సగటున రోజుకు 50 నుంచి 100 క్వింటాళ్ల వరకు ఇక్కడి నుంచి వివిధ రకాల ఆహార పదార్థాలు విదేశాలకు తరలివెళ్తున్నాయి. ఒక్కోసారి 500 క్వింటాళ్ల వరకు కూడా పచ్చళ్లు, పిండివంటల పార్శిళ్లు వెళ్తున్నట్టు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారి ఒకరు చెప్పారు. కాగా, ఒక్కో ప్యాకింగ్‌లో 10 – 25 కిలోల వరకు వస్తువులుంటున్నాయి. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారు హైదరాబాద్‌లోని తమ ఇంటి నుంచి కావలసిన వస్తువులను తెప్పించుకుంటున్నారు. కాలిఫోర్నియా, ఒక్లహామా, న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా తదితర ప్రాంతాలకు ఎక్కువ ఎగుమతి అవుతున్నాయి. ఇంటి నుంచే పంపించేయొచ్చు కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో అంతర్జాతీయ ప్రయాణాలు నిలిచిపోయాయి. అదే సమయంలో దేశీయ, అంతర్జాతీయ కార్గో సర్వీసుల సంఖ్య భారీగా పెరిగింది. గతంలో రోజుకు 17 కార్గో విమానాలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లేవి. ప్రస్తుతం 37 విమానాలు వివిధ దేశాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. కరోనా మందులు, ఇతర ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు, పీపీఈ కిట్లు తదితర వస్తువులు బల్క్‌గా రవాణా అవుతున్నాయి. అలాగే, అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఉన్న తమ పిల్లలకు, బంధువులకు పంపించే పార్శిళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. డీహెచ్ఎల్, ఫెడాక్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు వీటిని ఎగుమతి చేస్తున్నాయి. ఈ సంస్థలకు అనుబంధంగా నగరం నలమూలలా 250 నుంచి 300కుపైగా అనుబంధ కొరియర్ సంస్థలు పని చేస్తున్నాయి. వీటిలో పనిచేసే సిబ్బంది వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకొని నేరుగా వారిళ్ల వద్దకే వెళ్లి ప్యాకింగ్ చేసి పార్శిల్ సంస్థలకు తరలిస్తారు. గతంలో కిలోకు రూ.500 తీసుకొనేవారు. ఇప్పుడీ మొత్తం రూ.600కు పెంచేశారు. సరుకు పరిమాణాన్ని బట్టి చార్జీల్లో కొంత మేరకు తగ్గింపూ ఉంటుంది. దీంతో అమెరికాలో ఒకేచోట ఉండి చదువుకుంటున్న తమ పిల్లల కోసం ఇక్కడి తల్లిదండ్రులు నలుగురైదుగురు కలిసి బల్క్‌గా పెద్దమొత్తంలో పంపిస్తున్నారు. లాక్డౌన్ నుంచి డిమాండ్ పెరిగింది ప్రధాన కొరియర్ సంస్థకు ఏజెంట్‌గా పని చేస్తున్నాను. గతంలో రోజుకు 50 ఆర్డర్ల కంటే తక్కువగా ఉండేవి. ఇప్పుడు వంద వరకు వస్తున్నాయి. ఒక పార్శిల్ 10 కిలోల నుంచి ఎంత బరువైనా ఉండవచ్చు. 10 కిలోల కంటే తక్కువగా పంపించేవాళ్లు ఉండరు. – రమేష్, కొరియర్, తార్నాక పక్కా శానిటైజ్ చేస్తాం కోవిడ్ కారణంగా ప్రతి పార్శిల్‌ను శానిటైజ్ చేస్తున్నాం. ప్రధాన కొరియర్ సంస్థల్లోనూ, తిరిగి అక్కడ వినియోగదారులకు అందజేసేటపుడు కచ్చితంగా శానిటైజ్ చేస్తాస్తారు. పైగా అమెరికాకు చేరాక ఒకరోజు గోడౌన్లోనే ఉంచి ఆ మర్నాడు వినియోగదారులకు చేరవేస్తారు. – సురేష్‌రెడ్డి, చైతన్యపురి ఫుడ్ ఐటెమ్సే ఎక్కువ గతంలో అన్ని రకాల వస్తువులను పంపించేవారు. ఇప్పుడు ఫుడ్ ఐటెమ్స్ ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. పచ్చళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆ తరువాత పిండివంటలు, స్వీట్లు ఎక్కువగా వెళ్తున్నాయి. – ఉదయ్, యూఎస్ కొరియర్ సర్వీస్, బేగంపేట -
ఆవకాయ.. టేస్టే వేరు..
ఆవకాయ పచ్చడిలేని ఇల్లు జంటనగరాల్లో ఉండదంటే అతిశయోక్తి కాదు. వేసవి వచ్చిందంటే మామిడి సీజన్ మొదలవుతుంది. తెలుగు లోగిళ్లలో ఆవకాయ పచ్చడికి ఉన్న ప్రత్యేకతే వేరు. నగరంలో ఊరగాయల వాడకం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో వీడియోలు చూసి చాలామంది ఇళ్లలోనే పచ్చడి చేసుకుంటున్నారు. దానికితోడు కరోనా కారణంగా పచ్చళ్ల కోసం మార్కెట్లను ఆశ్రయించకుండా ఇంట్లో తయారు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే.. పచ్చడి ప్రియులు ఎంతగానో ఎదురుచూసే పచ్చడి మామిడి కాయలు మార్కెట్లోకి వచ్చేశాయి. గతంలో కంటే కాస్త ధర ఎక్కువగా ఉన్నా వాటికి ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. మహిళలు మార్కెట్‌కు వచ్చి వాటిని కొనుగోలు చేసి వారి వద్దే ముక్కలు చేయించుకొని తీసుకెళ్తున్నారు. దిల్సుఖ్నగర్: మలక్‌పేట్, మహేశ్వరం జోన్ పరిధిలోని ఇళ్లలో మామిడికాయ పచ్చడి పెట్టడంలో అందరూ బిజీగా ఉన్నారు. పెళ్లిళ్లు, పేరంటాలు.. ఇంట్లో ఏ కార్యం జరిగినా అక్కడ ఆవకాయ ఉండాల్సిందే.. పప్పులో ఉప్పు తగ్గినా.. కూరలో కారం తగ్గినా.. ఆవకాయ తోడైతే భోజనం సంపూర్ణంగా ముగిసినట్లే.. లాక్డౌన్ కారణంగా బయటకు వెళ్లడం చాలా వరకు తగ్గించారు. కూరగాయల కోసం నిత్యం మార్కెట్లకు వెళ్లకుండా వారానికి సరిపడా తెచ్చుకుంటున్నారు. దాంతో కొన్ని సమయాల్లో ఆవకాయ పచ్చడితోనే భోజనం లాగించేస్తున్నారు. మామిడి పచ్చళ్లలో రకాలెన్నో... మామిడి పచ్చడిలో రకాలు అనేకం.. కానీ ఎక్కువగా ఇష్టపడేవి ఆవకాయ, అల్లం పచ్చడి మాత్రమే.. వేసవిలో వచ్చే పుల్లటి మామిడితో తయారు చేయించుకొని ఏడాదంతా నిల్వ ఉంచుకుంటారు. పేద, మధ్యతరగతి వారి ఇళ్లలోనే ఎక్కువగా మామిడి పచ్చడి ఉంటుందనేది ఒకప్పటి మాట.. సంపన్నులు సైతం మామిడి పచ్చడికే జైకొడుతున్నారు. పెరిగిన మామిడికాయ ధరలు.. గతేడాది మామిడి దిగుబడి అంతగా లేదు. అయినా వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న కాయలతో పచ్చళ్లను తయారు చేసుకున్నారు. గతేడాది ఒక్కో కాయ ధర రూ.10 నుంచి రూ.20 వరకు విక్రయించారు. ఈ సంవత్సరం మామిడి దిగుబడి బాగానే ఉంది. పచ్చడి ప్రియులకు కావాల్సిన రకం కాయలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రైతులు, వ్యాపారులకు గిట్టుబాటు అయ్యింది. మార్కెట్లో మంచి రకం కాయ ఒక్కటి రూ.20 నుంచి రూ.25 వరకు ధర పలుకుతోంది. సీజన్ ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో కొనుగోళ్లు కూడా పెరిగాయి. -
ఆహా! ఆవకాయ
పచ్చళ్ల సీజన్ వచ్చేసింది.. మార్కెట్లో మామిడి, ఊసిరి, పండు మిర్చి, చింతకాయలు సందడి చేస్తున్నాయి.. ఏడాదికి సరిపోను పచ్చళ్లు తయారు చేసుకోవడం ఆనవాయితీ.. మామిడికి మంచి గిరాకీ ఉంది.. ముద్దపప్పు, ఆవకాయకు తోడు నెయ్యి ఉంటే నోరురాల్సిందే.. ప్రస్తుతం లాక్డౌన్ ఉన్నా నిబంధనలు పటిస్తూనే పచ్చళ్ల తయారీలో మహిళలు మునిగిపోయారు. సాక్షి, విజయవాడ: ఊరగాయ పచ్చళ్ల తయారీకి కృష్ణా జిల్లా ప్రసిద్ధి. పచ్చడి నిల్వకు అనువుగా ఉండే కాయలు అందుబాటులో ఉన్నాయి. అందులో మామిడి పచ్చడికి అగ్రస్థానం ఉంది. ఇక్కడ తయారీ చేసినా పచ్చళ్లు దేశవిదేశాలకు సరఫరా చేస్తుంటారు. పల్లె నుంచి పట్టణాల వరకు ప్రజలు పచ్చళ్లు సొంతగా తయారు చేసుకునే అలవాటు తెలుగు ప్రజలకు ఎప్పటి నుంచో ఉంది. దీంతో మహిళలు రకరకాల ఊరగాయ పచ్చళ్లు, వడియాలు, అప్పడాలు, ఊరమిరపకాయలు ఏడాదికి సరిపడా సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. మామిడి తరువాత చింతకాయ, ఊసిరికాయ, మాగాయి పచ్చళ్లు ఉంటాయి. ఎవరి ఆర్థిక పరిస్థితి, ఇంట్లో తినేవారి తిండిపుష్టిని పట్టి ఏడాదికి సరిపోను పచ్చళ్లు తయారు చేసుకుని నిల్వ చేసుకుంటారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూనే... కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. నిబంధనలు పరిధిలో మహిళలు వేసవిలో పట్టాల్సిన ఊరగాయపచ్చళ్లు పట్టేస్తున్నారు. ఉదయం లాక్డౌన్ సడలించిన సమయంలో మహిళలు హడావుడిగా మార్కెట్‌కు, రైతుబజార్లకు వచ్చి మామిడికాయలు కొనుగోలు చేసి అక్కడే అందుబాటులో ఉంటే మేదర్లు చేత ఆవకాయ ముక్కలు కొట్టించుకుని 9 గంటల లోగా ఇళ్లకు చేరుతున్నారు. అక్కడ నుంచి ఒకటి రెండు రోజుల్లో రుచికరమైన ఆవకాయ పచ్చడి సిద్ధం చేస్తున్నారు. పురుషులు ఇళ్లలోనే ఉండటం ఊరగాయ పచ్చళ్లు, వడియాలు తయారీలో మహిళలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మహిళల ముందు చూపు.. రాత్రికి రాత్రి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినా ఆంధ్రా మహిళలు ఏమాత్రం బెదిరిపోలేదు. నెలరోజులుగా ఇళ్లలో కూరలు, సరుకులు లేకపోయినా.. కుటుంబాలు పస్తులు ఉండకుండా నాలుగు పచ్చడి మెతుకులతోనైనా భోజనం కానిచ్చేయడం వెనుక మహిళల ముందు చూపు ఎంతో ఉంది. పచ్చళ్లకు తోడుగా వడియాలు, అప్పడాలు కలిపారంటే భోజనం సంపూర్ణంగా పూర్తయినట్లే. ప్రస్తుత వేసవిలో ఊరగాయపచ్చళ్లు పెట్టుకోకపోతే ఏడాదంతా ఇబ్బంది పడాల్సి వస్తుందని పద్మావతి అనే మహిళ ‘సాక్షి’కి తెలిపింది. లాక్డౌన్ ఎత్తి వేసే వరకు ఆగితే మామిడికాయలు పండిపోయి పచ్చడి పాడైపోతుందని, అందువల్ల తప్పని పరిస్థితుల్లో ఇప్పుడే పెట్టేస్తున్నామని చెబుతున్నారు. నిరుపేదలకు ఉపాధి.. వెదురు కర్రతో తడికలు, బుట్టలు తయారు చేసుకునే మేదర్లకు ప్రస్తుత సీజన్లో మామిడి కాయలు ముక్కలుగా నరికి ఇచ్చి నాలుగు రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక్కొక్క కాయను ముక్కలుగా కట్ చేయడానికి సైజును బట్టి రూ.5 నుంచి రూ.10 వసూలు చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం పూట మూడు గంటలు కష్టపడితే రూ.200 వరకు ఆదాయం వస్తోందని కేదారేశ్వరపేట వంతెన వద్ద మామిడి కాయలు తరిగే ప్రసాద్ తెలిపాడు. లోకమణికి డబ్బులు పంపిస్తున్న ఎన్నారైలు -
పిందె విందు
వేసవికాలం వస్తోందంటే ఎండలు మండుతుంటాయి... ఒక పక్క నుంచి వడగాడ్పులు ... మరో పక్కనుంచి మామిడి గాలులు వీస్తాయి కాయలు పెద్దవయ్యే వరకు ఊరుకోగలమా... చెట్టు కింద రాలిన పిందెలను ఏరి ఏదో ఒకటి చేసేయొద్దు... పిందే కదా అని ఏరి పారేయద్దు... అందులోనూ రుచి ఉంది... తిని చూడండి... మీకు నచ్చి తీరుతుంది... కావాలంటే ఈ పిందె మీద ఒట్టు... పిందె విందు చేసుకు తిందాం... వడు మాంగా కావలసినవి: మామిడి పిందెలు – రెండు కప్పులు; (మామిడి పిందెలు గుండ్రంగా ఉండాలి); ఉప్పు – తగినంత (రాతి ఉప్పు మంచిది. మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి); నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు. పొడి కోసం: ఎండు మిర్చి – 20; మెంతులు – అర టీ స్పూను; ఆవాలు – ముప్పావు టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఇంగువ – పావు టీ స్పూను. తయారీ: ∙ముందుగా మామిడి పిందెలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి, కాసేపు నీడలో ఆరబెట్టాలి ∙ఒక పాత్రలో ఆరిన మామిడి పిందెలు వేసి వాటి మీద నూనె వేసి బాగా కలపాలి (అలా చేయడం వల్ల నూనె అన్ని మామిడి పిందెలకు పడుతుంది) ∙బాణలిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వరసగా ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి చల్లారాక, ఉప్పు, ఇంగువ జత చేసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙పావు కప్పు నీళ్లను మరిగించి చల్లార్చాక, పొడికి జత చేసి మెత్తటి ముద్దలా అయ్యేలా చేయాలి ∙ఈ మిశ్రమాన్ని మామిడిపిందెల మీద పోసి కిందకి పైకి బాగా కలపాలి ∙రోజుకి మూడు నాలుగుసార్ల చొప్పున అలా సుమారు మూడు రోజులు కలపాలి ∙మామిడిపిందెలు మెత్తగా అయ్యి తినడానికి అనువుగా తయారవుతుంది. మామిడి ఔషధం వేసవి వస్తోందనే సమాచారాన్ని మామిడి కాయలు మోసుకొస్తాయి. ఆ సమాచారంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే విటమిన్లు, మినరల్స్నూ తీసుకొస్తాయి. మండు వేసవి రాక ముందే అందరినీ నోరూరించే మామిడి కాయల వల్ల మంచి ఆరోగ్యం వస్తుంది ∙మామిడిలో పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది ∙క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది ∙కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గిస్తుంది ∙మామిడిలో అధిక మొత్తంలో ఉండే పెక్టిన్, పీచు పదార్థం రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తుంది. పెక్టిన్.. ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడకుండా ఉంచుతుంది ∙బరువు పెరగడానికి సహాయపడుతుంది ∙రక్త హీనతను తగ్గిస్తుంది ∙మామిడిలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల, గర్భధారణ సమయంలో గర్భిణీలకు అవసరమైన ఇనుము వీటి ద్వారా పుష్కలంగా లభిస్తుంది ∙మొటిమల నివారణకు మామడి చక్కని ఔషధం. చర్మానికి అడ్డు పడే రంధ్రాలు తెరుచుకోవటం వల్ల మొటిమలు ఏర్పడటాన్ని నివారిస్తుంది ∙వృద్ధాప్యాన్ని నివారిస్తుంది ∙మామిడికాయలో ఉండే ఏ, సి విటమిన్లు శరీరంలో అధికమొత్తం కొల్లాజెన్ ప్రోటీన్ ఉత్పత్తి చేయడానికి సహాయం చేస్తాయి ∙మామిడికాయలో అధికంగా ఉండే విటమిన్ బి 6 మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపకరిస్తుంది ∙రోగనిరోధక శక్తి పెంచుతుంది ∙మామిడిలో అధిక పరిమాణంలో ఉండే బీటా కెరొటిన్ అనే కెరొటినాయిడ్ వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది ∙కంటి ఆరోగ్యానికి మామిడి చక్కని ఔషధం. మామిడికాయ ముక్కలు ప్రతిరోజూ తీసుకుంటే విటమిన్ ఏ లభిస్తుంది. తద్వారా రేచీకటి, కళ్లు పొడిబారడం వంటి సమస్యలు దూరమై, కంటి చూపు మెరుగుపడుతుంది ∙పచ్చి మామిడికాయ రసంలో నీళ్లు, కొంచెం పంచదార కలిపి తాగితే శరీరం చల్లగా మారి, వేసవిలో వడదెబ్బ ప్రమాదాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది ∙సూర్యుని వేడి వల్ల మన శరీర వేడి తగ్గక పోతే, మూత్రవిసర్జన ఆగి, మూత్రపిండాలు విషపదార్థాలతో నిండే ప్రమాదం ఉంటుంది. దీనిని నివారించడానికి మామిడికాయ ఎంతో ఉపయోగపడుతుంది. కన్ని మాంగా అచార్ కావలసినవి: మామిడి పిందెలు – కేజీ; కారం – 4 టేబుల్ స్పూన్లు; ఉప్పు – పావు కేజీ; ఇంగువ – టీ స్పూను; ఆవాలు – 50 గ్రాములు (పొడి చేయాలి). తయారీ: ∙ముందుగా మామిడిపిందెలను శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి, తడి పోయేవరకు ఆరబెట్టి, ముచికలు కట్ చేయాలి ∙తగినన్ని నీళ్లకు ఉప్పు జత చేసి మరిగించి చల్లార్చాలి ∙ఒక పెద్ద జాడీలో ముందుగా మామిడి పిందెలు వేసి, వాటి మీద నీళ్లు పోసి (పిందెలన్నీ మునగాలి) మూత పెట్టి, మూడు రోజులు అలాగే ఉంచాలి ∙నాలుగవ రోజున నీళ్లను వడకట్టి పిందెలు వేరు చేయాలి ∙ఈ నీటికి కారం, ఇంగువ, ఆవ పొడి జత చేసి బాగా కలపాలి ∙ఈ నీటిని మళ్లీ జాడీలో పోసి, ఆ పైన మామిడి పిందెలు వేసి బాగా కలిపి మూత గట్టిగా బిగించి, సుమారు వారం రోజుల తరవాత తీసి వాడుకోవాలి. కడు మాంగా అచార్ కావలసినవి: మామిడి పిందెలు – 5; ఆవాలు – టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; పచ్చిమిర్చి – 6; పసుపు – పావు టీ స్పూను; మెంతి పొడి – టీ స్పూను; కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – 4 టేబుల్‌స్పూన్లు. తయారీ: ∙మామిడిపిందెలను శుభ్రంగా కడిగి, తడిపోయేవరకు ఆరబెట్టి, చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి ∙బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి ∙పసుపు, కారం కూడా వేసి బాగా వేయించి, చిన్న కప్పుడు నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి ∙చివరగా మామిడికాయ ముక్కలు వేసి సుమారు పది నిమిషాలు ఉడికించాలి ∙మిశ్రమం దగ్గరపడి చిక్కగా తయారయ్యాక, గాలిచొరని సీసాలోకి తీసుకోవాలి ∙(ఇష్టపడేవారు కొద్దిగా బెల్లం తురుమును ఎండబెట్టి కలుపుకోవచ్చు) -
ఒక్క ఐడియా ఆమె జీవితాన్నే మార్చేసింది!
ఉత్తర కన్నడ జిల్లా తట్టక్క అనే గ్రామంలో శశికళ శాంతారామ ఇల్లు ఎక్కడంటే ఎవరైనా చెబుతారు. ఇంటికి వెళ్తుండగానే కమ్మని ఊరగాయ ఘుమఘుమలు ఆహ్వానిస్తాయి. ఇంట్లో ఊరగాయ తయారీలో తీరిక లేకుండా శశికళ కనిపిస్తారు. ఒక సాధారణ మహిళ స్వశక్తిని నమ్ముకుని పదిమందికి ఉపాధినిచ్చేలా ఎదిగారు. సాక్షి, బళ్లారి: ఒక ఐడియా జీవితాన్నే మార్చేసింది అని టీవీల్లో,సినిమాల్లో,లేదా అక్కడక్కడ ఏవరో మాట్లాడటం చూస్తుంటాం. మారుతున్న కాలానుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇంటి వద్దనే ఉంటూ స్వయం ఉపాధితో ఎదగవచ్చని చాటుతోంది శశికళ శాంతరామ అనే వనితామణి. ఉత్తర కన్నడ జిల్లా సిద్దాపుర తాలూకా తట్టక్క అనే గ్రామంలో శశికళ శాంతరామ తయారీ చేస్తున్న ఊరగాయలు చుట్టుపక్కల జిల్లాల్లో ఎంతో ఖ్యాతి చెందాయి. నిమ్మతొక్కను పడేయాలా? పేద కుటుంబం,ఉన్నది ఒక ఎకరా పొలంలో వ్యవసాయం చేసుకుంటూ సాదాసీదా జీవనం సాగిస్తున్న ఆమెకు ఒక ఐడియా జీవితాన్నే మార్చేసింది. ఇంట్లో వంటకు నిత్యం ఉపయోగించే నిమ్మకాయ తొక్కును తొక్కే కదా అని పారవేస్తాం. ఆమె తొక్కును ఎందుకు పారవేయాలి? అని ఆలోచించి ఆమె ప్రతి రోజు తీసిన తొక్కులను ఆరవేసి ఎండిన తర్వాత రుచికరమైన చాట్ మసాలాను ఇంట్లో తయారీ చేసి నిమ్మకాయ తొక్కుకు అంటించి ఇంట్లో కుటుంబసభ్యులకు అందజేసింది. అదే ఆమె జీవితంలో మార్పునకు తొలి అడుగు. అలా తయారు చేసిన నిమ్మకాయ తొక్కుతో లెమన్ చాట్ తయారీ చేసి,కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల వారికి, బంధువులకు రుచి చూపించింది. ఇంకేముంది ప్రతి ఒక్కరు పొగడ్తలే పొగడ్తలు. అప్పటినుంచి చాట్ మసాలను తయారు చేసి ప్యాకెట్లుగా అమ్మకాలు ప్రారంభించింది. ఊరగాయల మీద దృష్టి ఆ తరువాత నిమ్మకాయ ఊరగాయల మీద దృష్టి పడింది. నాణ్యమైన దినుసులు ఉపయోగించిన చేసిన ఊరగాయ కొద్దికాలానికి అందరి నోళ్లలో నానింది. ఇక మామిడి, ఉసిరి ఇలా అన్ని రకాలు ఊరగాయలు తయారీ చేస్తోంది శశికళ. జిలకరతో తయారీ చేసిన ఊరగాయలకు మరింత డిమాండ్ ఏర్పడిందంటోంది ఆమె. ఆరోగ్యానికి మేలు చేసే విధంగా పలు రకాలు పదార్థాలను ఉపయోగించడంతో తట్టక్కన ఉప్పిన కాయకు (ఊరగాయకు) భలే డిమాండ్ ఏర్పడింది. ఉత్తర కన్నడ జిల్లాలో కాకుండా ప్రస్తుతం ధార్వాడ, బెంగళూరు, బాగల్‌కోట ఇలా పలు జిల్లాల్లో కూడా ఆమె తయారీ చేసిన ఊరగాయలకు గిరాకీ ఉంది. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ అదే తినాలనిపించే విధంగా, వట్టి ఊరగాయతోనే కడుపునిండా భోజనం చేసే విధంగా రుచి ఉంటుందని చెబుతారు. ఆదాయం, సంతృప్తి: శశికళ ఆమె సాక్షితో మాట్లాడుతూ మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని, తాను ఇంటి వద్దనే కూర్చొని వంట పని,ఉన్న ఒక ఎకరం పొలంపనులు చేసుకుని ఉన్నప్పుడు నిమ్మతొక్కుతో చాట్‌మసాలా ఆలోచన వచ్చిందన్నారు. అదే కొత్త జీవితాన్ని ప్రసాదించిందన్నారు. తాను ఉపాధి పొందడంతో పాటు పదిమందికి ఉపాధి కల్పిస్తూన్నట్లు చెప్పారు. 10 సంవత్సరాలకు పైగా ఇంటి పట్టునే కుటీర పరిశ్రమను నెలకొల్పానని, ఆదాయంతో పాటు ఎంతో తృప్తి కలుగుతోందన్నారు. పొలంలోనే నిమ్మకాయ, మామిడి తదిరాలను పండించి ఊరగాయలకు ఉపయోగిస్తున్నా, పెట్టుబడులు పోను ఐటీ ఇంజినీర్లు, డాక్టర్లతో సమానంగా ఆదాయం పొందుతున్నా, ఇంతకంటే ఆనందం ఏముంది? అని అన్నారు. -
పల్లీ ఫుల్ బెల్లీ ఫుల్
చెనక్కాయలన్నా, పల్లీలన్నా ప్రాణం లేచివస్తుంది అందరికీ. ఉడకబెట్టి తినడం, వేయించి పంటి కింద పటపటలాడించడమూ మామూలే! ఇక్కడ చూడండి. గోంగూరని పల్లీలతో మిక్స్ చేయండి. పల్లీలతో మురుకులు ఎలా చేయొచ్చో చూడండి. పల్లీతో పచ్చిపులుసు చేయండి. నాలుగు టొమాటోలు వేసి పచ్చడి నూరండి.ఇది వానల సమయం.వేడివేడి అన్నంలోకి లేదా వేడివేడి చిరుతిండి గానూ ఇవి వెంటనే ట్రై చేయండి. పీనట్ బటర్ కావలసినవి: పల్లీలు – ఒక కప్పు; తేనె – ఒక టేబుల్ స్పూను; పల్లీ నూనె – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – కొద్దిగా తయారీ: ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక పల్లీలు వేసి బాగా దోరగా వేయించి దింపేయాలి ∙పప్పు గుత్తితో ఒత్తుతూ పైన పొట్టును తీసేయాలి ∙పల్లీలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ఒక టేబుల్ స్పూను పల్లీ నూనె, ఒక టేబుల్ స్పూను తేనె, అర టీ స్పూను ఉప్పు వేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ∙ఈ బటర్ చపాతీతో కాని, బ్రెడ్‌తో కాని తింటే రుచిగా ఉంటుంది. పల్లీ గోంగూర పచ్చడి కావలసినవి: గోంగూర ఆకులు – మూడు కట్టలు; పల్లీలు – ఒక కప్పు; ఎండు మిర్చి – 10; ధనియాలు – ఒక టీ స్పూను; వెల్లుల్లి రేకలు – 4; ఉల్లి తరుగు – పావు కప్పు; ఉప్పు – తగినంత; చింతపండు – నిమ్మకాయంత; పచ్చి మిర్చి – 4; నూనె – రెండు టేబుల్ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఎండు మిర్చి, ధనియాలు వేసి వేయించాలి ∙వెల్లుల్లి రేకలు, పల్లీలు వేసి పల్లీల పచ్చి వాసన పోయేవరకు బాగా వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి మరోమారు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పచ్చి మిర్చి వేసి దోరగా వేయించి తీసేయాలి ∙ఆ బాణలిలోనే మరి కాస్త నూనె వేసి కాగాక గోంగూర ఆకులు వేసి వేయించాలి కొద్దిగా వేగాక చింతపండు జత చేసి మరోమారు వేయించాలి ∙ఆకు బాగా మెత్తబడ్డాక దింపి చల్లార్చాలి ∙మిక్సీలో పల్లీలు వేసి మెత్తగా చేయాలి ∙పచ్చి మిర్చి, గోంగూర, ఉప్పు జత చేసి మెత్తగా మిక్సీ పట్టాలి ∙కొద్దిగా నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించి, తయారుచేసి ఉంచుకున్న పచ్చడికి జతచేయాలి. పల్లీ మురుకులు కావలసినవి: బియ్యప్పిండి – 4 కప్పులు; పల్లీల పొడి – ఒక కప్పు; నువ్వులు – 3 టీ స్పూన్లు; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – తగినంత తయారీ: ∙ఒక పాత్రలో బియ్యప్పిండి, పల్లీల పొడి, నువ్వుల పొడి, మిరప కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి ∙2 టేబుల్ స్పూన్ల వేడి వేడి నూనె జత చేయాలి ∙కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ మురుకుల పిండిలా కలుపుకోవాలి ∙మురుకుల మౌల్డ్‌కి నూనె పూయాలి ∙కొద్దికొద్దిగా పిండి తీసుకుని మౌల్డ్‌లో ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, పిండిని మురుకులాగ నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి ∙ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిదే. బీరకాయ పల్లీల కూర కావలసినవి: వేయించిన పల్లీలు – పావు కప్పు; పచ్చికొబ్బరి ముక్కలు – పావు కప్పు; నూనె – 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఎండు మిర్చి – 3; కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఉల్లి తరుగు – అర కప్పు; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; మిరప కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; బీరకాయలు – అర కిలో. తయారీ: ∙బీరకాయల చెక్కు తీసి, చిన్నచిన్న ముక్కలు చేయాలి ∙మిక్సీలో పల్లీలు, కొబ్బరి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా చేయాలి ∙స్టౌ మీద బాణలిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాలి ∙కరివేపాకు, పసుపు జత చేసి వేయించాలి ∙ఇంగువ, ఉల్లి తరుగు జత చేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ∙ధనియాల పొడి, మిరప కారం, ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు వేసి మసాలా వేగేవరకు ఉంచాలి ∙బీరకాయ ముక్కలు వేసి బాగా కలిపి, కప్పుడు నీళ్లు పోసి మరోమారు బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి ∙మిక్సీ పట్టిన కొబ్బరి మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి, మూత పెట్టి ఉడికించాలి ∙నూనె పైకి తేలాక, కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేయాలి. పీనట్ బటర్ కావలసినవి: పల్లీలు – ఒక కప్పు; తేనె – ఒక టేబుల్ స్పూను; పల్లీ నూనె – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – కొద్దిగా తయారీ: ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక పల్లీలు వేసి బాగా దోరగా వేయించి దింపేయాలి ∙పప్పు గుత్తితో ఒత్తుతూ పైన పొట్టును తీసేయాలి ∙పల్లీలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ఒక టేబుల్ స్పూను పల్లీ నూనె, ఒక టేబుల్ స్పూను తేనె, అర టీ స్పూను ఉప్పు వేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ∙ఈ బటర్ చపాతీతో కాని, బ్రెడ్‌తో కాని తింటే రుచిగా ఉంటుంది. పల్లీ రైస్ కావలసినవి: అన్నం – రెండు కప్పులు; పల్లీలు – 6 టీ స్పూన్లు; నువ్వులు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; కొబ్బరి తురుము – 2 టీ స్పూన్లు; జీడిపప్పులు – 10; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఎండు మిర్చి – 7; ఉప్పు – తగినంత; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; నిమ్మ రసం – ఒక టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి ∙నాలుగు స్పూన్ల పల్లీలు వేసి వేయించాలి ∙పల్లీలు సగం వేగాక మినప్పప్పు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి ∙నువ్వులు వేసి సన్న మంట మీద చిటపటలాడేవరకు వేయించి దింపేయాలి ∙కొబ్బరి తురుము వేసి వేయించి చల్లారాక, మిక్సీ జార్లో వేసి, కొంచెం పలుకులుపలుకులుగా ఉండేలా మిక్సీ పట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక, రెండు టీస్పూన్ల పల్లీలు వేసి వేయించుకోవాలి ∙జీడిపప్పు వేసి రంగు మారేవరకు వేయించాక, కరివేపాకు వేసి వేయించాలి ∙చల్లారబెట్టుకున్న అన్నం వేసి, ఆ పైన మిక్సీ పట్టుకున్న పల్లీ పొడి వేయాలి ∙ఉప్పు కూడా వేసి బాగా కలియబెట్టాలి ∙నిమ్మ రసం, కొత్తిమీర వేసి మరోమారు కలిపి తింటే రుచిగా ఉంటుంది ∙తక్కువ టైమ్‌లో ఎంతో రుచిగా తయారయ్యే ఈ వంటకాన్ని పిల్లలకు లంచ్ బాక్స్‌లో పెడితే ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు. పల్లీల పచ్చి పులుసు కావలసినవి: చింతపండు పులుసు – ఒక కప్పు; వేయించిన పల్లీలు – 2 టీ స్పూన్లు; ఉల్లి తరుగు – పావు కప్పు; నూనె – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 6; పసుపు – పావు టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; వేయించిన నువ్వులు – – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ∙ముందుగా మిక్సీలో పల్లీలు, నువ్వులు, ఎండు మిర్చి, సగం ఉల్లి తరుగు, ఉప్పు వేసి మెత్తగా చేయాలి ∙కొద్దిగా చింతపండు రసం జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙ఈ మిశ్రమాన్ని చింతపండు రసంలో వేసి బాగా కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙జీలకర్ర జత చేసి మరోమారు వేయించాలి ∙మిగిలిన ఉల్లి తరుగు వేసి మెత్తబడేవరకు వేయించాలి ∙పసుపు జత చేయాలి ∙కరివేపాకు జత చేసి బాగా కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న పల్లీ మిశ్రమాన్ని వేసి కలిపి, కప్పుడు నీళ్లు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి సుమారు ఐదు నిమషాల పాటు సన్నటి మంట మీద ఉడికించి దింపేయాలి. పల్లీ టొమాటో ఉల్లి చట్నీ కావలసినవి: నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 3; పల్లీలు – అర కప్పు; వెల్లుల్లి రేకలు – 6; పచ్చి మిర్చి – 4; కరివేపాకు – 2 రెమ్మలు; ఉల్లి తరుగు – ఒక కప్పు; టొమాటో తరుగు – ఒక కప్పు; ఉప్పు – తగినంత; చింతపండు రసం – పావు కప్పు; ఆవాలు – పావు టీ స్పూను; జీలకర్ర – పావు టీ స్పూను; మినప్పప్పు – పావు టీ స్పూను తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఎండు మిర్చి, పల్లీలు, వెల్లుల్లి రేకలు వేసి రంగు మారే వరకు వేయించాలి ∙పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లి తరుగు జత చేసి దోర గా వేయించాలి ∙టొమాటో తరుగు, ఉప్పు, చింత పండు రసం జత చేసి బాగా కలిపి మూత పెట్టి మూడు నిమిషాల పాటు ఉడికించి దింపేసి, బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మినప్పపున్ప, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించి దింపేసి, సిద్ధంగా ఉంచుకున్న పచ్చడిలో వేసి కలపాలి ∙ఈ చట్నీ దోసెలలోకి, ఇడ్లీలలోకి రుచిగా ఉంటుంది. -
హరిపాలెం ఆవకాయ ఆ టేస్టే వేరప్పా..!
అది ఆవకాయ కాదు..ఆహా.. అనిపించే ‘కాయ’.తియ్య తియ్యగా జిహ్వనుజివ్వుమనే పించే ‘కాయ’.రసాయనాలకు దూరంగా..శుచి, శుభ్రతలే ధ్యేయంగాహరిపాలెం వాసులుఅందించే అవకాయ.రుచి అమోఘం అంటున్నారుభోజన ప్రియులు. ఎంత కాలంనిల్వ ఉంటే అంత రుచిఅని చెబుతున్నారు తయారీదారులు. నాణ్యతా ప్రమాణాలే తమ రుచికికారణమంటున్నారు విక్రయదారులు. అచ్యుతాపురం నుంచి అండమాన్ వరకు అమ్మకాలు సాగేఈ తీపి ఆవకాయపై ప్రత్యేక కథనం. అచ్యుతాపురం(యలమంచిలి) :హరిపాలెం తీపి ఆవకాయకు గిరాకీ తగ్గడంలేదు. ఇక్కడ తయారైన ఆవకాయ జిల్లాలు, రాష్ట్రాలు దాటి అండమాన్, పశ్చిమ బెంగాల్ వరకూ ఎగుమతవుతోంది. ప్రోత్సాహం ఉంటే లక్షల్లో పెట్టుబడిపెట్టి డ్రమ్ములకొద్దీ ఆవకాయ సిద్ధం చేసి ఎగుమతి చేయడానికి ఇక్కడి వ్యాపారులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంత క్రేజ్... మార్కెట్లో లభించే వివిధ బ్రాండ్ల ఆవకాయల తయారీకి యంత్రాలను వినియోగిస్తారు. నిల్వ చేసేందుకు రసాయనాలను కలుపుతారు. హరిపాలెంలో తయారు చేసే ఆవకాయకు రసాయనాలు వాడరు. ఏడాది నిల్వచేసిన తరువాతే అమ్మకాలు మొదలుపెడతారు. అన్నీ సమపాళ్లలో కలిపి శుచిగా నిల్వ చేస్తే అద్భుతమైన రుచి ఆవకాయ సొంతమవుతుందని చెబుతున్నారు తయారీదారులు. ఇదీ జీవన చిత్రం... హరిపాలెంలో 100 కుటుంబాలున్నాయి. ఒక్కొక్క కుటుంబం 10 డ్రమ్ముల పచ్చడి తయారు చేస్తుంది. ఏడాది పొడవునా రిటైల్, హోల్‌సేల్‌గా అమ్మకాలు జరుపుతారు. ఏడుదశాబ్దాల నుంచి ఇక్కడ పచ్చడి తయారీనే ఉపాధిగా ఎంచుకున్నారు. వీళ్లు తయారుచేసే విధానంలో ఏడాది వరకు పచ్చడి నిల్వ ఉంటుంది. ‘పెంటకోట’, ‘కాండ్రేగుల’ ఇంటిపేరు ఉన్న కుటుంబాలు ఇక్కడ పచ్చడి తయారీలో సిద్ధహస్తులు. హరిపురం ఆవకాయ ప్రత్యేకతలివే... ♦ కల్వటేరు రకానికి చెందిన మామిడి కాయలను మాత్రమే పచ్చడి తయారీకి వినియోగిస్తారు. ♦ తూర్పుగోదావరి, ఇతర ఏజెన్సీ ప్రాంతాల నుంచి మామిడికాయల్ని దిగుమతి చేసుకుంటారు. ♦ వారపు సంతల్లో మిరిపకాయలు కొనుగోలు చేస్తారు. ♦ రసాయనాలు వినియోగించకుండా తయారు చేసిన బెల్లంను సమీకరిస్తారు. ♦ మే నెలాఖరునాటికి మామిడి కాయ ముక్కలను నానబెట్టి, ఎండబెట్టి తయారీకి సిద్ధం చేస్తారు. ♦ కారం, ఆవపిండి, బెల్లంతో, నూనెలను కలిపి డ్రమ్ముల్లో నిల్వచేస్తారు. ♦ రెండు నెలల పాటు మగ్గిన తరువాత అమ్మకాలు ప్రారంభిస్తారు. ♦ గ్రామంలో హోల్‌సేల్‌గా, ఇతర గ్రామాలకు వెళ్లి రిటైల్‌గా అమ్మకాలు సాగిస్తారు. పెరుగుతున్న ధరలు.. ముడిసరుకుల ధరలు ఏటా బాగా పెరిగిపోతున్నాయని చెబుతున్నారు తయారీ దారులు. టన్ను మామిడి 11వేలు, బస్తా మిరప 14వేలు, బెల్లం వందకిలోలు 5వేలకు లభిస్తున్నాయని అంటున్నారు. మెంతులు, వెల్లుల్లి, ఆవాలు, నూనె ధరలు బాగా పెరిగాయంటున్నారు. ధరలు సంగతి ఎలా ఉన్నా నాణ్యతలో ఎక్కడా రాజీపడమని అదే హరిపాలెం ఆవకాయ ప్రత్యేకతని వివరిస్తున్నారు తయారీదారులు. గత ఏడాది కిలో పచ్చడి ధర రూ.120. ఈ ఏడాది రూ.150గా ఉంది. అండమాన్‌కు ఆవకాయ.. హరిపాలెంలో తయారైన పచ్చడిని ఒడిశా, అండమాన్, విశాఖ ఏజెన్సీ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన రిటైల్ వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. గ్రామంలో హోల్‌సేల్‌గా అమ్మకాలు సాగుతుంటాయి. కొందరు బైక్‌లు, సైకిళ్లపై పచ్చడిని గ్రామాలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. అండమాన్‌లో స్థిరపడిన హరిపాలెం వాసులు ఏదైనా పనిమీద తమ గ్రామానికి వచ్చినప్పుడు వంద నుంచి రెండొందల కిలోల పచ్చడిని అక్కడ విక్రయించేందుకు తీసుకెళుతుంటారు. కరువైన ప్రోత్సాహం... ఆవకాయ తయారీని చిన్నతరహా పరిశ్రమగా హరిపాలెం గ్రామస్తులు 70 ఏళ్ల క్రితం స్వీకరించారు. మే, జూన్లలో ఏడాదికి అవసరమైన ముడిసరుకు సిద్ధం చేసుకోవాలి. ఇందుకు ఒక్కొక్క కుటుంబానికి రూ.3లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పెట్టుబడి అవసరమవుతుంది. పెట్టుబడికి ప్రభుత్వ ప్రోత్సాహం లేదని చెబుతున్నారు తయారీదారులు. నగలు, ఇతర ఆస్తులను తాకట్టుపెట్టి, అధికవడ్డీలకు అప్పులు చేసి ఆవకాయను తయారు చేస్తున్నామని చెబుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కుటుంబానికి రూ.50 వేలు చొప్పున బ్యాంకు రుణం లభించేదని, ఇప్పుడా పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని పట్టించుకోరూ... పచ్చడి తయారీలో డ్రమ్ములు, కోత, ప్యాకింగ్ యంత్రాలు, రిటైల్ వ్యాపారులకు మోపెడ్ల అవసరం ఉంది. ప్రభుత్వం ఆవకాయ తయారీని వృత్తిగా గుర్తించాలి. అవసరమైన సహకారం అందించాలని కోరుతున్నారు హరిపాలెం వాసులు. రసాయనాలకు దూరంగా.. తీపి ఆవకాయకు గిరాకీ పెరిగింది. అన్నీ సమపాలల్లో వేసి శుచిగా తయారు చేస్తాం. రసాయనాలు వాడకుండా తయారు చేయడమే మా ఆవకాయ ప్రత్యేకత. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే మరింత ఉత్పత్తి చేస్తాం. – కాండ్రేగుల శ్రీను -
అయ్యో.. ఆవకాయ!
సాక్షి, ద్వారకాతిరుమల: వేసవి వచ్చిందంటేచాలు పల్లెల్లో ఆవకాయ పచ్చళ్లు ఘుమఘుమలాడేవి. కానీ ఈ ఏడాది గ్రామాల్లో ఆ హడావుడి అంతగా లేదు. పెరిగిన ఆవకాయ ధరలే దీనికి కారణం. గతేడాదే తక్కువగా ఉన్న కాపు ఈ ఏడాది మరీ తగ్గిపోయింది. దీంతో ఆవకాయ ధర అమాంతంగా ఆకాశానికెగసి సామాన్యుడికి అందకుండా ఉంది. దిగుబడి ఢమాల్ రాష్ట్రవ్యాప్తంగా 3,36,956 హెక్టార్లలో మామిడి సాగవుతోంది. దీని ద్వారా ఏటా 40,43,472 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తోంది. అయితే ఈ ఏడాది కురిసిన విపరీతమైన మంచు, ప్రస్తుతం మండిపోతున్న ఎండలు.. వీటికి తోడు ఇటీవల ఈదురు గాలులు, అడపాదడపా కురుస్తున్న వడగండ్ల వానలతో దిగుబడులు సగానికి సగంపైగా çపడిపోయాయి. దీంతో 15 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి రావడం కూడా కష్టమేనని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఉన్న కొద్దిపాటి పంటకూడా ప్రస్తుత తీవ్ర ఎండలకు ఉడికిపోయి రంగు మారుతోంది. దీంతో రైతు తన పంటను అమ్ముకునేందుకు తొందరపడుతున్నాడు. గతంలో ఇక్కడ పండిన పంట బరోడా, అహ్మదాబాద్, నాగపూర్, ఇండోర్, భోపాల్, జోద్పూర్, ముంబయి, ఢిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతయ్యేది. అలాగే మామిడి ముక్కలు గుజరాత్‌లోని నడియాద్ వంటి ప్రాంతాలకు వెళ్లేవి. అయితే ఈసారి దిగుబడుల్లేక ఎగుమతులు కూడా నిలిచిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అ‘ధర’హో సాధారణంగా పచ్చళ్లకు దేశవాళీ, కొత్తపల్లి కొబ్బరి, చిన్నరసాలు, తెల్ల గులాబీ, సువర్ణరేఖ వంటి కాయలను వినియోగిస్తారు. అయితే ఈసారి అవి దొరకని పరిస్థితులు నెలకొనడంతో.. ఏం చేయాలో పాలుపోక పచ్చడి ప్రియులు సతమతమవుతున్నారు. ఒక వేళ మార్కెట్లో ఇవి దొరికినా ఒక్కో కాయ ధర పరిమాణాన్నిబట్టి రూ.15 నుంచి రూ.40 వరకు పలుకుతుండటంతో మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గతేడాది కంటే మామిడి కాపు గణనీయంగా తగ్గింది. ఈదురు గాలులు, వడగాడ్పుల కారణంగా పంట బాగా దెబ్బతింది. అంతకు ముందు పూతను నిలుపుకొనేందుకు అధిక పెట్టుబడులు పెట్టి, చెట్లను కన్నబిడ్డల్లా కాశాం. అయినా దిగుబడి సరిగ్గా రాలేదు. పొలాల్లో అమ్మితేనే మాకు ఒక రూపాయి మిగులుతోంది. అలాకాక మార్కెట్‌కు తీసుకెళ్తే దళారుల వల్ల పెట్టుబడులను నష్టపోవాల్సి వస్తోంది. దేశవాళీ, కొత్తపల్లి కొబ్బరి వంటి కాయలకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఒక్కో కాయ సైజును బట్టి రూ.40 వరకు పలుకుతోంది. – ఘంటా వెంకట నరసింహరావు, రైతు, రాళ్లకుంట, ద్వారకాతిరుమల మండలం మామిడి కాయ ధరా.. అమ్మో! మామిడికాయ ధర వింటే దడపుడుతోంది. మార్కెట్లో చిన్న మామిడి కాయ ధర రూ.15 పైచిలుకే పలుకుతోంది. ఇలాగైతే పచ్చళ్లు పెట్టుకోలేం. కొత్తపల్లి కొబ్బరి, దేశివాళీ కాయలు కొందామంటే రూ.30 నుంచి రూ.40 పలుకుతున్నాయి. – అడపా సత్యన్నారాయణ, వినియోగదారుడు, ఈస్ట్ యడవల్లి, కామవరపుకోట మండలం సందడి కనబడటం లేదు ఏటా ఈ సమయానికి నిల్వ పచ్చళ్లు పెట్టేసేవాళ్లం. ఈ సారి మామిడికాయ దొరక్క ఇంకా పచ్చళ్లు పెట్టలేదు. ధరలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మామిడి కాయల ధరతో పాటు.. పచ్చళ్ల తయారీకి వినియోగించే మిగతా సరుకుల ధరలు కూడా మండిపోతున్నాయి. – కావేటి దేవి, గృహిణి, కొత్తపేట, జంగారెడ్డిగూడెం మండలం -
పచ్చిళ్లు
పచ్చళ్లే! పచ్చికాయలు కనుక పచ్చిళ్లు!పచ్చిగా చెప్పాలంటే..కొంచెం వయలెన్స్ ఉంటే కానీతయారీలో ఘాటు..ప్లేట్లోకి వచ్చాక షూట్ ఎట్ సైటు.. ఉండవు.కారం... ఉప్పు.. ఆవపొడి.. నువ్వులనూనెకలిస్తే.. చేతినిండా కలిపితేజిహ్వ జిమ్మాస్టిక్సే. నోరు ఏరోబిక్సే. వడు మాంగా కావలసినవి: మామిడి పిందెలు – రెండు కప్పులు (మామిడి పిందెలు గుండ్రంగా ఉండాలి); ఉప్పు – తగినంత (రాతి ఉప్పు మంచిది. మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి); నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు పొడి కోసం: ఎండు మిర్చి – 20; మెంతులు – అర టీ స్పూను; ఆవాలు – ముప్పావు టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఇంగువ – పావు టీ స్పూను తయారీ: ►ముందుగా మామిడి పిందెలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి, కొద్ది సేపు నీడలో ఆరబెట్టాలి ►ఒక పాత్రలో ఆరిన మామిడి పిందెలు వేసి వాటి మీద నూనె వేసి బాగా కలపాలి (అలా చేయడం వల్ల అన్ని మామిడి పిందెలకు నూనె పడుతుంది) ►బాణలిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి వరసగా ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి చల్లారాక, ఉప్పు, ఇంగువ జత చేసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ►పావు కప్పు నీళ్లను మరిగించి చల్లార్చి, జత చేసి పొడిని మెత్తటి ముద్దలా అయ్యేలా చేయాలి ►ఈ మిశ్రమాన్ని మామిడిపిందెల మీద పోసి కిందకి పైకి బాగా కలపాలి ►రోజుకి మూడు నాలుగుసార్లు చొప్పున అలా మూడు రోజులు కలపాలి ►మామిడి పిందెలు మెత్తగా అయ్యి తినడానికి అనువుగా తయారవుతాయి ►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నువ్వుల నూనెతో కలుపుకుని తింటే వడు మాంగా రుచిగా ఉంటుంది. టెండర్ మ్యాంగో పికిల్ కావలసినవి: మామిడి పిందెలు – ముప్పావు కిలో; ఉప్పు – ముప్పావు కప్పు; ఆవాలు – టేబుల్ స్పూను; పసుపు – ఒకటిన్నర టీ స్పూన్లు; నువ్వుల నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 20 తయారీ: ►మామిడి పిందెలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి, నీడలో కొద్దిసేపు ఆరబెట్టాలి ►తొడిమలను చాకుతో కట్ చేయాలి ►రాతి ఉప్పును మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ►ఆవాలు మిక్సీలో వేసి మెత్తగా అయ్యాక పసుపు జత చేయాలి ►తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా చేయాలి ►పెద్ద పాత్రలో మామిడి పిందెలు వేసి వాటి మీద నువ్వుల నూనె వేసి బాగా కలపాలి ►ఆవ పొడి జత చేసి మరోమారు కలపాలి ►ఉప్పు వేసి బాగా కలిపి జాడీలోకి తీసుకోవాలి ►మూడు రోజుల పాటు ప్రతిరోజూ రెండు పూటలా పైకి కిందకి కలుపుతుండాలి ►నాలుగో రోజుకి ఊట కిందకి దిగుతుంది ►మిక్సీలో ఎండు మిర్చి వేసి పొడి చేయాలి ►ముందుగా తయారుచేసి ఉంచుకున్న ఊరగాయలో నుంచి వచ్చిన ఊట కొంత తీసి, ఎండు మిర్చి పొడిలో వేసి మెత్తగా చేయాలి ►ఒక పెద్ద పాత్రలోకి ఊరగాయ తిరగదీసి, దాని మీద ఈ మిశ్రమం వేసి, జాడీలోకి తీసుకోవాలి ►పది రోజుల పాటు ప్రతిరోజూ పైకి కిందకి కలపాలి ►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నువ్వుల నూనెతో కలుపుకుంటే వడ దెబ్బ బారి నుంచి రక్షించుకోవచ్చు. కన్ని మాంగా అచార్ కావలసినవి: మామిడి పిందెలు – కేజీ; కారం – 4 టేబుల్ స్పూన్లు; ఉప్పు – పావు కేజీ; ఇంగువ – టీ స్పూను; ఆవాలు – 50 గ్రాములు (పొడి చేయాలి) తయారీ: ►మామిడి పిందెలను శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి, తడి పోయేవరకు ఆరబెట్టి, తొడిమలు తీసేయాలి ►తగినన్ని నీళ్లకు ఉప్పు జత చేసి మరిగించి చల్లార్చాలి ►పెద్ద జాడీలో ముందుగా మామిడి పిందెలు వేసి, వాటి మీద నీళ్లు పోసి (పిందెలన్నీ మునగాలి) మూత పెట్టి, మూడు రోజులు అలాగే ఉంచాలి ►నాలుగవ రోజున నీళ్లను వడకట్టి పిందెలు వేరు చేయాలి ►ఈ నీటికి కారం, ఇంగువ, ఆవ పొడి జత చేసి బాగా కలపాలి ►ఈ నీటిని మళ్లీ జాడీలో పోసి, ఆ పైన మామిడి పిందెలు వేసి బాగా కలిపి మూత గట్టిగా బిగించి, సుమారు వారం రోజుల తరవాత తీసి వాడుకోవాలి. కడు మాంగా అచార్ కావలసినవి: మామిడి పిందెలు – 5; ఆవాలు – టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; పచ్చిమిర్చి – 6; పసుపు – పావు టీ స్పూను; మెంతి పొడి – టీ స్పూను; కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – 4 టేబుల్æస్పూన్లు తయారీ: ►మామిడి పిందెలను శుభ్రంగా కడిగి, తడిపోయేవరకు ఆరబెట్టి, చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి ►బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ►కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి ►పసుపు, కారం కూడా వేసి బాగా వేయించి, చిన్న కప్పుడు నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి ►మామిడికాయ ముక్కలు వేసి సుమారు పది నిమిషాలు ఉడికించాలి ►మిశ్రమం దగ్గరపడి చిక్కగా తయారయ్యాక దింపేయాలి ►చల్లారాక గాలి చొరని సీసాలోకి తీసుకోవాలి (ఇష్టపడేవారు కొద్దిగా బెల్లం తురుము కలుపుకోవచ్చు మామిడి కాయ గ్రేవీ చట్నీ కావలసినవి: పచ్చి మామిడికాయ ముక్కలు – అర కేజీ; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; బెల్లం – ఒక కప్పు; ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 15 (కాశ్మీర్ మిర్చి); కొబ్బరి నూనె – 4 టేబుల్ స్పూన్లు; మెంతులు – పావు టీ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; పచ్చి కొబ్బరి – రెండు కప్పులు; ఇంగువ – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు తయారీ: ►తరిగిన పచ్చిమామిడికాయ ముక్కలను ఒక పెద్ద పాత్రలో వేసి పసుపు, ఉప్పు, బెల్లం జత చేసి కలిపి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలి వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి వేయించి తీసి చల్లార్చాలి ►అదే బాణలిలో ఎండు మిర్చి వేసి వేయించి ఒక పాత్రలోకి తీసుకుని చల్లార్చాలి ►బాణలిలో ఒక టీ స్పూను కొబ్బరి నూనె వేసి కాగాక ఒక టీ స్పూను బియ్యం వేసి వేయించాలి ►మెంతులు కొద్దిగా జత చేయాలి ►మినప్పప్పు కూడా జత చేసి వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి ►మిక్సీలో రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురుము, వేయించిన బియ్యం, మెంతులు, మినప్పప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి ►కొద్దిగా నీళ్లు జత చేయాలి ►స్టౌ మీద బాణలిలో మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి కాగాక ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి ►మామిడికాయ ముక్కలు జత చేయాలి ►మిక్సీ పట్టిన మిశ్రమం జత చేయాలి ►కప్పుడు నీళ్లు పోసి కలపాలి ►ముప్పావు కప్పు కొబ్బరి పాలు పోసి మరోమారు కలిపి మూత పెట్టాలి ►పావు గంట తరవాత మూత తీయాలి ►మామిడి గ్రేవీ చట్నీ అన్నం, చపాతీలలోకి రుచిగా ఉంటుంది. మామిడికాయ పచ్చడి కావలసినవి: మామిడి కాయలు – 4 (పచ్చివి); ఎండు మిర్చి – 8 ; ఉప్పు – తగినంత; పసుపు – చిటికెడు. తయారీ: ►మామిడికాయల తొక్కు తీసి, చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ►ఒక్కో ఎండు మిర్చిని మంట మీద దోరగా కాల్చాలి ►మిక్సీలో ఎండు మిర్చి, మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మెత్తగా చేయాలి ►అన్నంలోకి వేడి వేడి నేతితో కలుపుకుంటే రుచిగా ఉంటుంది. మామిడికాయ – కొత్తిమీర పచ్చడి కావలసినవి: మామిడికాయ ముక్కలు – ఒక కప్పు; కొత్తిమీర – చిన్న కట్ట; నానబెట్టిన పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; ఆవనూనె – అర టీ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 4; పంచదార – అర టీ స్పూను తయారీ: ►మామిడికాయ ముక్కలు, కొత్తిమీర, నానబెట్టిన పచ్చి సెనగ పప్పు, జీలకర్ర పొడి, ఉప్పులను మిక్సీలో వేసి మెత్తగా తిప్పాలి ►ఆవ నూనె వేసి మరోమారు తిప్పాలి ►ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, కొద్దిగా నీళ్లు వేసి తిప్పాలి ►పంచదార జత చేసి మరోమారు తిప్పాలి ►అప్పటికప్పుడు చేసుకునే ఈ చట్నీ అన్నంలో ఏ పదార్థంతోనైనా నంజుకుని తింటే రుచిగా ఉంటుంది. పచ్చి మామిడికాయ పచ్చడి కావలసినవి: మామిడికాయ ముక్కలు – అరకప్పు; వెల్లుల్లి రెబ్బలు – 2; కొత్తిమీర – కొద్దిగా; కరివేపాకు – కొద్దిగా; మిరప కారం – 2 టీ స్పూన్లు; పచ్చి కొబ్బరి తురుము – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత పోపు కోసం: ►ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; నూనె – ఒక టేబుల్ స్పూను. ►పైన చెప్పిన పదార్థాలను (పోపు సామాను మినహాయించి) మిక్సీలో వేసి మెత్తగా తిప్పి గిన్నెలోకి తీసుకోవాలి ►స్టౌ మీద చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించి పచ్చడిలో కలపాలి. -
ఆ రుచే వేరబ్బా!!!
గోదావరి జిల్లా వాసులను తియ్యటి అభిమానం, ఆప్యాయతలకు మారు పేరుగా చెప్పుకుంటారు. తియ్యటి ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజా, తాపేశ్వరం మడత కాజా, ధవళేశ్వరం జీళ్లు, గంగరాజు పాల కోవా... ఒక్కో ప్రాంతం... ఒక్కో తీపి వంటకం.తీపి మాత్రమేనా... కారంలోనూ మాకు మేమే సాటి అంటున్నారు... భీమవరం గోపీ పచ్చళ్ల అధినేత గోపాలరాజు. అతిథులకు ఈ పచ్చళ్లతో కమ్మటి భోజనం వడ్డించి ఆదరిస్తున్నారు... గోపీ పచ్చళ్ల గోపాలరావుతో ఈ వారం ఫుడ్ ప్రింట్స్... గోదావరి జిల్లా వాసులకు గౌరవమర్యాదలతో పాటు రుచికరమైన భోజనం వడ్డించడం సంప్రదాయంగా వస్తోంది. బంధువులు, స్నేహితులకు వెజ్, నాన్‌వెజ్ అన్నిరకాల వంటకాలతో భోజనం ఏర్పాటు చేసినప్పటికీ, గోపీ పచ్చళ్లు వడ్డించకపోతే, తృప్తి చెందరు. ఇంటికి వచ్చినవారికి మంచి భోజనం ఏర్పాటు చేయడమనేది సరదాతో కూడిన మర్యాద. పాతికేళ్లుగా... భీమవరం పట్టణానికి చెందిన యరకరాజు గోపాలరాజు (గోపీ) వంటలు చేసేవారు. అప్పట్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడ వేడుకలు జరిగినా గోపాలరాజు స్వయంగా వంట చేయాల్సిందే. వంటకాలు రుచిగా ఉండటంతో, భోజనం చేసిన వారంతా ‘వంట చాలా బాగుంది’ అని ప్రశంసించేవారు. వంటలతో పాటు పచ్చళ్లు కూడా తయారు చేసేవారు గోపాలరాజు. అందువల్ల చాలామంది ఆయనతో ఊరగాయలు పెట్టించుకునేవారు. క్రమేపీ గోపాలరాజుకు పచ్చళ్ల వ్యాపారం చేయాలనే ఆలోచన కలిగింది. పెద్దగా చదువుకోకపోయినా, వంటలు చేసిన అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టాలనుకున్నారు. పాతిక సంవత్సరాల క్రితం 1000 రూపాయల విలువ చేసే సరకులు అరువు తెచ్చి, ఆ డబ్బుకి సరిపడా వస్తువులు తెచ్చి, నాణ్యత పాటిస్తూ రుచికరమైన వెజ్, నాన్ వెజ్ పచ్చళ్లు తయారు చేసి, అమ్మడం ప్రారంభించారు. కొద్ది కాలానికే గోపీ పచ్చళ్ల ఘాటు ఉభయ గోదావరి జిల్లాలకు వ్యాపించింది. దానితో గోపీ పచ్చళ్లకు డిమాండు పెరిగింది. కొన్ని సంవత్సరాల పాటు ఒంటి చేతి మీదే పచ్చళ్లు తయారుచేశారు గోపాలరాజు. ఈ రోజు మరో పదిమందికి ఉపాధి కల్పించారు. చదువుకోకపోయినా, పెట్టుబడి పెట్టే స్థాయి లేకపోయినా, పట్టుదలతో ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందని నిరూపించారు గోపాలరాజు. విదేశాలలోని తెలుగువారికి తెలుగువారి ఆవ ఘాటు రుచి చూపించారు, చూపిస్తూనే ఉన్నారు.నాణ్యమైన, తాజా వస్తువులను ఉపయోగిస్తూ, పరిశుభ్రత పాటించడం వల్ల ఎంత కాలం నిల్వ ఉన్నా, రుచి చెడకుండా, ఎర్రటి రంగులో ఏడాది పొడవునా కంటికి ఇంపు కలిగిస్తాయి ఈ పచ్చళ్లు అంటారు గోపీ పచ్చళ్ల అధినేత గోపాలరాజు. బొక్కా రామాంజనేయులు, తెలుగు వారికి ఊరగా యలంటే మహా ప్రీతి. ముఖ్యంగా గోదావరి జిల్లా వాసుల ఇళ్లల్లో పచ్చళ్లు లేకుండా ముద్ద దిగదు. వంటలు చేసిన అనుభవం నాకు ఉపాధి గా మారింది. పచ్చళ్లు కూడా చేయడం ప్రారంభించాను. పాతికేళ్లుగా అదే రుచి, నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాను. దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ఒకసారి ఓ ప్రముఖ రాజకీయనాయకుడి ఇంట్లో మా పచ్చళ్లు తిని, ‘ఇవి ఎక్కడి పచ్చళ్లు’ అని అడిగి తెలుసుకుని, మెచ్చుకున్నారట. ఆ సంఘటన నా జీవితంలో మరచిపోలేను. యరకరాజు గోపాలరాజు గోపీ పచ్చళ్ల అధినేత నాకు గత 15 ఏళ్లుగా గోపీ పచ్చళ్లతో అనుబంధం ఉంది. వారు నాటి నుంచి నేటి వరకు గోపీ పచ్చళ్లల్లో రుచి, నాణ్యత ఏ మాత్రం తగ్గ లేదు. కమ్మటి నువ్వుల నూనె, మంచి ఘాటు గల మిరప కారంతో ఈ పచ్చళ్లు చాలా రుచిగా ఉంటున్నాయి. భీమవరం వంటి పట్టణంలో ఇటువంటి రుచి గల పచ్చళ్లు తయారుచేసి, అందించడం అభినందనీయం. ద్వారంపూడి సూర్యనారాయణరెడ్డి, -
పచ్చడి పచ్చడి చేయండి
ఒక్కదాన్ని చితకబాది పచ్చడి చేస్తే... రుచిగా ఉంటుంది.రెండిటిని కలిపి బాది బాది పచ్చడి చేస్తే... రుచిరుచిగా ఉంటుంది...ఈ రకం కాంబినేషన్ పచ్చళ్లు ఆల్రెడీ కలిపి కొడుతున్నాం కాబట్టిదేనితో కలిపినా రుచిగానే ఉంటుంది.కాని వేడి వేడి అన్నంలోకి నేతితో కలిపి తింటే రుచి రెట్టింపవుతుంది.ఇంకెందుకు ఆలస్యం... మీకు నచ్చిన కాంబినేషన్లను పచ్చడి పచ్చడి చేయండి.వేడివేడిగా ముద్దలు ముద్దలు లాగించేయండి. గోంగూర–పండుమిర్చి కావలసినవి: గోంగూర – అర కేజీ; పండు మిర్చి – పావు కేజీ; చింత పండు – 50 గ్రా.; నువ్వుల నూనె – పావు కేజీ; ఉప్పు – తగినంత; మెంతులు – ఒక టేబుల్ స్పూను (వేయించి పొడి చేయాలి); ఆవాలు – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 50 గ్రా.; ఇంగువ – రెండు టీ స్పూన్లు తయారీ: ►గోంగూరను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రం మీద తడి పోయేవరకు నీడలో ఆరబెట్టాలి ►పండు మిర్చిని శుభ్రంగా కడిగి, తొడిమలు తీసి పొడి వస్త్రం మీద ఆరబెట్టాక, ముక్కలు చేయాలి ►స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక గోంగూర, చింత పండు వేసి కలపాలి ►బాగా వేగిన తరవాత దింపేసి, చల్లారనివ్వాలి ►మిక్సీలో పండు మిర్చి ముక్కలు, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా తిప్పి, బయటకు తీసేయాలి ►చల్లారిన గోంగూర వేసి మెత్తగా చేయాలి ►మిక్సీ పట్టిన గోంగూర, పండు మిర్చి మిశ్రమాన్ని జాడీలోకి తీసుకుని బాగా కలపాలి ►మూడు రోజుల తరవాత, ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి ►ఇంగువ జత చేసి కలిపి దింపేయాలి ►చల్లారాక పచ్చడిలో వేసి కలిపి, జాడీలోకి తీసుకోవాలి ►వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. పండుమిర్చి దొరక్కపోతే, పండుమిర్చి పచ్చడిలో కలుపుకోవచ్చు. కొబ్బరి–కొత్తిమీర కావలసినవి: కొబ్బరి ముక్కలు – ఒక కప్పు; కొత్తిమీర తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి – 5; ఉప్పు – తగినంత; చింత పండు – కొద్దిగా; పోపు కోసం:ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – రెండు; నూనె – ఒక టేబుల్ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండు మిర్చి వేసి వేయించి దింపేయాలి ►కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా అయ్యేవరకు తిప్పాలి ►కొత్తిమీర, చింత పండు, ఉప్పు జత చేసి, అన్ని పదార్థాలు బాగా కలిసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి దింపేయాలి ►పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని, వేయించి ఉంచుకున్న పోపును జత చేయాలి ►ఈ పచ్చడి అన్నంలోకి, ఇడ్లీలోకి, దోసెలలోకి రుచిగా ఉంటుంది. టొమాటో– బీరకాయ కావలసినవి: బీరకాయలు – అర కిలో; టొమాటోలు – 4 (పెద్దవి); నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 8; పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 6; ఉల్లి తరుగు – అర కప్పు; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; పోపు కోసం: ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); ఆవాలు + జీలకర్ర – ఒక టీ స్పూను; మినప్పప్పు + పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ►బీరకాయలను శుభ్రంగా కడిగి, (చెక్కు తీయకుండా) ముక్కలు చేయాలి ►టొమాటోలను శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, బీరకాయ ముక్కలు వేసి కలపాలి ►కొద్దిగా మగ్గి నీరు బయటకు వచ్చిన తరవాత టొమాటో ముక్కలు జత చేయాలి ►బాగా మగ్గిన తరవాత దింపి పక్కన పెట్టాలి ►అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి కాగాక ఎండు మిర్చి, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టాలి ►మిక్సీలో ముందుగా ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా చేయాలి ►పోపు వేసి మరోమారు మిక్సీ పట్టి మెత్తగా అయ్యాక, బీరకాయ, టొమాటో ముక్కల మిశ్రమం, తగినంత ఉప్పు వేసి మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు వేసి వేయించాలి ►కొద్దిగా వేగిన తరవాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చి సెనగపప్పు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి ►చివరగా కరివేపాకు వేసి కలపాలి ►తయారైన పచ్చడి జత చేసి రెండు నిమిషాల పాటు బాగా కలియబెట్టి స్టౌ మీద నుంచి దింపేయాలి ►కొత్తిమీరతో అలంకరించి, వేడివేడి అన్నంలోకి వడ్డించాలి. వంకాయ–ఉల్లిపాయ కావలసినవి: వంకాయలు – పావు కేజీ; ఉల్లిపాయ – 1 (పెద్దది); చింతపండు – కొద్దిగా; పచ్చి మిర్చి – 5; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఎండు మిర్చి – 10; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; నూనె – ఒక టేబుల్ స్పూను. తయారీ: ►వంకాయలను శుభ్రంగా కడిగి పొడవుగా ముక్కలు చేసుకోవాలి ►ఉల్లిపాయలను కూడా ముక్కలు చేసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి కాగాక వంకాయ ముక్కలు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు వేసి బాగా కలిపి, మూత పెట్టి, మంట బాగా తగ్గించాలి ►ముక్కలు మెత్తబడ్డాక మంట ఆర్పేసి, ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టాలి ►వేయించి ఉంచుకున్న పోపును కొద్దిగా పక్కన ఉంచుకుని, మిగతా పోపును మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►చల్లారిన వంకాయ, ఉల్లిపాయ ముక్కల మిశ్రమం జత చేసి మరోమారు మిక్సీ తిప్పి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►పక్కన ఉంచుకున్న పోపు, పసుపు జత చేసి కలపాలి ►వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. కొబ్బరి – కందిపప్పు కావలసినవి: కందిపప్పు – ఒక కప్పు; పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు; చింతపండు – కొద్దిగా; ఎండు మిర్చి – 12; ఆవాలు – పావు టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – పావు టీ స్పూను; మినప్పప్పు – పావు టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; జీలకర్ర – అర టీ స్పూను; నూనె – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత తయారీ: ►స్టౌ మీద బాణలి ఉంచి, వేడయ్యాక కంది పప్పు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి దింపేయాలి ►చల్లారిన కందిపప్పును మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ►కొబ్బరి ముక్కలను జత చేసి కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ పచ్చడి మెత్తగా వచ్చేవరకు మిక్సీ పట్టాలి ►ఉప్పు, చింతపండు జత చేసి మరోమారు మిక్సీ పట్టి, పచ్చడిని ఒక పాత్రలోకి తీసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేయించాక, కరివేపాకు జత చేసి మరోమారు కలిపి దింపేసి, పచ్చడి పైన వేసి కలపాలి ►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నెయ్యి, అప్పడాలు, వడియాలు నంచుకుంటూ తింటే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. దోసకాయ – చింత కాయ కావలసినవి: దోసకాయలు – పావు కేజీ; చింత కాయలు – 50 గ్రా.; తరిగిన పచ్చి మిర్చి – 10; ఎండు మిర్చి – 10; ఇంగువ – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్‌స్పూన్లు; ఉల్లి తరుగు – పావు కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 5; తయారీ: ►దోసకాయ తొక్కు తీసి, సన్నగా ముక్కలు తరగాలి ►చింతకాయలను శుభ్రంగా కడిగి, గింజలు తీసేసి, చిన్నచిన్న ముక్కలు చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక తరిగిన పచ్చి మిర్చి వేసి వేయించాలి ►జీల కర్ర, కరివేపాకు జత చేసి వేయించాలి ►మిక్సీలో వెల్లుల్లి రేకలు, చింతకాయలు, వేయించి ఉంచుకున్న పచ్చి మిర్చి మిశ్రమం వేసి, మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టాలి ►కొన్ని దోసకాయ ముక్కలు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►ఈ మిశ్రమాన్ని మిగిలిన దోసకాయ ముక్కలకు జత చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి దోరగా వేయించి తయారుచేసి ఉంచుకున్న పచ్చడి మీద వేసి కలపాలి ►వేడి వేడి అన్నంతో తింటే రుచిగా ఉంటుంది. చింత కాయల బదులు చింతకాయ పచ్చడి కలుపుకో వచ్చు. క్యాబేజీ – ఉల్లిపాయ కావలసినవి: క్యాబేజీ – పావు కేజీ; ఉల్లి తరుగు – ఒక కప్పు; పచ్చిమిర్చి – 10; ఎండు మిర్చి – 2; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; పసుపు – కొద్దిగా; చింత పండు – తగినంత; ఉప్పు – తగినంత; నూనె – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ►క్యాబేజీని సన్నగా తరగాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక క్యాబేజీ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి ►ఉల్లి తరుగు, చింత పండు, పచ్చి మిర్చి, ఉప్పు, పసుపు జత చేసి మూత పెట్టి, కొద్దిసేపు మగ్గిన తరవాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, వరుసగా వేసి వేయించాలి ►మిక్సీలో క్యాబేజీ, ఉల్లి తరుగు మిశ్రమం వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►వేయించి ఉంచుకున్న పోపు జత చేయాలి ►కొత్తిమీరతో అలంకరించాలి ►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నేతితో ఈ పచ్చడి కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. నిమ్మకాయ – కాకరకాయ కావలసినవి: కాకరకాయలు – 4 (చక్రాలుగా తరగాలి); నిమ్మ కాయలు – 6 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); తరిగిన పచ్చి మిర్చి – 10; నిమ్మ రసం – ఒక కప్పు; మిరప కారం – 2 టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి రెబ్బలు – 10; ఉప్పు – తగినంత; నూనె – 200 మి.లీ.; వేయించిన మెంతుల పొడి – అర టేబుల్ స్పూను. తయారీ: ►ఒక పాత్రలో కాకర కాయ చక్రాలు, నిమ్మ కాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలపాలి ►మిరప కారం జత చేసి మరోమారు కలపాలి ►వెల్లుల్లి రెబ్బలు వేసి మరోమారు కలపాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక వేడి నూనెను పచ్చడిలో వేసి కలిపి మూడు రోజుల పాటు ఉంచాలి ►మెంతి పొడి వేసి మరోమారు కలిపి మరో మూడు రోజుల తరవాత వాడుకోవాలి ►అన్నంలోకి రుచిగా ఉంటుంది. టొమాటో – పుదీనా కావలసినవి: టొమాటోలు – అర కిలో; పుదీనా ఆకులు – ఒక కప్పు; పచ్చి మిర్చి – 6; నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; ఇంగువ – కొద్దిగా; పసుపు – కొద్దిగా తయారీ: ►స్టౌ మీద బాణలిలో ఒక టేబుల్ స్పూను నూనె వేసి వేడిచేయాలి ►జీలకర్ర వేసి వేయించాలి ►పచ్చి మిర్చి జత చేసి మరోమారు వేయించాలి ►పుదీనా తరుగు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ►టొమాటో తరుగు జత చేసి పచ్చివాసన పోయేవరకు వేయించి దింపేయాలి ►చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టాలి ►ఉప్పు, నూనె జత చేసి మరోమారు తిప్పాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, కరివేపాకు, ఇంగువ, ఎండు మిర్చి వరుసగా వేసి వేయించి తీసి, పచ్చడి మీద వేసి కలపాలి ►అన్నంలోకి రుచిగా ఉంటుంది. ముల్లంగి – పుదీనా కావలసినవి: ముల్లంగి తరుగు – ఒక కప్పు; పుదీనా ఆకులు – ఒక కప్పు; పచ్చి మిర్చి – 5; చింతపండు – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె – 2 టీ స్పూన్లు; పోపు కోసం... ఆవాలు – పావు టీ స్పూను; మినప్పప్పు – పావు టీ స్పూను; నూనె – ఒక టీ స్పూను; ఇంగువ – కొద్దిగా. తయారీ: ►చింతపండును పది నిమిషాల పాటు తగినన్ని నీళ్లలో నానబెట్టాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక తరిగిన పచ్చి మిర్చి వేసి వేయించాలి ►ముల్లంగి తురుము, పుదీనా అకులు జత చేసి ఐదారు నిమిషాల పాటు వాసన పోయేవరకు వేయించి, ప్లేట్లోకి తీసి చల్లారబెట్టాలి ►నానబెట్టిన చింతపండు, ముల్లంగి తురుము మిశ్రమం మిక్సీలో వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, ఒక పాత్రలోకి తీసుకుని పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు వేసి చిటపటలాడేవరకు వేయించాలి ►ఇంగువ జత చేసి బాగా కలిపి దింపేయాలి ►ముల్లంగి పచ్చడి మీద వేసి కలియబెట్టాలి ►ఇడ్లీ, దోసె, పొంగల్, ఊతప్పం వంటి టిఫిన్లతో తింటే రుచిగా ఉంటుంది. కొత్తిమీర పచ్చడి కావలసినవి: తాజా కొత్తిమీర – 2 కప్పులు (శుభ్రపరిచి తరగాలి)పచ్చిమిర్చి – 4 (రెండుగా కట్ చేసుకోవాలి)చింతపండు పేస్ట్ – 1 టేబుల్స్పూన్ఉప్పు – రుచికి తగినంత తయారీ: కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు పేస్ట్, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ గట్టిగా అయితే కొద్దిగా నీళ్లు చల్లుకోవచ్చు. ఈ పచ్చడి పెసరట్టుకు, ఇడ్లీ, దోశ, వడ... ఏ టిఫిన్‌లోకైనా మంచి కాంబినేషన్ అవుతుంది. మిరపకాయబజ్జీలను ఈ చట్నీలో అద్దుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే బ్రెడ్ రోల్స్‌ని కూడా ఈ చట్నీలో ముంచుకొని తినచ్చు. నోట్: ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న కొత్తిమీర జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికీ, శ్వాసనాళాల్లో కఫం తొలగించడానికీ సహకరిస్తుంది. కొత్తిమీరను ఏదో ఒక రూపంలో తరచు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో భాగమే ఈ పచ్చడి. నువ్వులు–మామిడికాయ కావలసినవి: నువ్వులు– అర కప్పు; మామిడికాయ – 1 (మీడియం సైజుది); ఎండు మిర్చి – 10; పచ్చి మిర్చి – 5; పచ్చి సెనగపప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను, నూనె – రెండు టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; కరివేపాకు – రెండు రెమ్మలు తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా నువ్వులు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించి తీసేయాలి ►అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి ►ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి ►మామిడికాయ తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ►మిక్సీలో నువ్వులు, ఎండు మిర్చి వేసి మెత్తగా చేయాలి ►వేయించిన పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి, పచ్చడి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►వేయించుకున్న పోపు జత చేయాలి ►వేడి వేడి అన్నంలో కమ్మటి నెయ్యి వేసుకుని కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పల్లీ– దొండకాయ కావలసినవి: దొండకాయలు – పావు కేజీ; వేయించిన పల్లీలు – 50 గ్రా.; చింత పండు – నిమ్మకాయంత; ఉప్పు – తగినంత; పోపు కోసం... నూనె – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 10; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; పసుపు – కొద్దిగా; కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను; బాదం పప్పులు – 5 (నీళ్లలో సుమారు రెండు గంటలు నానబెట్టాలి). తయారీ: ►దొండకాయలను శుభ్రంగా కడిగి, ముక్కలు చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక దొండకాయ ముక్కలు, చింతపండు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గిన తరవాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►అదే బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీల కర్ర, ఎండు మిర్చి వరుసగా వేసి దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టాలి ►చల్లారిన పోపును మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►వేయించిన పల్లీలు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►దొండకాయ ముక్కలు, బాదం పప్పులు జత చేసి మెత్తగా అయ్యేవరకు తిప్పి, పచ్చడిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►పసుపు, కొత్తిమీర జత చేయాలి. -
దాచిపెట్టుకుందామన్నా... దాచిపెట్టుకోలేరు...
అంత రుచిగా ఉంటేఎవరైనా దాచిపెట్టుకుంటారా! కంచం నాకేస్తారు. పంచినంత పంచేస్తారు. నిలవ పచ్చళ్లు కావు కదా మరి! ఇలా చేసుకోండి. ఒక వారం అలా లాగించేయండి. వారం వరకు మిగిల్తే కదా! అంతే మరి! అంత రుచిగా ఉంటే వారం వరకు మిగుల్తాయా! అందుకే దాచుకోవడం కష్టమే కదా! అల్లంపచ్చడి కావలసినవి అల్లం – 100 గ్రా.; ఉప్పు – తగినంత; నిమ్మరసం – 3 టీ స్పూన్లు; మిరపకారం: టేబుల్ స్పూను; తరిగిన పచ్చిమిర్చి – 4. తయారీ: ►అల్లం శుభ్రంగా కడిగి, తడిపోయేవరకు ఆరబెట్టాలి ►తొక్క తీసి సన్నగా పొడవుగా ముక్కలు చేయాలి ►ఒక పాత్రలో అల్లం ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి, పదినిమిషాల తరవాత, తరిగిన పచ్చిమిర్చి, కారం, నిమ్మరసం వేసి కలియబెట్టాలి ►గాజు సీసాలోకి తీసుకుని మూతపెట్టి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచాలి ►పరాఠాలోకి రుచిగా ఉంటుంది. టొమాటోఆవకాయ కావలసినవి: టొమాటోలు – 2 కిలోలు; నువ్వుల నూనె – పావు కేజీ; ఇంగువ – అర టీ స్పూను; ఆవ పిండి – ఒక టేబుల్ స్పూను; మెంతి పిండి – అర టీ స్పూను; మిరప కారం – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత. పోపు కోసం: నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 10 (ముక్కలు చేయాలి). తయారీ: ∙ ►టొమాటోలను శుభ్రంగా కడిగి, నీడలో ఆరబోయాలి ►పూర్తిగా తడి పోయాక చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ►స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక టొమాటో ముక్కలు, ఉప్పు వేయాలి ►టొమాటో ముక్కలలో తడి పోయి బాగా చిక్కగా అయ్యేవరకు సన్నటి మంట మీద ఉంచాలి ►బాగా చిక్కగా అయ్యాక మిరప కారం, ఆవ పిండి, మెంతి పిండి, ఇంగువ వేసి కలియబెట్టి దింపేయాలి ►స్టౌ మీద చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి చిటపటలాడే వరకు వేయించి తీసేసి, సిద్ధంగా ఉన్న టొమాటో ఆవకాయలో వేసి కలపాలి ►చల్లారాక గాలిచొరని సీసాలోకి తీసుకోవాలి ∙నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటుంది. ముక్కలపచ్చడి కావలసినవి: మామిడికాయలు – 3; మెంతులు – పావు టీ స్పూను; ఆవాలు – ఒక టేబుల్ స్పూను; వెల్లుల్లి రేకలు – 12 (మిక్సీలో వేసి మెత్తగా చేయాలి); పసుపు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – పావు కప్పు. పోపు కోసం: నూనె – 4 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); ఇంగువ – కొద్దిగా; వెల్లుల్లి రేకలు – 3; కరివేపాకు – రెండు రెమ్మలు. తయారీ: ►మామిడికాయలను నీళ్లలో వేసి పావు గంట తరవాత శుభ్రంగా కడిగి బయటకు తీయాలి ►పొడి వస్త్రంతో తుడవాలి ►మధ్యకు రెండుగా తరిగి, చిన్నచిన్న ముక్కలుగా చేయాలి ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక మెంతులు వేసి దోరగా వేయించాలి ►ఆవాలు జత చేసి రెండూ కలిపి వేయించి దింపి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ►ఒక పాత్రలో తరిగిన మామిడికాయ ముక్కలు, పసుపు, ఉప్పు, మిరప కారం, ఆవ + మెంతి పొడి వేసి కలపాలి ►వెల్లుల్లి ముద్ద జత చేసి మరోమారు కలియబెట్టాలి ►స్టౌ మీద బాణలిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి చిటపటలాడేవరకు వేయించాక, ఇంగువ వేసి కలియబెట్టాక, ముక్కల పచ్చడి మీద వేసి కలపాలి. ద్రాక్ష ఆవకాయ కావలసినవి: పుల్లటి ద్రాక్ష – కిలో; ఆవపిండి∙– టేబుల్ స్పూను; మిరప కారం – 4 టీ స్పూన్లు; ఉప్పు – 2 టీ స్పూన్లు; జీలకర్ర పొడి – 2 టీ స్పూన్లు; వెల్లుల్లి రేకలు – 10; నూనె – తగినంత; ఇంగువ – తగినంత తయారీ: ►ద్రాక్షలను శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి ►నిలువుగా రెండు ముక్కలుగా కట్ చేయాలి ►ఒక గిన్నెలో ఆవపొడి, మిరప కారం, ఉప్పు, జీలకర్ర పొడి, వెల్లుల్లి రేకలను వేసి కలపాలి ►ఈ మిశ్రమంలో ద్రాక్షముక్కలను వేసి కలియబెట్టాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కొద్దిగా కాగాక ఇంగువ వేసి కలిపి దింపేయాలి ►ద్రాక్ష ఆవకాయలో నూనె పోసి కలియబెట్టి, మరుసటి రోజు వాడుకోవాలి ►ఇది రెండు మూడు రోజుల కంటె నిల్వ ఉండదు. నిమ్మకాయ పచ్చడి కావలసినవి : నిమ్మకాయలు – 6; మిరప కారం – 50 గ్రా.; ఆవపిండి ∙– రెండు టీ స్పూన్లు; మెంతిపిండి – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను. పోపు కోసం : ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండుమిర్చి – 4 (ముక్కలు చేయాలి). తయారీ: ►నిమ్మకాయలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రం మీద నీడలో ఆరబోయాలి ►నిమ్మకాయలను చిన్నచిన్న ముక్కలుగా తరగాలి ►ఒక గాజు సీసా లేదా జాడీలో నిమ్మకాయ ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి రెండు రోజులు ఉంచేయాలి ►మూడోరోజు సీసా మూత తీసి నిమ్మకాయ ముక్కలను పై నుంచి కిందికి ఒకసారి బాగా కలపాలి ►ఆవపిండి, మెంతిపిండి, మిరప కారం జత చేయాలి ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగాక ఇంగువ వేసి కలపాలి ►ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి కలిపి చిటపటలాడాక దింపేయాలి ►నిమ్మకాయ ముక్కలకు జత చేయాలి ►ఈ పచ్చడి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి కావలసినవి: మామిడి కాయ ముక్కలు – రెండు కప్పులు; క్యారట్ ముక్కలు – అర కప్పు; బీన్స్ ముక్కలు – అర కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను. పేస్ట్ కోసం: వెల్లుల్లి రేకలు – 20; అల్లం – చిన్న ముక్క; మిరియాలు – ఒక టేబుల్ స్పూను; గసగసాలు – 2 టేబుల్ స్పూన్లు; జీడి పప్పులు – 50 గ్రా.; కొత్తిమీర తరుగు – అర కప్పు; పుదీనా తరుగు – పావు కపు; నిమ్మరసం – ఒక టేబుల్ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 20; పసుపు – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను ; ఉప్పు – తగినంత. తయారీ: ►మిక్సీలో వెల్లుల్లి రేకలు, అల్లం, మిరియాలు, గసగసాలు, జీడి పప్పులు, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, తరిగిన పచ్చి మిర్చి, పసుపు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి ►ఒక పాత్రలో కూరగాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి ►నిమ్మరసం జత చేసి మరోమారు కలపాలి ►తయారుచేసుకున్న పేస్ట్, ఇంగువ జత చేసి మరోమారు కలపాలి ►రెండు గంటల తరవాత ఉపయోగించుకోవాలి ►ఈ పచ్చడి పెరుగన్నంలోకి రుచిగా ఉంటుంది. దబ్బకాయ పచ్చడి కావలసినవి: దబ్బకాయలు – 2; పచ్చి మిర్చి – 100 గ్రా.; మెంతులు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; మెంతి పొడి – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను. పోపు కోసం: ఎండు మిర్చి – 20; ఇంగువ – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; నూనె – 3 టేబుల్ స్పూన్లు. తయారీ: ►దబ్బకాయల తొక్కలు తీసి, తొనలను చిన్నచిన్న ముక్కలుగా చేసి ఒక గిన్నెలో వేయాలి ►పచ్చి మిర్చిని శుభ్రంగా కడగాలి ►తొడిమలు తీసి, మధ్యకు చీల్చి, దబ్బకాయ తొనలకు జత చేయాలి ►తగినంత ఉప్పు, పసుపు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించి దింపేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక ఇంగువ, ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక దింపి, ఉడికించిన దబ్బకాయ పచ్చడిలో వేసి కలపాలి ►మెంతి పొడి జత చేసి కలియబెట్టాలి ►చల్లారాక గాలిచొరని సీసాలోకి తీసుకోవాలి ►వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది (మరిన్ని రోజులు కావాలనుకుంటే ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు) నారింజ పచ్చడి కావలసినవి: నారింజ కాయలు – 4; మిరప కారం – టేబుల్ స్పూను; మెంతి పొడి – అర టీ స్పూను; ఆవపిండి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – 3 టేబుల్ స్పూన్లు; ఇంగువ – అర టీ స్పూను. పోపు కోసం: నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 10 (ముక్కలు చేయాలి). తయారీ: ►నారింజ కాయ తొక్క తీసి తొనలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి మధ్యకు చీల్చాలి (తొడిమలు తీసేయాలి) ►నారింజ తొనలకు పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ►తగినంత ఉప్పు, పసుపు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించి దింపేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక ఇంగువ, ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక దింపి, ఉడికించిన నారింజకాయ పచ్చడిలో వేసి కలపాలి ►మెంతి పొడి జత చేసి కలియబెట్టాలి ►చల్లారాక గాలిచొరని సీసాలోకి తీసుకోవాలి ►వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది (మరిన్ని రోజులు కావాలనుకుంటే ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు) జామకాయ పచ్చడి కావలసినవి: జామకాయలు – పావు కిలో; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఆవ పొడి – ఒక కప్పు; వెల్లుల్లి రెబ్బలు – పావు కప్పు; జీలకర్ర పొడి – పావు కప్పు; ఉప్పు – తగినంత; మిరప కారం – తగినంత; కరివేపాకు – రెండు Æðమ్మలు; ఎండు మిర్చి – 4; నూనె – ఒక కప్పు తయారీ: ►జామకాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ►ఒక పాత్రలో జామకాయ ముక్కలు, ఆవపిండి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి ►ఉప్పు, మిరప కారం జత చేసి మరోమారు కలపాలి ►స్టౌ మీద బాణలిలో ఒక కప్పు నూనె వేసి కాగాక, జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి ►కరివేపాకు వేసి మరోమారు వేయించి దింపేసి, జామ కాయ పచ్చడిలో వేసి కలపాలి ►చల్లారాక గాలిచొరని సీసాలోకి తీసుకుని నిల్వ చేయాలి ►ఈ పచ్చడి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది దోస ఆవకాయ కావలసినవి: దోస కాయలు – కిలో; ఆవ పొడి – ఒక టేబుల్ స్పూను; మెంతి పొడి – అర టీ స్పూను; మిరప కారం – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ►దోస కాయలను శుభ్రంగా కడిగి తడిపోయేవరకు ఆరబెట్టాలి ►దోస కాయను మధ్యకు తరిగి, గింజలను తీసేయాలి ►దోస కాయలను చిన్నచిన్న ముక్కలుగా తరగాలి (తొక్క తీయకూడదు) ►ఒక పాత్రలో దోస కాయ ముక్కలు, ఆవ పొడి, మెంతి పొడి, మిరప కారం, ఉప్పు వేసి కలియబెట్టాలి ►నూనె పోసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి ►మూడో రోజున మరోసారి కలిపి వేడివేడి అన్నంలో తింటే రుచిగా ఉంటుంది ►దోస ఆవకాయ వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. క్యారట్ పచ్చడి కావలసినవి: క్యారట్ స్లయిసెస్ – ఒక కప్పు; ఆవ నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఇంగువ – పావు టీ స్పూను; సోంపు పొడి – అర టీ స్పూను; మెంతులు – రెండు టీ స్పూన్లు; ఆవ పొడి – 2 టీ స్పూన్లు; మిరప కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత. తయారీ: ►ఒక పాత్రలో సోంపు పొడి, మెంతులు, ఆవ పొడి, మిరప కారం, ఉప్పు వేసి బాగా కలపాలి ►క్యారట్ స్లయిసెస్ జత చేసి మరోమారు కలపాలి ►స్టౌ మీద బాణలిలో ఆవ నూనె వేసి కొద్దిగా కాగాక ఇంగువ వేసి, కలిపి, వెంటనే దింపేసి, క్యారట్ పచ్చడి మీద వేసి కలపాలి ►ఈ పచ్చడి అన్నం, పరాఠా, పూరీ, పుల్కాలలోకి రుచిగా ఉంటుంది. (తయారు చేసిన వెంటనే ఫ్రిజ్‌లో ఉంచాలి. లేదంటే పాడైపోతుంది) పెసర ఆవకాయ కావలసినవి : మామిడి కాయలు – 2; పెసర పప్పు – 100 గ్రా.; మిరప కారం – 50 గ్రా.; ఉప్పు – తగినంత; నూనె – 3 టేబుల్ స్పూన్లు. తయారీ: ►మామిడికాయలను శుభ్రంగా కడిగి తడిపోయేవరకు ఆరబెట్టాలి ►చిన్నచిన్న ముక్కలుగా తరగాలి ►స్టౌ మీద బాణలిలో పెసర పప్పు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ►ఒక పాత్రలో మామిడి కాయ ముక్కలు, మిరప కారం, పెసర పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి ►నువ్వుల నూనె వేసి మరోమారు కలియబెట్టి, మూడు రోజుల తర్వాత వాడుకోవాలి ►వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది ►ఈ ఆవకాయ పది రోజుల కంటె నిల్వ ఉండదు. -
ఇంటిప్స్
అలా చేయడం వల్ల అందు లో నీళ్లన్నీ ఎండిపోయి పచ్చళ్ళు బూజుపట్టకుండా ఎక్కువ కాలం నిలవ ఉంటాయి. ఇల్లు తుడిచేటప్పుడు నీటిలో కొద్దిగా కిరోసిన్ వేస్తే ఈగలు, దోమలు రావు.ఉడెన్ ఫర్నిచర్‌ను పేపర్‌తో తుడిస్తే పాలిష్ చేసినట్లు మెరుస్తాయి. పేపర్‌తో తుడవడం వల్ల సందుల్లోని దుమ్ము పూర్తిగా వదలదు కాబట్టి ముందుగా మెత్తటి క్లాత్‌తో తుడిచి, తర్వాత పేపర్‌తో తుడవాలి.పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు చేతులకు కొంచెం ఆయిల్ రాసుకుంటే మండకుండా ఉంటాయి. వంటగదిలో అలోవెరా మొక్కను పెట్టుకుంటే మంచిది. చిన్న చిన్న గాయాలు తగిలినపుడు అలోవెరా ఆకును తెంపి ఆ జెల్‌ను గాయమైన చోట రుద్దితే ఉపశమనం కలుగుతుంది. -
కూరలు చేయ పువ్వు తెచ్చాను
పెరటిలోన అరటంట...ఫలములెన్నో ఇచ్చునంట...పండు అరటి..కూర అరటి....మరి పువ్వు?దానితో కూడా కూర చేయవచ్చునట...పోపు వేసి రుచి చూడవచ్చునట...పువ్వు ఒకటేనట.... పదార్థం పదునారు రకాలట.పూజలు చేయడానికి తెచ్చే పూలు వేరు. కూరలు చేయడానికి ఈ పువ్వు తెండి. సుష్టుగా తినండి. అరటి పువ్వు– పెసర పప్పు కూర కావలసినవి: అరటి పువ్వు – 1 (చిన్నది); పెసర పప్పు – పావు కప్పు (రెండు గంటలు నానబెట్టాలి); పసుపు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; మెంతులు – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; పచ్చి మిర్చి – 3; అల్లం – చిన్న ముక్క (సన్నగా తరగాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; మిరప కారం – పావు టీ స్పూను; నూనె – 5 టీ స్పూన్లు; ఇంగువ – కొద్దిగా. తయారీ: ∙అరటి పువ్వును ముందుగా శుభ్రం చేసుకోవాలి ∙పైన ఉన్న డిప్పలు తీసి, లోపల ఉన్న వాటిలో నుంచి మద్యభాగంలో ఉండే కేసరం తీసేయాలి ∙శుభ్రం చేసిన అరటిపువ్వును మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేసుకోవాలి ∙ఒక గిన్నెలో నీళ్లు, తగినంత పసుపు వేసి బాగా కలిపి, కచ్చాపచ్చాగా చేసుకున్న అరటిపువ్వును అందులో వేసి రెండుమూడు సార్లు బాగా కడగాలి ∙ఒక గిన్నెలో అరటి పువ్వుకు తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు జత చేసి, స్టౌ మీద ఉంచి కొద్దిసేపు ఉడికించి, చల్లారాక, గట్టిగా పిండి నీళ్లు తీసేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు వేసి బాగా వేయించాక పసుపు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి ∙కరివేపాకు, ఇంగువ జత చేసి మరోమారు కలపాలి ∙అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు వేసి మరోమారు వేయించాక, ఉడికించిన అరటి పువ్వు మిశ్రమం, నానబెట్టిన పెసరపప్పు వేసి బాగా కలిపి, చివరగా కొద్దిగా ఉప్పు వేసి కలిపి, మరో ఐదు నిమిషాలు ఉంచి దింపేయాలి. అరటి పువ్వు పికిల్ కావలసినవి: అరటి పువ్వు – 1; ధనియాలు – రెండు టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 10; వెల్లుల్లి – 6 రెబ్బలు; జీలకర్ర – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; చింతపండు రసం – పావు కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు. తయారీ: ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె కాగాక ఎండు మిర్చి వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో జీలకర్ర, ధనియాలు వేసి వేయించాలి ∙కరివేపాకు జత చేసి మరోమారు వేయించి, దింపేసి చల్లారనివ్వాలి ∙వెల్లుల్లి రెబ్బలు, వేయించిన ఎండు మిర్చి, వేయించిన ధనియాల మిశ్రమం వేసి మెత్తగా చేయాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక అరటి పువ్వు వేసి పచ్చి వాసన పోయేవరకు సుమారు పది నిమిషాలు వేయించాలి ∙పసుపు జత చేసి మరోమారు కలిపి, ఎండు మిర్చి మిశ్రమంలో వేసి, తగినంత ఉప్పు జత చేయాలి ∙ఉడికించి ఉంచుకున్న చింతపండు రసం కూడా వేసి బాగా కలిపి, మొత్తం మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙అవసరమనుకుంటే కొద్దిగా నీరు జత చేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, సెనగ పప్పు, మినప్పప్పు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాక, తయారుచేసి ఉంచుకున్న అరటిపువ్వు మిశ్రమం వేసి పచ్చి వాసన పోయేవరకు బాగా వేయించి ఒక పాత్రలోకి తీసుకోవాలి. అరటిపువ్వు – పులిహోర కూర కావలసినవి: అరటి పువ్వు – 1 (చిన్నది); పచ్చి మిర్చి – 3; సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; పల్లీలు – ఒక టేబుల్ స్పూను; ఇంగువ – చిటికెడు; జీలకర్ర – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – నాలుగు రెమ్మలు; ఎండు మిర్చి – 2; పసుపు – అర టీ స్పూను; చింతపండు పులుసు – అర కప్పు; ఉప్పు – తగినంత; పోపు సామాను – ఒక టేబుల్ స్పూను; ఆవ పొడి – ఒక టీ స్పూను; తయారీ: ∙అరటి పువ్వును మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేసి బయటకు తీసి, పసుపు నీళ్లతో రెండు మూడు సార్లు కడగాలి (ఇలా చేయడం వల్ల వగరు పోతుంది) ∙బాణలిలో నూనె కాగాక ఆవాలు, పచ్చి మిర్చి తరుగు, సెనగ పప్పు, మినప్పప్పు, పల్లీలు, ఇంగువ, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిర్చి వేసి వేయించాలి ∙పసుపు, చింతపండు పులుసు, ఉప్పు జత చేసి మరోమారు కలపాలి ∙కచ్చాపచ్చాగా చేసిన అరటి పువ్వు జత చేసి బాగా కలిపి సుమారు పది నిమిషాలు ఉడికించాలి ∙ఆవ పొడి జత చేసి బాగా కలిపి దింపేసి, వేడి వేడి అన్నంతో వడ్డించాలి. అరటి పువ్వు వడ కావలసినవి: అరటి పువ్వు – 1; పసుపు – ఒక టేబుల్ స్పూను; పెరుగు – 2 టీ స్పూన్లు; ఉల్లి తరుగు – అర కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 5; సోంపు – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 4; సెనగ పప్పు – ఒకటిన్నర కప్పులు; కొత్తిమీర – ఒక కప్పు; పెరుగు – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ :అరటి పువ్వును శుభ్రం చేసి, చిన్నచిన్న ముక్కలుగా తరగాలి ∙ఒక గిన్నెలో అరటి పువ్వు తరుగు, తగినన్ని నీళ్లు, కొద్దిగా పసుపు, రెండు టీ స్పూన్ల పెరుగు జత చేసి మూత పెట్టి సుమారు మూడు గంటలసేపు పక్కన ఉంచాలి ∙ఒక గిన్నెలో సెనగ పప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి గంట సేపు నాన»ñ ట్టి, నీళ్లు ఒంపేయాలి ∙మిక్సీలో... సెనగ పప్పు, సోంపు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి వేసి మెత్తగా చేసి, గిన్నెలోకి తీసుకోవాలి ∙తగినంత ఉప్పు జత చేసి కలియబెట్టాలి ∙అరటి పువ్వుకు తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి పది నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙చల్లారాక నీళ్లు గట్టిగా పిండి తీసేయాలి.∙∙ఒక గిన్నెలో ఉడికించిన అరటి పువ్వును వేసి చేతితో మెత్తగా అయ్యేలా మెదపాలి ∙మెత్తగా చేసుకున్న సెనగ పప్పు మిశ్రమం, ఉల్లి తరుగు, కొత్తిమీర జత చేసి అన్నీ కలిసేవరకు కలపాలి ∙ కొద్దికొద్దిగా మిశ్రమం చేతిలోకి తీసుకుని వడల మాదిరిగా ఒత్తాలి ∙ స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఒత్తి ఉంచుకున్న వడలను వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి పేపర్ నాప్కిన్ మీదకు తీసుకోవాలి ∙వేడివేడిగా అందించాలి. అరటి పువ్వు కొబ్బరి పచ్చడి కావలసినవి: అరటి పువ్వు – 1 (చిన్నది); కొబ్బరి తురుము – ఒక కప్పు; పచ్చి మిర్చి – 4; ఎండు మిర్చి – 10; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగపప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఇంగువ – కొద్దిగా; పసుపు – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్ స్పూన్లు; చింతపండు – నిమ్మకాయ పరిమాణంలో; తాలింపు – ఒక టే బుల్ స్పూను. తయారీ: ముందుగా అరటి పువ్వును శుభ్రం చేసి మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేసి పసుపు కలిపిన చన్నీళ్లతో మూడునాలుగు సార్లు బాగా కడగాలి ∙ స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఇంగువ, సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసి చల్లారనివ్వాలి ∙ వేయించిన పోపును మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙ అరటి పువ్వు వేసి మరోమారు తిప్పాలి ∙కొబ్బరి తురుము, పసుపు, ఉప్పు జత చేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకోవాలి ∙వేయించిన తాలింపు గింజలు జత చేసి కలిపి, వేడి వేడి అన్నంలోకి వడ్డించాలి. అరటి పువ్వు పులుసు కూర కావలసినవి: అరటి పువ్వు – ఒక కప్పు; ఆవ పొడి – ఒక టీ స్పూను; నువ్వుల పొడి – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర – కొద్దిగా; టొమాటో ముక్కలు – అర కప్పు; చింతపండు – తగినంత; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 3 (సన్నగా పొడవుగా తరగాలి); ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); మిరప కారం – తగినంత; వెల్లుల్లి రెబ్బలు – 4; నూనె – 4 టేబుల్ స్పూన్లు; పోపు దినుసులు – ఒక టీ స్పూను; పసుపు – చిటికెడు; ఉప్పు – తగినంత; తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పోపు దినుసులు వేసి వేయించాలి ∙ఎండు మిర్చి వేసి వేగాక, పచ్చి మిర్చి తరుగు వేసి మరోమారు వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙వెల్లుల్లి రెబ్బలు జత చేసి మరోమారు వేయించాలి ∙టొమాటో ముక్కలు జత చేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాక, తగినంత ఉప్పు జత చేసి కలపాలి ∙పసుపు జత చేసి మరోమారు కలియబెట్టాలి ∙కచ్చాపచ్చాగా మిక్సీ పట్టిన అరటి పువ్వును జత చేయాలి ∙మిరపకారం వేసి బాగా కలపాలి ∙కొద్దిగా నీళ్లు జత చేసి ఐదు నిమిషాలు ఉడికించాలి ∙చింతపండు రసం వేసి బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి ∙ఆవ పొడి వేసి కలియబెట్టాలి ∙తగినంత నువ్వుల పొడి వేసి మరోమారు కలపాలి ∙కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి ∙ఈ కూర చూడటానికి గ్రేవీ మాదిరిగా వస్తుంది. అరటి పువ్వు కందిపప్పు కూర కావలసినవి: అరటి పువ్వు – 1; కంది పప్పు – ఒక కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు; ఎండు మిర్చి – 3; వెల్లుల్లి రెబ్బలు – 5; జీలకర్ర – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె – రెండు టేబుల్ స్పూన్లు తయారీ: ∙కంది పప్పుకు తగినన్ని నీళ్లు జత చేసి కుకర్లోఉంచి ఉడికించాలి (మరీ ముద్దగా చేయకూడదు) ∙అరటి పువ్వును శుభ్రం చేసి మిక్సీలో వేసి, కచ్చాపచ్చాగా చేసి, పసుపు నీళ్లలో రెండు మూడుసార్లు కడిగి, గట్టిగా పిండి నీరు తీసేయాలి ∙ఉడికిన పప్పులో వేసి బాగా కలపాలి ∙తగినంత ఉప్పు, పసుపు జత చేసి కలపాలి ∙మిరప కారం జత చేసి మరోమారు కలిపి, తడిపోయే వరకు ఉడికించాలి ∙స్టౌ మీద చిన్న బాణలిలో నూనె కాగాక వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి ∙జీలకర్ర, కరివేపాకు వేసి మరోమారు వేయించాలి ∙ఎండు మిర్చి జత చేసి కలిపి, ఉడికించిన కందిపప్పు అరటి పువ్వు కూరలో వేసి కలిపి, వేడి వేడి అన్నంతో వడ్డించాలి. కదంబం శాకంభరీ పూజల సందర్భంగా అమ్మవారికి నివేదన చేసే ‘కదంబం’ కావలసినవి: బియ్యం – 1 కప్పు; కంది పప్పు – ఒక కప్పు; చింతపండు రసం – 1 టేబుల్ స్పూను; బెండకాయలు – 4; క్యారట్ – 1; చిలగడ దుంప – 1; బంగాళదుంప – 1; వంకాయలు – 2; క్యాప్సికమ్ – 1; బఠాణీ – పావు కప్పు; తీపి గుమ్మడి కాయ ముక్క – చిన్నది; చిక్కుడుకాయ ముక్కలు – పావు కప్పు; సాంబారు పొడి – 1 టేబుల్ స్పూన్; ఉప్పు – తగినంత; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; జీలకర్ర – 1 టీ స్పూను; కొత్తిమీర – చిన్న కట్ట; కరివేపాకు రెమ్మలు – 2 తయారీ: కూరగాయలన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా తరిగి, తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ∙కందిపప్పుకు తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా ఉడికించాలి ∙బియ్యం శుభ్రంగా కడిగి, మూడు కప్పుల నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి, స్టౌ మీద పెట్టి, నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి ∙ఉడికించుకున్న కూరగాయ ముక్కలు వేసి మరోమారు వేయించాలి ∙సాంబారు పొడి, ఉప్పు, చింతపండు రసం వేసి బాగా కలిపాక, ఉడికించి ఉంచుకున్న కందిపప్పు, కొద్దిగా నీళ్లు వేసి మరోమారు కలపాలి ∙కొద్దిగా ఉyì కిన తరవాత అన్నం, కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి. కదళీ కుసుమం కాంతివర్ధకం భారతీయ సనాతన ఆచారాలలోనూ, తెలుగు సంస్కృత కవీశ్వరుల కలాలలోనూ, ప్రాచీన ఆయుర్వేద వైద్యశాస్త్ర ఔషధ కోశాగారంలోనూ... ఈ మూడు చోట్లా ఆశ్రయం పొంది మిసమిసలాడిన ముద్దుగుమ్మ మన ‘రంభ’. అదే జగద్విదితమైన అరటికి మరోపేరు. పర్యాయ పదాలు... కదళీ (రీ), సుఫలా, మోచా, వారణ, వనలక్ష్మీ, ఊరుస్తంభా గుచ్ఛఫలా, సత్పత్రీ మొదలైనవి.హైందవ శుభకార్యాల పందిళ్లలో కనిపించేది అర టిచెట్టు, ఆహారం వడ్డించే విస్తరాకు అరటి ఆకు, ఆకులోని అమోఘమైన ఫలం అరటిపండు, నదీ జలాలలో తళతళలాడే కార్తీక దీపాలను నిలబెట్టేది అరటికాండపు ముక్క. మృదుమధురంగా సునాయాసంగా అర్థమయ్యే కవితారసాన్ని కదళీపాకం అంటారు. కవులు తమ వర్ణనలలో, కోమలత్వాన్ని సూచించే ఉపమాన ద్రవ్యం కదళీకాండం. ఆయుర్వేదంలో అరటి యొక్క పంచాంగాలనూ (ఫలం, పత్రం, పుష్పం, మూలం, కాండం) రకరకాల వ్యాధులలో ఔషధ ద్రవ్యంగా ప్రయోగిస్తారు.అరటికాయకి తియ్యదనంతో పాటు కొంచెం వగరు కూడా ఉంటుంది. చలవ చేస్తుంది. మల బంధకం. పరిపూర్ణంగా పక్వమైతే (పండు) దానికి తియ్యదనం పెరిగి వగరు తగ్గుతుంది. బక్కచిక్కిన వారికి బరువు పెరగడానికి ఉపయోగకరం. అరుచిని పోగొడుతుంది. ప్రమేహాన్ని కూడా పోగొడుతుంది. శీతలం, శుక్రకరం. ఆకలిదప్పికలను తగ్గిస్తుంది. అరటి పువ్వు:ఇది అరటికాయ గెలలకు క్రింది భాగంలో చాలా సుందరంగా వ్రేలాడుతుంటుంది. పైన కనపడే ఎరుపునలుపుల వెడల్పైన రేకలను తొలగిస్తుంటే లోపల అగ్గిపుల్లల మాదిరి కనబడే పువ్వుల గుత్తులు కనబడతాయి. ప్రతి నాళిక పైన స్వచ్ఛమైన ఉల్లిపొరలాంటిది ఉంటుంది. దాన్ని తొలగిస్తే తినదగిన పుష్పనాళికల మధ్య ఒక ముదురు కేసరం కనిపిస్తుంది. ఇది తినడానికి పనికిరాదు. తినదగిన ఈ పువ్వులు వాతావరణానికి సోకితే క్రమేపీ నల్లబడిపోతాయి. నీటిలో నానబెట్టి ఉంచితే నల్లబడదు. పువ్వులోని పోషక విలువలు – ఆరోగ్య ప్రయోజనాలు: పీచు (ఫైబర్) సమృద్ధిగా ఉంటుంది. నీటిలో కరిగిపోయే పీచు, కరగని పీచు ఈ రెండూ ఉంటాయి. కరగని పీచువల్ల రోజువారీ విరేచనం సాఫీగా అవుతుంది. కరిగే పీచు వల్ల అతిసారం (అధిక విరేచనాలు) తగ్గుతాయి. కనుక ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్కి మంచి గుణకారి. అధిక బరువుని కూడా తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫినాలిక్ ఆమ్లం, ఇతర రసాయనాల వల్ల మధుమేహాన్ని తగ్గించే గుణం కూడా ఉంది. పిండి పదార్థాలు తగుమాత్రం ఉన్నా ‘శర్కర శాతం, సోడియం, కొలెస్టరాలు’ శూన్యం. పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కనుక అధిక రక్తపోటుని తగ్గించి, కండరాలకు శక్తినిస్తుంది. ఐరన్, కాపర్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. రక్తహీనతను పోగొడుతుంది.‘మెగ్నీషియం, ప్రొటీన్లు తగినంత లభిస్తాయి. ఆందోళన, నరాల వ్యాధులను తగ్గిస్తాయి. అల్జీమర్సు, పార్కిన్సోనియం వంటి వ్యాధులలో గుణకారిగా చెప్పవచ్చు.ఎ, సి, ఇ విటమిన్లు దండిగా ఉంటాయి. చర్మకాంతికి మంచిది. స్త్రీలలో అధిక ఋతుస్రావాన్ని అరికడుతుంది. కంటి రోగాలకు మంచిది. దీనిలో లభించే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల క్రిమిహర ంగాను, అకాల వార్ధక్యాన్ని తగ్గించేదిగాను ఉపకరిస్తుంది. క్యాన్సరు రోగులకు కూడా మంచిది.ప్రసూతులలో తల్లిపాలను సమృద్ధిగా కలిగేట్టు చేస్తుంది. అరటిపువ్వు అంతా బలమే (ఆయుర్వేదం)ప్రాచీన ఆయుర్వేద వైద్య పుంగవులైన చరక సుశ్రుత వాగ్భటులందరూ అరటి ద్రవ్యాలను రకరకాలైన వ్యాధులను నయం చేయటానికి ప్రయోగించారు. ఇతర ఆయుర్వేద వైద్య గ్రంధాలలో కూడా దీని ఔషధ విలువలు ఉటంకించబడ్డాయి.రాజ నరహరి నామధేయుడైన నృసింహ పండితుడు రాజ నిఘంటువు గ్రంధ రచయిత. అందులోని శ్లోకం...రంభాఫలం కషాయ మధురం బల్యంచ శీతం తథా‘పిత్తం అస్రవిమర్దనం గురుతరం పథ్యం న మందానవే‘‘సత్యః శుక్రవివృద్ధిదం క్లమహరం తృష్ణాపహరం కాంతి దం‘దీప్తాగ్నౌ సుస్వదం కషాయకరం సంతర్పణం దుర్జరం‘‘బాలం ఫలం మధురం... పుష్పం తదపి అనుగుణం,క్రిమిహారి, కందం పర్ణంచ శూలశమకం కదలీ భవం స్యాత్ గమనిక: పైన చెప్పిన ఆధునిక శాస్త్రజ్ఞులు వివరించిన ఆరోగ్య ప్రయోజనాలన్నీ ఈ శ్లోకంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఉదా: దుర్జరం : వార్ధక్యాన్ని నిలుపుతుంది సద్యః క్లమహరం: తక్షణ శక్తినిస్తుంది. సంతర్పణం : కృశత్వాన్ని పోగొట్టి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్రిమిహారి: యాంటిసెప్టిక్ మరియు యాంటీ బయోటిక్ఉబ్బసానికి కూడా మంచిది. ఎలా తినాలి?పువ్వు రేకల్ని నీళ్లల్లో నానబెట్టిన అనంతరం, ఇతర సలాడ్స్‌తో కలిపి పచ్చివి తినవచ్చు లేదా సూప్‌గా తయారుచేసుకోవచ్చు. పువ్వు పచ్చడి: శుభ్రపరచిన పువ్వుని చిన్న ముక్కలుగా తరిగి, కొంచెం ఆవాలు, నువ్వులపప్పు, మిరపకాయలు ముద్దగా చేసి, ఈ రెంటినీ కలపాలి. ఆ మిశ్రమానికి తగినంత ఉప్పు, చింతపండు/నిమ్మరసం జత చేసి, ఇంగువ పోపు పెట్టాలి. తినేటప్పుడు చిక్కటి పెరుగుని కూడా కలుపుకుని, అన్నంలోను, రొట్టెలలోను కూడా తినవచ్చు. మంచి వ్యంజనం.గుర్తుంచుకోవలసిన సారాంశంఇతర కుసుమ సౌరభములు ఎదకు హితముఅన్ని వ్యాధులు తగ్గించు అరటి పువ్వుసకల శక్తులు బలపర్చి శాంతిజేయురంభ శక్తిని గుర్తించి ప్రజ్వరిల్లు! మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారు చేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జతచేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయిం చవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్కమ్. mail: familyvantakalu@gmail.com లేదా పోస్టు ద్వారా పంపండి. మా చిరునామా: సాక్షి వంటలు, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
తీపి పచ్చళ్లు
బెల్లం చుట్టూ చీమలు చేరడం పాత ముచ్చట.కారం చుట్టూ తిరగడం మామూలు ఇచ్చట.తీపి పచ్చళ్లంటే అందరికీ మమకారమే.కారంలో తీపి కలపడం రుచికి గుణకారమే.ఎండాకాలం వచ్చిందంటే చాలు, ఇల్లాళ్ల చేతులు వేగం పుంజుకుంటాయి. జాడీలు ప్రాణం పోసుకుంటాయి. నాలుకలు కొత్త ఆవకాయ ఘాటు కోసం చెవులు కోసుకుంటాయి. మరి కారపు పచ్చళ్లలో వెరైటీగా కొంచెం తీపిని కూడా మిళాయిస్తే ఆ ఘుమఘుమే వేరు, ఆ మధురిమే కొత్త తీరు.మామిడికాయ, ఖర్జూరం, టొమాటో, జామకాయ, నిమ్మకాయ, బీట్రూట్, పచ్చిమిరప, అల్లం, క్యారెట్, కీరదోస, కాలీఫ్లవర్ లాంటి పచ్చళ్లను ఈసారి కొత్తగా ప్రయత్నించండి. ఇల్లంతా తియ్యటి వేడుక చేసుకోండి. నిమ్మకాయ ఊరగాయ కావలసినవి: నిమ్మకాయలు – 12, ఉప్పు – 3 టేబుల్ స్పూన్లు, బెల్లం తరుగు – ఒకటిన్నర కప్పులు, ఏలకుల పొడి – పావు టీ స్పూన్, గరం మసాలా – 1 టీ స్పూన్, కారం – 1 టీ స్పూన్, అల్లం పేస్ట్ – 1 టీ స్పూన్ తయారీ: ముందుగా నిమ్మకాయలను శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. ఆపైన వాటిని ముక్కలుగా చేసి, గింజలను తొలగించాలి. ఇప్పుడు ఓ జాడీ తీసుకొని, అందులో నిమ్మకాయ ముక్కలు, ఉప్పు కలపాలి. ఆ జాడీ పదిహేను రోజుల వరకు పక్కన పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పదిహేను రోజుల తర్వాత ఆ నిమ్మ ముక్కలను ఓ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి అర కప్పు నీళ్లు పోయాలి. అందులో బెల్లం వేసి బాగా కలపాలి. మిశ్రమం గట్టిపడుతుండగా ఏలకుల పొడి వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత దాంట్లో నిమ్మ ముక్కలు, అల్లం పేస్ట్, గరం మసాలా, కారం వేసి కలుపుకోవాలి. మిశ్రమం బాగా దగ్గరకయ్యాక జాడీలోకి తీసుకోవాలి. పచ్చిమిర్చి ఊరగాయ కావలసినవి: పచ్చి మిర్చి (ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో ఉన్నవి) తరుగు – 1 కప్పు, నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు – 2 టీ స్పూన్లు, ఆవాలు – 1 టీ స్పూన్, అల్లం తరుగు – అర టీ స్పూన్, చింతపండు గుజ్జు (నానబెట్టిన తర్వాత వచ్చే గుజ్జు) – పావు కప్పు, బెల్లం తరుగు – అర కప్పు, కారం పొడి – 1 టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత తయారీ: ముందుగా నువ్వులు, ఆవాలను వేయించుకొని పొడి చేసుకోవాలి. ఆపైన స్టవ్‌పై మూకుడు పెట్టి నూనె పోయాలి. అందులో పచ్చి మిర్చి, అల్లం తరుగు వేసి కలపాలి. నాలుగు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, మూకుడు దించుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై మరో పాన్ పెట్టి చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపు వేయాలి. మిశ్రమం వేడయ్యాక, నువ్వులు–ఆవాల పొడి, బెల్లం తరుగు వేసి కలపాలి. మిశ్రమం దగ్గరకయ్యాక దింపేసుకోవాలి. ఆపైన అందులో పచ్చి మిర్చి, అల్లం మిశ్రమం వేసి మరో రెండు నిమిషాల పాటు వేడి చేయాలి. తర్వాత మిశ్రమం పూర్తిగా చల్లారాక జాడీలోకి తీసుకోవాలి. ఖర్జూరం ఊరగాయ కావలసినవి: పచ్చి ఖర్జూరాలు – 2 కప్పులు, అల్లం తరుగు – 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి తరుగు – 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు – 1 టేబుల్ స్పూన్, మెంతుల పొడి – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్ ఇంగువ – అర టీ స్పూన్, వెనిగర్ – 1 టీ స్పూన్, ఆవాల పొడి – 1 టేబుల్ స్పూన్, బెల్లం తరుగు – 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెమ్మ – 1, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ: ముందుగా పాన్‌లో నూనె పోయాలి. అందులో కరివేపాకు, అల్లం, వెల్లుల్లి తరుగు వేసి కలపాలి. ఆ పైన ఖర్జూరం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు, మెంతుల పొడి, కారం, ఆవాల పొడి, ఉప్పు వేయాలి. చివరగా బెల్లం తరుగు, వెనిగర్ వేసి బాగా కలపాలి. మిశ్రమం దగ్గరకయ్యాక స్టవ్‌ను ఆఫ్ చేసుకోవాలి. బెల్లం ఆవకాయ కావలసినవి: మామిడి కాయలు – 3, ఆవాలు – 1 టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కారం పొడి – 2 టేబుల్ స్పూన్లు, మెంతుల పొడి – 1 టీ స్పూన్, ఉప్పు – రెండున్నర టేబుల్ స్పూన్లు, బెల్లం తరుగు – 1 కప్పు, ఇంగువ – పావు టీ స్పూన్, నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా మామిడి కాయలను ముక్కలుగా చేసుకోవాలి. ఓ బౌల్లో వాటిని తీసుకొని, పసుపు, ఉప్పు వేసి కలుపుకొని ఓ రాత్రంతా పక్కన పెట్టుకోవాలి. తెల్లవారాక దాంట్లోని నీటినంతా పారబోసి, ముక్కలను మూడురోజుల పాటు ఎండలో పెట్టుకోవాలి. నాలుగోరోజు, రెండు కప్పుల నీళ్లను మరిగించుకోవాలి. తర్వాత అందులో ఎండిన ముక్కలను వేసి ఓ గంటపాటు పక్కన పెట్టాలి. మరోవైపు బెల్లాన్ని పాకం పట్టుకోవాలి (పాకం ముదురు కాకుండా చూసుకోవాలి). మామిడి ముక్కలను మరో బౌల్లోకి తీసుకొని, కారం, మెంతుల పొడి, ఉప్పు వేసి కలపాలి. ఆపైన అందులో బెల్లం పాకం వేయాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి నూనె పోయాలి. అందులో ఆవాలు, ఇంగువ వేసి, ఆ పైన మామిడి మిశ్రమాన్ని వేసి కలపాలి. చివరగా ఆవకాయను జాడీలోకి తీసుకోవాలి. టొమాటో ఊరగాయ కావలసినవి: టొమాటో ముక్కలు – అర కప్పు, నూనె – 1 టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం పొడి – అర టీ స్పూన్, ఉప్పు – పావు టీ స్పూన్, బెల్లం తరుగు – 3 టీ స్పూన్లు, ఆవాల పొడి – పావు టీ స్పూన్ తయారీ: ముందుగా స్టవ్‌పై పాన్ పెట్టి నూనె పోయాలి. అందులో టొమాటో ముక్కలు వేసి మూడు నిమిషాల పాటు ఉంచాలి. ఆపైన అందులో ఇంగువ, ఆవాల పొడి, పసుపు, కారం, ఉప్పు, బెల్లం వేసి కలపాలి. పాన్‌పై మూత పెట్టి మిశ్రమం దగ్గరకయ్యే వరకు ఉడకనివ్వాలి. ఆపైన దాన్ని దింపేసి, జాడీలోకి తీసుకోవాలి. కీరదోస పచ్చడి కావలసినవి: కీరదోస – 6 (నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవాలి), ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, చక్కెర – అర కప్పు, ధనియాల పొడి – 1 టీ స్పూన్, ఆవాల పొడి – 1 టీ స్పూన్, కారం – 2 టేబుల్ స్పూన్స్, మిరియాల పొడి – 1 టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి – కొద్దిగా, లవంగాల పొడి – పావు టీ స్పూన్, నూనె – సరిపడా తయారీ: ముందుగా స్టవ్ వెలిగించుకుని, ఒక మూకుడు తీసుకుని అందులో నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ఇప్పుడు అందులో కీర ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసుకుని వేయించు కోవాలి. తర్వాత అందులో చక్కెర వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాస్త వేడిగా ఉన్నప్పుడే ధనియాల పొడి, లవంగాల పొడి, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి, ఆవాల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం పచ్చడి కావలసినవి: అల్లం ముక్కలు – 1 కప్పు, పసుపు– పావు టీ స్పూన్, చింతపండు గుజ్జు – పావు కప్పు, బెల్లం తరుగు – అర కప్పు, కారం పొడి – 5 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, మెంతుల పొడి – ముప్పావు టేబుల్ స్పూన్, ఆవాలు – 1 టీ స్పూన్, నూనె – పావు కప్పు, ఎండు మిర్చి ముక్కలు – 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 8, ఇంగువ – చిటికెడు తయారీ: ముందుగా అల్లం ముక్కలను కొద్దిగా వేయించి, మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో చింతపండు గుజ్జు, కారం, పసుపు, ఉప్పు వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత బెల్లం కూడా వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఓ బౌల్లోకి తీసుకోవాలి. అందులో మెంతుల పొడి వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి నూనె పోయాలి. తర్వాత ఆవాలు, వెల్లుల్లి తరుగు, ఎండు మిర్చి, ఇంగువ వేసి కలపాలి. ఆపైన దాంట్లో అల్లం మిశ్రమాన్ని వేసి ఓ నిమిషం తర్వాత దింపేసుకోవాలి. చల్లారాక జాడీలోకి తీసుకోవాలి. జామకాయ పచ్చడి కావలసినవి: జామకాయ గుజ్జు (దోర కాయలను ముక్కలుగా చేసి మిక్సీలో వేయాలి)– ఒకటిన్నర కప్పులు, నూనె – 1 టేబుల్ స్పూన్, మెంతుల పొడి – పావు టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, బెల్లం తరుగు – 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ – చిటికెడు, ఉప్పు – తగినంత తయారీ: ముందుగా స్టవ్‌పై పాన్ పెట్టి నూనె పోయాలి. అందులో బెల్లం తరుగు, ఇంగువ వేయాలి. అర నిమిషం తర్వాత మిరియాల పొడి, కారం, మెంతుల పొడి వేసి కలపాలి. బెల్లం పూర్తిగా కరిగేవరకు స్టవ్‌ను మీడియం మంట పైనే ఉంచాలి. ఆ పైన సిమ్‌లో పెట్టి జామకాయ గుజ్జు, ఉప్పు వేసి కలపాలి. మిశ్రమం దగ్గరకయ్యాక దింపేసి, చల్లారాక జాడీలోకి తీసుకోవాలి. వెల్లుల్లి ఊరగాయ కావలసినవి: వెల్లుల్లి రెబ్బలు – 1 కప్పు, నువ్వుల నూనె – పావు కప్పు, ఆవాలు – 1 టీ స్పూన్, ఇంగువ –పావు టీ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, కారం – రుచికి తగ్గట్టు, పసుపు – చిటికెడు, చింతపండు గుజ్జు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, నీళ్లు – ఒకటిన్నర కప్పులు, ఉప్పు – తగినంత, బెల్లం తరుగు – రెండున్నర టేబుల్ స్పూన్లు, మెంతుల పొడి – అర టీ స్పూన్ తయారీ: ముందుగా నూనెను వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు వేసి, అవి వేగగానే కరివేపాకు, ఇంగువ వేసుకుని బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమంలో వెల్లుల్లి రెబ్బలు వేసుకుని నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు కారం, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. చింతపండు గుజ్జు జత చేసి మరోమారు కలపాలి. ఇప్పుడు బెల్లం తరుగు, మెంతుల పొడి, ఉప్పు వేసుకుని బాగా కలుపుకుంటూ దగ్గరయ్యే వరకు ఉడికించి దింపేయాలి. చల్లారాక ఒక జాడీలోకి తీసుకోవాలి. క్యారెట్ ఊరగాయ కావలసినవి: క్యారెట్ తురుము – 3 కప్పులు, అల్లం + వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్లు, ఆవాల పొడి – 1 టీ స్పూన్, మెంతుల పొడి – పావు టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, బెల్లం తరుగు – పావు కప్పు, నిమ్మ కాయలు – 2 లేదా 3(మీడియం సైజ్), కారం – 2 టీ స్పూన్లు, ఆవాల పొడి –పావు టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, పసుపు – చిటికెడు, నూనె – పావు కప్పు, ఉప్పు – తగినంత తయారీ: ముందుగా నూనెను వేడి చేసుకోవాలి. ఇప్పుడు అందులో క్యారెట్ తురుము, పసుపు, కారం, ఇంగువ, ఉప్పు, అల్లం + వెల్లుల్లి పేస్ట్ జత చేసుకుని గోధుమ రంగులోకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో బెల్లం వేసుకుని కలుపుకోవాలి. తర్వాత అన్ని పొడులను మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుని జాడీలోకి తీసుకోవాలి. బీట్రూట్ ఊరగాయ కావలసినవి: బీట్రూట్ – 3 (మీడియం సైజ్), చక్కెర – 1 టేబుల్ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, వెనిగర్ – పావు కప్పు, నీళ్లు – పావు కప్పు, ఉప్పు – తగినంత తయారీ: ముందుగా బీట్రూట్ను బాగా కడిగి, తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. ఒక పాత్రలో బీట్ రూట్ ముక్కలకు తగినన్ని నీళ్లు జత చేసి, స్టవ్ మీద ఉంచి ఉడికించాలి. తర్వాత వెనిగర్‌తో పాటు చక్కెర వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా, కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని ఇంకాస్త ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ మిశ్రమాన్ని బాగా చల్లార్చుకుని నిల్వ చేసుకోవాలి. కాలీఫ్లవర్ ఊరగాయ కావలసినవి: కాలీఫ్లవర్ – 1 (మీడియం సైజ్), ఉల్లిపాయ గుజ్జు – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 4, ఆవాలు – 1 టీ స్పూన్, నిమ్మరసం – పావు కప్పు, వెల్లుల్లి గుజ్జు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, కారం – 2 టేబుల్ స్పూన్స్, నూనె – పావు కప్పు, చక్కెర – ఒకటిన్నర కప్పు తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ గుజ్జు వేసుకోవాలి. ఇప్పుడు అందులో నిమ్మరసం, వెల్లుల్లి గుజ్జు వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని నాన్‌స్టిక్ పాత్రలో నూనె వేసుకుని కాస్త వేడిగా అయిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలను చెంచాతో తిప్పుతూ వెల్లుల్లి మిశ్రమం, కారం, చక్కెరను అందులో వేసుకుని బాగా కలుపుకుని ఉడికించాలి. తర్వాత పసుపు, ఉప్పు వేసుకుని ఇంకాసేపు ఉడికించాలి. ఆ తర్వాత దాన్ని జాడీలోకి తీసుకోవాలి. -
టెంక కాదు, టెక్నాలజీ ముఖ్యం
మామిడికాయ పచ్చళ్లకి సమయం ముంచు కొచ్చేసింది. తల్లులారా! మీరు టెక్నాలజీని వాడండి. నా మాట వినండి. ప్రపంచంలోనే మొదటిసారి మ్యాంగో పికిల్ యాప్‌ని ప్రారం భించనున్నారు. ఎందుకంటే ఇది మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు జాడీ. మన తెలుగింట ఆడపడుచులకు ఆవకాయల తయారీ కొట్టిన పిండి. దంచేయడం, పొడి చేయడం మన విద్య.ఈ సీజన్లో ఏపీలో కొన్ని వందల మెట్రిక్ టన్నుల మామిడి నిల్వ పచ్చళ్లని అమ్మలక్కలు జాడీలకెత్తుతారు. వీటి పాళాలు ఇంటికో తీరున, ఊరికో లెక్కన ఉంటాయ్. మన ఊళ్లలో ఆవకాయ పెద్దమ్మలు, మాగాయ మామ్మలు ఉంటారు. వాళ్లు మన ప్రాచీన ఋషుల్లా వారి అనుభవాలని క్రోడీకరించి ఫార్ము లాని ప్రచారంలోకి తెస్తారు. నమ్మిన వాళ్లు ఆచరిస్తారు. నమ్మనివాళ్లు నాస్తి కుల్లా మిగులుతారు.ఇందులో బ్రహ్మ విద్యలో ఉన్నట్లు రకరకాల వాదాలున్నాయ్. కొందరు టెంకవాదులు, మరికొందరు కండవాదులు, ఇంకొందరు టెంకండ వాదులు. అంటే రెండూ ముఖ్యమేనని విశ్వసించేవారు. పచ్చళ్లలో గ్లామర్ చింతకాయకి, గోంగూరకి లేదు. ఇది.బూర్జువా అభిరుచిగా అతి వాదులు ఆక్షేపిస్తూ ఉంటారు. ఆవకాయలో సామాజిక స్పృహమీద చర్చించడం ఆత్మలోకంలో దివాలా. కత్తిపీటల్లో ఆవకాయ కత్తిపీటలు వేరు. వూరికి రెండో మూడో ఉండేవి. ముందుగా వాటిని బుక్ చేసుకుని, తర్వాత కాయ తెచ్చు కునేవారు. ఆవకాయ ముక్క కొట్టడం ఒక విల క్షణమైన కళ. ఇది పరుష విద్య. కాయకే కాదు. ఈ పనికీ కండపుష్టి అవసరం. ప్రతి ముక్కకి అంతో ఇంతో టెంక పెచ్చు మనిషికి తత్వజ్ఞానంలా అతుక్కుని ఉండాలని శాస్త్రకారులు ఘోషిస్తున్నారు. అరిస్టాటిల్ హయాంలోనే ఈ ఆవకాయ సంప్రదాయం ఉన్నట్లు గ్రీక్ గ్రంథాలను జాగ్ర త్తగా పరిశీలిస్తే అవగతమవుతుంది. భాగవత పురాణంలో పోతన గోపాలకులు చద్దులారగించు వేళ మాగాయలాంటి నంజుళ్లని ఇష్టంగా తిన్నట్టు పేర్కొన్నారు. ఒక తెగ తెలుగువారు నూజివీడు చిన్న రసాలు, పెద్ద రసాలు ఆవకాయకి పెట్టింది పేరంటారు. ‘‘పీచు కావాలంటే హలో! నూజి వీడు రసాలకే చలో’’ అనే నినాదం ప్రచారంలో ఉంది. ప్రతి ఇంటా కారాలూ ఆవాలూ నూరే తరుణం ఇది. దినుసుల మీద కావల్సినంత గోష్టి నడుస్తుంది. ఈ రెండు నెలల్లోనే ఆవాలు, కారాలు, నూనెలు మీద జరిగే చర్చలకిగాను మొత్తంమీద రెండొం దల కోట్ల సెల్ బిల్ కాల్తుందని ఓ అంచనా. ఏ జిల్లా సంప్రదాయం ఆ జిల్లాదే. ఇప్పుడు చంద్రబాబు పూనుకుని, అందర్నీ ఓ జాడీ కిందికి తీసుకొచ్చి, అమరావతి ఆవకాయలుగా స్థిరీకరిస్తే బావుంటుందనిపిస్తోంది. ఈ వేసవిలో విదేశాలకు పంపే మామిడి పచ్చళ్లకి ప్రత్యేక కౌంటర్లు వెలుస్తాయ్. ఇండియాలో పెద్ద దిక్కు లేని వారికి, మేమున్నామంటూ కొన్ని సంస్థలు వచ్చాయ్. అన్నీ వాళ్లే చూస్తారు, ఎటొచ్చీ మనం డబ్బు చూడాలి. ఈ సీజన్లో అట్లాంటా నించి న్యూజెర్సీ నించీ, అమ్మా! హాయ్... సూపర్బ్, టిపికల్, వావ్ అంటూ లొట్టలు విని పించి, లక్షలాది తెలుగు ఇళ్లలో ఆనందాలు వెల్లివిరుస్తాయి. దీనికి ఇంత సత్తా ఉందని తెలిస్తే, చంద్రబాబు ఊరుకోడు. ఓ ఉచిత సలహా కేంద్రం, పంపడానికి ఓ సేవా కేంద్రం స్వయంగా రిబ్బన్ కత్తిరించి ప్రారంభించే అవకాశం ఉంది. ఆయనకి టెంక కంటే టెక్నాలజీయే ముఖ్యం! వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
పచ్చడిపిందెలు.. కాయపచ్చళ్లు
వేసవికాలం... ఎండలు మండుతుంటాయి. ఒక పక్క వేడి గాలులు ... మరో పక్కనుంచి మామిడి గాలులు. కాయలు పెద్దవయ్యేలోపు రాలిన పిందెలతో కొన్ని ... కాయ పదునుకొచ్చాక మరికొన్ని చేసేయొద్దూ..! పిందే కదా అని ఏరి పారేయద్దు... అందులోనూ రుచి ఉంది. మనవి కొన్ని, పొరుగు రాష్ట్రానివి కొన్ని కలిపి ఊరగాయలు పట్టేద్దాం. మామిడి రుచిని ఆస్వాదిద్దాం. వడు మాంగా కావలసినవి: మామిడి పిందెలు – రెండు కప్పులు (పిందెలు గుండ్రంగా ఉండాలి); ఉప్పు – తగినంత (రాతి ఉప్పు మంచిది. మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి); నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు పొడి కోసం ఎండు మిర్చి – 20; మెంతులు – అర టీ స్పూను; ఆవాలు – ముప్పావు టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఇంగువ – పావు టీ స్పూను తయారీ:ముందుగా మామిడి పిందెలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి, కాసేపు నీడలో ఆరబెట్టాలి ∙ఒక పాత్రలో ఆరిన మామిడి పిందెలు వేసి వాటి మీద నూనె వేసి బాగా కలపాలి. (అలా చేయడం వల్ల నూనె అన్ని మామిడి పిందెలకు అందుతుంది) ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి వరసగా ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి చల్లారాక, ఉప్పు, ఇంగువ జత చేసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙మరిగించి చల్లార్చిన పావు కప్పు నీళ్లు జత చేసి పొడిని మెత్తటి ముద్దలా అయ్యేలా చేయాలి ∙ఈ మిశ్రమాన్ని మామిడిపిందెల మీద పోసి కిందకి పైకి బాగా కలపాలి ∙రోజుకి మూడు నాలుగుసార్ల చొప్పున అలా సుమారు మూడు రోజులు కలపాలి ∙మామిడిపిందెలు మెత్తగా అయ్యి వడు మాంగా తినడానికి అనువుగా తయారవుతుంది. టెండర్ మ్యాంగో పికిల్ కావలసినవి: మామిడి పిందెలు – 4 కప్పులు; ఉప్పు – ముప్పావు కప్పు; ఆవాలు – టేబుల్ స్పూను; పసుపు – ఒకటిన్నర టీ స్పూన్లు; నువ్వుల నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 20 ∙తొడిమలను చాకుతో కట్ చేయాలి ∙రాతి ఉప్పును మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ∙ఆవాలు మిక్సీలో వేసి మెత్తగా అయ్యాక పసుపు, తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా చేయాలి ∙పెద్ద పాత్రలో మామిడి పిందెలు వేసి వాటి మీద నువ్వుల నూనె వేసి బాగా కలపాలి ∙ఆవపిండి వేసి మరోమారు కలపాలి ∙చివరగా ఉప్పు వేసి బాగా కలిపి, పెద్ద మూతి ఉన్న జాడీలోకి తీసుకోవాలి ∙మూడు రోజుల పాటు ప్రతిరోజూ రెండు పూటలా పైకి కిందకి కలుపుతుండాలి ∙నాలుగో రోజుకి బాగా ఊట కిందకి దిగుతుంది ∙మిక్సీలో ఎండు మిర్చి వేసి పొడి చేయాలి ∙ముందుగా తయారుచేసి ఉంచుకున్న ఊరగాయ లోనుంచి వచ్చిన ఊట కొంత తీసి, ఎండుమిర్చి పొడిలో వేసి మెత్తగా చేయాలి ∙ఒక పెద్ద పాత్రలోకి ఊరగాయ తిరగదీసి, దాని మీద ఈ మిశ్రమం వేసి బాగా కలిపి, జాడీలోకి తీసుకోవాలి ∙పది రోజుల పాటు ప్రతిరోజూ పైకి కిందకి కలపాలి ∙ఊటంతా దిగి, ఊరగాయ తయారయిన తరవాత అన్నంలో కలుపుకుని తినాలి. కన్ని మాంగా అచార్ కావలసినవి: మామిడి పిందెలు – కేజీ; కారం – 4 టేబుల్ స్పూన్లు; ఉప్పు – పావు కేజీ; ఇంగువ – టీ స్పూను; ఆవాలు – 50 గ్రాములు (పొడి చేయాలి) తయారీ: ∙ముందుగా మామిడిపిందెలను శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి, తడి పోయేవరకు ఆరబెట్టి, తొడిమలు కట్ చేయాలి ∙తగినన్ని నీళ్లకు ఉప్పు జత చేసి మరిగించి చల్లార్చాలి ∙ఒక పెద్ద జాడీలో ముందుగా మామిడి పిందెలు వేసి, వాటి మీద చల్లారబెట్టుకున్న నీళ్లు పోసి (పిందెలన్నీ మునగాలి) మూత పెట్టి, మూడు రోజులు అలాగే ఉంచాలి ∙నాలుగవ రోజున నీళ్లను వడకట్టి పిందెలు వేరు చేయాలి ∙ఈ నీటికి కారం, ఇంగువ, ఆవపొడి జత చేసి బాగా కలపాలి ∙ఈ నీటిని మళ్లీ జాడీలో పోసి, ఆ పైన మామిడి పిందెలు వేసి బాగా కలిపి మూత గట్టిగా బిగించి, సుమారు వారం రోజుల తరవాత తీసి వాడుకోవాలి. స్వీట్ పికిల్ కావలసినవి: పచ్చి మామిడికాయలు – 3 (తురమాలి); పంచదార /బెల్లం పొడి – 2 కప్పులు; ఉప్పు – తగినంత; మిరపకారం – 2 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూను; వేయించిన జీలకర్ర – టీ స్పూను; వేయించిన ధనియాలు – ఒక టీ స్పూను; నిమ్మరసం – 2 టీ స్పూన్లు తయారీ: పచ్చి మామిడికాయలను శుభ్రంగా కడిగి, తుడిచి, తొక్క తీసేసి, కాయలను సన్నగా తురమాలి ∙ఒక పెద్ద పాత్రలో మామిడికాయ తురుముకి ఉప్పు, పంచదార, పసుపు, మిరప పొడి, నిమ్మరసం జత చేసి బాగా కలిపి, సుమారు ఆరుగంటలసేపు ఎండలో ఆరబెట్టాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక మామిడి మిశ్రమం అందులో వేసి బాగా కలిపి, మంట తగ్గించి మిశ్రమం చిక్కగా అయ్యేవరకు కలిపి, దింపేసి చల్లారనివ్వాలి ∙జీలకర్ర పొడి, ధనియాల పొడి జత చేసి మరోమారు కలపాలి ∙గాలి చొరని జాడీలోకి తీసుకుని, ఫ్రిజ్‌లో ఉంచాలి. కడు మాంగా అచార్ కావలసినవి: మామిడి పిందెలు – 5; ఆవాలు – టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; పచ్చిమిర్చి – 6; పసుపు – పావు టీ స్పూను; మెంతి పొడి – టీ స్పూను; కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – 4 టేబుల్‌స్పూన్లు తయారీ: మామిడిపిందెలను శుభ్రంగా కడిగి, తడిపోయేవరకు ఆరబెట్టి, చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి ∙బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి ∙పసుపు, కారం కూడా వేసి బాగా వేయించి, చిన్న కప్పుడు నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి ∙చివరగా మామిడికాయ ముక్కలు వేసి సుమారు పది నిమిషాలు ఉడికించాలి ∙మిశ్రమం దగ్గరపడి చిక్కగా తయారయ్యాక దింపి, చల్లారాక గాలిచొరని సీసాలోకి తీసుకోవాలి (ఇష్టపడేవారు కొద్దిగా బెల్లం తురుము కలుపుకోవచ్చు). తోతాపురి పికిల్ కావలసినవి: మామిడి కాయ – 1 (పెద్దది); మిరప కారం – 4 టీ స్పూన్లు; వేయించిన మెంతుల పొడి – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – ఒక కప్పు; నూనె – 4 టేబుల్ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను తయారీ: మామిడికాయను శుభ్రంగా కడిగి తడిపోయే వరకు ఆరబెట్టాలి ∙సన్నగా పొడవుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ఉప్పు జత చేసి పక్కన ఉంచాలి ∙ఒక గిన్నెలో కప్పుడు నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగాక, మిరపకారం జత చేసి బాగా కలిపి దించేయాలి. (ఇది సూప్‌లా ఉండాలి, నీళ్లలా ఉండకూడదు. అవసరమనుకుంటే మరి కాస్త కారం జత చేయాలి) ∙కొద్దిగా చల్లారాక ఈ నీళ్లను మామిడికాయ ముక్కల మీద పోయాలి ∙మెంతి పొడి కూడా వేసి కలిపి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగిన తరవాత ఆవాలు, ఇంగువ వేసి వేయించి, ఆ నూనెను మామిడి కాయ ముక్కల మీద పోసి బాగా కలపాలి. (ఉప్పు కాని కారం కాని చాలకపోతే, మరికాస్త జత చేయొచ్చు) మామిడి తురుము పచ్చడి కావలసినవి: పచ్చి మామిడి కాయలు – 2 (మీడియం సైజు); మిరప కారం – అర కప్పు; ఆవ పిండి – అర కప్పు; ఉప్పు – అర కప్పు; మెంతి పొడి – టీ స్పూను; జీలకర్ర పొడి – టేబుల్ స్పూను; ఇంగువ – టీ స్పూను; నువ్వు పప్పు నూనె – పావు కేజీ; మినప్పప్పు – టీ స్పూను; ఆవాలు – టీ స్పూను; ఎండు మిర్చి – 1 తయారి: మామిడికాయల తొక్కు తీసి, కాయను సన్నగా తురమాలి ∙బాణలిలో నూనె లేకుండా మెంతులు వేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ఉప్పు, పసుపు, మిరప కారం పొడులు జత చేసి బాగా కలపాలి ∙ఈ మిశ్రమంలో మామిడి తురుము వేసి బాగా కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేడి చేసి మినప్పప్పు, ఆవాలు, ఎండు మిర్చి, జీలకర్ర పొడి, ఇంగువ ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించి, దింపి, చల్లారాక, తయారుచేసి ఉంచుకున్న మామిడి తురుము మిశ్రమంలో వేసి బాగా కలపాలి ∙గాలి చొరని డబ్బాలో నిల్వ ఉంచాలి ∙ఈ పచ్చడి అన్నంలోకి రుచిగా ఉంటుంది ∙ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే, ఫ్రిజ్‌లో పెట్టాలి. వెల్లుల్లి మామిడి తురుము కావలసినవి: మామిడికాయ తురుము – 2 కప్పులు; నూనె – అర కప్పు; ఉప్పు – తగినంత; పసుపు – టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 10; ఇంగువ – పావు టీ స్పూను; ఆవాలు – 3 టేబుల్ స్పూన్లు; జీలకర్ర – 2 టీ స్పూన్లు; మెంతులు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4 తయారీ: జీలకర్రను, మెంతులను బాణలిలో నూనె లేకుండా విడివిడిగా వేయించి తీసేయాలి ∙మిక్సీలో ఆవాలు, వేయించిన మెంతులు, వేయించిన జీలకర్ర వేసి మెత్తగా పొడి చేయాలి ∙ఒక పాత్రలో మామిడికాయ తురుము వేసి, మెత్తగా పొడి చేసిన ఆవాల మిశ్రమం జత చేయాలి ∙మిరపకారం, పసుపు, ఉప్పు జత చేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో కప్పుడు నూనె వేడయ్యాక, ఆవాలు, ఇంగువ, ఎండు మిర్చి, మెత్తగా చేసిన వెల్లుల్లి ముద్ద వేసి వేయించి దింపి, చల్లారాక మామిడి తురుము మిశ్రమానికి జత చేయాలి ∙గాలి చొరని డబ్బాలో నిలవ చేసుకోవాలి ∙రోటీలు, పరాఠాలలో రుచిగా ఉంటుంది. పచ్చి మామిడి మర్మాలు వేసవి వచ్చిందంటే ఊరగాయలు పెడుతూ అటు అమ్మలు, ఇటు అమ్మమ్మలు బిజీబిజీగా ఉంటారు. ఎప్పుడెప్పుడు మామిడిపళ్లు, ఆవకాయ, పెరుగన్నం తిందామా అని ఎదురుచూస్తుంటారు అందరూ. ముఖ్యంగా పిల్లలకు మామిడికాయ పేరు చెప్పగానే పులుపు గుర్తుకు వచ్చి నోరు ఊరుతుంది. పళ్లు జిల్లుమంటాయి. పళ్లనే కాదు మనసును ఝల్లనిపించే ఈ మామిడిలో దాగున్న రహస్యాలు ఎన్నో. ►పచ్చి మామిడికాయ ఒంటి వేడిని తగ్గించి, శరీరాన్ని చల్లబరుస్తుంది. ►శరీరంలో ద్రవాల స్థాయి తగ్గకుండా చూస్తుంది. ►వడదెబ్బ కొట్టే లక్షణాలు కనిపిస్తే పచ్చిమామిడికాయ తీసుకోవడం మంచిది. ►మధుమేహం ఉన్నవారు పచ్చిమామిడికాయలను పెరుగు, అన్నంతో తీసుకుంటే సుగర్ లెవల్స్ తగ్గుతాయి. ►ఎలక్ట్రొలైట్స్‌ను పచ్చిమామిడికాయ బ్యాలెన్స్ చేస్తుంది. అందువల్ల రక్తప్రసరణ అదుపులో ఉండి, గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. ►పచ్చిమామిడి మన శరీరంలో క్యాలరీలు కరిగించి, బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. ►పచ్చి మామిడిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. ►కూరలలో స్నాక్స్‌లో పచ్చిమామిడికాయను జత చేయడం వల్ల అజీర్ణ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ►ఎసిడిటీ నుంచి దూరం కావొచ్చు. ►వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.. ► వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ►కాలేయ సంబంధిత సమస్యలు నివారించడంలో పచ్చి మామిడి శక్తిమంతంగా పనిచేస్తుంది. ►ఒక ముక్క పచ్చి మామిడి నమలడం వల్ల ప్రేగులు శుభ్రపడి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దూరమవుతాయి. ► పంటి ఆరోగ్యం మెరుగవుతుంది. చిగుళ్లు బలంగా అవుతాయి. చిగుళ్ల నుంచి రక్తస్రావం తగ్గి, దుర్వాసన పోతుంది. ►కొత్త రక్త కణాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. ► పచ్చి మామిడిరసం తాగడం వల్ల అధిక చెమటను నివారించుకోవచ్చు. ►మలబద్దకం సమస్యను దూరం చేస్తుంది ►పెద్ద పేగు ఆరోగ్యాన్ని పెంచుతుంది. ►వేసవి ఎండ కారణంగా శరీరం కోల్పోయే సోడియం, ఐరన్ వంటి ఖనిజాలను తిరిగి భర్తీ చేస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని అందించి, వేడిని తగ్గిస్తుంది. ఫుడ్ ఫ్యాక్ట్స్ శీతల పానీయాలు సేవించడం వలన కలిగే నష్టాలు ∙మధుమేహం, మెటబాలిక్ సిండ్రోమ్ ∙చిన్నతనంలోనే ఊబకాయం ∙గుండె జబ్బులు ∙దంతక్షయం ∙ఆస్టియో పోరోసిస్ వ్యాధి వచ్చి, ఎముకలు విరిగే అవకాశం ∙మూత్రపిండాల వ్యాధులు ∙కాలేయం పెరిగే అవకాశం ఎక్కువ (లివర్ సిరోసిస్) ∙క్యాన్సర్ వ్యాధి బారిన పడే అవకాశం ∙నిద్రలేమి ∙ఆస్త్మా ∙స్త్రీలకు గర్భాశయ సమస్యలు వచ్చే అవకాశం మీ వంటలకు ఆహ్వానం మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారుచేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జత చేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయించవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్కమ్.familyvantakalu@gmail.com -
నోరు'ఊరు'
ఆ ఊరు పేరు చెప్పగానే నోరు ఊరుతుంది. పచ్చళ్ల తయారీకి అంతగా ప్రసిద్ధి చెందింది జిల్లాలోని పెరవలి మండలం ఉసులుమర్రు. వేసవి వచ్చిందంటే చాలు ఇక్కడ కొత్త పచ్చళ్ల తయారీ ఊపందుకుంటుంది. ఈ కాలంలోనే అన్ని రకాల పచ్చళ్లు పట్టి నిల్వ చేస్తారు. ఈ గ్రామంలో 2,400 మంది జనాభా ఉంటే పచ్చళ్ల తయారీపై 1,600 మంది ఆధారపడి జీవిస్తున్నారు. పెరవలి : ఏడాది పొడవునా ఉసులుమర్రులో పచ్చళ్ల అమ్మకాలు సాగిస్తారు. టమాట, ఉసిరి, అల్లం, మాగాయి, ఆవకాయ, గోంగూర, కాలీఫ్లవర్, పండుమిరప, నిమ్మ, దబ్బ వంటి పచ్చళ్లకు ఈ గ్రామం పెట్టింది పేరు. ఇక్కడ తయారైన పచ్చళ్లను పట్టుకుని మగవారు హైదరాబాద్, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, తిరుపతి, ఒంగోలు ప్రాంతాలకు అమ్మేందుకు బయలుదేరతారు. ఏడాదిలో 10 నెలలు వారు ఇతర ప్రాంతాల్లోనే ఉంటారు. వేసవి రెండు నెలలు మాత్రమే వారు ఇళ్ల వద్ద ఉంటారు. ఈ సమయంలో ఏడాదికి సరిపడా పచ్చళ్లు పడతారు. రుచిలో.. ఆవకాయదే అగ్రతాంబూలం పచ్చళ్లలో ఎన్ని రకాలు ఉన్నా ఆవకాయ పచ్చడి రుచి వేరు. ఈ పచ్చడి పట్టడానికి నాణ్యమైన ముదురు మామిడి కాయలు కావాలి. టెంక పట్టి ఉండాలి. దీనిని సరి సమానంగా చిన్నచిన్న ముక్కలు కోసి అందులో జీడిని తీసి ఆరబెట్టాలి. ఆ తరువాత మెత్తగా కొట్టిన ఆవపిండి, నాణ్యమైన మెంతులు, ఎర్రటి పచ్చడి కారం, వేరుశెనగ నూనె లేక నువ్వుల నూనె కావాలి. ముందుగా కారం, ఆవపిండి, మెంతులు, మెత్తని ఉప్పు కలపాలి. ఆ తర్వాత మామిడి ముక్కలను నూనెలో ముంచి ఈ కారం కలిపిన మిశ్రమంలో వేసి ముక్కకు కారం పట్టేలా చూచి జాడీలో కానీ డ్రమ్ములో గానీ వేయాలి. ఇలా వేసిన తర్వాత నూనె వేసి మూత పెట్టాలి, మూడు రోజుల తరువాత పచ్చడిని కలపాలి. అన్ని పచ్చళ్ల కంటే పండుమిరప పచ్చడి పట్టడం ఎంతో ఇబ్బంది అని గ్రామస్తులు తెలిపారు. ఒక డ్రమ్ పచ్చడి తయారవ్వాలంటే రూ.10 వేల పెట్టుబడి అవసరమని చెప్పారు. గతంలో పండుమిరప పచ్చడిని రుబ్బేవారమని, కూలీలు ఈ పనికి రాకపోవడంతో ఇప్పుడు మెషీన్‌లోనే ఆడించి కలుపుతున్నట్టు తెలిపారు. ధరలు మండిపోతున్నాయ్ గతంలో ఒక డ్రమ్ము పచ్చడికి రూ.10 వేలు సరిపోయేదని, నేడు రూ.20 వేలు అవుతోందని గ్రామంలోని తయారీదారులు చెప్పారు. నేడు మార్కెట్లో కిలో చింతపండు నాణ్యతను బట్టి రూ.120 నుంచి రూ.140 వరకు ఉందని, అలాగే పండు మిరపకాయలు గతంలో కిలో రూ.50 ఉంటే నేడు రూ.100 ఉందని, మామిడి కాయలు టన్ను గతంలో రూ.6 వేలు ఉంటే నేడు రూ.10 వేలు అన్నా లేవన్నారు. ఆవాలు 50 కిలోల బస్తా గతంలో రూ.2 వేలు ఉంటే, నేడు రూ.2,500 అని, ఆయిల్ గతంలో కిలో రూ.70 ఉంటే నేడు రూ.100 ఉందని, వెళ్లుళ్లి పాయలు కిలో రూ.20 ఉంటే నేడు రూ.40 అని, మెంతులు కిలో రూ.40 ఉంటే నేడు రూ.60 అని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రకాల పచ్చళ్లు పట్టాలంటే రూ.రెండు లక్షల పెట్టుబడి అవసరం అని, కాలం కలసి వస్తే ఖర్చులు పోను రూ.40 వేల నుంచి రూ.50 వేలు మిగులుతుందని ఒక కుటుంబం వారు తెలిపారు. కేవలం నాణ్యతే తమ గ్రామ వ్యాపార సూత్రమని చెప్పారు. -
పచ్చళ్లు కొంటున్నారా.. క్షణం ఆలోచించండి
-
కృష్ణాతీరంలో పచ్చళ్లూ - పులుసులూ
మీగడ పెరుగుతో మేళవించిన చల్ది; ముద్ద డాపలిచేత మొనయ నునిచి చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు; వ్రేళ్ళ సందులయందు వెలయ నిఱికి... ఇది కృష్ణుడు ఊరుగాయ పచ్చడిలో చల్దన్నం ఎలా తిన్నాడో పోతన గారు వర్ణించిన పద్యం. చద్దన్నం అంటే పాచిన అన్నం కాదు, పెరుగన్నం. మీగడ పెరుగుతో మేళవించిన అన్నం ముద్దని ఎడమ చేతిలో పెట్టుకుని, ఇంట్లో ఇంకాస్త పెట్టమని కొసరి కొసరి తెచ్చుకున్న ఊరుగాయ ముక్కని వ్రేళ్ల సందుల మధ్య ఇరికించుకుని ఆ రసాన్ని నాకుతూ, సంగిడీలు అంటే జట్టుగాళ్లతో కలిసి చక్కగా కూర్చుని చతురులాడుతూ చద్ది తిన్నాడట గోపాలకృష్ణుడు. పోతనగారు అచ్చమైన తెలుగువాడు కాబట్టి, కృష్ణుడు కూడా ఊరుగాయల్ని తిన్నాడని వ్రాశాడు. వంటింట్లో కారం తెలుగువారి ఆహార సంస్కృతి చరిత్రను మిరపకాయల రాకకు ముందు యుగం, తరువాతి యుగం అని రెండు రకాలుగా విభజిస్తే, మనకు కొన్ని సంగతులు అవగతం అవుతాయి. ఇండియాకి దారి కనుక్కోవడానికి బయల్దేరిన కొలంబస్ పొరబాటున అమెరికా ఖండాన్ని చేరాడు. మెక్సికో తీరంలో కారపుకాయలు రుచి చూశాడు. అదే ఇండియా అనుకున్నాడు. ఆ ఎర్రకారం కాయల్ని రెడ్ పెప్పర్ అన్నాడు. ఆ ఎర్రటి మనుషుల్ని రెడ్ ఇండియన్లు అన్నాడు. అమెరికా నుంచి కొలంబస్ తెచ్చిన మిరపకాయల్ని స్పెయిన్ నుంచి పోర్చుగీసులు అందుకుని తెచ్చి భారతదేశానికి అందించారు. అంటించారంటే ఇంకా సబబుగా ఉంటుంది. మిరియాల్ని సంస్కృత భాషలో ‘మరీచి’ అంటారు. మిరియంపు కాయ మిరపకాయగా మారింది. ఈ మరీచే ‘మిర్చి’గా కూడా మారి ఉండవచ్చు. మన కూరదినుసులు, మనం నేసిన వస్త్రాలు, మన పెట్లుప్పు (పేలే ఉప్పు- సురేకారం- ఫిరంగుల్లోకి కావలసిన ఇంధనం) మన దగ్గర పుచ్చుకొని పోర్చుగీసులు ఓడల్లో తెచ్చిన సరుకంతా దించేవాళ్లట. ‘‘వాణిజ్యము పెంచి యేలగానుగున్’’ అని కదా రాయలవారు ఆముక్తమాల్యదలో వ్రాసుకున్నారు. అక్షరాలా అదే మార్గాన తెలుగువాళ్లు ప్రపంచంలోనే రెండో స్థానంలో వుండే విధంగా మిరపకాయల్ని పండించటం మొదలుపెట్టారు. అప్పటిదాకా వాడిన మిరియాలు, పిప్పళ్లు, శొంఠి, అల్లం, జీలకర్ర, వాము, దాల్చిన చెక్క లాంటి కారపు ద్రవ్యాలన్నీ కేవలం మసాలా దినుసులుగా మిగిలిపోయాయి. మిర్చి వంటింటి రారాజు అయింది. చింతపండు రారాణిగా పెత్తనం చెయ్యసాగింది. వంటకాలన్నీ కారం, పులుపుమయంగా మారిపోయాయి. ఒక కీర్తనలో పురందరదాసు (1480-1564) పైకి ఆకుపచ్చగా, అమాయకంగా కన్పించే పచ్చిమిరపకాయ కొరికితే ఎంత ఘాటుగా ఉంటుందో, పాండురంగడి శక్తి కూడా అంతటిదేనని, అంచనా వేయడం కష్టం అనీ అంటాడు. అంటే, పురందరదాసు కాలానికే మిరపకాయలు కొత్తగా విజయనగర రాజ్యంలోకి ప్రవేశించాయి. మిరపకాయలు, బొప్పాయి, జామ, పొగాకు, వగైరా పోర్చుగీసుల ద్వారా తెలుగు నేల మీద కృష్ణాతీర ప్రాంతాలకు చేరాయి. మిరప, పొగాకుల ఉత్పత్తిలో గుంటూరుదే అగ్రస్థానం. ఇదంతా ఆంగ్లేయ యుగంలో తెలుగు నేల మీద జరిగిన పరిణామ క్రమం. అందుమూలాన కొత్త అలవాట్లు తెలుగు ప్రజలకు అలవడ్డాయి. కారం, పొగాకు తెలుగువారికి హక్కుభుక్తాలయ్యాయి. కారం ఎక్కువగా కావాలనుకునే వారు కృష్ణా, గుంటూరు మిరపకాయల్నీ, తక్కువ కారం కోరుకునే వారు కర్నూలు మొదలైన సీమప్రాంతాల్లో పండే బళ్లారి మిరపకాయలకు వెడతారు. రుచిలో, కారంలో మధ్యస్థంగా ఉంటాయి భద్రాచలం మిరపకాయలు. ఊరుగాయలు 1563లో భారతదేశంలోని పోర్చుగీసులు పచ్చి జీడిపప్పుని ఉప్పునీళ్లలో ఊరవేసి ఒకరకమైన ఊరుగాయని తయారు చేశారు. దాన్ని వాళ్లు ‘అచార్’ అన్నారు. ప్రాచీన అమెరికన్ రెడ్డిండియన్ భాషల్లో ఆక్సి, అహి, అచి పదాలు ‘పచ్చడి’ అనే అర్థంలో కనిపిస్తాయి. అచార్, అచర్, అచ్చడ్, పచ్చడి ఈ పదాలన్నీ ఒకే మూలంలోంచి పుట్టి ఉండొచ్చు. అది ద్రావిడ భాషా పదమే కావచ్చు కూడా! ‘ఘటికాచల మహాత్మ్యం’ కావ్యంలో తెనాలి రామకృష్ణుడు ఊరు పండు, ఊరుగాయలు రెండింటి గురించీ రాశాడు. ‘రాజశేఖర చరిత్ర’ లో మాదయగారి మల్లన్న ఊరు పిండి, ఊరుగాయలను ప్రస్తుతించాడు. 15వ శతాబ్ది నాటి కన్నడ గురులింగ దేశిక రచన లింగపురాణంలో 50 రకాల ఊరగాయల్నీ, 17వ శతాబ్ది నాటి శివతత్వ రత్నాకరం గ్రంథంలో కేలడి బసవరాజ మరో అయిదు రకాల ఊరుగాయల్నీ పేర్కొన్నాడు. అన్ని రకాల ఊరుగాయలు తిన్నారంటే మన పూర్వులు మనకన్నా మగానుభావులే! అప్పట్లో ఊరుగాయ అంటే ఉసిరికాయ తొక్కుపచ్చడి, మామిడికాయ తొక్కుపచ్చడి, చింతకాయ తొక్కుపచ్చడి. ఇలా నిల్వ పచ్చళ్లను ఊరుగాయలు అనే వారు. మిరపకాయలు వచ్చాక ఆ పాతకాలం ఊరుగాయల స్థానంలో ఇప్పుడు మనం పెట్టుకునే తరహా ఊరుగాయలు కొత్తగా చేరాయి. ఎక్కువ పులుపు, ఎక్కువ కారం, ఎక్కువ ఉప్పు కలిపే ఊరుగాయలను పెట్టుకొనే అలవాటు ఈ రెండు లేక మూడు వందల ఏళ్ల నుంచే మనకు అలవడింది. ఆఖరికి మిరపకాయల్ని కూడా ఊరవేసి ఊరుమిరపకాయల్ని తయారు చేసిన ఘనత మనదే. మిరపకాయలు తెలుగు వారి ఆహార చరిత్రను సమూలంగా మార్చేశాయి. అందుకు కృష్ణాతీరం ప్రధానకారకం. పులుసుకూరలు మిరపకారం ఎక్కువగా వేసుకోవాలంటే పులుపు తగినంత కలపాలి. సొరకాయ కూర వండితే చిటికెడు ఉప్పు, అర మిరపకాయ వేస్తే... ఉప్పు, కారాలు సరిపోతాయి. అదే చింతపండు రసం పోసి పులుసుకూర చేస్తే చెంచాడు ఉప్పు, గరిటెడు కారం పోయాల్సి వస్తుంది. మిర్చి రాక ముందు మిరియాల పొడి ఖరీదు కాబట్టి, చింతపండుని వంటింట్లోకి పెద్దగా రానిచ్చే వాళ్లు కాదు. చింతచిగురు, పులిచెంచలి కూర, పుల్లబచ్చలి లాంటి వాటిని పులుపు కోసం వాడుకునే వాళ్లు. రాయల కాలం నాటికి గోంగూర పూలమొక్కే! మిరపకాయలు వచ్చాక ఆ ఘాటుకు తగ్గ దీటైన పులుపు కోసం, చింతపండు, గోంగూరలకు ఘనస్వాగతం పలికారు ఘాటు ప్రియులైన కృష్ణాతీర వాసులు. అప్పటి వరకూ ఇగురు కూరలుగా ఉన్నవన్నీ పులుసు కూరలుగా కొత్త అవతారం ఎత్తాయి. కృష్ణాతీరంలో ఇంటింటా కృష్ణమ్మలా చింతపండు పులుసమ్మ కూడా ప్రవహించసాగింది. దాని ప్రభావం రాష్ట్రం అంతా విస్తరించింది. పచ్చళ్లు మిరపకాయల రాకతో రోటిపచ్చళ్ల తీరు మారిపోయింది. రోటిపచ్చడి అంటే కూర గాయల్ని ఉమ్మగిల చేసి, నూరి కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి తాలింపు పెట్టుకునే వాళ్లు. ఊర్బిండి (మినప్పప్పు లేదా పెసరపప్పును నానబెట్టి రుబ్బిన పచ్చడి), ఊర్పచ్చడి (రుబ్బిన పచ్చడి), బజ్జీ పచ్చడి (కూరగాయలను నిప్పుల మీద కాల్చి నూరి తాలింపు పెట్టిన పచ్చడి), తొక్కు (గోంగూర తొక్కు, చింతకాయ తొక్కు). ఇలా రోట్లో నూరి రుబ్బి పచ్చళ్లు చేసుకునే వాళ్లు. కూరగా చేసుకుంటే ఎంత కూరగాయల అవసరం అవుతుందో, పచ్చడిగా చేసుకున్నా అన్నే కూరగాయలు పట్టేవి. పచ్చడి మెతుకులంటే పేదకూడు అనే అభిప్రాయం ఆనాడు లేదు. విందు భోజనాల్లో బజ్జులు. నంజులు ఇలా రకరకాల పచ్చళ్లను వడ్డించే వాళ్లు. రోజులు మారాయి. ఇప్పుడు పచ్చళ్లన్నీ పులుపు కారాల మిశ్రమంగా మారిపోయాయి. అదనంగా అల్లం, వెల్లుల్లి మిశ్రమాన్ని కలపటం అనే కొత్త అలవాటు వల్ల రెట్టింపు కారం, దానికి తగ్గట్టుగా రెట్టింపు పులుపు తినడానికి క్రమంగా తెలుగు వాళ్లంతా అలవాటు పడుతూ వచ్చారు. ఆ రోజుల్లోనూ ‘యొర్రచేరులు’ ఘాటైన మిరియాల చారు, మూర్ధన్యాలు అదిరేలా ఘాటైన ఆవపచ్చళ్లూ తిన్నారు. కానీ అవన్నీ మిరియాల పొడితో తయారైనవి. ఇప్పటిలా కారం, చింతపండు వాళ్లకు తెలీని విద్యలే! చింతపండు (టామర్ హింద్ - భారతదేశపు పుల్ల ఖర్జూరం) ఎక్కువగా ఆయుర్వేద ఔషధాల తయారీలో వాడకంగా ఉండేది. వంటింట్లో దాని పాత్ర చాలా తక్కువ! ‘‘పప్పు బూరెలు నెయ్యి - పాయసాన్నములు / కాయ కూరలు పెక్కు - కలవంటకాలు / ఊరుగాయలు నెయ్యి - బొబ్బట్లు వడలు / గారెలు బూరెలు - కందమండిగెలు /అరటి పండులను -రాజన్నరాసులును / పిండి కూరలు ’’ అంటూ సుభధ్రాకళ్యాణంలో పెళ్లివారికి విందులో వడ్డించిన వంటకాల్లో ఊరుగాయలున్నాయి. నేతి అప్పచ్చులు, పాయసాన్నాలు, అనేక కూరలు కలిపి వండిన కలగూర వంటకాలు, ఊరుగాయలు, నేతి బొబ్బట్లు, వడలు, గారెలు, బూరెలు, పంచదారతో చేసిన మండెగలు (మాల్ పువాలాంటివి), అరటి పండ్లు, రజనాల బియ్యం (ఖరీదైన బాసుమతీ బియ్యం లాంటివి)తో వండిన అన్నం. పిండి కూరలు (తెలికి పిండి, నువ్వుల పిండి లేదా ఆవపిండి కలిపి వండిన కూరలు) ఇలా ఉండేవి ఆ రోజుల్లో తెలుగు వంటకాలు. మిరపకాయలకు పుట్టిల్లనదగిన కృష్ణా, గుంటూరు, కర్నూలు మొదలైన కృష్ణాతీర ప్రాంతాల్లో ఘాటు వంటకాలకు ప్రాధాన్యత ఎక్కువ! ఎండలు, కారాలూ రెండూ ఎక్కువగా ఉండే కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల ఆహార పదార్థాల్లో ఈ ఘాటు నుంచి కృష్ణా జిల్లాల్లోని అమృతమే రక్షగా ఉంది. - డా.జి.వి.పూర్ణచందు ఆహార చరిత్ర పరిశోధకుడు, సాహితీవేత్త నల్గొండ జిల్లాలో గోంగూర పచ్చడితో పాటు వాటి పూలతోను తొక్కు చేస్తారు. ఇక్కడి ప్రజలు గోంగూరను పుంటికూర అంటారు. ఆ పూల పచ్చడిని ‘పుంటికూర పూల పచ్చడి’ అంటారు. అందరికీ నోరూరించే తీపి వంటకం ‘అరిసె’. వీటిని వివిధ ప్రాంతాల్లో రకరకాల పేర్లతో పిలుస్తారు. తెలంగాణలో అరిసె, అతిరసం అంటారు. అలాగే వీటిని కర్నూలు జిల్లావాసులు అపరాసులు అని పిలుస్తారు. వివాహ వేడుకల్లో తప్పనిసరిగా ఉండే బొబ్బట్లు... కృష్ణాతీర అన్ని ప్రాంతాల్లో చేస్తారు. కాకపోతే, ఒక్కోచోట ఒక్కో పేరు. కోస్తాలో బొబ్బట్లు అంటే... కర్నూలులో భక్ష్యాలనీ, తెలంగాణ జిల్లాల్లో పోలె భక్ష్యాలనీ అంటారు. వీటినే కన్నడ సరిహద్దు ప్రాంతాల్లో బొబ్బట్లు, పోళిగలు, ఓళిగలని పిలుస్తారు. మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలో ‘అంబలి’ అనే మాట బాగా వినిపిస్తుంది. దీన్ని రాగులతో తయారు చేస్తారు. దీన్ని కర్నూలు జిల్లాలో ‘అమ్మరి’ అని కూడా అంటారు. ‘సేమియా’ అని రాయలసీమ, కోస్తా జిల్లాల్లో అంటే... ‘సేవిక’ అని తెలంగాణలో అంటారు. పేరు ఏదైనా వాటితో పాయసమే చేస్తారందరూ. వీటిని కర్నూలు జిల్లాలో చాలామంది ‘సేవెపోచలు’ అంటారు. నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ‘సకినాలు’ అనే పిండి వంటకాన్ని తప్పనిసరిగా ‘సంక్రాంతి’ పండుగకు చేస్తారు. అలాగే పెళ్లికూతుళ్లకు పుట్టింటి సారెగా... సీమంతాలకు ఒడి నింపడానికి వీటిని తప్పనిసరిగా చేస్తారు. ఇవి ఒక్క తెలంగాణలోనే వినిపించే.. కనిపించే.. పిండి వంటకం. మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో ‘సర్వపిండి’ బాగా ఫేమస్. వీటినే కోస్తాలో ‘తప్పేళా చెక్కలు’ అంటారు. కర్నూలులో వీటిని ‘మండిగలు’ అని పిలుస్తారు. -
నోరు పండే పచ్చళ్లు
పండుమిర్చి... పేరు వినగానే నోరు మండుతుంది... అలాగని మనసు ఊరుకోనిస్తుందా... ఒక్కసారి ఆ ఘాటును రుచి చూడమంటుంది... అంత కారం తినాలంటే ఎలా అని మళ్లీ అనిపిస్తుంది... అందుకే పండుమిర్చితో రకరకాల పదార్థాలను జత కట్టిద్దాం... గోంగూర, కొబ్బరి, చింతకాయ, టొమాటో, మసాలా... వీటి స్నేహంతో మిరప తన ఘాటు కోపాన్ని కాస్తంత తగ్గించుకొని... కమ్మటి రుచిని అందిస్తోంది... అమ్మో! పండుమిర్చి! అనకుండా ఒక్కసారి ప్రయత్నించి చూడండి... అబ్బ! ఎంత బాగుందో... అనక మానరు. పండుమిర్చిచింతకాయ పచ్చడి కావలసినవి: పండుమిర్చి - 100 గ్రా. చింతకాయలు - 100 గ్రా., శనగపప్పు - టీ స్పూను జీలకర్ర - అర టీస్పూను, కరివేపాకు - ఒక రెమ్మ, వెల్లుల్లి రేకలు - 5 ఇంగువ - చిటికెడు, ఆవాలు - అర టీ స్పూను, నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి - 2, ఉప్పు - 25 గ్రా. పసుపు - టీ స్పూను, మినప్పప్పు - టీ స్పూను తయారి: చింతకాయలను కడిగి ఆరబోసి, తడి పోయాక దంచి, గింజలు, ఈనెలు, పై తొక్క వేరు చేయాలి పండుమిర్చిని శుభ్రంగా కడిగి తడిపోయేవరకు ఆరనిచ్చి, తొడిమలు తీసి, మిర్చిని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి చింతకాయల పేస్ట్, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రేకలు జత చేసి మరోమారు తిప్పి తీసేయాలి. బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి బాగా వేగాక, ఇంగువ, కరివేపాకు జత చేసి వేగాక పచ్చడిలో వేసి కలపాలి. పండుమిర్చి టొమాటో పచ్చడి కావలసినవి: ఆవాలు - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు వైట్ వెనిగర్ - ఒకటిన్నర కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను, ఆలివ్ ఆయిల్ - ఒకటిన్నర కప్పులు, పండుమిర్చి - పావు కేజీ (గింజలు తీసేయాలి) టొమాటోలు - 2 కేజీలు, (చిన్న ముక్కలుగా కట్ చేయాలి) పసుపు - టీ స్పూను, జీలకర్ర - 4 టీ స్పూన్లు పంచదార - కప్పు, ఉప్పు - తగినంత తయారి: ఒక పాత్రలో ఆవాలు, వైట్ వెనిగర్ వేసి సుమారు అరగంటసేపు నాననివ్వాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పండుమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి పసుపు, జీలకర్ర, పంచదార, ఉప్పు, వెనిగర్‌లో నానబెట్టిన ఆవాలు జత చేయాలి మిశ్రమం దగ్గరపడే వరకు సుమారు గంటసేపు స్టౌ మీద ఉంచి దించేయాలి చల్లారాక గాలిచొరని జాడీలోకి తీసుకుని సుమారు 10 రోజుల తరువాత ఉపయోగించుకోవాలి. పండుమిర్చి కొబ్బరి పచ్చడి కావలసినవి: పండుమిర్చి - 200 గ్రా., కొబ్బరితురుము - కప్పు, వెల్లుల్లి రేకలు - 10, అల్లం తురుము - టీ స్పూను, ఆవపొడి - అర కప్పు, ఎండుమిర్చి - 6, ఆవాలు - టేబుల్ స్పూను, పసుపు - టీ స్పూను, చింతపండు - కొద్దిగా, మెంతిపొడి - అర టేబుల్ స్పూను, పల్లీ నూనె - 300 మి.లీ., ధనియాలపొడి - టీ స్పూను, జీలకర్రపొడి - టీ స్పూను, ఉప్పు - తగినంత, ఇంగువ - టీ స్పూను తయారి: పండుమిర్చిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి బాణలిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక పండుమిర్చి ముక్కలు, కొబ్బరితురుము వేసి వేయించాలి. చల్లారాక, ఉప్పు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి అల్లం తురుము, చింతపండు జత చేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, వెల్లుల్లి రేకలు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించాలి పండుమిర్చి, కొబ్బరిపేస్ట్ వేసి వేయించాలి చివరగా ఆవపొడి, ధనియాలపొడి, జీలకర్రపొడి, పసుపు, మెంతిపొడి వేసి బాగా కలిపి మూడు నిమిషాలయ్యాక దింపేయాలి. పండుమిర్చి గుత్తి పచ్చడి కావలసినవి: పండుమిర్చి -3 కేజీలు, వాము - 100 గ్రా. జీలకర్ర - 100 గ్రా., సోంపు - 100 గ్రా., ఎండుమిర్చి - 100 గ్రా. మెంతులు - 100 గ్రా., ఇంగువ - టేబుల్ స్పూను కలౌంజీ - 100 గ్రా., ఉప్పు - 200 గ్రా. ఆమ్చూర్ - 150 గ్రా., ఆవనూనె - కేజీ వైట్ వెనిగర్ - 200 మి.లీ. తయారి: పండుమిర్చిని శుభ్రంగా కడిగి,తడి పోయేవరకు గాలిలో ఆరబెట్టి, తొడిమలు తీసేయాలి. గింజలు తీసి పక్కన ఉంచాలి స్టౌ మీద బాణలిలో వాము, జీలకర్ర, సోంపు, ఎండుమిర్చి, మెంతులు వేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ఉప్పు, ఆమ్చూర్ జతచేసి మరోమారు మిక్సీ పట్టాలి. పండు మిర్చి గింజలను కూడా మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి రెండు పొడులకు కలౌంజీ జత చేసి, ఆవనూనె, వైట్ వెనిగర్ వేయాలి. (వీటిని కలిపేటప్పుడు గ్లౌజ్ వేసుకుంటే మంచిది. లేదంటే చేతులు మండుతాయి) నూనె, ఇంగువ వేసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని రెండు మూడు రోజులు ఎండలో ఉంచాలి ఈ మిశ్రమాన్ని కట్ చేసి ఉంచుకున్న పండుమిర్చిలో స్టఫ్ చేసి, నాలుగు రోజులు ఎండలో ఉంచాక, మిగిలిన నూనెను వాటి మీద పోసి గాలిచొరని జాడీలో నిల్వ చేయాలి. పండుమిర్చి గోంగూర పచ్చడి కావలసినవి: గోంగూర - కేజీ, పండుమిర్చి - 300గ్రా., చింతపండు - 250 గ్రా., ఉప్పు -తగినంత, ఇంగువ - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 6, పసుపు - టీ స్పూను, మెంతులు - 3 టీ స్పూన్లు, నూనె - పావు కేజీ తయారి: మెంతులను దోరగా వేయించి పొడి చేసి పక్కన ఉంచాలి పండుమిర్చిని శుభ్రంగా కడిగి తడిపోయేవరకు ఆరనిచ్చి, తొడిమలు తీసి మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి చింతపండు శుభ్రం చేసి పక్కన ఉంచాలి గోంగూర ఆకులను శుభ్రం చేసి, బాగా కడిగి తడిపోయేవరకు ఆరబెట్టాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక గోంగూర ఆకులు వేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ఒక పెద్ద పాత్రలో మెత్తగా చేసి ఉంచుకున్న పండుమిర్చి, గోంగూర, చింతపండు వేసి వాటికి ఉప్పు, వెల్లుల్లి రేకలు, పసుపు, మెంతిపొడి జత చేసి బాగా కలపాలి బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ వేసి బాగా కలిపి దించి చల్లారిన తరువాత పచ్చడిలో వేసి బాగా కలిపి, గాలిచొరని జాడీలో నిల్వ చేసుకోవాలి వాడుకునే ముందు పోపు వేస్తే తాజాగా, రుచిగా ఉంటుంది. పండుమిర్చి పచ్చడి కావలసినవి: పండుమిర్చి - కేజీ ఉప్పు - అర కప్పు చింతపండు - పావు కేజీ పసుపు - టీ స్పూను మెంతులు - టీ స్పూను నూనె - 2 కప్పులు జీలకర్ర - టేబుల్ స్పూను ఆవాలు - టేబుల్ స్పూను ఇంగువ - పావు టీ స్పూను తయారి: ఒక పాత్రలో పండు మిర్చి ముక్కలు, ఉప్పు, చింతపండు వేసి బాగా కలిపి గాలిచొరని సీసాలో మూడు రోజులు ఉంచాలి బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మెంతులు, పసుపు వేయించి, పచ్చడిలో వేసి కలపాలి తగినంత నూనె పోసి రెండు రోజుల తర్వాత వాడుకోవాలి. సేకరణ: డా. వైజయంతి -
పక్షవాతాన్ని ఎలా తగ్గించవచ్చు?
మా నాన్నగారి వయసు 73 ఏళ్లు. గత ఆరునెలలుగా పక్షవాతంతో (కుడివైపున) బాధపడుతున్నారు. మాట కూడా అస్పష్టంగానే ఉంది. డాక్టర్లు ఫిజియోథెరపీ చేయమని సలహా ఇచ్చారు. దీనికి ఆయుర్వేద చికిత్స తెలియజేయగలరు. నా వయసు 51 సంవత్సరాలు. ఇది వారసత్వంగా వస్తుందా? నివారణ మార్గాలను కూడా తెలియజేయండి. - ఐ. కిశోర్‌కుమార్, బెంగళూరు అందరూ పక్షవాతంగా వ్యవహరించే ఈ వ్యాధిని ఆయుర్వేదంలో ‘పక్షాఘాతం’ లేదా ‘పక్షవధ’ అనే పేర్లతో వర్ణించారు. ఆయుర్వేద సూత్రాలైన వాత, పిత్త, కఫాలలో... ఇది వాత ప్రధానమైన వ్యాధి కనుకనే వ్యావహారికంగా పక్షవాతం అంటారు. మొత్తం శరీర భాగాల్ని కుడి, ఎడమలుగా మనం విభజిస్తుంటాం. అవే వామపక్షం, దక్షిణపక్షం. ‘ఘాత, ఆఘాత, వధ’ శబ్దాలకు దారుణంగా కొట్టటం, చచ్చుబడటం లనే అర్థాలున్నాయి. సాధారణంగా ఈ వ్యాధి శరీరంలో ఒక పక్షానికి వస్తుంది కాబట్టి పక్షాఘాతం లేదా పక్షవధం అనే జబ్బుగా గుర్తించారు. ఇదే ఒక్క అంగానికి (కాలు లేక చెయ్యి) వస్తే ఏకాంగవాతమని, మొత్తం శరీరానికి వస్తే సర్వాంగవాతమనీ పేర్లు మారుతుంటాయి. వాతప్రకోపకర అంశాలను కట్టడి చేయకపోతే ఈ వ్యాధి కలుగుతుంది. అధికరక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు, శక్తికి మించిన శ్రమ, ప్రమాదవశాత్తు దెబ్బలు తగలటం, క్షమత్వం తగ్గి శరీరం శుష్కించిపోవటం, మితిమీరిన ఉపవాసాలు, స్థౌల్యరోగం, ధూమపాన, మద్యపానాల వంటి మాదకద్రవ్యసేవన, అధిక మానసిక ఒత్తిడి మొదలగునవన్నీ వాత ప్రకోపకారకాలు. కాబట్టి, వాటిపై నియంత్రణ కావాలని గుర్తుంచుకోండి. అప్పుడప్పుడు వారసత్వం కూడా కారణంగా కన్పించినా, పైన చెప్పిన కారణాలు; ఆహారవిహారాలపై అవగాహన పెంచుకొని, క్రమశిక్షణ పాటిస్తే ఈ వ్యాధి రాకుండా నివారించుకోవచ్చు. అంటే మెదడుకు సంబంధించి రక్తనాళాలు, నాడీకణాలకు సంబంధించిన రుగ్మతలు, ప్రమాదాలు రాకుండా ఉంటాయి. ఆహారం: తీపి, ఉప్పు, పులుపు తగినంత ప్రమాణంలోనే సేవించాలి. ప్రత్యేకమైన నూనె వంటకాలు, ఊరగాయలు, అధికంగా ఉప్పు సేవించడం వంటివి పూర్తిగా మానేయాలి. ద్రవాహారం బాగా తీసుకోవాలి. పోషక విలువలుండే సహజంగా లభించే ఆహార సేవనం ఆరోగ్యకరం. సమీకృత, మితాహారం అలవాటు చేసుకోవాలి. ఆవుపాలు, ఆవునెయ్యి, నువ్వుల నూనె తగు ప్రమాణాలలో సేవిస్తే ఈ వ్యాధి దూరమవుతుంది. విహారం: వయసుకు, వృత్తికి అనుగుణంగా పరిమితమైన వ్యాయామం (నడక, ఆటలు, యోగాసనాలు మొదలగునవి) చిన్నప్పట్నుంచి పాటిస్తూ జీవితాంతం సాధన చేయడం మంచిది. ప్రాణాయామం అత్యంత ప్రయోజనకరం. ఔషధాలు : బృహత్వాత చింతామణిరస (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1 చొప్పున పదిహేను రోజులు మాత్రమే వాడాలి. మహావాతవిధ్వంసినీరస, వాతరాక్షస, వాతగజాంకుశ, వాతకులాంతకరస (మాత్రలు) వంటి మందులలో ఏది ఎంత మోతాదులో ఎంతకాలం అవసరమో ఆయుర్వేద నిపుణులు నిర్ణయిస్తారు. మహారాస్నాది, దశమూల కషాయాలు ఉపయోగకరం. అశ్వగంధ, బలా, శతావరీ చూర్ణాలు కూడా లాభదాయకం. బాహ్యచికిత్స తైలమర్దనం: ‘బలా, ధన్వంతరి, మహామాష, క్షీరబలాతైల’ వంటి వాటిలో దేనితోనైనా ఈ మసాజ్ చేస్తారు. స్వేదకర్మ: వ్యాధిగ్రస్తమైన భాగాలకు మసాజ్ చేసిన పిదప, ప్రత్యేక ఔషధ పదార్థాలను వేడిచేసి, వాటితో స్వేదకర్మ (చెమట పట్టించే ప్రక్రియ) చేస్తారు. వ్యాయామం: కొంత విరామం తర్వాత, ప్రత్యేకమైన ఫిజియోథెరపీలు చేయిస్తారు. పంచకర్మలు వస్తికర్మ: కొన్ని తైలాలను లేదా కషాయాలను మలమార్గం ద్వారా లోనికి ప్రవేశపెట్టే ప్రత్యేక సాంకేతిక ప్రక్రియే ఈ ‘వస్తికర్మ’. వ్యాధి స్వభావాన్ని బట్టి శిరస్సుపై చేస్తే దానిని శిరోవస్తి అంటారు. అలాగే ధారాచికిత్స, సస్యకర్మలను కూడా ఆయుర్వేదంలో వివరించారు. గమనిక: ఈ ప్రక్రియలన్నీ... వ్యాధి చికిత్సకు గాను ఒక పద్ధతిలోనూ, రోగాన్ని నివారించి ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఇంకొక తీరులోనూ ఔషధాలను మారుస్తూ చెయ్యవలసి ఉంటుంది. కేవలం నిపుణుల పర్యవేక్షణలోనే ఇవి జరగాల్సి ఉంటుంది. కాబట్టి మీరు దగ్గరలోని నిపుణుని సంప్రదించండి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్