టెంక కాదు, టెక్నాలజీ ముఖ్యం | Sri Ramana Writes On Akshara Thuniram | Sakshi
Sakshi News home page

May 12 2018 2:49 AM | Updated on May 12 2018 2:20 PM

Sri Ramana Writes On Akshara Thuniram - Sakshi

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (ఫైల్‌ ఫోటో)

మామిడికాయ పచ్చళ్లకి సమయం ముంచు కొచ్చేసింది. తల్లులారా! మీరు టెక్నాలజీని వాడండి. నా మాట వినండి. ప్రపంచంలోనే మొదటిసారి మ్యాంగో పికిల్‌ యాప్‌ని ప్రారం భించనున్నారు. ఎందుకంటే ఇది మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు జాడీ. మన తెలుగింట ఆడపడుచులకు ఆవకాయల తయారీ కొట్టిన పిండి. దంచేయడం, పొడి చేయడం మన విద్య.ఈ సీజన్‌లో ఏపీలో కొన్ని వందల మెట్రిక్‌ టన్నుల మామిడి నిల్వ పచ్చళ్లని అమ్మలక్కలు జాడీలకెత్తుతారు. వీటి పాళాలు ఇంటికో తీరున, ఊరికో లెక్కన ఉంటాయ్‌. మన ఊళ్లలో ఆవకాయ పెద్దమ్మలు, మాగాయ మామ్మలు ఉంటారు.

వాళ్లు మన ప్రాచీన ఋషుల్లా వారి అనుభవాలని క్రోడీకరించి ఫార్ము లాని ప్రచారంలోకి తెస్తారు. నమ్మిన వాళ్లు ఆచరిస్తారు. నమ్మనివాళ్లు నాస్తి కుల్లా మిగులుతారు.ఇందులో బ్రహ్మ విద్యలో ఉన్నట్లు రకరకాల వాదాలున్నాయ్‌. కొందరు టెంకవాదులు, మరికొందరు కండవాదులు, ఇంకొందరు టెంకండ వాదులు. అంటే రెండూ ముఖ్యమేనని విశ్వసించేవారు. పచ్చళ్లలో గ్లామర్‌ చింతకాయకి, గోంగూరకి లేదు. ఇది.బూర్జువా అభిరుచిగా అతి వాదులు ఆక్షేపిస్తూ ఉంటారు. ఆవకాయలో సామాజిక స్పృహమీద చర్చించడం ఆత్మలోకంలో దివాలా.

కత్తిపీటల్లో ఆవకాయ కత్తిపీటలు వేరు. వూరికి రెండో మూడో ఉండేవి. ముందుగా వాటిని బుక్‌ చేసుకుని, తర్వాత కాయ తెచ్చు కునేవారు. ఆవకాయ ముక్క కొట్టడం ఒక విల క్షణమైన కళ. ఇది పరుష విద్య. కాయకే కాదు. ఈ పనికీ కండపుష్టి అవసరం. ప్రతి ముక్కకి అంతో ఇంతో టెంక పెచ్చు మనిషికి తత్వజ్ఞానంలా అతుక్కుని ఉండాలని శాస్త్రకారులు ఘోషిస్తున్నారు. అరిస్టాటిల్‌ హయాంలోనే ఈ ఆవకాయ సంప్రదాయం ఉన్నట్లు గ్రీక్‌ గ్రంథాలను జాగ్ర త్తగా పరిశీలిస్తే అవగతమవుతుంది. భాగవత పురాణంలో పోతన గోపాలకులు చద్దులారగించు వేళ మాగాయలాంటి నంజుళ్లని ఇష్టంగా తిన్నట్టు పేర్కొన్నారు.

ఒక తెగ తెలుగువారు నూజివీడు చిన్న రసాలు, పెద్ద రసాలు ఆవకాయకి పెట్టింది పేరంటారు. ‘‘పీచు కావాలంటే హలో! నూజి వీడు రసాలకే చలో’’ అనే నినాదం ప్రచారంలో ఉంది. ప్రతి ఇంటా కారాలూ ఆవాలూ నూరే తరుణం ఇది. దినుసుల మీద కావల్సినంత గోష్టి నడుస్తుంది. ఈ రెండు నెలల్లోనే ఆవాలు, కారాలు, నూనెలు మీద జరిగే చర్చలకిగాను మొత్తంమీద రెండొం దల కోట్ల సెల్‌ బిల్‌ కాల్తుందని ఓ అంచనా. ఏ జిల్లా సంప్రదాయం ఆ జిల్లాదే. ఇప్పుడు చంద్రబాబు పూనుకుని, అందర్నీ ఓ జాడీ కిందికి తీసుకొచ్చి, అమరావతి ఆవకాయలుగా స్థిరీకరిస్తే బావుంటుందనిపిస్తోంది. ఈ వేసవిలో విదేశాలకు పంపే మామిడి పచ్చళ్లకి ప్రత్యేక కౌంటర్లు వెలుస్తాయ్‌. ఇండియాలో పెద్ద దిక్కు లేని వారికి, మేమున్నామంటూ కొన్ని సంస్థలు వచ్చాయ్‌.

అన్నీ వాళ్లే చూస్తారు, ఎటొచ్చీ మనం డబ్బు చూడాలి. ఈ సీజన్‌లో అట్లాంటా నించి న్యూజెర్సీ నించీ, అమ్మా! హాయ్‌... సూపర్బ్, టిపికల్, వావ్‌ అంటూ లొట్టలు విని పించి, లక్షలాది తెలుగు ఇళ్లలో ఆనందాలు వెల్లివిరుస్తాయి. దీనికి ఇంత సత్తా ఉందని తెలిస్తే, చంద్రబాబు ఊరుకోడు. ఓ ఉచిత సలహా కేంద్రం, పంపడానికి ఓ సేవా కేంద్రం స్వయంగా రిబ్బన్‌ కత్తిరించి ప్రారంభించే అవకాశం ఉంది. ఆయనకి టెంక కంటే టెక్నాలజీయే ముఖ్యం!

వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement