క్షీరసాగర మథనం | Sriramana Akshara Tuniram On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

క్షీరసాగర మథనం

Published Sat, May 9 2020 12:53 AM | Last Updated on Sat, May 9 2020 4:58 AM

Sriramana Akshara Tuniram On Chandrababu Naidu - Sakshi

చాలా రోజుల తర్వాత నిషా తిరిగి మబ్బులా ఆవరించింది. వీధులమీద చిత్రవిచిత్రమైన సందళ్లు. ఎప్పుడూ ఇంత స్తబ్దుగా ఈ సమాజం ఉన్నది లేదు. ఎంత డబ్బు?! నమ్మలేని నిజాలు! రోజువారీ రాష్ట్ర అమ్మకాల్లో సామాన్యుడి వాటా పదిహేను కోట్లు. అందులో పేదవాడి చెమట నెత్తురు కనీసం ఏడె నిమిది కోట్లు. ఇంతాచేసి ఇది ఒక్కరోజు కలెక్షను. పైగా ఇది కేవలం ద్రవాల వెల మాత్రమే, ఇందులో ఉపద్రవాలపై ఖర్చు ఉంటుందని అనుభవజ్ఞుడి అంచనా. ఇది పుట్టినప్పుడు దీనికి ‘సురాపానం’ అని నామకరణం చేశారు. అంటే దేవతల అధికారిక డ్రింక్‌. 
(చదదవండి: ఐఏఎస్‌లకు ఏం తెలుసు?)

ఇది ఎప్పటికీ అసురపానం కాలేదుగానీ క్రమంగా ఓ మెట్టు పైకి చేరినకొద్దీ సురలే అసురులై పోతారని ‘మధు మోహం’ లేనివారు విశ్లేషిస్తుంటారు. కృతయుగంలో ఏ దివ్యముహూర్తాన క్షీర సాగర మహాక్రతువు ఆరంభమైందోగానీ ఆ మహా మథనంలో ఎన్నో వింతలు విశేషాలు పుట్టు కొచ్చాయి. ఐరావతమనే తెల్లఏనుగు నించి వెన్నె లలు కురిపించే చందమామ దాకా ఆ చిలకడంలో వెన్నెముద్దల్లా తేలాయి. దీన్ని జయప్రదం చేయ డానికి విష్ణుమూర్తి రెండు అవతారాలు ధరించాడు. కూర్మమై మునిగిపోతున్న మంథరగిరి కవ్వాన్ని వెన్నంటి నిలిపాడు. 

శివదేవుడు ఘోర కాకోలమైన విషం చెలరేగినపుడు జుంటి తేనెలా స్వీకరించి గొంతులో నిలిపి గరళ కంఠుడైనాడు. మధ్యలో అనేకానేక విశేషాలు వింతలు వచ్చాయి. అచ్చర కన్నెలు నాట్యభంగిమలతో పాల నురగల్లో కలిసి పోయారు. ఒక దశలో ‘వారుణి’ దిగి వచ్చి ఏరులై ప్రవహించింది. సేవించిన వారందరికీ తిమ్మి రెక్కింది. తిక్క రేగింది. దేవ దానవులు రెచ్చి  పోయారు. కలిపిన పట్టువదిలి ఊగసాగారు. విష్ణు మూర్తి, ఇంకో నాలుగు తిప్పులు తిప్పితే ఆశించిన అమృతం సిద్ధిస్తుంది లేకపోతే ఎక్కడికో జారి పోతుందని హెచ్చరించాడు. 

నిజంగానే అమృతం జాడ పొడకట్టింది. నిత్య యవ్వనంతోబాటు, జర రుజ మరణాల్ని నియంత్రించే అమృతం వచ్చేసరికి మాకంటే మాకంటూ సురాసురులు ఎగబడ్డారు. విష్ణుమూర్తి గమనించాడు. అన్యాయం, అక్రమం, స్వార్థం, భయం, పక్షపాత బుద్ధి అక్కడే పడగ విప్పాయి. దేవుడు మోహినిగా అవతారం ధరిం చాడు. వడ్డన సాగించాడు. ధర్మ సంస్థాపన కోసం జరగాల్సిన దగా దేవుడి చేతుల మీదుగా జరిగి పోయింది. చివరకు సురలకే అమృతం దక్కింది. అసురలకు శ్రమలో వాటా చిక్కింది. 

కలియుగంలో ఎన్టీఆర్‌ పాలనలో తెలుగు వారుణి వాహినిగా ప్రభుత్వ సారాయిగా జనం మీదకు వచ్చింది. అన్న గారు కిలో రెండు రూపాయల బియ్యం పథకం దేశాన్ని కుదిపేసింది. ఆనాడు ఆ బియ్యం ధర శ్రామిక వర్గాన్ని నిషా ఎక్కించింది. మిగిలిపోతున్న డబ్బులు వారుణి వాహిని వైపు మొగ్గు చూపాయి. అప్పుడే చాలామంది కష్టపడి ఈ కొత్త మత్తుని అలవాటు చేసుకున్నారు. ప్రభుత్వం ఆ చేత్తో ఇచ్చి, ఈ చేత్తో లాక్కుందని జనం వాపోయారు.
(చదవండి: అప్పుడలా.. ఇప్పుడిలా)

ఇప్పుడు షాపులు తీశారని ఒక విమర్శ. రాష్ట్ర సరిహద్దు కూత వేటు దూరంలో ఉంటుంది. భాగ్యనగర్‌ వైన్స్‌కి, బెజవాడ వైన్స్‌కి పది అంగల దూరం ఉంటుంది. ఆ దూరాన్ని ఎవడాపగలడు. అప్పుడు మళ్లీ అదొక విమర్శ. జగన్‌ మద్యం ధరలు పెంచారట. కొందరైనా విముఖత చూపుతారని ఆశతో. బీద బిక్కి దీనివల్ల చితికి పోతున్నారని చంద్రబాబు ఒక మద్యాస్త్రం సంధించారు. ఎవరి మద్యం వారే కాచుకోండి అంటే ఎట్లా ఉంటుంది? ప్రతి ఇల్లూ ఒక బట్టీ అవుతుంది. ధరలు తగ్గు తాయి. ఏదైనా ఎదుటివారికి చెప్పడం చాలా తేలిక. మనం ఏం చేశామో మనకి గుర్తుండదు. అందుకే నేటి అపోజిషన్‌ లీడర్లు పాత పేపర్లు తీరిగ్గా చదువు కోవడం మంచిదని ఒక పెద్దాయన సూచిస్తున్నారు. 

మా ఊరి పెద్దాయన చంద్రబాబు వీరాభిమాని, ‘రోజూ హీనపక్షం రెండు లేఖలు వదుల్తున్నారండీ’ అంటే ఆయన చిద్విలాసంగా నవ్వి, పోన్లెండి ఇవ్వా ల్టికి ఇంటిపట్టున ఉన్నాడు. తాజా కూరలు తాజా పాలు, వేళకి తిని తగినంత విశ్రాంతి తీసుకుంటు  న్నట్టున్నాడు. రోజూ ఒకటికి రెండుసార్లు ఇబ్బంది లేకుండా అవుతున్నట్టున్నాయ్‌ మంచిదే! అన్నారు. అంటే నిత్యం చంద్రబాబు వదుల్తున్న లేఖల్ని మా వూరి పెద్దాయన ఎలా భావిస్తున్నారో చాలా లౌక్యంగా చెప్పారు. అందుకని ఈ దినచర్య మార్చండి.        
వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement