అచ్చం రామోజీరావు నోట్లోంచి ఊడిపడ్డట్టు... ‘ఈనాడు’ రాతల్లోంచి పుట్టుకొచ్చినట్లు... తెలుగుదేశం ఆరోపణల్ని పుణికిపుచ్చుకున్నట్లు...!! కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన ఫిర్యాదు గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే ఇంతకన్నా మరేమీ లేదు. టీడీపీ నేతల ఆరోపణల్ని చూసి రాసినట్టుగా తయారు చేసిన లేఖను అమిత్‌షాకు అందజేసి.. దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరటం ద్వారా పురందేశ్వరి తన మరిది చంద్రబాబు నాయుడి కళ్లలో సంతోషాన్ని చూడాలనుకున్నట్టున్నారు. తెలుగుదేశం పార్టీకి కొత్త ఆశలివ్వాలని అనుకున్నట్టున్నారు. అసలు ఆమె లేఖలో పేర్కొన్న ఆరోపణల్లో ఏ కొంచెమైనా నిజం ఉందా? ఏది నిజం? చూద్దాం...
వైఎస్సార్‌సీపీ హయాంలో దశలవారీ మద్య నియంత్రణ
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దశలవారీగా మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలుచేస్తోంది. ఇందుకోసం పలు చర్యలు చేపట్టింది.
► టీడీపీ హయాంలో ప్రైవేటు మద్యం దుకా ణాలు ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకూ విక్రయాలు సాగించేవి. అనధికారికంగా 24 గంటలూ విక్రయిస్తుండేవి. కానీ, ఇప్పుడు ఆ సమయాన్ని కుదించి, ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకే విక్రయాలకు అనుమతించారు. ఇది నిజం కాదా?
► బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లు రద్దు చేశారు. చంద్రబాబు హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుబంధంగా 43 వేల బెల్ట్ దుకాణాలుండేవి. వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే వాటన్నింటినీ పూర్తిగా తొలగించారు. గతంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా అనుమతించిన పర్మిట్ రూమ్‌లు అనధికారిక బార్లుగా చలామణి అయ్యేవి. వాటినీ ఈ ప్రభుత్వం రద్దు చేయటం పచ్చి నిజం.
► రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్యనూ తగ్గించారు. టీడీపీ హయాంలో 4,380 మద్యం దుకాణాలుండగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వాటిని 2,934కి తగ్గించింది. బార్ల సంఖ్యను పెంచలేదు. 2019లో ఖరారుచేసిన 840 బార్లే ఉన్నాయి. కొత్త బార్లకు లైసెన్సులివ్వలేదు. ఇది నిజం కాదా?
► మద్యం విక్రయాలను నిరుత్సాహపరచడమే తమ పార్టీ విధానమని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో చాలాసార్లు చెప్పారు. అందుకే అధికారంలోకి వచ్చాక మందుబాబులకు షాక్ కొట్టేలా మద్యం ధరలను పెంచారు. అదనపు ఎక్సైజ్ టాక్స్ (ఏఆర్‌ఈటీ) విధించారు. దీంతో మద్యం ధరలు పెరిగాయి. ఏఆర్‌ఈటీ పన్నుతో రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా, వాస్తవానికి మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా పేదలు ఈ వ్యసనానికి క్రమంగా దూరమవుతున్నారు. ఇది నూరుశాతం నిజం.
తగ్గిన మద్యం వినియోగం... కేంద్ర సర్వేనే వెల్లడించిన వాస్తవం: రాష్ట్రంలో మద్య వినియోగం గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ నివేదికే వెల్లడించింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) నివేదిక ప్రకారం 2015–16లో రాష్ట్రంలో పురుషుల్లో 34.9 శాతం, మహిళల్లో 0.4 శాతం మద్యం సేవించేవారు. 2019–21 నాటికి రాష్ట్రంలో మద్యం సేవించే పురుషులు 31.2 శాతానికి, మహిళలు 0.2 శాతానికి తగ్గారు. ఇది మద్య నియంత్రణ విధానాల వల్ల కాదా పురందేశ్వరి గారూ?
డిస్టిలరీలన్నీ మీ చంద్రబాబు అనుమతిచ్చినవే
చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం కల్పించాలనే ఆతృతతో పురందేశ్వరి వాస్తవాలను విస్మరించారు. వైఎస్సార్‌సీపీ నేతలకు చెందిన కంపెనీలకే మద్యం తయారీ కాంట్రాక్టులు అప్పగించి దోపిడీకి పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. కానీ వాస్తవం ఏమిటంటే.. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా అనుమతివ్వలేదు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉంటే వాటిలో 12 డిస్టిలరీలకు చంద్రబాబే అనుమతిచ్చారు.
మిగిలిన 6 అంతకు ముందటి ప్రభుత్వాలు అనుమతిచ్చినవి. ప్రస్తుతం చంద్రబాబు సన్నిహితుల కంపెనీలే మద్యాన్ని తయారు చేస్తున్నాయి. గతంలో తయారు చేస్తున్న మద్యాన్నే ఇప్పుడూ తయారు చేస్తున్నాయి. మరి ఎందుకీ దుష్ప్రచారం?
► ఎంకే డిస్టిలరీ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్‌కుమార్‌ది. ఆయన టీడీపీ నేత పుట్టా మధుసూదన్ యాదవ్‌కు కుమారుడు కూడా.
► శ్రీకృష్ణ ఎంటర్‌ప్రైజస్ టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవుల నాయుడు కుటుంబానిది.
► ఎస్పీవై ఆగ్రో ప్రొడక్ట్స్ టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబానిది. వైఎస్సార్‌సీపీ తరపున ఎంపీగా గెలిచి నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలో చేరినందుకు నజరానాగా ఎస్పీవై రెడ్డికి చంద్రబాబు అనుమతిచ్చారు.
► ఇక బాబు ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద 2019 ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్‌లో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వాటాదారు.
మద్యం నాణ్యతపైనా దుష్ప్రచారమే
పురందేశ్వరి కుట్రపూరితంగా చేసిన మరో దుష్ప్రచారం.. మద్యంలో నాణ్యత లేదని. గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇలాంటి విషపు ఆరోపణే చేసి భంగపడింది. విషపు అవశేషాలు ఉన్నాయని చెన్నైలోని ఎస్‌జీఎస్ లేబోరేటరీ పేరిట ఓ నకిలీ నివేదికను టీడీపీ తెరపైకి తెచ్చి అభాసుపాలైంది. కానీ, అదే నివేదికను ఉటంకిస్తూ పురందేశ్వరి అవే అసత్య ఆరోపణలు ఇప్పుడూ చేయడం విచిత్రమే. చెన్నైలోని ఎస్‌జీఎస్ లేబోరేటరీ అసలు తాము అలాంటి నివేదికే ఇవ్వలేదని అప్పట్లోనే స్పష్టంచేసింది.
తాము పరీక్షించిన మద్యం నమూనాల్లో అవశేషాలు పరిమితికి లోబడే ఉన్నాయని, అవి ప్రమాదకరం కాని సహజసిద్ధమైన మొక్కల నుంచి తయారైనవేనని స్పష్టం చేసింది. తమ నివేదికను తప్పుగా అన్వయించారని చెప్పింది. అయినా సరే రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ రాష్ట్రంలో మద్యం నమూనాలను హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌కు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నా లజీ ప్రయోగశాలలో పరీక్షించింది. ఆ నమూనాలన్నీ నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే ఉన్నాయని ఆ లేబోరేటరీ నివేదిక ఇచ్చింది. మద్యం నాణ్యతపై ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చిచెప్పింది. పురందేశ్వరి ఆరోపణలు చేసే ముందు ఈ వాస్తవాలను కావాలనే విస్మరించారు.
డిజిటల్ చెల్లింపులూ జరుగుతున్నాయి
రాష్ట్రంలో 80 శాతం మద్యం అమ్మకాలు నగదు లావాదేవీల ద్వారానే నిర్వహిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని çపురందేశ్వరి మరో అబద్ధాన్ని రాసేశారు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదు అమ్మకాలే కాదు డిజిటల్ చెల్లింపుల విధానాన్నీ బెవరేజెస్ కార్పొరేషన్ అమలు చేస్తోంది. రోజువారీ వేతనాలు తీసుకునే కూలీలు నగదు ద్వారానే కొంటున్నారు కనక ఆ విధానాన్నీ కొనసాగిస్తోంది. మద్యం విక్రయాల మొత్తాన్ని ఏ రోజుకా రోజు సమీపంలోని ఎస్‌బీఐ శాఖలో జమ చేసి చలానాలు అందజేస్తోంది. మద్యం నిల్వలు, విక్రయాలు, బ్యాంకుల్లో జమ చేసిన మొత్తం అన్నింటిపై బెవరేజెస్ కార్పొరేషన్ పకడ్బందీగా రికార్డులు నిర్వహిస్తోంది.
ఇవి కాకిలెక్కలు కాదా?
► రాష్ట్రంలో రోజూ 80 లక్షల మంది ఒకొక్కరూ సగటున రూ.200 విలువైన మద్యాన్ని సేవిస్తున్నారని పురందేశ్వరి కాకి లెక్కలు వల్లించడం మరో విడ్డూరం. ఆ విధంగా మద్యం అమ్మకాల మొత్తం రూ.57,600 కోట్లలో రూ.25 వేల కోట్లు అక్రమంగా మళ్లిస్తున్నారని నోటికొచ్చింది కూసేశారు. కేంద్ర జాతీయ కుటుంబ ఆరోగ్య నివేదిక(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) నివేదిక ప్రకారం 2019–21లో రాష్ట్రంలో 18.7 శాతం మంది అంటే దాదాపు 40 లక్షల మంది మాత్రమే మద్యం సేవిస్తున్నారు. మరి 80 లక్షల మంది అంటూ అంత అబద్ధాన్ని ఎలా చెప్పగలిగారో పురందేశ్వరికే తెలియాలి!!.
► లంచాలిచ్చే కంపెనీల నుంచే మద్యం కొంటున్నారని పురందేశ్వరి ఆరోపించారు. కానీ రాష్ట్రంలో 2015లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను అనుసరించే ప్రస్తుతం బెవరేజస్ కార్పొరేషన్ మద్యం కొంటోంది. 2019 తరువాత ఆ విధానంలో ఎలాంటి మార్పూ లేదు. కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రాష్ట్రంలో మద్యం కొనుగోళ్లు పూర్తి పారదర్శకంగా, నిబంధనల మేరకే ఉన్నాయని నివేదిక ఇచ్చింది.
► రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై స్పెషల్ డ్యూటీ (పన్ను) వసూలు చేస్తున్నారని, ఆ మొత్తం ఎక్కడికి వెళ్తోందో తెలియడంలేదని పురందేశ్వరి మరో దరిద్రమైన ఆరోపణ చేశారు. ఏదైనా ప్రభుత్వ ఖజానాకు వెళ్లేదే కదా!. వాస్తవానికి అది స్పెషల్ డ్యూటీ (పన్ను) కాదు. అది స్పెషల్ మార్జిన్. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమ పథకాలు కోసం ప్రభుత్వం 2021 నవంబరు 9న ప్రత్యేక జీవో జారీ చేసి ఆ స్పెషల్ మార్జిన్ వసూలు చేస్తోంది. ఆ నిధుల్ని సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తోంది.
► రాష్ట్రంలో రెండేళ్లలో కాలేయ సంబంధ వ్యాధులతో మృతి చెందిన వారు 25 శాతం పెరిగారనటం మరో దుర్మార్గం. విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో గత పదేళ్లలో నెలకు సగటున 20 మంది మాత్రమే కాలేయ సంబంధిత వ్యాధులతో ఆసుపత్రిలో చేరారు. వారిలో కూడా 95 శాతం మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ నివేదిక కూడా ఇచ్చారు. కాకపోతే మరిది కోసం... బాబు కోసం కష్టపడుతున్న పురందేశ్వరికి ఈ వాస్తవాలతో పనేముంటుంది!?
Comments
Please login to add a commentAdd a comment