
మచిలీపట్నం తీరంలో 3 వేల ఎకరాలకు పైగా మడ అడవులు నాశనం
పల్లెతుమ్మలపాలెంలోని భారత్ సాల్ట్స్ ఫ్యాక్టరీ వ్యర్థ జలాలే కారణం
పట్టించుకోని అటవీ శాఖ
మడ అడవులు దెబ్బతింటే తీరానికి పెను ప్రమాదం
ప్రకృతి ప్రసాదించిన మడ అడవులు తుపానులు, సునామీల వంటి విలయాల్ని అడ్డుకుంటాయి. సముద్రంలో విరుచుకుపడే కెరటాలను చిన్నపాటి అలలుగా మార్చి విపత్తులను ఆపేస్తాయి. తీరానికి సహజ రక్షణ కవచంగా నిలుస్తూ.. పర్యావరణాన్నిపరిరక్షిస్తాయి. అంతటి విశిష్టత గల మడ అడవులు మచిలీపట్నం తీరంలో భారీగా నాశనమవుతున్నా పట్టించుకునే నాథుడు కనిపించడం లేదు.
సాక్షి, అమరావతి: కృష్ణా అభయారణ్యం పరిధిలో మడ అడవులు అత్యంత వేగంగా నాశనమవుతున్నాయి. సముద్ర తీరానికి సహజ రక్షణ కవచాలుగా నిలిచే మడ అడవులు కళ్లముందే ధ్వంసమవుతున్నా అటవీ శాఖ పట్టించుకోవడం లేదు. మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో కేవలం రెండు, మూడు నెలల వ్యవధిలోనే 3 వేల ఎకరాలకుపైగా మడ అడవి నాశనమైనట్టు పర్యావరణవేత్తలు గుర్తించారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్ని నెలల్లోనే అభయారణ్యంలోని అడవి మొత్తం కనుమరుగవుతోందని పర్యావరణవేత్తలు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
మచిలీపట్నం తీరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న భారత్ సాల్ట్స్ రిఫైనరీస్ వ్యర్థ జలాల వల్ల మడ అడవి నాశనమవుతున్నట్టు తేలింది. ఆ పరిశ్రమ వ్యర్థ జలాలను భారీఎత్తున మడ అడవిలోకి వదిలేస్తుండటంతో మడ చెట్లు చనిపోతున్నాయి. గతంలో ఆరోపణలు వచ్చినప్పుడు పరిశ్రమ వ్యర్థ జలాలు మడ అడవిలోకి రాకుండా చర్యలు తీసుకున్నారు. దానివల్ల కొంతమేర రక్షణ ఏర్పడింది.
కానీ.. కొన్ని నెలల నుంచి ఆ చర్యలు లేకపోవడంతో పరిశ్రమ నుంచి వ్యర్థ జలాలు నేరుగా మడ అడవిలోకి వదిలేస్తున్నారు. ఫలితంగా వేలాది ఎకరాల అడవి చూస్తుండగానే నాశనమైంది. ఇది తెలిసినా అటవీ శాఖాధికారులు పట్టించుకోకపోవడంతో రానున్న రోజుల్లో మడ అడవి మొత్తం కనుమరుగయ్యే పరిస్థితి ఉందని చెబుతున్నారు.
నిబంధనల ఉల్లంఘన
అభయారణ్యంలో పరిశ్రమలకు అనుమతి ఇవ్వకూడదని చట్టం చెబుతున్నా.. 20 ఏళ్లుగా భారత్ సాల్ట్స్ పరిశ్రమ అక్కడ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం పోలాటితిప్ప, పల్లెతుమ్మలపాలెం తీర ప్రాంతంలో చెన్నైకి చెందిన భారత్ సాల్ట్స్ రిఫైనరీస్ లిమిటెడ్‌కు 2001లో 6,500 ఎకరాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం లీజుకు ఇచ్చిoది. ఎకరం రూ.50 చొప్పున కారు చౌకగా కట్టబెట్టింది. నిజానికి అటవీ ప్రాంతంలో పరిశ్రమల స్థాపన, నిర్మాణాలను అనుమతించకూడదు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనల ప్రకారం.. తీరానికి 3 కిలోమీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదు.
ఒకవేళ భూమిని ఇవ్వాల్సి వస్తే అక్కడ ఎంత భూమి పరిశ్రమకు ఇచ్చారో దానికి రెట్టింపు భూమి మరోచోట అడవి ఏర్పాటుకు ఇవ్వాలి. కానీ.. భారత్ సాల్ట్స్ అధికారులను ప్రలోభపెట్టి ఎక్కడా భూమి ఇవ్వకుండానే వేల ఎకరాలను చేజిక్కించుకుని ఉప్పు పరిశ్రమ నిర్వహిస్తోంది. నిజానికి 2022లోనే లీజు గడువు ముగిసిపోయింది. లీజు గడువు ముగిసినా పరిశ్రమ యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంతటితో ఆగకుండా వ్యర్థ జలాలను వదులుతుండటంతో మడ అడవి నాశనమవుతోంది.
మడ అడవులు తగ్గిపోవడానికి కారణాలు
» అక్రమంగా మడ అడవులను నరికేయడం
»తీరంలో చేపల చెరువుల్ని విస్తరించడం
» పరిశ్రమల వ్యర్థ జలాలను సముద్రంలోకి నేరుగా వదిలేయడం
» కృష్ణా అభయారణ్యం మొత్తం విస్తీర్ణం 194.81 చ.కి.మీ
» ఇందులో మడ అడవులు 15 వేల ఎకరాలు
» ఇందులో మచిలీపట్నం అటవీ విభాగం పరిధిలో మడ అడవులు 7 వేల ఎకరాలు
» ఇందులో నాశనమైపోయిన మడ అడవులు 3 వేల ఎకరాలకు పైగా
మడ అడవులు లేకపోతే జరిగే అనర్థాలు
» జీవ వైవిధ్యం మనుగడకు ముప్పు
» పర్యావరణ వ్యవస్థకు ముప్పు ఏర్పడుతుంది
» మత్స్య సంపద తగ్గిపోతుంది
» తుపానుల నుంచి తీర ప్రాంతానికి రక్షణ లేకుండా పోతుంది