
తాబేళ్లకు రక్షణగా ట్రీ ఫౌండేషన్, అటవీశాఖ
సాగర తీరంలో సంరక్షణ కేంద్రాలు
తాబేలు గుడ్లకు రక్షణ
పొదిగిన తర్వాత తీరంలోకి పిల్లలను వదిలిపెడుతున్న సభ్యులు
సాగర గర్భంలో తల్లులు, ఎక్కడో దూరంగా తీరంలో పిల్లలు.. ఆ తల్లీపిల్లలు కలుసుకోవడానికి సవాలక్ష ఆటంకాలు. ప్రకృతి వైపరీత్యాలు, జంతువుల దాడులు, ఆకతాయిల వికృత చేష్టలు అన్నీ తట్టుకుని నిలబడితేనే ఆ పిల్లలు కడలి గర్భంలోకి వెళ్లగలవు. లేదంటే అండంలో ఉన్నప్పుడే ఆయుష్షు తీరిపోతుంది.
ఇలాంటి ఆపత్కాలంలో ఉన్న ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లల ఆయుష్షుకు అటవీ శాఖ, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులు అండగా నిలబడుతున్నారు. తీరంలో గుడ్లను సంరక్షించి అవి పొదిగి పిల్లలు బయటకు వచ్చే వరకు జాగ్రత్తగా చూసి.. బుల్లి బుల్లి తాబేలు పిల్లలు ఆనందంగా సముద్రంలోకి వెళ్లడాన్ని మురిపెంగా చూస్తున్నారు.
సోంపేట: సముద్రంలో లక్షలాది జీవులు నివాసం ఉంటాయి. అందులో సముద్రానికి మేలు చేసే జాతుల్లో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఒక జాతి. ఆ రకం తాబేళ్లు గుడ్లు పెట్టుకునేందుకు మన తీరాలను అనువుగా ఎంచుకున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత సముద్ర తీరానికి వచ్చి తీరంలో గొయ్యి తవ్వి గుడ్లు పెడతాయి.
అనంతరం వాటిని కప్పేసి సముద్రంలోకి వెళ్లిపోతాయి. తీరంలో గుడ్లు పెట్టడానికి అనువైన స్థలం చూసుకుని గుడ్లు పెడుతుంటాయి. అలా వచ్చినప్పుడు బోట్లు తగిలి కొన్ని తాబేళ్లు చనిపోతుంటాయి. ప్రస్తుతం ఆలివ్‌రిడ్లే తాబేళ్లు అంతరించి పోయే ప్రమాదంలో ఉండడంతో అటవీశాఖ పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో తాబేళ్ల సంరక్షణకు నడుం బిగించింది.
50 నుంచి 150 గుడ్లు
సాధారణంగా ఈ జాతి తాబేళ్లు 50 నుంచి 150 వరకు గుడ్లు పెడుతుంటాయి. అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 5 గంటల లోపు తీరానికి చేరుకుని ఇసుకలో గోతులు తవ్వి వాటిలో గుడ్లు పెట్టి, తిరిగి వాటిపై ఇసుక కప్పి తల్లి తాబేళ్లు సముద్రంలోకి వెళ్లిపోతాయి.
ప్రత్యేక జీవులు
ఆలివ్ రిడ్లే తాబేళ్లు చాలా ప్రత్యేకమైనవి. వీటికి స్థిర నివాసం ఉండదు. రెండు అడుగుల పొడవు, సుమారు 150 కిలోలు పైన బరువు ఉండే తాబేళ్లు ఆహార అన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం సుమారు 20 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. డిసెంబర్ నుంచి మార్చి రెండో వారం వరకు ఎక్కువగా గుడ్లు పెడుతుంటాయి.
గుడ్లకు సంరక్షణ..
తీరంలో తాబేళ్లు గుడ్లు పెట్టి వెళ్లిపోయాక శ్రీకాకుళం జిల్లాలో అటవీ శాఖ అధికారులు, ట్రీ ఫౌండేషన్ సౌజన్యంతో గుడ్లను సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు. జిల్లాలో మొత్తం మూడు డివిజన్ల పరిధిలో 16 సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇచ్ఛాపురం నియోజక వర్గంలో 7 కేంద్రాలు ఏర్పాటు చేశారు. నియోజక వర్గంలోని సోంపేట మండలం బట్టిగళ్లూరు, బారువ పేట, ఇస్కలపాలేం, కవిటి మండలం కళింగపట్నం, బట్టివాని పాలేం, సీహెచ్ కపాçసుకుద్ది, ఇచ్ఛాపురం మండలం డొంకూరులో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
గత సంవత్సరం జిల్లాలో 1,59,403 గుడ్లు సేకరించి 1,44,981 పిల్లలుగా తయారు చేసి సముద్రంలోకి విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది గత ఏడాది కంటే ఎక్కువ పిల్లలను తయారు చేసి సముద్రంలోకి విడిచి పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ డివిజన్‌ల పరిధిలో 452 నెట్లు ఏర్పాటు చేసి 53,400 గుడ్లు సేకరించారు. సుమారు 40 రోజుల పాటు రక్షణ వలయంలో ఉంచి గుడ్లు పిల్లలుగా మారిన తర్వాత వాటిని సురక్షితంగా సముద్రంలోకి విడిచిపెడతారు.
మత్స్యకారులు సహకరించాలి
తాబేలు గుడ్లను సంరక్షించడానికి అటవీ శాఖా ధికారులు, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులకు మత్స్యకారులు సహకరించాలి. అంతరించే స్థితి లో ఉన్న ఆలివ్‌రిడ్లే తాబేళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. గుడ్లను సంరక్షించే బాధ్యత అటవీ శాఖ తీసుకుంటుంది. గత ఏడాది సుమారు లక్షా యాభై వేల పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టాం. ఈ ఏడాది అంతకన్నా ఎక్కువ పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. – నాగరాజు, జిల్లా అటవీ శాఖాధికారి
గుడ్లను సంరక్షించడం ఆనందం
గత కొన్నేళ్లుగా అటవీ శాఖాధికారుల సౌజన్యంతో ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల గుడ్లు సేకరించి, వాటిని పిల్లలుగా తయారు చేసి సముద్రంలోకి విడిచి పెట్టడం ఆనందంగా ఉంది. జిల్లాలో మత్స్యకారులు సహాయ సహకారాలు అందించడంతో ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. – కె.సోమేశ్వరరావు, ట్రీ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్