
కృష్ణా జలాల్లో ప్రమాదకర బ్యాక్టీరియా
మోతాదుకు మించి ఘనవ్యర్థాలు
విచ్చలవిడిగా నదిలోకి పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు
అడవుల నరికివేత, ఇష్టారాజ్యంగా గనుల తవ్వకమూ కారణం
ఏపీపీసీబీ పరీక్షల్లో వెల్లడి
శుద్ధి చేయకుండా తాగడం శ్రేయస్కరం కాదంటున్న నిపుణులు
మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వర్‌కు సమీపంలో జన్మించి, ఒంపు సొంపులతో బిరబిరా సాగుతూ కృష్ణా జిల్లా హంసలదీవి వరకు పరుగులిడే కృష్ణా నది తెలుగు రాష్ట్రాలకు జీవనాధారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సాగు, తాగునీటి కోసం అధికంగా ఆధారపడేది కృష్ణా జలాలపైనే. నిత్యం నీరు పారే ఈ జీవ నది మానవ తప్పిదాల కారణంగా ఇప్పడు కాలుష్యకాసారంగా మారింది. ఒకప్పుడు నేరుగా తాగేంత స్వచ్ఛంగా ఉన్న కృష్ణా నది నీరు ఇప్పుడు శుద్ధి చేయనిదే తాగకూడని దశకు చేరాయి.
ఈ నది జలాల్లో క్షార స్వభావం, బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ), ప్రమాదకర బ్యాక్టీరియా (ఫీకల్ కోలిఫారమ్), ఘన వ్యర్థాలు అధికంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (ఏపీపీసీబీ) గత నెల (మార్చి)లో నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది. కృష్ణా నీటిని శుద్ధి చేయకుండా తాగడం శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు. శుద్ధి చేయకుండా తాగితే డయేరియా, చర్మ వ్యాధుల, ఇతర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఈ నది పరీవాహక ప్రాంతంలో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మురుగునీటిని యథేచ్ఛగా వదిలేయడం, పారిశ్రామిక వ్యర్థాలను విడిచిపెట్టడం, అనేక ప్రాంతాల్లో నదినే డంపింగ్ యార్డ్‌గా మార్చేయడం వల్ల జలాలు కలుషితమవుతున్నాయి. అడవులను నరికివేయడం, గనులను ఇష్టారాజ్యంగా తవ్వడం వల్ల కూడా నది కలుషితమవుతోంది. పర్యవసానంగా కృష్ణా జలాలు నేరుగా తాగడానికి పనికి రాకుండా పోతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, అమరావతి
ప్రమాదకర బ్యాక్టీరియా
కృష్ణా జలాల నాణ్యతపై ఏపీపీసీబీ ప్రతి నెలా పరీక్షలు చేస్తోంది. ఫిబ్రవరిలో నిర్వహించిన పరీక్షల్లో కృష్ణా జలాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. పీహెచ్ 7 శాతం లోపు ఉంటే ఆమ్ల స్వభావం.. 7 శాతం కంటే ఎక్కువ ఉంటే క్షార స్వభావం ఉన్నట్లు లెక్క. పీహెచ్ 7 ఉంటే స్వచ్ఛమైన నీరుగా లెక్క. కానీ.. కృష్ణా జలాల్లో పీహెచ్ 7 శాతం కంటే ఎక్కువగా ఉంది. అంటే జలాల్లో క్షార స్వభావం ఎక్కువ ఉన్నట్లు స్పష్టమవుతోంది.
నీటిలో కరిగిన ఆక్సిజన్ (డీవో), బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) కూడా మోతాదుకు మించి ఉన్నట్లు వెల్లడైంది. తాగే నీటిలో అత్యంత ప్రమాదకరమైన ఫీకల్ కోలీఫామ్ బ్యాక్టీరియా వంద మిల్లీ లీటర్లకు ఒక్కటి కూడా ఉండకూడదు. కానీ.. కృష్ణా జలాల్లో వంద మిల్లీ లీటర్లకు 11 నుంచి 58 వరకూ ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది.
నీటిలో ఘనవ్యర్థాలు వంద మీల్లీ లీటర్లకు 500 మిల్లీ గ్రాముల వరకూ ఉండవచ్చు. కానీ.. కృష్ణా నీటిలో ఘన వ్యర్థాలు అంతకంటే ఎక్కువ ఉన్నట్లు వెల్లడైంది. మురుగు నీటిని, పారిశ్రామిక వ్యర్థ జలాలను శుద్ధి చేయడం, వ్యర్థాలకు అడ్డుకట్ట వేయడం ద్వారా కృష్ణా నదిని స్వచ్ఛంగా మార్చవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
బీఐఎస్ ప్రమాణాల మేరకు తాగు నీటికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాలు
1. పీహెచ్ 6.5 నుంచి 8.5 శాతం లోపు ఉండొచ్చు
2. డీవో (డిజాల్‌్వడ్ ఆక్సిజన్) లీటర్ నీటికి 6 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉండాలి
3. బీవోడీ (బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్) లీటర్ నీటికి 2 మిల్లీగ్రాముల లోపు ఉండొచ్చు
4. టోటల్ కోలీఫామ్ (టీసీ– బ్యాక్టీరియా) 100 మిల్లీలీటర్ల నీటికి 50 లోపు ఉండొచ్చు
5. ఫీకల్ కోలీఫామ్ (ఎఫ్‌సీ– ప్రమాదకర బ్యాక్టీరియా) 100 మిల్లీలీటర్లకు నీటికి ఒక్కటి కూడా ఉండకూదు
6. టీడీఎస్ (టోటల్ డిజాల్‌్వడ్ సాలిడ్స్) లీటర్ నీటికి 500 మిల్లీగ్రాముల లోపు ఉండొచ్చు
